మీడియాతో మాట్లాడుతున్న బిహార్ సీఎం నితీశ్
పట్నా : ఓవైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం హస్తినలో కాకపుట్టిస్తున్న వేళ.. అనూహ్యంగా బిహార్ కూడా తమ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. బిహార్‌కు చెందిన విపక్షాలన్నీ ఏకమై ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ కేంద్రంపై దాడికి సిద్ధమయ్యాయి. అయితే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాత్రం ఈ విషయంలో గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘రాష్ట్ర గౌరవాన్ని నితీశ్ కేంద్రం కాళ్ల వద్ద తాకట్టు పెట్టారంటూ’ ఆర్జేడీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కేంద్రం మెడలు వంచేందుకు ఇదే మంచి సమయమని.. మిత్రపక్షం(ఎన్డీఏ కూటమి) నుంచి బయటకు వచ్చి తమతో కలిసిపోరాడాలని విపక్షాలు నితీశ్‌కు సూచిస్తున్నాయి. అయితే ప్రత్యేక హోదా విషయంలో తమ పోరాటం ఆగలేదని నితీశ్ చెబుతున్నారు. సోమవారం హిందుస్థానీ అవామ్ మోర్చా(హెచ్‌ఏఎం) నేత నరేంద్ర సింగ్ నితీశ్ సమక్షంలో జేడీయూలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నితీశ్ హోదా అంశంపై స్పందించారు.
‘బిహార్ ప్రత్యేక హోదా పోరాటం పదేళ్ల పై మాటే. అప్పటి నుంచే కేంద్రం వద్ద మా డిమాండ్ వినిపిస్తూ వస్తున్నాం. ఆ అంశాన్ని మేమెప్పుడు విడిచిపెట్టలేదు, విడిచే ప్రసక్తే లేదు. ఈ అంశంపై మేం మౌనంగా ఉన్నామంటూ కొందరు విమర్శిస్తున్నారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రతీ రోజూ మాట్లాడినంత మాత్రాన వస్తుందా?. అందుకు మార్గాలు వేరే ఉన్నాయి. ఈ విషయాన్ని విమర్శించే పార్టీలు గుర్తిస్తే మంచిది. హోదాపై మా పోరాటం కొనసాగుతుంది’ అని నితీశ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment