బిహార్‌లో మరో మలుపు! | Amid JDU-RJD rift, Nitish Kumar resigns as Bihar Chief Minister | Sakshi
Sakshi News home page

బిహార్‌లో మరో మలుపు!

Published Thu, Jul 27 2017 12:39 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బిహార్‌లో మరో మలుపు! - Sakshi

బిహార్‌లో మరో మలుపు!

ఆర్జేడీతో నితీశ్‌ తెగదెంపులు
బిహార్‌ సీఎంగా రాజీనామా
బీజేపీతో మళ్లీ దోస్తీ.. కొత్తగా జేడీయూ– బీజేపీ ప్రభుత్వం!
►  సీఎంగా నేడు మళ్లీ ప్రమాణ స్వీకారం  


పట్నా: నాటకీయ పరిణామాల మధ్య బిహార్‌ రాజకీయం బుధవారం ఒక్కసారిగా వేడెక్కింది. లాలు కుటుంబంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. అధికార పక్ష  భాగస్వాములు జేడీయూ, ఆర్జేడీల  మధ్య నేడో, రేపో తెగతెంపులు ఖాయమనే వార్తలు.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానంటూ నితీశ్‌ అకస్మాత్తుగా ప్రకటించడంతో నిజమయ్యాయి.

రాజీనామా లేఖను గవర్నర్‌ కేఎన్‌ త్రిపాఠీకి అందజేసిన నితీశ్‌.. ఆ తరువాత ఆర్జేడీపై ఆరోపణలు గుప్పిస్తూ.. మహాకూటమిలో కొనసాగడం అసాధ్యమంటూ తేల్చిచెప్పారు. మరోవైపు, నితీశ్‌ నిర్ణయాన్ని ప్రధాని మోదీ సమర్ధిస్తూ.. ఆయనకు అభినందనలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుశీల్‌ మోదీ.. నితీశ్‌కు మద్దతు తెలుపుతూ గవర్నర్‌కు లేఖనందించారు. దీంతో నేటి సాయంత్రం ఐదు గంటలకు బిహార్‌ సీఎంగా జేడీయూ నేత నితీశ్‌ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. అయితే ఈ పరిణామాలన్నీ బీజేపీ కుట్రేనని ఆర్జేడీ చీఫ్‌ లాలూ యాదవ్‌ విమర్శించారు.

ఆర్జేడీతో ఉప్పు నిప్పు
బుధవారం సాయంత్రం నితీశ్‌ రాజీనామా పట్నాతోపాటుగా దేశవ్యాప్తంగా రాజకీయంగా కలకలం రేపింది. కూటమితో నితీశ్‌ అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టమవుతున్నా.. ఇలా హఠాత్తుగా రాజీనామా చేస్తారని ఎవరూ ఊహించలేదు. లాలూ కుటుంబంపై అవినీతి ఆరోపణలతో సీబీఐ, ఈడీ దాడుల నేపథ్యంలో.. ప్రజలకు వివరణ ఇవ్వాలని లాలూ కుమారులను నితీశ్‌ కొంతకాలం క్రితమే కోరారు. దీన్ని లాలూ కుటుంబం బాహా టంగానే ఖండించింది. బుధవారం మధ్యాహ్నం ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ తన కుమారులు రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఘంటాపథంగా చెప్పారు. దీంతో బిహార్‌ రాజకీయం వేడెక్కింది. తదనంతర పరిస్థితులతో సాయంత్రం ఇంచార్జ్‌ గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠీని కలిసిని నితీశ్‌ రాజీనామా లేఖను అందజేశారు.

కలిసి పనిచేయటం కష్టమే!
రాజీనామా సమర్పించిన అనంతరం నితీశ్‌ మీడియాతో మాట్లాడారు. ‘బిహార్‌లో నెలకొన్న పరిస్థితులతో మహాకూటమితో కలిసి పనిచేయటం కష్టమే. కూటమిని కొనసాగించేందుకు నా సామర్థ్యాన్ని మించి ప్రయత్నించాను’ అని స్పష్టం చేశారు. ‘రాజీనామా చేయమని నేను ఎవరినీ కోరలేదు. తమపై వచ్చిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వమని మాత్రమే అడిగాను. అయినా వారు (లాలూ కుమారులు) స్పందించలేదు. ప్రభుత్వాన్ని నడపటం కష్టంగా మారింది.

ఈ పరిస్థితుల్లో రాజీనామా చేయటం మినహా నాకు వేరే మార్గమేమీ కనిపించలేదు. నా అంతరాత్మ ప్రబోధం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని నితీశ్‌ పేర్కొన్నారు. నోట్లరద్దు నిర్ణయం, బినామీ చట్టాన్ని తను సమర్థించిన సందర్భాల్లో తనపై ఎన్నో ఆరోపణలు చేశారని.. అయినా తనేమీ పట్టించుకోకుండా పాలనపైనే దృష్టిపెట్టానని ఆయన చెప్పుకొచ్చారు. ‘తేజస్వీ యాదవ్‌పై వచ్చిన బినామీ ఆస్తుల ఆరోపణలను నేనెలా సమర్థించగలను?’ అని నితీశ్‌ ప్రశ్నించారు.

రంగంలోకి బీజేపీ
తాజా పరిణామాలు జరుగుతుండగానే బీజేపీ వేగంగా పావులు కదిపింది. ప్రధాని మోదీ నితీశ్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘అవినీతి వ్యతిరేక పోరాటంలో చేరుతున్నందుకు నితీశ్‌ కుమార్‌కు అభినందనలు. నిజాయితీకి మద్దతుగా మీ నిర్ణయాన్ని 125 కోట్ల మంది స్వాగతిస్తున్నారు.

బిహార్‌తోపాటుగా దేశాభివృద్ధి కోసం రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి ముందుకెళ్లాల్సిన తరుణమిది’ అని మోదీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. అటు, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సుశీల్‌ మోదీ తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై.. నితీశ్‌కు మద్దతివ్వాలని నిర్ణయించారు. జేడీయూ ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లుగా బీజేపీ ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్‌ త్రిపాఠీకి లేఖనందించారు. అటు, బీజేపీ–జేడీయూ ఎమ్మెల్యేలకు బుధవారం రాత్రి నితీశ్‌ విందు ఏర్పాటుచేశారు. కొత్త ప్రభుత్వంలో బీజేపీ చేరుతోందని సుశీల్‌ మోదీ స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి పదవిపై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

బిహార్‌ రాజకీయాల్లో చాణక్యుడు
బిహార్‌లో 2015 శాసనసభ ఎన్నికల సమయంలో ఏళ్లనాటి శత్రుత్వాన్ని పక్కనబెట్టి అనూహ్యంగా లాలూ ప్రసాద్‌తో చేతులు కలిపిన నితీశ్‌...అంతే అనూహ్యంగా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. బిహర్‌ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుగాంచిన నితీశ్‌ పట్నాలోని ఎన్‌ఐటీలో ఎలక్ట్రికల్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ చదివారు.

మృదు స్వభావిగా, కార్యదక్షుడిగా పేరు తెచ్చుకున్న ఆయన చదువుకునే రోజుల నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు.1985లో తొలిసారి బిహార్‌ శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం 1989, 91, 96, 98, 99ల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా, రైల్వే మంత్రిగా సేవలందించారు. 1999లో ఆయన రైల్వే మంత్రిగా ఉండగా పశ్చిమబెంగాల్‌లోని గైసల్‌ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 300 మంది మరణించగా, నైతిక బాధ్యత వహిస్తూ నితీశ్‌ రాజీనామా చేశారు. మళ్లీ 2001లో రైల్వే మంత్రి అయ్యారు. 2002లో గోద్రా అల్లర్లకు కారణమైన రైలు దహన ఘటన సమయంలోనూ ఆయనే రైల్వే మంత్రి. ఇప్పటికి ఐదుసార్లు బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీశ్‌ పనిచేశారు.

బీజేపీతో నితీశ్‌ కుమ్మక్కు: లాలూ
1991 నాటి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నందునే నితీశ్‌ ఇప్పుడు బీజేపీతో లాలూచీ పడ్డారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. ‘బీజేపీ–ఆరెస్సెస్‌ల ప్రోద్బలంతోనే నితీశ్‌ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ప్రకటన చేసిన వెనువెంటనే ప్రధాని మోదీ అభినందనలు తెలపడం చూస్తే ఇది అర్థమవుతోంది.

నితీశ్‌ బీజేపీతో చేతులు కలపడం నిజం కాకపోతే...కూటమి పార్టీల్లోని ఎమ్మెల్యేలందరినీ సమావేశపరిచి కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు ఆయన అంగీకరించాలి. రాష్ట్రంలో పెద్ద పార్టీ మాదే. మాకు ప్రజామోదం ఉంది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం మాకే ఇవ్వాలి’ అని లాలూ అన్నారు. ‘మేం సంబంధిత పత్రాలను సీబీఐకి ఇస్తాం. వాటిని అడగటానికి వారు (నితీశ్‌) ఎవరు? బిహార్‌ ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ ఏదైనా అవినీతికి పాల్పడ్డాడా? ఇదంతా మోదీ చేయిస్తున్నారు. బిహార్‌ ప్రజల నమ్మకాన్ని నితీశ్‌ నిలబెట్టలేక పోయారు’ అని పేర్కొన్నారు.

నితీశ్‌కు ఒరిగేదేంటి?
మహాకూటమిలో 80 స్థానాలతో ఆర్జేడీయే అతిపెద్ద పార్టీగా ఉంది. నితీశ్‌కు సీఎం పదవి ఇచ్చినా కూటమిలో పెద్ద పార్టీగా తమ మాట చెల్లుబాటు కావాలనే పంతంతో లాలూ వ్యవహరిస్తున్నారు. దీంతో నితీశ్‌ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. మళ్లీ ఎన్డీయేలో చేరితే.. నితీశ్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదు. మరోవైపు, అవినీతి ఊబిలో ఉన్న లాలూ కుటుంబంతో అంటకాగితే.. నితీశ్‌ క్లీన్‌ ఇమేజ్‌కు ఇబ్బందులు తప్పవు. ఇది కూడా ఈయన కూటమి నుంచి తప్పుకునేందుకు ఓ కారణం. బిహార్‌ అభివృద్ధికి కేంద్రంతో సఖ్యతగా ఉండటమే మంచిది. యూపీలో బీజేపీ ఘన విజయం తర్వాత మోదీకి గట్టి ప్రత్యామ్నాయం కనుచూపు మేరల్లో కనపడని పరిస్థితి. అలాంటపుడు ఎన్డీయేకు దూరంగా ఉండటంలో అర్థం ఉండదని జేడీయూ భావిస్తోంది.

బీజేపీకి లాభమేంటి?
బీజేపికి ప్రత్యామ్నాయంగా 2019 కల్లా విపక్షాలతో కలిపి మహాకూటమిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. దీని అవసరాన్ని కాంగ్రెస్‌కు చెప్పిందే నితీశ్‌. అలాంటి నితీశ్‌ను తమవైపు తిప్పుకుంటే మహాకూటమి ప్రయత్నాలకు ఆదిలోనే గండికొట్టినట్లవుతుంది. రాజ్యసభలో ఎన్డీయే బలపడుతోంది. ప్రస్తుతమున్న  74 మంది ఎన్డీయే ఎంపీలకు తోడు.. పది మంది జేడీయూ ఎంపీలు తోడైతే పెద్దలసభలో బీజేపీకి కొంత ఊరట. నితీశ్‌తో తెగదెంపులతో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే.. నితీశ్‌ కలుపుకుపోవడం బీజేపీకి అత్యంత అవసరం.

మమ్మల్ని నిరాశకు గురిచేసింది: కాంగ్రెస్‌
నితీశ్‌ రాజీనామా తమను నిరుత్సాహానికి గురిచేసిందని కాంగ్రెస్‌ పేర్కొంది. మహాకూటమి లోని విభేదాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామంది. కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా మాట్లాడుతూ ‘మహాకూటమి ఐదేళ్లు కొనసాగాలని ప్రజలు ఓటేశారు. బిహార్‌ గౌరవాన్ని తాకట్టు పెట్టిన బీజేపీని, ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పు అది. దానిని గౌరవించేందుకు మేం పనిచేస్తాం’ అని అన్నారు.  ‘కాంగ్రెస్‌ పార్టీకి, మరీ ప్రత్యేకంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలకు నితీశ్‌పై ఎంతో అభిమానం, గౌరవం ఉన్నాయి. ఆయన రాజీనామా చేయడం మమ్మల్ని అందరినీ ఎంతో నిరాశకు గురిచేసింది’ అని రణదీప్‌ చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement