పాట్నా: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. జూన్ 4న వెలువడిన నీట్ యూజీ ఫలితాల్లో ఏకంగా 67 మందికి 720 మార్కులు రావడం, వీరిలో ఆరుగురు హర్యానాలోని ఒకే సెంటర్‌లో పరీక్ష రాయడం సందేహాలకు దారి తీసింది. దీంతో పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని.. మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని విద్యార్ధులు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో కొనసాగుతోంది. మరోవైపు కేసులో బిహార్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేయగా.. ఇప్పటివరకు 14 మంది అరెస్టయ్యారు.
తాజాగా నీట్ పేపర్ వ్యవహారంపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. పేపర్ లీక్‌తో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనుచరుడికి సంబంధం ఉందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఈ విషయంపై డిపార్ట్‌మెంటల్ విచారణ జరిపినట్లు తెలిపారు.
గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్ వ్యక్తిగత కార్యదర్శి ప్రీతం కుమార్ బిహార్ రోడ్ కన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్ (ఆర్‌సీడీ) ఉద్యోగి ప్రదీప్‌తో మాట్లాడినట్లు తెలిపారు. సికందర్ ప్రసాద్ యాదవెందు అనే ఇంజినీర్ కోసం ఎన్‌హెచ్‌ఏఐ గెస్ట్ హౌస్‌లో రూమ్ బుక్ చేయమని చెప్పాడని ఆరోపించారు.
పరీక్ష జరగడానికి నాలుగురోజుల ముందు ఈ కాల్ వెళ్లినట్లు చెప్పారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారికి అధికారం లేకపోయినా.. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. పట్నాలోని ఎన్‌హెచ్‌ఏఐ గెస్ట్‌హౌస్‌లో ఆ రూమ్ బుక్ చేసిన ఆర్‌సీడీ ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు సిన్హా చెప్పారు.
మరోవైపు నీట్ నిందితులు తమ గెస్ట్ హాస్‌లో బస చేసినట్లుగా వచ్చిన ఆరోపణలను ఎన్‌హెచ్‌ఏఐ ఖండించింది. పాట్నాలో తమకు గెస్ట్ హౌస్ సౌకర్యం లేదని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment