ఎన్నికల నగారా మోగింది.. ఇక సమరమే | Sakshi Special Story On Bihar Assembly Elections 2020 | Sakshi
Sakshi News home page

ఎన్నికల నగారా మోగింది.. ఇక సమరమే

Published Fri, Sep 25 2020 8:19 AM | Last Updated on Sat, Sep 26 2020 12:58 PM

Sakshi Special Story On Bihar Assembly Elections 2020

దేశంలో మరో ఎన్నికల సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్నా బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్‌ 28న తొలి విడత పోలింగ్‌ జరుగనుంది. నవంబర్‌ 3న రెండో విడత, నవంబర్‌ 7న మూడో విడత పోలింగ్‌ అనంతరం నవంబర్‌ 10న ఎన్నికల ఫలితాలను వెల్లడించనుంది. దీంతో ఎన్నికల రణరంగంలోని దిగేందుకు రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.  పొత్తులు, ప్రత్యర్థిపై ఎత్తులు వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధాన పార్టీలై బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్‌, ఆర్జేడీలో సీట్ల పంపకాలపై చర్చలు వేగవంతం చేశాయి. విజయలక్ష్యంగా అభ్యర్థుల వేటను ఆరంభించాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు బిహార్‌లో బలమైన పునాదులు ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ అంతా జేడీయూ, ఆర్జేడీ మధ్య ఉండే అవకాశం ఉంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరగనున్న అతిపెద్ద ఎన్నికల్లో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకటికావడం గమనార్హం. (మోగిన బిహార్‌ ఎన్నికల నగారా)

వెబ్‌స్పెషల్‌ :  కరోనా లాంటి క్లిష్ట సమయంలో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాజకీయాల్లో ఆరితేరిన నేతలున్న బిహార్‌లో.. కేంద్ర ఎన్నికలు సంఘం ప్రకటనతో రాజకీయ వేడి మొదలైంది. ఆనాటి మౌర్యసామ్రాజ్యానికి రాజధాని వెలసిల్లిన పాటలీపుత్ర నగరం నేడు రాజకీయ వ్యహాలకు, ఎత్తుల పైఎత్తులకు కేంద్రంగా మారింది. దేశంలో తలపండిన ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న పోటీ కావడంతో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తినెలకొంది. బీజేపీ-జేడీయూ-ఎల్‌జేపీ (లోక్‌జన శక్తి పార్టీ) ఉమ్మడిగా బరిలోకి దిగుతుండగా.. గత మిత్రులు కాంగ్రెస్‌-ఆర్జేడీ మరోసారి జట్టుకట్టాయి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దిగజారిపోవడంతో పాటు దాదాపు రెండు దశాబ్ధాల పాటు బిహార్‌ రాజకీయాలను ఏలిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రస్తుతం జైల్లో ఉండటం ఎన్డీయేకూటమికి కలిసొచ్చే అంశం.

ఇక నితీష్‌ కుమార్‌ పాలనపై ప్రజల్లో నమ్మకం, జాతీయ స్థాయిలో ఆయనకున్న పలుకుబడితో పాటు బీజేపీ మద్దతు జేడీయూ మరింత బలం చేకూరుస్తోంది. లాలూ జైలు పాలవ్వడంతో పార్టీ బాధ్యతల్నిభుజానకెత్తుకున్న తేజస్వీ యాదవ్‌ గత లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా విఫలమయ్యారు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకోవడంలో తేజస్వీ విఫలమయ్యారు. అంతేకాకుండా ఇద్దరు అన్నదవమ్ములు (తేజస్వీ-తేజ్‌ ప్రతాప్‌యాదవ్‌)ల మధ్య విభేదాలు రచ్చకెక్కడంతో పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. గత ఐదేళ్ల కాలంలో నితీష్‌ చేసిన అభివృద్ధి, బీజేపీతో ఉన్న సత్సంబంధాలు ఎన్డీయే కూటమికి దోహదపడే అవకాశం ఉంది. (రంగు మారిన పవన్‌ రాజకీయం)

ఎన్డీయేకు సవాలే.. నితీష్‌కు కఠిన పరీక్ష
మరోవైపు కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోవడం, ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడం, నిరుద్యోగుల ఆక్రోశం ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఉన్నఫళంగా విధించిన లాక్‌డౌన్‌ కోట్లాదిమంది కార్మికులను నడిరోడ్డుపై నిలబెట్టింది. వేసవికాలంలో పొట్టచేతపట్టుకుని వేల కిలోమిటర్లు కార్మికులు నడిచిన తీరు దేశమంతా చూసింది. అలాగే బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య వ్యవహారం సైతం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర పోలీసులను తప్పుదోవ పట్టించి, బిహార్‌ పోలీసుల చేత విచారణ జరిపిస్తోందన్న విమర్శలూ వ్యక్తం అయ్యాయి. మరోవైపు సరిహద్దుల్లో గత మూడు నెలలుగా చైనా అక్రమణకు దిగుతోంది.

గల్వాన్‌లోయలో 20 మంది సైనికులను పొట్టనబెట్టుకుంది. అయితే చైనాపై భారత పాలకులు సరైన రీతిలో స్పందించడంలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.  అంతకుమించి బీజేపీ-ఆర్జేడీ-ఎల్‌జేపీ మధ్య కోల్డ్‌వార్‌ నేతలకు తలనొప్పిగా మారింది. ఎల్‌జేపీ చీప్‌ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ నితీష్‌పై పీకల్లోతు కోపంతో మండిపోతున్నారు. తమను కనీస భాగస్వామ్య పార్టీగా నితీష్‌ గుర్తించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మూడు పార్టీల నడుమ సీట్ల పంపకం అనేది తేలని పంచాయితీగానే మిగిలిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్డీయే కూటమి ఈ ఎన్నికలను  ఏవిధంగా ఎదుర్కొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ఏడాది చివరన జరిగే ఎన్నికల్లో సీఎం నితీష్‌ కూడా ఈ ఎన్నికలు కఠిన పరీక్షలాంటివని చెప్పకతప్పదు. (కేసీఆర్‌ తరువాత టీఆర్‌ఎస్‌ బాస్‌ ఎవరు..?)


మోదీ, అమిత్‌ షాతో నితీష్‌ బంధం...
2003లో మరోసీనియర్‌ నేత శరద్‌ యాదవ్‌తో కలిసి నితీష్‌ కుమార్‌ జనతాదల్‌ (యూనైటెడ్‌) పార్టీని నెలకొల్పాడు. అయితే అప్పటి నుంచీ అది బీజేపీ మిత్రపక్షంగానే కొనసాగుతోంది. బీజేపీ మద్దతుతోనే నితీష్‌‌ సైతం సీఎంగా కొనసాగుతూ వస్తున్నారు. గతంతో పోలీస్తే నితీష్‌ సీఎం అయ్యాక బిహర్‌ రూపురేఖలు మారాయనే చెప్పొచు. ముఖ్యంగా నిరుద్యోగం, ఆకలి, అక్షరాస్యత, తాగునీరు వంటి అంశాల్లో రాష్ట్రం కొంత మెరుగుపడింది. వెనుకబడిన రాష్టంగా ముద్రపడ్డ బిహార్‌లో నితీష్‌ నాయకత్వం పరిశ్రమలకు పెద్ద పీఠ వేసింది. పదేళ్ల ఆర్జేడీ పాలనతో విసిగిన బిహార్‌ ప్రజలకు జేడీయూ పాలన కొత్త రుచులను చూపించింది. దీంతో నితీష్‌ నాయకత్వంపై ప్రజలకు ఓ బలమైన విశ్వాసం కలిగింది. బిహార్‌ రాజకీయాల్లో ఇక తమకు తిరుగులేదనే స్థాయికి బీజేపీ-జేడీయూ కూటమి చేరుకుంది. అంతేకాకుండా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరుఫున తానే ప్రధాని అభ్యర్థి అనేంతగా నితీష్‌ జాతీయ రాజకీయాల్లో పేరు తెచ్చుకున్నారు. అయితే తమ సొంత పార్టీ అభ్యర్థిని కాదని భాగస్వామ్య పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వాలని భావించిన కాషాయ దళ పెద్దలు అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రే మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ పరిణామం ఆ పార్టీ కురువృద్దుడు ఎల్‌కే అద్వానీతో పాటు మరికొంత మంది సీనియర్లుకు ఏమాత్రం రుచించలేదు. ఈ ప్రభావం జేడీయూ-బీజేపీ 17 ఏళ్ల స్నేహంపైనా పడింది. మోదీ అభ్యర్థిత్వాన్ని నితీష్‌ కుమార్‌ బహిరంగంగా వ్యతిరేకించారు. గోద్రా అల్లర్లతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం ఏంటని నిలదీశారు. మోదీని ముస్లింల నరహంతకుడిగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఎన్డీయే కూటమి నుంచి వైదులుగుతున్నట్లు ప్రకటించారు.

మా స్నేహం మూనాళ్ల ముచ్చటే..
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీలో ప్రస్తుతం 73 స్థానాలున్న అర్జేడీ ప్రతిపక్షంలో కూర్చింది. జేడీయూ(69), బీజేపీ (54), ఎల్‌జేపీ (2) మద్దతులో నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో  ఏళ్ల నాటి బంధాన్ని వదులుకుని నితీష్‌ కుమార్‌ చిరకాల శత్రువు లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో దొస్తీ కట్టారు. మహా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌-ఆర్జేడీ-జేడీయూ కలిసి పోటీచేసి విజయాన్ని అందుకున్నాయి. అయితే నితీష్‌-లాలూల స్నేహం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.

డిప్యూటీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌తో పాటు తేజ్‌ ప్రతావ్‌ యాదవ్‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో మహాకూటమితో నితీష్‌ తెగదెంపలు చేసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులతో తాను ప్రభుత్వాన్ని నడపలేనంటూ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన 24 గంటల్లోనే బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం పీఠం ఎక్కారు. అయితే ఇదంతా బీజేపీ, జేడీయూ ఆడిన నాటకమని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శించాయి. నితీష్‌ తీరుపై అప్పట్లో జాతీయ స్థాయిలోనూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తాజా ఎన్నికల్లో మరోసారి పాత స్నేహం (బీజేపీ)తో నితీష్‌ బరిలో నిలిచారు. ధీటైన విపక్షం లేకపోవడంతో విజయవకాశాలు దాదాపు ఎన్డీయే కూటమికే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్జేడీ కొంతమేర పోటీ ఇచ్చినా.. కాంగ్రెస్‌ మాత్రం కేవలం ఉనికి కోసం కొట్లాడే పరిస్థితి కనిపిస్తోంది.

29 ఏళ్లకే లోక్‌సభకు ఎన్నిక
లాలూ ప్రసాద్ యాదవ్ భారత కేంద్ర ప్రభుత్వములో ప్రస్తుత (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) రైల్వే శాఖా మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ ఆధ్యక్షుడు. యాదవ్ ఏడు సంవత్సరముల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. గడచిన రెండు దశాబ్దాలలో బిహార్‌ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభలమైన వ్యక్తి. లాలూ రాజకీయ జీవితానికి తొలి మెట్టు పాట్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఘానికి అధ్యక్షత వహించడము. జయ ప్రకాష్ నారాయణ్ వల్ల ప్రభావితమైన విద్యార్థుల ఉద్యమానికి 1970లో లాలూ నాయకత్వము వహించారు. ఎమర్జెన్సీ కాలంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ఒక వినతి శాసనాన్ని అందించిన ధీశాలిగా నిలిచారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి సత్యేంద్ర నారాయణ్ సిన్హా (ఛోటే సాబ్) 1977లో లాలూను లోక్‌సభ స్థానానికి పోటీ చేయించి, లాలూ తరపున ప్రచారము చేశాడు. ఫలితంగా 29 ఏళ్ల పిన్న వయస్సులోనే 6వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేవలము 10 సంవత్సరముల వ్యవధిలోనే లాలూ, బిహార్లో ఒక ఉజ్జ్వల శక్తిగా ఎదిగారు. 1989లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో లాలూ నేషనల్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయపథాన నడిపించారు. 1990లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైయ్యారు.

జాతీయ నేత జైలు పాలు..
1996లో బిహర్‌లో బయటపడిన రూ.950 కోట్ల పశుగ్రాస కుంభకోణం లాలూ రాజకీయ జీవితాన్ని మార్చివేసింది. పశుగ్రాస కుంభకోణానికి సంబంధించిన ఆరోపణల వల్ల లాలూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన స్థానములో సతీమణి రబ్రీ దేవిని ముఖ్యమంత్రిగా నియమించారు. అయితే అయితే ఈ దర్యాప్తును లాలూనే స్వయంగా విచారణకు ఆదేశించడము విశేషం. 1997లో లాలూ, జనతా దళ్ నుంచి విడిపోయి రాష్ట్రీయ జనతా దళ్ అనే సొంత పార్టీని స్థాపించారు. కేంద్ర మంత్రి అయిన తరువాత నష్టాల్లో నడుస్తున్న భారతీయ రైల్వేలను లాభాల దిశగా నడిపించిచటంలో ఉపయోగించిన విన్నూత యాజమాన్య పద్ధతులకు జాతీయ స్థాయిలో లాలూ ఖ్యాతిగడించారు. ఆసియా టైమ్స్ ఆన్‌లైన్‌తో మాట్లాడుతూ లాలూ "ప్రపంచములోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఒక ఆవుల కాపరి కొడుకు ఇంతటి స్థాయికి ఎలా చేరుకోగలిగాడు అని ఆశ్చర్యమును, ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ ఉత్సుకత భారత ప్రజాస్వామ్య విజయానికి చిహ్నము" అని అన్నారు.

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత: నితీష్‌
దాదాపు 34 ఏళ్ల రాజకీయ జీవితం, అవినీతి మచ్చలేని మనిషి. పార్టీలు మారినా ప్రజల్లో తనకున్న ఫాలోయింగ్‌లో మాత్రం మార్పు రాలేదు. ఉన్నత కులాలకే ఉన్నత పదవులు అన్న మాటల్ని తిరగరాసి ఉ‍న్నతమైన భావాలున్నవారందరికి అనిపించాడు. రౌడీలు రాజ్యమేలుతున్న బిహర్‌కు ఓ రాథోడ్‌.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కరెక్టుగా తెలిసిన రాజకీయ నాయకుడు నితిష్‌కుమార్‌. నితీష్‌పై  జయప్రకాశ్‌ నారాయణ్‌, రామ్‌మనోహర్‌ లోహియా సిద్ధాంతాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయన 1971లో రాజకీయ రంగప్రవేశం చేసి, రామ్‌మనోహర్‌ లోహియా పార్టీ సంజీవాది యువజన్‌ సభలో చేరారు. 1974-1977 వరకు జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.1977లో తన (కుర్మీ) సామాజిక వర్గం బలంగా ఉన్న హర్‌నాత్‌ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. ఆ ఎన్నికల ద్వారా ఆయన ఓ గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. 1985లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1987 యువలోక్‌ దల్‌ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. రెండు సంవత్సరాల అనంతరం జనతా దల్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ ఎన్నికయ్యారు.

1994లో సమతా పార్టీ పేరిట సొంత పార్టీని స్థాపించారు. జనతాదల్‌ యునైటెడ్‌ ప్రారంభమైన తర్వాత సమతా పార్టీని అందులో విలీనం చేశారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉండగా1998-1999 మధ్య కాలం కేంద్ర మంత్రిగా రైల్వేశాఖ, వ్యవసాయ శాఖల బాధ్యతలు చేపట్టారు. 2000 సంవత్సరంలో మొదటి సారి బిహార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన ఒక వారంలో నితీష్‌ తన పదవి కోల్పోవడం గమనార్హం. 2005లో బీజేపీతో పొత్తుపెట్టుకుని మరోసారి బీహార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. 2015లో లాలూప్రసాద్‌ యాదవ్‌, కాంగ్రెస్‌తో మహాకూటమి ఏర్పాటు చేశారు. 2016లో మహాకూటమితో తెగదింపెలు చేసుకుని పాత మిత్రుడైన బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీ సహాయంతో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నితీష్‌ కుమార్‌ మొత్తం 13 ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1973లో మంజుకుమారీ సిన్హాన అనే ఉపాధ్యాయురాలిని వివాహమాడారు. వారికి నిశాంత్‌ అనే ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 2007 సంవత్సరంలో నితిష్‌ తన భార్యను కోల్పోయారు. తను కుమారుడిని మాత్రం రాజకీయాలకు దూరంగానే  ఉంచడం గమనార్హం. ఇక తాజా ఎన్నికల్లో చాణిక్యుడి చతురత.. వృద్ధనేత వ్యూహాలు ముందు ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారో వేచిచూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement