Bihar Assembly Election 2020
-
చెక్కు చెదరని మోదీ ఇమేజ్..
ఇది కోవిడ్ నామ సంవత్సరం. 2020 పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతుంది. అయినా రాజకీయాలు రంజుగా సాగాయి. ఢిల్లీ ఎన్నికలతో మొదలైన ఏడాది బిహార్ ఎన్నికలతో ముగిసి ప్రధాన పార్టీలకు కరోనాని మించిన రాజకీయ పాఠాలను నేర్పింది. ఈ ఏడాది కూడా బీజేపీ తన హవా కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని కాపాడే నాథుడు లేక కొట్టుమిట్టాడుతోంది. తమిళ సూపర్ స్టార్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తానన్న ప్రకటన ఈ ఏడాది హైలైట్‌గా నిలిచింది. చెక్కు చెదరని మోదీ ఇమేజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకున్న బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవడంలో ఈ ఏడాది విజయం సాధించారు. కరోనా మహమ్మారితో పోరాడుతూనే దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యధిక జనాభా కలిగిన భారత్ కరోనాను ఎదుర్కోలేక కుదేలైపోతుందన్న అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ తనదైన శైలిలో పకడ్బందీ ప్రణాళిక రచించారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ కష్టకాలంలో నరేంద్ర మోదీ ప్రధాని కావడం వల్ల భారత్‌కున్న పేరు ప్రతిష్టలు పెరిగాయని దేశ ప్రజల్లో 93% అభిప్రాయపడినట్టుగా ఐఏఎన్ఎస్–సీ ఓటరు సర్వే తేల్చి చెప్పింది. సరైన ప్రతిపక్షం లేకపోవడం కూడా ప్రధానికి బాగా కలిసొచ్చింది. ఏడాది చివర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు మాత్రం ఆయనని చిక్కుల్లో పడేశాయి. ఎన్నికల్లో.. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ సారి బీజేపీ హవాయే కనిపించింది. ఏడాది మొదట్లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ విజయ ఢంకా మోగించింది. సీఎం కేజ్రివాల్‌కి క్రేజ్ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. 70 స్థానాలకు గాను ఆప్ 62 స్థానాల్లో విజయం సాధిస్తే, బీజేపీ ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. ఇక బిహార్‌లో హోరాహోరిగా సాగిన పోరాటంలో ఎన్డీయే 125 స్థానాలు దక్కించుకుంది. అయితే ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ గట్టి పోటీయే ఇచ్చింది. 75 స్థానాలను గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో రాజకీయాల్లో యువకెరటం తేజస్వి యాదవ్ పేరు మారుమోగిపోయింది. ఇక వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. జ్యోతిరాదిత్య సింధియా వర్గాన్ని చీల్చి తమ వైపు లాక్కున్న బీజేపీకి మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఆ ఎన్నికల్లో 19 స్థానాల్లో నెగ్గి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక ఈ ఏడాది రాజ్యసభలో కూడా 12 సీట్ల బలాన్ని పెంచుకొని రాజకీయంగా శక్తిమంతంగా ఎదిగింది. కాంగ్రెస్ ఒక భస్మాసుర హస్తం కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది ఏమాత్రం కలిసిరాలేదు. నానాటికీ ఆ పార్టీ అధఃపాతాళానికి పడిపోతోంది. దశ దిశ లేని నాయకత్వం. కొత్త జనరేషన్ ఆలోచనలకి తగ్గట్టుగా వ్యూహరచన చేయలేకపోవడం ఆ పార్టీని దెబ్బతీసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించు కోలేకపోయిన కాంగ్రెస్ బిహార్ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 స్థానాల్లో మాత్రమే నెగ్గింది. కాంగ్రెస్ తురుపు ముక్కగా భావించే ప్రియాంక గాంధీపై పెట్టుకున్న ఆశలు కూడా అడియాశలయ్యాయి. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు స్థానాలకు గాను నాలుగు సీట్లలో కాంగ్రెస్ డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. వృద్ధతరానికి, యువతరానికి మధ్య పోరు ఉధృతం కావడంతో జ్యోతిరాదిత్య సింధియా వంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై కొట్టేసి కాషాయ శిబిరంలో చేరారు. ఫలితంగా మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ లక్ష్యమైన కాంగ్రెస్ ముక్త భారత్ ఎంతో దూరంలో లేదని కాంగ్రెస్ పార్టీ తనకి తానే ఒక భస్మాసుర హస్తంగా మారిందన్న విశ్లేషణలైతే వినిపిస్తున్నాయి. పొలిటికల్ బాషా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఈ ఏడాది పండగే పండుగ. ఎట్టకేలకు తాను రాజకీయాల్లోకి వస్తానని రజనీ ప్రకటించారు. ఆధ్యాత్మిక రాజకీయాల పేరుతో తమిళనాట మార్పు తీసుకువస్తానని నినదించారు. రజనీ పార్టీ పేరు మక్కల్ సేవై మర్చీ (ప్రజాసేవ పార్టీ)గా రిజిస్టర్ చేయించుకున్నారని, ఆయన ఎన్నికల గుర్తు ఆటో అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతలోనే రక్తపోటులో తేడాలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో రజనీ చికిత్స పొందారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా రజనీకాంత్ తాను చెప్పినట్టుగానే డిసెంబర్ 31న కొత్త పార్టీ ప్రకటన చేస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒరిగిన రాజకీయ శిఖరాలు ఇద్దరూ ఇద్దరే.. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్స్. ఒకరు దేశ అత్యున్నత శిఖరాన్ని అధిరోహిస్తే, మరొకరు తెరవెనుక మంత్రాంగాన్ని నడిపారు. కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నాయకులు ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్‌లు ఈ ఏడాది కరోనాతో కన్ను మూశారు. ప్రణబ్‌కు ఆగస్టులో కరోనా పాజి టివ్‌గా నిర్ధారణ అయింది. తర్వాత ఆయన మెదడుకి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఆస్పత్రిలో సెప్టెంబర్ 1న ప్రణబ్ మరణించారు. కాంగ్రెస్‌లో సోనియా ఆంతరంగికుడు అహ్మద్ పటేల్ నవంబర్ 23న కన్ను మూశారు. నమస్తే ట్రంప్ భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో మైలురాయిలాంటి కార్యక్రమం ఈ ఏడాది ఆరంభం లోనే జరిగింది. హౌడీమోడీకి దీటుగా కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించింది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకాతో కలిసి భారత పర్యటనకు వచ్చారు. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ని సందర్శించారు. ఇరుదేశాల మధ్య 300 కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరింది. -
తొలి అసెంబ్లీ: తేజస్వీపై నితీష్ ఆగ్రహం
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయేపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను టార్గెట్‌గా చేసుకున్న ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్.. విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిపి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఎన్డీయే కూటమి తమకంటే కేవలం 12,270 ఓట్లు, 16 సీట్లు మాత్రమే సాధించి అధికారంలోకి వచ్చిందని అన్నారు. తేజస్వీ విమర్శలకు సీఎం నితీష్ కుమార్ ఘాటుగా స్పందించారు. తొలిసారి సభలో ఎన్నడూ లేని ఆగ్రహాన్ని ప్రదర్శించారు. జీవితంలో అభివృద్ధి చెందాలంటే ముందు ప్రవర్తన మార్చుకోవాలని, గౌరవాన్ని కాపాడుకోవాలని చురకలు అంటించారు. ఒక ఓటు తేడా కూడా విజయాన్ని నిర్ణయిస్తుందని బదులిచ్చారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎవరైనా అనుకుంటే వారు కోర్టును ఆశ్రయించవచ్చు సూచించారు. 122 సీట్లు సాధించిన ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చుని పేర్కొన్నారు. కాగా ఉత్కంఠ బరితంగా సారిగి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 74, 115 స్థానాల్లో పోటీ చేసిన నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యు) 43 సీట్లలో గెలిచి అధికారాన్ని అందుకున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో 110 అసెంబ్లీ స్థానాలను దక్కించుకోగలిగింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ మాత్రమే ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు సాధించి అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ చేసిన పేలవమైన ప్రదర్శన కారణంగా మహాకూటమి అధికారంలోకి రాలేకపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న జేడీయు కూడా పేలవమైన ప్రదర్శనతో మూడవ స్థానం సరిపెట్టుకుంది. -
బిహార్ స్పీకర్‌గా ఎన్డీయే అభ్యర్థి విజయ్ సిన్హా
పాట్నా : బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికలో విజయ్ సిన్హాకు 126 ఓట్లు రాగా మహా కూటమి తరపున పోటీ చేసిన అవద్ బిహార్ చౌదరికి 114 ఓట్లు దక్కాయి. కాగా బిహార్‌లో దాదాపు 50 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న స్పీకర్ పదవికి ఎన్డీయే కూటమి తరపున విజయ్ కుమార్ సిన్హా, మహా కూటమి తరపున అవద్ బిహారీ చౌదరి పోటీలో నిలిచారు. వీరిద్దరూ మంగళవారం పట్నా నుంచి అసెంబ్లీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో బిహార్ అసెంబ్లీలో భారీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చదవండి: బిహార్‌లో లాలూ ఆడియో టేపుల కలకలం అసెంబ్లీలోకి ఎమ్మెల్సీలు రావడంతో స్పీకర్ ఎన్నికల్లో వాయిస్ ఓట్లను ఆర్జేడీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ముఖ్యంగా సీఎం నితీశ్ కుమార్, అశోక్ చౌదరి సభలో ఉండటాన్ని తప్పుబడుతూ.. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆర్జేడీ ఎమ్మెల్యే తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. స్పీకర్ ఎన్నిక సమయంలో నియమాలను పాటించాలని చెబుతూ.. రూల్‌బుక్‌ను ప్రొటెం స్పీకర్ జితన్ రామ్ మాంజీకి అందించారు. దీనిపై స్పందించిన ప్రొటెం స్పీకర్.. ‘అసెంబ్లీ పక్షనేతగా సీఎం సభలో ఉండటం తప్పేం కాదు. అది చట్టబద్దమైనది. ఇతర సభ నుంచి వచ్చిన వారు స్పీకర్ ఎన్నికల్లో ఓటు వేయడంలేదు. అసెంబ్లీలో వారు ఉండటంలో ఎలాంటి సమస్య లేదు" అని ఆయన అన్నారు. అదే విధంగా గతంలో లాలూ యాదవ్ లోక్‌సభ సభ్యుడిగా.. రబ్రీదేవి సీఎంగా ఉన్నప్పుడు వారు కూడా ప్రొసిడింగ్స్‌కు హాజరయ్యారని తేజస్వీ యాదవ్ తల్లిదండ్రులను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. అప్పుడు రహస్య ఓటింగ్ లేదని గుర్తు చేశారు. అనంతరం స్పీకర్‌గా ఎన్నికైన విజయ్ కుమార్ సిన్హాను సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంలు తార్ కిషోర్ ప్రసాద్, రేణు దేవి.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లు కలిసి స్పీకర్ పోడియం వద్దకు తీసుకెళ్లారు. ఇక ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే సంపూర్ణ మెజారిటీ సాధించడంతో వరుసగా నాలుగోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. 243 అసెంబ్లీ స్థానాల్లో 126 ఎన్డీయే దక్కించుకోగా ఇందులో బీజేపీ 74, జనతాదళ్(యు) 43 మరో ఎనిమిది సీట్లను ఎన్డీయే మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. మరోవైపు ఆర్జేడీ 75 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాగా 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. బిహార్ ప్రజలకు ఉచితంగానే వ్యాక్సిన్ -
హిందుస్తాన్ అనను: ఎంఐఎం ఎమ్మెల్యే
పట్నా: ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు ‘హిందుస్తాన్’ అననంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రేపారు. వివరాలు.. బిహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్తారుల్ ఇమాన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ.. ‘దానిలో భారత్ అనే ఉంది కదా.. హిందుస్తాన్ అని ప్రమాణం చేయడం సరైందేనా అని తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నారు. ‘రాజ్యంగా ప్రకారం ప్రమాణ స్వీకారం చేసే ప్రతిసారి భారత్ అనే ఉపయోగిస్తాం. ఈ క్రమంలో నేను హిందుస్తాన్ అని ఉపయోగించడం సరైందేనా.. లేక భారత్ అనే ఉపయోగించాలా. ఎందుకంటే మేం ప్రజాప్రతినిధులం. రాజ్యాంగం మాకు అన్నింటి కంటే ఎక్కువ’ అన్నారు. రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘హిందుస్తాన్ అనే పదం పట్ల నేను ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. చేయను కూడా. రాజ్యాంగ ప్రవేశికను ఏ భాషలో చదివినా అందులో ఉండేది భారత్ అనే. దీని ప్రకారం రాజ్యాంగం పేరిట మన ప్రమాణం చేస్తున్నందున దానిలో ఉన్న దాన్ని ఉపయోగించడమే సరైన పని’ అన్నారు ఇమాన్. (మమతతో దోస్తీకి ఒవైసీ రెడీ) హిందుస్తాన్ అనడం ఇష్టం లేకపోతే పాక్ వెళ్లండి: బీజేపీ ఇక ఇమాన్ వ్యాఖ్యల పట్ల బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నాయకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘హిందుస్తాన్ అని పలకాలంటే ఇబ్బంది పడేవారు పాకిస్తాన్ వెళ్లవచ్చు’ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమాన్‌తో సహా మరో నలుగురు ఎంఐఎం నాయకులు విజయం సాధించారు. -
నితీష్ కుమార్‌కు ఆర్జేడీ ఆఫర్
పట్నా : బీజేపీ నామినేటెడ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ తమతో చేతులు కలపాలని ఆర్జేడీ సీనియర్ నేత అమర్నాథ్ గమీ వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సీఎం పీఠంలో నితీష్ కుమార్‌కు కూర్చోబెట్టడం వెనుక పెద్ద కుట్రదాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రానున్న కొద్దికాలంలోనే నితీష్ ప్రభుత్వం కూలిపోతుందని తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్బందన్ బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్నాలో సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీ పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీదే విజయమని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఎన్నికైనప్పటికీ అధికారమంతా బీజేపీ నేతల చేతుల్లోనే ఉంటుందన్నారు. ఎలాంటి అధికారాలు లేని సీఎం పీఠంలో నితీష్ ఉండి ఉపయోగంలేదన్నారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి తమతో చేతులు కలపాలని కోరారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలోనూ బీజేపీ ప్రత్యామ్నాయ కూటమికి నాయకత్వం వహించాలని అమర్నాథ్ సూచించారు. కాగా ఇటీవల వెలువడిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. 75 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. బీజేపీ 74, జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే కూటమిలో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ సీఎం పీఠం మాత్రం జేడీయూకి అప్పగించింది. దీనిపై జాతీయ స్థాయిలో వివిధ రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయిన్పటికీ ముందు కుదిరిన ఒప్పందంలో భాగంగానే నితీష్‌ను సీఎంగా ఎన్నుకున్నామని బీజేపీ చెబుతోంది. -
బిహార్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా మాంజీ
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తానీ ఆవామ్ మోర్చా పార్టీ వ్యవస్థాపకుడు జితన్‌రామ్ మాంజీ ఆ రాష్ట్ర నూతన అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఫగుచౌహాన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 23 లేదా 24న కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉండటంతో అప్పటి వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అసెంబ్లీ మెదటి సమావేశాలు నవంబర్ 23 నుంచి ఐదు రోజుల పాటు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తూర్పు బిహార్‌కు చెందిన 76 ఏళ్ల జితన్ రామ్ బిహార్ 23వ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2014 మే20 నుంచి 2015 ఫిబ్రవరి 20 వరకు ఆయన సీఎం పదవిలో కొనసాగారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జితన్ రామ్.. చంద్రశేఖర్ సింగ్, బిందేశ్వరీ దూబే, సత్యేంద్ర నారాయణ సిన్హా, జగన్నాథ్ మిశ్రా, లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. -
జాతీయగీతం మర్చిపోయిన విద్యాశాఖ మంత్రి
పట్నా: బిహార్ నూతన విద్యాశాఖ మంత్రిని నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. బడికి పోయావా లేదా సామి అంటూ ఎగతాళి చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టి పట్టుమని వారం రోజులు కూడా కావడం లేదు.. ఇన్ని విమర్శలు మూటగట్టుకుంటున్నాడంటే.. అయ్యగారు ఇంతలోనే ఏం ఘనకార్యం వెలగబెట్టారో అనుకుంటున్నారా. నిజమే మంత్రిగారు చేసింది మాములు తప్పు కాదు. భారతీయుడు అయ్యి ఉండి.. అందులోనూ ప్రజాప్రతినిధిగా ఎన్నికై.. ఏకంగా జాతీయ గీతాన్ని మర్చిపోయాడంటే మామూలు తప్పిదం కాదు కదా. అందుకే నెటిజనులు సదరు మినిస్టర్‌ని ఇంతలా ట్రోల్ చేస్తున్నారు. వివరాలు.. బిహార్ విద్యాశాఖ మంత్రి మేవలాల్ చౌదరీ ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యి.. జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. అయితే మేవలాల్ జనగణమణ పాడుతూ.. మధ్యలో కొన్ని పదాలను మర్చిపోయారు. "పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా" కు బదులుగా "పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా" అని పాడారు. (చదవండి: బిహార్ ఫలితాలు-ఆసక్తికర అంశాలు) ఇందుకు సంబంధించిన వీడియో ఆర్జేడీ నాయకులకు చిక్కింది. "అనేక అవినీతి కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ విద్యాశాఖ మంత్రి మేవలాల్ చౌదరికి జాతీయ గీతం కూడా తెలియదు. నితీష్ కుమార్ జీ ఇంతకన్నా అవమానం ఏం ఉంటుంది? మీ మనస్సాక్షి ఎక్కడ మునిగిపోయింది?" అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరలవ్వడమే కాక ట్రోల్ అవుతోంది. ఈ వీడియోని ఇప్పటికే 2.2 లక్షల మంది వీక్షించారు. ఇక దీనిపై నెటిజనులు ‘ఇలాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.. ఇక విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోండి’.. ‘ఇది 2020 సంవత్సరం.. ఇప్పటికి జాతీయ గీతం రాని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం నిజంగా సిగ్గు చేటు’.. ‘స్కూల్లో ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న అంశాలు విద్యాశాఖ మంత్రికి తెలియకపోవడం దురదృష్టం.. అసలు మీరు బడికి వెళ్లారా లేదా’ అంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. (చదవండి: బిహార్ అసెంబ్లీలో నేర చరితులెక్కువ!) ఇక మేవలాల్ చౌదరిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన అగ్రికల్చర్ యూనివర్సిటీకి హెడ్‌గా ఉన్నప్పుడు జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో మేవలాలక్కు భాగం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టిన నితీష్ కుమార్ ద్వంద్వ వైఖరికి సిగ్గుపడుతున్నాం. 60 స్కాముల్లో మేవలాల్‌కు భాగస్వామ్యం ఉంది. అలాంటి వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించి ఆ పదవిని కించపరిచారు అంటూ ఆర్జేడీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బిహార్ అసెంబ్లీలో నేర చరితులెక్కువ!
పట్నా: బిహార్ అసెంబ్లీ విజేతల సామాజిక నేపథ్యాలను విశ్లేషించగా, గత ఎన్నికలకంటే ఈసారి ఎన్నికల్లో ధనవంతులు, నేర చరితులు ఎక్కువగా ఉన్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, ఆర్జేడీ నాయకత్వంలో మహా కూటమితోపాటు ఏఐఎంఐఎం పార్టీలు కలిసి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 54.5 శాతం టిక్కెట్లను క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఇవ్వగా, 58.2 శాతం మంది విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో అవే పార్టీలు 61.7 శాతం టిక్కెట్లు ఇవ్వగా, 66.8 శాతం ఎమ్మెల్యేలు గెలిచారని ‘అసొసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్’ విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. 2015 ఎన్నికల్లో 25 శాతం మంది అభ్యర్థులు కోటి రూపాయలు దాటిన ధనవంతులు కాగా, 2020 ఎన్నికల్లో వారి సంఖ్య 33 శాతానికి చేరుకుంది. వారిలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మినహా ప్రధాన రాజకీయ పార్టీల తరఫున 86 శాతం మంది ధనవంతులు పోటీ చేయగా, 78 శాతం మంది విజయం సాధించారు. సీపీఐ నుంచి గెలిచిన రామ్ రతన్ సింగ్ బహుళ కోటీశ్వరుడు. లోక్‌జన శక్తి పార్టీ నుంచి విజయం సాధించిన రాజ్ కుమార్ సింగ్ 1.9 కోట్ల అధిపతి. ప్రధాన రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన అనంత్ కుమార్ సింగ్ నగదు ఆస్తులు 51 కోట్లు. మొకామా నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అనంత్ కుమార్ సింగ్ నగదు ఆస్తులు 51 కోట్లు. ఆయనపై అత్యధికంగా 38 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 11 హత్యాయత్నం కేసులు, నాలుగు కిడ్నాపింగ్ కేసులు ఉన్నాయి. మొత్తంగా గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో ఆస్తిపరులు, నేరస్థులు గణనీయంగా పెరిగారు. (చదవండి: బిహార్ ఫలితాలు-ఆసక్తికర అంశాలు) -
నితీష్‌పై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్
పట్నా : దేశ వ్యాప్తంగా రాజకీయ వేడి రగిల్చిన బిహార్‌లో నేడు (సోమవారం) కీలక ఘట్టం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమిలో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ.. జేడీయూ అధినేత నితీష్ కుమార్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం నితీష్‌తో పాటు 14 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ రాజకీయాల్లో చాణిక్యుడిగా పేరొందిన నితీష్.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక సీఎంగా ఎన్నికైన నితీష్‌కు దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. ఎన్డీయే పక్షాలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం అభినందనలు తెలియజేస్తున్నారు. (సోదరుడికి చెక్.. బీజేపీతో పొత్తుకు సై!) ఈ క్రమంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సైతం నితీష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా ఎన్నికై నితీష్‌ను అభినందిస్తూనే సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేసిన ప్రశాంత్ కిషోర్ ‘బీజేపీ నామినేటేడ్ ముఖ్యమంత్రి నితీష్‌కు శుభాకాంక్షలు. సీఎంగా అలసిపోయి, రాజకీయంగా వెనుబడిన ముఖ్యమంత్రి (నితీష్) పాలనను భరించేందుకు బిహార్ ప్రజలు మరో కొనేళ్ల పాటు సిద్ధంగా ఉండాలి’ అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. (నితీష్ కుమార్ సీఎం కుర్చీకి ముప్పు!?) కాగా గతంలో నితీష్ కుమార్‌కు మద్దతుగా నిలిచిన ప్రశాంత్ కిషోర్ గత ఏడాది ఆయనతో విభేదించిన విషయం తెలిసిందే. దీంతో జేడీయూ ఉపాధ్యక్ష పదవి నుంచి ప్రశాంత్‌ను తొలగిస్తూ నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీతో కలిసి పోటీచేయాలన్న నితీష్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో విపక్షాలకు మద్దతుగా ప్రచారం చేస్తారనుకున్న ప్రశాంత్.. మౌనంగా ఉన్నారు. ఎట్టకేలకు నాలుగు నెలల అనంతరం తొలిసారి నితీష్‌పై స్పందించారు. -
బీజేపీ బలవంతం మేరకే సీఎం..
పట్నా : బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్‌పై ప్రతిపక్ష ఆర్జేడీ మరోసారి వ్యంగ్యస్త్రాలు సంధించింది. ఆర్జేడీ, బీజేపీ కంటే తక్కువ స్థానాలను గెలుచుకుని సీఎం పీఠంలో కూర్చోడానికి నితీష్ సిగ్గుపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తనకు ఏమాత్రం ఇష్టంలేకున్నా బీజేపీ నేతల బలవంతం మేరకే సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు నితీష్ కుమార్ ఇదివరకే చెప్పారని ఆర్జేడీ ఈ సందర్భంగా గుర్తుచేసింది. నితీష్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించిన ఆర్జేడీ ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ సాధించిన ఫలితాలే తమ నిర్ణయానికి కారణమని పార్టీ పేర్కొంది. (కాషాయ గూటికి మాజీ సీఎం కుమారుడు!) ‘నిజానికి మరోసారి సీఎంగా పని చేయడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. జేడీయూ మూడవ స్థానంలో నిలవడం ఊహించలేనిది. సీఎంగా బాధ్యతలు నిర్వర్తించే ఓపిక ఇక నాకు లేదు.’ అంటూ ఆదివారం ఎన్డీయే పక్షాల సమావేశంలో బీజేపీ నేతలతో నితీష్ కుమార్ చెప్పినట్లు ఆర్జేడీ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. తానే సీఎంగా ఉండాలని బీజేపీ నేతలు ఏడ్చి పట్టుబట్టారని.. వారి అభిప్రాయాన్ని కాదనలేకే సీఎంగా కొనసాగాలనే నిర్ణయం తీసుకున్నానని నితీష్ చెప్పినట్లు ఆర్జేడీ వ్యంగంగా ట్వీట్ చేసింది. నవంబర్ 10న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి 125 స్థానాలు సాధించిన విషయం తెలిసిందే. 74 స్థానాలతో కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 43 స్థానాలతో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ రెండవ స్థానంలో ఉండగా వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ), హిందుస్తాన్ ఆవాస్ మోర్చా చెరో నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. అయితే ఈ ఎన్నికల్లో 75 సీట్లను కైవసం చేసుకుని ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ ఆరోపిస్తున్నారు. -
కొలువు దీరిన నితీష్ కొత్త సర్కార్
సాక్షి, పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ (69)ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పీఠాన్ని వరుసగా నాల్గవసారి ఆయన సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఏడవసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికైన ఘనతను నితీష్ దక్కించుకున్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్ నితీష్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి బీజేపీ నేత, కేంద్రమంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా హాజరయ్యారు. ఉత్కంఠ పోరులో విజయాన్ని చేజిక్కించుకున్న ఎన్డీఏ కొత్త సర్కార్ కొలువు దీరింది. బీజేపీ నుంచి ఏడుగురికి, జేడీయూనుంచి ఐదుగురికి కేబినెట్లో చోటు దక్కగా, ఉప ముఖ్యమంత్రి పదవులను బీజేపీ సొంతం చేసుకోవడం విశేషం. 12 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకరించారు. డిప్యూటీ సీఎంలుగా బీజేపీ నేతలు తార్కిషోర్ ప్రసాద్ రేణూ దేవీ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆదివారం సమావేశమైన ఎన్డీఏ శాసనసభ పార్టీ నాయకులు నితీష్ కుమార్‌ను నాయకుడిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసినవారు: కొత్త మంత్రివర్గంలో చేరిన 12 మంది మంత్రులలో బీజేపీ నుంచి మంగల్ పాండే , అమరేంద్ర ప్రతాప్ సింగ్ ఉన్నారు. హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం)కు చెందిన సంతోష్ మాంజి, జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, అశోక్ చౌదరి, మేవా లాల్ చౌదరి, వికా షీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) కు చెందిన ముఖేష్ మల్లా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. -
నితీష్ కుమార్ సీఎం కుర్చీకి ముప్పు!?
సాక్షి, న్యూఢిల్లీ : నితీష్ కుమార్ ఈ రోజు (సోమవారం) సాయంత్రం బిహార్ ముఖ్యమంత్రిగా ఏడవ సారి పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగినట్లయితే బిహార్ రాష్ట్రానికి అత్యధిక కాలంపాటు కొనసాగిన ముఖ్యమంత్రిగా కొత్త చరిత్రను సష్టిస్తారు. ఓ రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేయడం అన్నది మామూలు విషయం కాదు. అందున అగ్రవర్ణ కులం నుంచో లేదా రాష్ట్రంలో ప్రాబల్యం ఎక్కువగా ఉన్న యాదవ కుటుంబం నుంచి కాకుండా ఓ కుర్మి సామాజిక వర్గానికి చెందిన నితీష్ కుమార్ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగడం మామూలు విషయం కాదు. బిహార్ రాష్ట్ర జనాభాలో కేవలం రెండు శాతం మాత్రమే ఉన్న కుర్మీ కమ్యూనిటీ నుంచి ఈ స్థాయికి నితీష్ ఎదగడమే ఓ గొప్ప విషయం. నితీష్ కుమార్ ప్రాతినిథ్యం వహిస్తోన్న జేడీయూ రాష్ట్ర ఎన్నికల్లో ఎన్నడూ కూడా తనంతట తాను మెజారిటీ సీట్లను సాధించలేదు. ఈసారి సీట్లు, ఓట్ల శాతం మరింత తగ్గిపోయింది. ఆ పార్టీకి ఈసారి 15.4 శాతం ఓట్లతో కేవలం 43 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. గత ఎన్నికల్లో 71 సీట్లను సాధించింది. ఈసారి జనతాదళ్కంటే బీజేపీకి అదనంగా 30 సీట్లు రావడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఈసారి ముఖ్యమంత్రి పదవి నుంచి నితీష్ కుమార్ తప్పించి ఆ స్థానంలో బీజేపీ సీనియర్ నాయకులకు ప్రాతినిథ్యం కల్పిస్తారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బిహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కూడా ఆ ప్రచారానికి తోడ్పడగా, అందుకనుగుణంగా నితీష్ కుమార్ శకం ముగిసట్లేనంటూ బీజేపీ సీనియర్ నాయకులు కూడా వ్యాఖ్యానాలు చేశారు. అందుకు భయపడో, మరెందుకోగానీ ఇదే తన చివరి ఎన్నికలంటూ ప్రచారం చేయడం ద్వారా ప్రజల సానుభూతిని పొందేందుకు నితీష్ ప్రయత్నించారు. ఏదయితేనేం, అతిపెద్ద పార్టీలుగా బిహార్‌లో ఆవిర్భవించిన బీజేపీ, ఆర్జేడీలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేటన్ని సీట్లు సాధించలేక పోయాయి. మిత్రపక్షాలతో కలసి బీజీపీకి ప్రభుత్వం ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీ లభించింది. బీజీపీ తాను సొంతంగా కాకుండా నితీష్ కుమార్‌నే ముఖ్యమంత్రిగా కొనసాగించాలనే తెలివైన నిర్ణయం తీసుకుంది. నితీష్ కాదంటే ఆయన ఆర్జేడీ–కాంగ్రెస్ కూటిమికి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రత్యామ్నాయ ప్రభుత్వంలో చేరే అవకాశం స్పష్టంగా ఉండింది. దాన్ని అడ్డుకోవడంలో భాగంగానే బీజేపీకి నితీష్‌ను సీఎంగా చేయక తప్పలేదు. అయినంత మాత్రాన ఐదేళ్లపాటు నితీష్‌ను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగించే ఉద్దేశం బీజేపీ అధిష్టానంకు లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. నితీష్‌ను సీఎం పదవి నుంచి తప్పించినా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి నుంచి ముప్పు ఉండకుండా ఉండేందుకు ఆ పార్టీల నుంచే కాకుండా, నితీష్ పార్టీ నుంచి సభ్యుల వలసను బీజేపీ స్వీకరిస్తుందని, తద్వారా తానే అధికార పగ్గాలు స్వయంగా స్వీకరించే పరిస్థితిని సష్టించుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక నితీష్ పూర్తికాలం సీఎం పదవిలో కొనసాగరన్నది వారి వాదన. -
35 ఏళ్లుగా పోటీకి దూరం.. ఏడోసారి సీఎం
దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్‌ను కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ముందుగా ఇచ్చిన హామీకి కట్టుబడి నితీష్‌కే సీఎం పీఠం కట్టబెట్టేందుకు బీజేపీ పెద్దలు ఆమోదం తెలిపారు. దీంతో ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. గత 35 ఏళ్లుగా అసెంబ్లీ పోటీగా దూరంగా ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రిగా మాత్రం తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నారు. మూడు దశాబ్ధాలకు పైగా శాసనమండలికి ఎన్నికవుతూ.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తున్నారు. పట్నా : నితీష్ కుమార్ ఇప్పటివరకు బిహార్ ముఖ్యమంత్రిగా ఆరుసార్లు ప్రమాణం చేశారు. 2000 (8 రోజులు), మరోసారి 11 రోజులు, 2005, 2010, 2015లో రెండుసార్లు ప్రమాణం చేశారు. 1977 లో తొలిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హర్నాట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. అనంతరం అదే స్థానం నుంచి 1985 లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఆరుసార్లు గెలిచారు. చివరగా 2004 లో నలంద పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గెలిచారు. తొలిసారి 2000లో బిహార్ సీఎంగా ఎన్నికయినప్పటికీ ఎనిమిది రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత 2005లో మరోసారి సీఎంగా ప్రమాణం చేసే అవకాశం రావడంతో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక అప్పటి నుంచి కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితమై.. బిహార్‌ను శాసిస్తున్నారు. తాజాగా ఏడోసారి సీఎంగా ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు. 2014-15లో తొమ్మిది నెలల స్వల్ప కాలం మినహా.. 2005 నవంబర్ నుంచి ఇప్పటి వరకు (2020) బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏర్పడిన రాజకీయ విభేదాలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు సన్నద్దతలో భాగంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సమయంలో ఎస్సీ నేత జీతాన్రాం మాంజీ బిహార్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే మారిన రాజకీయ సమీకరణల కారణంగా నితీష్ కుమార్ 2015 లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పీఠం మరోసారి అధిష్టించారు. ఈ సారి ఎన్నికల్లో లాలూప్రసాద్‌తో పొత్తు పెట్టుకుని పూర్తిస్థాయి మెజార్టీ సాధించి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మరోసారి 2017 లో ఎన్డీయేతో మరోసారి జట్టుకట్టారు. బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన బిహార్ అసెంబ్లీలోని ఏ సభలోనూ సభ్యుడు కాదు. దాంతో ఆయన పదవీకాలం ఎనిమిది రోజులు మాత్రమే కొనసాగింది. అప్పుడు ఆయన రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యే అవకాశం లేదు. 2005 నవంబర్‌లో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా ఆయన ఎమ్మెల్యే కాదు. ఆ తర్వాతి ఏడాది ప్రారంభంలో శాసనమండలికి ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా నితీష్ కుమార్ పదవీకాలం 2012 లో ముగియడంతో.. ఆయనను తిరిగి ఎగువ సభకు ఎన్నుకున్నారు. ‘తనకు ఎగువసభ అంటే అమితమైన గౌరవం, అందుకే ఎమ్మెల్సీగా ఉండటానికి ఇష్టపడతాను అంటూ నితీష్ పలు సందర్భల్లో చెప్పుకొచ్చారు. ఒక నియోజకవర్గంపై తన మొత్తం దృష్టిని పరిమితం చేయకూడదనుకుంటునానని, అందకే తాను అసెంబ్లీకి పోటీ చేయను అంటూ అని 2012 జనవరిలో శాసనమండలి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో నితీష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత ఆరేండ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికవుతాను అని నవ్వుతూ చెప్పారు. నితీష్ కుమార్ 2018 లో శాసనమండలికి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2024లో ముగియనుంది. సీఎం పీఠాన్ని మార్చాలని బీజేపీ అనుకోకుంటే అప్పటి వరకు నితీష్ సీఎంగా కొనసాగనున్నారు. బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేకి 125 సీట్లు దక్కాయి. ఆర్జేడీ సారధ్యంలోని మహాకూటమికి 110 సీట్లకే పరిమితమైంది. ఎల్జేపీ 1, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు. పార్టీల వారీగా చూస్తే.. 75 సీట్లు గెలిచి ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74 సీట్లు సాధించగా, జేడీయూ 43 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించింది. ఇక, సీపీఐఎంఎల్ 11, ఎంఐఎం 5, హెచ్ఏఎంఎస్ 4, వీఐపీ 4, సీపీఎం 3, సీపీఐ 2, ఎల్జేపీ ఒక స్థానంలో గెలిచాయి. నితీష్ దారిలో ఠాక్రే, యోగీ.. కాగా నితీష్‌తో పాటు మరో రెండు రాష్ట్రాలకు సైతం ఇద్దరు సీఎంలు మండలి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు లోక్‌సభ ఎన్నికలలో గెలిచారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఎప్పుడూ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే, ఠాక్రే, యోగి ఆదిత్యనాథ్ ఇద్దరూ ఎగువసభ ద్వారా మొదటిసారి ముఖ్యమంత్రి కావడం విశేషం. -
మోదీ భక్తుడిపై నీలి నీడలు
పట్నా : బిహార్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ముప్పేట దాడి చేసిన లోక్‌జనశక్తి (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కొండంత అండగా ఉన్న తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ అకాల మరణంతో ఒంటరి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ ఓటమే లక్క్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ ప్రచారం చేశారు. చివరకు తాను అనుకున్న లక్ష్యం నెరవేరకున్నా ఎన్డీయే కూటమిలో జేడియూ ఓట్లను చీల్చుతూ సీట్ల సంఖ్య తగ్గించగలిగారు. ఎల్జేపీ వల్లే సుమారు 35 మంది అభ్యర్థులు ఓడిపోయారని జేడియూ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమిలో భాగసామ్య పార్టీఅయిన ఎల్జేపీపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఎన్నికల తర్వాత ప్రెస్ మీట్లో నితీష్ డిమాండ్ చేశారు. (చదవండి:మీడియా తప్పుగా అర్థం చేసుకుంది: నితీష్) ముందు నుయ్యి.. వెనుక గొయ్యి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయ్యింది బీజేపీ పరిస్థితి. బిహార్‌లో ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఎన్డీయే కూటమి నష్టపోయినప్పటికీ, బీజేపీ అతిపెద్ద భాగసామ్య పక్షంగా అవతరించడంతో సహాయ పడింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎల్జేపీ అభ్యర్థులను బరిలో నిలపలేదు. మరోవైపు ఎన్నికల ర్యాలీలలో ఎల్జేపీ యువనేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హనుమంతుడిలాంటి భక్తునంటూ ప్రచారం చేశారు. రాష్ష్ర్టంలో బీజేపీ అధికారంలోకి రావడం తన ధ్వేయమని పలు బహిరంగ సభల్లో ప్రకటించారు. ఇలాంటి తరణంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... ‘ఎల్జేపీ జాతీయ పార్టీ కాదు. ఇది బిహార్‌కి చెందిన ప్రాంతీయ పార్టీ. చిరాగ్ పాశ్వాన్ ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్‌ని వ్యతిరేకించారు. దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన మంత్రి పదవి ఇవ్వాలా? వద్దా? అనేది పార్టీ అగ్రనేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నిర్ణయిస్తారు’ అని అన్నారు. (చదవండి:బిహార్ ఎన్నికల్లో ఎన్నో ‘సేలియెంట్ ఫీచర్స్’) చిరాగ్‌ని చీకొట్టడానికి అడ్డంకులేంటీ? ప్రధాని మోదీ ఎన్నికల సభలో రాం విలాస్ పాశ్వాన్‌ని గుర్తు చేస్తూ.. ఒక మంచి మిత్రుడిని కోల్పోయనని పేర్కొన్నారు. బీజేపీ అగ్రవర్ణాల పార్టీగా కాకుండా దళితులకు చేరువవడంలో రాంవిలాస్ పాశ్వాన్, రాందాస్ అథవాలే విశేష కృషి చేశారు. రానున్న బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కూటమి నుంచి ఎల్జేపీ అవమానకర స్థితిలో బయటకు పంపిస్తే దళిత వర్గాల్లో బీజేపీ బలహీన పడే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ అగ్రనాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే ఎన్డీయే నేతృత్వలో ఏర్పాటు కానున్న ప్రభుత్వానికి చిరాగ్ మద్దతు ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
మీడియా తప్పుగా అర్థం చేసుకుంది: నితీష్
పాట్నా : బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం మొదటిసారి విలేకరులతో పాట్నాలో సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు తమ కూటమికే అవకాశం ఇచ్చారని అన్నారు. అయితే గతంలో తాను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందన్నారు. ఈ ఎన్నిక తనకు చివరిది కాదని స్పష్టం చేశారు. తాను గత సమావేశంలో పదవీ విరమణ గురించి మాట్లాడలేదని పేర్కొన్నారు. ‘‘ప్రతీ ఎన్నికల చివరి ర్యాలీలో నేను ‘ముగింపు బాగుంటే, అంతా బాగుంటుంది’ (అంత్ బలా తో సబ్ బలా) అనే మాటతో ముగిస్తాను. దీనిని అస్పష్టంగా అర్థం చేసుకున్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా అంకితభావంతో పరిపాలన కొనసాగిస్తాన’’ని అన్నారు. కాగా, నితీష్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే ముందు రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేయాల్సి ఉంటుంది. అనంతరం తాజాగా ఎన్డీయే కూటమి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆయన్ను తమ నేతగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమి 125 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. గట్టిపోటీనిచ్చిన ఆర్జేడీ నాయకత్వంలోని విపక్ష మహా కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకుంది. (ఎల్జేపీపై బీజేపీదే నిర్ణయం: నితీశ్) -
‘ఉప’ ఫలితాలతో ఉత్సాహం
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు కూడా బీజేపీకి, ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఉత్సాహాన్నిచ్చాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్ ఫలితాలు బీజేపీని బాగా సంతోషపరిచాయి. మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 19 స్థానాలను చేజిక్కించుకోవడం ఆ రాష్ట్రంలో బీజేపీకి జవసత్వాలనిచ్చింది. ఆ పార్టీ బలం ఒక్కసారిగా 126కి పెరిగింది. కరోనా వైరస్ దేశమంతా అలుముకున్న తొలి దినాల్లో... అంటే మొన్న మార్చిలో అక్కడ రాజకీయ సంక్షోభం రాజుకుని జ్యోతిరాదిత్య సింథియాకు మద్దతుగా 22మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌నుంచి బయటికొచ్చారు. దాంతో అప్పటికి 15 నెలలుగా అధికారంలో కమల్‌నాథ్ నేతృత్వం లోని కాంగ్రెస్ సర్కారు విశ్వాస పరీక్ష ఎదుర్కొనడానికి ముందే రాజీనామా చేసింది. బీజేపీ సీనియర్ నేత శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 107మంది సభ్యుల బలంతో అప్పటినుంచీ అది నెట్టుకొస్తోంది. రాజీనామాలవల్ల, ఇతరత్రా కారణాలతో మొత్తం 28 స్థానాలు ఖాళీ కాగా వాటికి గత నెలలో ఉప ఎన్నికలు జరిగాయి. తగినంత బలం లేకున్నా పాలన సాగించవలసి వస్తోంది గనుక శివరాజ్ సింగ్ చౌహాన్ తరచు తనను తాను ‘తాత్కాలిక సీఎం’గా చెప్పుకునేవారు. 2005 నుంచి 2018 వరకూ పాలించిన చౌహాన్‌కు ఇలాంటి సమస్య ఎప్పుడూ ఎదురుకాలేదు. అయితే నెగ్గినవారిలో అత్యధికులు కాంగ్రెస్ నుంచి పార్టీలోకొచ్చిన జ్యోతిరా దిత్య సింథియా అనుయాయులు. వారు పార్టీ కన్నా జ్యోతిరాదిత్యకే విశ్వాసపాత్రులుగా వుంటారు. కనుక చౌహాన్‌పై మున్ముందు ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. గతంలో ఆయనది ఏకచ్ఛత్రాధిపత్యం. ఈ ఉప ఎన్నికలు ఇటు జ్యోతిరాదిత్యకూ, అటు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్‌కూ పెద్ద పరీక్షగా మారాయి. తన అనుచర గణాన్ని గెలిపించుకోలేకపోతే బీజేపీలో జ్యోతిరాదిత్య స్థానం బలపడదు. అలాగే ఇన్నాళ్లూ జ్యోతిరాది త్యకు పార్టీ బలమే తప్ప సొంత బలమేమీ లేదని చెబుతూ వస్తున్న కమల్‌నాథ్‌పై దాన్ని నిరూపించ వలసిన భారం పడింది. అందువల్లే ఉప ఎన్నికల ఫలితాలతో ఆయన డీలా పడ్డారు. గ్వాలియర్– చంబల్ ప్రాంతంలో తనకు రాజకీయంగా పట్టుందని జ్యోతిరాదిత్య రుజువు చేసుకున్నారు. మరో 9 స్థానాల్లో ఫిరాయింపుదార్లను ఓడించి, విజయం సాధించడమే కాంగ్రెస్‌కు ఉన్నంతలో ఓదార్పు. అచ్చం మధ్యప్రదేశ్ తరహాలోనే గుజరాత్లో కూడా 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల సమయంలో బీజేపీకి ఫిరాయించారు. వారిలో అయిదుగురికి ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్లు లభించాయి. తాజాగా ఈ ఎనిమిదిచోట్లా కాంగ్రెస్ ఓడిపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్తెసరు మెజారిటీయే లభించింది. 182మంది సభ్యుల అసెంబ్లీలో 1995 తర్వాత తొలిసారి ఆ పార్టీ బలం 99కి పడిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘకాలం సీఎంగా పనిచేసిన బీజేపీకి ఇది భంగ పాటే. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 77 స్థానాలు గెల్చుకుంది. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేనాటికి సీఎం విజయ్ రూపానీని మార్చే అవకాశం వుందన్న కథనాలు వెలువడుతున్న దశలో అన్ని స్థానా లనూ పార్టీ గెల్చుకోవడం రూపానీకి రాజకీయంగా కలిసొచ్చే అంశం. మణిపూర్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీకి అయిదుగురు ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో ఉప ఎన్నికలు అవసరమయ్యాయి. తాజా ఉప ఎన్నికల్లో బీజేపీ నాలుగు గెల్చుకోగా, మరోచోట ఇండిపెండెంట్ అభ్యర్థి నెగ్గారు. యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగిన ఏడు స్థానాల్లో ఆరింటిని బీజేపీ గెల్చుకుంది. ఒక చోట సమాజ్‌వాదీ పార్టీ స్వల్ప ఆధిక్యతతో సీటు నిలబెట్టుకుంది. అత్యాచారం, హత్య కేసుల్లో శిక్ష అను భవిస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్ నేతృత్వంవహించిన బంగార్మవ్ నియోజక వర్గంలో సైతం బీజేపీ అభ్యర్థే విజయం సాధించారు. హథ్రాస్‌లో యువతిపై అత్యాచారం, ఆమె భౌతి కకాయానికి అర్థరాత్రి పోలీసులే అంత్యక్రియలు జరపడం వంటి ఘటనల ప్రభావం ఉప ఎన్నికలపై కనబడకపోవడం గమనించదగ్గది. ఉత్తరప్రదేశ్ ఫలితాలకు విపక్షాల బాధ్యత కూడా వుంది. ఈ ఏడు చోట్లా నేరుగా యోగి ఆదిత్యనాథ్ సభలూ, సమావేశాలూ నిర్వహించారు. మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, మాయావతి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియింకగాంధీ ఒక్కచోట కూడా ప్రచారానికి వెళ్లలేదు. తెలంగాణలో ఉప ఎన్నిక జరిగిన దుబ్బాక స్థానాన్ని టీఆర్ఎస్ చేజార్చుకుంది. అక్కడ బీజేపీ విజయం సాధించింది. ఉన్నంతలో ఛత్తీస్‌గఢ్, హరియాణాల్లో రెండు స్థానాలు, జార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి రెండు స్థానాలు గెల్చుకోవడం మాత్రమే కాంగ్రెస్‌కు ఊరట. అయితే జార్ఖండ్‌లో అటు జేఎంఎంకూ, ఇటు కాంగ్రెస్‌కూ గతంలోకన్నా మెజారిటీ బాగా తగ్గడం ఆందోళన కలిగించే అంశమే. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన సాగు బిల్లులపై ఆందోళన జరుగుతున్న హరియాణాలో బరోడా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ–జేజేపీ ఉమ్మడి అభ్యర్థి ఓడిపోవడం గమనార్హం. కర్ణాటకలో జరిగిన రెండు ఉప ఎన్ని కల్లోనూ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. ఉప ఎన్నికల ఫలితాలకూ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకూ చాలా వ్యత్యాసం వుంటుంది. సాధా రణంగా ఉప ఎన్నికలు వాటికవే ఒక ధోరణిని ప్రతిబింబించవు. ఎక్కువ సందర్భాల్లో ఉప ఎన్నికల్లో ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో వుండే అధికార పక్షాలకు అనుకూలంగా వుండే అవకాశం వున్నా అభ్యర్థి ఎంపిక మొదలుకొని అతి విశ్వాసం వరకూ... స్థానిక సమస్యలతో మొదలుపెట్టి కుల సమీకరణాల వరకూ ఎన్నెన్నో అంశాలు వాటిని ప్రభావితం చేస్తాయి. ఈ అంశాల్లో ఎక్కడ లెక్క తప్పినా పార్టీలకు సమస్యలెదురవుతాయి. అధికారంలో వున్న పక్షం నగుబాటుపాలవుతుంది. త్వరలో అసెంబ్లీ ఎన్ని కలో, మరో ఎన్నికలో వచ్చే అవకాశం వుంటే ఈ ఫలితాలను చూపి భవిష్యత్తు తమదేనని శ్రేణులకు చెప్పుకోవడానికి ఏ పార్టీకైనా అవకాశం వుంటుంది. అందుకే అధికారంలో వున్న పార్టీ ఉప ఎన్నికల్లో సర్వశక్తులూ కేంద్రీకరిస్తుంది. మొత్తానికి ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు నిరాశ మిగల్చగా, బీజేపీకి ఉత్సాహాన్నిచ్చాయి. -
బిహార్ ఫలితాలు: శివసేనకు ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై : ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా ఆఘాడీ ప్రభుత్వం ప్రజా గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిపై వ్యక్తిగత కక్ష పెంచుకుని, ఆయన్ను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ ఆత్మహత్య కేసులో నవంబర్ 4న అర్నబ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మేజిస్ట్రేట్ అర్నబ్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి నిరాకరిస్తూ నవంబర్ 18 వరకు జ్యూడీషియల్ రిమాండ్‌కు అనుమతించింది. అయితే హైకోర్టులో అర్నబ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను బెంచీ కొట్టివేసింది. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. (‘మహా’ ప్రభుత్వం పతనం ఖాయం.!) అయితే అర్నబ్ మధ్యంతర బెయిల్ కోసం సుప్రీం తలుపు తట్టారు. అర్నబ్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బుధవారం ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడారు. శివసేన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహారాష్ట్ర ప్రభుత్వ స్థానాన్ని సుప్రీం చూపించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు అనుమతి తీసుకోకుండా, మూసివేసిన కేసును తిరిగి తెరిచి, అర్నబ్‌ను వీధి నేరస్థుడిలా చూసిందని మండిపడ్డారు. అతన్ని ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని, అతన్ని ఒక జైలు నుంచి మరొక జైలుకు మార్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రజల గొంతును అణిచివేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం ఇష్టపడుతోందని ఫడ్నవీస్ ఆరోపించారు. ఇది రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని అన్నారు. శివసేనకు ఎదురుదెబ్బే.. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం సరిగా లేదని, ప్రజలు ఆ పార్టీని నమ్మడం లేదని ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. బిహార్‌లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించడంపై ఆయన స్పందించారు. ఫడ్నవిస్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నందుకు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఫలితం అనుభవిస్తుందని వ్యాఖ్యానించారు. బిహార్‌లో ప్రధాని మోదీ ప్రచారం బీజేపీకి కలిసొచ్చిందని ఫడ్నవిస్ స్పష్టంచేశారు. గ్రామగ్రామానికి బీజేపీ అభివృద్ధి మంత్రం పనిచేసిందని, వారి వరకు తీసుకెళ్లగలిగామన్నారు. కాంగ్రెస్ చర్యలు భవిష్యత్తులో మహా రాజకీయాలను ప్రభావితం చేస్తాయని తెలిపారు. ఆ ప్రభావం శివసేనపై పడుతుందని, ఇపుడు సేనకు అర్థం కాబోదని, వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో తగలబోయే ఎదురుదెబ్బతో తెలుస్తుందని ఫడ్నవిస్ జోస్యం చెప్పారు. బాధితులకూ న్యాయం జరగాలి: మంత్రి మలిక్ వ్యక్తిగత స్వేచ్ఛ అందరికీ ఉంటుందని అదే సమయంలో బాధితులకూ న్యాయం జరగాలని ఎన్సీపీ నేత, మైనార్టీ వ్యవహారాల శాఖమంత్రి నవాబ్ మలిక్ వ్యాఖ్యానించారు. కాగా, అర్నబ్ అరెస్టు గురించి కోర్టు వ్యాఖ్యానిస్తూ.. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం సబబు కాదని, అది న్యాయాన్ని అపహాస్యం చేయడమేనంది. భావజాలం, అభిప్రాయ భేదాల నడుమ కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసుకోవడం పట్ల కూడా సుప్రీం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా మంత్రి మలిక్ మాట్లాడుతూ.. దేశ న్యాయవ్యవస్థను గౌరవించడం అందరి బాధ్యత అని వ్యక్తి యొక్క స్వేచ్ఛ గురించి మాట్లాడారని, అదే సమయంలో బాధితుడికి న్యాయం కూడా జరగాలని వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. -
‘మహా’ ప్రభుత్వం పతనం ఖాయం.!
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని మహావికాస్ ఆఘడీ ప్రభుత్వంపై బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే కుప్పుకూలనుందని జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే మహారాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయం తామేనని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ప్రభుత్వం త్వరలోనే పడిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కూటమిలోని మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయిని, ఇలాంటి ప్రభుత్వం ఎక్కవ కాలం పరిపాలన కొనసాగించలేదని పేర్కొన్నారు. శివసేన సర్కార్ పడిపోయిన వెంటనే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామమని ఫడ్నవిస్ ధీమా వ్యక్తం చేశారు. (చదవండి:బిహార్ ఎన్నికల్లో ఎన్నో ‘సేలియెంట్ ఫీచర్స్’ ) గురువారం ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సహాయం అందడం లేదు. ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన ఉంటూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. బిహార్ ఎన్నికల ఫలితాలు కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ ప్రభావం చూపే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని’ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిహార్ ఎన్నికల ఇంఛార్జ్‌గా ఫడ్నవిస్ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. సీఎం నితీష్ కుమార్ పాలనకు ఆ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని అన్నారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించినప్పటికీ ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నమ్మి ప్రజలు బీజేపీకి ఓటేశారని, నితీష్ కుమార్ ఫాలోయింగ్ కూడా తమకు కలిసొచ్చిందని అన్నారు. బిహార్‌లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఎన్డీయే 125 సాధించింది. అందులో బీజేపీకి 74, జేడీయూకు 43, వికాశిల్ ఇసాన్ పార్టీకి 4, హిందుస్తానీ అవాం మోర్చాకి 4 సీట్లు వచ్చాయి. ప్రత్యర్ధి మహాఘట్ బంధన్ కి 110 సీట్లు రాగా, వీటిలో ఆర్జేడీ 75 , కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలకు 16 సీట్లు సాధించాయి. ( చదవండి: ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు ) -
బిహార్ ఫలితాలు; ఎన్డీఏ విజయం వెనుక..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఎన్నికలను ప్రభావితం చేస్తాయనుకున్న అంశాలు అనూహ్యంగా మరుగున పడి పోయి కొత్త అంశాలు ముందుకు వచ్చి ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ అదే జరిగింది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని 40 లోక్‌సభ సీట్లకుగాను 39 సీట్లను బీజేపీ కూటమి గెలుచుకోవడంతో వాటి ఫలితాల ప్రభావం ఈ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఉండవచ్చని తొలుత రాజకీయ విశ్లేషకులు భావించారు. జాతీయ అంశాలైన పుల్వామా–బాలాకోట్ అంశాల కారణంగా నాడు అన్ని లోక్‌సభ సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. (చదవండి.. బిహార్ ఎన్నికల ఎఫెక్ట్; కాంగ్రెస్ సీట్లకు కోత!) దేశంలోనే అత్యంత పేద రాష్ట్రమైన బిహార్‌ను 2020లో కరోనా వైరస్ మహమ్మారి అతలాకుతలం చేసింది. దాంతో దేశవ్యాప్తంగా వలసలు పోయిన బిహారీలో ఆకలిదప్పులతో అలమటిస్తూ, అష్టకష్టాలు పడుతూ సొంతూళ్లకు చేరుకున్నారు. ఆ నేపథ్యంలో బిహార్‌లో పాలకపక్ష మనుగడ ఈసారి ఎన్నికల్లో ప్రశ్నార్థకం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ ఎన్నిలకపై ప్రధానంగా అభివృద్ధి అంశం ప్రభావితం చేస్తుందని 42 శాతం మంది అభిప్రాయపడగా, నిరుద్యోగం ప్రభావితం చేస్తుందని 30 శాతం మంది, ద్రవ్యోల్బణం ప్రభావం చూపిస్తుందని 11 శాతం మంది ఓ సర్వేలో అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయాలేవి నిజం కాలేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న కష్టకాలంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద లక్షలాది బిహారి పేద కుటుంబాలకు ఉచితంగా రేషన్ అందజేయడం ఎన్నికల ఫలితాలను ఎంతో ప్రభావితం చేసింది. తమను వాస్తవంగా గెలిపించిందీ సైలెంట్ ఓటర్లయిన మహిళలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడంలో పూర్తి వాస్తవం ఉంది. మగవారికన్నా ఐదుశాతం ఎక్కువ మంది మహిళలు ఈసారి ఓటింగ్‌లో పాల్గొన్నారు. మహిళల కోసం మోదీ చేపట్టిన ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం ఎంతోకొంత మహిళలను ప్రభావితం చేయగా, స్థానిక సంఘాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను నితీష్ ప్రభుత్వం కల్పించడం, పాఠశాలలకు వెళ్లే బాలికలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం పాలకపక్షానికి కలసి వచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ హయాం నుంచి పురుషాధిపత్య రాజకీయాలను చూస్తూ వస్తోన్న బిహార్ మహిళకు నితీష్ పట్ల గౌరవం పెరుగుతూ వచ్చింది. ‘రోజ్‌గార్’ నినాదానికి ఎక్కువగా ఆకర్షితులైన యువత మాత్రం తేజస్వీ యాదవ్ వైపు వెళ్లింది. ఇవే తనకు ఆఖరి ఎన్నికలంటూ నితీష్ కుమార్ చెప్పడం కూడా బిహార్ ఆఖరి విడత ఎన్నికలపై ఎంతో ప్రభావం చూపింది. మహిళలు, ఇతర వెనకబడిన వర్గాల వారు ఆ మాటలకు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. నితీష్–మోదీ అనే డబుల్ ఇంజన్ ప్రచారం కూడా కలిసొచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉండడం, యాదవ్ సోదరులకు ఒకరంటే ఒకరికి పడక పోవడం, తేజస్వీ యాదవ్ రాష్ట్రంలో కాకుండా ఎక్కువ కాలం ఢిల్లీలో గడపడం కూడా బిహార్ పాలకపక్షానికి కలిసొచ్చింది. జాతీయ స్థాయిలో వివాదాస్పదమైన కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన 370 రాజ్యాంగ అధికరణను రద్దు చేయడం, అయోధ్యలో రామాలయ నిర్మాణం, వివాదాస్పదమైన పౌరసత్వ బిల్లు లాంటి అంశాలపై తేజస్వీ యాదవ్ పూర్తిగా మౌనం వహించడం 28 శాతం –30 శాతం కలిగిన ముస్లింలు–యాదవ్‌ల బంధాన్ని బలహీనపర్చింది. 2015 ఎన్నికల సందర్భంగా ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాల్లోకి అడుగుపెట్టిన అసుదుద్దీన్ ఓవైసీ తన పార్టీ ఏఐఎంఐఎంను విస్తరించడంలో విజయం సాధించడం కూడా పాలకపక్ష కూటమికి కలిసొచ్చిన మరో అంశం. రాష్ట్రంలో సరైన నాయకత్వం లేకపోవడం వల్ల కాంగ్రెస్‌తో పొత్తు మహా కూటమికి కలసిరాని మరో అంశం. (చదవండి: ఎన్నికల ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు) -
హైదరాబాద్‌కు బిహార్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఐదుగురు ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ దారుస్సలాం చేరుకున్నారు. బుధవారం సాయంత్రం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు వద్ద బిహార్ ఎమ్మెల్యేలు అఖ్తరుల్ ఇమాన్, మహ్మద్ ఇజాహర్ ఆసీఫ్, షాహనవాజ్ ఆలం, సయ్యద్ రుకునుద్దీన్, అజహర్ నయీమీలకు హైదరాబాద్‌కు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా దారుస్సలాం చేరుకొని పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా మంగళవారం విడుదలైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 74, జేడీయూ 44 స్థానాల్లో గెలుపొందాయి. ఇక తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అత్యధికంగా 76 స్థానాల్లో విజయం సాధించింది. -
నితీష్‌కు చిరాగ్ చికాకు!
పట్నా : గత ఏడాది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన సీనియర్ నేత సరయూ రాయ్ ఏకంగా సీఎం రఘువర్‌దాస్‌పై పోటీ చేసి ఆయనను ఓడించారు. సీఎంను మట్టికరిపించడంతో పాటు బీజేపీ విజయావకాశాలనూ దెబ్బతీసిన సరయూ రాయ్ తరహాలో బిహార్‌లో చిరాగ్ పాశ్వాన్ నితీష్ కుమార్‌కు చుక్కలు చూపారు. చిరాగ్ పాశ్వాన్ కారణంగానే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీల తర్వాత జేడీయూ మూడోస్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని జేడీయూ వర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రఘవర్‌దాస్‌తో పోలిస్తే సీఎం స్ధానం నిలబెట్టుకోవడం మాత్రం నితీష్ కుమార్‌కు ఊరట ఇస్తోంది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ తమను టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేయడంతో జేడీయూ మంత్రులు పలువురు ఓటమి పాలయ్యారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పేర్కొనడం గమనార్హం. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి పోటీచేసినప్పుడు జేడీయూ 71 స్ధానాలను గెలుపొందగా తాజా ఎన్నికల్లో ఆ పార్టీ 43 స్ధానాలకు పరిమితమైంది. జేడీయూ అభ్యర్ధులపై తమ అభ్యర్ధులను నిలపడం చిరాగ్ నిర్ణయమా లేక ఇతరుల ప్రోద్బలంతో జరిగిందా అనేది చెప్పలేమని, కేంద్రంలో నరేంద్ర మోదీ తదుపరి కేబినెట్ విస్తరణలో ఈ దిశగా స్పష్టత వస్తుందని జేడీయూ సీనియర్ నేత చెప్పుకొచ్చారు. ఎల్జేపీ అభ్యర్ధులంతా ఏ కూటమితో కలవకుండా ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటారని, ప్రతి జిల్లాలోనూ తమ పార్టీ పటిష్టంగా ఉందని ఎన్నికల ఫలితాల అనంతరం చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. జేడీయూకు వ్యతిరేకంగా ఎల్జేపీ ప్రచారం సాగించడంతో పాలక పార్టీ ఊహించిన విధంగానే భారీ ఎదురుదెబ్బ తగిలింది. -
ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆర్జేడీ ఛీప్ తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫలితాల్లో పెద్ద ఎత్తున ఆక్రమాలు జరిగాయని ఆరోపణలు గుప్పించారు. బిహార్ ఓటర్లు మహా ఘట్‌బందన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎన్నికల సంఘంతో కుమ్మకై ఫలితాలను తారుమారు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అవకతవకలు జరిగాయన్నారు. గురువారం పట్నాలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయేకు ఈసీ అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. పోల్ ప్యానల్‌పై సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. బిహార్ ఫలితాలను రీకౌంటింగ్ జరపించాలని తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఫలితాలపై ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ నేతలు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహా కూటమి గెలిచిన స్థానాల్లో చాలావరకు వెయ్యిలోపు మెజార్టీ ఉండటంతో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. (బిహార్ ఎన్నికల ఎఫెక్ట్; కాంగ్రెస్ సీట్లకు కోత!) కాగా మంగళవారం విడదలైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ఎన్డీయే కూటమి విజయ సాధించింది. ఆర్జేడీకి 76, బీజేపీ 74, జేడీయూ 43 స్థానాల్లో గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బీజేపీకి 74 స్థానాను సొంతం చేసుకుంది. అయితే ఆర్జేడీ భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపకపోవడంతో ఆ ప్రభావం తేజస్వీపై పడింది. ఏకంగా 70 సీట్లకు పోటీచేసి కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక మరోసారి బిహార్ సీఎం పగ్గాలను అందుకునేందుకు జేడీయూ అధినేత నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. మంత్రివర్గ సంప్రదింపుల అనంతరం దిపావళి తరువాత సీఎంగా ప్రమాణం చేయనున్నారు. కేబినెట్లో కీలక శాఖలు తమకే దక్కాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇక అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సరైన సంఖ్యా బలం లేకపోవడంతో తేజస్వీ మరోసారి ప్రతిపక్ష పాత్ర పోషించనున్నారు. -
బిహార్ ఎన్నికలు : 10 మంది మంత్రుల ఓటమి
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించినా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేబినెట్లో 24 మంది మంత్రుల్లో పది మంది ఓటమి పాలయ్యారు. వీరిలో ఎనిమిది మంది జేడీయూకు చెందిన వారు కాగా, ఇద్దరు బీజేపీ మంత్రులున్నారు. నితీష్ కేబినెట్లో మొత్తం 29 మంత్రులున్నా వారిలో 5గురు ఎమ్మెల్సీలు కావడంతో ఎన్నికల బరిలో నిలవలేదు. 23 మంది మంత్రులు తమ నియోజకవర్గాల్లో పోటీ చేయగా, 2015లో ఘోసి నుంచి పోటీ చేసిన విద్యా మంత్రి కృష్ణ నందన్ ప్రసాద్ వర్మ తాజాగా జెహనాబాద్ నుంచి బరిలో దిగారు. ఇక బీజేపీ కోటా నుంచి నితీష్ కేబినెట్లో చేరిన పట్టణాభివృద్ధి మంత్రి సురేష్ కుమార్ శర్మ, గనుల మంత్రి బ్రిజ్ కిషోర్ బింద్‌లు వరుసగా ముజఫర్‌పూర్, చైన్‌పూర్‌ల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు వర్మతో పాటు జేడీయూ మంత్రులు శైలేష్ కుమార్, సంతోష్ కుమార్ నిరాల, జైకుమార్ సింగ్, రాం సేవక్ సింగ్, రమేష్ రిషిదేవ్, ఖర్షీద్, లక్ష్మేశ్వర్ రాయ్‌లు ఓటమి చవిచూశారు. ఎల్జేపీ అభ్యర్ధులు పలు నియోజకవర్గాల్లో సంప్రదాయ ఎన్డీయే ఓట్లను చీల్చడంతో తమ మంత్రులు ఓడిపోయారని ఎల్జేపీ తమ విజయావకాశాలను దెబ్బతీయకుంటే జేడీయూ 80 స్ధానాల్లో విజయం సాధించేందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తమ అభ్యర్ధుల ఓటమిపై ఎన్డీయే నేతలు సమీక్షిస్తారని చెప్పారు. -
సవాళ్లను ఎదుర్కొని గెలిచిన ఎన్డీయే
పట్నా: 15 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను, ఇటీవల వేరుపడిన మిత్రపక్షం ఎల్జేపీ శత్రుత్వాన్ని, ఆర్జేడీ యువనేత సారధ్యంలోని విపక్షాన్ని విజయవంతంగా ఎదుర్కొని బిహార్‌లో ఎన్డీయే మరోసారి అధికారంలోకి రానుంది. 243 సీట్ల అసెంబ్లీలో, మెజారిటీ మార్క్ 122 కన్నా కేవలం 3 స్థానాలు అధికంగా సాధించి, మరోసారి బిహార్ గద్దెనెక్కనుంది. గట్టిపోటీనిచ్చిన ఆర్జేడీ నాయకత్వంలోని విపక్ష మహా కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ విజయంతో వరుసగా నాలుగోసారి జేడీయూ నేత నితీశ్‌కుమార్ సీఎం కానున్నారు. 2015 ఎన్నికల్లో 71 సీట్లు సాధించిన జేడీయూ ఈ ఎన్నికల్లో 43 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. 2015లో నితీశ్ బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేశారు. మిత్రపక్షం జేడీయూ కన్నా ఎక్కువ స్థానాల్లో(74) గెలిచినా.. ముందే కుదిరిన అంగీకారం మేరకు నితీశ్‌కుమారే సీఎంగా ఉంటారని బీజేపీ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో జేడీయూ ఆశించినన్ని స్థానాలను గెలవలేకపోవడం వెనుక మాజీ మిత్రపక్షం ఎల్జేపీ హస్తం ఉంది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్‌ను అంగీకరించినప్పటికీ.. ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ మంత్రివర్గంలో అధిక వాటాను, కీలక శాఖలను డిమాండ్ చేసే అవకాశముంది. ఎంఐఎం, బీఎస్పీ, ఆర్‌ఎల్‌ఎస్పీల ‘మహా ప్రజాస్వామ్య, లౌకిక కూటమి’ ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మహా కూటమి విజయావకాశాలను బాగా దెబ్బతీసిందని, ముఖ్యంగా ముస్లిం ఓట్లను ఈ కూటమి చీల్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
బిహార్‌లో సరికొత్త అడుగులు!
భారత రాజకీయాల్లో ఒక సరికొత్త యువ హీరో ఆవిర్భావానికి బిహార్ ఎన్నికలు నాందిపలికాయి. ఆ ఉదయ తార పేరు తేజíస్వీ యాదవ్. విభజన రాజకీయాల ప్రాతిపదికన రెచ్చగొట్టాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా సరే.. దారిద్య్రం, నిరుద్యోగం వంటి తన సొంత రాజకీయ అజెండాకు గట్టిగా నిబద్ధత ప్రకటించడంలో తేజస్వీ యాదవ్ బ్రహ్మాండంగా విజయవంతమయ్యారు. 31 సంవత్సరాల తరుణ వయస్కుడు తేజస్వీ.. యాదవ రాజకీయాల బరువునుంచి పూర్తిగా తప్పుకుని కొత్త పంథాలో నడిచి అస్తిత్వ రాజకీయాల పట్టునుంచి యువతను బయటకు లాగగలిగారు. తన వంటి అతి పిన్నవయసు యువకుల్లో చాలా అరుదుగా కనిపించే పరిణతి అది. ఒక్కమాటలో చెప్పాలంటే కోవిడ్ అనంతర రాజకీయాలను ప్రతిబింబిస్తున్న సరికొత్త హీరో తేజస్వీ యాదవ్. చిట్టచివరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా ఆవిర్భవించింది.. 243 మంది సభ్యులు కల రాష్ట్ర అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 125 స్థానాలు గెల్చుకుని సరిగ్గా ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి సరిపోయేటన్ని సీట్లను సాధించి బతుకుజీవుడా అని బయటపడింది. బీజేపీ నాయకత్వం దేన్నయితే ఆశించిందో సరిగ్గా అలాగే పోలింగ్ సరళి సాగిపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో బీజేపీ స్వయంగా 74 స్థానాలు గెల్చుకుని 70 శాతం విజయశాతాన్ని సాధించింది. బిహార్ ఎన్నికల్లో అది సాధించిన ఉత్తమ ఫలితాలు ఇవే మరి. నితీశ్ కుమార్‌ని ఆయన జేడీయూని ఈ ఎన్నికల్లో ఒక జూనియర్ భాగస్వామి పాత్రకు కుదించాలని బీజేపీ పన్నిన పథకం బ్రహ్మాండంగా ఫలించింది. ప్రతిపక్ష శ్రేణులను ఎంతగా దెబ్బకొట్టాలో అంతగా దెబ్బకొట్టడమే కాదు.. విజయానికి దాదాపు దగ్గరగా వచ్చేలా ప్రతిపక్షాల ఓట్లను కూడా శాసించి బ్రాండ్ మోడీ ప్రభావం వల్లే ఈ గెలుపు సాధ్యం చేశానని బీజేపీ ఇరుపక్షాల శ్రేణుల ముందు ఘనంగా ప్రదర్శించింది. అయితే అదే సమయంలో భారత రాజకీయాల్లోకి ఒక సరికొత్త యువ హీరో ఆవిర్భవానికి బిహార్ ఎన్నికలు నాందిపలికాయి. ఆ ఉదయ తార పేరు తేజస్వి యాదవ్. విభజన రాజకీయాల ప్రాతిపది కన రెచ్చగొట్టాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా సరే.. దారిద్య్రం, నిరుద్యోగం వంటి తన సొంత రాజకీయ అజెండాకు గట్టిగా నిబద్ధత ప్రకటించడంలో తేజస్వి యాదవ్ బ్రహ్మాండంగా విజయవంతమయ్యారు. గెలిచిన స్థానాలను పరిశీలిస్తే తేజస్వి నాయకత్వంలోని ఆర్జేడీ 75 స్థానాలు సాధించి బిహార్‌లో అతిపెద్ద పార్టీగా కొనసాగింది. దాదాపు 30 లక్షల ఓట్లను లేదా 40 శాతాన్ని దక్కించుకున్న ఆర్జేడీకి, 2015 నాటి ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు దక్కాయి. ముస్లింలు, యాదవుల ఓటు పునాది కలిగిన పరిమితిని దాటి ఆర్జేడీ తన పలుకుబడిని విస్తృతస్థాయిలో విస్తరించిందని తేటతెల్లమైంది. గుర్తించదగిన విషయం ఏమిటంటే రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తన ఓటు షేరును 18.3 శాతం నుంచి 23.1 శాతానికి పెంచుకునే క్రమంలో జేడీయూ పార్టీకి చెందిన ఓట్ల కంటే బీజేపీ కోటాను కొల్లగొట్టడమే. ఈ దెబ్బకు బీజేపీ ఓటు షేర్ గతంలోని 24.4 శాతం నుంచి 19.5 శాతానికి పడిపోయింది. 2015తో పోలిస్తే బీజేపీకి ప్రస్తుతం 10 లక్షల పదివేల ఓట్లు తక్కువగా రావడం గమనార్హం. అయితే కూట మిలో భాగంగా తక్కువ స్థానాలకు కట్టుబడినందువల్ల కూడా బీజేపీకి ఓట్ల శాతం తక్కువగా వచ్చి ఉండవచ్చు. జేడీయు ఓటు షేర్‌ను దెబ్బకొట్టడంలో బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషించింది. బీజేపీ ఇలా దెబ్బ కొట్టినా ఈదఫా ఎన్నికల్లో జేడీయూకు ఓటు శాతం 16.8 నుంచి 15.8 శాతం మాత్రమే తగ్గింది. ఒకవైపు బీజేపీ అభ్యర్థులు జేడీయూ ఓటర్లను పొందగలిగారు తప్పితే బీజేపీకి చెందిన అగ్రకులాల ఓటర్లు జేడీయూ పోటీ చేసిన స్థానాల్లో తమ ఓటు వేయకుండా జాగ్రత్తపడ్డారు. జేడీయూకు బదులుగా వీరు అటు ఎల్జేపీనుంచి లేదా ఆర్జేడీనుంచి పోటీ చేసిన బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులకు, తమ ఓటు గుద్దేశారు. కొన్ని సందర్భాల్లో వీరి ఓట్లు స్వతంత్ర అభ్యర్థులకు, ప్లూరల్స్ పార్టీ వంటి అతి చిన్న పార్టీల ఖాతాలోకి కూడా వెళ్లిపోయాయి. ముందుండి నడిపించిన సమర యోధుడు గతంలో 2015లో జరిగిన ఎన్నికల్లో మహాగట్ బంధన్ ప్రధాన వ్యూహకర్తగా తలపండిన రాజకీయనేత లాలూ ప్రసాద్ యాదవ్ సర్వం తానై ఎన్నికల ప్రచారాన్ని నడిపించారు. ఈ ప్రచార ముఖ చిత్రంగా నితీశ్ కుమార్ నిలిచి తన పార్టీనీ, పొత్తు పార్టీలను ఒంటిచేత్తో విజయం వైపు తీసుకుపోయారు. పైగా ఆనాడు బిహార్‌లో ప్రతిపక్షం ఎన్నికలకు కొద్ది నెలల ముందువరకు చెల్లాచెదురై ఉండేది. అందుకనే 2015లో సాధించిన 80 సీట్లతో పోలిస్తే ఇప్పుడు 75 స్థానాలు చేజిక్కించుకుని గణనీయమైన విజయం సాధించిన ఘనత పూర్తిగా యువ తేజస్వీ యాదవ్‌కే దక్కుతుంది. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఛాయ నుంచి పూర్తిగా బయటపడిన 31 సంవత్సరాల తరుణ వయస్కుడు తేజస్వి యాదవ్ అతి తక్కువ సమయంలో సాధించిన విజయం సాధారణమైనది కాదు. యాదవ రాజకీయాల బరువునుంచి తప్పుకుని కొత్త పంథాలోసాగిన తేజస్వి బిహార్‌లోని అస్తిత్వ రాజకీయాల పట్టునుంచి యువతను బయటకు లాగగలిగారు. అంతకంటే ముఖ్యంగా ఇటీవలి కొన్ని ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా బిహార్‌లో సాగిన ఎన్నికల ప్రచారం సాపేక్షికంగా శాంతియుతంగా, విద్వేష రహితంగా సాగిందనే చెప్పాల్సి ఉంటుంది. ఈ గొప్ప మార్పునకు పూర్తి ఘనత ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్‌కే దక్కాల్సి ఉంటుంది. జాతీయ మీడియా కూడా ఈ విషయంలో తేజస్వి విశిష్టతను స్పష్టంగా గుర్తించి ప్రశంసించింది. 2020లో సాగిన ఎన్నికల్లో కూడా బీజేపీ య«థాప్రకారంగా కశ్మీర్, సీఏఏ, రామ్ మందిర్ వంటి అంశాలను పదేపదే ప్రస్తావించి విభజన రాజకీయాలను ప్రేరేపించా లని ప్రయత్నించింది. కానీ దానివల్ల అది సాధించింది పెద్దగా ఏమీలేదు. చివరకు బాలీవుడ్లో కొనసాగుతున్న సాంస్కృతిక తప్పిదాల వల్లే యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుట్ అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకుని కన్నుమూశాడంటూ చెలరేగిన తీవ్రవివాదాస్పద అంశాన్ని కూడా బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిం చింది. ఇక నితీశ్ తనవంతుగా జంగిల్ రాజ్ అనే పాత ముద్రను ఆర్జేడీపై పదేపదే సంధిస్తూ తేజస్విపై, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దాడులకు కూడా ప్రయత్నించినా, అవేవీ పెద్దగా ఫలవంతం కాలేదు. ఈ మొత్తం వ్యతిరేక ప్రచారంలో కూడా తేజస్వి అత్యంత పరిణతిని ప్రదర్శించారు. తన వంటి అతి పిన్న వయసు యువకుల్లో చాలా అరుదుగా కనిపించే పరిణతి అది. తనపై సాగుతున్న దాడిలో పొరపాటున కూడా ప్రవేశించకుండా తేజస్వి యాదవ్ మొదటినుంచి చివరివరకూ తాను విశ్వసించినటువంటి.. బిహార్ యువతకు విద్య, ఉద్యోగాలు అనే అంశాలపైన మాత్రమే దృష్టి సారించి ప్రచారం సాగిం చాడు. మహాగట్ బంధన్ బలమైన అధికార కూటమిని ఈ స్థాయిలో ముప్పు తిప్పలు పెట్టిందంటే తేజస్వి అత్యంత ప్రతిభావంతంగా అల్లిన ప్రచార ఎజెండానే కారణమని చెప్పక తప్పదు. ఈ ప్రయాణ క్రమంలో తేజస్వి ఈ దఫా ఎన్నికలకు మాత్రమే కాకుండా, దేశంలో కోవిడ్–19 అనంతర రాజకీయాలకు కూడా అజెండాను నిర్దేశించడంలో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. బిహార్ యువతీయువకులకు పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తానని తేజస్వి ఇచ్చిన ఎన్నికల హామీ బీజేపీని ఎంతగా భీతిల్లజేసిందంటే తమ కూటమిని గెలిపిస్తే 19 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని ఎదురు హామీ ఇవ్వాల్సి వచ్చింది. అంతే కాకుండా కోవిడ్–19 వ్యాక్సిన్‌ని ఉచితంగా అందిస్తానని కూడా హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఇది మధ్యేవాద వామపక్ష రాజకీయ ఆర్థిక విధానాన్ని ఒక మితవాద పార్టీ ప్రకటించవలసి రావడంగా తప్ప మరోలా దీన్ని చూడలేం. మరోవిధంగా బిహార్‌లో వామపక్షాలు సాగించిన గొప్ప విజ యంలో కూడా ఇది ప్రతిఫలించింది. పోటీ చేసింది 29 స్థానాల్లోనే అయినప్పటికీ ఈ దఫా ఎన్నికల్లో వామపక్షాలు 16 సీట్లు కొల్లగొట్టి షాక్ తెప్పించాయి. గతంతో పోలిస్తే 50 శాతం విజయాల రేటును పెంచుకున్న వామపక్షాలు ఆర్జేడీతో సమానంగా విజయాలు సాధించడమే కాకుండా కాంగ్రెస్ (30 శాతం), జేడీయూ (40శాతం) కంటే మంచి స్థానంలో నిలబడటం చెప్పుకోదగిన విషయం. ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ–జేడీయు కూటమి అత్తెసరి మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్నప్పటికీ భారతదేశంలో మధ్యేవాద–వామపక్ష రాజకీయాలకు ఏకకాలలో బిహార్ పైకెత్తి నిలిపింది. వచ్చే సంవత్సరం పశ్చిమబెంగాల్, అస్సామ్, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికలు కూడా బిహార్ అనుభవాన్ని ప్రతిబింబించినట్లయితే, అప్పడు బిహార్ ప్రజలు అలాంటి మార్గాన్ని చూపించింది మేమే కదా అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే కోవిడ్ అనంతర రాజకీయాలకు సంబంధించిన సరికొత్త హీరో తేజస్వి యాదవ్. వ్యాసకర్త రాజేష్ మహాపాత్ర స్వతంత్ర జర్నలిస్టు