పట్నా: బిహార్ నూతన విద్యాశాఖ మంత్రిని నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. బడికి పోయావా లేదా సామి అంటూ ఎగతాళి చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టి పట్టుమని వారం రోజులు కూడా కావడం లేదు.. ఇన్ని విమర్శలు మూటగట్టుకుంటున్నాడంటే.. అయ్యగారు ఇంతలోనే ఏం ఘనకార్యం వెలగబెట్టారో అనుకుంటున్నారా. నిజమే మంత్రిగారు చేసింది మాములు తప్పు కాదు. భారతీయుడు అయ్యి ఉండి.. అందులోనూ ప్రజాప్రతినిధిగా ఎన్నికై.. ఏకంగా జాతీయ గీతాన్ని మర్చిపోయాడంటే మామూలు తప్పిదం కాదు కదా. అందుకే నెటిజనులు సదరు మినిస్టర్‌ని ఇంతలా ట్రోల్ చేస్తున్నారు. వివరాలు.. బిహార్ విద్యాశాఖ మంత్రి మేవలాల్ చౌదరీ ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యి.. జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. అయితే మేవలాల్ జనగణమణ పాడుతూ.. మధ్యలో కొన్ని పదాలను మర్చిపోయారు. "పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా" కు బదులుగా "పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా" అని పాడారు. (చదవండి: బిహార్ ఫలితాలు-ఆసక్తికర అంశాలు)
ఇందుకు సంబంధించిన వీడియో ఆర్జేడీ నాయకులకు చిక్కింది. "అనేక అవినీతి కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ విద్యాశాఖ మంత్రి మేవలాల్ చౌదరికి జాతీయ గీతం కూడా తెలియదు. నితీష్ కుమార్ జీ ఇంతకన్నా అవమానం ఏం ఉంటుంది? మీ మనస్సాక్షి ఎక్కడ మునిగిపోయింది?" అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరలవ్వడమే కాక ట్రోల్ అవుతోంది. ఈ వీడియోని ఇప్పటికే 2.2 లక్షల మంది వీక్షించారు. ఇక దీనిపై నెటిజనులు ‘ఇలాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.. ఇక విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోండి’.. ‘ఇది 2020 సంవత్సరం.. ఇప్పటికి జాతీయ గీతం రాని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం నిజంగా సిగ్గు చేటు’.. ‘స్కూల్లో ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న అంశాలు విద్యాశాఖ మంత్రికి తెలియకపోవడం దురదృష్టం.. అసలు మీరు బడికి వెళ్లారా లేదా’ అంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. (చదవండి: బిహార్ అసెంబ్లీలో నేర చరితులెక్కువ!)
ఇక మేవలాల్ చౌదరిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన అగ్రికల్చర్ యూనివర్సిటీకి హెడ్‌గా ఉన్నప్పుడు జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో మేవలాలక్‌కు భాగం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టిన నితీష్ కుమార్ ద్వంద్వ వైఖరికి సిగ్గుపడుతున్నాం. 60 స్కాముల్లో మేవలాల్‌కు భాగస్వామ్యం ఉంది. అలాంటి వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించి ఆ పదవిని కించపరిచారు అంటూ ఆర్జేడీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment