పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ పక్షాల సీట్ల పంపకాల విషయం కొలిక్కి వచ్చినట్టే కనబడుతోంది. జేడీయూ చీఫ్, సీఎం నితీష్‌కుమార్ ఓ అడుగు వెనక్కి తగ్గి చెరి సగం సీట్లలో పోటీ చేసేందుకు అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా 122 సీట్లలో అధికార జేడీయూ, 121 సీట్లు బీజేపీ తమ అభ్యర్థులను పోటీకి దింపే దిశగా డీల్ కుదుర్చుకున్నట్టు వార్తలోస్తున్నాయి. పట్నాలో జేడీయూ, బీజేపీల సీనియర్ నేతలు మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చలు విజయవంతంగా ముగిసినట్టు అనధికార వర్గాల సమాచారం.
జేడీయూకి కేటాయించిన 122 సీట్లలోని 5 నుంచి 7 చోట్ల హిందుస్తానీ అవామ్ మోర్చా(హెచ్‌ఏఎమ్) అభ్యర్థులు పోటీ చేస్తారని, బీజేపీ వద్దనున్న121 సీట్లలోని కొన్నింటిని లోక్ జన శక్తి (ఎల్‌జేపీ)కి సర్దుబాటు చేసేలా ఈ చర్చల్లో ఓ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. తమకు కనీసం 42 సీట్లయినా ఇవ్వాల్సిందేనని ఎల్‌జేపీ పట్టుబడుతుండుగా 15కు మించి ఇవ్వలేమని బీజేపీ చేతులెత్తేసినట్టు వార్తలొచ్చాయి. తాము కోరినన్ని సీట్లివ్వని పక్షంలో స్వతంత్రంగానే 143 సీట్లలో పోటీకి దిగుతామని కూడా ఎల్‌జేపీ బాస్ చిరాగ్ పాశ్వాన్ హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేఈ-ఎల్‌జేపీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఆసక్తికంగా మారింది. (ఆర్జేడీకి 144, కాంగ్రెస్‌కు 70 సీట్లు)
Comments
Please login to add a commentAdd a comment