పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పార్టీలన్ని దూకుడు పెంచాయి. అయితే ఈ ఎన్నికల్లో నితీష్ కుమార్ ప్రతిపక్షాలతో పాటు విపక్షంగా మారిన మిత్రపక్షం లోక్ జన్‌శక్తి పార్టీ నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌జేపీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించాడు. ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన ఆయన బీజేపీ మిత్ర పక్షంగా కొనసాగుతానని తెలిపారు. ఎన్నికల్లో నితీష్ కుమార్‌కు వ్యతిరేకంగా పోరాడుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సమస్యను రెట్టింపు చేస్తూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, చిరాగ్ పాశ్వాన్‌కి మద్దతు తెలిపారు. రామ్ విలాస్ పాశ్వాన్ లేని సమయంలో నితీష్ కుమార్ వారికి అండగా ఉండాల్సింది పోయి చిరాగ్ పాశ్వాన్‌ని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ‘చిరాగ్ పాశ్వాన్ విషయంలో నితీష్ కుమార్ వైఖరి సరైంది కాదు. ఈ సమయంలో చిరాగ్ పాశ్వాన్‌కి ఆయన తండ్రి అవసరం ఎంతో ఉంది. కానీ ప్రస్తుతం రామ్ విలాస్ పాశ్వాన్ మన మధ్యలో లేరు. నిజంగా ఇది శోచనీయం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చిరాగ్ పాశ్వాన్ పట్ల నితీష్ కుమార్ వైఖరి పూర్తిగా అన్యాయంగా ఉంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: నేను మోదీ హనుమాన్‌ని!)
అయితే తేజస్వీ ఇలా చిరాగ్ పాశ్వాన్‌కు మద్దతివ్వడం వెనక గల కారణాలను విశ్లేషిస్తే.. ఇద్దరి తండ్రులు మధ్య గల స్నేహం ఒక కారణమైతే సోషలిస్ట్ ఉద్యమంలో భాగంగా ఇరు యువ నాయకులు తండ్రులు నితీష్ కుమారతో కలిసి పని చేశారు. ఇక రామ్ విలాస్ పాశ్వాన్ మరణించినప్పుడు తేజస్వీ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పుడు నితీష్ కుమార్ ఇద్దరీకి ఉమ్మడి శత్రువుగా మారడంతో తేజస్వీ, చిరాగ్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దానిలో భాగంగానే రాఘోపూర్ నియోజకవర్గంలో తేజస్వీకి సహాకరించేందుకుగాను చిరాగ్ రాజ్‌పుత్ సామాజిక వర్గానికి టిక్కెట్ ఇచ్చారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని వల్ల బీజేపీ ఉన్నత కుల ఓటు బ్యాంకు చీలిపోయి తేజస్వీకి ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment