సాక్షి, హైదరాబాద్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్ధానాలు గెలుపొంది సత్తా చాటిన ఏఐఎంఐఎం బలహీనుల గొంతుకగా మారుతుందని ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో తాము బెంగాల్, యూపీ సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోటీ చేసి పార్టీని విస్తరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి రాష్ట్రంలోనూ పోటీచేసి ఎంఐఎంను జాతీయ పార్టీగా మలిచే ప్రణాళికలు తమ ముందున్నాయనే సంకేతాలు పంపారు. బెంగాల్‌లోనూ విజయాలను నమోదు చేస్తామని 2021లో ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగుతామని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చిందని తమను కాంగ్రెస్ పార్టీ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. మహారాష్ట్రలో శివసేనతో చేతులు కలిపిన కాంగ్రెస్‌తో తాము ఎలా జతకడతామని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడినుంచైనా పోటీ చేసే హక్కు తమకు ఉందని, దీనికి ఎవరి అనుమతి అవసరం లేదన్నారు.
బిహార్‌లో దీటైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆర్జేడీకి మద్దతుపై పూర్తి ఫలితాలు వెల్లడయ్యాక ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బిహార్‌లో తమ పార్టీ విజయంలో మహిళలు కీలక పాత్ర పోషించారని, తాను హాజరైన పలు సభలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని అన్నారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్ ఓటమికి ఎంఐఎంను నిందిచడం తగదని అన్నారు. చదవండి : ‘ఆ వివాదం మళ్లీ తెరపైకి తెచ్చారు’
Comments
Please login to add a commentAdd a comment