
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార ఎన్‌డీఏ మిత్రపక్షాలైన జేడీ(యూ), బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం జేడీ(యూ) 122 సీట్లకూ, బీజేపీ 121 సీట్లకూ పోటీ చేస్తాయి. తనకన్నా జేడీ(యూ)కి ఒక స్థానం అదనంగా ఇవ్వడం ద్వారా... ఎన్నికల్లో నెగ్గాక నితీశ్ కుమారే ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించడం ద్వారా లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) తిరుగుబాటు వెనక తమ హస్తం లేదని బీజేపీ చాటింది. జేడీ(యూ) తన వాటాలోని ఏడు సీట్లను జితన్‌రాం మాంఝీ నాయకత్వంలోని హిందూస్తాన్ ఆవామ్ మోర్చా(హెచ్‌ఏఎం)కు ఇస్తుండగా... తన స్థానాల్లో ఆరింటిని కొత్తగా ఎన్‌డీఏలోకొచ్చిన వికాశ్ శీల్ ఇన్సాన్(వీఐపీ) పార్టీకి బీజేపీ కేటాయిస్తోంది. కనుక జేడీ(యూ), బీజేపీలు నికరంగా చెరో 115 స్థానాలకూ పోటీ చేస్తున్నట్టు లెక్క. అయితే సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని ప్రకటించడానికి నిర్వహించతలపెట్టిన మీడియా సమావేశం ఆలస్యం కావడం, ఆదరా బాదరగా నితీశ్‌ను బీజేపీ బుజ్జగించడం వంటి పరిణామాలు చూస్తే బిహార్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత అసలు కథ మొదలవుతుందన్న అభిప్రాయం కలుగుతోంది.
ఎల్‌జేపీ నిలపబోయే అభ్యర్థుల్లో సగంమంది బీజేపీ, ఆరెస్సెస్ నేపథ్యం వున్నవారేనన్న ప్రచారం సంగతి సరేసరి. ఎల్‌జేపీ ఇప్పటికే తమ తరఫున బీజేపీ నేతలిద్దరు పోటీ చేస్తారని ప్రకటించింది. అలాగే కేంద్రంలోని ఎన్‌డీఏలో భాగస్వాములం కనుక ప్రధాని నరేంద్ర మోదీ ఛాయాచిత్రం తమ పార్టీ పోస్టర్లలో వుంటుందని తెలిపింది. 143 స్థానాల్లో పోటీ చేస్తామని, జేడీ(యూ)కు వ్యతిరేకంగా తమ అభ్యర్థుల్ని నిలుపుతామని చెప్పింది. ఈ విషయంలో బీజేపీ వివరణ ఇచ్చేలా చేయడంలో నితీశ్ కుమార్ ఇప్పటికైతే విజయం సాధించినట్టే. కానీ ఇదే నితీశ్ ఒకప్పుడు ఇంతకన్నా దూకుడుగా వున్న సంగతి మర్చిపోకూడదు. బిహార్ ఎన్నికల్లో బీజేపీ తరఫున నరేంద్ర మోదీ ప్రచారం చేయనంటేనే ఆ పార్టీతో చెలిమి చేస్తానని 2010లో నితీశ్ కుమార్ పట్టుబట్టారు. దాన్ని సాధించుకున్నారు. కానీ ఆయనకు ఇప్పుడా పరిస్థితి లేదు.
జేడీ(యూ)పై ఆగ్రహించి బయటకు వెళ్లిన ఎల్‌జేపీ వల్ల ఎన్‌డీఏ ఓట్లు ఏమేరకు తగ్గుతా యన్నది చూడాల్సివుంది. ఆ పార్టీ అధినేత, కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ శస్త్ర చికిత్స చేయించుకున్నారు గనుక ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారో లేదో అనుమానమే. ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ప్రకటనలు దూకుడుగానే వుంటున్నాయి. నితీశ్ ఏలుబడిలో బిహార్ ప్రాభవం అడుగంటిందని, దాన్ని పునరుద్ధరించడమే ధ్యేయమని ఆయన చెబుతున్నారు. నితీశ్ మొదలుకొని మంత్రులు, అధికారులు ఎవరూ బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ఉండటం లేదని ఆరోపిస్తున్నారు. నితీశ్ అభివృద్ధి నినాదం ఫలాలు సామాన్యులకు చేరలేదని చెబుతున్నారు. బీజేపీతో తమకు శత్రుత్వం లేదని, నితీశ్‌కు గుణపాఠం చెప్పడమే ధ్యేయమని పోస్టర్లలో నినాదంగా ముద్రించారు. చిరాగ్‌కు ఎన్నికల ప్రచార బాధ్యతల్ని భుజస్కంధాలపై మోసిన చరిత్ర లేదు. ఎల్‌జేపీలో రాంవిలాస్ పాశ్వాన్ మినహా చెప్పుకోదగ్గ నాయకుడెవరూ లేరు. ఆయన కుమారుడన్న ఒకే ఒక్క అనుకూలాంశం మినహా చిరాగ్‌కు ఇతరత్రా ప్రత్యేక గుర్తింపు లేదు.
అయితే తెరవెనక బీజేపీ వుండి ఆయన్ను నడిపిస్తోందన్న సంశయాలు అందరికీ వున్నాయి. ఆ పార్టీ లోపాయికారీ మద్దతుతో చిరాగ్ నితీశ్‌కు తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు. సొంతంగా పోటీ చేయడం వల్ల ఎల్‌జేపీకి రాజకీయంగా పెద్దగా లాభించేది ఏమీ వుండకపోయినా జేడీ(యూ) విజయావకాశాలను అది దెబ్బతీయొచ్చన్నది నిపుణుల అంచనా. ఇప్పటికి జరిగింది సర్దుబాటే. ఎవరెవరు ఏయే స్థానాల్లో పోటీ చేయాలన్న సమస్య వచ్చినప్పుడు సహజంగానే బీజేపీ మెరుగైన స్థానాలను ఎంచు కుంటుంది. గతంలోవలే గట్టిగా పట్టుబట్టి తాను అనుకున్నది సాధించడం జేడీ(యూ)కు అంత సులభం కాదు. ఇన్నిటిని దాటుకుని జేడీ(యూ) అత్యధిక స్థానాలు గెల్చుకోవడం సాధ్యమేనా అన్నది సందేహమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల అనంతరం నితీశ్ కుమార్‌కు ముఖ్యమంత్రి పదవి లభించడం కూడా అనుమానమే. బీజేపీ నేత, ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ నితీశే మా సీఎం అభ్యర్థి అని ప్రస్తుతం చెబుతున్నా, ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరి సంఖ్యాబలం ఎంతన్న దానిపై ఆధారపడి ముఖ్యమంత్రి పదవి ఏ పార్టీకెళ్తుందన్నది తేలుతుంది. బీజేపీ కన్నా తక్కువ స్థానాల్లో నెగ్గితే సీఎం పదవి ముందు చెప్పినట్టు తనకే ఇవ్వాలని నితీశ్ పట్టుబట్టలేరు. మెజారిటీ సీట్లు గెల్చుకున్న పార్టీయే సహజంగా ఆ పదవిని సొంతం చేసుకుంటుంది.
అయితే ఎన్నికల ప్రచారపర్వంలో ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అంశాలు నితీశ్ ముందు చాలానే వున్నాయి. అందులో ముఖ్యమైనవి కరోనా వైరస్, దాని పర్యవసానంగా విధించిన లాక్‌డౌన్, వరదలు. కరోనా కేసుల్లో బిహార్ దేశంలో అయిదో స్థానంలో వుంది. కానీ కరోనా పరీక్షల్లో అట్టడుగున వుంది. పారిశ్రామికీకరణ పెద్దగా లేనందువల్ల నిరుద్యోగిత ఆ రాష్ట్రంలో మొదటినుంచీ ఎక్కువే. గనులున్న ప్రాంతాలు జార్ఖండ్‌కు పోయాక ఉపాధి అవకాశాలు మరీ తగ్గాయి. బిహార్‌లో నిరుద్యోగిత 10.2 శాతమని నిరుడు జూన్‌లో వెల్లడైన గణాంకాలు చెబుతున్నాయి. కనుకనే ఆ రాష్ట్రం నుంచి వలసలు అధికం. అలా వలసపోయినవారు 30లక్షలమంది వివిధ రాష్ట్రాల్లో ఇబ్బం దులు పడుతుంటే నితీశ్ ప్రభుత్వం నిర్లిప్తంగా వుందని ఆ కుటుంబాలవారు ఆగ్రహిస్తున్నారు. ఈసారి వచ్చిన వరదలు కూడా నితీశ్ ప్రతిష్టను దెబ్బతీశాయి. 16 జిల్లాల్లోని 1,232 గ్రామాలు నీట మునిగాయి. 34 లక్షలమంది ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం సహాయచర్యల్లో విఫల మైందన్న విమర్శలొచ్చాయి. వీటన్నిటికీ సంతృప్తికరమైన జవాబులు ఇవ్వడంతోపాటు స్వపక్ష, విపక్షాల శిబిరాలనుంచి ఎదురయ్యే సవాళ్లను ఎంత దీటుగా ఎదుర్కొంటారన్నదాన్ని బట్టి నితీశ్ విజయావకాశాలు ఆధారపడివుంటాయి.