
న్యూఢిల్లీ: ఇది ఎన్నికల సీజన్. అక్టోబర్, నవంబర్‌లలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా 11 రాష్ట్రాల్లో 56 స్థానాలకు, బిహార్‌లోని ఒక పార్లమెంటు సీటుకి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. సెప్టెంబర్ 30న ఇచ్చిన అన్‌లాక్ 5 నిబంధనల్ని కేంద్ర హోంశాఖ సవరిస్తూ గురువారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించడానికి అనుమతినిచ్చింది. ఈ ఉత్తర్వులు వెంటనే ఆమల్లోకి వస్తాయని హోంశాఖ స్పష్టం చేసింది.
అక్టోబర్ 15 వరకు ఎలాంటి ఎన్నికల సభలు నిర్వహించవద్దని సెప్టెంబర్ 30న విడుదల చేసిన అన్‌లాక్ 5లో పేర్కొన్న కేంద్ర హోంశాఖ వాటిని సవరించింది. ఎన్నికల ర్యాలీలో 200 మంది వరకు పాల్గొనవచ్చునని తెలిపింది. ఇక ఏదైనా భవనం లోపల ఎన్నికల సమావేశాలు నిర్వహిస్తే సగం హాలు వరకు మాత్రమే జనానికి అనుమతినివ్వాలని వెల్లడించింది. ఇక ఎన్నికల ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా చేయాలని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment