home ministry
-
అమిత్ షా వరుస రివ్యూలు.. మణిపూర్‌కు అదనపు బలగాలు
న్యూఢిల్లీ:మణిపూర్‌లో ఇటీవల మళ్లీ హింస చెలరేగుతోంది. దీంతో అక్కడి తాజా పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలో వరుస ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో శాంతిభద్రతలు అదుపులోకి తెచ్చేందుకు కేంద్రహోంశాఖ చర్యలు మొదలుపెట్టింది. త్వరలో 50 కంపెనీల అదనపు బలగాలను కేంద్రం మణిపూర్‌కు తరలించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.దీనిపై హోం మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్ర హోం మంత్రిత్వశాఖ బృందం త్వరలో రాష్ట్రంలోని కీలక ప్రాంతాలను సందర్శించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, మణిపూర్‌లో జాతుల మధ్య వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది. -
సీఐఎస్ఎఫ్లో మొట్టమొదటి మహిళా బెటాలియన్.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్, సీఐఎస్ఎఫ్)లో మొట్టమొదటి మహిళా బెటాలియన్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి తెలిపింది. పూర్తిగా మహిళలతో కూడిన ఈ బెబాలియన్లో వెయ్యి మంది సభ్యులుంటారు. ఇటీవలి కాలంలో విమానాశ్రయాల వంటి కీలక ప్రదేశాలు, ప్రముఖుల భద్రత విధులు సీఐఎస్ఎఫ్కు తలకుమించిన భారంగా మారిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంగళవారం ఈ నిర్ణయం వెలువరించినట్లు సమాచారం.సీఐఎస్ఎఫ్కు మంజూరైన 2 లక్షల మంది బలగాల్లోనే మహిళల రిజర్వుడు బెటాలియన్ కూడా ఉంటుందని ఓ అధికారి తెలిపారు. మొత్తం 1,025 మంది సభ్యులకుగాను సీనియర్ కమాండెంట్ ర్యాంకు అధికారి నాయకత్వం వహిస్తారు. తాజాగా ప్రకటించిన బెటాలియన్ ఎంపిక, శిక్షణ, కేటాయించే విధులకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్లోని 1.80 లక్షల మందిలో ఏడు శాతం వరకు మహిళలున్నారు.కశ్మీర్లో 119 మంది ఉగ్రవాదులు శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో చురుగ్గా వ్యవహరించే ఉగ్రవాదులు ఎందరన్న దానిపై నిఘా వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. మొత్తం 119 మంది ఉగ్రవాదులు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తేల్చాయి. ఉగ్రవాదుల ఉనికి, వారి కార్యకలాపాల తీవ్రత, కొత్త వారిని చేర్చుకుంటున్న తీరును బట్టి నిఘా వర్గాలు ఈ మేరకు అంచనాకు వచ్చినట్లు సమాచారం.చదవండి: బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పుమొత్తం 119 మందిలో పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోని ఉత్తర ప్రాంతంలో 79 మంది ఉండగా వీరిలో 16 మంది స్థానికులు కాగా, 61 మంది విదేశీయులని తేలింది. పర్వత శ్రేణుల దక్షిణ భాగంలో చురుగ్గా వ్యవహరిస్తున్న 40 మంది ముష్కరుల్లో ఏకంగా 34 మంది విదేశీయులు కాగా, ఆరుగురు మాత్రమే స్థానికంగా ఎంపికైన వారిగా నిఘా వర్గాలు గుర్తించాయి. -
కోల్‌కతా డాక్టర్ కేసు: ‘ప్రతి 2 గంటలకు నివేదిక ఇవ్వండి’
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్ జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆయా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.దేశంలోని అన్ని రాష్ట్రాలలోని పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆ నివేదికల ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఘటనపై సీబీఐకు దర్యాప్తు కొసాగిస్తోంది. -
ఉగ్ర దుర్బేధ్యంగా భారత్‌ను నిర్మిస్తా
న్యూఢిల్లీ: భారత దేశాన్ని అజేయ శక్తిగా మలుస్తానని నూతన హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో హోం శాఖ కార్యాలయంలో అమిత్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ‘ దేశం, దేశ ప్రజల భద్రతే నాకు అత్యున్నతం. మోదీ 3.0 ప్రభుత్వం దేశాన్ని భద్రత విషయంలో సమున్నత శిఖరాలకు చేరుస్తుంది. ఉగ్రవాదం, వేర్పాటువాదం, నక్సల్ ప్రభావం బారిన పడకుండా దుర్బేధ్యంగా మారుస్తా’ అని అన్నారు. మరోసారి కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన మూడు నేర చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత–2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత–2023, భారతీయ సాక్ష్యా అధినియం–2023ల సమర్థ అమలును అమిత్‌షా పర్యవేక్షించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రులు మంత్రులుగా ప్రమాణంచేసిన నేతలు మంగళవారం ఢిల్లీలో తమతమ శాఖల కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించి కర్తవ్య నిర్వహణ మొదలెట్టారు. కొందరు నేతలు పూజాకార్యక్రమాలు చేసి మంత్రి కుర్చిల్లో కూర్చుంటే కొందరు కమలదళ నినాదాలు చేస్తూ కుర్చిల్లో ఆసీనులయ్యారు. జైశంకర్ భారత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా, అశ్వనీ వైష్ణవ్ రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కిరెన్ రిజిజు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిగా ప్రహ్లాద్ జోషి, విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్, పర్యావరణ మంత్రిగా భూపేంద్ర యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రిగా ఎల్జేపీ(రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తన కుటుంబసభ్యుల సమక్షంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులూ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.మహిళా మంత్రులూ.. వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తానని మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ అన్నపూర్ణాదేవి చెప్పారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రిగా అనుప్రియా పటేల్, క్రీడలు, యువజన వ్యవహారాల సహాయ మంత్రిగా రక్షా ఖడ్సే, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రిగా శోభా కరంద్లాజె, మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా సావిత్రీ ఠాకూర్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా నిమూబెన్ బంభానియా బాధ్యతలు స్వీకరించారు. -
‘భారత ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’
ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విధివిధాలను నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి నుంచి సీఏఏ అమలుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఏఏ చట్టంతో బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడితున్నాయి. మరోవైపు.. ఈ చట్టం అమలుతో ముస్లింలు ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించబడతారని కేరళ సీఎం పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా సీఏఏ చట్టంపై ముస్లింల ఆందోళనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని ముస్లింలు సీఏఏతో ఆందోళ చెందాల్సిన పనిలేదని వివరణ ఇచ్చింది ‘భారతీయ ముస్లింలు ఆందోళన పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సీఏఏ చట్టంలో 18 కోట్లమంది ముస్లింలను ఇబ్బంది పెట్టే ఎటువంటి నిబంధన లేదు. ముస్లింలు తమ పౌరసత్వ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేశంలోని హిందూవులతో సమానమైన హక్కులు ఉంటాయి. సీఏఏ కింద ముస్లింలు పౌరసత్వాన్ని రుజువు చేయటానికి ఎటువంటి పత్రాలు సమర్పించాలిన అవసరం లేదు. ఇస్లాం మతం శాంతియుతమైంది. మతప్రాతిపదికగా ద్వేషం, హింసను బోధించదు. ఈ చట్టం కరుణ చూపే.. ఇస్లాం మతాన్ని హింస పేరుతో మసకబారనివ్వకుండా కాపాడుతుంది’ అని కేంద్ర హోంశాఖ పేర్కొంది. కొన్ని ఇస్లాం దేశాలలో మైనారిటీల వేధింపుల కారణంగా.. ఇస్లాం పేరు మసకబారిందని తెలిపింది. ఇక.. సీఏఏ చట్టం ముస్లింకు వ్యతిరేకమని కొంతమంది ఆందోళన చెందటం అన్యాయమని పేర్కొంది. ఎవరి పౌరసత్వాన్ని లాక్కునే నిబంధన సీఏఏ చట్టంలో లేదని హామీ ఇస్తున్నట్లు చెప్పింది. మరోవైపు.. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున ఖార్గే, ఎంపీ రాహుల్ గాంధీ.. సీఏఏ చట్టం వల్ల ముస్లిం మైనార్టీలు తమ పౌరసత్వాన్ని కోల్పోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హైదరాబాద్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా మండిపడ్డారు. చదవండి: ‘అలా జరిగితే.. నేను రాజీనామా చేస్తాను’.. అస్సాం సీఎం హిమంత -
కేరళ గవర్నర్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత పెంపు.. ఎందుకంటే?
తిరువనంతపురం: సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ స్టూడెంట్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌కు సీఆర్పీఎఫ్ బలగాలతో Z+ కేటగిరి భద్రతను మరింత విస్తరిస్తున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేరళ రాజ్‌భవన్‌కు తెలియజేసింది. ఈ విషయాన్ని కేరళ రాజ్‌భవన్ ‘ఎక్స్’ ట్విటర్లో పేర్కొంది. సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ అయిన స్టూడెంట్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా(SFI) శనివారం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌కు వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసనకు దిగారు. గవర్నర్ ఆరిఫ్ కొట్టారక్కర జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరుకావటానికి వెళుతున్న సమయంలో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ విద్యార్థులు గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. విద్యార్థుల నిరసనతో విసిగిపోయిన గవర్నర్ ఆరిఫ్.. అనూహ్యంగా రోడ్డు పక్కన్న ఉన్న ఓ షాప్ ముందు బైఠాయించారు. తనపై నిరసన తెలుపుతున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకొని.. అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన కొల్లాం జిల్లాలో జరిగింది. గవర్నర్ అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పోలీసులకు తెలియజేశారు. నిరసన ఘటనపై గవర్నర్ ఆరిఫ్ .. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌పై విమర్శలు చేశారు. పినరయ్ విజయన్ ప్రభుత్వం.. రాష్ట్రంలో అధర్మం, అశాంతిని ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడితో సహా పలువురి నాయకులపై కోర్టుల్లో క్రిమినల్ కేసులు ఉన్నా సీఎం పినరయ్ విజయన్ వారిని కాపాడటానికి పోలీసులకు దిశానిర్ధేశం చేస్తున్నారని విమర్శించారు. ఇక కొంత కాలంగా కేరళ సీఎం, గవర్నర్ మధ్యలు విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా గతంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు సైతం గవర్నర్ ఆరిఫ్పై పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు. చదవండి: తలొగ్గిన సర్కార్.. మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు ఫుల్స్టాప్ -
తెలుగు రాష్ట్రాలకు ఐపీఎస్‌ల కేటాయింపు
ఢిల్లీ, సాక్షి: తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ అధికారులంతా 2022 బ్యాచ్‌కు చెందిన వాళ్లు. తెలంగాణకు అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయి కిరణ్, మనన్ భట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిని కేటాయించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన అధికారుల పేర్లపై స్పష్టత రావాల్సి ఉంది. -
రెండు రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశాలు
-
ప్రజల మనసు గెలిచి.. పురస్కారం పొంది.. హనుమంతునిపాడు పీఎస్ కు పట్టం
హనుమంతునిపాడు / ఒంగోలు టౌన్: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచి జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా గుర్తింపు తెచ్చుకుంది జిల్లాలోని హనుమంతునిపాడు పోలీస్‌స్టేషన్. 9 రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని, ప్రజల అభిప్రాయాలను సేకరించి 2022 సంవత్సరానికి గాను ఉత్తమ పోలీసు స్టేషన్ గా ఎంపిక చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం డీజీపీ చేతుల మీదుగా ఎస్పీ మల్లికా గర్గ్, ఎస్ఐ కృష్ణ పావని, సిబ్బంది పురస్కారాన్ని అందుకున్నారు. మండల కేంద్రానికి దూరంగా ఉన్నా.. 1927వ సంవత్సరం బ్రిటీషు పాలనలో కొండ శివారు గ్రామమైన నందనవనంలో పోలీస్సేష్టన్ను ఏర్పాటు చేశారు. 1984లో మండలాలు ఏర్పాటైన తర్వాత దీనిని హనుమంతునిపాడు మండల కేంద్రానికి మార్చారు. అయితే పురాతన భవనంలో తుపాకులు, ఇతర సామగ్రికి, సిబ్బందికి నక్సల్స్ నుంచి ముప్పు పొంచి ఉందన్న కారణంతో 2004లో కనిగిరి పాత పోలీస్‌స్టేషన్‌లోకి మార్చారు. దాదాపు పదేళ్లకుపైగా మండల కేంద్రానికి దూరంగా నియోజకవర్గ కేంద్రంలో హెచ్‌ఎంపాడు పీఎస్ కొనసాగుతోంది. స్టేషన్ పరిధిలో 23 గ్రామ పంచాయతీల్లో 14 సచివాలయాల కింద 62 హ్యాబిటేషన్ గ్రామాలున్నాయి. కనిగిరిలోని పోలీస్‌స్టేషన్ భవనం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిబ్బంది మండలానికి దూరంగా ఉన్నా విధి నిర్వహణలో చిత్తశుద్ధితో వ్యవహరించారు. ఉన్నతాధికారుల సూచనలతో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ శక్తిమేర సేవలందించారు. అన్ని వర్గాల ప్రజల నుంచి సెభాష్ అనిపించుకున్నారు. గతేడాది ఆగస్టు 28వ తేదీన కేంద్ర బృందం సర్వే చేసింది. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. కేంద్ర బృందం ద్వారా ప్రశంసలందుకుని పురస్కారానికి అర్హత సాధించారు. శ్రమకు గుర్తింపు లభించింది హనుమంతునిపాడు పోలీసు స్టేషన్‌కు ఉత్తమ పోలీసు స్టేషన్‌గా కేంద్ర హోం శాఖ నుంచి అవార్డు రావడం ప్రకాశం జిల్లా పోలీసుల శ్రమకు తగిన గుర్తింపు లభించినట్లు భావిస్తున్నాను. ముఖ్యంగా హనుమంతునిపాడులో ఎస్ఐగా విధులు నిర్వహించిన కృష్ణ పావని నిబద్ధత కలిగిన అధికారి. ఆమె పనితీరు చాలా బాగుంది. ఆమెతో పాటుగా అక్కడ పనిచేస్తున్న పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేయడంతోనే ప్రజల, ప్రభుత్వ ప్రశంసలు పొందారు. – ఎస్పీ మలికా గర్గ్ మరింత స్ఫూర్తినినిచ్చింది ఈ అవార్డు నాకు మరింత స్ఫూర్తినిచ్చింది. ఎస్పీ మలికా గర్గ్ ఇచ్చిన మద్దతు, సూచనలు, సలహాలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించడం, ప్రజలతో సానుకూలంగా వ్యవహరించడంతో పాటుగా బాధితులకు న్యాయం చేయడానికి శక్తిమేర ప్రయత్నించడం మా పోలీసు స్టేషన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ విషయాన్ని మండల ప్రజలు కేంద్ర హోం శాఖ బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అవార్డు రావడానికి సహచర పోలీసు సిబ్బంది, మండల ప్రజల తోడ్పాటును ఎప్పటికీ మరచిపోలేను. – కృష్ణ పావని, ఎస్ఐ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకున్న అంశాలు: ● నేరాల నియంత్రణ ● లా అండ్ ఆర్డర్ నిర్వహణ ● చట్టాల అమలు ● కేసుల దర్యాప్తు, విశ్లేషణ ● కోర్టు సమన్లు, కోర్టు మానిటరింగ్ ● ప్రోయాక్టివ్ పోలీసింగ్ ● కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ● పెట్రోలింగ్ నిర్వహణ ● పచ్చదనం, పరిశుభ్రత -
మణిపూర్‌లో శాంతి స్థాపనకు కేంద్రం కమిటీ
న్యూఢిల్లీ: మణిపూర్‌లో జాతుల మధ్య వైరాన్ని రూపుమాపి శాంతిని స్థాపించేందుకు, వివిధ వర్గాల మధ్య చర్చలు జరిపేందుకు కేంద్రం శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. గవర్నర్ సారథ్యంలోని ఈ కమిటీలో ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు పౌరసంఘాలకు ప్రాతినిథ్యం ఉంటుందని శనివారం హోం శాఖ తెలిపింది. ఇటీవల మణిపూర్‌లో పర్యటన సమయంలో హోం మంత్రి అమిత్ షా శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మణిపూర్‌లో నెల రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 300 మంది గాయపడ్డారు. -
చరిత్రాత్మకమైన తీర్పు
న్యాయం చేయటం మాత్రమే కాదు, అలా చేస్తున్నట్టు కనబడటం కూడా ముఖ్యం అంటారు. ‘మీడియా వన్’ కేసులో సుప్రీంకోర్టు బుధవారం వెలువరించిన తీర్పు ఈ సహజ న్యాయసూత్ర ప్రాధాన్యతనూ, దాపరికం లేని న్యాయవ్యవస్థ ఆవకశ్యతనూ నిర్మొహమాటంగా తెలియజేసింది. అంతేకాదు, ఈమధ్యకాలంలో ‘జాతీయ భద్రత’ను అడ్డం పెట్టుకునే పోకడలను నిశితంగా విమ ర్శించింది. ‘మీడియా వన్’ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే ఆ కేసు నిజానికి ఇంత దూరం రావా ల్సిన అవసరం లేదని సులభంగానే అర్థమవుతుంది. దేశ భద్రతకు ముప్పు కలుగుతుందన్న ఆరోపణతో కేరళలోని ‘మీడియా వన్’ చానెల్ ప్రసారాల కొనసాగింపునకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. దేశభద్రతకు ముప్పు తెచ్చే ఎలాంటి చర్యలనైనా అడ్డుకోవటానికీ, ప్రజల ప్రాణాలు కాపాడటానికీ ప్రభుత్వాలకు సర్వాధికారాలూ ఉంటాయి. ఆ విషయంలో రెండో మాటకు తావులేదు. కానీ అందుకు సహేతుక కారణాలను చూపటం ముఖ్యం. అలా కారణాలు చూపటంవల్ల వ్యక్తులు లేదా సంస్థలు లబ్ధి పొందుతాయా లేదా అన్నది ప్రధానం కాదు. ప్రజా స్వామ్యం నాలుగు కాలాలపాటు మనుగడ సాగించాలంటే ఇది ముఖ్యం. ఇలా చేయటంవల్ల దేశ ప్రజల్లో చట్టబద్ధ పాలనపై విశ్వసనీయత ఏర్పడుతుంది. పాలన పారదర్శకంగా సాగుతున్నదనీ, జవాబుదారీతనం అమల్లో ఉన్నదనీ భరోసా కలుగుతుంది. కారణాలేమైనా గానీ ఇటీవలి కాలంలో కొన్ని కేసుల విషయంలో తన వాదనలకు మద్దతుగాకేంద్రం కొన్ని పత్రాలను సీల్డ్ కవర్లో అందజేయటం, న్యాయస్థానాలు ఆ ధోరణిని అంగీకరించటం కనబడుతుంది. ఇందుకు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు తదితరాలు మొదలుకొని భీమా కోరెగావ్ కేసు వరకూ ఎన్నిటినో ఉదహరించవచ్చు. ఆఖరికి ఇదెంత వరకూ వచ్చిందంటే సీల్డ్ కవర్ అందజేయటం న్యాయవ్యవస్థలో ఒక సాధారణ విషయంగా మారింది. ఇందువల్ల కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులకూ, సంస్థలకూ నష్టం జరుగుతుంది. తమపై ఉన్న ఆరోపణలేమిటో, వాటికిగల ఆధారాలేమిటో తెలియకపోతే ఏ ప్రాతిపదికన వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించాలి? ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కాదా? నేరం రుజువయ్యేవరకూ ఎవరినైనా నిరపరాధులుగా పరిగణించాలన్నది అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలూ అనుసరించే విధానం. దానికి సీల్డ్ కవర్ పద్ధతి గండికొడుతోంది. అంతేకాదు, నిందితులకు అన్యాయం జరుగుతున్నదన్న భావన కలిగి ప్రజల్లో వారిపట్ల సానుభూతి ఏర్పడుతోంది. ‘మీడియా వన్’ కేసు విషయానికొస్తే ఆ సంస్థ ప్రసారాలను ఎందుకు నిలిపేయాల్సివచ్చిందో కేంద్రం చెప్పదు. హైకోర్టుకు పోతే అక్కడ ధర్మాసనం తనకు సమర్పించిన సీల్డ్ కవర్లో ఆ ఆరోపణలేమిటో చూస్తుంది. వీటిపై మీ వాదనేమిటని కక్షిదారును ప్రశ్నించదు. పైగా ఆ సీల్డ్ కవర్ సమాచారం ఆధారంగా తీర్పు వెలువడుతుంది. సింగిల్ బెంచ్ ముందూ, డివిజన్ బెంచ్ ముందూ కూడా ‘మీడియా వన్’కు ఇదే అనుభవం ఎదురైంది. అయితే అసలు న్యాయస్థానాలు సీల్డ్ కవర్‌ను అంగీకరించే ధోరణి గతంలో లేనేలేదని చెప్పలేం. ప్రభుత్వోద్యోగుల సర్వీసు, పదోన్నతుల వ్యవహారాల్లో సంబంధిత అధికారుల ప్రతిష్ట కాపాడేందుకు... లైంగిక దాడుల కేసుల్లో బాధితుల గుర్తింపు రహస్యంగా ఉంచటానికి సీల్డ్ కవర్లో వివరాలు ఇచ్చే సంప్రదాయం ఉంది. ఆఖరికి రాఫెల్ యుద్ధ విమానాల కేసులో సాంకేతిక అంశాలు వెల్లడిస్తే శత్రు దేశాలకు ఉప్పందించినట్టవుతుందని చెప్పటం వరకూ అంగీకరించవచ్చు. కానీ బీసీసీఐ విషయంలో తానే నియమించిన కమిటీ నివేదికనూ, గుజరాత్‌కు సంబంధించిన నకిలీ ఎన్కౌంటర్ కేసు, అయోధ్య స్థల దస్తావేజు కేసువంటి అంశాల్లో సైతం గోప్యత పాటించాలని ప్రభుత్వం చేసిన వినతిని న్యాయస్థానాలు అంగీకరించటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 2013లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల పర్యవసానంగా ఈ స్థితి ఏర్పడింది. అయితే తాజా తీర్పులో సుప్రీంకోర్టు ప్రస్తావించినట్టు బ్రిటన్, కెనడా సుప్రీంకోర్టులు ఈ విషయంలో ఎన్నదగిన తీర్పులు వెలువరించాయి. కేసులకు సంబంధించిన సమాచారాన్ని దాచివుంచటం వల్ల ఆ కేసుల గురించి చర్చించుకోవటం, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించటం ప్రజలకు నిరాకరించినట్టే అవుతుందని అక్కడి న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. ‘మీడియా వన్’ కేసులో జాతీయ భద్రతను సాకుగా చూపిన కేంద్రం దాన్ని సమర్థించుకునేందుకు సీల్డ్ కవర్లో ప్రస్తావించిన కారణాలు పేలవంగా ఉన్నాయి. అందుకే గాల్లోంచి ఆరోపణలు సృష్టిస్తే అంగీకరించబోమని ధర్మాసనం వ్యాఖ్యానించాల్సి వచ్చింది. ఇకపై ఇలాంటి కేసుల విష యంలో న్యాయస్థానాలు అనుసరించాల్సిన రెండు గీటురాళ్లను కూడా ప్రకటించింది. కేసులోని అంశాలు వెల్లడిస్తే జాతీయ భద్రతకు ముప్పు కలుగుతుందని భావించటానికి అవసరమైన సమా చారం ప్రభుత్వం అందించిందా లేదా అన్నది అందులో మొదటిది. వివేకవంతులైన వ్యక్తులు సైతం ఆ సమాచారం ఆధారంగా అలాగే భావించే అవకాశం ఉన్నదా లేదా అన్నది రెండోది. భావప్రకటనా స్వేచ్ఛకు పూచీపడే రాజ్యాంగంలోని 19వ అధికరణలోనే ఏయే అంశాల్లో నియంత్రణలు అమలు చేయవచ్చో వివరంగా ఉంది. వాటిని బేఖాతరు చేసి నచ్చని అభిప్రాయాలు ప్రకటించారన్న ఏకైక కారణంతో ఆ స్వేచ్ఛకు గండికొట్టడం రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీస్తుంది. అందుకే ‘మీడియా వన్’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. -
స్నూపింగ్ కేసు: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు భారీ షాక్..
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు భారీ షాక్ తలిగింది. స్నూపింగ్ కేసులో ఆయనపై న్యాయపమరైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. సిసోడియాను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సీబీఐ కోరగా.. ఆయన ఇప్పటికే అంగీకారం తెలిపారు. అలాగే కేంద్ర హోంశాఖ అనుమతి కోసం పంపారు. ఈ విజ్ఞప్తికి హోంశాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా.. ఇప్పుడు స్నూపింగ్ కేసులో కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2015లో ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చాక ఫీడ్‌బ్యాక్ యూనిట్(ఎఫ్‌బీయూ)ను ఏర్పాటు చేసింది. 2016లో రూ.కోటి కేటాయించడంతో ఎఫ్‌బీయూ సీక్రెట్ సర్వీస్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. అయితే రాజకీయ పార్టీలు, ప్రభుత్వ, స్వతంత్ర సంస్థలపై రహస్య నిఘా పెట్టేందుకే దీన్ని ఏర్పాటు చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే దీన్ని ఏర్పాటు చేశారంటోంది. ఢిల్లీ విజిలెన్స్ శాఖకు నేతృత్వం వహిస్తున్న సిసోడియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతి కావాలని కోరింది. 2015లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎఫ్‌బీయూ ఏర్పాటును సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదించారని, కానీ దాని ఎజెండాకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పలేదని సీబీఐ ఆరోపిస్తోంది. ఎఫ్‌బీయూ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కూడా లేదని పేర్కొంది. సీబీఐ అభ్యర్థను ఆమోదిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎటువంటి శాసన, న్యాయ, కార్యనిర్వాహక పర్యవేక్షణ లేకుండా అధికారాన్ని ఉపయోగించి రహస్య ఏజెన్సీని స్థాపించేందుకు ఆప్ ప్రయత్నించిందని ధ్వజమెత్తారు. చదవండి: దేశంలోని నిరుద్యోగులకు మోదీ రూ.6,000 భృతి.. నిజమెంత? -
వీరప్పన్‌ను మట్టుబెట్టిన పోలీసు అధికారి రాజీనామా
న్యూఢిల్లీ: గంధపు చెక్కల స్మగ్లర్, కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వీరప్పన్‌ను పక్కా ప్రణాళికలతో మట్టుబెట్టిన ఐపీఎస్ మాజీ అధికారి కే విజయ్ కుమార్.. కేంద్ర హోంశాఖ భద్రతా సలహాదారు పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సంబంధిత హోంశాఖ అధికారులకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించిన విజయ్ కుమార్.. ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. తన నివాసాన్ని చెన్నైకి మార్చుకున్నట్లు వెల్లడించారు. ‘వ్యక్తిగత కారణాలతో హోంశాఖలో నిర్వర్తిస్తున్న నా బాధ్యతలకు స్వస్తి చెప్పి.. ప్రస్తుతం చెన్నైకి మారాను.’ అని విజయ్ కుమార్ తెలిపారు. మరోవైపు.. హోంశాఖ భద్రతా సలహాదారుగా తనకు అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, సహకారం అందించిన హోంశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కశ్మీర్ లోయలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఆయన సలహాలు కేంద్ర ప్రభుత్వానికి ఎంతగానే ఉపయోగపడ్డాయని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 1975 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విజయ్ కుమార్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ హోదాలో 2012లో పదవీ విరమణ చేశారు. అనంతరం హోంశాఖ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు గవర్నర్‌కు భద్రతా సలహాదారుగా విజయ్‌కుమార్‌ను కేంద్రం నియమించింది. అంతకుముందు తమిళనాడులో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చీఫ్‌గా పని చేశారు. ఆ సమయంలోనే 2004లో పక్కా ప్రణాళికతో కిల్లర్ వీరప్పన్‌ను మట్టుబెట్టారు. చెన్నై పోలీస్ కమిషనర్‌గానూ, జమ్ముకశ్మీర్‌లో బీఎస్ఎఫ్ ఐజీగానూ విజయ్‌కుమార్ విధులు నిర్వర్తించారు. ఇదీ చదవండి: పుష్పపై ‘ఫైర్’.. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌కే ముచ్చెమటలు పట్టించి.. -
ఏపీ విభజనా చట్టం అమలుపై నేడు కేంద్ర హోంశాఖ సమావేశం
-
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ?
న్యూఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ వారంలో తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు అత్యంత కీలకమైన హోంశాఖ అప్పగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఆగస్టు 15లోగా కేబినెట్ విస్తరణకు సీఎం షిండే సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 30న ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ ప్రమాణం చేశారు. అప్పట్నుంచి వారిద్దరితోనే కేబినెట్ నడుస్తూ ఉండడంతో విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ విమర్శల్ని ఫడ్నవీస్ కొట్టిపారేశారు. ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ చేసిన విమర్శల్ని తిప్పికొడుతూ వారి ప్రభు త్వంలో మొదటి 32 రోజులు కేవలం అయిదుగురే ఉన్న విషయాన్ని అజిత్ దాదా మర్చిపోయారా అని గుర్తు చేశారు. ఆగస్టు 15లోగా మహారాష్ట్ర ప్రభుత్వ విస్తరణ జరగనుంది. చదవండి: ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు: కేజ్రీవాల్ -
హోం, ఆర్థిక శాఖ మాకే కావాలి.. పట్టుబడుతున్న షిండే వర్గం
సాక్షి, ముంబై: ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య పదవుల పంపకంపై పాకులాట మొదలైనట్లు తెలుస్తోంది. ఒకపక్క హోం, ఆర్థిక శాఖ లాంటి కీలక శాఖలు తనవద్దే ఉండాలని షిండే పట్టుబడుతుండగా, మరోపక్క షిండే వర్గం వద్ద ముఖ్యమంత్రి ఉండటంతో హోం శాఖ, నగరాభివృద్ధి, రెవెన్యూ, జలవనరులు లాంటి కీలక శాఖలు తమకే కావాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలక శాఖలపై ఇరువర్గాలు చేస్తున్న డిమాండ్లను ఎలా పరిష్కరిస్తారనే దానిపై ఇటు తిరుగుబాటు, అటు బీజేపీ ఎమ్మెల్యేలో ఉత్కంఠ నెలకొంది. ఆది, సోమవారాలు రెండు రోజులపాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్‌గా రాహుల్ నార్వేకర్‌ను ఎన్నుకోవడంలో షిందే, ఫడ్నవీస్ వర్గానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. కానీ మంత్రివర్గంలో ఎవరికి స్ధానం కల్పిస్తారు..? ఆ తరువాత పదవులు ఎలా పంపకం చేస్తారు.? ఏ ఎమ్మెల్యేకు, ఏ పదవి కట్టబెడతారనే దానిపై చర్చ జోరుగా సాగుతోంది. మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్, ఎన్సీపీ వద్ద ఉన్న పదవుల్లో అధిక శాతం పదవులు తమకే కావాలని బీజేపీ భావిస్తోంది. ఏక్నాథ్ షిండే వద్ద ముఖ్యమంత్రి పదవి ఉండటంతో హోం, విద్యుత్, నగరాభివృద్ధి, జలవనరుల లాంటి కీలక శాఖలు తమకే కావాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: తెగని పంచాయితి.. మహారాష్ట్రలో ఆ 16 మంది ఎమ్మెల్యేల పరిస్థితేంటి? కాని షిండే వర్గం హోం, నగరాభివృద్ధి, ఆర్ధిక, జలవనరులు, విద్య లాంటి కీలక శాఖలు కావాలని కోరుకుంటుంది. అందులో హోం, ఆర్ధిక లాంటి అత్యంత కీలకమైన శాఖలు స్వయంగా తన వద్ద ఉంచుకోవాలని షిండే పట్టుబడగా, ఫడ్నవీస్ కూడా ఆ రెండు శాఖలు తనవద్దే ఉంచుకోవాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో శివసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం హయాంలో ఫడ్నవీస్ వద్ద హోం, నగరాభివృద్ధి లాంటి కీలక శాఖలుండేవి. కానీ ఇప్పుడు శాఖల పంపిణీపై ఇరువర్గాల మధ్య విభేదాలు పొడచూపకుండా చాలా జాగ్రత్తగా సమస్యను పరిష్కరించేందుకు షిండే, ఫడ్నవీస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. చదవండి: మహారాష్ట్ర: బల పరీక్షలో నెగ్గిన ఏక్నాథ్ షిండే ప్రభుత్వం -
ఉదయ్‌పూర్ ఘటనలో ఉగ్రకోణం?.. హోం శాఖ కీలక ఆదేశాలు
Udaipur Tailor Murder: రాజస్థాన్ ఉదయ్‌పూర్ టైలర్ హత్య కేసుపై దేశవ్యాప్తంగా స్పందన పెరిగిపోతుండగా.. మరోవైపు చర్చ కూడా విపరీతంగా నడుస్తోంది. ఈ తరుణంలో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పందించింది. బుధవారం ఉదయం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో ఉగ్రకోణం అనుమానాలు వ్యక్తం అవుతున్నందున.. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) విచారణకు ఆదేశించింది. టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కస్టమర్లలాగా నటిస్తూ కొలతలు ఇస్తుండగానే.. కన్హయ్య గొంతు కోసి హత్య చేస్తూ వీడియో వైరల్ చేయడం, ఆపై ప్రధానికి సైతం హెచ్చరికలు జారీ చేసిన వీడియోలు వైరల్ కావడం తెలిసిందే. ప్రవక్తపై నూపర్ కామెంట్ల వివాదం తర్వాత.. నూపుర్‌కు మద్ధతుగా కన్హయ్య పోస్టులు పెట్టినందుకే ఈ హత్య జరిగనట్లు నిందితుల వీడియో ద్వారా స్పష్టమైంది. మరోవైపు .. సదరు వీడియోలను తొలగించాలంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంకోవైపు ఉగ్ర కోణం నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించినట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ట్విటర్లో ప్రకటించింది కూడా. ఏదైనా సంస్థ ప్రమేయం, అంతర్జాతీయ లింకులు క్షుణ్ణంగా పరిశోధించబడతాయి అని ట్వీట్లో పేర్కొంది. ఇక ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ ఐజీ స్థాయి అధికారితో పాటు ఎన్ఐఏ బృందం ఒకటి మంగళవారమే ఉదయ్‌పూర్‌కు చేరుకుని పరిశీలించింది. తాజా సమాచారం ప్రకారం.. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఉదయ్‌పూర్ ఘటనపై ఎన్ఐఏ బృందం కేసు నమోదు చేయొచ్చని తెలుస్తోంది. MHA has directed the National Investigation Agency (NIA) to take over the investigation of the brutal murder of Shri Kanhaiya Lal Teli committed at Udaipur, Rajasthan yesterday. The involvement of any organisation and international links will be thoroughly investigated. — गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 29, 2022 చదవండి: అచ్చం ఐసిస్ తరహాలో క్రూరంగా కన్హయ్య గొంతు కోశారు -
Cyclone Asani: సర్కారు హై అలర్ట్
సాక్షి, అమరావతి: తుపాను తీవ్రత నేపథ్యంలో ముందే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని జిల్లాల అధికార యంత్రాంగాల్ని అప్రమత్తం చేయడంతోపాటు విపత్తుల నిర్వహణ సంస్థ ద్వారా ముందుగానే సహాయక చర్యలకు సిద్ధమైంది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంది. 65 మండలాల్లోని 555 గ్రామాల్లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. రాష్ట్రస్థాయిలో స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ 24 గంటలూ పనిచేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అన్ని జిల్లాల ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు, మండల ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు, 219 మల్టీపర్పస్ సైక్లోన్ సెంటర్లు, 16 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను క్రియాశీలకం చేశారు. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ముందస్తుగా 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 16 ఎన్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. కాకినాడ జిల్లాకు ఇప్పటికే 2 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందస్తుగా పంపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, విశాఖకు ఒక ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్, యానాంకు ఒక ఎన్డీఆర్ఎఫ్, కోనసీమకు ఒక ఎన్డీఆర్ఎఫ్, మచిలీపట్నానికి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని పంపించారు. మిగిలిన బృందాలను అవసరమైన చోటుకు పంపేందుకు అందుబాటులో ఉంచారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తుపాను షెల్టర్లను సిద్ధం చేశారు. అవసరాన్ని బట్టి స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు, సహాయక శిబిరాలను కూడా గుర్తించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలను ప్రాంతాల వారీగా తయారు చేశారు. టెలీ కమ్యూనికేషన్లు, తాగునీరు, నిత్యావసర వస్తువులు నిల్వ చేసుకోవడం, ట్రాఫిక్‌ను యుద్ధప్రాతిపదికన క్లియర్ చేయడానికి ముందస్తు ప్రణాళికలను జిల్లా యంత్రాంగాలు సిద్ధం చేసుకున్నాయి. తాత్కాలిక విద్యుత్ ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. ఇదిలావుండగా.. తుపాను విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖపట్నం జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజని కలెక్టర్ ఎ.మల్లికార్జునరావుకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విశాఖలోని ఫిషింగ్ హార్బర్ వద్ద అలల ఉధృతి గ్రామాల వారీగా కమిటీలు తుపాను ప్రభావంతో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలోని గ్రామాల్లో పంచాయతీరాజ్ సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ శాంతిప్రియపాండే మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. హోం మంత్రిత్వ శాఖ వీడియో కాన్ఫరెన్స్ తుపాను ప్రభావిత రాష్ట్రాల విపత్తుల శాఖ అధికారులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఏపీ విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాల్గొన్నారు. విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ముందస్తుగా తీసుకున్న చర్యలను వివరించారు. -
'ఏ ల్యాండ్‌మైన్ ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితి ఉండేది'
-
కర్ణాటక హోం మంత్రిగా జ్ఞానేంద్ర
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన కొత్త కేబినెట్లో మంత్రులకు శనివారం శాఖలు కేటాయించారు. కీలకమైన హోం శాఖను మొదటిసారిగా కేబినెట్లోకి తీసుకున్న అరగా జ్ఞానేంద్రకు కట్టబెట్టారు. గత యడియూరప్ప ప్రభుత్వంలోని చాలా మంది మంత్రులను తిరిగి అవే శాఖలను అప్పగించారు. కీలకమైన ఆర్థిక శాఖను సీఎం బొమ్మై తన వద్దే ఉంచుకున్నారు. దీంతోపాటు, ఇంటెలిజెన్స్, కేబినెట్ వ్యవహారాలు, బెంగళూరు అభివృద్ధి, కేటాయించని ఇతర శాఖలు కూడా ఆయన వద్దే ఉన్నాయి. బెంగళూరు నగరపాలక సంస్థకు త్వరలో ఎన్నికలు జరగనున్నందున ‘బెంగళూరు డెవలప్మెంట్’ శాఖను నగరానికి చెందిన సీనియర్ మంత్రికి అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ, పోటీదారులు ఎక్కువ కావడం వల్లే సీఎం ఎవరికీ ఈ పోస్టును కేటాయించలేదని భావిస్తున్నారు. కాగా, శాఖల కేటాయింపుపై ఆనంద్ సింగ్, ఎంటీ బీ నాగరాజ్ బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారితో వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్య పరిష్కరిస్తానని సీఎం బొమ్మై తెలిపారు. కాగా, వీరిద్దరూ గతంలో కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ సర్కారును వీడి, బీజేపీ సర్కారు ఏర్పడటంలో సహకరించిన వారే కావడం గమనార్హం. కర్ణాటక సీఎంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై తన కేబినెట్లోని 29 మందికి మంత్రిత్వ శాఖలు కేటాయించారు. గత యడియూరప్ప కేబినెట్లోని 23 మందితోపాటు కొత్తగా ఆరుగురికి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఎవరూ ఊహించని విధంగా కీలకమైన హోం శాఖను కొత్తగా కేబినెట్లోకి తీసుకున్న అరగా జ్ఞానేంద్రకు కట్టబెట్టారు. మొదటిసారిగా కేబినెట్లో చోటు దక్కిన జ్ఞానేంద్రకు ఈ విధంగా జాక్‌పాట్ తగిలింది. అదేవిధంగా, ముఖ్యమైన విద్యుత్ శాఖతోపాటు కన్నడ, సాంస్కతిక శాఖను వి.సునీల్‌కుమార్‌కు కేటాయించారు. పాత వారిలో 17 మందికి గత శాఖలనే కొనసాగించగా, వీరిలో 8 మంది కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని వీడి, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంలో సహకరించిన వారే కావడం గమనార్హం. అరగా జ్ఞానేంద్ర, సునీల్ కుమార్ సహా కొత్తగా చేర్చుకున్న వారికి, బీజేపీ, ఆర్ఎస్ఎస్తో సన్నిహిత సంబంధాలున్నాయి. మిగతా నలుగురిలో.. కె.ఎస్. ఈశ్వరప్పకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలు, ఆర్–అశోకకు రెవెన్యూ, కోటా శ్రీనివాస పూజారికి సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతులు, బీసీ నగేశ్‌కు ప్రాథమిక, సెకండరీ విద్య దక్కాయి. -
బెంగాల్లో హింస: కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం సీరియస్ అయింది. బెంగాల్లో హింసకు సంబంధించి నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర హోం శాఖ బెంగాల్ గవర్నర్‌ను ఆదేశించింది. ఇప్పటికే కేంద్రం నలుగురు సభ్యులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్లో చెలరేగిన హింస దృష్ట్యా కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటుచేయనుంది. 77 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలో ప్రతిపక్షనేతగా ఎన్నికైన సువేందు అధికారికి జెడ్ కేటగిరీ భద్రతను కొనసాగించే అవకాశం ఉంది. చదవండి: Tamil Nadu: పెత్తనం.. పళనిదే! -
Delhi Lieutenant Governor: ఢిల్లీకి ఎల్జీనే బాస్!
న్యూఢిల్లీ: దేశ రాజధానికి లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఇన్చార్జ్గా గుర్తిస్తూ చేసిన నూతన చట్టాన్ని కేంద్రం బుధవారం నోటిఫై చేసింది. దీంతో ఇకపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అంశంపై ఎల్జీ అనుమతి తీసుకోవాల్సిఉంటుంది. జీఎన్సీటీడీ– 2021గా పిలిచే నూతన చట్టాన్ని ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే! ఆ సమయంలో ఆప్ సహా పలు ప్రతిపక్షాలు ఈ బిల్లును రాజ్యాంగవిరుద్ధమని విమర్శించాయి. తాజా నోటిఫికేషన్‌తో చట్టంలోని నిబంధనలు ఈనెల 27 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లయిందని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఢిల్లీలో పబ్లిక్ ఆర్డర్, పోలీస్, భూ సంబంధిత అంశాలు కేంద్రం ఆధీనంలో ఉండగా, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, అడవులు, రవాణా తదితరాలు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. ఎల్జీని కేంద్రం నియమిస్తునందున, ఇకపై దాదాపుగా అన్ని అంశాలపై కేంద్రం పెత్తనం కొనసాగనుంది. ఇకపై ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే అని నూతన చట్టం వివరిస్తోంది. కరోనాను కట్టడి చేయడంలో అటు కేంద్రం, ఇటు కేజ్రీవాల్ ప్రభుత్వం వైఫల్యం చెందిన వేళ తాజా ఆదేశాలు వెలువడ్డాయి. కరోనా విజృంభణపై మంగళవారం ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అరవింద్ ప్రభుత్వం నామమాత్రమే.. జీఎన్సీటీడీ బిల్లును కేంద్రం నోటిఫై చేయడంతో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నామమాత్రంగా మిగలనుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. తాజా ఆదేశాలతో ఇకపై ఎల్జీ దాదాపు 80కి పైగా ప్రభుత్వ శాఖలను నియంత్రించడంతో పాటు, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను సైతం నిలిపివేయగల అధికారాలు పొందారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోని అంశాలైన విద్య, అవినీతి నిరోధం, ఆరోగ్యం, సాంఘీక సంక్షేమం, టూరిజం, ఎక్సైజ్, రవాణా లాంటి అంశాలతో పాటు అధికారుల బదిలీలతో సహా అన్ని విషయాల్లో అరవింద్ ప్రభుత్వం ఎల్జీ అనుమతితోనే అడుగులు వేయాల్సిఉంటుంది. కావాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎల్జీ రాష్ట్ర అధికారులకు నేరుగా ఆదేశాలివ్వవచ్చు. ఇతర రాష్ట్రాల్లోని గవర్నర్లతో పోలిస్తే ఢిల్లీ ఎల్జీ అధికారాలు భిన్నమైనవని అధికారులు వివరించారు. ఇప్పటివరకు అధికార పరిధిపై ఎల్జీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న సందిగ్ధాలను తాజా చట్టం నివారిస్తుందని చెప్పారు. -
గణతంత్ర వేళ: తెలుగు రాష్ట్రాలకు పోలీస్ పతకాల పంట
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతియేటా పోలీస్ పతకాలు ప్రకటించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం పోలీస్ పతకాలు ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి పోలీస్ మెడల్స్ తెలుగు రాష్ట్రాలకు భారీగా వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు పోలీస్ అధికారులకు ఈ పురస్కారాలు దక్కాయి. ఈ పతకాలను త్వరలోనే స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్: 18 పోలీస్ మెడల్స్, ఒక రాష్ట్రపతి విశిష్ట సేవ, 2 గ్యాలంట్రీ పతకాలు, విశిష్ట సేవ కేటగిరీలో 15 మందికి పతకాలు వచ్చాయి. తెలంగాణ 14 పోలీస్ మెడల్స్, రాష్ట్రపతి విశిష్ట సేవ 2, విశిష్ట సేవ కేటగిరీలో 12 పతకాలు ప్రకటించారు. వీరిలో హైదరాబాద్ అదనపు సీపీ శిఖా గోయల్‌కు, నిజామాబాద్ ఐజీ శివశంకర్ రెడ్డి ఉన్నారు. ఆయా అధికారులు తమ విధుల్లో కనబర్చిన ప్రతిభకు ఈ పతకాలు దక్కాయి. పతకాలు పొందిన వారిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. త్వరలోనే వీరు పతకాలు స్వీకరించనున్నారు. -
ఎన్నికల ప్రచారాలు షురూ
న్యూఢిల్లీ: ఇది ఎన్నికల సీజన్. అక్టోబర్, నవంబర్లలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా 11 రాష్ట్రాల్లో 56 స్థానాలకు, బిహార్‌లోని ఒక పార్లమెంటు సీటుకి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. సెప్టెంబర్ 30న ఇచ్చిన అన్‌లాక్ 5 నిబంధనల్ని కేంద్ర హోంశాఖ సవరిస్తూ గురువారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించడానికి అనుమతినిచ్చింది. ఈ ఉత్తర్వులు వెంటనే ఆమల్లోకి వస్తాయని హోంశాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 15 వరకు ఎలాంటి ఎన్నికల సభలు నిర్వహించవద్దని సెప్టెంబర్ 30న విడుదల చేసిన అన్‌లాక్ 5లో పేర్కొన్న కేంద్ర హోంశాఖ వాటిని సవరించింది. ఎన్నికల ర్యాలీలో 200 మంది వరకు పాల్గొనవచ్చునని తెలిపింది. ఇక ఏదైనా భవనం లోపల ఎన్నికల సమావేశాలు నిర్వహిస్తే సగం హాలు వరకు మాత్రమే జనానికి అనుమతినివ్వాలని వెల్లడించింది. ఇక ఎన్నికల ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా చేయాలని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. -
అన్‌లాక్ 3.0: యూటీలు, రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అన్‌లాక్-3 ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అంతర్రాష్ట్ర, రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు ప్రజల రాకపోకలు, వస్తువుల రవాణాపై ఇంకా నిషేధం కొనసాగించడం సరికాదని హితవు పలికింది. ఇలాంటి చర్యల వల్ల ఆర్థిక కార్యకలాపాలకు భంగం కలగడంతో పాటుగా ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. అంతర్రాష్ట్ర, రాష్ట్రాల మధ్య రాకపోకలు కొనసాగించవచ్చని ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిందని, అయినప్పటికీ ఆంక్షలు విధిస్తే దీనిని ఉల్లంఘన చర్యగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించింది. (అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల) ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారం కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. నిబంధనలు ఎత్తివేయాలంటూ విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ- పర్మిట్ల పేరిట సరుకు రవాణాకు ఆటంకం కలిగించవద్దని కోరారు. ఒకవేళ ఇలాంటి ఆంక్షల గురించి మరోసారి తమ దృష్టికి వస్తే విపత్తు నిర్వహణ చట్టం-2005లోని నిబంధనల ప్రకారం ఉల్లంఘన చర్యగా పరగణించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి నేపథ్యంలో మార్చి 24 అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. (అన్‌లాక్ 4.0: తెరుచుకోనున్న సినిమాహాళ్లు!) ఈ క్రమంలో పలు దఫాలుగా నిబంధనలు సడలించిన కేంద్ర ప్రభుత్వం మే రెండోవారంలో అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించింది. అయితే అన్‌లాక్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు గతంలో ప్రకటించిన హోం మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఈ మేరకు లేఖ రాయడం గమనార్హం. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న అన్‌లాక్-3 ఆగష్టు 31తో ముగియనున్న తరుణంలో ఇన్నాళ్లుగా మూతపడ్డ థియేటర్లు, మార్కెట్లను కనీస జాగ్రత్తలు పాటిస్తూ తెరిచేందుకు కేంద్రం అనుమతించినున్నట్లు తెలుస్తోంది. ఇక దేశంలో గడచిన 24 గంటల్లో 69,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కోవిడ్ బాధితుల సంఖ్య 29,75,702 కు చేరుకుంది. మొత్తంగా 55,794 కరోనాతో మరణించారు. ఇక దేశంలో ప్రస్తుతం 6,97,330 యాక్టివ్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత దృష్ట్యా ఇప్పటికీ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో అజయ్ భల్లా ఈ మేరకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.