చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వం రద్దు | Home Ministry Cancels Chennamaneni Ramesh Citizenship | Sakshi
Sakshi News home page

చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వం రద్దు

Published Thu, Nov 21 2019 2:24 AM | Last Updated on Thu, Nov 21 2019 7:42 AM

Home Ministry Cancels Chennamaneni Ramesh Citizenship - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/ కరీంనగర్‌:పౌరసత్వం వివాదంలో వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారత పౌరసత్వానికి ఆయన అనర్హుడని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. పౌరసత్వాన్ని పొందేందుకు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేశ్‌ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్‌ 2009 నుంచి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తప్పుడు ధ్రువపత్రాలతో మన దేశ పౌరసత్వం పొందినందున రమేశ్‌ ఎన్నిక చెల్లదంటూ ఆది వాదిస్తూ వస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ జరిపి, తాజాగా తన నిర్ణయాన్ని వెలువరించింది.  

తప్పుడు సమాచారం ఇచ్చారు.. 
‘‘భారత పౌరసత్వం కోసం చెన్నమనేని రమేశ్‌ 31.03.2008న దరఖాస్తు చేసుకున్నారు. సెక్షన్‌ 5 (1) (ఎఫ్‌) ప్రకారం దరఖాస్తుదారు దరఖాస్తు చేసుకోవడానికి ముందు ఏడాది పాటు భారతదేశంలో నివసించి ఉండాలి. ఈ విషయంలో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారు. 21.11.2008న గత 12 నెలల్లో విదేశాలకు వెళ్లిన వివరాలను సమర్పించాలని హోంశాఖ ఆయన్ను కోరగా.. తాను విదేశాలకు వెళ్లలేదని 27.11.2008న రమేశ్‌ బదులిచ్చారు. ఈ నేపథ్యంలో 04.02.2009న ఆయనకు కేంద్ర హోంశాఖ భారత పౌరసత్వాన్ని ఇచ్చింది. దీనిపై ఆది శ్రీనివాస్‌ 15.06.2009న రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. భద్రతా సంస్థల నివేదిక ప్రకారం రమేశ్‌ 01.03.2007 నుంచి 26.11.2007 వరకు, 20.12.2007 నుంచి 28.02.2008 వరకు విదేశాల్లో ఉన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక లేఖ ద్వారా 01.09.2009న ధ్రువీకరించింది.

పౌరసత్వ చట్టం సెక్షన్‌ 10(5) పరిధిలో ఒక విచారణ కమిటీని నియమించగా.. ఆ కమిటీ 10.03.2017న తన నివేదిక సమర్పించింది. జర్మనీకి వెళ్లిన విషయాన్ని రమేశ్‌ నిజాయతీగా వెల్లడించలేదని, 27.11.2008న తప్పుడు సమాచారం ఇచ్చారని కమిటీ నిర్ణయానికి వచ్చింది. రమేశ్‌ భారత ప్రభుత్వాన్ని మోసగించడం ద్వారా పౌరసత్వాన్ని పొందారని తేలింది’’అని హోంశాఖ పేర్కొంది. రమేశ్‌ తప్పుడు అభ్యర్థన చేశారని, వాస్తవాలను మరుగున పెట్టారని, పౌరసత్వ దరఖాస్తుకు ముందు చేసిన విదేశీ పర్యటనలను దాచి ఉంచినట్టు వెల్లడైందని వివరించింది. వాస్తవాలను మరుగుపరచడం, తప్పుడు సమాచారం ద్వారా పౌరసత్వం పొందితే సెక్షన్‌ 10(2) వర్తిస్తుందని, అంటే ఆయన పౌరసత్వం తొలగించాల్సి వస్తుందని తెలిపింది. 

ఉదాహరణగా ఉండాల్సిన వారు ఇలా చేస్తే? 
‘‘తాను ప్రజాసేవలో ఉన్నందున సెక్షన్‌ 10(3)ను పరిగణనలోకి తీసుకోవాలని చెన్నమనేని అభ్యర్థించారు. తాను సిట్టింగ్‌ ఎమ్మెల్యేనని, ఎలాంటి నేరచరిత్ర లేదని, క్రిమినల్‌ కేసు లేదని, తీవ్రవాదం వంటి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. అయితే, తప్పుడు సమాచారం ఇవ్వడం, వాస్తవాలను దాచిపెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. దరఖాస్తు నాటికి ఏడాది ముందు కాలం పాటు పూర్తిగా భారతదేశంలో నివసించలేదని సమాచారం ఇచ్చి ఉంటే అధీకృత యంత్రాంగం ఆయనకు పౌరసత్వం ఇచ్చి ఉండేది కాదు. ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఇచ్చే సమాచారం సరైనదిగా ఉండాలి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకు ఆయన ప్రవర్తన ఉదాహరణగా ఉండాలి.

ఒక వ్యక్తి దేశ పౌరసత్వం పొందేందుకు తప్పుడు సమాచారం ఇచ్చారంటే, సమాజానికి సదరు వ్యక్తి చేసే మంచిని ఊహించగలం. నేరారోపణలు లేనంత మాత్రాన తప్పుడు సమాచారం ఇవ్వడం మంచి చేయడానికే అని అర్థం కాదు. ప్రజాప్రతినిధిగా ఉండి అసత్య సమాచారం ఇవ్వడం ప్రజాశ్రేయస్సుకు మంచిది కాదు. ఆయన ఎలాంటి నేరాలకు పాల్పడలేదని భావించి పౌరసత్వాన్ని కొనసాగిస్తే ఇదొక ఉదాహరణగా మారి మరికొందరు ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి పౌరసత్వాన్ని పొందుతారు. వీటన్నింటి దృష్ట్యా ఆయన భారత దేశపౌరుడిగా కొనసాగడం ప్రజాశ్రేయస్సుకు దోహదం చేయదని నిర్ణయించి, రమేష్‌ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం’’అని హోంశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

పదేళ్ల న్యాయ పోరాటం చివరికి ఇలా... 
రమేశ్‌బాబు పౌరసత్వాన్ని సవాల్‌ చేస్తూ ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్‌ 2009 జూన్‌లో కేంద్ర హోంశాఖలో ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అప్పటి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఎస్పీ విచారణ జరిపి, రమేశ్‌ కేవలం 96 రోజులు మాత్రమే భారతదేశంలో ఉన్నారని నివేదిక సమర్పించారు. 2010 ఉప ఎన్నికల అనంతరం రమేశ్‌బాబు ఎన్నికను సవాల్‌ చేస్తూ ఆది శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. 2013 ఆగస్టు 14న రమేశ్‌బాబు పౌరసత్వం రద్దు చేయడమే కాకుండా ఓటరు జాబితాలో పేరు తొలగించాలని తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రమేశ్‌బాబు 2013లో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ నుంచి మళ్లీ ఈ వ్యవహారం కేంద్ర హోంశాఖకు మారింది.

రమేశ్‌బాబు విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కూడా ఆయన మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని తేల్చి చెప్పింది. దీంతో 2017 ఆగస్టు 31న రమేశ్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు హోంశాఖ ప్రకటించింది. అయితే, తాను ప్రజలకు సేవలు అందిస్తున్నానని, తన పౌరసత్వం కొనసాగించాలని మరోసారి ఆయన హోంశాఖను కోరారు. అనంతరం 2018 జనవరి 5న మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్టే ఇవ్వగా.. దానిని ఎత్తివేయాలని కోరుతూ ఆది శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు 2019 జూలై 10న రమేశ్‌బాబు పౌరసత్వాన్ని కేంద్ర హోంశాఖ మూడు మాసాల్లో తేల్చాలని ఆదేశించింది. 

మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా: చెన్నమనేని 
తన పౌరసత్వ పరిరక్షణకు మరోమారు హైకోర్టును ఆశ్రయిస్తానని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ తెలిపారు. ఈ ఏడాది జూలై 15న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ‘నా పౌరసత్వాన్ని 2017లో హోంశాఖ రద్దు చేసిన తరువాత హైకోర్టు వెంటనే స్టే మంజూరు చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఈ ఏడాది జూలై 15న నా పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని కొట్టివేసింది. పౌరసత్వ చట్టం, వాటి నియమ నిబంధనలు, దరఖాస్తులను సమగ్రంగా హేతుబద్దంగా, నైతిక విలువలు, వ్యక్తి సామాజిక నిబద్దతను పరిగణిస్తూ (సెక్షన్‌ 10.3) చూడాలి తప్ప, సాంకేతికంగా విడదీసి విశ్లేషించరాదని తన 25 పేజీల తీర్పులో హైకోర్టు స్పష్టంచేసింది.

ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని హోంశాఖను ఆదేశించింది. ఒకవేళ సెక్షన్‌ 10.3ని పరిగణించకుండా.. ఏ నిర్ణయం వచ్చినా న్యాయం కోసం మళ్లీ తమ వద్దకు రావచ్చని చెప్పింది. హైకోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్‌ 31న మరోమారు ఢిల్లీలో హోంమంత్రిత్వ శాఖ వద్ద వాదనలు జరిగాయి. అయితే హైకోర్టు తీర్పులో పేర్కొన్న ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయం. పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా. తప్పక న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’అని చెన్నమనేని పేర్కొన్నారు. 

న్యాయం గెలిచింది: ఆది శ్రీనివాస్‌ 
రమేశ్‌బాబు భారతదేశ పౌరుడు కాదని తాను మొదటినుంచీ చెబుతూనే ఉన్నానని, ఇన్నాళ్లకు న్యాయం గెలిచిందని వేములవాడ కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. మచ్చలేని నాయకుడనని చెప్పుకుంటున్న రమేశ్‌బాబు ఈ దేశ పౌరుడు కాదని కేంద్ర హోంశాఖ ప్రకటించిందని, ఈ అంశాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ‘ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని నేను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ న్యాయస్థానంలో ఉంది. గతంలో వచ్చిన తీర్పుల ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడి ఆ పదవిలోకి వస్తే సమీప ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. ఇక్కడ కూడా అదే వర్తిస్తుందని భావిస్తున్నా’అని శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు.

వేటా.. చెల్లుబాటా?
రమేశ్‌ భారత పౌరసత్వం రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేప థ్యంలో, ఆయన ఎమ్మెల్యే పదవిలో కొనసాగడంపై ఉత్కంఠ నెలకొంది. హోం శాఖ నిర్ణ యం నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతారా, సమీప ప్రత్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తారా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అనర్హత వేటు పడితే ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే హోంశాఖ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మరోమారు హైకో ర్టును ఆశ్రయిస్తానని రమేశ్‌ ప్రకటించిన నేపథ్యంలో, ఎమ్మెల్యేగా ఆయన భవితవ్యంపై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేశ్‌ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి 2010 ఉప ఎన్నికతో పాటు 2014, 2018 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. భారతీయుడైన రమేశ్‌ 1993లో జర్మనీ పౌరసత్వాన్ని స్వీకరించగా, 2008 మార్చి 31న తిరిగి భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement