సాక్షి, వేములవాడ: బీజేపీకి నేషన్ ఫస్ట్ అయితే.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్ అని అన్నారు ప్రధాని మోదీ. అలాగే, మూడో దశ పోలింగ్ తర్వాత ఇండియా కూటమికి ఫ్యూజ్ ఎగిరిపోయిందని మోదీ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రజలు ఓటు వేసిన కారణంగానే బీజేపీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని స్పష్టం చేశారు.
కాగా, ప్రధాని మోదీ వేములవాడలో పర్యటించారు. ఈ సందర్బంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం, వేములవాడలో బీజేపీ శ్రేణులు నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ..‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి విజయం పక్కాగా ఖాయమని కనిపిస్తోంది. ఇక్కడ బీఆర్‌ఎస్ అడ్రస్ కూడా కనిపించడం లేదు.
రేవంత్, రాహుల్ ట్యాక్స్..
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు పెద్ద తేడా ఏమీ లేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను అవినీతి కలుపుతోంది. తెలంగాణను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి కాపాడాలి. ఓటుకు నోటు కేసుపై బీఆర్‌ఎస్ ఎందుకు విచారణ చేయించలేదు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతిపై కాంగ్రెస్ ఇంత వరకూ ఎందుకు విచారణకు ఆదేశించలేదు. తెలంగాణలో ఆర్‌ఆర్ ట్యాక్స్ గురించి బాగా చర్చ నడుస్తోంది.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు వెయ్యి కోట్ల కలెక్షన్స్ వస్తే.. ఇప్పుడు 3-4 నెలల్లోనే ‘ఆర్‌ఆర్’ (రేవంత్, రాహుల్) ట్యాక్స్ దాన్ని మించిపోయింది. ఇక్కడి వసూళ్లు ఢిల్లీకి పంపుతున్నారు. రాహుల్ గాంధీ నాలుగున్నరేళ్లుగా అంబానీ-అదానీ పేర్లు జపించారు. ఎన్నికలు ప్రారంభం కాగానే రాహుల్.. అంబానీ-అదానీ పేర్లు జపించడం మానేశారు. అంబానీ-అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ హైదరాబాద్‌ను ఎంఐఎంకు లీజ్‌కు ఇచ్చాయి. తొలిసారిగా ఎంఐఎంకు బీజేపీ సవాల్ విసురుతోంది.
భారత్ ముందుకు సాగుతోంది..
కాంగ్రెస్ అతి కష్టం మీద కరీంనగర్‌లో అభ్యర్థిని బరిలో నిలిపింది. పీవీని కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించిందో మనమంతా చూశాం. పీవీని భారతరత్నతో సన్మానించాము. నిన్ననే ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పీవీని ఎంతగానో గౌరవించాము. ఉదయం పది గంటలకే ఇంత పెద్ద సభ నిర్వహించడం.. నాకు గుజరాత్‌లో కూడా సాధ్యం కాదు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు.
మన దేశంలో ఎంతో సమర్థత ఉన్నా.. ఇన్నేళ్లు కాంగ్రెస్ ఆ సామర్థ్యాన్ని నాశనం చేసి సమస్యలవలయంగా మార్చింది. బీజేపీ, ఎన్డీఏ హయాంలోనే ఈ దేశంలో సమగ్రాభివృద్ధి జరుగుతోంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయమందించి, బీమా అందిస్తూ లాభసాటిగా మార్చాం. పదేళ్లుగా నా పనితీరు ఎలా ఉందో మీరంతా గమనించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. రక్షణ రంగంలో దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి మన దేశం చేరింది. మీరంతా బీజేపీకి ఓటు వేసిన కారణంగానే.. దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది.
అయోధ్యకు రామమందిరం తలుపులు తెలంగాణ నుంచే వచ్చాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం కాకుండా కాంగ్రెస్ ప్రయత్నించింది. మాదిగలకు వ్యతిరేకంగా రిజర్వేషన్‌లన్నీ ముస్లింలకు చెందాలని కాంగ్రెస్ నేత అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు లాక్కొని వాటిని ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment