
సాక్షి,కరీంనగర్ : తాను కేసీఆర్ అంత మంచోడిని కాదని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి కేటీఆర్. కరీంనగర్ బీఆర్ఎస్ సన్నాహక సభలో కేటీఆర్ మాట్లాడారు.
‘ఇవాళ సన్నాహక సమావేశాన్ని చూస్తే బీఆర్ఎస్ ఎంత బలంగా ఉందో అర్థమైతుంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ కరీంనగర్. తెలంగాణ సెంటిమెంట్ లేదన్న రోజున కేసీఆర్‌ను 2 లక్షల మెజారిటీతో గెలిపించి వాదాన్ని నిలబెట్టిన గడ్డ కరీంనగర్.
గత పదిహేను నెలలుగా అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్న ప్రతిపక్షం బీఆర్ఎస్. ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపమన్న నాయకుడు కేసీఆర్. ఇవాళ భూమికి జానెడున్నోడు కూడా ఎగిరెగిరి పడుతున్నాడు. వానపాములు బుసలు కొడుతున్నై, గ్రామసింహాలు సింహాలనుకుంటున్నై. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. బీజేపీ 1992లోనే ఒక్క ఓటు పేరు, రెండు రాష్ట్రాల పేరిట మోసం చేసింది. కాంగ్రెస్ మోసాలు చేస్తూనే ఉంటుంది
ఇవాళ ఏం రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. ఇవాళ రైతులకు కేసీఆర్ గుర్తుకొస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీ, అణిచివేత రాజ్యం. నేను కేసీఆర్ అంత మంచోణ్ని కాదు. మనకు సమయం వస్తుంది. అప్పుడు అన్ని లెక్కలు తేలుస్తాం. విదేశాల్లో దాక్కున్నా పట్టుకొస్తాం. ఈ ప్రభుత్వం 5 డీఏలు బాకీ ఉంది. 16 నెలల్లో 6 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని యువత బాధ పడుతోంది. ఈ ఏడాది మొత్తం రజతోత్సవం చేసుకుందాం.
ఏప్రిల్ 27న ఆవిర్భావ సభకు అందరూ కదిలి రావాలి. దక్షిణ భారతానికి నష్టం వాటిల్లబోతోందని తమిళనాడు సదస్సు నిర్వహించింది. కుటుంబ నియంత్రణ పాటించినందుకు మనకు ఉత్తరాది నాయకులు ప్రాతినిథ్యం తగ్గించి దక్షాణాదిని చిన్నచూపు చూస్తున్నాయి. ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడ సీట్లు తగ్గిస్తామంటోంది.

అయోధ్య తలంబ్రాల పేరిట సెంటిమెంట్ పూసారు. అవి అయోధ్య వి కావు, ఉత్తినే. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ని ఏదడిగినా శివం, శవం ముచ్చట తప్ప వేరే లేదు. బడి కట్టినా, గుడి కట్టినా బీఆర్ఎస్ నాయకులే కట్టారు. పదేళ్లలో కడుపులో సల్ల కదలకుండా చూసుకున్నాడు కేసీఆర్. తెలంగాణాలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారు. బీఆర్ఎస్ మీద ద్వేషం, అసూయ, ఆశ అనే అంశాలను ప్రయోగించి దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం’అని పిలుపునిచ్చారు.