Karim nagar
-
హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 చిరు వ్యాపారుల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అరటి పండ్ల బండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది వాహనాలు, ఇతర దుఖాణాలకు మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రమాదం..షార్ట్ సర్క్యూట్ వల్లేనని తెలుస్తోంది. అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
జమ్మికుంట తహశీల్దార్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు!
సాక్షి, కరీంనగర్: జమ్మికుంట తహశీల్దార్ రజినీ ఆస్తులను ఏసీబీ ప్రకటించింది. మార్కెట్ విలువ ప్రకారం రూ.20 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 22 ఓపెన్ ఫ్లాట్స్, 7 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించినట్లు పేర్కొంది. కిలోలకొద్దీ బంగారం, వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. బినామీ పేర్లతో పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. పెద్ద మొత్తంలో ఆస్తుల కొనేందుకు తహశీల్దార్ రజినీ అడ్వాన్స్ చెల్లించినట్లు తెలిపింది. జమ్మికుంట తహసీల్దార్ రజినీ ఇంట్లో ఇవాళ ఏసీబీ సోదాలు జరిపింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేశారు. హన్మకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో తహశీల్దార్ రజని బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ సోదాలు జరిపింది. -
కరీంనగర్ జిల్లాలోనూ కుక్కలు స్వైర విహారం
-
వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో జియో ట్రూ 5జీ సేవలు
హైదరాబాద్: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను తెలంగాణ లోని వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో మంగళవారం లాంఛనంగా ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్ లో రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. జియో ట్రూ 5జి సేవల ప్రారంభంతో తెలంగాణ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటి,ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుందని జియో తెలిపింది. జియో ట్రూ 5జీ పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. చిట్టచివరి అడుగు వరకు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యం మెరుగుపడుతుందని పేర్కొంది. తెలంగాణలో జియో ట్రూ 5జీని విస్తరిండం పట్ల జియో తెలంగాణ సీఈఓ కే సీ రెడ్డి సంతోషం ప్రకటించారు. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని కంపెనీ తెలిపింది జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికిట్రూ-5జీని అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా తెలంగాణను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ ప్రకటన
-
మావోల హిట్‌లిస్టులో ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్..!
సాక్షి , కరీంనగర్: ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కరీంనగర్లో రెండువారాలుగా కలకలం రేగుతోంది. మావో యిస్టు రాష్ట్ర కార్యదర్శి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, యాక్షన్ కమిటీ సభ్యుడు పాండు అలియాస్ మంగులు దళాలు ప్రవేశించాయని పోలీసులు అప్రమత్తమయ్యారు. గోదావరి నది దాటి వీరు పెద్దపల్లి జిల్లాలోనూ ప్రవేశించే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో సోమవారం సీఎం పెద్దపల్లి పర్యటనలో ఆఖరు నిమిషాన రోడ్డు మార్గం వద్దని పోలీసులు కేసీఆర్‌ను ఆకాశమార్గం (హెలీక్యాప్టర్) ద్వారా రప్పించారు. 2005 తరువాత మావోయిస్టు పార్టీ పాత కరీంనగర్ జిల్లాలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. 2020 లాక్డౌన్ సమయంలో జిల్లాలో కార్యకలాపాలు సాగించేందుకు తిరిగి యత్నాలు ప్రారంభించింది. సిరిసిల్లలో ఓ కాంట్రాక్టరు వద్ద డబ్బులు వసూలు చేయడం, జగిత్యాలలోనూ రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నించడం వంటి ఘటనలు వెలుగుచూశాయి. ఎక్కడికక్కడ అణిచివేత..! మావోలతో సంబంధాలున్న ఏ నెట్‌వర్క్‌నైనా ఉమ్మడి జిల్లా పోలీసులు ఎక్కడికక్కడ భగ్నం చేశారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమలలో పనిచేసే కొందరితో మావోలు కొంతకాలం రహస్య సంబంధాలు నెరిపారు. ఈ వ్యవహారంపై కన్నేసిన కరీంనగర్ సీపీ సత్యనారాయణ గంగాధర, చొప్పదండి, బావుపేట, హుస్నాబాద్‌లకు చెందిన పలువురిని అరెస్టు చేసి మావోల నెట్‌వర్క్‌ను తెంచారు. అలాగే.. జనశక్తి పేరిట కొందరు మాజీలు సిరిసిల్లలో కార్యకలాపాలకు పూనుకునేందుకు సిద్ధమైనా.. ఎస్పీ రాహుల్ హెగ్డే వీరిని ఆదిలోనే అణిచివేశారు. ఇదే జనశక్తికి చెందిన పలువురు ఆయుధాలతో జగిత్యాలలో సంచరిస్తుండగా.. ఎస్పీ సింధు శర్మ బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఎలాంటి కదలికల్లేకుండా జాగ్రత్తపడుతున్నారు. సున్నిత ప్రాంతంగా పెద్దపల్లి జిల్లా.. తాజాగా పెద్దపల్లి జిల్లాలోని ఆర్ఎఫ్సీఎల్లో వెలుగుచూసిన కుంభకోణంలో మావోయిస్టు కార్యదర్శి వెంకటేశ్ పేరుతో విడుదలవుతున్న లేఖలపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఆ లేఖల్లో పలువురు నేతల పేర్లు ప్రస్తావించడంతో అవి ఎక్కడ నుంచి వచ్చాయన్న విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అదే విధంగా మాజీ మావోలపైనా రహస్యంగా నిఘా కొనసాగిస్తున్నారు. ఈ లేఖలు తొలుత ఆగస్టు 25న, ఆ తరువాత 31న మావోయిస్టు పార్టీ జయశంకర్– మహబూబాబాద్– వరంగల్2– పెద్దపల్లి జిల్లాల డివిజన్ కమిటీ పేరుతో వచ్చాయి. తొలుత ఈ లేఖను కొందరు ఆకతాయిలు విడుదల చేశారని పోలీసులు భావించారు. కానీ.. వీటిని మావోయిస్టులే విడుదల చేశారని ఇటీవల పోలీసులు కూడా నిర్ధారించినట్లు సమాచారం. మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులకు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతంలోని కొందరు నాయకులకు ముప్పు అధికంగా ఉందని, దీన్ని సున్నిత ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అనుమానితులు, కొత్త వ్యక్తుల సమాచారాన్ని నిరంతరం తెప్పించుకుంటున్నారు. జిల్లా సరిహద్దుల వద్ద సీసీ కెమెరాలు, ఇన్ఫార్మర్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. చదవండి: Hyderabad: చూస్తుండగానే బాలుడిపైకి దూసుకెళ్లిన కారు.. భయానక దృశ్యాలు టీఆర్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్..! విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలను టార్గెట్‌గా చేసుకుని మావోలు దాడులకు పాల్పడతారన్న సమాచారం పోలీసుల వద్ద ఉంది. తద్వారా పాత జిల్లాలో తిరిగి ఉనికిని చాటుకోవాలన్నది మావోల వ్యూహమని పోలీసులు చెబుతున్నారు. దీంతో మావోల జాబితాలో ఉన్న సదరు నేతలను పోలీసులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎక్కడా పర్యటించవద్దని స్పష్టంచేశారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నేతలకు ముప్పు అధికంగా పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నెట్వర్క్ నాశనమైందన్న ఆందోళనలో ఉన్న మావోలు దాన్ని పునరుద్ధరించుకోవాలన్నా.. పార్టీకి నిధులు సమకూర్చుకోవాలన్నా.. వారి ముందున్న ఏకైక మార్గం హింస. అందుకే.. పోలీసులు వీఐపీ నేతల రక్షణకు సంబంధించిన ప్రతీ అంశాన్ని చాలా పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. భద్రత విషయంలో చిన్న లోపమున్నా.. మావోలు హింసకు పాల్పడతారన్న సమాచారంతో అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. -
ఎంబీఏ చదువు, మంచి ఉద్యోగం వదిలి.. పాడితో ఉపాధి!
జగిత్యాల అగ్రికల్చర్: ఉన్నత చదువులు చదివిన యువకులు వ్యవసాయంతోపాటు పాడి వంటి అనుబంధ రంగాల వైపు వెళ్లేందుకు నామోషీగా ఫీలవుతుంటారు. దీంతో, చాలీచా లని జీతంతో పట్టణాల్లో మగ్గిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎంబీఏ చదివి, ప్రైవేట్ ఉద్యోగాన్ని వదులుకొని, ఉన్న ఊరిలో జెర్సీ ఆవుల ఫాం నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాడు జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన తీపిరెడ్డి సురేశ్‌రెడ్డి(99893 54414). ఉరుకుల పరుగుల జీవితం నచ్చక.. సురేశ్‌రెడ్డి ఎంబీఏ పూర్తయ్యాక రెండేళ్లు హైదరాబాద్‌లో ఉద్యోగం చేశాడు. కానీ ఉరుకుల పరుగుల జీవితం అతనికి నచ్చలేదు. దీంతో వ్యవసాయం చేద్దామని ఇంటికి వచ్చాడు. కానీ చదువుకున్నది వ్యవసాయం చేయడానికి కాదు.. ఏదో ఒక ఉద్యోగం చూసుకో అని తల్లితండ్రులు ముఖం మీదే చెప్పేశారు. అయినప్పటికీ తనకున్న పట్టుదల, ధైర్యంతో మొండిగా ఆవుల ఫాం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి రుణం తీసుకొని, తమకున్న వ్యవసాయ భూమిలోనే 5 జెర్సీ ఆవులతో ఫాం ప్రారంభించాడు. ప్రస్తుతం 25 ఆవులున్నాయి.. ఫాంలో ప్రస్తుతం 25 జెర్సీ ఆవులు, 10 దూడలున్నాయి. పాలు పితికేందుకు సురేశ్‌రెడ్డి ఇద్దరు బిహార్ కూలీలను నియమించుకున్నాడు. ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫాంలోనే ఉంటూ ఆవులను స్వయంగా పర్యవేక్షిస్తుంటాడు. వాటికి మేత కోసం, ఎకరంలో పచ్చిగడ్డి వేశాడు. ఉదయం, సాయంత్రం ఆవులకు దాణా పెట్టి, పాలు పితుకుతారు. ఆవులు, దూడల పేడ, మూత్రంతో ఈగలు, దోమలు రాకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాడు. లీటర్‌కు రూ.50లకు విక్రయం ప్రతీరోజు ఉదయం, సాయంత్రం 100 లీటర్ల పాల దిగుబడి సాధిస్తున్నట్లు సురేశ్‌రెడ్డి తెలిపాడు. వీటిలో 30 లీటర్లను స్థానిక వినియోగదారులకు లీటర్‌కు రూ.50 చొప్పున పోస్తున్నాడు. మిగిలిన పాలను పాల డిపోకు తీసుకెళ్తున్నాడు. అక్కడ పాలల్లో వెన్న శాతాన్ని బట్టి లీటర్‌కు రూ.30 నుంచి రూ.33 వరకే ఇవ్వడం వల్ల ఆదాయానికి గండి పడుతోంది. అలా కాకుండా వినియోగదారులు పెరిగితే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉందంటున్నాడు. దాణా రేట్లు ఏడాదిలో రెట్టింపు కావడం వల్ల ఫాం నిర్వహణ ఖర్చులు పెరిగాయి. దీనికితోడు, ప్రభుత్వం ఇస్తామన్న లీటర్‌కు రూ.4 ఇన్సెంటివ్ రూ.2 లక్షలు రెండేళ్లుగా అందక కొంత ఇబ్బందిగా ఉందని చెబుతున్నాడు. ఎండుగడ్డి సేకరణ పాడి పశువులకు మేత ప్రధానం. ఓవైపు పచ్చిమేత ఇస్తూనే, మరో వైపు ఎండుగడ్డిని ఓ పూట వేస్తుంటారు. ఇందుకోసం సురేశ్‌రెడ్డి వరి పొలాల సమయంలో వరి గడ్డిని కట్టలు కట్టించి, షెడ్డులో నిల్వ చేస్తున్నాడు. రూ.వేలకు వేలు పెట్టి, కొత్తగా పాడి పశువులను కొనుగోలు చేయకుండా, ఆవులకు పుట్టిన పిల్లలకే సమీకృత దాణా ఇస్తూ త్వరగా ఎదిగేలా చేస్తున్నాడు. జగిత్యాలలో షాప్ పెట్టాలనుకుంటున్న జెర్సీ ఆవుల ఫాం ప్రారంభించాక మొదట్లో ఎన్నో కష్టనష్టాలు చూశా. కానీ ఏనాడూ అధైర్యపడలేదు. ఫాంని మరింత లాభాల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్న. జగిత్యాలలో వినియోగదారుల కోసం షాప్ పెట్టాలనుకుంటున్న. దాణా రేట్లు తగ్గితే ఆదాయం బాగుంటుంది. – తీపిరెడ్డి సురేశ్‌రెడ్డి, పాడి రైతు, లక్ష్మీపూర్ -
మేం వచ్చాక యూనిఫారాలు ఊడదీయిస్తాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సైదాబాద్: టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసుల యూనిఫారాలను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఊడదీయిస్తామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి భగవంత్ ఖుబా హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ, 317 జీవోకు సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. అంతకుముందు కరీంనగర్ జైల్లో ఉన్న సంజయ్‌ని ములాఖత్ ద్వారా కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీ ఇంటినౌకరుగా ప్రవర్తిస్తున్నారని, ఐపీఎస్ శిక్షణ సమయంలో ప్రజారక్షకుడిగా ఉంటానని ప్రమాణం చేసి, ప్రజాభక్షకుడిగా మారారని విమర్శించారు. జరిగిన ఉదంతానికి త్వరలోనే ఆయన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తే, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ లాంటివారినే ప్రజలు ఓడించారని, కుటుంబపాలన చేస్తున్న కేసీఆర్‌కు అదే పరిస్థితి తప్పదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ది తుగ్లక్ పాలన అని విమర్శించారు. 317 జీవోతో రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందుల పాలు జేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం సంజయ్ దీక్ష చేపట్టిన కార్యాలయాన్ని సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే శోభ అరెస్టు సంజయ్ ఈ నెల 2న తలపెట్టిన జాగరణ దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అదే కేసులో నిందితులుగా ఉన్న కార్పొరేటర్ రాపర్తి ప్రసాద్, బీజేపీ నేత ఉప్పరపల్లి శ్రీనివాస్‌ను కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. వైద్యపరీక్షల అనంతరం వీరిని మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్ విధించడంతో ముగ్గురినీ జిల్లా జైలుకు పంపారు. -
డాక్యుమెంట్ రైటర్లదే హవా..
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్): జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉద్యోగుల కంటే ఎక్కువగా డాక్యుమెంట్ రైటర్ల హవా నడుస్తోంది. డాక్యుమెంట్లు చేయడంతోపాటు ఆఫీసులో సైతం వారే పెత్తనం చెలాయిస్తున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చే వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రజల నిరక్షరాస్యతతో పాటు విద్యావంతులు సైతం ఆన్లైన్లో సర్వే నంబర్ల పరిశీలన డాక్యుమెంట్ కోసం చేయాల్సిన పనులు తెలిసినప్పటికీ డాక్యుమెంట్ రైటర్లను సంప్రదిస్తుండంతో వారి ఆదాయం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోందని రియల్ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) 50 నుంచి 90 వరకు డాక్యుమెంట్లు.. జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథనిలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. రోజుకు పెద్దపల్లిలో 20నుంచి 50 వరకు డాక్యుమెంట్లు మిగతా ప్రాంతాల్లో 10నుంచి 15వరకు డాక్యుమెంట్ రైటర్లు డాక్యుమెంట్ చేస్తుంటారు. పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం చాలావరకు వివరాల నమోదును ఆన్లైన్ చేసింది. అయితే ఆన్లైన్ వివరాల నమోదులోనూ డాక్యుమెంట్ రైటర్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారికి ఆన్లైన్ పై సరైన అవగాహన లేకపోవడంతో డాక్యుమెంట్ రైటర్ల పైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో ఒక్కో సేవకు ఒక్కో రేటు చొప్పున వసూలు చే స్తు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీకి పట్టించిన డాక్యుమెంట్ రైటర్... పెద్దపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్న ఒకరు.. గతంలో పనిచేసిన సబ్‌రిజిస్ట్రార్ వద్ద తనమాట చెల్లకపోవడంతో సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీకి పట్టించాడు అయినప్పటికీ తిరిగి డాక్యుమెంట్ రైటర్‌గా కొనసాగుతుండడం విశేషం. అక్రమ వసూళ్లలో రిజిస్ట్రార్ కార్యాల య అధికారులు, సిబ్బందికి కూడా వాటాలు ముడుతుండడంతో అధికారుల వద్ద రైటర్ల హవా నడుస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు మ్యుటేషన్ ఉచితమే... రిజిస్ట్రేషన్ సమయంలో మ్యుటేషన్ ఉచితంగానే రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు చేస్తారు. కానీ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారుల పేరుచెప్పి సమీపంలోని డాక్యుమెంట్ రైటర్లు మ్యుటేషన్ చేస్తా మని పలువురు వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ధరణి మాదిరిగా చేయాలి ధరణి మాదిరిగా భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే డాక్యుమెంట్ రైటర్ల అవినీతిని అరికట్టవచ్చని సబ్ రిజిస్ట్రార్లు పేర్కొంటున్నారు. ధరణిలో రిజిస్ట్రేషన్ చేస్తే అవకతవకలు నివారించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. డబ్బులు వసూలు చేస్తే చర్యలు మ్యుటేషన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇలా ఎవరైనా అవినీతికి పాల్పడితే తమదృష్టికి తీసుకురావాలి. ఈ విషయమై తమకు ఫిర్యాదులు కూడా అందాయి. డాక్యుమెంట్రైటర్లపై ప్రత్యేక దృష్టిసారించాం. – సురేశ్‌బాబు, సబ్ రిజిస్ట్రార్, పెద్దపల్లి (చదవండి: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!) -
టీఆర్ఎస్ కార్యకర్తలను తరలిస్తున్న టాటాఏస్ బోల్తా..
-
బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి కేటీఆర్ ఫిదా: ‘పేపర్ వేస్తే తప్పేంటి’
సాక్షి, హైదరాబాద్: బాల్యం ప్రతి మనిషి జీవితంలో అందమైన జ్ఞాపకం. ఎంత వయసు వచ్చినా.. జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా.. బాల్య స్మృతులు తలుచుకోగానే మనసులో తెలియని ఆనందం. అవును మరి రేపటి గురించి దిగులు లేదు.. నేడు ఎలా గడుస్తుందో అన్న బెంగ లేదు. అమ్మనాన్నల ప్రేమ.. స్నేహితులతో ఆటలు.. బడిలో గెంతులు. బాల్యం అనగానే వినిపించే మాటలు. అయితే ఇది ఒకవైపు మాత్రమే. మరోవైపు.. పలకబలపం పట్టాల్సిన చిన్నారులు పనిలో తలమునకలవుతున్నారు. చిన్న తనంలోనే వారి మీద పెద్ద బాధ్యత. వెరసి మనచుట్టూ ఎందరో బాల కార్మికులు. కోవిడ్‌తో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇంట్లోని ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల. ఈ క్రమంలో కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని.. చదువుకుంటునే పని చేస్తున్న చిన్నారులెందరో ఉన్నారు. (చదవండి: కంటోన్మెంట్ విలీనంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ ) తాజాగా ఈ కోవకు చెందిన వీడియోని ఒకదాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది తెగవైరలవుతోంది. ఈ బుడ్డోడి ఆత్మవిశ్వాసానికి కేటీఆర్ సైతం ఫిదా అయ్యాడు. చిన్నారి భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నారు. ‘‘ఈ చిన్నారి ఆత్మవిశ్వాసం, ఆలోచనల్లో స్పష్టత, హావభావాలు నాకు చాలా నచ్చాయి’’ అనే క్యాప్షన్‌తో వీడియోని షేర్ చేశారు కేటీఆర్. ఈ వీడియోలోని సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న జై ప్రకాశ్ ఉదయం పూట పేపర్ బాయ్‌గా పని చేసుకుంటున్నాడు. ఇది గమనించి ఆ దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి.. జై ప్రకాశ్‌ని పలకరించాడు. ఏం చేస్తున్నావ్.. ఎక్కడ చదువుతున్నావ్ అని ప్రశ్నించాడు. అనంతరం సదరు వ్యక్తి ఈ ఏజ్‌లో నువ్వు పేపర్ వేస్తున్నావ్ ఎందుకు అని ప్రశ్నించగా.. అప్పుడు జై ప్రకాశ్ ‘ఏం.. పేపర్ వేయొద్దా’ అని తిరిగి ప్రశ్నిస్తాడు. (చదవండి: కేటీఆర్‌పై ఆ విమర్శలు చేయొద్దు.. రేవంత్‌కు సిటీ సివిల్ కోర్టు ఆదేశం ) అప్పుడు ఆ వ్యక్తి చిన్నారి జై ప్రకాశ్‌ని ప్రశంసించి.. ‘చదువుకునే ఏజ్‌లో పని చేస్తున్నావ్ కదా’ అంటే.. అందుకు జై.. ‘చదువకుంటున్నా.. పని చేస్తున్నా.. దానిలో తప్పేం ఉంది’ అని తిరిగి ప్రశ్నిస్తాడు. ఈ ఏజ్‌లో నువ్వు ఇలా కష్టపడటం చాలా నచ్చింది అని సదరు వ్యక్తి అనగా.. ‘కష్టపడితే ఏం అయితది.. భవిష్యత్తులో నాకు మేలు చేస్తుంది’ అని సమాధానం ఇస్తాడు జై. ఇక వీడియో మొత్తంలో బుడ్డోడి ఎక్స్ప్రెషన్స్, కాన్ఫిడెన్స్ వేరే లెవల్. Loved this video from Jagtial Town This young lad a Govt school student called Jai Prakash; loved his confidence, composure and clarity of thought & expression 👏👏 He says what’s wrong in working while studying & goes on to say it’ll keep him in good stead in future pic.twitter.com/Ug4wYIGn8a — KTR (@KTRTRS) September 23, 2021 ఈ వీడియో చూసిన నెటిజనులు చిన్నారి జైని ప్రశంసిస్తున్నారు. పిల్లలు, పెద్దలు నిన్ను చూసి నేర్చుకోవాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోని 5 వేల మందికి పైగా లైక్ చేయగా.. 900 మందికి పైగా రీట్వీట్ చేశారు. ఒక్కరోజులో చిన్నారి జై ప్రకాశ్ స్టార్ అయ్యాడు. చదవండి: శభాష్ పోలీస్.. నిండు ప్రాణాన్ని నిలిపిన కానిస్టేబుల్ -
మెరిసిన ‘తెల్ల బంగారం.. క్వింటాల్ పత్తి ధర రూ.7,800
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తికి రికార్డు ధర పలికింది. పత్తి కొనుగోళ్లలో వ్యాపారులు పోటీ పడ్డారు. నాణ్యంగా ఉన్న పత్తికి క్వింటాల్‌కు రూ.7,800 గరిష్ట ధర పలికింది. అలాగే కనిష్టంగా రూ.6,000 వరకు వేలం పాటలో రైతులకు చెల్లించారు. నారాయణపేట జిల్లాలో కూడా మంచి ధర వచ్చింది. ఊట్కూర్ మండలం తిప్రాస్‌పల్లి సమీపంలోని విజయ్ కాటన్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు నాణ్యతను బట్టి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,300 ధర చెల్లించారు. అలాగే కనిష్టంగా రూ.6,500 చెల్లించారు. – జమ్మికుంట/నారాయణపేట -
సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన
-
రాజన్న సిరిసిల్లలో బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసిన నర్స్
-
శభాష్ పోలీస్.. నిండు ప్రాణాన్ని నిలిపిన కానిస్టేబుల్
సాక్షి, కరీంనగర్: కానిస్టేబుల్ సమయస్ఫూర్తి ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆగిన గుండెకు పోలీస్ కానిస్టేబుల్ ఊపిరి పోశారు. కరీంనగర్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద బొమ్మకల్ కు చెందిన ఎండి అబ్దుల్ ఖాన్ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీ అతన్ని కొట్టింది. దీంతో అబ్దుల్ ఖాన్ అక్కడికక్కడే పడిపోయి అపస్మారక స్థితికి చేరాడు. చుట్టుపక్కల జనం చూస్తూ ఉండి పోయారు. కానీ అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వన్ టౌన్ కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అపస్మారక స్థితికి కు చేరుకున్న యువకుడు ఛాతిపై ప్రెసింగ్ చేశాడు. అలా మూడు,నాలుగు నిమిషాలు చేయడంతో యువకుడిలో చలనం వచ్చింది. వెంటనే ఆ యువకుడిని 108లో ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తి పట్ల సీపీ కమలాసన్ రెడ్డి తో పాటు పలువురు అభినందించారు. సిపి కమలాసన్ రెడ్డి మాటలును ప్రేరణగా తీసుకుని, ట్రైనింగ్ లో నేర్చుకున్న అంశాలతో సకాలంలో స్పందించి యువకుడు ప్రాణాలు కాపాడానని కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్ తెలిపారు. ఖలీల్ గొప్ప పనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ద్విచక్ర వాహనం ఢీకొట్టిన వెంటనే కుప్పకూలిపోయిన యువకుడి హార్ట్ బీట్ ఆగిపోయింది. పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఖలీల్ ప్రథమ చికిత్సలో భాగంగా గుండె పైన నిమిషం పాటు పంపింగ్ చేయండంతో యువకుడికి మొదలయిన హార్ట్ బీట్, వెంటనే అతనిని హాసుపత్రికి తరలించడమైనది. pic.twitter.com/zZEYMVHal1 — Telangana State Police (@TelanganaCOPs) June 23, 2021 చదవండి:జీవిత సమస్య: పోరుబాట వదలడమా? ప్రాణాలు పోవడమా? -
Huzurabad: చిలక పలుకుల మంత్రులకు ఆత్మగౌరవం ఉందా?
సాక్షి, కరీంనగర్ జిల్లా: మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత కాషాయ కండువాతో తొలిసారి నియోజకవర్గంలో అడుగు పెట్టారు. దారి పొడవునా అభిమానులు, బీజేపి కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో ఈటల రోడ్ షో నిర్వహించగా ఆయన సతీమణి జమున కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల మద్దతు కోరారు. ఈటల దంపతుల తొలి రోజు ప్రచారం బీజేపీకి కొత్త ఊపునివ్వగా.. గులాబీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. జమ్మికుంట మండలం నాగారం ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హుజురాబాద్ ఉప ఎన్నికతో ప్రజలు.. టీఆర్ఎస్ అహంకారానికి ఘోరీ కడతారని వ్యాఖ్యానించారు. 2023 ఎన్నికలకు.. ఈ ఉప ఎన్నిక రిహార్సల్‌గా ఆయన అభివర్ణించారు. తనకు మద్దతిస్తున్న వారిని ఇంటిలిజెన్స్ అధికారులు వేధిస్తున్నారని ఈటల ఆరోపించారు. ప్రజలు ప్రేమకు లొంగుతారని. బెదిరింపులకు కాదనన్నారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మ గౌరవం ఉందా అని ప్రశ్నించారు. ఆత్మ గౌరవం పోరాటానికి హుజురాబాద్ వేదిక అని రేపటి నుంచి ఇంటింటికి వెళ్తానని ఈటల రాజేందర్ వెల్లడించారు. చదవండి: Huzurabad: టార్గెట్ ఈటల..పెద్దిరెడ్డి మాటల వెనుక అర్థం ఏమిటో? ‘ఈటల’ నియోజకవర్గానికి భారీగా నిధులు -
Huzurabad: పట్టుబిగిస్తున్న అధిష్టానం.. ఈటల ఒంటరేనా?!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ కేడర్‌ను దూరం చేసేలా పార్టీ అధిష్టానం వేగంగా పావులు కదుపుతోంది. రాజీనామా చేయకుండా పోటాపోటీగా ప్రెస్మీట్ల ద్వారా ఎదురుదాడి చేస్తున్న ఆయనను ఒంటరిని చేసేందుకు వ్యూహం అమలు చేస్తోంది. ఒకవేళ రాజేందర్ పార్టీ వీడినా టీఆర్ఎస్ నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎవరూ చేజారకుండా హుజూరాబాద్ నియోజకవర్గంపై టీఆర్ఎస్ పట్టు బిగిస్తోంది. సుమారు వారం పాటు స్థబ్దత నెలకొనగా... రెండు రోజులుగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇన్ని రోజులు వేచిచూసే ధోరణి ప్రదర్శించిన నాయకులు ‘కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తాం... టీఆర్ఎస్లోనే ఉంటాం’ అని ప్రకటిస్తున్నారు. హుజూరాబాద్‌పై ‘ఆపరేషన్ గంగుల’ పేరిట బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాపూర్ కమలాపూర్, వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్ నేతలతో నిత్యం టచ్‌లో ఉంటుండగా, త్వరలోనే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి, ట్రబుల్ షూటర్ టి.హరీష్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ రంగంలోకి దిగుతారన్న ప్రచారం కమలాపూర్‌లో సాగుతోంది. ఫలిస్తున్న టీఆర్ఎస్ వ్యూహం.... మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురై ఇరవై రోజులు గడుస్తున్నా మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ను వీడటం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అమలు చేస్తున్న వ్యూహాలు సత్పలితాలు ఇస్తున్నాయి. రాజేందర్ తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించి వెళ్లాక పరిస్థితులు ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఇరవై రోజుల పాటు వేచిచూసిన పలువురు టీఆర్ఎస్ సీనియర్లు బుధవారం ప్రెస్మీట్ల ద్వారా తమ వైఖరి స్పష్టం చేశారు. కరోనా తగ్గుముఖం పట్టాక తర్వాత తన రాజకీయ భవిష్యత్ నిర్ణయం ప్రకటిస్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేస్తుండగా, ఒక్కొక్కరుగా ఆయన శిబిరం నుంచి బయట పడుతున్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సమయంలో రాజేందర్‌ను కలిసి సంఘీభావం ప్రకటించిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పలువురు ఇప్పుడు పక్కకు తప్పుకుంటున్నారు. కరీంనగర్లో మకాం వేసిన గంగుల కమలాకర్‌ను కలిసొచ్చి హుజూరాబాద్, కమలాపూర్‌ల్లో ప్రెస్మీట్లు పెడుతున్నారు. కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తాం టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న పలువురు సీనియర్లతో పాటు మెజార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు గులాబీ జెండా కిందే పని చేస్తామని బుధవారం ఖరాకండిగా ప్రకటించారు. కమలాపూర్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీలోనే కొనసాగుతూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ ఇంద్రసేనారెడ్డి, పింగిలి ప్రదీప్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె రాధికా శ్రీనివాస్, వైస్‌చైర్మన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, ఎంపీటీసీలు తాళ్లపెల్లి శ్రీనివాస్ తదితరులు ప్రెస్మీట్లో ఈటల రాజేందర్ వైఖరిని ఖండించారు. టీఆర్ఎస్లోనే తమ ప్రస్థానం కొనసాగుతుందని, డబ్బులు, ప్రలోభాలకు లొంగే నాయకులు టీఆర్ఎస్లో, నియోజకవర్గంలో లేరని వెల్లడించారు. చదవండి: హుజురాబాద్: హరీశ్‌కు బాధ్యతలు అప్పగిస్తారా? -
జగిత్యాల: తల్వార్‌తో బర్త్‌డే వేడుకలు
జగిత్యాలక్రైం: పుట్టిన రోజు వేడుకలను తల్వార్‌తో జరుపుకున్న మైనర్‌పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హన్మాన్వాడకు చెందిన 17 ఏళ్ల మైనర్ తన పుట్టిన రోజు వేడుకలను శనివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత స్నేహితుల మధ్య రోడ్డుపైన జరుపుకున్నాడు. తల్వార్‌తో కేక్ కట్ చేయడంతోపాటు నృత్యాలు చేశారు. ఆ దృశ్యాలు పోలీసుల వరకు వెళ్లడంతో సదరు మైనర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ జయేశ్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారు చేసే పనులపై ఓ కన్నేసి ఉంచాలని, సంఘ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడితే తల్లిదండ్రులపై సైతం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చదవండి: అయ్యో కొడుకా: తండ్రి ట్రాక్టర్ కింద పడి.. -
ఎంత చదివినా 'తన్వి' తీరదు!
పదేళ్ల పిల్లలు ఏం చేస్తారు? ఆడుతూ పాడుతూ..స్కూల్లో చెప్పిన పాఠాలను వల్లేవేస్తూ ఉంటారు. ఇది ఒకప్పటి మాట. టెక్నాలజీతో ఆడుతూ పాడుతూ ఆన్లైన్ గేమ్‌లతో బిజీగా ఉంటున్నారు నేటితరం పిల్లలు. ఐదోతరగతి చదువుతున్న వోరుగంటి తన్వి మాత్రం కవితలు రాస్తూ ఏకంగా ఒక బుక్‌ను çప్రచురించింది. ఎంత చదివినా తన్వి తీరనంతగా అందరినీ ఔరా అనిపిస్తోంది. లాక్డౌన్ కాలంలో ఎక్కడివారు అక్కడే ఇళ్లలో ఉండిపోవలసి రావడంతో తమకు దొరికిన సమయాన్ని చాలా మంది రకరకాలుగా సద్వినియోగం చేసుకున్నారు. పదేళ్ల చిన్నారి తన్వి కూడా ఎవరికీ తీసిపోలేదు. తనకొచ్చిన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చింది. చక్కటి కవితలుగా మార్చింది. ఇలా రాసిన కవితలను ‘ఫ్రం ది ఇన్సైడ్–ద ఇన్నర్ సోల్ ఆఫ్ యంగ్ పొయెట్’ పేరిట పుస్తకం విడుదల చేసింది. దీంతో అమెరికాలో అతిపిన్న రచయితల జాబితాలో నిలిచింది. మార్చి15న విడుదలైన ఈ బుక్ ప్రస్తుతం ఆన్లైన్ వేదికపై ఫైవ్‌స్టార్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ప్రపంచమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో అందరూ అనుభవించిన, ఎదుర్కొంటున్న సమస్యలు, చేస్తున్న ఆలోచనలు, కష్టాలను కవితల రూపంలో వివరిస్తోంది. ముఖ్యంగా భావోద్వేగాలు, బాధ, కోపం, విచారం, ఒంటరితనం, ఇష్టమైన వారిని కోల్పోవడం, లాక్‌డౌన్‌తో స్వేచ్ఛను కోల్పోవడం వంటి అనేక అంశాలను పుస్తకంలో తన్వి ప్రస్తావించింది. అంతేకాకుండా ప్రకృతిపట్ల మనం చూపాల్సిన ప్రేమ బాధ్యత, ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు, మర్చిపోలేని బంధాలు... వంటివాటన్నిటì నీ కవితల ద్వారా వివరించింది. హ్యారీపోటర్ సీరిస్‌లను ఇష్టపడే తన్విని కవితలు రాయాలనే అభిరుచే రచయితగా మార్చిందని చెబుతోంది. పదేళ్ల వయసులో బుక్ రాసిన తన్వి భారత సంతతికి చెందిన అమ్మాయి కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌కు చెందిన మహేందర్ రెడ్డి, దీపికా రెడ్డి దంపతుల ఏకైక సంతానమే తన్వి వోరుగంటి. ఐదోతరగతి చదువుతోన్న తన్వి వయసులో మాత్రమే చిన్నది. ఆలోచనల్లో ఒక రచయిత అంత వయసు తనది. అందుకే అందరు పిల్లల్లా వేసవి సెలవల్లో ఆడుకోలేదు తన్వి. తనకి ఎంతో ఇష్టమైన కవితలు రాస్తూ కాలం గడిపేది. అలా తాను రాసుకున్న కవితలన్నింటికి ఒక పుస్తకరూపం ఇవ్వడంతో అమెరికా లో యంగెస్ట్ రచయితల సరసన పదేళ్ల తన్వి నిలవడం విశేషం. తన్వి మాటల్లోనే విందాం...‘‘నాపేరు తన్వి వోరుగంటి. నేను అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలోని చాడ్లర్ నగరంలో అమ్మానాన్నలతో ఉంటున్నాను. మా స్వస్థలం కరీంనగర్ అయినప్పటికీ నాన్న మహేందర్ రెడ్డి ఇంటెల్‌లో హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా, అమ్మ దీపిక సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండడంతో నేను ఇక్కడే పుట్టాను. రెండేళ్లకోసారి మాత్రమే ఇండియా వచ్చి తాతయ్య దగ్గర ఒక నెలరోజులు గడుపుతాము. నా కవితల ప్రస్థానం గతేడాది వేసవికాలం సెలవుల్లో మొదలైంది. సమ్మర్ హాలిడేస్‌లో టైమ్‌పాస్ కోసం కవితలు రాయం మొదలు పెట్టాను. అలా రాస్తూ రాస్తుండగానే నేను కవితలు రాస్తున్న విషయం అమ్మానాన్నలకు తెలియడంతో వారు కూడా నన్ను బాగా ప్రోత్సహించారు. అంతేగాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా స్కూల్ టీచర్ల ప్రోత్సాహం తో నేను మరిన్ని కవితలు రాయగలిగాను. వారి సహకారంతో ఆ కవితలకు పుస్తకరూపం తీసుకు రాగలిగాను. అయితే పుస్తక ప్రచురణ ఏమంత సులభం కాలేదు. చాలా సవాళ్లను ఎదుర్కొనవలసి వచ్చింది. నామీద నాకు పూర్తిస్థాయిలో విశ్వాసం లేకపోవడం వల్ల బుక్ ముద్రించడానికి అర్హురాలినేనా అనిపించేది. పుస్తకాన్ని ముద్రించడానికి నా రచన సరిపోతుందా అనిపించేది. ఇలా ఎన్నో ఆలోచనలు, సందిగ్ధతల నడుమ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ.. తల్లిదండ్రుల సహకారంతో బుక్ పబ్లిష్ చేసాను. అయితే అందరూ అర్థం చేసుకునేలా అర్థవంతమైన కవిత్వం రాశానని మాత్రం చెప్పగలను’’ అని చెప్పింది ఆరిందలా. ‘‘కొత్తగా కవితలు రాయాలనుకుంటున్నవారు ముందుగా మిమ్మల్ని మీరు బాగా నమ్మండి. ఎప్పటికప్పుడు మీకు మీరే నేను చేయగలను అని చెప్పుకుంటూ ఉండాలి. అనుకున్న లక్ష్యాన్నీ చేరేందుకు కష్టపడాలి’’అని చెప్పింది. పిల్లలు, పెద్దల కోసం భవిష్యత్ లో రియలిస్టిక్ ఫిక్షన్ నావెల్స్ రాయాలనుకుంటున్నట్లు తన్వి వివరించింది. ఆమె ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం. ‘‘నా మనవరాలు చిన్నవయసులో కవితలు రాసి బుక్ పబ్లిష్ చేసే స్థాయికి ఎదగడం నాకెంతో గర్వంగా ఉంది. తన్వి అమెరికాలో పుట్టినప్పటికీ ఏడాదికోసారి ఇండియా రావడాన్ని ఎంతో ఇష్టపడుతుంది. చిన్నప్పటి నుంచి తను చాలా కామ్‌గా ఉండే తత్వం. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేది. ఎప్పుడూ ఆలోచిస్తూ తనకు నచ్చిన వాటిని చిన్న నోట్‌బుక్‌లో రాసి పెట్టుకునేది. రీడింగ్, రైటింగ్ అంటే తనకు ఎంతో ఇష్టం. స్కూల్లో టీచర్ల ప్రోత్సాహంతో మంచి వకాబులరీ నేర్చుకుంది. మా ఫ్యామిలీలో రచయితలు ఎవరూ లేరు. ఈ లోటును తన్వి తీర్చింది. తను ఇలానే మంచి మంచి రచనలు చేస్తూ..మరిన్ని పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాను. తన స్టడీస్తోపాటు రచయితల ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను’’ –తన్వి తాతయ్య వోరుగంటి హనుమంత రెడ్డి, (కరీంనగర్ డెయిరీ అడ్వైజర్) -
'నాకు రిటైర్మెంట్ వయసు పెంపు వద్దు'
కొడిమ్యాల: ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపుపై ఉద్యోగులంతా సంబరాలు చేసుకుంటుండగా.. ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం తనకు పెంపు వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా నల్లబ్యాడ్జీ ధరించి విధులకు హాజరవుతున్నారు.జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఏనుగు మల్లారెడ్డి తనకు రిటైర్మెంట్ వయస్సు పెంపు వద్దని మంగళవారం ప్రకటించారు. ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల నిరుద్యోగ యువతకు అవకాశాలు దక్కకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు చేసిన త్యాగాలను గుర్తు తెచ్చుకుని సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నిండిన హుండీలు.. భక్తులకు తిప్పలు
సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో హుండీలు నిండిపోయాయి. దీంతో కానుకలు వేసేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ గర్భగుడి, అంత ర్భాగంలో మొత్తం 18 హుండీలు ఉండగా.. 13 హుండీలు నిండాయి. భక్తులు కానుకలు వేయకుండా అధికారులు హుండీలకు వ్రస్తాన్ని చుట్టారు. దీంతో భక్తులు ఆలయ పరిసరాల్లో కానుకలను సమర్పించుకుంటున్నారు. ఇదే అదనుగా కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. జనవరి 27న హుండీలు లెక్కించగా.. రూ.10.80 కోట్ల ఆదాయం సమకూరింది. తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. చిల్లర నాణేలను బ్యాంకర్లు తీసుకోకపోవడం.. లెక్కింపులోనూ జాప్యం జరగడంతో హుండీలు నిండిపోవడానికి కారణమని చెబుతున్నారు. బుధవారం హుండీలను లెక్కింపునకు ఏర్పాట్లు చేశామని, చిల్లర సమస్యపై దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. -
పెద్దపల్లి జిల్లా బీజేపీలో ముసలం
సాక్షి, పెద్దపల్లి: పార్టీలో క్రమశిక్షణ లోపించిందని అధిష్టానానికి పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ లేఖ రాశారు. దీంతో ఆ పార్టీలో ముసలం రాజుకుంది. తనకు తెలియకుండానే పార్టీ మీటింగ్‌లు పెడుతున్నారని సోమారపు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగలేనని లేఖలో పేర్కొన్నారు. నాలుగు నెలల క్రితం జిల్లా అధ్యక్షుడిగా వేసిన కమిటీని అధిష్టానం ఆమోదించని పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లాకు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. చదవండి: మాజీ కౌన్సిలర్ దారుణ హత్య -
కదంతొక్కిన కమ్యూనిస్టులు..
కరీంనగర్: నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఆందోళనకు సంఘీభావంగా కరీంనగర్లో కమ్యూనిస్టులు కదంతొక్కారు. జిల్లా నలుమూలల నుంచి సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో కరీంనగర్‌కు చేరుకొని నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. నగర పురవీధుల గుండా సాగిన ర్యాలీలో.. కమ్యూనిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడి, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతోనే నేడు ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన ప్రజా ఉద్యమంగా మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నూతన వ్యవసాయ చట్టాలు మూడింటిని రద్దు చేయాలని ఉభయ కమ్యునిస్టులు డిమాండ్ చేశారు. -
'మరోసారి పెళ్లి ప్రస్తావన తెచ్చావంటే చంపుతా'
సాక్షి, కరీంనగర్: ప్రేమ పేరుతో యువకుడి చేతిలో ఒక మైనర్ బాలిక మోసపోయింది. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి బాలికను తల్లిని చేసిన యువకుడు ఇప్పుడు ముఖం చాటేయడంతో మోసపోయానని గ్రహించింది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపుతానని బెదిరించడంతో దిక్కుతోచని స్థితిలో పుట్టిన బిడ్డను తీసుకొని న్యాయం కోసం పోలీసుల వద్దకు వచ్చింది. కాగా యువకుడిని అరెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కరీంనగర్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. కరీంనగర్ లోని గోదాంగడ్డకు చెందిన సమీర్ .. గణేష్ నగర్ లో నివాసం ఉండే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మైనర్ బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. బ్యాంగిల్ షాప్ లో పనిచేస్తున్న ఆమెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దీంతో బాలిక గర్బం దాల్చడంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు స్థానికులతో కలిసి పెళ్లి చేసుకోమని యువకుడిని నిలదీశారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పిన సమీర్ పాప పుట్టేవరకు కాలం గడిపాడు. గత నవంబర్ 12న యువతి పాపకు జన్మనివ్వడంతో ముఖం చాటేసిన సమీర్ పెళ్ళికి నిరాకరించాడు. పుట్టిన పాపతో తనకు ఏమి సంబంధం లేదని.. కట్నం డబ్బు తెస్తేనే పెళ్ళి చేసుకుంటానని చెప్పిన సమీర్ అప్పటినుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో సదరు బాలిక తల్లిదండ్రులతో కలిసి పెళ్లి చేసుకోవాలని సమీర్ వద్ద ఒత్తిడి తేవడంతో పెళ్లి ప్రస్తావన తెస్తే చంపుతానని బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమీర్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. -
భర్తను హతమార్చిన భార్య
ముస్తాబాద్(సిరిసిల్ల): పిల్లలు లేని తనకుకాకుండా.. రెండో భార్యకు ఆస్తి దక్కుతుందని భావించిన మొదటి భార్య బంధువులతో కలిసి భర్తను హతమార్చింది. సిరిసిల్ల టౌన్ సీఐ వెంకటనర్సయ్య, మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా..ముస్తాబాద్ మండలం సేవాలాల్‌తండాకు చెందిన ధరమ్‌సోత్ శంకర్‌నాయక్(49)పై అతడి మొదటి భార్య సరోజన, మరో ఇద్దరు బంధువులు కలిసి శనివారం రాత్రి దాడి చేశారు. తీవ్రగాయాలకు గురైన శంకర్‌నాయక్‌ను సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. శంకర్‌నాయక్ పరిస్థితి విషమంగా ఉండడంతో ముస్తాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతిచెందిన శంకర్‌నాయక్ కాగా శంకర్‌నాయక్‌కు గతంలో సరోజనతో వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. దీంతో సేవాలాల్ తండాకే చెందిన రాజవ్వను శంకర్‌నాయక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు జన్మించింది. అయితే వ్యవసాయ భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని శంకర్‌నాయక్‌పై మొదటి భార్య సరోజన కొంతకాలంగా ఒత్తిడి తెస్తోంది. ఇద్దరి మధ్య ఆస్తిపై గొడవలు జరుగుతున్నాయి. పిల్లలు లేని తనను ఎవరూ పట్టించుకోరని ఆస్తి రాసివ్వాలని పంచాయితీలు పెట్టింది.(చదవండి: పథకం ప్రకారమే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య) అయితే అందుకు అతడు నిరాకరించడంతో తన బంధువులైన లక్ష్మీ, శ్రీనివాస్, సరోజన కలిసి శంకర్‌నాయక్‌కు శనివారం రాత్రి ఫుల్‌గా మందు తాగించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న శంకర్‌నాయక్‌పై ముగ్గురు కలిసి దాడి చేసి కొట్టారు. శంకర్‌ను చంపిన ముగ్గురిని శిక్షించాలని రెండో భార్య రాజవ్వ, ఆమె బంధువులు ముస్తాబాద్‌లో ఆందోళన చేపట్టారు. హత్యకు కారణమైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటనర్సయ్య, ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.