సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్): జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉద్యోగుల కంటే ఎక్కువగా డాక్యుమెంట్ రైటర్ల హవా నడుస్తోంది. డాక్యుమెంట్లు చేయడంతోపాటు ఆఫీసులో సైతం వారే పెత్తనం చెలాయిస్తున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చే వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రజల నిరక్షరాస్యతతో పాటు విద్యావంతులు సైతం ఆన్‌లైన్‌లో సర్వే నంబర్ల పరిశీలన డాక్యుమెంట్ కోసం చేయాల్సిన పనులు తెలిసినప్పటికీ డాక్యుమెంట్ రైటర్‌లను సంప్రదిస్తుండంతో వారి ఆదాయం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోందని రియల్‌ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.
(చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!)
50 నుంచి 90 వరకు డాక్యుమెంట్లు..
జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథనిలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. రోజుకు పెద్దపల్లిలో 20నుంచి 50 వరకు డాక్యుమెంట్లు మిగతా ప్రాంతాల్లో 10నుంచి 15వరకు డాక్యుమెంట్ రైటర్లు డాక్యుమెంట్ చేస్తుంటారు. పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం చాలావరకు వివరాల నమోదును ఆన్‌లైన్ చేసింది. అయితే ఆన్‌లైన్ వివరాల నమోదులోనూ డాక్యుమెంట్ రైటర్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారికి ఆన్‌లైన్ పై సరైన అవగాహన లేకపోవడంతో డాక్యుమెంట్ రైటర్ల పైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో ఒక్కో సేవకు ఒక్కో రేటు చొప్పున వసూలు చే స్తు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి.
సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీకి పట్టించిన డాక్యుమెంట్ రైటర్...
పెద్దపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్న ఒకరు.. గతంలో పనిచేసిన సబ్‌రిజిస్ట్రార్ వద్ద తనమాట చెల్లకపోవడంతో సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీకి పట్టించాడు అయినప్పటికీ తిరిగి డాక్యుమెంట్ రైటర్‌గా కొనసాగుతుండడం విశేషం. అక్రమ వసూళ్లలో రిజిస్ట్రార్ కార్యాల య అధికారులు, సిబ్బందికి కూడా వాటాలు ముడుతుండడంతో అధికారుల వద్ద రైటర్ల హవా నడుస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు
మ్యుటేషన్ ఉచితమే...
- రిజిస్ట్రేషన్ సమయంలో మ్యుటేషన్ ఉచితంగానే రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు చేస్తారు. కానీ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారుల పేరుచెప్పి సమీపంలోని డాక్యుమెంట్ రైటర్లు మ్యుటేషన్ చేస్తా మని పలువురు వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు.
- ధరణి మాదిరిగా చేయాలి
- ధరణి మాదిరిగా భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే డాక్యుమెంట్ రైటర్ల అవినీతిని అరికట్టవచ్చని సబ్ రిజిస్ట్రార్లు పేర్కొంటున్నారు. ధరణిలో రిజిస్ట్రేషన్ చేస్తే అవకతవకలు నివారించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
డబ్బులు వసూలు చేస్తే చర్యలు
మ్యుటేషన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇలా ఎవరైనా అవినీతికి పాల్పడితే తమదృష్టికి తీసుకురావాలి. ఈ విషయమై తమకు ఫిర్యాదులు కూడా అందాయి. డాక్యుమెంట్‌రైటర్లపై ప్రత్యేక దృష్టిసారించాం.
– సురేశ్‌బాబు, సబ్ రిజిస్ట్రార్, పెద్దపల్లి
(చదవండి: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!)
Comments
Please login to add a commentAdd a comment