అడ్డుకోబోయిన మహిళను కాలుతో తన్ని... | Owner attacked by land grabbers in karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో రెచ్చిపోయిన ల్యాండ్‌ మాఫియా

Published Fri, Apr 26 2019 3:57 PM | Last Updated on Fri, Apr 26 2019 8:55 PM

Owner attacked by land grabbers in karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : కరీంనగర్‌లో ల్యాండ్‌ మాఫియా రెచ్చిపోయింది. 35 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్‌ అయిన ఓ స్థలంపై నకిలీ పత్రాలు సృష్టించి, అమ్మకానికి పెట్టారు భూ బకాసురులు. ఇదేమని ప్రశ్నించిన స్థలం యజమానిపై కబ్జాదారుడు ఎదురుదాడికి దిగారు. అడ్డుకోబోయిన ఓ మహిళను కాలుతో కడుపులో తన్ని చేయి చేసుకున్నాడు. అప్పనంగా భూములు కొట్టేయడమే కాకుండా, భూమి సొంతదారులపై దాడికి సైతం తెగబడటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన కరీంనగర్‌లోని రామచంద్రాపూర్ కాలనీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. 

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లా కేశవపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన చింతిరెడ్డి ఇందిరమ్మ అనే మహిళ 35 ఏళ్లక్రితం కరీంనగర్‌లోని సిక్‌వాడికి చెందిన సురేందర్‌పాల్‌ సింగ్‌ అనే వ్యక్తి వద్ద నుంచి రామచంద్రాపూర్‌కాలనీకి చెందిన సర్వే నంబర్‌ 965లోని 266 గజాల ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేశారు. 1985లో ఈ మేరకు ఇందిరమ్మ పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆమె వద్ద నుంచి ఆ భూమిని చింతిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2010లో కొనుగోలు చేసి అతడి భార్య స్వరూప పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించి ఎల్‌ఆర్‌ఎస్‌ కూడా తీసుకున్నారు.

ఈనెల 4వ తేదీన సిక్‌వాడీకి చెందిన యస్పాల్‌సింగ్, రాజీవీర్‌సింగ్‌లు మరో ఇద్దరు మహిళలు కలిసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి చింతిరెడ్డి స్వరూప పేరు మీద ఉన్న భూమిని పురంశేట్టి వెంకయ్య అనే వ్యక్తికి విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసరెడ్డి తన భూమిని కాపాడుకునేందుకు ఈనెల 19వ తేదీన భూమిలో నిర్మాణం చేపట్టారు. ఈ సమయంలో యస్పాల్‌సింగ్, రాజ్‌వీర్‌సింగ్‌లు వచ్చి ఈ భూమి మాకు చెందిందని బెదిరించడంతో కరీంనగర్‌ టుటౌన్‌ పోలీసులకు ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలని ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటే క్రిమనల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించి పంపించారు. 

గురువారం ఉదయం ప్రహరీ నిర్మించేందుకు శ్రీనివాస్‌రెడ్డి భూమిలోకి వెళ్లగా సమాచారం తెలుసుకున్న ప్రత్యర్థులు అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. శ్రీనివాసరెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ పెద్దది కావడంతో ఆవేశానికి గురైన యాస్పాల్‌సింగ్‌ అనుచరులు శ్రీనివాస్‌రెడ్డిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే శ్రీనివాస్‌ను ఆస్పత్రికి తరలించారు. బాధితుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని టుటౌన్‌ సీఐ దేవారెడ్డి తెలిపారు.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

పెరుగుతున్న భూ వివాదాలు... 
కరీంనగర్‌ శివారు ప్రాంతాల్లోని భూముల రేట్లు అమాంతంగా పెరగడంతో వివాదాలు కూడా అదేస్థాయిలో పెరిగిపోతున్నాయి. కొందరు ముఠాగా ఏర్పడి చాలా ఏళ్లక్రితం రిజిస్ట్రేషన్లు జరిగిన వాటిని గుర్తించి వాటికి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి వారిని బెదిరించడం లేదా కోర్టులో కేసులు వేసి వారిని ముప్పు తిప్పలు పెట్టడం చేసి అందినకాడికి దండుకుంటున్నారు. తీగలగుట్టపల్లిలో ఓ వ్యక్తి తరచూ భూవివాదాల్లో తలదూర్చి భూమి నాదే అంటూ కేసులు వేయడం నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయడం వాటిని అడ్డం పెట్టుకుని భూ యాజమానులను బెదిరించి వసూలు చేస్తున్నాడని సమాచారం. ఇలాంటి వివాదాలు కరీంనగర్‌లో ప్రతీరోజు జరుగుతూనే ఉన్నాయి. సివిల్‌ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోరు. దీన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగడం లేదా భూములను ఇతరులకు అమ్మడం చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఇలాంటి వారిని గుర్తించిన పోలీసులు గతంలో వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కొందరు మిన్నకుండినా ఈ మధ్యకాలంలో కొందరు రెచ్చిపోయి అందిన కాడికి దండకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement