land grabbers
-
కబ్జాదారులకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి,హైదరాబాద్: దుర్మార్గులు చెరువులను ఆక్రమించడం వల్లే వరదలు వస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చెరువులు, నాలాలు కబ్జా చేసిన వాళ్లు స్వచ్ఛంధంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేదంటే తమ హైడ్రా వాటిని మొత్తం నేలమట్టం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఆక్రమణదారులు ఎంత పెద్దవాళ్లైనా వదిలేది లేదని హెచ్చరించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం(సెప్టెంబర్11) జరిగిన ఎస్సైల పాసింగ్‌అవుట్ పరేడ్‌లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేసే స్కీమ్ ఏమీ లేదు. ఫాంహౌసుల్లోని డ్రైనేజీ నీటిని ఉస్మాన్‌సాగర్,హిమాయత్సాగర్లలో కలుపుతున్నారు’అని చెప్పారు. ‘పోలీసు జాబ్ అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు. అది ఒక భావోద్వేగం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీసులదే కీలక బాధ్యత. మా ప్రభుత్వం 30 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చింది. మరో 35వేలకుపైగా ఉద్యోగాలు ఈ ఏడాది చివరికల్లా ఇస్తాం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం.పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షలపై ఎవరికీ అనుమానాలు లేవు. కేవలం 8 నెలల్లోనే రైతు రుణమాఫీ చేశాం. దుర్మార్గులు చెరువులను ఆక్రమించడం వల్లే వరదలు వస్తున్నాయి. డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం. కొందరు వ్యసనాలకు అలవాటు పడి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు’అని సీఎం అన్నారు. ఇదీ చదవండి.. ఫ్యూచర్‌సిటీపై ఆచితూచి -
రామోజీరావు కబ్జాలపై చర్యలేవీ?
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): రాష్ట్రంలో కొందరు కబ్జాదారులపై మాత్రమే చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా కబ్జాదారులందరిపైనా చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు కోరారు. రేవంత్ సర్కారు హెచ్ఎండీఏ పరిధిలోని భూముల కబ్జాదారులపై చర్యలు చేపట్టడాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు. ఫిలింసిటీ పేరుతో ప్రభుత్వ రోడ్డును, పేదల భూములను ఆక్రమించిన రామోజీరావుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేటలోని 920 ఎకరాల భూకబ్జాపై కూడా సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ భూకబ్జా వెనుక మాజీ మంత్రుల హస్తం ఉందని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో గోనె ప్రకాశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి కమిటీ ద్వారా వాస్తవాలను తేల్చి భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ మంత్రుల సహకారంతో భూకబ్జా.. బొమ్మరాసిపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 323 నుంచి 409 వరకు 1,049 ఎకరాల భూమి ఉందని.. అందులో కొందరు రైతు సంఘం ముసుగులో 920 ఎకరాల భూమిని కబ్జా చేశారని గోనె ప్రకాశ్‌రావు ఆరోపించారు. 1965లో మీర్ రెహమత్ అలీతోపాటు మరో ఆరుగురి నుంచి మాజీ ఎంపీ దుగ్గిరాల బలరామకృష్ణ ఈ భూమి ని కొనుగోలు చేశారని.. ఆయన వారసులైన దుగ్గిరాల అమరేందర్బాబుతోపాటు మరో 20 మంది పేరిట ఆ భూమి రిజిస్టర్ అయిందని తెలిపారు. ఈ భూమి హక్కుదారులు విదేశాలలో స్థిరపడటంతో కొందరు దానిపై కన్నేశారని.. నకిలీ పత్రాలను సృష్టించి మాజీ మంత్రుల సహకారంతో కబ్జాకు పాల్పడ్డారన్నారు. రైతు సంఘం నేతలు ధర్నాలు చేస్తూ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ కూడా భూకబ్జాదారులకు వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. ఈ భూముల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయాలని.. జిల్లా కలెక్టర్ ద్వారా పూర్తి వివరాలు సేకరించి, అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై త్వరలో సీఎం రేవంత్‌ను కలుస్తానని చెప్పారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై కబ్జాదారుల దాడి
సాక్షి, నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గం ఎర్గట్ల మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై కొందరు కబ్జాదారులు దాడికి దిగారు. 430 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిని స్కూల్ పిల్లల గ్రౌండ్ కోసం ఉపయోగించాలని, అందుకు సంబంధించిన భూమి వివరాలను సాఫ్ట్వేర్ ఇంజినీర్ హరి ప్రసాద్ .. ఆర్టీఐ ద్వారా అధికారులను వివరాలు కోరారు. దీంతో కక్ష కట్టిన కబ్జాదారులు హరి ప్రసాద్‌పై ఇంటి వద్దకు వచ్చి దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతడి తల్లిపై కూడా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు అన్ని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. హరి ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి..
చంద్రగిరి( చిత్తూరు జిల్లా): తమ భూ దందాపై రెవెన్యూ అధికారులకు సమాచారమిస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కబ్జాదారులు బుధవారం మారణాయుధాలతో దాడి చేశారు. బుధవారం తనపల్లి సమీపంలో ఈఘటన చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు తిరుపతి రూరల్ మండలం తనపల్లి సమీపంలోని వినాయక నగర్లో వెంకటేష్‌రెడ్డి, సుబ్రమణ్యం, మారి నివాసం ఉంటున్నారు. వినాయక నగర్‌కు చెందిన మునిరత్నం భూ దందాలు ఇటీవల తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడేందుకు తిరుపతి రూరల్ తాహసీల్దార్ కిరణ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. వారం రోజులుగా ప్రభుత్వ భూముల అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ, స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వినాయక నగర్లో భారీగా భూ ఆక్రమణలు జరిగినట్లు వెలుగులోకి రావడంతో లోతైన విచారణ చేపట్టారు. అక్కడ నివాసముంటున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వెంకటేష్‌రెడ్డి, సుబ్రమణ్యం, మారి అధికారులకు సమాచారం ఇస్తున్నారని భూ కబ్జాదారుడు మునిరత్నం అనుమానించాడు. బుధవారం ఉదయం వెంకటేష్‌రెడ్డి, సుబ్రమణ్యం, మారి వాకింగ్ వెళ్తున్న సమయంలో మునిరత్నం, అతని అనుచరులు వెంబడించారు. ని ర్మానుష్య ప్రాంతంలో ఒక్కసారిగా వారిపై ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. మారి అక్కడ నుంచి తప్పించుకోగా, వెంకటేష్ రెడ్డి తలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. సుబ్రమణ్యం స్పృహ కోల్పోయాడు. వారు మృతి చెందారనుకుని మునిరత్నం, అనుచరులు అక్కడ నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వెంకటేష్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళా వలంటీర్‌పైనా దుశ్చర్య వెంకటేష్ రెడ్డి, సుబ్రమణ్యంపై జరుగుతున్న దాడిని గమనించిన వినాయకనగర్ వలంటీర్ మౌనికపై కూడా మునిరత్నం, ఆయన అనుచరులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వెంకటేష్ రెడ్డి, సుబ్రమణ్యంపై దాడి జరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న మౌనిక గమనించి, తన సెల్ఫోన్లో వీడియో తీసింది. ఇది గుర్తించిన మునిరత్నం తనపై దాడికి పాల్పడి, సెల్‌ఫోన్ లాక్కొని వెళ్లినట్లు మౌనిక తెలిపారు. ఈ మేరకు ఆమె తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
అడ్డుకోబోయిన మహిళను కాలుతో తన్ని...
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్లో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. 35 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ అయిన ఓ స్థలంపై నకిలీ పత్రాలు సృష్టించి, అమ్మకానికి పెట్టారు భూ బకాసురులు. ఇదేమని ప్రశ్నించిన స్థలం యజమానిపై కబ్జాదారుడు ఎదురుదాడికి దిగారు. అడ్డుకోబోయిన ఓ మహిళను కాలుతో కడుపులో తన్ని చేయి చేసుకున్నాడు. అప్పనంగా భూములు కొట్టేయడమే కాకుండా, భూమి సొంతదారులపై దాడికి సైతం తెగబడటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన కరీంనగర్‌లోని రామచంద్రాపూర్ కాలనీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన చింతిరెడ్డి ఇందిరమ్మ అనే మహిళ 35 ఏళ్లక్రితం కరీంనగర్‌లోని సిక్‌వాడికి చెందిన సురేందర్‌పాల్ సింగ్ అనే వ్యక్తి వద్ద నుంచి రామచంద్రాపూర్‌కాలనీకి చెందిన సర్వే నంబర్ 965లోని 266 గజాల ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేశారు. 1985లో ఈ మేరకు ఇందిరమ్మ పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. ఆమె వద్ద నుంచి ఆ భూమిని చింతిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2010లో కొనుగోలు చేసి అతడి భార్య స్వరూప పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఎల్ఆర్ఎస్ కూడా తీసుకున్నారు. ఈనెల 4వ తేదీన సిక్‌వాడీకి చెందిన యస్పాల్‌సింగ్, రాజీవీర్‌సింగ్‌లు మరో ఇద్దరు మహిళలు కలిసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి చింతిరెడ్డి స్వరూప పేరు మీద ఉన్న భూమిని పురంశేట్టి వెంకయ్య అనే వ్యక్తికి విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసరెడ్డి తన భూమిని కాపాడుకునేందుకు ఈనెల 19వ తేదీన భూమిలో నిర్మాణం చేపట్టారు. ఈ సమయంలో యస్పాల్‌సింగ్, రాజ్‌వీర్‌సింగ్‌లు వచ్చి ఈ భూమి మాకు చెందిందని బెదిరించడంతో కరీంనగర్ టుటౌన్ పోలీసులకు ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలని ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటే క్రిమనల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించి పంపించారు. గురువారం ఉదయం ప్రహరీ నిర్మించేందుకు శ్రీనివాస్‌రెడ్డి భూమిలోకి వెళ్లగా సమాచారం తెలుసుకున్న ప్రత్యర్థులు అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. శ్రీనివాసరెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ పెద్దది కావడంతో ఆవేశానికి గురైన యాస్పాల్‌సింగ్ అనుచరులు శ్రీనివాస్‌రెడ్డిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే శ్రీనివాస్‌ను ఆస్పత్రికి తరలించారు. బాధితుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని టుటౌన్ సీఐ దేవారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పెరుగుతున్న భూ వివాదాలు... కరీంనగర్ శివారు ప్రాంతాల్లోని భూముల రేట్లు అమాంతంగా పెరగడంతో వివాదాలు కూడా అదేస్థాయిలో పెరిగిపోతున్నాయి. కొందరు ముఠాగా ఏర్పడి చాలా ఏళ్లక్రితం రిజిస్ట్రేషన్లు జరిగిన వాటిని గుర్తించి వాటికి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి వారిని బెదిరించడం లేదా కోర్టులో కేసులు వేసి వారిని ముప్పు తిప్పలు పెట్టడం చేసి అందినకాడికి దండుకుంటున్నారు. తీగలగుట్టపల్లిలో ఓ వ్యక్తి తరచూ భూవివాదాల్లో తలదూర్చి భూమి నాదే అంటూ కేసులు వేయడం నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయడం వాటిని అడ్డం పెట్టుకుని భూ యాజమానులను బెదిరించి వసూలు చేస్తున్నాడని సమాచారం. ఇలాంటి వివాదాలు కరీంనగర్లో ప్రతీరోజు జరుగుతూనే ఉన్నాయి. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోరు. దీన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగడం లేదా భూములను ఇతరులకు అమ్మడం చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఇలాంటి వారిని గుర్తించిన పోలీసులు గతంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. కొందరు మిన్నకుండినా ఈ మధ్యకాలంలో కొందరు రెచ్చిపోయి అందిన కాడికి దండకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. -
చినబాబు రాక.. కబ్జాదారుల వేట!
ఆత్మకూరు (మంగళగిరి): ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీకి రంగంలోకి దిగారో లేదో.. వెంటనే భూకబ్జాదారులు సైతం అక్కడ వాలిపోయారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మంత్రి లోకేష్ పేర్లు చెప్పి రూ.100 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించడం శనివారం మంగళగిరిలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఆత్మకూరు గ్రామంలో హ్యాపీ రిసార్ట్స్ అధినేత అంబటి మధుమోహనకృష్ణ మరికొంతమంది కలిసి శాంతి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 1995లో భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. ఆత్మకూరు గ్రామం 373 సర్వే నంబరులోని ఎనిమిది ఎకరాల భూమిలో రియల్ వెంచర్ వేసి ఒక్కో ప్లాటు 200 గజాల చొప్పున అందులో టేకు, మామిడి, జామ మొక్కలు పెంచి ఐదు సంవత్సరాల పాటు వాయిదా కట్టేలా ప్లాట్లు విక్రయించారు. దీంతో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలకు చెందిన 127 మంది ప్లాట్లను కొనుగోలు చేసి నెలా నెలా వాయిదా చెల్లించి 1999–2000వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే 373 సర్వే నంబర్లోని ఎనిమిది ఎకరాలను తాను కొనుగోలు చేశానంటూ 2003లో పిడుగురాళ్ళకు చెందిన పచ్చవ వేమయ్య దస్తావేజులు తేవడంతో వెంచర్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. పిడుగురాళ్ళలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కార్యాలయం సైతం వేమయ్యదే కావడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి అడంగల్‌లో పేర్లు ఎక్కించుకుని మళ్లీ కబ్జాకు యత్నించగా ప్లాట్ల యజమానులంతా అసోసియేషన్‌గా ఏర్పడి సివిల్ కోర్టును ఆశ్రయించారు. వివాదం కోర్టులో ఉండగా వేమయ్య హైకోర్టును ఆశ్రయించగా..ఇరు పక్షాలు సివిల్ కోర్టులో రుజువులు చూపించాలని ఆదేశించింది. సివిల్ కోర్టులో వాదనలు జరుగుతుండగా కోర్టు ఈనెల 27 వ తేదీకి వాయిదా వేసింది. కోర్టులో తమ నకిలీ దస్తావేజులు చెల్లవనే ఆందోళనతో వేమయ్య తమ అధికార బలంతో పాటు, తన అల్లుడికి జిల్లా ఉన్నతాధికారి స్నేహితుడు కావడంతో అటు రాజకీయ నాయకుల్ని, ఇటు అధికారుల్ని ఉపయోగించి ఆగమేఘాల మీద భూమిలోని టేకు చెట్లను తొలగించేందుకు ఉత్తర్వులు తెచ్చుకోగలిగారు. వీఆర్వో ఇచ్చిన సర్టిఫికెట్తో తహసీల్దార్ ఎన్వోసీ ఇవ్వగా దాన్ని ఆధారంగా చూపి అటవీశాఖ అధికారులు అనుమతులు మంజూరు చేయడం వివాదాస్పదమవుతోంది. ఇదే అదనుగా వేమయ్య 50 మంది అనుచరులతో శనివారం అర్ధరాత్రి వివాదాస్పద స్థలంలో టేకు చెట్లను నరికించారు. విషయం తెలుసుకున్న ప్లాట్ల యజమానులు తమ ప్లాట్లలో ఉన్న టేకు చెట్లు ఎలా నరుకుతారంటూ ప్రశ్నించగా, ఎవరు వచ్చినా మమ్మల్ని అడ్డుకోలేరని, లోకేష్ మంగళగిరిలోనే పోటీ చేస్తున్నారని ఇక తమను అడ్డుకునే ధైర్యం ఎవరికీ ఉండదని.. అడ్డుకుంటే అడ్డుకున్న వారిని నరుకుతామంటూ వేమయ్య బెదిరింపులకు దిగినట్లు ప్లాట్ల యజమానులు తెలిపారు. సమాచారం అందుకున్న యజమానులంతా అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగడంతో చెట్లను నరకడం ఆపారు. బాధితులు ఆందోళన చేస్తుండగా వేమయ్య మాత్రం తన వాహనాల్లో వచ్చిన వారితో అక్కడే తిష్ట వేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు సైతం సివిల్ వివాదం కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని బాధితులు కోర్టు వాయిదా ఉన్న 27వ తేదీ వరకు కుటుంబాలతో సహా ఇక్కడే ఉండి తమ ప్లాట్లను కాపాడుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. పేర్లు చెప్పి బెదిరిస్తున్నారు.. 1995లో వేసిన ప్లాట్లను వాయిదాల్లో డబ్బు కట్టి 1999–2000 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. నకిలీ దస్తావేజులు సృష్టించిన వేమయ్య మమ్మల్ని బెదిరిస్తున్నాడు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, లోకేష్ తమకు అండగా ఉన్నారని, అడ్డుకుంటే నరుకుతామని బెదిరిస్తున్నారు. కోర్టులో వివాదం నడుస్తుండగా అధికారులు ఎన్వోసీ ఇవ్వడం వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిడితో పాటు అధికారుల పాత్ర ఉన్నట్లు తెలిసింది. –పడిగి శ్రీనివాసరావు ప్లాట్ల యజమానుల సంఘం కార్యదర్శి కోర్టు ఆదేశాలు వచ్చేవరకు ఎవరినీ అనుమతించవద్దు.. భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడుతుందని నోరు కట్టుకుని నెలా నెలా కట్టుకుని ఎంతో కష్టపడి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. భూముల ధరలు పెరగడంతో టీడీపీ నేతల అండతో కబ్జాకు యత్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కోర్టు ఆదేశాలు వచ్చేవరకు ఎవరినీ అనుమతించకుండా చర్యలు తీసుకోవాలి. – నసీమున్నీషా అధికారులు మాకు రక్షణ కల్పించాలి భూమిపై వేమయ్యకు అన్ని హక్కులుంటే అర్ధరాత్రులు ఎందుకు చెట్లు నరకడం. పగలే తనది భూమి అని చెప్పి చెట్లు నరికి స్వాధీనం చేసుకోవచ్చు కదా. తాము వచ్చి అడ్డుకుంటే బెదిరిస్తున్నారు. లోకేష్, యరపతినేని అండగా ఉన్నారని, కబ్జాను అడ్డుకుంటే మనుషులను నరుకుతాం అంటున్నారు. అధికారులు మాకు రక్షణ కల్పించాలి. – ఎన్.ఝాన్సీరాణి నోటికాడ ముద్ద లాక్కోవాలని చూస్తున్నారు పిల్లలతో పాటు మా జీవితాలకు ఆధారంగా ఉంటుందని తినీ తినక నెలా నెలా కిస్తీలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఇప్పుడు మా నోటి కాడ ముద్ద లాక్కోవాలని చూస్తున్నారు. అధికార పార్టీ నేతలు అధికారుల అండతోనే ఆక్రమణకు పూనుకున్నారు. వెంటనే ఉన్నతాధికారులు కలుగజేసుకుని మా ప్లాట్లను కాపాడి మా జీవితాలను నిలబెట్టాలి. – బండి నాగమల్లేశ్వరి -
టీడీపీలో భూ కబ్జాదారులకే ప్రాధాన్యత
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): టీడీపీలో భూ కబ్జాదారులకే అధిక ప్రాధాన్యత లభిస్తుందని, పార్టీకోసం పనిచేసేవారికి గుర్తింపు లేదని ఆ పార్టీ విజయవాడ అర్బన్ మాజీ ఉపాధ్యక్షుడు ముష్టి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 27 ఏళ్లుగా పార్టీకోసం పనిచేసిన తనకు అన్యాయం జరిగిందంటూ మీడియా ముందుకు వచ్చారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని, అనేక చోట్ల భూ కబ్జాలకు పాల్పడ్డారని అయినా టికెట్ ఇచ్చారన్నారు. ఉమా ఎదుగుదలకు అడ్డువస్తానని భావించి తనను పదవినుంచి తప్పించారన్నారు. ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, బొండా ను ఓడిస్తానన్నారు. -
నగరంలో భూచోళ్లు...!
రియల్ ఎస్టేట్ ముసుగులో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేస్తున్నారు.కొంతమొత్తంలో ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా కలిపేసుకుంటున్నారు. వీరికి అధికార పార్టీ నాయకులు వత్తాసు పలుకుతున్నారు. వారిపై చర్యలు తీసుకోలేక అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. అడ్డుకునేందుకు ఎవరైనా స్థానికులు యత్నిస్తే వారికి హెచ్చరికలు సైతం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఈ తరహా అక్రమాలు జరుగుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. విజయనగరం మున్సిపాలిటీ: విజయనగరం పట్టణ శివారు ప్రాంతం బొబ్బాదిపేట దశాబ్దం క్రితం వరకూ మండల పరిధిలో ఉన్న సమయంలో సర్వే నంబర్ 4/3లోని ఐదు ఎకరాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా లే అవుట్ వేశారు. ఈ ప్రాంతం విజయనగరం మున్సిపాలిటీలో విలీనం కాగా... ప్రస్తుతం 26వ వార్డు పరిధిలో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం స్థలం ధర రూ. 10 వేల నుంచి రూ. 15వేల వరకు పలుకుతోంది. ఇప్పటికీ లే అవుట్‌ను క్రమబద్ధీకరించుకోని స్థల యజమానులు అడ్డదారిలో అమ్మకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం అధికార బలం ఉన్న స్థానిక కౌన్సిలర్‌తో బేరం కుదుర్చుకున్నారు. దశాబ్దం అనంతరం ఆ అనధికారిక లే అవుట్లో పనులు మరల ప్రారంభమయ్యాయి. లే అవుట్‌ను ఆనుకుని 75 సెంట్ల రామ్మూర్తి బందను ఆక్రమించేశారు. లే అవుట్ పక్కనుంచి వెళ్లే 60 అడుగుల ఎర్రవాని చెరువు కాలువలో సింహభాగం ఆక్రమించేశారు. అంతటితో ఆగకుండా రెవెన్యూ యంత్రాంగం, మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా లే అవుట్‌కు వెళ్లివచ్చేందుకు రెండు రహదారులను నిర్మించేస్తున్నారు. ఇందుకోసం లే అవుట్ దిగువన ఉన్న ఎర్రవాని చెరువు కాలువలో చిన్నపాటి గొట్టాలు వేసి మట్టి రోడ్లు వేసేస్తున్నారు. ఇదంతా చూసిన ఎర్రవాని చెరువు ఆయకుట్టు రైతులు ప్రతిఘటించటంతో స్థానిక కౌన్సిలర్ రంగంలోకి దిగి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇది మున్సిపాలిటీ స్థలం ఏం చేసుకుంటే మీకెందుకంటూ ఎదురుదాడికి దిగారని స్థానికులు చెబుతున్నారు. ఇదే విషయమై స్థానికులు కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌లో పిర్యాదు చేస్తే రెవెన్యూ యంత్రాంగం వచ్చి లే అవుట్‌కు సరిహద్దులు వేసి వెళ్లగా వాటినీ అక్రమార్కులు చక్కగా మార్చేసి విక్రయాలకు సిద్ధమవుతున్నారు. రాత్రి వేళల్లో రోడ్ల పనులు ఇప్పటికీ అనుమతులు లేవని స్థానికులు చెబుతున్న ఈ లే అవుట్‌కు వెళ్లాలంటే బొబ్బాదిపేట శివారుకు వెళ్లి తిరిగి రావాలి. లే అవుట్‌కు పట్టణానికి దూరం పెరిగితే మంచి ధర పలకదన్న భావనతో సర్వే నంబర్ 6/77లో గల ఎర్రవాని చెరువు కాలువపై నుంచి మహాలక్ష్మీనగర్ వైపు రోడ్లు వేసేందుకు అక్రమార్కులు రంగం సిద్ధం చేసుకున్నారు. స్థానిక కౌన్సిలర్‌తో ఒప్పందం కుదుర్చుకుని కాలువ మార్గంలో చిన్నపాటి గొట్టా లు వేసి మట్టి రోడ్డు నిర్మించేందుకు యత్నించారు. ఇదంతా గమనించిన స్థానికులు, చెరువు ఆయకట్టు రైతులు అడ్డుకోవటంతో ఇటీవల రాత్రి వేళల్లో యంత్రాలతో పనులు చేపట్టేశారు. ప్రశ్నార్థకంగా చెరువు ఆయకట్టు భూమి ఈ లేఅవుట్‌కు వేస్తున్న రోడ్లు వేసేందుకు రెవెన్యూ రికార్డుల ప్రకారం 60 అడుగుల వెడల్పు గల కాలువను కబ్జా చేయటంతో ఎర్రవాని చెరువు కింద 100 ఎకరాల భూమి సాగు ప్రశ్నార్థకంగా మారింది. 8.50 ఎకరాల విస్తీర్ణం గల ఎర్రవాని చెరువులోనే జిల్లా కేంద్రాసుపత్రి ప్రాంతం నుంచి సాలిపేట మీదుగా ప్రవహించే వాడుక నీరంతా కలుస్తోంది. భారీ వర్షాలు కరిసే సమయంలో ఈ కాలువ గుండా వచ్చే నీరు సంవత్సరమంతా రైతుకు ఉపయోగపడుతోంది. 60 అడుగుల గల ఈ కాలువ స్థలంలో సుమారు 50 అడుగులు ఇప్పటికే ఆక్రమించేశారు. మిగిలిన పది అడుగుల కాలువలో చిన్నపాటి పైప్‌లైన్ వేసి రోడ్డు నిర్మించటంతో గతంలో మాదిరి చెరువులోకి నీరు వచ్చే అ వకాశం లేదని స్థానిక రైతులు ఆవేదన. వచ్చే ఏడాది నుంచి పంట సాగు చేసేందుకు నీటి సమ స్య ఉత్పన్నమవుతుందని వారు చెబుతున్నారు అధికారులు వేసిన రాళ్లనూ పీకేశారు సర్వే నంబర్ 4/3లో గల అనధికారిక లే అవుట్ అక్రమాలపై గతంలోనే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. అప్పటి వీఆర్వో రవికుమార్ వచ్చి లే అవుట్లో అక్రమాలను గుర్తించి రాళ్లను సరి చేసి వెళ్లారు. కొద్ది రోజుల వ్యవధిలోనే చెరువు కాలువను ఆక్రమించి సాగుభూములకు నీరివ్వకండా చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి – తుమ్మగంటి నాగేశ్వరరావు, ఆయకట్టు రైతు మళ్లీ పరిశీలించి చర్యలు తీసుకుంటాం బొబ్బాదిపేటలోని లే అవుట్లో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారంటూ గతంలో ఒక సారి మా దృష్టికి వచ్చింది. స్థానికులు ఫిర్యాదు చేశారు. అప్పట్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసి కేసు నమోదు చేశాం. మరో మారు పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – ప్రభాకర్, హెచ్‌డీటీ, విజయనగరం ఎలా బతకాలి 1958 నుంచి ఎర్రవాని చెరువు కింద పంట సాగు చేసుకుంటున్నాం. మాకు రెండెకరాల భూమి ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకుల బలంతో కాలువలు కప్పేసి లే అవుట్లకు రోడ్లేస్తున్నారు. ఇలా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేసుకుని డబ్బు జేసుకుంటే అధికారులకు ఎందుకు కనబడటం లేదు. – తుమ్మగంటి లక్ష్మి, ఆయకట్టు రైతు -
ఎలా ఖాళీ చేయిస్తారో చూస్తాం..
చీపురుపల్లి: చీపురుపల్లి పట్టణ శివారున శ్రీకాకుళానికి వెళ్లే రహదారిలో సర్వే నంబర్ 65లో గెడ్డవాగు ఉంది. కొందరు వ్యక్తులు ఆ వాగును పూడ్చేసి ఆక్రమించుకుని, చిన్న షెడ్డులు వేసేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ అధికారులు వారికి ఆరేడు నోటీసులు జారీ చేశారు. వారు స్పందించకపోవడంతో ఖాళీ చేయించేందుకు శనివారం అక్కడికి అధికారులు చేరుకున్నారు. వెంటనే ఖాళీ చేయాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని నానా హడావుడి చేశారు. జెడ్పీటీసీ రంగ ప్రవేశంతో.. విషయం తెలుసుకున్న చీపురుపల్లి జెడ్పీటీసీ, అధికార పార్టీ నేత మీసాల వరహాలనాయుడు అక్కడికి చేరుకున్నారు. మండల వ్యాప్తంగా అన్ని చోట్ల ఆక్రమణలు జరిగాయి. వాటిని వదిలేసి ఇక్కడ పేదలు వేసుకున్న చిన్న వర్క్‌షాపులను తొలగించేందుకు వచ్చారా..? అవి మీకు కనిపించడం లేదా..? అని అధికారులను నిలదీశారు. ఒక దశలో మీరెలా ఖాళీ చేయిస్తారో చూస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. పేదలకు సాయపడని అధికారులు ఎందుకు అని హుకుం జారీ చేశారు. అంతే అప్పటివరకు నానా హడావుడి చేసిన అధికారులు చప్పగా మారిపోయారు. చేతులు కట్టుకుని జెడ్పీటీసీ చెప్పినదానికి తలలు ఊపారు. అధికార పార్టీ నేత కావడంతో.. వరహాల నాయుడు అధికార పార్టీ నేత కావడంతో మళ్లీ ఎమ్మెల్యే, మంత్రి దృష్టికి తీసుకెళితే ఇబ్బందులు వస్తాయని తలచిన అధికారులు కిమ్మనకుండా ఉండిపోయారు. తహసీల్దార్ ముక్తేశ్వరరావు ఆదేశాలతో ఖాళీ చేయించేందుకు స్థానిక వీఆర్ఓ, ఆర్ఐ వసంత, ఇరిగేషన్ ఏఈ పవన్‌కుమార్, డీటీ కెఎస్ఎన్.మూర్తి తదితరులు వెళ్లారు. వారు చర్యలు ప్రారంభిస్తుండగా జెడ్పీటీసీ అక్కడి చేరుకుని సోమవారం వరకు సమయం కావాలని లేకుంటే ఖాళీ చేయమని బదులిచ్చారు. ఒకానొక సమయంలో రెవెన్యూ అధికారులు, విలేకర్లపై అసహనం వ్యక్తం చేశారు. అయితే డీటీ మూర్తి మూర్తి మాట్లాడుతూ సాయంత్రం వరకు సమయం ఇస్తున్నామని అప్పటికే ఖాళీ చేయాలని, తన చేతిలో ఏమీ లేదని స్పష్టం చేశారు. తర్వాత అధికారులు జెడ్పీటీసీ వేర్వేరుగా మాట్లాడుకుని, సాయంత్రానికి ఆక్రమణదారులే స్వచ్ఛందంగా ఖాళీ చేస్తారని హామీ ఇవ్వడంతో అధికారులు వెనుతిరిగారు. -
కబ్జా కోరల్లో రూ.కోట్ల భూమి
♦ కనిగిరిలో రెచ్చిపోతున్న భూ బకాసురులు ♦ అక్రమార్కుల చెరలో ప్రభుత్వ, పోరంబోకు భూములు ♦ నిద్ర నటిస్తున్న అధికారులు కనిగిరి: భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. జాగా కన్పిస్తే పాగా వేసేస్తున్నారు. అధికారులకు ఆమ్యామ్యాలు ఎరజూపి రికార్డులు తారుమారు చేస్తున్నారు. అటవీ పోరంబోకు, అసైన్డ్, వాగు, గ్రేజీంగ్ భూములను ఆక్రమించేస్తున్నారు. కనిగిరి నియోజకవర్గంలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అక్రమార్కుల పాలవుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిద్రనటిస్తున్నారు. కనిగిరి మండలం చల్లగిరిగిల్లలో పశువుల మేత భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆక్రమణకు ఉపక్రమించాడు. 10.71 ఎకరాల భూమి(సుమారు రూ.10లక్షలు)ని వీఆర్వో ద్వారా రికార్డులు ట్యాంపరింగ్ చేసి అక్రమంగా ఇద్దరి పేర్లపై ఎక్కించుకున్నాడు. పామూరు మండలంలో.. ♦ మోపాడు రిజర్వాయర్ తొట్టిప్రాంతంలో విలువైన సుమారు 100 ఎకరాల తొటిభూమిని టీడీపీ నాయకులు ఆక్రమించగా, ♦ నెల్లూరు రోడ్డులోని సర్వేనంబర్ 447 ఎదురుగా ఉన్న రూ 50లక్షల విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమించి లేఅవుట్లు వేసారు. ♦ నెల్లూరు రోడ్డులోని వల్లీ, భుజంగేశ్వరస్వామి, మదన వేణుగోపాలస్వామి, ఇనాం, దేవదాశీ భూములు రూ 5కోట్ల విలువ చేసేవీ టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కాగా సమస్య కోర్టులోనలుగుతుంది. కోట్ల విలువచేసే బ్రహ్మంగారి, శంకరమ్మ మఠంకు చెందిన స్థలాలు ఆక్రమణలో ఉన్నాయి. కొత్తచెరువుకు వచ్చే కాల్వను సైతం ఆక్రమించుకున్నారు. సీఎస్‌పురంలో.. ♦ పెదగోగులపల్లిలో 392 సర్వే నంబర్లో 70 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా అధికార పార్టీ నాయకులు 60 ఎకరాల వరకు ఆక్రమించు కుని జామాయిల్ పంట సాగు చేశారు. వెలిగండ్లలో.. ♦ బొంతగుంట్లపల్లిలో సర్వే నంబర్ 77లో 133.55 ఎకరాలు, సర్వేనెంబర్ 65లో 414.25 పశువుల మేత పోరంబోకు భూమి ఉంది. ఈ రెండు సర్వే నంబర్లలో 75 శాతం భూమి ఆక్రమణకు గురైంది. ♦ వెలిగండ్ల పరిధిలో సర్వే నంబర్ 749, 752బై1లో 4.89 సెంట్లు ఆక్రమణలో ఉంది. వీటిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. హనుమంతునిపాడులో.. ♦ కోటతిప్పల, కొండారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామాల్లో ఆక్రమణదారులు 222 సర్వే నంబర్లో 240 ఎకరాలు, 207, 205, 206లో గల భూమిని ఆక్రమించి, జామాయిలు సాగు చేశారు. ♦ మహమ్మదాపురం రెవెన్యూలో సర్వే నంబర్ 415,421,420, 405,413,417,439,లో భూమి ఆక్రమించి సాగు చేశారు. ♦ ముప్పళ్లపాడు రెవెన్యూలో 220 సర్వేనంబర్‌లో 200 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని ఆక్రమించి జామాయిలుసాగు చేశారు. ఇవి కొన్ని మచ్చుకకు మాత్రమే. కబ్జాలకు కేరాఫ్‌గా పీసీపల్లి.. పీసీపల్లిలో మండలంలో భూ ఆక్రమణదారులు రెచ్చిపోయి కబ్జా చేస్తున్నారు. ముద్దపాడు పంచాయతీలో రూ.1.20 కోట్ల విలువ చేసే 43 ఎకరాల గ్రేజింగ్ పోరంబోకు భూమిపై అధికార పార్టీ గద్దల కన్ను పడింది. అధికారులను మెత్తపరిచి దున్నకాలు చే స్తున్నారు. అప్పలవాడికుంట వద్దగల 364, 374 సర్వే నంబర్లలోని గ్రేజింగ్ భూమిని ఎన్.అంకయ్య, జి.చెన్నయ్య అక్రమంగా సాగు చేస్తున్నట్లు సర్పంచ్ లక్ష్మమ్మ 2015 జూన్ 22న కలెక్టర్, జేసీకి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు సాగును అడ్డుకుని ప్రభుత్వ భూమిగా బోర్డును పెట్టారు. పశువుల బీడు భూమి కావడంతో అప్పట్లో సర్పంచ్ దానిని పేదలకు ఇవ్వాని తీర్మాన ం చేశారు. ఈ భూమిలో ప్రభుత్వ నిధులతో పనులు కూడా చేశారు. మరలా రోజుల నుంచి అక్రమార్కులు ప్రభుత్వ బోర్డును పడేసి సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. సర్పంచ్ ఎస్.లక్ష్మమ్మ తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. అలాగే పీసీపల్లి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి 83 ఎకరాల్లో కొందరు అక్రమంగా జామాయిల్ సాగు చేశారు. రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చి చేయిదులుపు కున్నారు. మురిగమ్మిలో 450 ఎకరాల అటవీ పొరంబోకు, బంజరు భూమిని అక్రమంగా సాగుచేస్తున్నారు. అక్రమార్కులు దీనికి దొంగ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు జరిపినట్లు సమాచారం. పెదఇర్లపాడు రెవెన్యూ పరిధిలో 250 ఎకరాలను, గుంటుపల్లి పంచాయతీలొ గ్రేజిగ్ పొరంబోకు, ఆటవిపోరంబోకు, ఆనాదినం, చింతగుంల్లి రెవిన్యూలొ వందలాది ఎకరాలలో అక్రమ సాగు జరుగుతోంది. -
పోలవరం భూముల్లో 'పెద్దల పాగా'
ప్రాజెక్ట్ కోసం గిరిజనుల నుంచి సేకరించిన స్థలాల్లో ప్రైవేటు రిసార్ట్స్ అనుమతులు లేకుండా రాత్రి సమయాల్లో నిర్మాణం రెండు నెలలుగా పనులు చేస్తున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం ఏలూరు/పోలవరం : జాతీయ బహుళార్థసాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం గిరిజనుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూముల్లో పెద్దలు పాగా వేస్తున్నారు. ముంపు గ్రామాల్లో గిరిజనులను ఖాళీ చేయించేందుకు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్న అధికారులు.. ప్రాజెక్టు భూముల్లో రిసార్ట్స్ నిర్మాణం జరుగుతున్నా తమకు ఏమీ తెలియదన్నట్టు నిద్ర నటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో నిర్వాసితులు సహా ఎవరూ వ్యవసాయం చేయకూడదని, అలా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ.. ఆ భూముల్లోనే అడ్డగోలుగా రిసార్ట్స్ నిర్మాణం సాగుతున్నా నోరు మెదపడం లేదు. వివరాల్లోకి వెళితే.. పోలవరం మండలం శివగిరి ప్రాంతంలో అరగంటి కృష్ణారెడ్డి, ఆయన కుమార్తె అరగంటి కృష్ణకుమారిలకు 12.24 ఎకరాల భూమి ఉండేది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ఈ భూమిని సేకరించింది. దీనికి బదులుగా జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురంలోని 106, 86, 73/1, 11/5, 99, 102 సర్వే నంబర్లలో 12.24 ఎకరాల భూమిని కృష్ణారెడ్డి, కృష్ణకుమారిలకు కేటాయించారు. శివగిరిలో ప్రభుత్వం సేకరించిన భూమిలో రెండు నెలలుగా టూరిజం గెస్ట్‌హౌస్‌లు, రిసార్ట్స్ నిర్మాణాలు సాగుతున్నాయి. ఇప్పటికే పది గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. భీమవరం వాస్తవ్యుడు, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న ఓ వ్యాపారి ఈ రిసార్ట్స్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. వీటిని గిరిజనులే నిర్మించుకుంటున్నారని, తాము నిర్మాణ పనులు మాత్రమే చేస్తున్నామని అక్కడి పనులను పర్యవేక్షిస్తున్న వ్యాపారి సంబంధీకులు చెప్పుకొస్తున్నారు. అవునా.. తెలియదే శివగిరి గ్రామం వద్ద రిసార్ట్స్ నిర్మిస్తున్న విషయాన్ని పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ అధికారి, జంగారెడ్డిగుడెం ఆర్డీఓ ఎస్.లవన్న దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా.. ‘అవునా.. ఆ విషయం నాకు తెలియదే’ అని వ్యాఖ్యానించారు. ఆర్ అండ్ ఆర్ వ్యవహారాల్లో నిమగ్నమై ఉండటం వల్ల ఆ విషయంపై దృష్టి సారించలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగినట్టు తేలితే త్వరలోనే ఆ రిసార్ట్స్‌ను తొలగిస్తామన్నారు. -
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అవినీతి అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ అంశంపై విచారణకు ఆదేశించినట్లు స్థానిక ఎమ్మార్వో సీహెచ్ రవీంద్రరెడ్డి శుక్రవారం వెల్లడించారు. కీసర మండలంలోని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రవీంద్రరెడ్డి హెచ్చరించారు. అయితే రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూకబ్జాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.