నగరంలో భూచోళ్లు...! | Land grabbers in city | Sakshi
Sakshi News home page

నగరంలో భూచోళ్లు...!

Published Tue, Mar 6 2018 12:02 PM | Last Updated on Fri, Aug 10 2018 8:46 PM

Land grabbers in city - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రియల్‌ ఎస్టేట్‌ ముసుగులో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేస్తున్నారు.కొంతమొత్తంలో ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా కలిపేసుకుంటున్నారు. వీరికి అధికార పార్టీ నాయకులు వత్తాసు పలుకుతున్నారు. వారిపై చర్యలు తీసుకోలేక అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. అడ్డుకునేందుకు ఎవరైనా స్థానికులు యత్నిస్తే వారికి హెచ్చరికలు సైతం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఈ తరహా అక్రమాలు జరుగుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

విజయనగరం మున్సిపాలిటీ: విజయనగరం పట్టణ శివారు ప్రాంతం బొబ్బాదిపేట దశాబ్దం క్రితం వరకూ మండల పరిధిలో ఉన్న సమయంలో సర్వే నంబర్‌ 4/3లోని ఐదు ఎకరాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా లే అవుట్‌ వేశారు. ఈ ప్రాంతం విజయనగరం మున్సిపాలిటీలో విలీనం కాగా... ప్రస్తుతం 26వ వార్డు పరిధిలో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం స్థలం ధర రూ. 10 వేల నుంచి రూ. 15వేల వరకు పలుకుతోంది. ఇప్పటికీ లే అవుట్‌ను క్రమబద్ధీకరించుకోని స్థల యజమానులు అడ్డదారిలో అమ్మకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇందుకోసం అధికార బలం ఉన్న  స్థానిక కౌన్సిలర్‌తో బేరం కుదుర్చుకున్నారు. దశాబ్దం అనంతరం ఆ అనధికారిక లే అవుట్‌లో పనులు మరల ప్రారంభమయ్యాయి. లే అవుట్‌ను ఆనుకుని 75 సెంట్ల రామ్మూర్తి బందను ఆక్రమించేశారు. లే అవుట్‌ పక్కనుంచి వెళ్లే 60 అడుగుల ఎర్రవాని చెరువు కాలువలో సింహభాగం ఆక్రమించేశారు. అంతటితో ఆగకుండా రెవెన్యూ యంత్రాంగం, మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా లే అవుట్‌కు వెళ్లివచ్చేందుకు రెండు రహదారులను నిర్మించేస్తున్నారు.

ఇందుకోసం లే అవుట్‌ దిగువన ఉన్న  ఎర్రవాని చెరువు కాలువలో చిన్నపాటి గొట్టాలు వేసి మట్టి రోడ్లు వేసేస్తున్నారు. ఇదంతా చూసిన ఎర్రవాని చెరువు ఆయకుట్టు రైతులు  ప్రతిఘటించటంతో  స్థానిక కౌన్సిలర్‌ రంగంలోకి దిగి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇది మున్సిపాలిటీ స్థలం  ఏం చేసుకుంటే మీకెందుకంటూ ఎదురుదాడికి దిగారని స్థానికులు చెబుతున్నారు. ఇదే విషయమై స్థానికులు కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌సెల్‌లో పిర్యాదు చేస్తే రెవెన్యూ యంత్రాంగం వచ్చి లే అవుట్‌కు సరిహద్దులు వేసి వెళ్లగా వాటినీ అక్రమార్కులు చక్కగా మార్చేసి విక్రయాలకు సిద్ధమవుతున్నారు.
 
రాత్రి వేళల్లో రోడ్ల పనులు
ఇప్పటికీ అనుమతులు లేవని స్థానికులు చెబుతున్న ఈ లే అవుట్‌కు వెళ్లాలంటే బొబ్బాదిపేట శివారుకు వెళ్లి తిరిగి రావాలి. లే అవుట్‌కు పట్టణానికి దూరం పెరిగితే మంచి ధర పలకదన్న భావనతో సర్వే నంబర్‌ 6/77లో గల ఎర్రవాని చెరువు కాలువపై నుంచి మహాలక్ష్మీనగర్‌ వైపు రోడ్లు వేసేందుకు అక్రమార్కులు రంగం సిద్ధం చేసుకున్నారు. స్థానిక కౌన్సిలర్‌తో ఒప్పందం కుదుర్చుకుని కాలువ మార్గంలో చిన్నపాటి గొట్టా లు వేసి మట్టి రోడ్డు నిర్మించేందుకు యత్నించారు. ఇదంతా గమనించిన స్థానికులు, చెరువు ఆయకట్టు రైతులు అడ్డుకోవటంతో  ఇటీవల రాత్రి వేళల్లో  యంత్రాలతో పనులు చేపట్టేశారు.
 
ప్రశ్నార్థకంగా చెరువు ఆయకట్టు భూమి
ఈ లేఅవుట్‌కు వేస్తున్న రోడ్లు వేసేందుకు రెవెన్యూ రికార్డుల ప్రకారం 60 అడుగుల వెడల్పు గల కాలువను కబ్జా చేయటంతో ఎర్రవాని చెరువు కింద 100 ఎకరాల భూమి సాగు ప్రశ్నార్థకంగా మారింది. 8.50 ఎకరాల విస్తీర్ణం గల ఎర్రవాని చెరువులోనే జిల్లా కేంద్రాసుపత్రి ప్రాంతం నుంచి సాలిపేట మీదుగా ప్రవహించే వాడుక నీరంతా కలుస్తోంది. భారీ వర్షాలు కరిసే సమయంలో ఈ కాలువ గుండా వచ్చే నీరు సంవత్సరమంతా రైతుకు ఉపయోగపడుతోంది. 60 అడుగుల గల ఈ కాలువ స్థలంలో సుమారు 50 అడుగులు ఇప్పటికే ఆక్రమించేశారు. మిగిలిన పది అడుగుల కాలువలో చిన్నపాటి పైప్‌లైన్‌ వేసి రోడ్డు నిర్మించటంతో గతంలో మాదిరి చెరువులోకి నీరు వచ్చే అ వకాశం లేదని స్థానిక రైతులు ఆవేదన. వచ్చే ఏడాది నుంచి పంట సాగు చేసేందుకు నీటి సమ స్య ఉత్పన్నమవుతుందని వారు చెబుతున్నారు


అధికారులు వేసిన రాళ్లనూ పీకేశారు

సర్వే నంబర్‌ 4/3లో గల అనధికారిక లే అవుట్‌ అక్రమాలపై గతంలోనే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. అప్పటి వీఆర్వో రవికుమార్‌ వచ్చి లే అవుట్‌లో అక్రమాలను గుర్తించి రాళ్లను సరి చేసి వెళ్లారు. కొద్ది రోజుల వ్యవధిలోనే చెరువు కాలువను ఆక్రమించి సాగుభూములకు నీరివ్వకండా చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి
– తుమ్మగంటి నాగేశ్వరరావు, ఆయకట్టు రైతు

మళ్లీ పరిశీలించి చర్యలు తీసుకుంటాం

బొబ్బాదిపేటలోని లే అవుట్‌లో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారంటూ గతంలో ఒక సారి మా దృష్టికి వచ్చింది. స్థానికులు ఫిర్యాదు చేశారు. అప్పట్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసి కేసు నమోదు చేశాం. మరో మారు పరిశీలించి చర్యలు తీసుకుంటాం. 
– ప్రభాకర్, హెచ్‌డీటీ, విజయనగరం  

ఎలా బతకాలి
1958 నుంచి ఎర్రవాని చెరువు కింద పంట సాగు చేసుకుంటున్నాం. మాకు రెండెకరాల భూమి ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకుల బలంతో కాలువలు కప్పేసి  లే అవుట్‌లకు రోడ్లేస్తున్నారు. ఇలా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేసుకుని డబ్బు జేసుకుంటే అధికారులకు ఎందుకు కనబడటం లేదు. 
– తుమ్మగంటి లక్ష్మి, ఆయకట్టు రైతు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement