జనసేన అధినేత పవన్ కల్యాణ్
సాక్షి, విజయనగరం : అవినీతిని నిరూపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటుంటారు.. లంచాలకు ఎవరైనా రసీదులు ఇస్తారా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. జిల్లాలోని సాలూరులో శుక్రవారం పవన్ మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకులు చివరకు అంగన్‌వాడీ పోస్టులకు లక్షలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. బాక్సైట్ మైనింగ్ కోసం కొండలు అక్రమంగా తవ్వేస్తున్నారు.. ఇది అవినీతి కాదా అని జనసేత అధినేత నిలదీశారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం భూసేకరణ చేయకపోతే జన సైనికులు అడ్డుపడుతారని హెచ్చరించారు.
‘ మద్యంషాపులను ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి మహిళలను భయాందోళనకు గురి చేస్తున్నారు. అంతేకాక సాలూరులో టూరిజం ఏర్పాటు చేయాలి. ఆర్‌పీ బంజ్‌దేవ్ గిరిజనుడు కానప్పటికీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించి చంద్రబాబు సర్టిఫికెట్ ఇచ్చారు. సాలూరు తొలి ఎమ్మెల్యే ఎంఎల్‌ఏ కునిశెట్టి వెంకట దొర విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. అంతేకాక సాలూరులో వంద పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది’ అని పవన్ ప్రశ్నించారు.
యువతను మోసం చేసే పథకాలను చంద్రబాబు ప్రవేశ పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. నిరుద్యోగ భృతి నెలకు వెయ్యి, అది కూడా డిగ్రీ చదివిన వారికి మాత్రమే అట, మిగతా వారు యువకులు కాదా అని జనసేన అధినేత నిలదీశారు. అంతేకాక జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యగోగులకు జనసేన అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు. జనసేన అధికారంలోకి వస్తే కేంద్రంపై వత్తిడి తెచ్చి రద్దు చేసేందుకు కృషి చేస్తామన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్రం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా 17 వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని చెప్పారు.. సాలూరుకు బైపాస్ వేశారా అని నిలదీశారు. సాలూరులో వేలమంది కార్మికులు ఉన్నారు. ఆటో నగర్ ఉంటే అభివృద్ది చెందేదన్నారు. ఉద్దానం సమస్యను ప్రపంచం దృష్టికి ఎలాగా తీసుకు వెళ్లానో అదే విధంగా సాలూరు సమస్యలను తీసుకెళ్తామని పేర్కొన్నారు. జిల్లాలో 5వేల చెరువులు ఉన్నా ఫలితం లేదు. స్థానిక తెలుగు దేశం ఇంచార్జ్ బంజదేవ్ పెద్ద గెడ్డ రిజార్వాయర్ నుంచి నీటిని రొయ్యల చెరువుకు అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. కలుషిత నీటిని ప్రజలకు పంపించడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని పవన్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment