దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటేష్ రెడ్డి, సుబ్రమణ్యం
చంద్రగిరి( చిత్తూరు జిల్లా): తమ భూ దందాపై రెవెన్యూ అధికారులకు సమాచారమిస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కబ్జాదారులు బుధవారం మారణాయుధాలతో దాడి చేశారు. బుధవారం తనపల్లి సమీపంలో ఈఘటన చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు తిరుపతి రూరల్ మండలం తనపల్లి సమీపంలోని వినాయక నగర్‌లో వెంకటేష్‌రెడ్డి, సుబ్రమణ్యం, మారి నివాసం ఉంటున్నారు. వినాయక నగర్‌కు చెందిన మునిరత్నం భూ దందాలు ఇటీవల తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడేందుకు తిరుపతి రూరల్ తాహసీల్దార్ కిరణ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. వారం రోజులుగా ప్రభుత్వ భూముల అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ, స్వాధీనం చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో వినాయక నగర్‌లో భారీగా భూ ఆక్రమణలు జరిగినట్లు వెలుగులోకి రావడంతో లోతైన విచారణ చేపట్టారు. అక్కడ నివాసముంటున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వెంకటేష్‌రెడ్డి, సుబ్రమణ్యం, మారి అధికారులకు సమాచారం ఇస్తున్నారని భూ కబ్జాదారుడు మునిరత్నం అనుమానించాడు. బుధవారం ఉదయం వెంకటేష్‌రెడ్డి, సుబ్రమణ్యం, మారి వాకింగ్ వెళ్తున్న సమయంలో మునిరత్నం, అతని అనుచరులు వెంబడించారు. ని ర్మానుష్య ప్రాంతంలో ఒక్కసారిగా వారిపై ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. మారి అక్కడ నుంచి తప్పించుకోగా, వెంకటేష్ రెడ్డి తలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. సుబ్రమణ్యం స్పృహ కోల్పోయాడు. వారు మృతి చెందారనుకుని మునిరత్నం, అనుచరులు అక్కడ నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వెంకటేష్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళా వలంటీర్‌పైనా దుశ్చర్య
వెంకటేష్ రెడ్డి, సుబ్రమణ్యంపై జరుగుతున్న దాడిని గమనించిన వినాయకనగర్ వలంటీర్ మౌనికపై కూడా మునిరత్నం, ఆయన అనుచరులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వెంకటేష్ రెడ్డి, సుబ్రమణ్యంపై దాడి జరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న మౌనిక గమనించి, తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసింది. ఇది గుర్తించిన మునిరత్నం తనపై దాడికి పాల్పడి, సెల్‌ఫోన్ లాక్కొని వెళ్లినట్లు మౌనిక తెలిపారు. ఈ మేరకు ఆమె తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment