కబ్జాల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి రాగద్వేషాలకు పోవద్దు: మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు
కేవలం కొందరిపైనే చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి అప్రతిష్ట
బొమ్మరాసిపేటలో భూకుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
అక్కడ 920 ఎకరాల భూకబ్జా వెనుక మాజీ మంత్రుల హస్తం ఉందని ఆరోపణ
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): రాష్ట్రంలో కొందరు కబ్జాదారులపై మాత్రమే చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా కబ్జాదారులందరిపైనా చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు కోరారు. రేవంత్ సర్కారు హెచ్‌ఎండీఏ పరిధిలోని భూముల కబ్జాదారులపై చర్యలు చేపట్టడాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు. ఫిలింసిటీ పేరుతో ప్రభుత్వ రోడ్డును, పేదల భూములను ఆక్రమించిన రామోజీరావుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేటలోని 920 ఎకరాల భూకబ్జాపై కూడా సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ భూకబ్జా వెనుక మాజీ మంత్రుల హస్తం ఉందని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్‌లో గోనె ప్రకాశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ధరణి కమిటీ ద్వారా వాస్తవాలను తేల్చి భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మాజీ మంత్రుల సహకారంతో భూకబ్జా..
బొమ్మరాసిపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 323 నుంచి 409 వరకు 1,049 ఎకరాల భూమి ఉందని.. అందులో కొందరు రైతు సంఘం ముసుగులో 920 ఎకరాల భూమిని కబ్జా చేశారని గోనె ప్రకాశ్‌రావు ఆరోపించారు. 1965లో మీర్ రెహమత్ అలీతోపాటు మరో ఆరుగురి నుంచి మాజీ ఎంపీ దుగ్గిరాల బలరామకృష్ణ ఈ భూమి ని కొనుగోలు చేశారని.. ఆయన వారసులైన దుగ్గిరాల అమరేందర్‌బాబుతోపాటు మరో 20 మంది పేరిట ఆ భూమి రిజిస్టర్ అయిందని తెలిపారు.
ఈ భూమి హక్కుదారులు విదేశాలలో స్థిరపడటంతో కొందరు దానిపై కన్నేశారని.. నకిలీ పత్రాలను సృష్టించి మాజీ మంత్రుల సహకారంతో కబ్జాకు పాల్పడ్డారన్నారు. రైతు సంఘం నేతలు ధర్నాలు చేస్తూ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ కూడా భూకబ్జాదారులకు వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. ఈ భూముల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయాలని.. జిల్లా కలెక్టర్ ద్వారా పూర్తి వివరాలు సేకరించి, అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై త్వరలో సీఎం రేవంత్‌ను కలుస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment