
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): టీడీపీలో భూ కబ్జాదారులకే అధిక ప్రాధాన్యత లభిస్తుందని, పార్టీకోసం పనిచేసేవారికి గుర్తింపు లేదని ఆ పార్టీ విజయవాడ అర్బన్ మాజీ ఉపాధ్యక్షుడు ముష్టి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 27 ఏళ్లుగా పార్టీకోసం పనిచేసిన తనకు అన్యాయం జరిగిందంటూ మీడియా ముందుకు వచ్చారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని, అనేక చోట్ల భూ కబ్జాలకు పాల్పడ్డారని అయినా టికెట్ ఇచ్చారన్నారు. ఉమా ఎదుగుదలకు అడ్డువస్తానని భావించి తనను పదవినుంచి తప్పించారన్నారు. ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, బొండా ను ఓడిస్తానన్నారు.