ఘంటసాల(అవనిగడ్డ): ఆందోళనలు, రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దని చెప్పిన ఘంటసాల ఎస్‌ఐ శ్రీనివాస్‌పై మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఊగిపోయారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఆయనకు వంతపాడారు. దీంతో టీడీపీ నేతలు ఎస్‌ఐపై రెచ్చిపోయారు. వారి తీరుతో కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో చేపట్టిన టీడీపీ ఇసుక సత్యాగ్రహం కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్‌ఐ కూచిపూడి శ్రీనివాస్ తెలిపిన వివరాలు..చంద్రబాబు పిలుపు మేరకు సోమవారం బుద్ధప్రసాద్ నేతృత్వంలో మాజీ ఎంపీ కొనకళ్లతో మరికొంతమంది టీడీపీ నేతలు శ్రీకాకుళం నుంచి ర్యాలీగా ఇసుక క్వారీ వరకు వెళ్లారు.
అక్కడ టీడీపీ జెండాలు ఉంచి నిరసన తెలిపారు. ఎస్‌ఐ శ్రీనివాస్ ఈ ఆందోళన కార్యక్రమానికి ఒక గంట మాత్రమే అనుమతిచ్చారు. పామర్రు టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమారరాజా రావడం ఆలస్యం కావడంతో ఇచ్చిన సమయం దాటిపోయింది. అయినప్పటికీ కొంతమంది నేతలు మాట్లాడుతుండటంతో మీకిచ్చిన సమయం అయిపోయింది, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని, ఏదైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలని ఎస్‌ఐ సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన బుద్ధప్రసాద్.. ‘ఇసుక దోపిడీకి అనుమతిస్తావా, మేము మాట్లాడుతుంటే ఆడ్డుపడతావా’ అంటూ ఎస్‌ఐపై విరుచుకుపడ్డారు.
ఇసుక దోపీడిని అరికట్టకుండా మమ్మల్నే అడ్డుకుంటావా..అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. కొనకళ్ల కలి్పంచుకుని ఇసుక దోపిడీ గురించి మాట్లాడుతుంటే అడ్డుకుంటానికి మీరెవరు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం పార్లమెంటరీ టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు మాచవరపు ఆదినారాయణ ఎస్‌ఐకి వేలు చూపిస్తూ.. నువ్వు దొంగవి అంటూ దురుసుగా ప్రవర్తించారు. అనంతరం జేపీ సిబ్బందిని తీసుకొచ్చిన ఎస్‌ఐ శ్రీనివాస్.. ఇసుక ధరలు, క్వారీ అనుమతుల గురించి బుద్ధప్రసాద్‌తో మాట్లాడించారు.
ఇక్కడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, పామర్రు నియోజకవర్గ పరిధిలో జగనన్న కాలనీలకు సంబంధించిన స్టాక్ పాయింట్లకు ఇసుక రవాణా చేయడం వల్ల వాటికి రేటు వేయరని చెప్పారు. మైనింగ్ అనుమతి గురించి ప్రశ్నించగా.. మా ఉన్నతాధికారుల వద్ద వివరాలున్నాయని సిబ్బంది చెప్పారు. ఇసుక క్వారీకి సంబంధించి అనుమతులు చూపించాలని లేదంటే రేపు పోలీస్ స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష చేస్తామంటూ ఎస్‌ఐని బుద్ధప్రసాద్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment