కాకినాడ కూటమిలో బిగ్ ఫైట్
జనసేన ఎంపీ ఏకపక్ష ధోరణిపై టీడీపీలో అసంతృప్తి
ఉప ముఖ్యమంత్రి పవన్‌కు ఫిర్యాదులు
నిట్టనిలువునా చీలిన కూటమి
తారాస్థాయికి ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వార్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి నేతలు ఆధి పత్యం కోసం బస్తీమే సవాల్ అంటున్నారు. కాకినాడ నగరంలో కూటమి నిట్టనిలువునా చీలిపోయింది. జనసేన, టీడీపీ నేతలు ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలుగా విడిపోయి ప్రతి చిన్నదానికి తన్నుకుంటున్నారు. అధికారుల బదిలీ కోసం మొదలైన ఆధిపత్య పోరు మద్యం, బాణసంచా షాపులు దక్కించుకునే వరకు దారి తీసింది. ఒక వర్గానికి వచ్చిన షాపులను మరో వర్గం లాగేసుకునే ప్రయత్నాలతో ఇరువర్గాలు రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తు న్నాయి. జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో రాజుకున్న అగ్గి
ఇటీవల కాకినాడ ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో ఇరువురి మధ్య సఖ్యత చెడిందంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నప్పటి నుంచి కాకినాడలో వివిధ హోదాల్లో పనిచేసిన మల్లిబాబును ఆర్డీఓగా తీసుకురావాలనేది ఎంపీ ఉదయ్ ఆలోచన. ఇక్కడ జెడ్పీ సీఈఓగా పనిచేసిన సత్యనారాయణను ఆర్డీఓగా నియమిస్తామని కొండబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఒప్పందాలు కూడా జరిగాయి. ఆర్టీఓ బదిలీల్లో ఎంపీ పెత్తనం ఏమిటంటూ ఎమ్మెల్యే వర్గీయులు విమర్శలకు దిగారు. చివరకు ఈ బదిలీ వ్యవహారం ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎంపీ సిఫారసు చేసిన మల్లిబాబు ఆర్డీఓగా నియమితులయ్యారు. ఇది చాలదు అన్నట్టుగా ఒకప్పుడు సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన టీడీపీ సిటీ అధ్యక్షుడు నున్న దొరబాబు ఆ శిబిరం నుంచి బయటకు వచ్చేసి ఎంపీ శ్రీనివాస్ శిబిరంలో చేరారు. ఎమ్మెల్యే కొండబాబు వ్యవహారాలను అతని సోదరుడు సత్యనారాయణ సమన్వయం చేసుకునేవారు. సత్యనారాయణతో పాటు దొరబాబు కూడా కలిసే ఉండేవారు. అటువంటిది వీరిద్దరి మధ్య వచ్చిన పొరపొచ్చాలతో దొరబాబు ఎమ్మెల్యే శిబిరం నుంచి బయటకు వచ్చేశారు.
సరిగ్గా అదే సమయంలో జనసేన రూపంలో కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గెలుపొందడంతో దొరబాబు ఆ శిబిరంలో చేరి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య వైషమ్యాలు పెరుగుతూ వచ్చి చివరకు మద్యం, బాణసంచా షాపు ల వ్యవహారంలో పట్టుదలతో తారా స్థాయికి చేరుకుని రోడ్డెక్కే వరకు వెళ్లాయనేది పరిశీలకుల మాట.
ముక్కున వేలేసుకుంటున్న జనం
కాకినాడ సంజయ్‌నగర్‌లో ఒక మద్యం దుకాణాన్ని డ్రాలో తెలంగాణాలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన కౌకుట్ల జీవన్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. షాపు ఏర్పాటు కోసం లీజు అగ్రిమెంట్ చేసుకుని పనులు మొదలుపెట్టేసరికి ఎమ్మెల్యే కొండబాబు ముఖ్య అనుచరుడు, నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, అతని అనుచరగణం అడ్డుతగిలారు. ఇంతకీ షాపు దక్కించుకున్న లీజుదారుడు ఎంపీ శ్రీనివాస్‌కు సహచరుడు.
అదే కారణంతో ఎమ్మెల్యే కొండబాబు తన అనుచరులను రెచ్చగొట్టి దౌర్జన్యంగా మద్యం షాపును లాగేసుకునేందుకు ప్రయతి్నంచారని ఎంపీ వర్గం ఆరోపిస్తోంది. ఇది చినికిచినికి గాలివానగా మారి పోలీసుల వరకు వెళ్లింది. ఈ రెండు వర్గాల మధ్య ఈ వివాదం కొనసాగుతుండగానే తాజాగా కాకినాడ మెయిన్‌రోడ్డులో బాణసంచా షాపు ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కొండబాబు వర్గం ప్రయత్నించింది. ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే మెయిన్‌రోడ్డులో మందుగుండు షాపు ఇచ్చిన దాఖలాలు లేవని, ప్రమాదకరమనే కారణంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు.
మద్యం దుకాణం విషయంలో గొడవ చేసినందుకు ప్రతీకారంగా ఎంపీ కావాలనే మందుగుండు షాపునకు అను మతి రాకుండా అడ్డుకున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తూ సోమవారం రాత్రి రోడ్డెక్కడం అటు జనసేన, ఇటు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మా రింది. ఏదో ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేసినట్టు వ్యక్తిగత లాభాపేక్ష కోసం నిర్వహించే మ ద్యం, బాణసంచా షాపుల కోసం రోడ్డెక్కుతారా అంటూ టీడీపీ నేతల తీరుతో ప్రజలు ముక్కున వేలేసు కుంటున్నారు. గతంలో ఎప్పుడూ ఏ పార్టీ ఇలా దిగజారుడు రాజకీయాలకు పాల్పడలేదని ఆక్షేపిస్తున్నారు.
ఎంపీని ఏకాకిని చేసే వ్యూహం
జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వివిధ కారణాలతో కాకినాడ ఎంపీ శ్రీనివాస్‌ను ఇటీవల కాలంలో దూరం పెట్టారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఎంపీ కూటమిలోని ఎమ్మెల్యేలను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా పోతున్నారని ఆయా నియోజవకర్గాల నేతలు ఆగ్రహంతో ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదులు చేశారని కూటమి నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలో ఎంపీ శ్రీనివాస్‌ను ఏకాకిని చేసే వ్యూహంలో భాగంగానే టీడీపీ నేతలు తెర వెనుక ఉండి కొండబాబును నడిపిస్తున్నారనే చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment