Liquor Store
-
జనసేన ఎంపీ ఏకపక్ష ధోరణిపై టీడీపీలో అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి నేతలు ఆధి పత్యం కోసం బస్తీమే సవాల్ అంటున్నారు. కాకినాడ నగరంలో కూటమి నిట్టనిలువునా చీలిపోయింది. జనసేన, టీడీపీ నేతలు ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలుగా విడిపోయి ప్రతి చిన్నదానికి తన్నుకుంటున్నారు. అధికారుల బదిలీ కోసం మొదలైన ఆధిపత్య పోరు మద్యం, బాణసంచా షాపులు దక్కించుకునే వరకు దారి తీసింది. ఒక వర్గానికి వచ్చిన షాపులను మరో వర్గం లాగేసుకునే ప్రయత్నాలతో ఇరువర్గాలు రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తు న్నాయి. జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో రాజుకున్న అగ్గి ఇటీవల కాకినాడ ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో ఇరువురి మధ్య సఖ్యత చెడిందంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నప్పటి నుంచి కాకినాడలో వివిధ హోదాల్లో పనిచేసిన మల్లిబాబును ఆర్డీఓగా తీసుకురావాలనేది ఎంపీ ఉదయ్ ఆలోచన. ఇక్కడ జెడ్పీ సీఈఓగా పనిచేసిన సత్యనారాయణను ఆర్డీఓగా నియమిస్తామని కొండబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఒప్పందాలు కూడా జరిగాయి. ఆర్టీఓ బదిలీల్లో ఎంపీ పెత్తనం ఏమిటంటూ ఎమ్మెల్యే వర్గీయులు విమర్శలకు దిగారు. చివరకు ఈ బదిలీ వ్యవహారం ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎంపీ సిఫారసు చేసిన మల్లిబాబు ఆర్డీఓగా నియమితులయ్యారు. ఇది చాలదు అన్నట్టుగా ఒకప్పుడు సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన టీడీపీ సిటీ అధ్యక్షుడు నున్న దొరబాబు ఆ శిబిరం నుంచి బయటకు వచ్చేసి ఎంపీ శ్రీనివాస్ శిబిరంలో చేరారు. ఎమ్మెల్యే కొండబాబు వ్యవహారాలను అతని సోదరుడు సత్యనారాయణ సమన్వయం చేసుకునేవారు. సత్యనారాయణతో పాటు దొరబాబు కూడా కలిసే ఉండేవారు. అటువంటిది వీరిద్దరి మధ్య వచ్చిన పొరపొచ్చాలతో దొరబాబు ఎమ్మెల్యే శిబిరం నుంచి బయటకు వచ్చేశారు. సరిగ్గా అదే సమయంలో జనసేన రూపంలో కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గెలుపొందడంతో దొరబాబు ఆ శిబిరంలో చేరి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య వైషమ్యాలు పెరుగుతూ వచ్చి చివరకు మద్యం, బాణసంచా షాపు ల వ్యవహారంలో పట్టుదలతో తారా స్థాయికి చేరుకుని రోడ్డెక్కే వరకు వెళ్లాయనేది పరిశీలకుల మాట. ముక్కున వేలేసుకుంటున్న జనం కాకినాడ సంజయ్‌నగర్‌లో ఒక మద్యం దుకాణాన్ని డ్రాలో తెలంగాణాలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన కౌకుట్ల జీవన్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. షాపు ఏర్పాటు కోసం లీజు అగ్రిమెంట్ చేసుకుని పనులు మొదలుపెట్టేసరికి ఎమ్మెల్యే కొండబాబు ముఖ్య అనుచరుడు, నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, అతని అనుచరగణం అడ్డుతగిలారు. ఇంతకీ షాపు దక్కించుకున్న లీజుదారుడు ఎంపీ శ్రీనివాస్‌కు సహచరుడు.అదే కారణంతో ఎమ్మెల్యే కొండబాబు తన అనుచరులను రెచ్చగొట్టి దౌర్జన్యంగా మద్యం షాపును లాగేసుకునేందుకు ప్రయతి్నంచారని ఎంపీ వర్గం ఆరోపిస్తోంది. ఇది చినికిచినికి గాలివానగా మారి పోలీసుల వరకు వెళ్లింది. ఈ రెండు వర్గాల మధ్య ఈ వివాదం కొనసాగుతుండగానే తాజాగా కాకినాడ మెయిన్‌రోడ్డులో బాణసంచా షాపు ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కొండబాబు వర్గం ప్రయత్నించింది. ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే మెయిన్‌రోడ్డులో మందుగుండు షాపు ఇచ్చిన దాఖలాలు లేవని, ప్రమాదకరమనే కారణంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు.మద్యం దుకాణం విషయంలో గొడవ చేసినందుకు ప్రతీకారంగా ఎంపీ కావాలనే మందుగుండు షాపునకు అను మతి రాకుండా అడ్డుకున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తూ సోమవారం రాత్రి రోడ్డెక్కడం అటు జనసేన, ఇటు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మా రింది. ఏదో ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేసినట్టు వ్యక్తిగత లాభాపేక్ష కోసం నిర్వహించే మ ద్యం, బాణసంచా షాపుల కోసం రోడ్డెక్కుతారా అంటూ టీడీపీ నేతల తీరుతో ప్రజలు ముక్కున వేలేసు కుంటున్నారు. గతంలో ఎప్పుడూ ఏ పార్టీ ఇలా దిగజారుడు రాజకీయాలకు పాల్పడలేదని ఆక్షేపిస్తున్నారు. ఎంపీని ఏకాకిని చేసే వ్యూహం జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వివిధ కారణాలతో కాకినాడ ఎంపీ శ్రీనివాస్‌ను ఇటీవల కాలంలో దూరం పెట్టారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఎంపీ కూటమిలోని ఎమ్మెల్యేలను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా పోతున్నారని ఆయా నియోజవకర్గాల నేతలు ఆగ్రహంతో ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదులు చేశారని కూటమి నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలో ఎంపీ శ్రీనివాస్‌ను ఏకాకిని చేసే వ్యూహంలో భాగంగానే టీడీపీ నేతలు తెర వెనుక ఉండి కొండబాబును నడిపిస్తున్నారనే చర్చ నడుస్తోంది. -
సౌదీలో తొలి మద్యం దుకాణం
రియాద్: మద్యపాన నిషేధాన్ని పాటించే సౌదీ అరేబియాలో మొట్టమొదటి సారిగా ఆల్కాహాల్ విక్రయ కేంద్రం తెరుచుకోనుంది. ముస్లిమేతర దౌత్యవేత్తల వినియోగం కోసం ఈ మద్యం స్టోర్‌ను తెరవనున్నారు. సంబంధిత మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకున్న మద్యం ప్రియులు మాత్రమే అక్కడ మద్యం కొనుగోలుచేసేందుకు అర్హులు. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ దీనిని అనుమతులు ఇస్తుంది. నెలవారీ కోటా పరిమితి ప్రకారమే వినియోగదారులకు మద్యాన్ని విక్రయిస్తారు. పర్యాటకం, వాణిజ్యం ఊపందుకునేందుకు వీలుగా రియాద్ నగరంలో మద్యం అమ్మకాలు పెరగాలన్న సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకే ఈ స్టోర్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. రియాద్‌లో వివిధ దేశాల ఎంబసీలు, రాయబార కార్యాలయాలకు నిలయమైన ప్రాంతంలో ఈ స్టోర్‌ను మరి కొద్ది వారాల్లో ప్రారంభించనున్నారు. -
Glynn Simmons: 48 ఏళ్ల తర్వాత నిర్దోషిగా..
చేయని తప్పునకు శిక్ష అనుభవించడం, నిందలు మోయడం నిజంగా బాధాకరమే. అమెరికాలోని ఒక్లహోమాకు చెందిన 70 సంవత్సరాల గ్లిన్ సైమన్స్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఏ నేరమూ చేయకపోయినా ఏకంగా 48 సంవత్సరాల ఒక నెల 18 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వచి్చంది. జీవితంలో విలువైన సమయం జైలుపాలయ్యింది. న్యాయం అతడి పక్షాన ఉండడంతో ఎట్టకేలకు నిర్దోషిగా బయటపడ్డాడు. అమెరికాలో చేయని తప్పునకు అత్యధిక కాలం శిక్ష అనుభవించింది గ్లిన్ సైమన్స్ అని నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ ఎగ్జోజనరేషన్స్ అధికారులు చెప్పారు. 1974 డిసెంబర్లో ఒక్లహోమాలోని ఓ లిక్కర్ స్టోర్‌లో హత్య జరిగింది. ఇద్దరు దుండగులు లిక్కర్ స్టోర్ క్లర్క్‌ను కాల్చి చంపి, మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. అప్పుడు గ్లిన్ సైమన్స్ వయసు 22 ఏళ్లు. సైమన్స్తోపాటు డాన్ రాబర్ట్స్ అనే వ్యక్తి ఈ హత్య చేశారని పోలీసులు తేల్చారు. వారిద్దరికీ న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. తాము ఈ నేరం చేయలేదని మొత్తుకున్నా అప్పట్లో ఎవరూ వినిపించుకోలేదు. పోలీసులు వారిని జైలుకు పంపించారు. డాన్ రాబర్ట్స్ 2008లో పెరోల్‌పై విడుదలయ్యాడు. కేసును మళ్లీ విచారించాలని సైమన్స్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాడు. దాంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసును మళ్లీ విచారించారు. సైమన్స్ హత్య చేయలేదని గుర్తించారు. అతడిని జైలు నుంచి విడుదల చేస్తూ ఒక్లహోమా కంట్రీ జిల్లా కోర్టు రెండు రోజుల క్రితం తీర్పు ఇచ్చింది. అంతేకాదు అతడికి 1.75 లక్షల డాలర్ల (రూ.1.45 కోట్లు) నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సైమన్స్ మంగళవారం కారాగారం నుంచి బయటకు వచ్చాడు. తాను నేరం చేయలేదు కాబట్టి శిక్షను ధైర్యంగా ఎదుర్కొన్నానని, ఎప్పటికైనా నిర్దోషిగా విడుదలవుతానన్న నమ్మకంతో ఉన్నానని సైమన్స్ చెప్పాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మద్యం దుకాణాల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన రవికాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండొద్దని సుప్రీం తీర్పు ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఏ ప్రతిపాదికన రిజర్వేషన్లు నిర్ణయించారో తెలిపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాన్ని సంప్రదించి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. చదవండి: ఇదేం బాదుడు బాబోయ్! సికింద్రాబాద్ స్టేషన్లో ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.500 -
సర్ది చెప్పడానికి వెళ్లాడు.. శవమై వచ్చాడు!
కోదాడ: మద్యం దుకాణం వద్ద జరుగుతున్న గొడవను ఆపి సర్దిచెప్పడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని వైన్స్ సిబ్బంది కర్రలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఏపీ సరిహద్దులోని రామాపురం క్రాస్‌రోడ్‌లో హనుమాన్ వైన్స్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి ఏపీలోని కృష్ణాజిల్లా షేర్ మహ్మద్‌పేటవాసి కావడంతో గ్రామానికి చెందిన పలువురు అక్కడి చేరుకొని మృతదేహంతో ధర్నాకు దిగారు. దీంతో వైన్స్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. షేర్‌మహ్మద్‌పేటకు చెందిన రైతు నాగయ్య మద్యం కోసం రామాపురం వద్ద వైన్స్‌కు వచ్చాడు. అప్పటికే షేర్‌మహ్మద్‌పేటకు చెందిన ఇద్దరు వ్యక్తులతో వైన్స్ సిబ్బంది గొడవ పడుతున్నారు వారిని వారించడానికి నాగయ్య అక్కడికి వెళ్లాడు. అదే సమయంలో వైన్స్ సిబ్బంది కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో నాగయ్య తలపైబలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వైన్స్‌ముందు గ్రామస్తుల ధర్నా వైన్స్ సిబ్బంది దాడిలో తమ గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న షేర్‌మహ్మద్‌పేట వాసులు, బంధువులు పెద్ద ఎత్తున రామాపురం క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకొని వైన్స్ ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కోదాడ టౌన్ సీఐ నరసింహారావు, రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఇదిలా ఉండగా నాగయ్య మృతి చెందగానే వైన్స్‌ను మూసివేసి సిబ్బంది అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని బంధువుల ఫిర్యాదు అందిన తరువాత పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
కోడెల శివరామ్.. ఆంధ్రా నయీమ్
పట్నంబజారు (గుంటూరు): కోడెల శివరామ్ తన నుంచి ‘కే ట్యాక్స్’ వసూలు చేశాడంటూ మంగళవారం మరో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇది వరకే ఫిర్యాదు చేసిన ఇంకో బాధితుడు తన డబ్బు ఇప్పించాలంటూ గుంటూరులోని కోడెల శివరామ్‌కు చెందిన షోరూం ఎదుట ఆందోళనకు దిగాడు. తనకు చెల్లించాల్సిన రూ.11 లక్షలు ఇస్తే.. తప్ప తాను ఇక్కడ నుండి కదలబోనని.. డబ్బులు ఇవ్వకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. కోడెల శివరామ్‌ను చూసినప్పుడల్లా ఆంధ్ర నయీమ్లాగే అనిపించేదని అతను వాపోయాడు. బాధితుడి కథనం మేరకు.. సత్తెనపల్లికి చెందిన యేల్లినేడి శ్రీనివాసరావు కాంట్రాక్ట్ పనులు చేయటంతో పాటు, భోజనాల క్యాటరింగ్ చేస్తుంటారు. 2017లో నరసరావుపేటలో జరిగిన ఖేలో ఇండియా కబడ్డీ పోటీలకు సంబంధించి 2 వేల మందికి భోజనాలు సరఫరా చేసేందుకు రూ.24 లక్షల కాంట్రాక్ట్ శ్రీనివాసరావు తీసుకున్నారు. దానికి సంబంధించి తొలుత ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షలు ఇచ్చి, మిగతా మొత్తం కబడ్డీ పోటీలు ముగిశాక ఇస్తామని కోడెల శివరామ్ చెప్పారు. పనులు ముగిసిన తరువాత రూ.10 లక్షల చెక్కు వచ్చిందని, రూ.5 లక్షలు కట్టి తీసుకెళ్లాలని శివరామ్ హుకుం జారీ చేయటంతో చేసేది లేక రూ.5 లక్షలు చెల్లించారు. అనంతరం వచ్చిన రూ.5 లక్షల చెక్కులో రూ.3 లక్షలు, మరోసారి వచ్చిన రూ.4 లక్షల చెక్కులో రూ.2 లక్షలు తీసుకున్నారు. తనకు జరిగిన అన్యాయం శ్రీనివాసరావు తన ఆత్మీయులకు చెప్పుకున్నారు. దీంతో కోడెల శివరామ్ తన గురించి మాట్లాడతావా.. అంటూ రూ.లక్ష పెనాల్టీ వసూలు చేశాడు. దీనిపై బాధితుడు శ్రీనివాసరావు కొద్ది రోజుల క్రితం అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. కోడెల శివరామ్ అనుచరులు, డబ్బులు జూలై 1వ తేదీ కల్లా ఇస్తామని, కేసు పెట్టవద్దని శ్రీనివాసరావుకు చెప్పారు. తర్వాత ఫోన్లు అన్ని స్విచ్చాఫ్ చేసుకోవటంతో శ్రీనివాసరావు ఆందోళన చేపట్టారు. నగరంపాలెం ఎస్‌హెచ్‌వో కె.వెంకటరెడ్డి, ఎస్ఐ పి.భాగ్యరాజులు శ్రీనివాసరావును స్టేషన్‌కు పిలిచి వివరాలు తెలుసుకున్నారు. డబ్బులు ఇప్పించకపోతే ఆత్మహత్యే శరణ్యం కోడెల శివరామ్ తన నుంచి వసూలు చేసిన డబ్బులు ఇప్పించకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన యార్లగడ్డ వెంకటపద్మారావు నగరంపాలెం స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశాడు. వెంకటపద్మారావుకు 2015లో మద్యం షాపు రాగా మురళీకృష్ణ వైన్స్ పేరుతో నరసరావుపేటలో ప్రారంభించారు. అదే ఏడాది ఆగస్టు 2న కోడెల శివరామ్ ఆయనకు ఫోన్‌చేసి గుంటూరు చుట్టుగుంట వద్ద ఉన్న గౌతమ్ హీరో షోరూమ్‌కు రావాలని చెప్పారు. రూ.20 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. వెంకటపద్మారావు నాలుగు రోజుల వ్యవధిలో రూ.20 లక్షలు తీసుకెళ్ళి కోడెల శివరామ్‌కు ఇచ్చారు. తర్వాత 2017లో సత్తెనపల్లిలో కల్యాణి వైన్స్ పద్మారావుకు వచ్చింది. తిరిగి కోడెల శివరామ్ ఫోన్ చేసి మరో రూ.20 లక్షలు డిమాండ్ చేసి తీసుకున్నాడు. దీంతో తాజాగా వెంకట పద్మారావు నగరంపాలెం ఎస్హెచ్ఓ కె.వెంకటరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశాడు. -
దుండగుడి కాల్పుల్లో ఎన్ఆర్ఐ మృతి
టెక్సాస్ : టెక్సాస్‌లోని లీవిస్విల్లేలోని లిక్కర్సిటీ మాల్లో లిటిల్ ఎమ్ ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు హత్యకు గురయ్యాడు. లిక్కర్ షాప్‌లో పని ముగించుకుని సురేష్ షా(46) ఇంటికి వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో సురేష్ షా గుండెలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
సినీ ఫక్కీలో రూ.2 లక్షలు లూటీ
కశింకోట : కన్నూరుపాలెంలోని ఒక మద్యం దుకాణంలో ఆదివారం రాత్రి సినీ ఫక్కీలో రూ.2 లక్షలు అపహరణకు గురైంది. బాధిత మద్యం విక్రేతలు అందించిన వివరాలివి. కన్నూరుపాలెంలోని వైన్ దుకాణాన్ని ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మూసివేశారు. ఆ సమయంలో మద్యం కోసం స్థానికుడు ఒకరు వచ్చి బలవంతం చేసి దుకాణం తెరిపించాడు. దుకాణంలో బాబ్జీ, వై.పైడిరాజు ఉన్నారు. కస్టమర్‌కు బాబ్జీ మద్యం సీసా అందించగా, పైడిరాజు మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన రూ.2 లక్షల మూడు వేల నగదును ప్యాకెట్‌తో పట్టుకుని నిరీక్షిస్తున్నాడు. ఇంతలో అప్పటికే అక్కడ మద్యం సేవిస్తున్న ఓ వ్యక్తి హఠాత్తుగా పైడిరాజు చేతిలోని నగదు ప్యాకెట్‌ను లాక్కున్నాడు. అదే తడవుగా దుకాణానికి కాస్త దూరంలో మోటార్‌సైకిల్‌తో సిద్ధంగా ఉన్న మరో గుర్తు తెలియని వ్యక్తితో కలిసి అదేవాహనంపై తాళ్లపాలెం వైపు పరారయ్యాడు. ఈలోగా మద్యం కోసం వచ్చిన వ్యక్తి కూడా నర్సీపట్నం వైపు పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ బి.మధుసూదనరావు, పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఆగంతకులు నగదును తస్కరించినట్టు భావిస్తున్నారు. తాళ్లపాలెం కూడలిలో ఉన్న సీసీ కెమెరాల్లో కూడా ఆగంతకుల వివరాలు నమోదు కాలేదని తెలుస్తోంది. దీనిబట్టి ఎవరో స్థానికుల ప్రోత్సాహంతో దొంగతనానికి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. -
హైవేలపై మద్యం దుకాణాలు మూసేయండి
ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం ► లైసెన్స్ లను మార్చి 31 తర్వాత రెన్యువల్ చేయొద్దు ► దీన్ని ఆదాయ మార్గంగా చూడొద్దు ► సాధారణ ప్రజల ప్రాణాలను పరిగణనలోకి తీసుకోవాలి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న మద్యం దుకాణా లను మూసేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుత లైసెన్స్ కాలపరిమితి ముగిసే వరకు మాత్రమే ఈ దుకాణాలను నిర్వహించుకోవచ్చంది. వచ్చే ఏడాది మార్చి 31 తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి లైసెన్స్ లను రెన్యువల్ చేయరాదని ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి లిక్కర్ విక్రయాలను సూచించే బ్యానర్లన్నంటినీ తొలగించాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వర రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏటా రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మృత్యువాత పడుతుండడంపై ఇటీవల సుప్రీం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిం దే. ఈ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రహదా రులపై ఉన్న అన్ని మద్యం దుకాణాల్ని మూసివేయాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అందుకే జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం విక్రయాలు జరగ కుండా చూసేలా ఎక్సైజ్ చట్టాలను సవరించాలంటూ దాఖలైన పలు వినతుల నేపథ్యంలో ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. హైవేల సమీపంలో లిక్కర్ షాపులకు అనుమతి ఇవ్వాలని, ఇందుకోసం నిబంధనలు సడలించాలన్న పంజాబ్ ప్రభుత్వం వైఖరిని ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుబట్టింది. మద్యం అమ్మకాలను నిషేధించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికుందని గుర్తు చేస్తూ.. సాధారణ ప్రజల మేలుకోసం చర్యలు తీసుకోవాలని హితవు పలికింది. అదే సమయంలో వివిధ రాష్ట్రాలు సైతం రోడ్ల వెంబడి ఉన్న లిక్కర్ షాపుల్ని తొలగించడంలో నిర్లక్ష్యం చూపడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మద్యం తాగి వాహనాలు నడపడం పెరిగిపోతున్నదని, దీని ఫలితంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్ల వెంబడి లిక్కర్ షాపుల ఏర్పాటుకు లైసెన్స్ లు ఇవ్వడాన్ని ఒక ఆదాయ మార్గంగా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు చూడరాదని హితవు పలికింది. ఈ విషయంలో కేంద్రం సైతం నిర్మాణాత్మకంగా వ్యవహరించక పోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. -
బార్ ముందు బారికేడ్లు..!
జనం రద్దీని తట్టుకునేందుకుసినిమా హాళ్లు, బస్సు, రైల్వే స్టేషన్లలో టిక్కెట్టు క్యూ కౌంటర్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయడం సర్వసాధారణం. కానీ, ఇప్పుడు మద్యం దుకాణాలు వారు కూడా బారికేడ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. రద్దీ సమయాల్లో మందుబాబుల తోపులాటను నివారించే ముందు జాగ్రత్త చర్య ఇది. రహమత్‌నగర్ డివిజన్ రాజీవ్‌గాంధీ నగర్‌లోని ఓ మద్యం దుకాణం ముందు ఇలా బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. -
వైన్ షాప్‌లో చోరీ
పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఉన్న మద్యం దుకాణం గోదాంలో దొంగలు పడి రూ. 60 వేల విలువైన మద్యం బాటిల్స్‌ను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. దుకాణం వెనుక వైపు ఉన్న కిటికీ తొలగించిన దుండగులు విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం ఇది గుర్తించిన యజమాని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం దుకాణాన్ని అడ్డుకున్న మహిళలు
రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలంలో తలపెట్టిన మద్యం దుకాణం ఏర్పాటును మహిళలు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం సీతారామపురం గ్రామానికి మద్యం దుకాణం మంజూరైంది. దీనిని దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డు పక్కన గుడి, బడికి సమీపంలోనే దుకాణాన్ని ఏర్పాటు చేయటానికి పనులు ప్రారంభించాడు. ఇది తెలిసిన గ్రామస్తులు మహిళలు సుమారు 200 మంది దుకాణం నిర్మాణానికి తవ్విన పునాది గుంతలను పూడ్చివేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. -
మహిళల కోసం ప్రత్యేక మద్యం దుకాణం
-
మద్యం దుకాణంలో చోరీ
బోడుప్పల్‌లోని కళింగ వైన్స్‌లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. శనివారం ఉదయం దుకాణం తెరిచిన తర్వాత దొంగతనం జరిగిన విషయాన్ని యజమాని గుర్తించాడు. దుకాణం వెనుక నుంచి కన్నం చేసుకుని ప్రవేశించిన దుండగులు క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.50వేల నగదుతోపాటు మూడు కార్టన్ల మద్యాన్ని ఎత్తుకుపోయారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
మద్యం దుకాణం సీజ్: ముగ్గురి అరెస్టు
కల్తీ మద్యం విక్రయిస్తున్న దుకాణాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రం తిమ్మరాజుపేటలోని ఓ మద్యం దుకాణంలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎక్సైజ్ అధికారులు శనివారం మధ్యాహ్నం దుకాణంపై దాడి చేశారు. ఎలాంటి సీళ్లు లేని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దుకాణాన్ని సీజ్ చేసి, ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేశారు. -
బార్ కోడింగ్ భారం
నెలాఖరు నాటికి కంప్యూటర్లు ప్రతి మద్యం దుకాణంలో తప్పనిసరిగా కంప్యూటర్, హోలోగ్రామ్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాట్లు చేసుకోని వారికి లెసైన్స్‌లు ఇవ్వబోమని ఇప్పటికే స్పష్టం చేశాం. తణుకు సర్కిల్ పరిధిలో అందరు వ్యాపారులు రూ.5 వేలు చొప్పున చెల్లించారు. ఈ నెలాఖరు నాటికి అన్ని మద్యం షాపుల్లో కంప్యూటర్లు, హోలోగ్రామ్ మెషీన్లు ఏర్పాటు చేస్తాం. - టి.సత్యనారాయణమూర్తి, ఎక్సైజ్ సీఐ, తణుకు. తణుకు : మద్యం విక్రయించే దుకాణాల్లో బార్ కోడింగ్ విధానం ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపై ప్రతి మద్యం దుకాణంలో కంప్యూటర్ ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనను ఈ ఏడాది నుంచి ఎక్సైజ్ శాఖ తప్పనిసరి చేసింది. మార్కెట్లో రూ. 45 వేలకు వచ్చే కంప్యూటర్ను సంబంధిత కాంట్రాక్టు సంస్థ రూ. 1.20 లక్షలుగా నిర్ణయించింది. దీని నిమిత్తం నెలకు రూ. 5 వేలు చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. మద్యం దుకాణదారులు కంప్యూటర్‌తోపాటు హోలోగ్రామ్ మిషన్ కొనుగోలు చేస్తేనే మద్యం లెసైన్సులు ఇస్తామని, మద్యం నిల్వలు ఇస్తామని వ్యాపారులకు అధికారులు తెగేసి చెబుతుండటం జిల్లాలో వివాదంగా మారింది. ఆంక్ష లతో వ్యాపారులకు చిక్కులు జిల్లాలో 397 మద్యం దుకాణాలు దాదాపు 40 బార్లు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ప్రకారం బార్, మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతి మద్యం సీసాపై ఉన్న హోలోగ్రామ్‌ను స్కాన్ చేసి విక్ర యించాల్సి ఉంటుంది. దీంతో తయారీ వివరాలు, విక్రయదారుని వివరాలు కంప్యూటర్లో నిక్షిప్తమవుతాయి. ఇక్కడి వివరాలు మద్యం డిపోలు, డిస్టలరీస్లోని సాఫ్ట్వేర్లకు అనుసంధానం చేస్తే పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం అంటోంది. మరోవైపు బహిరంగ మార్కెట్లో రూ. 45 వేలు విలువ చేసే కంప్యూటర్, ఇతరత్రా పరికరాలను రెండేళ్లకు రూ. 1.20 లక్షలు అద్దె చెల్లించాలని, ఒకవేళ కంప్యూటర్ పాడైతే రూ. 80 వేలు కొనుగోలు ఖరీదు చెల్లించాలని ఆంక్షలు విధించడం వ్యాపారులకు మింగుడు పడడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన అపిట్కో నిర్ధేశించిన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే వినియోగించాలని మరో మెలిక పెట్టారు. కార్వే సంస్థకు చెందిన కంప్యూటర్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. కంప్యూటర్లు ఏర్పాటు చేసుకున్నా లేకున్నా నెలకు రూ. 5 వేలు చెల్లించాల్సిందేనని అధికారులు తేల్చి చెబుతున్నారు. గతంలో విఫలమైనా... మద్యం విక్రయాల్లో బార్‌కోడింగ్ విధానాన్ని గత ఏడాదే ప్రవేశపెట్టాలని అధికారులు భావించినా వ్యాపారులు సహకరించకపోవడంతో అమలు కాలేదు. కొందరు వ్యాపారులు కంప్యూటర్లు కొనుగోలు చేసినప్పటికీ అవి అలంకారప్రాయమే అయ్యాయి తప్ప అక్కరకు రాలేదు. ఈ పరిస్థితుల్లో మరోసారి బార్‌కోడింగ్ అంటూ వ్యాపారులను పరుగులెత్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో లేని బార్‌కోడింగ్ విధానం లెసైన్సు దుకాణాల్లో తప్పనిసరి చేయడం సబబు కాదంటున్నారు. ఆన్లైన్ ధరలు, అమ్మకాల కోసం బార్ కోడింగ్ విధానం తీసుకురావడం అభినందనీయమే అయినా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయకుండా నెల వారీ వాయిదాలకు ఎక్సైజ్ శాఖ తెర తీయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మహిళలు తలచుకుంటే సీఎం కూడా దిగిపోవాల్సిందే
మందుబాబుల ఆగడాలతో కదంతొక్కిన మహిళలు {పభుత్వ మద్యం దుకాణం ఎత్తివేయాలని రాస్తారోకో, ధర్నా ఎక్సైజ్ సీఐ కార్యాలయం ముట్టడి యలమంచిలి : ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్ధినులు, మహిళలు, మహిళా ఉద్యోగులు ఆ మార్గాల మీదుగా వెళ్లలేకపోతున్నారు. మందుబాబుల ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. వారి వేధింపులు భరించలేకపోతున్నాం. అత్యంత రద్దీగా ఉండే సీత, తులసీ థియేటర్ల మార్గంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయడమేమిటి? ఈ దుకాణాన్ని అక్కడ నుంచి తరలించాలని ఎంతమందికి చెప్పినా అరణ్యరోదనే అవుతోంది. వెంటనే మందుబాబుల ఆగడాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు మద్యం దుకాణాన్ని అక్కడ నుంచి తరలించాల్సిందేనంటూ సోమవారం యలమంచిలి పట్టణంలోని 6, 7, 8, 9 వార్డులకు చెందిన మహిళా సంఘాల నేతలు, స్థానిక మహిళలు భారీ ఆందోళన చేపట్టారు. ఎక్సైజ్ సీఐ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై రాస్తారోకో, ధర్నా చేపట్టారు. వాహనాల రాకపోకలు అడ్డుకుని నినాదాలు చేశారు. మానవహారంగా ఏర్పడి ఎక్సైజ్ సీఐ, సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం ఎక్సైజ్ సీఐ కార్యాలయాన్ని ముట్టడించారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ జి.బాలకృష్ణ మహిళా కానిస్టేబుళ్లు, సిబ్బందితో రాస్తారోకో జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని మహిళలకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఎక్సైజ్ సీఐ కార్యాలయంలో డ్యూటీలో ఉన్న సెంట్రీ మహిళా కానిస్టేబుల్‌కు మహిళలు వినతి పత్రం ఇచ్చి, రెండు రోజుల్లోగా ప్రభుత్వ మద్యం దుకాణం వేరేచోటికి మార్చకపోతే మహిళల సత్తా ఏమిటో చూపుతామని హెచ్చరించారు. మహిళలు ధర్నా చేస్తున్న సమయంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ‘మీకేం పనిలేదా ?’ అనడంతో ఆందోళన చేస్తున్న మహిళలు మరింత ఆగ్రహానికి గురయ్యారు. తాము ఎవరితోనూ మాటలు పడాల్సిన పనిలేదని, మహిళలను చులకనగా చూస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. మహిళల జోలికి వచ్చినా, అవమానించినా ముఖ్యమంత్రి కూడా కుర్చీదిగిపోవాల్సి వస్తుందని అన్నారు. ఆందోళన కార్యక్రమంలో కరణం రమాదేవి, కాండ్రేగుల నూకరత్నం, వేగి పుష్ప, మళ్ల సరోజిని, కర్రి లక్ష్మి, దొడ్డి పావని, శీరందాసు సూర్యకుమారి, వై.లక్ష్మి, దాడి మంగ, మారిశెట్టి నూకరత్నం, సత్యవతి సహా పలువురు మహిళలు పాల్గొన్నారు. -
ఒకే రాత్రి మూడు చోరీలు
అమలాపురం టౌన్ : కోనసీమలో ఆదివారం అర్ధరాత్రి వేర్వేరు చోట్ల మూడు చోరీలు జరిగాయి. అమలాపురం పట్టణంలో సాయిబాబా ఆలయంతోపాటు, ఓ మద్యం దుకాణంలో జరిగిన రెండు చోరీల్లో రూ.13.50 లక్షల సొత్తు దోపిడీకి గురైంది. ఈ ఘటనలు సంచలనం కలిగించాయి. అమలాపురం ఎర్రవంతెన సమీపంలో 216 జాతీయ రహదారి పక్కన ఉన్న సాయి షిర్డీ స్వర్ణ మందిరంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు చొరబడి విగ్రహానికి అలంకరించిన రూ.12 లక్షల విలువైన 32 కిలోల వెండి తొడుగులు, వస్తువులను దోచుకుపోయారు. సోమవారం అమలాపురం పట్టణ సీఐ వై.ఆర్.కె.శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ నుంచి క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించాయి. ఆదివారం రాత్రి 9 గంటలకు రోజూలాగే హారతిచ్చి ఆలయం తలపులు మూసి తాళాలు వేశారు. సోమవారం తెల్లవారుజామున ఆలయం తలుపులు తీసేసరికి ఈశాన్యం వైపు ఉన్న తలుపులకు ఉన్న తాళం కప్ప బద్దలకొట్టి ఉండడాన్ని సిబ్బంది గమనించారు. సాయి విగ్రహం వద్ద 16 కిలోల వెండి సింహ ఆకార తొడుగులు, 14కిలోల వెండితో ఉన్న సాయి పాద పీఠం, మూడు కిలోల నెమలి ఆకార తొడుగులు, ఒక కిలో వెండి జగ్గులు తస్కరణకు గురైనట్టు గుర్తించారు. తలుపుల వద్ద ఇనుపరాడ్ పడి ఉండడంతో దాంతోనే తాళాలు పగలగొట్టినట్టు తెలుస్తోంది. విగ్రహం వద్ద మొత్తం రూ.60 లక్షల విలువైన దాదాపు 90 కిలోల వెండి ఆభరణాలు ఉండగా, దొంగలు 32 కిలోల వెండి వస్తువులనే దొంగిలించారు. సమయం సరిపోకో.. అన్ని వస్తువులు తీసుకెళ్లటం సాధ్యం కాకో.. మిగిలినవి వదిలేసి ఉండవచ్చని భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ 216 జాతీయ రహదారిపై వరకు వచ్చి ఆగిపోయాయి. దీంతో దొంగలు ఏదైనా వాహనంపై వచ్చి చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చేయితిరిగిన నేరస్తులే ఈ చోరీ చేసి ఉంటారని భావిస్తున్నారు. క్రైం పార్టీతో దర్యాప్తు ప్రారంభించారు. ఉన్నా పనిచేయని సీసీ కెమెరాలు స్వర్ణసాయి షిర్డీ మందిరం కోనసీమ వ్యాప్తంగా ప్రాచూర్యం పొందింది. అనేక మంది భక్తులు నిత్యం సాయిని దర్శించుకుంటుంటారు. ఆ ఆలయానికి సీసీ కెమెరాల సౌకర్యం కూడా ఉంది. అయితే అవి ప్రస్తుతం పనిచేయడం లేదు. ఇటీవల పట్టణ పోలీసులు జన సందోహం ఎక్కువగా ఉండే దుకాణాలు, ఆలయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటుచేసుకోవాలని నోటీసులు జారీ చేసినా ఆలయ నిర్వాహకులు అలక్ష్యం వహించారని పట్టణ సీఐ శ్రీనివాస్ అన్నారు. మద్యం దుకాణంలోనూ చోరీ అమలాపురం గడియారంస్తంభం సెంటరులోని లక్ష్మి వైన్స్ దుకాణంలోనూ దొంగలు చొరబడి రూ.1.48 లక్షలు దోచుకున్నారు. దుకాణంలోని లోపలి తలుపులను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. క్లూస్‌టీమ్, డాగ్ స్వ్కాడ్ తనిఖీ చేశాయి. దుకాణ యజమాని శేఖర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కేశవస్వామి ఆలయంలోనూ చోరీ అయినవిల్లి : ముక్తేశ్వరంలోని కేశవస్వామి ఆలయంలోనూ ఆదివారం రాత్రి చోరి జరిగింది. ఆలయ మేనేజర్ బొక్కా వీరవెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి 11.30 గంటలకు దొంగ ప్రవేశించి తలపు తాళాలు ధ్వంసం చేసి అమ్మవారి మేడలో ఉన్న రోల్డు గోల్డ్ నగలను బంగారు నగలుగా భావించి తీసుకుపోయాడు. ఈలోపు స్థానికం గా ఉంటున్న ఆలయ అర్చకుడు రవిశ ర్మ అలికిడి వినిపించి వచ్చే సరికి దొంగ పారిపోయాడు.అయినవిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మద్యం కల్తీ.. జేబు లూటీ
మద్యం ప్రియులకు కిక్కు దిగిపోయే విషయమిది. సీలు మద్యం సీసాలో ‘స్పిరిట్’ చేరుతోంది. సర్కారు పుణ్యమా అంటూ బార్లు బార్లాగా తెరవడంతో మద్యం విక్రయాలు కూడా పెరిగాయి. ఎమ్మార్పీ ధరలకు మించి అమ్మకాలు జరుగుతున్నాయి. అధికార పక్ష నాయకుల ఆశీస్సులున్న దుకాణాల వైపు అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు రాత్రివేళల్లో గుట్టుచప్పుడు కాకుండా మద్యంలో స్పిరిట్ కలిపి కల్తీ చేస్తున్నారు. దీంతో మందుబాబులు మరింత అనారోగ్యం పాలవుతున్నారు. * మందుబాబులకు టోకరా *మత్తు కోసం ‘స్పిరిట్’ వినియోగం * రోజుకు రూ.30 వేలు అక్రమార్జన * శివారు ప్రాంతాలే టార్గెట్ * అనారోగ్యం పాలవుతున్న మద్యం ప్రియులు కైకలూరు : సాయంత్రం 6 గంటలు.. కైకలూరు పట్టణ శివారులోని ఓ మద్యం దుకాణం.. రోజంతా కష్టపడిన కూలీలు మద్యం కోసం కౌంటర్ వద్ద గుమిగూడారు. ఇంతలో ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి రెండు క్వార్టర్ల మద్యం కొన్నారు. ఓ చేపల చెరువు గట్టుపై కూర్చుని తాగడం మొదలుపెట్టారు. అలా నోటి దగ్గర పెట్టారో లేదో వాంతులయ్యాయి. అసలు విషయం ఏమిటంటే అది కల్తీ మద్యం. వివిధ బ్రాండ్లకు చెందిన క్వార్టర్, హాఫ్ సీసాల్లో ఈ కల్తీ ఎక్కువగా జరుగుతోంది. సీసాల మూతలను చాకచక్యంగా తీసి అందులో కొంత మద్యాన్ని తీసి, అనుమానం రాకుండా నీరు, స్పిరిట్‌తో నింపేస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులు తాగే మందులో నాణ్యత ఎంత అనేది నేడు ప్రశ్నార్థకంగా మారింది. మందు బాబులు దుకాణదారులను గట్టిగా నిలదీద్దామంటే.. గొడవ జరిగితే పరువు పోతుందని మిన్నకుంటున్నారు. కొంతమంది కల్తీ మందు అంటగట్టారని అడిగితే అదేదో సీసా మూత తీయకముందే చెప్పాలంటూ దుకాణ సిబ్బంది వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. కల్తీ ఎలా జరుగుతోందంటే... మద్యం దుకాణం మూసేసిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతును దుకాణంలో పనిచేసే సిబ్బందితో చేయిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ అమ్మకాలు జరిగే బ్రాండ్లపై వీరు దృష్టి సారిస్తున్నారు. మూడు అంగుళాల సైజులో స్క్రూ డ్రైవర్ (కనెక్టర్) అనే చిన్న పరికరంతోసీసా మూతను తీస్తున్నారు. ఒక్కో బాటిల్ నుంచి మద్యం తీసి, దాని స్థానంలో నీరు, ‘స్పిరిట్’ కలుపుతున్నారు. తిరిగి యథావిధిగా మూతను పెడుతున్నారు. అలా సేకరించిన మద్యాన్ని ఖాళీ ఫుల్బాటిల్స్లో పోసి దుకాణం వద్ద లూజు విక్రయాల్లో వినియోగిస్తున్నారు. ఎక్కువగా మెన్స్‌క్లబ్, ఎంసీ బ్రాందీ, ఎంసీ విస్కీ బ్రాండ్లలో కల్తీ చేస్తున్నారు. కల్తీ చేసిన మద్యం సీసాలను తాము గుర్తించడం కోసం దుకాణంలో ఒక అరలో పెడుతున్నారు. రోజూ వచ్చే వ్యక్తులకు కాకుండా కొత్తవారు, ప్రయాణంలో వెళుతూ ఆగి తీసుకునేవారికి కల్తీ చేసిన మందును అంటగడుతున్నారు. కల్తీలో ఉపయోగించే స్పిరిట్‌ను మందుల దుకాణాల్లో తీసుకుంటున్నారు. కేసుకు రూ.1,850 లాభం... కల్తీదారులు ఒక క్వార్టర్ బాటిల్ నుంచి 60 ఎంఎల్ మద్యం తీస్తున్నారు. సాధారణంగా క్వార్టర్‌కు 180 మిల్లీలీటర్ల మద్యం ఉంటుంది. దీనిని ఒక్కో పెగ్గుగా మూడు బాగాలుగా విభజిస్తారు. పెగ్గు 60 ఎంఎల్‌గా ఉంటుంది. ఉదాహరణకు ఒక రకం బ్రాందీ క్వార్టర్ సీసాకు రూ.115 వసూలు చేస్తున్నారు. దీనిని బట్టి కేసులోని 48 బాటిళ్లలో పెగ్గు మందు చొప్పున తీస్తే వారికి రూ.1,850 మిగులుతుంది. బ్రాండు రేటు పెరిగితే ఆదాయం మరింత పెరుగుతుంది. దీనికి తోడు ఈ విధంగా సేకరించిన మద్యాన్ని ఖాళీ ఫుల్ బాటిల్స్‌లో పోసినప్పుడు నీటిని కలుపుతున్నారు. అంటే లూజు విక్రయాల ద్వారా మరికొంత ఆదాయం వస్తుంది. ఇక బాటిల్లో కల్తీ చేసే ‘స్పిరిట్’ 500 ఎంఎల్ ధర సుమారు రూ.150 ఉంటుంది. దీనిని ప్రభుత్వాస్పత్రుల్లో శస్త్రచికిత్సల సమయంలో పైపూతగా వాడతారు. స్పిరిట్‌లో ఆల్కహాల్ ఇమిడి ఉంటుంది. ఒక కేసుకు రెండు స్పిరిట్ బాటిళ్లను వినియోగిస్తారు. దీనిని బయట మందుల దుకాణాల్లో విక్రయించడం లేదు. ఆస్పత్రుల నుంచి వీటిని సేకరిస్తున్నట్లు సమాచారం. స్పిరిట్ అందుబాటులో లేనప్పుడు చీప్ క్వార్టర్ బాటిళ్లలోని మందును నింపుతున్నారు. ప్రధాన బ్రాండ్ల విషయంలో స్పిరిట్ వాసన వచ్చే అవకాశం ఉన్నప్పుడు నీళ్లు కలిపి మూత బిగించేస్తున్నారు. అమలుకు నోచని ‘ఎమ్మార్పీ’ విక్రయాలు... ఎమ్మార్పీ ధరలకు మద్యం విక్రయాలు జరగాలని అధికారులు ఆదేశాలిస్తున్నా అనేక చోట్ల అమలు కావడం లేదు. క్వార్టర్‌కు రూ.5, హాఫ్‌కు రూ.10, ఫుల్ బాటిల్‌కి రూ.20 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదేమిటని సామాన్యులు అడిగితే అధికార సిండికేట్లు రంగంలోకి దిగితున్నారు. వాళ్ల అండ చూసుకుని దుకాణాల్లో పనిచేసే సిబ్బంది రెచ్చిపోతున్నారు. రాత్రిపూట నిర్ణీత సమయం దాటిన తరువాత కూడా విక్రయాలు సాగిస్తున్నారు. అదేమిటంటే ‘అధికారం మాది.. రాత్రి ఎన్ని గంటలైనా అమ్ముతాం ఏంటంటా?’ అని సమాధానం ఇస్తున్నారు. అధికార పక్ష అండదండలున్న దుకాణాల వైపు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదు. కొద్ది నెలల క్రితం ఓ దుకాణంలో కల్తీ మద్యం కొనుగోలు చేసిన వ్యక్తి, ఇంటికి వెళ్లిన తర్వాత గుర్తించి దుకాణంలో సిబ్బందితో గొడవకు దిగాడు. దీంతో అతనికి మరో బాటిల్ అందించారు. ఇటీవల కైకలూరులో రాత్రివేళ మందు తాగిన యువకులను గొడ్డును బాదినట్లు బాదిన ఓ ఎస్సై ఆ సమయంలో తెరిచి ఉన్న మద్యం దుకాణం జోలికి వెళ్లకపోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న కల్తీ విక్రయాలపై కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తాం కల్తీ మద్యం అమ్మకాలపై ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే దుకాణదారులపై కేసులు నమోదు చేస్తామని కైకలూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ సి.భార్గవ చెప్పారు. అనుమానం కలిగిన మద్యం బాటిళ్లను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేసిన తర్వాత కల్తీ కలిసిందని తెలిస్తే సదరు దుకాణదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
కళ్లు తెరవండి!
కల్లు డిపోలను వ్యతిరేకిస్తూ 150 ఫిర్యాదులు చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు కల్లు కాంపౌండ్లలో ఆ ముగ్గురిదే రాజ్యం సాక్షి, సిటీబ్యూరో: జనావాసాల మధ్య కల్లు డిపోల ఏర్పాటుపై మహిళా లోకం భగ్గుమంటోంది. ఇప్పటికే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎక్కడో ఓ చోట నిత్యం మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నేరాల అదుపునకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా దసరా రోజున 119 కల్లు డిపోల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సర్వత్రా నిరసన వెల్లువెత్తుతోంది. ఈ విషయమై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఆబ్కారీ శాఖ పత్రికా ప్రకటన విడుదల చేయడంతో మంగళవారం నగరంలోని ధూల్‌పేట, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్సైజ్ డివిజన్ల పరిధిలో వందకుపైగా ఫిర్యాదులు అందాయి. గతంలో 50 వరకు వచ్చిన ఫిర్యాదులు 150కి చేరడం గమనార్హం. ముఖ్యంగా మలక్ పేట్, మల్కాజ్గిరి, దోమల్‌గూడ, అదిక్మెట్, చిక్కడపల్లి, రసూల్‌పురా, పురానాపూల్, ఆసిఫ్‌నగర్, గౌలిగూడ, ఆసిఫ్‌నగర్, కోమటికుంట, ఎర్రగడ్డ, సైదాబాద్ ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీలు, పాఠశాలలు, ప్రార్థన స్థలాలకు సమీపంలో కల్లు డిపోలను ఏర్పాటు చేయరాదని పలువురు ఫిర్యాదు చేశారు. ఆయా ప్రాంతాల్లో లెసైన్సులు దక్కించుకున్న వ్యాపారులు నిబంధనలకు నీళ్లొదిలి జనావాసాల మధ్యనే డిపోల ఏర్పాటుకు యత్నిస్తుండటం దారుణమని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. సర్వత్రా ఆందోళనల పర్వం స్థానికంగా కల్లు దుకాణం తెరవాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వివిధ సంఘాలు ఖైరతాబాద్ రైల్వేగేట్ వద్ద ఇటీవల నిరసన వ్యక్తం చేశాయి. అల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం, ఆల్ ఇండియా డెమొక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ‘బంగారు తెలంగాణ’ నిర్మిస్తామంటున్న ప్రభుత్వం కల్లు దుకాణాలు తెరిచి కాపురాలు, కుటుంబాలు, యువతరాన్ని మత్తులో ముంచేందుకు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల చాదర్‌ఘాట్‌లోని కల్లు కాంపౌండ్ మడి వద్ద పూజలు ప్రారంభించవద్దంటూ ఛత్రి సంస్థ ఆధ్వర్యంలో పలువురు ధర్నాకు దిగారు. మురికివాడలు అధికంగా ఉండే చాదర్‌ఘాట్‌లో కల్లుకు బానిసలైన పేదవారు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు నీళ్లు... ఆబ్కారీ శాఖ నిబంధనల ప్రకారం జనావాసాలు, కాలనీలు, బస్తీలు, విద్యాసంస్థలు, దేవాలయాలు, జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్లను ఏర్పాటు చేయరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత కల్లు డిపోలు తెరవనుండటంతో ఆత్రుతగా ఉన్న పలువురు కాంట్రాక్టర్లు స్థానికుల అభిప్రాయాలకు భిన్నంగా జనావాసాల మధ్యనే డిపోల ఏర్పాటుకు యత్నిస్తున్నారు. అక్రమాలకు సాక్ష్యం ఇదే మల్కాజ్గిరి ఇందిరా నెహ్రూ నగర్లో జనావాసాల మధ్య కల్లు కాంపౌండ్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్కడడిపో తెరవరాదంటూ స్థానిక మహిళలు కొంత కాలంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ముగ్గురి కనుసన్నల్లోనే నిబంధనలకు విరుద్ధంగా కల్లు డిపోలను తెరిచే విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు, నగర టీడీపీకి చెందిన మరో నేత, గతంలో నగర బహిష్కరణకు గురైన ఓ లిక్కర్ డాన్ ఉన్నట్లు సమాచారం. మొత్తం వీరి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కల్లు డిపోల కాంట్రాక్టర్ల అవతారం ఎత్తిన లీడర్లు గీత కార్మికుల పొట్ట కొట్టి కల్లు డిపోలను దొడ్డిదారిన దక్కించుకున్నారు. జనావాసాల మధ్య వాటి ఏర్పాటుకు యత్నిస్తున్నారు. ఫిర్యాదుల వెల్లువ జనావాసాల మధ్య డిపోలను తెరిచేందుకు కాంట్రాక్టర్లు ప్రయత్నిస్తుండడంతో కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు నగర ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్‌కు గతంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తాజాగా మంగళవారం వందకు పైగా ఫిర్యాదులు అందాయి. ఈ విషయమై డిప్యూటీ కమిషనర్ ఫారూఖీని వివరణ కోరగా, ఏదేని ఓ ప్రాంతంలో నూతనంగా పాన్ డబ్బా ఏర్పాటు చేసినా స్థానికుల నుంచి ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతాయని, ఇప్పుడూ అదే జరుగుతోందని వ్యాఖ్యానించడం గమనార్హం. మహిళలకు రక్షణ ఉండదు మల్కాజ్గిరి ఇందిరా నెహ్రూనగర్ కాలనీలో కల్లు కాంపౌండ్ ఏర్పాటుతో మహిళలకు రక్షణ ఉండదు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగే ప్రమాదం ఉంది.జనావాసాల మధ్య కాంపౌండ్ ఏర్పాటు చేయకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. - పద్మ, స్థానిక మహిళ కాంపౌండ్ ఇక్కడ వద్దు నివాస ప్రాంతంలో కాంపౌండ్ ఏర్పాటు చేయకుండా ఆబ్కారీ అధికారులు చర్యలు తీసుకోవాలి. చదువుకునే పిల్లలపై దుష్ర్పభావం పడుతుంది. మందుబాబులు ఇళ్లలో చొరబడి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉంది. కాలనీల్లో నిత్యం సమస్యలు తప్పవు. - రేణుక, గృహిణి -
షరా..మామూలే..
ఎక్సైజ్ శాఖలో అద్దె స్కానర్ల హడావుడి లెసైన్స్‌తో స్కానర్లకు లింకు కొనుగోలు స్థానంలో అద్దె ప్రతిపాదన నెలకు రూ.4,997 అద్దె 28లోపు ఏర్పాటు చేస్తామని వ్యాపారుల నుంచి అఫిడవిట్ సాక్షి, విజయవాడ : ఎక్సైజ్ శాఖ అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా చర్చనీయాంశమవడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ప్రతి మద్యం దుకాణంలో అద్దె ప్రాతిపదికన బార్కోడ్ స్కానర్లు ఏర్పాటు చేయాలని అఫిడవిట్లు స్వీకరించడం ఎక్సైజ్ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. మద్యం దుకణాల్లో అక్రమాలు నివారించేందుకు, స్టాకు వివరాలు తెలుసుకునేందుకు ప్రతి షాపులో బార్కోడ్ స్కాన్ మిషన్లు ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అధికారులు అన్ని షాపుల యజమానులకు సూచించారు. అయితే వ్యాపారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో అధికారులు కొత్త లెసైన్స్‌లతో లింకు పెట్టారు. స్కానర్ ఉంటేనే లెసైన్స్‌లు జారీ చేస్తామని నిబంధన విధించారు. గతంలో స్కానర్ల వ్యవహారం కొంత వివాదాస్పదమైంది. ఈ క్రమంలో స్కానర్ల కొనుగోలు కాకుండా, అద్దె ప్రాతిపదికన తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 28లోపు స్కానర్లు ఏర్పాటు చేస్తామని వ్యాపారుల నుంచి అధికారులు అఫిడవిట్లు స్వీకరిస్తున్నారు. శ్రీ టెక్నో సిస్టమ్స్‌కు బాధ్యతలు.. జిల్లాలో 301 మద్యం షాపులు, 156 బార్లు ఉన్నాయి. వీటిలో సొంతగా స్కానర్లు ఏర్పాటు చేయాలంటే రూ.4.10 కోట్లు ఖర్చవుతుంది. ఒక్కో వ్యాపారికి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. దీంతో స్కానర్ల ఏర్పాటును వ్యాపారులు వ్యతిరేకించారు. ప్రభుత్వం మాత్రం స్కానరు ఉంటేనే లెసైన్స్ ఇవ్వాలని, అవసరమైతే మద్యం సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు, వ్యాపారులు సమావేశమై అద్దె ప్రాతిపదికన స్కానర్లు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు రెండేళ్లకు అద్దెకు స్కానర్లు సరఫరా చేయాలని శ్రీ టెక్నో సిస్టమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కో షాపునకు నెలకు రూ.4,997 చొప్పున అద్దె చెల్లించేలా నిర్ణయించారు. ఈ లెక్కన శ్రీటెక్నో సిస్టమ్స్‌కు నెలకు రూ.22లక్షల వరకు అద్దె లభిస్తుంది. నెల రోజుల కిందట జరిగిన ఈ ఒప్పందానికి అన్ని దుకాణాలు, బార్ల యజమానులు అంగీకరించారు. అయితే నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు స్కానర్లు ఏర్పాటు చేయకపోవడంతో అధికారులు మళ్లీ హడావుడి చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీలోపు స్కానర్లు ఏర్పాటు చేసుకుంటామని అఫిడవిట్లు అందజేయాలని వ్యాపారులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటి వరకు పది శాతం మంది వ్యాపారులు మాత్రమే అఫిడవిట్లు సమర్పించారు. స్కానర్లు శ్రీటెక్నో సిస్టం నుంచే ఎందుకు అద్దెకు తీసుకోవాలని మరికొందరు తర్జనభర్జనపడుతున్నట్లు సమాచారం. -
మద్యం దుకాణం వద్దే వద్దు
ఒంగోలు టౌన్ : ‘కూలీ నాలీ చేసుకొని జీవిస్త్తున్నాం. నాలుగు రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. మా గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటుకు అధికారులు సిద్ధమయ్యారు. అలా చేస్తే తమ ఇళ్లు గుల్లవుతాయి. మద్యం మత్తులో గొడవలు జరుగుతాయి. మా గ్రామానికి మద్యం దుకాణం వద్దు’ అని సంతనూతలపాడు మండలం మైనంపాడుకు చెందిన పలువురు మహిళలు వేడుకున్నారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జరిగిన ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్‌ను కలిసి వారు సమస్యను విన్నవించారు. మైనంపాడు గ్రామంలో డైట్ కాలేజీ ఉందని, ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థినులు వస్తుంటారని, మందుబాబులు మద్యం మత్తులో వారిపై అసభ్యంగా ప్రవర్తించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా మండల కేంద్రమైన సంతనూతపాడులో మూడో మద్యం దుకాణం ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకోవాలని పలువురు కోరారు. ఇప్పటికే బస్టాండు సెంటర్లో రెండు దుకాణాలు ఉన్నాయని, తాజాగా మరొకటి ఏర్పాటుచేస్తే మద్యం మత్తులో ఎక్కువగా గొడవలు చోటుచేసుకునే ప్రమాదం ఉందన్నారు. కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు ‘గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఇర్లా రామకృష్ణతో నాకు వివాహమైంది. పెళ్లి సమయంలో ఇస్తామన్న కట్నాన్ని కొంచెం ఆలస్యంగా ఇచ్చాం. ఆ తరువాత అదనపు కట్నం కావాలంటూ నా భర్త, అత్తమామలు, బావ, మరిది, వారి కుటుంబ సభ్యులు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు’ అని సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలేనికి చెందిన ఇర్లా అశ్వని వాపోయింది. తన భర్త ఇండియన్ నేవీలో పనిచేస్తున్నాడని, ప్రస్తుతం తనకు ఒకటిన్నరేళ్ల వయస్సు కలిగిన పాప ఉందని వివరించింది. కుటుంబ సభ్యులు వేధింపులు ఎక్కువ కావడంతో తాను ఈ ఏడాది జూలై 23వ తేదీ సంతమాగులూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, తమ కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదని వాపోయారు. ధర్మతోపు భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలి 56సంవత్సరాల నుంచి శ్మశాన వాటికగా ఉపయోగించుకుంటున్న ధర్మతోపు భూమికి అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఒంగోలు నగరపాలక సంస్థలోని ముక్తినూతలపాడు క్రిష్టియన్పాలెం, హరిజనవాడలకు చెందిన వారు కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద శ్మశానవాటిక అభివృద్ధికి అధికారులు ముందుకొస్తే పులుసు ప్రకాశం అనే వ్యక్తి ఆ భూమి తాను కొనుగోలు చేశానని డాక్యుమెంట్లు చూపించారన్నారు. ధర్మతోపు స్థలానికి క్రయవిక్రయాలు జరపరాదని, ఆ భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసి శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ నిర్మించాలని కోరారు. స్థలాలు ఇప్పించాలి జిల్లాలోని యానాదులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని జిల్లా యానాది యువజన సంఘం కార్యదర్శి యాకసిరి అంజిబాబు కోరారు. గిరిజన తెగకు చెందిన యానాదులు నికరంలేని వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నామన్నారు. ఏళ్లు గడిచినా వారికి గూడు లేకుండా పోతుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని వేడుకున్నారు. అక్రమంగా వెలుస్తున్న గుడిసెలు ఒంగోలు నగరంలోని నేతాజీకాలనీలో అక్రమంగా గుడిసెలు వెలుస్తున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. ఏడేళ్ల నుంచి తాము అక్కడ నివసిస్తుంటే కొంతమంది తిరగడానికి వీలులేకుండా రోడ్లపైనే గుడిసెలు వేస్తున్నారన్నారు. ఎస్కే మీరావలి, చిరంజీవి, మోహన్ అనే వ్యక్తులు గుడిసెలు వేయిస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.15వేల చొప్పున వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకొని గుడిసెలను తొలగించాలని కోరారు. చెరువుకట్టను బాగుచేయించాలి ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని పెల్లూరు గ్రామ చెరువు కాలువ కట్టను బాగు చేయించాలని పలువురు రైతులు కోరారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు పడమర కట్ట తెగిందని, దీంతో నీరు నిలవడం లేదని తెలిపారు. వరి పంట సాగు చేసుకుంటూ జీవనం సాగించే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. -
మద్యం దుకాణం దగ్ధం
రూ.10 లక్షల విలువైన మద్యం నిరుపయోగం కైకలూరు మండలం వింజరం గ్రామంలో ఘటన వింజరం (కైకలూరు) : మండలంలోని వింజరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మద్యం దుకాణం, ఓ పూరిల్లు కాలిపోయాయి. వివరాల ప్రకారం.. కలిదిండి మండలం ఆవకూరు గ్రామానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ్యకు చెందిన ఈ దుకాణా న్ని ఇటీవలే ఏర్పాటు చేశారు. షాపులోనుంచి శుక్రవారం తెల్లవారుజామున మంటలు వస్తుండటాన్ని అటుగా వెళుతున్న ఆటో డ్రైవర్ చూసి పోలీసులకు సమాచారం అందించాడు. కైకలూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. పోలీసులు, గుమస్తా కొండవీటి వెంకట కృష్ణ తెలి పిన వివరాల ప్రకారం గురువారం సా యంత్రం దుకాణాన్ని మూసి వెళ్లారు. దుకాణం వద్ద ఓ వ్యక్తి రోజూ బజ్జీలు అ మ్ముకుంటూ వెనుకభాగంలోని పాకలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతడు కుటుంబంతో సహా బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తి పాకకు నిప్పంటించడంతో మంటలు వ్యాపించి ఉంటాయని భా విస్తున్నారు. ఈ ఘటనలో రూ. 10 లక్షలు విలువ చేసే మద్యం పాడైందని, రూ.80 వేల నగదు కాలిపోయిందని నష్టపోయామని గుమస్తా చెబుతున్నాడు. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా జరిగిందని భావించడానికి ఈ దుకాణానికి విద్యుత్ సర్వీసు లేదు. జనరేటర్‌ను వాడుతున్నారు. ఎవరో నిప్పంటించి ఉంటారని పోలీ సు లు భావిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఇంటిలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి శకలాలు రోడ్డుపైన, పక్కన ఉన్న పొలంలో పడ్డాయి. ఈ ఘటన జరిగినప్పుడు జనసంచారం ఉంటే ప్రమాదబారిన పడేవారని స్థానికులు చెబుతున్నారు. దుకాణం వెనుక నివసిస్తున్న బజ్జీల వ్యాపారితో విరో ధం ఉన్నవారు ఎవరైనా ఈ పని చేశారా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. టీడీపీ కలి దిండి మండల అధ్యక్షుడు శ్రీని వాసచౌదరి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై టౌన్ అదనపు ఎస్ఐ షబ్బిర్ అ హ్మద్ కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. -
మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లాలో మిగిలిపోయిన 34 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి శనివారం గెజిట్ విడుదల చేశారు. జనాభ ప్రాతిపదికన లెసైన్స్ ఫీజు స్లాబ్ ప్రకారం నిర్దేశించి దుకాణాలను కేటాయించనున్నారు. పదివేల జనాభా ఉన్న ప్రాంతంలో రూ. 32.50 లక్షలు, 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతంలో రూ.34 లక్షలు, మూడు లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతంలో రూ.42 లక్షలు స్లాబ్ పద్ధతిన లెసైన్స్ ఫీజును నిర్దేశించారు. జిల్లాలో 32.50 లక్షల లెసైన్స్ ఫీజు ఉన్న దుకాణాలు 17, 34 లక్షలు లెసైన్స్ ఫీజు ఉన్న దుకాణాలు 12, 42 లక్షల లెసైన్స్ ఫీజున్న దుకాణాలు 5 ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుర్జీత్ సింగ్ తెలిపారు. దరఖాస్తుతో పాటు డిక్లరేషన్ ఫారం-డీ-ఏ1, స్థిర ఆస్తి వివరాల అఫిడవిట్ ఏ2, డిక్లరేషన్ ఫారం-3లో తహశీల్దారు లేదా ఎక్సైజ్ గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్ చేయించి రెండు పాస్‌ఫోర్ట్ సైజు ఫొటోలు జత చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే దరఖాస్తు రుసుం రూ.25 వేలు(డీడీ), లెసైన్స్ ఫీజులో పది శాతం ఈఎండీ కోసం (5 లక్షల వరకు) డీడీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేరుతో చెల్లించాలి. 5వ తేదీ ఉదయం 11 గంటలకు ఎక్సైజ్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు.