
కళ్లు తెరవండి!
- కల్లు డిపోలను వ్యతిరేకిస్తూ 150 ఫిర్యాదులు
- చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు
- కల్లు కాంపౌండ్‌లలో ఆ ముగ్గురిదే రాజ్యం
సాక్షి, సిటీబ్యూరో: జనావాసాల మధ్య కల్లు డిపోల ఏర్పాటుపై మహిళా లోకం భగ్గుమంటోంది. ఇప్పటికే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎక్కడో ఓ చోట నిత్యం మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నేరాల అదుపునకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా దసరా రోజున 119 కల్లు డిపోల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సర్వత్రా నిరసన వెల్లువెత్తుతోంది.
ఈ విషయమై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఆబ్కారీ శాఖ పత్రికా ప్రకటన విడుదల చేయడంతో మంగళవారం నగరంలోని ధూల్‌పేట, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్సైజ్ డివిజన్ల పరిధిలో వందకుపైగా ఫిర్యాదులు అందాయి. గతంలో 50 వరకు వచ్చిన ఫిర్యాదులు 150కి చేరడం గమనార్హం. ముఖ్యంగా మలక్ పేట్, మల్కాజ్‌గిరి, దోమల్‌గూడ, అదిక్‌మెట్, చిక్కడపల్లి, రసూల్‌పురా, పురానాపూల్, ఆసిఫ్‌నగర్, గౌలిగూడ, ఆసిఫ్‌నగర్, కోమటికుంట, ఎర్రగడ్డ, సైదాబాద్ ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీలు, పాఠశాలలు, ప్రార్థన స్థలాలకు సమీపంలో కల్లు డిపోలను ఏర్పాటు చేయరాదని పలువురు ఫిర్యాదు చేశారు. ఆయా ప్రాంతాల్లో లెసైన్సులు దక్కించుకున్న వ్యాపారులు నిబంధనలకు నీళ్లొదిలి జనావాసాల మధ్యనే డిపోల ఏర్పాటుకు యత్నిస్తుండటం దారుణమని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.
సర్వత్రా ఆందోళనల పర్వం
స్థానికంగా కల్లు దుకాణం తెరవాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వివిధ సంఘాలు ఖైరతాబాద్ రైల్వేగేట్ వద్ద ఇటీవల నిరసన వ్యక్తం చేశాయి. అల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం, ఆల్ ఇండియా డెమొక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ‘బంగారు తెలంగాణ’ నిర్మిస్తామంటున్న ప్రభుత్వం కల్లు దుకాణాలు తెరిచి కాపురాలు, కుటుంబాలు, యువతరాన్ని మత్తులో ముంచేందుకు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల చాదర్‌ఘాట్‌లోని కల్లు కాంపౌండ్ మడి వద్ద పూజలు ప్రారంభించవద్దంటూ ఛత్రి సంస్థ ఆధ్వర్యంలో పలువురు ధర్నాకు దిగారు. మురికివాడలు అధికంగా ఉండే చాదర్‌ఘాట్‌లో కల్లుకు బానిసలైన పేదవారు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
నిబంధనలకు నీళ్లు...
ఆబ్కారీ శాఖ నిబంధనల ప్రకారం జనావాసాలు, కాలనీలు, బస్తీలు, విద్యాసంస్థలు, దేవాలయాలు, జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్‌లను ఏర్పాటు చేయరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత కల్లు డిపోలు తెరవనుండటంతో ఆత్రుతగా ఉన్న పలువురు కాంట్రాక్టర్లు స్థానికుల అభిప్రాయాలకు భిన్నంగా జనావాసాల మధ్యనే డిపోల ఏర్పాటుకు యత్నిస్తున్నారు.
అక్రమాలకు సాక్ష్యం ఇదే
మల్కాజ్‌గిరి ఇందిరా నెహ్రూ నగర్‌లో జనావాసాల మధ్య కల్లు కాంపౌండ్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్కడడిపో తెరవరాదంటూ స్థానిక మహిళలు కొంత కాలంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ ముగ్గురి కనుసన్నల్లోనే
నిబంధనలకు విరుద్ధంగా కల్లు డిపోలను తెరిచే విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు, నగర టీడీపీకి చెందిన మరో నేత, గతంలో నగర బహిష్కరణకు గురైన ఓ లిక్కర్ డాన్ ఉన్నట్లు సమాచారం. మొత్తం వీరి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కల్లు డిపోల కాంట్రాక్టర్ల అవతారం ఎత్తిన లీడర్లు గీత కార్మికుల పొట్ట కొట్టి కల్లు డిపోలను దొడ్డిదారిన దక్కించుకున్నారు. జనావాసాల మధ్య వాటి ఏర్పాటుకు యత్నిస్తున్నారు.
ఫిర్యాదుల వెల్లువ
జనావాసాల మధ్య డిపోలను తెరిచేందుకు కాంట్రాక్టర్లు ప్రయత్నిస్తుండడంతో కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు నగర ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్‌కు గతంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తాజాగా మంగళవారం వందకు పైగా ఫిర్యాదులు అందాయి. ఈ విషయమై డిప్యూటీ కమిషనర్ ఫారూఖీని వివరణ కోరగా, ఏదేని ఓ ప్రాంతంలో నూతనంగా పాన్ డబ్బా ఏర్పాటు చేసినా స్థానికుల నుంచి ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతాయని, ఇప్పుడూ అదే జరుగుతోందని వ్యాఖ్యానించడం గమనార్హం.
మహిళలకు రక్షణ ఉండదు
మల్కాజ్‌గిరి ఇందిరా నెహ్రూనగర్ కాలనీలో కల్లు కాంపౌండ్ ఏర్పాటుతో మహిళలకు రక్షణ ఉండదు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగే ప్రమాదం ఉంది.జనావాసాల మధ్య కాంపౌండ్ ఏర్పాటు చేయకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి.
- పద్మ, స్థానిక మహిళ
కాంపౌండ్ ఇక్కడ వద్దు
నివాస ప్రాంతంలో కాంపౌండ్ ఏర్పాటు చేయకుండా ఆబ్కారీ అధికారులు చర్యలు తీసుకోవాలి. చదువుకునే పిల్లలపై దుష్ర్పభావం పడుతుంది. మందుబాబులు ఇళ్లలో చొరబడి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉంది. కాలనీల్లో నిత్యం సమస్యలు తప్పవు.
- రేణుక, గృహిణి