నెలాఖరు నాటికి కంప్యూటర్లు ప్రతి మద్యం దుకాణంలో తప్పనిసరిగా కంప్యూటర్, హోలోగ్రామ్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాట్లు చేసుకోని వారికి లెసైన్స్‌లు ఇవ్వబోమని ఇప్పటికే స్పష్టం చేశాం. తణుకు సర్కిల్ పరిధిలో అందరు వ్యాపారులు రూ.5 వేలు చొప్పున చెల్లించారు. ఈ నెలాఖరు నాటికి అన్ని మద్యం షాపుల్లో కంప్యూటర్లు, హోలోగ్రామ్ మెషీన్లు ఏర్పాటు చేస్తాం.
- టి.సత్యనారాయణమూర్తి, ఎక్సైజ్ సీఐ, తణుకు.
తణుకు : మద్యం విక్రయించే దుకాణాల్లో బార్ కోడింగ్ విధానం ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపై ప్రతి మద్యం దుకాణంలో కంప్యూటర్ ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనను ఈ ఏడాది నుంచి ఎక్సైజ్ శాఖ తప్పనిసరి చేసింది. మార్కెట్‌లో రూ. 45 వేలకు వచ్చే కంప్యూటర్‌ను సంబంధిత కాంట్రాక్టు సంస్థ రూ. 1.20 లక్షలుగా నిర్ణయించింది. దీని నిమిత్తం నెలకు రూ. 5 వేలు చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. మద్యం దుకాణదారులు కంప్యూటర్‌తోపాటు హోలోగ్రామ్ మిషన్ కొనుగోలు చేస్తేనే మద్యం లెసైన్సులు ఇస్తామని, మద్యం నిల్వలు ఇస్తామని వ్యాపారులకు అధికారులు తెగేసి చెబుతుండటం జిల్లాలో వివాదంగా మారింది.
ఆంక్ష లతో వ్యాపారులకు చిక్కులు
జిల్లాలో 397 మద్యం దుకాణాలు దాదాపు 40 బార్‌లు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ప్రకారం బార్, మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతి మద్యం సీసాపై ఉన్న హోలోగ్రామ్‌ను స్కాన్ చేసి విక్ర యించాల్సి ఉంటుంది. దీంతో తయారీ వివరాలు, విక్రయదారుని వివరాలు కంప్యూటర్‌లో నిక్షిప్తమవుతాయి. ఇక్కడి వివరాలు మద్యం డిపోలు, డిస్టలరీస్‌లోని సాఫ్ట్‌వేర్‌లకు అనుసంధానం చేస్తే పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం అంటోంది. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో రూ. 45 వేలు విలువ చేసే కంప్యూటర్, ఇతరత్రా పరికరాలను రెండేళ్లకు రూ. 1.20 లక్షలు అద్దె చెల్లించాలని, ఒకవేళ కంప్యూటర్ పాడైతే రూ. 80 వేలు కొనుగోలు ఖరీదు చెల్లించాలని ఆంక్షలు విధించడం వ్యాపారులకు మింగుడు పడడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన అపిట్కో నిర్ధేశించిన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే వినియోగించాలని మరో మెలిక పెట్టారు. కార్వే సంస్థకు చెందిన కంప్యూటర్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. కంప్యూటర్లు ఏర్పాటు చేసుకున్నా లేకున్నా నెలకు రూ. 5 వేలు చెల్లించాల్సిందేనని అధికారులు తేల్చి చెబుతున్నారు.
గతంలో విఫలమైనా...
మద్యం విక్రయాల్లో బార్‌కోడింగ్ విధానాన్ని గత ఏడాదే ప్రవేశపెట్టాలని అధికారులు భావించినా వ్యాపారులు సహకరించకపోవడంతో అమలు కాలేదు. కొందరు వ్యాపారులు కంప్యూటర్లు కొనుగోలు చేసినప్పటికీ అవి అలంకారప్రాయమే అయ్యాయి తప్ప అక్కరకు రాలేదు. ఈ పరిస్థితుల్లో మరోసారి బార్‌కోడింగ్ అంటూ వ్యాపారులను పరుగులెత్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో లేని బార్‌కోడింగ్ విధానం లెసైన్సు దుకాణాల్లో తప్పనిసరి చేయడం సబబు కాదంటున్నారు. ఆన్‌లైన్ ధరలు, అమ్మకాల కోసం బార్ కోడింగ్ విధానం తీసుకురావడం అభినందనీయమే అయినా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయకుండా నెల వారీ వాయిదాలకు ఎక్సైజ్ శాఖ తెర తీయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బార్ కోడింగ్ భారం
Published Wed, Aug 5 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM
Advertisement