bar coding
-
ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి ప్రధాన పేపర్ల పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన పరీక్షలను ఆరు పేపర్లతో నిర్వహించారు. ప్రథమ భాష (పేపర్–1), ద్వితీయ భాష, ఇంగ్లిష్, మేథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు జరిగాయి. ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2, ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1, పేపర్–2, వొకేషనల్ కోర్సుల పేపర్లతో టెన్త్ పరీక్షలు పూర్తవుతాయి. జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 19 నుంచి 26 వరకు జరుగుతుంది. ఇతర ప్రక్రియలను కూడా ముగించి ఫలితాలను మే 2వ వారంలో విడుదల చేయనున్నారు. గతేడాది అనుభవాల దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు లీకులు, ఫేక్‌లకు ఆస్కారం లేకుండా విద్యా శాఖ జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి ప్రశ్నపత్రంపైనా ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించింది. పరీక్ష కేంద్రాల వారీగా ప్రశ్నపత్రాలకు బార్ కోడింగ్ పెట్టింది. దీంతో ఎక్కడా అవకతవకలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. కాపీయింగ్‌కు కూడా అడ్డుకట్ట పడింది. ఈ ఆరు రోజుల పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ కేసులు రాష్ట్రవ్యాప్తంగా 5 మాత్రమే నమోదయ్యాయి. గతేడాది ‘నారాయణ’ అక్రమాలు గతేడాది కొన్ని కార్పొరేట్ యాజమాన్యాలు విద్యా వ్యాపారాన్ని పెంచుకొనేందుకు అత్యధిక పాస్ పర్సంటేజీ, మార్కుల కోసం ప్రశ్నపత్రాల లీకులకు తెగబడ్డాయి. టీడీపీ పెద్దలతో అనుబంధమున్న ‘నారాయణ’ విద్యా సంస్థ దీనికి తెరతీసింది. తమ సంస్థల్లోని పిల్లలతో కాపీయింగ్ చేయించేలా, అదే తరుణంలో ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేసేలా వ్యవహారాన్ని నడిపించింది. కొందరు ప్రభుత్వ టీచర్లనూ మభ్యపెట్టింది. ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా దీనికి తోడయ్యారు. లీకులతో, సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ ప్రశ్నపత్రాల ప్రచారంతో విద్యార్థుల్లో గందరగోళం సృష్టించారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకొని కఠిన చర్యలు తీసుకుంది. అక్రమాలతో సంబంధమున్న పలువురు నారాయణ విద్యా సంస్థల సిబ్బందిని, ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లు, ఇతర వ్యక్తులపైనా కేసులు నమోదు చేసింది. 74 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమాలకు ప్రధాన కారణమైన నారాయణ విద్యా సంస్థల యాజమాన్యంపైనా కేసులు నమోదు చేశారు. ఈసారి పకడ్బందీ చర్యలు ఈసారి పరీక్షల్లో చిన్న ఘటనలకు కూడా తావివ్వకూడదన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విద్యా శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. పరీక్షల నిర్వహణలో పూర్తిగా ప్రభుత్వ సిబ్బందినే భాగస్వామ్యం చేసింది. గతంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇన్విజిలేటర్లు కాకుండా ఇతర సిబ్బంది ఆయా సంస్థల వారే ఉండేవారు. దీనివల్ల అక్రమాలకు ఎక్కువ ఆస్కారముండేది. ఈసారి దానికి అడ్డుకట్ట వేస్తూ ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లోనూ మొత్తం ప్రభుత్వ సిబ్బందినే నియమించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్ల ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ తరలింపు, రూట్ ఆఫీసర్ల నియామకం, పరీక్ష కేంద్రాలకు మెటీరియల్ పంపిణీలో ఎక్కడా లోటుపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు. లీక్, ఫేక్ లకు ఆస్కారం లేకుండా తీసుకున్న చర్యలివీ.. ♦ లీకులకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాలను నో ఫోన్ జోన్లుగా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఎవరికీ పరీక్ష కేంద్రాల్లో ఫోన్లను అనుమతించలేదు. స్మార్ట్, డిజిటల్ వాచీలు, కెమెరాలు, బ్లూటూత్ వంటి ఎల్రక్టానిక్ పరికరాలనూ నిషేధించారు. ♦ ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలకు ఎంపికచేశారు. ♦ టీచర్లకు వారి స్కూళ్ల విద్యార్థులు పరీక్షలు రాసే కేంద్రాల్లో కాకుండా ఇతర కేంద్రాల్లో విధులు కేటాయించారు. ♦ విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన ప్రశ్నపత్రాలను చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్ సహా ఇద్దరు ఇన్విజిలేటర్ల సమక్షంలో సీల్ వేశారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు చేశారు. ♦ ప్రతి ప్రశ్నపత్రానికి బార్‌కోడింగ్ ఇవ్వడమే కాకుండా క్యూఆర్ కోడ్‌ను సూపర్ ఇంపోజ్ చేయించారు. దీనివల్ల ప్రశ్నపత్రం బయటకు వచ్చినా అది ఎక్కడి నుంచి వచ్చిందో వెంటనే తెలిసిపోతుంది. ♦ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలను అందించిన వెంటనే విద్యార్థులతో వాటిలోని అన్ని పేజీలపై రోల్ నంబర్, సెంటర్ నంబర్‌ను రాయించారు. ♦ విద్యార్థుల ఓఎమ్మార్ పత్రాలపైనా ఈసారి బార్ కోడింగ్ ఇచ్చారు ♦ సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ల సంఖ్యను రెట్టింపు చేశారు. రెవెన్యూ, పోలీసు సహా ఇతర విభాగాల సీనియర్ అధికారులను, ఇతర సిబ్బందిని కూడా పరీక్షల్లో భాగస్వాములను చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు ఎస్పీల ఆధ్వర్యంలో పని చేశాయి. ♦ పరీక్ష కేంద్రాల్లోకి నిర్ణీత సమయంలో అనుమతించడమే కాకుండా పరీక్ష ముగిసిన తర్వాతే విద్యార్థులు, సిబ్బంది బయటకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. -
అమలులోకి బయోమెట్రిక్, బార్‌కోడింగ్
అనంతపురం అగ్రికల్చర్ : సూక్ష్మసాగు (డ్రిప్, స్ప్రింక్లర్లు) పరికరాల మంజూరు ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావడానికి ఈ సారి బయోమెట్రిక్, బార్‌కోడింగ్ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) పీడీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. బార్‌కోడింగ్ పరికరాలు ఇప్పటికే తెప్పించామన్నారు. త్వరలోనే బయోమెట్రిక్ పరికరాలు ఏపీఎంఐపీ కార్యాలయంతో పాటు మీసేవా కేంద్రాలు, డ్రిప్ కంపెనీల వద్ద అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అర్హులకు సకాలంలో యూనిట్లు మంజూరు చేయడానికి సులభంగా ఉంటుందన్నారు. మే రెండో వారం నుంచి డ్రిప్ యూనిట్ల మంజూరు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. యూనిట్లు తీసుకుని ఏడేళ్లు పూర్తయిన రైతులు రెండోసారి తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. -
మద్యం మోసాలకు చెక్!
మద్యం అమ్మకాల్లో మోసాలకు చెక్ పడనుంది. కచ్చితమైన ధరలకే విక్రయించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దుకాణాల్లో విధిగా బార్‌కోడింగ్ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. తొలుత ప్రభుత్వ దుకాణాల్లో అమలు చేసి... తరువాత ప్రైవేటు దుకాణాల్లో విధిగా అమలయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. నరసన్నపేట : మద్యం విక్రయించే దుకాణాల్లో బార్‌కోడింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు జిల్లా ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ మద్యం దుకాణంలో దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ముందుగా దీనిని అమలు చేస్తామని, ప్రవేటు దుకాణాల్లో కూడా త్వరితగతిన దీనిని కచ్చితంగా అమలు చేయాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. షాపుల్లో మద్యం అమ్మకాలను క్రమపద్ధతిలో నిర్వహించి కల్తీని, దొంగ మద్యం అరికట్టాలనేది ప్రభుత్వ ఆలోచన. దీనికి అనుగుణంగా షాపుల్లో కంప్యూటరు, హోలోగ్రాం మెషిన్, ఇతర పరికరాలు సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో బార్ కోడింగ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రయోగాత్మకంగా నరసన్నపేటలోని మద్యం షాపులో బార్ కోడింగ్ విదానాన్ని అమలు చేయగా ఫలితాలు బాగున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా దీనిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది నుంచే ప్రయత్నాలు.. బార్ కోడింగ్ విధానాన్ని గతేడాది నుంచే అమలు చేయాలని ఎక్సైజ్ అధికారులు ప్రయత్నించారు. కంప్యూటర్లకోసం మద్యం వ్యాపారుల నుంచి కొంత మేర డబ్బు కట్టించుకున్నా... కార్యరూపం దాల్చలేదు. ఈ ఏడాది జిల్లాలో ఉన్న 209 మద్యం షాపుల్లోనూ అమలు చేయాలని యంత్రాంగం చూస్తోంది. కొత్త మద్యం పాలసీ ప్రకారం బార్, మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతీ మద్యం సీసాపై ఉన్న హోలోగ్రామ్ స్కాన్ చేసి విక్రయించాల్సి ఉంటుంది. దీంతో తయారీ, విక్రయదారుని వివరాలు కంప్యూటర్లో నిక్షిప్తం అవుతాయి. ఇక్కడి వివరాలు మద్యం డిపోల్లోగల డిస్టలరీస్లోని సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో అమ్మకాలు పారదర్శకంగా ఉంటాయని కల్తీని, దొంగ మద్యంను నిరోధించవచ్చని అధికారులు చెబుతున్నారు. అపిట్కో నిర్దేశించిన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే వినియోగించాలనీ, కార్వే సంస్థకు చెందిన కంప్యూటర్లే ఏర్పాటు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇదంతా వ్యయంతో కూడుకున్నదనీ, దీనివల్ల వ్యాపారులు నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వైన్‌డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బార్ కోడింగ్ భారం
నెలాఖరు నాటికి కంప్యూటర్లు ప్రతి మద్యం దుకాణంలో తప్పనిసరిగా కంప్యూటర్, హోలోగ్రామ్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాట్లు చేసుకోని వారికి లెసైన్స్‌లు ఇవ్వబోమని ఇప్పటికే స్పష్టం చేశాం. తణుకు సర్కిల్ పరిధిలో అందరు వ్యాపారులు రూ.5 వేలు చొప్పున చెల్లించారు. ఈ నెలాఖరు నాటికి అన్ని మద్యం షాపుల్లో కంప్యూటర్లు, హోలోగ్రామ్ మెషీన్లు ఏర్పాటు చేస్తాం. - టి.సత్యనారాయణమూర్తి, ఎక్సైజ్ సీఐ, తణుకు. తణుకు : మద్యం విక్రయించే దుకాణాల్లో బార్ కోడింగ్ విధానం ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపై ప్రతి మద్యం దుకాణంలో కంప్యూటర్ ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనను ఈ ఏడాది నుంచి ఎక్సైజ్ శాఖ తప్పనిసరి చేసింది. మార్కెట్లో రూ. 45 వేలకు వచ్చే కంప్యూటర్ను సంబంధిత కాంట్రాక్టు సంస్థ రూ. 1.20 లక్షలుగా నిర్ణయించింది. దీని నిమిత్తం నెలకు రూ. 5 వేలు చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. మద్యం దుకాణదారులు కంప్యూటర్‌తోపాటు హోలోగ్రామ్ మిషన్ కొనుగోలు చేస్తేనే మద్యం లెసైన్సులు ఇస్తామని, మద్యం నిల్వలు ఇస్తామని వ్యాపారులకు అధికారులు తెగేసి చెబుతుండటం జిల్లాలో వివాదంగా మారింది. ఆంక్ష లతో వ్యాపారులకు చిక్కులు జిల్లాలో 397 మద్యం దుకాణాలు దాదాపు 40 బార్లు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ప్రకారం బార్, మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతి మద్యం సీసాపై ఉన్న హోలోగ్రామ్‌ను స్కాన్ చేసి విక్ర యించాల్సి ఉంటుంది. దీంతో తయారీ వివరాలు, విక్రయదారుని వివరాలు కంప్యూటర్లో నిక్షిప్తమవుతాయి. ఇక్కడి వివరాలు మద్యం డిపోలు, డిస్టలరీస్లోని సాఫ్ట్వేర్లకు అనుసంధానం చేస్తే పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం అంటోంది. మరోవైపు బహిరంగ మార్కెట్లో రూ. 45 వేలు విలువ చేసే కంప్యూటర్, ఇతరత్రా పరికరాలను రెండేళ్లకు రూ. 1.20 లక్షలు అద్దె చెల్లించాలని, ఒకవేళ కంప్యూటర్ పాడైతే రూ. 80 వేలు కొనుగోలు ఖరీదు చెల్లించాలని ఆంక్షలు విధించడం వ్యాపారులకు మింగుడు పడడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన అపిట్కో నిర్ధేశించిన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే వినియోగించాలని మరో మెలిక పెట్టారు. కార్వే సంస్థకు చెందిన కంప్యూటర్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. కంప్యూటర్లు ఏర్పాటు చేసుకున్నా లేకున్నా నెలకు రూ. 5 వేలు చెల్లించాల్సిందేనని అధికారులు తేల్చి చెబుతున్నారు. గతంలో విఫలమైనా... మద్యం విక్రయాల్లో బార్‌కోడింగ్ విధానాన్ని గత ఏడాదే ప్రవేశపెట్టాలని అధికారులు భావించినా వ్యాపారులు సహకరించకపోవడంతో అమలు కాలేదు. కొందరు వ్యాపారులు కంప్యూటర్లు కొనుగోలు చేసినప్పటికీ అవి అలంకారప్రాయమే అయ్యాయి తప్ప అక్కరకు రాలేదు. ఈ పరిస్థితుల్లో మరోసారి బార్‌కోడింగ్ అంటూ వ్యాపారులను పరుగులెత్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో లేని బార్‌కోడింగ్ విధానం లెసైన్సు దుకాణాల్లో తప్పనిసరి చేయడం సబబు కాదంటున్నారు. ఆన్లైన్ ధరలు, అమ్మకాల కోసం బార్ కోడింగ్ విధానం తీసుకురావడం అభినందనీయమే అయినా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయకుండా నెల వారీ వాయిదాలకు ఎక్సైజ్ శాఖ తెర తీయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘చుక్క’కు బిల్లు ?
సాక్షి, గుంటూరు: జిల్లాలోని మద్యం దుకాణాల్లో బార్‌కోడింగ్ విధానం అమలవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్ని మద్యం దుకాణాల్లో డిసెంబర్ 1వ తేదీ నుంచి బార్‌కోడింగ్ విధానం అమలు చేయాలని మూడు నెలల కిందటే ఎక్సైజ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి మద్యం దుకాణంలో బార్‌కోడింగ్ మిషన్ ఏర్పాటు చేసి అమ్మ కాలకు కంప్యూటర్ బిల్లు ఇవ్వాలని ఆదేశించారు. దీని వల్ల ఎమ్మార్పీ ధరలకు అమ్మకాలు జరగడంతోపాటు, ఎంత వ్యాపారం జరిగిందనేది పక్కాగా తెలుస్తోంది. బె ల్టుషాపుల్లో మద్యం సీసాలు పట్టుబడితే అవి ఏ దుకాణం నుంచి వచ్చాయనేది కచ్చితంగా తెలిసిపోతుంది. మద్యం దుకాణాల నిర్వాహకులు బార్‌కోడింగ్ విధానం అమలుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలు గడుస్తున్నా తమ ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి బార్‌కోడింగ్ విధానం అమలు కానున్న నేపథ్యంలో గుంటూరులో కూడా దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. గుంటూరు ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో ఇటీవల జిల్లా మద్యం దుకాణాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. బార్‌కోడింగ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారుల మద్య కోల్డ్ వార్ మొదలైందని చెప్పవచ్చు. ఎమ్మార్పీ ధరలకు అమ్మాల్సివస్తుందనేనా..? బార్‌కోడింగ్ విధానాన్ని అమలుచేస్తే అధిక ధరలు అమ్మలేమని, ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని మద్యం వ్యాపారులు మదనపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఐదు నెలల కాలంలో అధిక ధరలకు అమ్మకపోతే నష్టాలు చవి చూడాల్సి వస్తుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఒకపక్క బెల్టుషాపులపై ఆంక్షలు, మరోపక్క బార్‌కోడింగ్ అంటుండటంతో మద్యం వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంత ఖర్చు చేసి కొనలేం... బార్‌కోడింగ్ విధానంపై మద్యం వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమ దుకాణాల లెసైన్స్ గడువులో సగం కాలం పూర్తయిందని, మిగిలిన ఐదు నెలలకు ఇంత ఖర్చు చేసి బార్‌కోడింగ్ మి షన్లు కొనలేమని చెబుతున్నారు. మొదట్లో కంప్యూటర్, మెషిన్లు తాము కొనుక్కుంటే సాఫ్ట్వేర్ ఇస్తామని ఎక్సైజ్ ఉన్నతాధికారులు చెప్పారని, ఇప్పుడు మెషిన్ కూడా తాము చెప్పినచోటే కొనుగోలు చేయాలంటూ లింకు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 40 వేలు అయ్యే మెషిన్‌ను రూ. 90 వేలు పెట్టి కొనమంటే ఎలాగంటూ వాపోతున్నారు. మరోవైపు వచ్చే ఏడాది రాష్ట్రంలో తమిళనాడు మాదిరిగా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకాలు జరపనుందంటూ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు పదేపదే చెబుతున్నారని, అలాంటప్పుడు ఈ ఐదారు నెలలకు అంత ఖర్చు చేయాల్సిన అవసరమేమిటంటూ వారు ఎక్సైజ్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. అద్దెకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం... బార్ కోడింగ్ మెషిన్లను ఇప్పటికే అన్ని ఐఎమ్ఎల్ డిపోల్లో ఇన్స్టాల్ చేశాం. జిల్లాలో ఎక్కువ శాతం మద్యం దుకాణదారులు బార్‌కోడింగ్ మెషిన్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. కొనుగోలు చేయ లేని వారికి నెలకు రూ. 5వేల చొప్పున అద్దెకు ఇప్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఏదేమైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 1వ తేదీ నుంచి అన్ని మద్యం దుకాణాల్లో బార్‌కోడింగ్ విధానాన్ని అమల్లోకి తెస్తాం. లేనిపక్షంలో ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం. - కుళ్లాయప్ప, ఎక్సైజ్ శాఖ డీసీ -
ఎక్సర్సైజ్ లేని ‘ఎక్సైజ్'
కర్నూలు: మద్యం విక్రయాలు ప్రభుత్వ ఖజానాకు రూ.వేల కోట్ల ఆదాయం అందించే వనరుగా మారింది. ఈ వ్యాపారంలో అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు గాను ఈ ఏడాది కొత్తగా 2డీ బార్ కోడింగ్ పద్ధతిని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు మాసాలు గడిచినా ఇప్పటివరకు ఆ విధానం బాలారిష్టాలు దాటలేదు. వ్యాపారులకు ఏడాది కాలపరిమితి అనుమతి ఉంది. ఇప్పటికే ఆరు నెలలు పూర్తయింది. దీనిపై ఆరు నెలల క్రితమే జిల్లా అధికారులకు మార్గదర్శకాలు అందినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. జిల్లా మొత్తానికి మద్యం విక్రయించే కల్లూరు హంద్రీ ఒడ్డున ఉన్న ఐఎంఎల్ డిపోలో మాత్రం బార్ కోడింగ్ విధానం అమలు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 15వ తేదీలోపు 2డీ బార్ కోడింగ్ ప్రక్రియ పూర్తి చేసి 1వ తేదీ నుంచి కచ్చితంగా అమలు చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఐఎంఎల్ డిపోలో నాలుగు హార్డ్‌వేర్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఒక ప్రైవేటు కంపెనీ సెల్యులర్ టవర్ కూడా నెలకొల్పారు. 3-జీ యాక్టివేషన్ ప్రాసెస్ జరుగుతుంది. నెలకు రూ.60 కోట్ల వ్యాపారం ఐఎంఎల్ డిపో నుంచి నెలకు రూ.60 కోట్లు విలువైన మద్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. సరుకు దిగుమతి చేయాలంటే మొదట డిపో సెక్యూరిటీ గార్డు వద్ద, ఐఎంఎల్ డిపో ఇన్చార్జ్ వద్ద బార్ కోడ్ విధానాన్ని వినియోగిస్తారు. అనంతరం బార్ కోడ్ పద్ధతిలోనే బిల్లులు కూడా తనిఖీ చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని మద్యం సీసాలకు బార్‌కోడ్‌కు సంబంధించి హోలోగ్రామ్ గులాబి రంగులో ఉన్న లేబుల్‌ను వేస్తుండగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఆకుపచ్చ రంగు లేబుళ్లను కేటాయించారు. జూన్ నుంచే కొత్తగా హోలోగ్రామ్ లేబుల్స్‌ను అందిస్తున్నారు. ఈ లేబుల్‌పై ఉండే బార్కోడ్ ద్వారా నిర్ణయించిన ధరకే విక్రయించాలి. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి కర్నూలు డిపోకు మద్యం వస్తుంది. బార్ కోడ్ వల్ల అమ్మకాల్లో అక్రమాలు పూర్తిగా అరికట్టవచ్చు. బార్కోడ్ ప్రాజెక్టు అమలుకు సహకరించని వ్యాపారులు ప్రతి మద్యం దుకాణంలో 2డీ స్కానర్, ఇండస్ట్రియల్ కంప్యూటర్, 3-జీ సిమ్, ఫ్లాట్ ఏర్పాటు చేసుకోవాలని ఎక్సైజ్ కమిషనర్ నుంచి గత జూలైలోనే ఆదేశాలు అందాయి. ఈ మేరకు యూఎస్ఈ అధికారులు హోలోగ్రామ్ బార్‌కోడ్‌ను(హెచ్‌ఈఏఎల్) పొందుపరిచే విధానంపై స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో పాటు మద్యం వ్యాపారులకు అదేనెలలో అవగాహన అవగాహన కల్పించారు. అయితే వ్యాపారులు ముందుకు రాకపోవడం వల్ల ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఈ విధానం అమలు జరిగితే కర్నూలు మద్యం డిపోతో పాటు రిటైల్ దుకాణాల్లో విక్రయాలు స్టాక్ వివరాలు హైదరాబాద్ సెంట్రల్ సర్వర్ ద్వారా క్షణాల్లో ఎక్సైజ్ ఉన్నతాధికారులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.