సాక్షి, గుంటూరు: జిల్లాలోని మద్యం దుకాణాల్లో బార్‌కోడింగ్ విధానం అమలవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్ని మద్యం దుకాణాల్లో డిసెంబర్ 1వ తేదీ నుంచి బార్‌కోడింగ్ విధానం అమలు చేయాలని మూడు నెలల కిందటే ఎక్సైజ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది.
ప్రతి మద్యం దుకాణంలో బార్‌కోడింగ్ మిషన్ ఏర్పాటు చేసి అమ్మ కాలకు కంప్యూటర్ బిల్లు ఇవ్వాలని ఆదేశించారు. దీని వల్ల ఎమ్మార్పీ ధరలకు అమ్మకాలు జరగడంతోపాటు, ఎంత వ్యాపారం జరిగిందనేది పక్కాగా తెలుస్తోంది. బె ల్టుషాపుల్లో మద్యం సీసాలు పట్టుబడితే అవి ఏ దుకాణం నుంచి వచ్చాయనేది కచ్చితంగా తెలిసిపోతుంది.
మద్యం దుకాణాల నిర్వాహకులు బార్‌కోడింగ్ విధానం అమలుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలు గడుస్తున్నా తమ ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి బార్‌కోడింగ్ విధానం అమలు కానున్న నేపథ్యంలో గుంటూరులో కూడా దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.
గుంటూరు ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో ఇటీవల జిల్లా మద్యం దుకాణాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. బార్‌కోడింగ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారుల మద్య కోల్డ్ వార్ మొదలైందని చెప్పవచ్చు.
ఎమ్మార్పీ ధరలకు అమ్మాల్సివస్తుందనేనా..?
బార్‌కోడింగ్ విధానాన్ని అమలుచేస్తే అధిక ధరలు అమ్మలేమని, ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని మద్యం వ్యాపారులు మదనపడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఐదు నెలల కాలంలో అధిక ధరలకు అమ్మకపోతే నష్టాలు చవి చూడాల్సి వస్తుందని వారు భావిస్తున్నట్లు సమాచారం.
ఒకపక్క బెల్టుషాపులపై ఆంక్షలు, మరోపక్క బార్‌కోడింగ్ అంటుండటంతో మద్యం వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
అంత ఖర్చు చేసి కొనలేం...
బార్‌కోడింగ్ విధానంపై మద్యం వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమ దుకాణాల లెసైన్స్ గడువులో సగం కాలం పూర్తయిందని, మిగిలిన ఐదు నెలలకు ఇంత ఖర్చు చేసి బార్‌కోడింగ్ మి షన్‌లు కొనలేమని చెబుతున్నారు.
మొదట్లో కంప్యూటర్, మెషిన్లు తాము కొనుక్కుంటే సాఫ్ట్‌వేర్ ఇస్తామని ఎక్సైజ్ ఉన్నతాధికారులు చెప్పారని, ఇప్పుడు మెషిన్ కూడా తాము చెప్పినచోటే కొనుగోలు చేయాలంటూ లింకు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ. 40 వేలు అయ్యే మెషిన్‌ను రూ. 90 వేలు పెట్టి కొనమంటే ఎలాగంటూ వాపోతున్నారు.
మరోవైపు వచ్చే ఏడాది రాష్ట్రంలో తమిళనాడు మాదిరిగా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకాలు జరపనుందంటూ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు పదేపదే చెబుతున్నారని, అలాంటప్పుడు ఈ ఐదారు నెలలకు అంత ఖర్చు చేయాల్సిన అవసరమేమిటంటూ వారు ఎక్సైజ్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. అద్దెకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం... బార్ కోడింగ్ మెషిన్లను ఇప్పటికే అన్ని ఐఎమ్‌ఎల్ డిపోల్లో ఇన్‌స్టాల్ చేశాం.
జిల్లాలో ఎక్కువ శాతం మద్యం దుకాణదారులు బార్‌కోడింగ్ మెషిన్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. కొనుగోలు చేయ లేని వారికి నెలకు రూ. 5వేల చొప్పున అద్దెకు ఇప్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఏదేమైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 1వ తేదీ నుంచి అన్ని మద్యం దుకాణాల్లో బార్‌కోడింగ్ విధానాన్ని అమల్లోకి తెస్తాం. లేనిపక్షంలో ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
- కుళ్లాయప్ప, ఎక్సైజ్ శాఖ డీసీ
‘చుక్క’కు బిల్లు ?
Published Mon, Dec 1 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM
Advertisement