Computer bill
-
‘చుక్క’కు బిల్లు ?
సాక్షి, గుంటూరు: జిల్లాలోని మద్యం దుకాణాల్లో బార్‌కోడింగ్ విధానం అమలవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్ని మద్యం దుకాణాల్లో డిసెంబర్ 1వ తేదీ నుంచి బార్‌కోడింగ్ విధానం అమలు చేయాలని మూడు నెలల కిందటే ఎక్సైజ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి మద్యం దుకాణంలో బార్‌కోడింగ్ మిషన్ ఏర్పాటు చేసి అమ్మ కాలకు కంప్యూటర్ బిల్లు ఇవ్వాలని ఆదేశించారు. దీని వల్ల ఎమ్మార్పీ ధరలకు అమ్మకాలు జరగడంతోపాటు, ఎంత వ్యాపారం జరిగిందనేది పక్కాగా తెలుస్తోంది. బె ల్టుషాపుల్లో మద్యం సీసాలు పట్టుబడితే అవి ఏ దుకాణం నుంచి వచ్చాయనేది కచ్చితంగా తెలిసిపోతుంది. మద్యం దుకాణాల నిర్వాహకులు బార్‌కోడింగ్ విధానం అమలుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలు గడుస్తున్నా తమ ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి బార్‌కోడింగ్ విధానం అమలు కానున్న నేపథ్యంలో గుంటూరులో కూడా దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. గుంటూరు ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో ఇటీవల జిల్లా మద్యం దుకాణాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. బార్‌కోడింగ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారుల మద్య కోల్డ్ వార్ మొదలైందని చెప్పవచ్చు. ఎమ్మార్పీ ధరలకు అమ్మాల్సివస్తుందనేనా..? బార్‌కోడింగ్ విధానాన్ని అమలుచేస్తే అధిక ధరలు అమ్మలేమని, ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని మద్యం వ్యాపారులు మదనపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఐదు నెలల కాలంలో అధిక ధరలకు అమ్మకపోతే నష్టాలు చవి చూడాల్సి వస్తుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఒకపక్క బెల్టుషాపులపై ఆంక్షలు, మరోపక్క బార్‌కోడింగ్ అంటుండటంతో మద్యం వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంత ఖర్చు చేసి కొనలేం... బార్‌కోడింగ్ విధానంపై మద్యం వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమ దుకాణాల లెసైన్స్ గడువులో సగం కాలం పూర్తయిందని, మిగిలిన ఐదు నెలలకు ఇంత ఖర్చు చేసి బార్‌కోడింగ్ మి షన్లు కొనలేమని చెబుతున్నారు. మొదట్లో కంప్యూటర్, మెషిన్లు తాము కొనుక్కుంటే సాఫ్ట్వేర్ ఇస్తామని ఎక్సైజ్ ఉన్నతాధికారులు చెప్పారని, ఇప్పుడు మెషిన్ కూడా తాము చెప్పినచోటే కొనుగోలు చేయాలంటూ లింకు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 40 వేలు అయ్యే మెషిన్‌ను రూ. 90 వేలు పెట్టి కొనమంటే ఎలాగంటూ వాపోతున్నారు. మరోవైపు వచ్చే ఏడాది రాష్ట్రంలో తమిళనాడు మాదిరిగా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకాలు జరపనుందంటూ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు పదేపదే చెబుతున్నారని, అలాంటప్పుడు ఈ ఐదారు నెలలకు అంత ఖర్చు చేయాల్సిన అవసరమేమిటంటూ వారు ఎక్సైజ్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. అద్దెకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం... బార్ కోడింగ్ మెషిన్లను ఇప్పటికే అన్ని ఐఎమ్ఎల్ డిపోల్లో ఇన్స్టాల్ చేశాం. జిల్లాలో ఎక్కువ శాతం మద్యం దుకాణదారులు బార్‌కోడింగ్ మెషిన్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. కొనుగోలు చేయ లేని వారికి నెలకు రూ. 5వేల చొప్పున అద్దెకు ఇప్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఏదేమైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 1వ తేదీ నుంచి అన్ని మద్యం దుకాణాల్లో బార్‌కోడింగ్ విధానాన్ని అమల్లోకి తెస్తాం. లేనిపక్షంలో ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం. - కుళ్లాయప్ప, ఎక్సైజ్ శాఖ డీసీ -
నేటి నుంచి ‘వైన్ స్కాన్’..!
కంప్యూటర్ బిల్లు తప్పనిసరి స్కానర్ ఉంటేనే మద్యం స్టాకు గగ్గోలు పెడుతున్న వ్యాపారులు చిత్తూరు(అర్బన్): నూతన ఎక్సైజ్ విధానం మద్యం వ్యాపారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. జిల్లాలో ఆగస్టు ఒకటి (శుక్రవారం) నుంచి ప్రతి మద్యం దుకాణంలో కంప్యూటర్ బిల్లింగ్, మద్యం బాటిళ్లను స్కాన్ చేయడం తప్పనిసరంటూ అధికారులు నిబంధనలు విధించడంతో మద్యం దుకాణాదారులు దిగులుచెందుతున్నారు. కంప్యూటర్లు పెట్టుకోని వారికి స్టాకు ఇచ్చేదిలేదని ఎక్సైజ్ అధికారులు ఖరాకండిగా చెబుతున్నారు. ఇదే జరిగితే దుకాణాలు మూసేయూల్సిందేనని మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలివీ... జిల్లాలో 458 మద్యం దుకాణాల నిర్వహణకు ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్ ఇవ్వడం, ఇందులో 385 దుకాణాలకు వ్యాపారులు లెసైన్సులు దక్కించుకోవడం జరిగిపోయింది. నూతన పాలసీతో ఇప్పటికే ప్రభుత్వానికి జిల్లా ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.120 కోట్ల వరకు ఆదాయం దక్కింది. అయితే నూతన పాలసీలో ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. ఇందులో భాగంగా స్కాన్ అండ్ ట్రేస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో ప్రతి మద్యం సీసాపై హోలోగ్రాఫిక్ ఎక్సైజ్ అడహేషన్ లేబుల్ (హెచ్‌ఈఏఎల్) ఏర్పాటు చేయాలి. అంటే మద్యం స్టాకును దుకాణాలకు తరలించేప్పుడే ప్రతి బాటిల్, బాక్సులకు హెచ్‌ఈఏఎల్ వేస్తారు. వీటిని దుకాణాల్లో విక్రయించేప్పుడు అక్కడ ఓ కంప్యూటర్, ప్రింటర్, స్కానింగ్ పరికరాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి బాటిల్ విక్రయానికి కంప్యూటర్ బిల్లింగ్ ఇచ్చి గరిష్ట చిల్లర ధర మాత్రమే వసూలు చేయాలి. ఇప్పటికే 20 శాతం వరకు లెసైన్సు ఫీజులు పెరగడం, ప్రతి మద్యం దుకాణానికి రూ.2 లక్షలు చెల్లించి పర్మిట్ గది తీసుకోవడం, ఏడు సార్లు షాపులు నిర్వహించిన వాటికి లెసైన్సు ఫీజులో ఎనిమిది శాతం ప్రివిలైజేషన్ రుసుము అదనంగా చెల్లించాలనే నిబంధనలకు తలూపిన మద్యం వ్యాపారులు తాజాగా కంప్యూటర్ బిల్లింగ్ ఇవ్వడానికి మాత్రం ససేమిరా అంటున్నారు. కానీ ఆగస్టు ఒకటి నుంచి డిపోల్లో తీసుకునే మద్యం స్టాకుకు తప్పనిసరిగా కంప్యూటర్ బిల్లు ఉండాలని, లేనిపక్షంలో స్టాకు ఇవ్వడం కుదరదని అధికారులు చెబుతున్నారు. వ్యాపారుల ఇబ్బందులు... మద్యం బాటిల్‌పై కంప్యూటర్ స్కానింగ్ పద్ధతి ఉండటంతో ఎవరైనా కేసుల కొద్దీ మద్యం కొనుగోలు చేసి బయట విక్రయిస్తే బెల్టుషాపు నిర్వహస్తున్నారని స్టాకు ఇచ్చిన తమపై కేసు నమోదు చేస్తారని వ్యాపారులు భయపడుతున్నారు. ప్రైవేటు ఏజెన్సీలకు కొమ్ము కాయడానికే అంద రినీ ఒకే వ్యక్తి నుంచి కంప్యూటర్ పరికరాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతి బాటిల్‌ను స్కానింగ్ చేస్తూ, బిల్లులు ఇచ్చుకుంటూ వెళితే రద్దీగా ఉన్నప్పుడు, విద్యుత్ సరఫరా లేనప్పుడు వ్యాపారం జరగదని చెబుతున్నారు. బిల్లింగ్ ఉండాల్సిందే... వ్యాపారులు తప్పనిసరిగా కంప్యూటర్ బిల్లులు పెట్టాల్సిందే. లేకుంటే మద్యం స్టాకు ఇచ్చే ప్రసక్తేలేదు. గెజిట్ నోటిఫికేషన్లో ఈ అంశాలన్నీ స్పష్టంగా పేర్కొన్నాం. బిల్లింగ్ లేకుండా మద్యం విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటా. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదు. - శేషారావు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్, చిత్తూరు.