
ఏప్రిల్ 1న నిర్వహణ
31న రంజాన్ సెలవు
సాక్షి, అమరావతి: పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్నట్టు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ప్రభుత్వం ఈనెల 31న రంజాన్ సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు మార్పు చేసినట్టు ప్రకటించారు.
పరీక్ష తేదీని విద్యార్థులు, హెచ్ఎంలు, ఇన్విజిలేటర్లు, పోలీస్ శాఖ, ట్రెజరీ సిబ్బంది, పోస్టల్ శాఖతో పాటు పదో తరగతి పరీక్షల నిర్వహణలో పాలుపంచుకుంటున్న అన్ని విభాగాలకు తెలియజేయాలని ఆర్జేడీ, డీఈవోలను ఆదేశించారు. మెటీరియల్, ప్రశ్నపత్రాలు తీసుకునేందుకు ఈనెల 31న నిల్వ కేంద్రాల వైపు వెళ్లొద్దని సూచించారు.
3 నుంచి టెన్త్ మూల్యాంకనం
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో ఏడు రోజుల్లోనే మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. అసిస్టెంట్ ఎగ్జామినర్స్ ప్రతిరోజు 40 పేపర్లను మూల్యాంకనం చేయాలి. వీటిని స్పెషల్ అసిస్టెంట్లు పరిశీలిస్తారు.
మూల్యాంకనం పూర్తయిన వాటిలో 20 పేపర్లు చొప్పున చీఫ్ ఎగ్జామినర్ పరిశీలించాల్సి ఉంటుంది. అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ ప్రతి అసిస్టెంట్ ఎగ్జామినర్ దిద్దిన జవాబు పత్రాల్లో కనీసం రెండు చొప్పున పరిశీలించాలి. క్యాంప్ ఆఫీసర్ రోజుకు 20 చొప్పున, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ రోజుకు 45 చొప్పున మూల్యాంకనం చేసిన పత్రాలను పునఃపరిశీలించాలి.
ఈ క్రమంలో మార్కుల్లో తేడా వస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ ఆదేశాలు జారీచేశారు. జవాబు పత్రాల మూల్యాంకనం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను అదేశించారు.