
ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ
సాక్షి, అమరావతి: ఈ వేసవిలో సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మేలో 47 వరకూ వెళ్లే అవకాశాలున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా. రాష్ట్ర ప్రభుత్వం వేసవిని ఎదుర్కొనేందుకు హెచ్చరికలు జారీ చేయడం తప్ప, క్షేత్ర స్థాయిలో తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు కనపడడంలేదు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వేడిగాలులు పెరిగాయి. డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాష్టన్, హీట్ స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలకు ఇవి దారితీస్తాయి.
ప్రభుత్వ తక్షణ దృష్టి అవశ్యం
తీవ్ర ఉష్ణోగ్రతల నమోదు నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉంచే దిశలో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోవాలి. భారత వాతావరణ శాఖ భాగస్వామ్యంతో జిల్లాల వారీగా హీట్ అలర్ట్స్ మరింత కచ్చితత్వంతో జారీ చేయాలి. అన్ని వర్గాలకు ఈ హెచ్చరికలు చేరేలా చూడాలి. బస్టాండ్లు, ఆటోస్టాండ్లు, రోడ్డు పక్కన పలు ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలి. కూల్ రూఫ్ బస్టాండ్‌లు, షెడ్‌లను శాశ్వతంగా నిర్మించడం మంచిది.
ఆసుపత్రుల్లో హీట్ స్ట్రోక్ యూనిట్లు, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్, ఐవీ ఫ్లూయిడ్స్, ఎమర్జెన్సీ బెడ్లు సిద్ధం చేయాలి. ఇక బడుల సమయాల్లో మార్పులు చేయాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు తరగతులు ఉండకుండా చూడాలి. బయట తరగతులు నిర్వహించకూడదు. హీట్ అలర్ట్ వచి్చనపుడు సెలవులు ప్రకటించాలి. ప్రజా రవాణా పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
» బయటకి వెళ్లే సమయాన్ని తగ్గించుకోవాలి.
» మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి.
» తప్పనిసరిగా బయటకి వెళ్లాల్సివస్తే తలపై టోపీ, తెల్లని దుస్తులు ధరించాలి.
» రోజుకు కనీసం 3–4 లీటర్ల వరకు నీటిని తాగాలి. కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగడం మంచిది.
» ఆహార నియమాలు పాటించాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. వేడి ఆహారం, మసాలా పదార్థాలు, డ్రై ఫుడ్స్ తగ్గించి ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
» వృద్ధులు, చిన్నారుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వీరిని వేడి సమయాల్లో ఇంట్లోనే ఉంచాలి. తగినంత నీటిని తాగేలా చూడాలి.
» వ్యాయామాలు ఉదయం, సాయంత్రం మాత్రమే చేయాలి
» కూలీలు, రైతులు ఉదయం 6–10 లేదా సాయంత్రం 5–7 సమయంలో పని చేయాలి.
» రోడ్లపై పనిచేసే ట్రాఫిక్ పోలీసులు, కూలీలకు జాకెట్లు, నీటి పంపిణీ జరగాలి. వడదెబ్బ తగలకుండా ఢిల్లీ తరహాలో కూల్ రూమ్ కాన్సెప్‌్టను ప్రవేశపెడితే మంచిది.
» అడవుల్లో జంతువుల కోసం నీరు అందుబాటులో ఉంచాలి.
హీట్ వేవ్ హాట్ స్పాట్లు
కర్నూలు, నంద్యాల, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు
అన్ని చర్యలు తీసుకుంటున్నాం
రోణంకి కూర్మనాథ్, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ
ఈ సంవత్సరం వేసవి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేసి, తగిన చర్యలను సూచిస్తున్నాం. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలుపు రంగు కాటన్ వస్త్రాలు ధరించడం మంచిది. కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదు.