
కొబ్బరి బొండం.. దివ్యౌషధం
వేసవి ఉష్ణోగ్రతలతో పెరుగుతున్న డిమాండ్
ఉమ్మడి ‘తూర్పు’న 1.50 లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు
భారీగా ఎగుమతులు
చాగల్లు, ఏలేశ్వరం, కొత్తపేట బొండాలకు అధిక డిమాండ్
రోహిణీ కార్తె ఇంకా రానేలేదు.. అప్పుడే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. నడినెత్తిన చండమార్తాండుడు నిప్పులు కురిపిస్తూండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇలా మండుతున్న ఎండల నుంచి తక్షణ ఉపశమనాన్నిచ్చే దివ్యౌషధం కొబ్బరి బొండం. వేసవిలోనే కాదు ఏడాది పొడవునా తాగేందుకు అనువైన ఆరోగ్యకరమైన పానీయం. రైతులకు సైతం కొబ్బరి కాయ కన్నా బొండం అమ్మకాల వల్లే అధిక ఆదాయం లభిస్తోంది. బొండాలు, నీళ్లు, కొబ్బరి నీళ్లతో చేసే జ్యూస్‌ల విక్రయాలతో చిరు వ్యాపారుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకూ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాయి. –సాక్షి, అమలాపురం
పోషకాల గని
» కొబ్బరి నీళ్లలో పోషకాలు, ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. కొబ్బరి బొండం సెలైన్‌తో సమానం. ఒక బొండంలో దాదాపు 300 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి.
» మూత్ర సంబంధిత జబ్బులు, కిడ్నీలో రాళ్ల సమస్యకు ఇది చక్కగా పని చేస్తుంది.
» కొబ్బరి నీళ్లు ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. దీనిని బెస్ట్ ఎనర్జీ డ్రింక్‌గా ఆరోగ్య నిపుణులు పేర్కొంటారు.
» బొండంలో ఉండే కొబ్బరి గుజ్జు గుండెజబ్బులు రానివ్వకుండా చేస్తుంది. వేసవిలో చెమట కాయలు, వేడి కురుపులు, చికెన్‌పాక్స్ వంటివి తగ్గడానికి దోహదపడుతుంది.
» లేత కొబ్బరిలో విటమిన్–ఎ, బి, సి సమృద్ధిగా లభిస్తాయి. ఐరన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, రెబోఫ్లెవిన్, నియాసిన్, థయామిన్ అధికంగా ఉంటాయి.
అక్కడి బొండాలకు డిమాండ్
»డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో సుమారు 1.50 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఏడాదికి 105 కోట్ల కొబ్బరి కాయలు వస్తాయని అంచనా. కొబ్బరి కాయల్లో 15 శాతం మాత్రమే బొండాలుగా రైతులు విక్రయిస్తున్నారు.
»ఎండలు పెరగడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి బొండాల ఎగుమతులు జోరందుకున్నాయి. మన రాష్ట్రంతో పాటు తెలంగాణలోని ముఖ్య నగరాలు, పట్టణాలకు బొండాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి రోజుకు 60 లారీలకు పైగా ఎగుమతి అవుతున్నాయి. ఎండల తీవ్రత మరింత పెరిగితే రోజుకు 100 లారీల వరకూ బొండాల ఎగుమతి జరుగుతుందని రైతులు చెబుతున్నారు.
» తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు, చాగల్లు, పెరవలి, గోపాలపురం, కాకినాడ జిల్లాలో తుని, ఏలేశ్వరం, కోనసీమ జిల్లాలోని కొత్తపేట, పి.గన్నవరం వంటి మండలాల్లో మాత్రమే కొబ్బరి బొండం సేకరణ అధికంగా ఉంటుంది.
»మార్చి మొదటి వారంలో బొండం రైతువారీ ధర రూ.12 ఉండగా ఇప్పుడది రూ.18కి పెరిగింది. ఎండలు పెరిగితే ఈ ధర రూ.20 వరకూ చేరుతుందని రైతులు ఆశపడుతున్నారు. కొబ్బరి కాయలైతే రైతులే సేకరించాలి. దింపు, పోగువేత, రాశులు పోయడం ఇలా కాయకు రూ.2 వరకూ అవుతోంది. అదే బొండాలను వ్యాపారులు సొంత ఖర్చులు పెట్టుకుని తీసుకుంటారు. దీనివలన రైతులకు ఆ పెట్టుబడి బాధ తప్పుతోంది. మార్కెట్‌తో సంబంధం లేకుండా ధర నిలకడగా ఉండటం, కాయ సేకరణ భారం లేకపోవడంతో బొండాల అమ్మకమే ప్రయోజనకరమని కొబ్బరి రైతులు భావిస్తున్నారు.
కొబ్బరి కాయతో పోల్చుకుంటే బొండం అమ్మకాలే లాభసాటిగా ఉంటున్నాయని రైతులు చెబుతున్నారు. బొండం ఆరు నుంచి ఎనిమిది నెలలకు తయారవుతుంది. అదే పక్వానికి వచ్చే కొబ్బరి కాయకు పట్టే సమయం 12 నెలలు. అందువలన బొండాల ఉత్పత్తిని రైతులు త్వరగా అందుకుంటూ, నాలుగు డబ్బులు కళ్లజూస్తున్నారు.

షర్బత్‌ల నుంచి జ్యూస్‌ల వరకూ..
కొబ్బరి బొండాలపై ఆధారపడి జీవిస్తున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. బొండాలతో పాటు కొబ్బరి నీళ్లతో షర్బత్, నాటాడీకో వంటి కోకోనట్ జల్లీలతో పాటు కొబ్బరి నీళ్లు, గుజ్జుతో జ్యూస్‌లు కూడా తయారు చేస్తున్నారు. వాస్తవానికి కొబ్బరి జ్యూస్ తయారీ మొదలైంది రాజమహేంద్రవరంలోనే కావడం విశేషం.
ఇప్పుడు ఈ వ్యాపారం అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. కోకోనట్ జ్యూస్‌లలో సైతం స్ట్రాబెర్రీ, మ్యాంగో, డ్రాగన్, బనానా, కివీ, వాటర్ మిలన్, ఆపిల్ వంటి ఫ్లేవర్లతో ఆకట్టుకుంటున్నారు. వీటితో నిరుద్యోగ యువత ఉపాధి పొందడంతో పాటు జనానికి ఆరోగ్యాన్ని చేరువ చేస్తున్నారు.
ఆరోగ్యానికి ఔషధం
కేవలం దప్పిక తీరడమే కాదు.. కొబ్బరి బొండం ఆరోగ్యానికి ఔషధం. వేసవిలో ఉపశమనం కోసమే కాదు.. ఏడాది పొడవునా ఆరోగ్యం కోసం కొబ్బరి బొండం తాగడం మంచిదే. దీనిలోని ఎలక్ట్రోలైట్లు, సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు తక్షణ శక్తినిస్తాయి. ఆరోగ్యానికి పలు రకాలుగా మేలు చేస్తాయి. – డాక్టర్ ఎన్‌బీవీ చలపతిరావు, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త, అంబాజీపేట
