Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

US, China Reach Major Agreement On Tariffs1
90 రోజుల పాటు కొత్త సుంకాలు: అమెరికా, చైనా మధ్య డీల్

నువ్వా నేనా అంటూ ప్రతీకార సుంకాలను అంతకంతకూ పెంచుకుంటూ పోయిన అమెరికా, చైనా దేశాలు టారిఫ్‌ల విషయంలో ఓ డీల్ కుదుర్చుకున్నాయి. తాజా ఒప్పందం ప్రకారం.. అమెరికా దిగుమతులపైన చైనా విధించిన 125 శాతం సుంకాలలో 10 శాతం తగ్గించింది. అదే సమయంలో అమెరికా కూడా చైనా దిగుమతుల మీద విధించిన 145 శాతం సుంకాలలో 30 శాతం తగ్గించించింది.ఇరు దేశాలు (చైనా, అమెరికా) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సుంకాల తగ్గింపు 90 రోజులు మాత్రమే అమలులో ఉంటాయని తెలుస్తోంది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?అమెరికా ప్రపంచ దేశాల మీద ప్రతీకార సుంకాలను విధించిన సమయంలో.. చైనా కూడా అమెరికాకు ధీటుగా సుంకాలను పెంచింది. దీంతో వాణిజ్య యుద్ధం మొదలైంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద విపరీతమైన ప్రభావం చూపింది. దిగ్గజ పారిశ్రామిక వేత్తలు కూడా భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అయితే తాజాగా.. ఇరుదేశాల మధ్య స్విట్జర్లాండ్‌ వేదికగా జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా ఈ సుంకాలను తగ్గించుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు.

Stock Market Closing Update2
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సోమవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,950.34 పాయింట్లు లేదా 3.71 శాతం లాభంతో 82,404.81 వద్ద, నిఫ్టీ 912.80 పాయింట్లు లేదా 3.80 శాతం లాభంతో 24,920.80 వద్ద నిలిచాయి. చాల రోజుల తరువాత భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లో క్లోజ్ అవ్వడం బహుశా ఇదే మొదటిసారి.ఎన్డీఆర్ ఆటో కాంపోనెంట్స్, ఇన్స్పిరిసిస్ సొల్యూషన్స్, ఐఎఫ్జీఎల్ రిఫ్రాక్టరీస్, బిర్లా కార్పొరేషన్, మ్యాన్ ఇండస్ట్రీస్ (ఇండియా) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కేపీఆర్ మిల్, జిందాల్ వరల్డ్‌వైడ్, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్, పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

which state Maintains Top Market Borrowings for FY253
అప్పుల్లో టాప్‌ రాష్ట్రం ఇదే..

దేశంలోని రాష్ట్రాల్లో ఏటికేడు అప్పులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు భవిష్యత్తులో తమకు ఉపయోగపడేలా స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పనకు అప్పులను వాడుతున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాలు వేతనాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు వంటి వాటికోసం వీటిని వినియోగిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని ఇటీవల ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య మొత్తం తమిళనాడు రుణాలు రూ.1.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి.బలమైన ఆర్థిక వ్యూహం, వృద్ధి ఆధారిత పెట్టుబడుల పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తూ తమిళనాడు రాష్ట్రం పెట్టుబడులను సమీకరిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా అప్పుల్లో తమిళనాడు నిలకడగా ముందంజలో ఉంది. సంవత్సరాలవారీగా అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి.2021 ఆర్థిక సంవత్సరంలో రూ.87,977 కోట్లు2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో రూ.87,000 కోట్లు2024 ఆర్థిక సంవత్సరంలో రూ.1.13 లక్షల కోట్లు2025 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ 2024 నుంచి 2025 ఫిబ్రవరి వరకు రూ.1.01 లక్షల కోట్లుతమిళనాడు తర్వాత 2025 ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర రూ.99,000 కోట్ల అప్పుతో రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..అప్పులకు వెనుక కారణాలు2025 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయంలో 22% పెరుగుదలను రాష్ట్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి బలమైన నిబద్ధతను సూచిస్తుంది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 28.7% లోపు దాని డెట్‌-జీఎస్‌డీపీ నిష్పత్తి 26.43%గా ఉంది. ఇది ఆర్థిక స్థిరత్వం, సుస్థిరతను నిర్ధారిస్తుంది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తమిళనాడు రూ.20,000 కోట్ల రుణాలు తీసుకోవాలని యోచిస్తోంది. దాంతో మొత్తం రుణాలు రూ.1.62 లక్షల కోట్లకు చేరుకుంటాయని భావిస్తున్నారు. ఇది రాష్ట్రం దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను బలోపేతం చేస్తుందని చెబుతున్నారు.

Rs 16700 crore in 10 weeks Canara Bank garners deposits using 82k staff4
10 వారాల్లో రూ.16,700 కోట్లు తెచ్చారు..

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కెనరా బ్యాంక్ ఉద్యోగులు అద్భుతమైన ఘనత సాధించారు. బ్యాంక్‌ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో పది వారాల్లో రూ.16,700 కోట్లు సమీకరించారు. డిపాజిట్ల వృద్ధి లేమితో సతమతమవుతున్న కెనరా బ్యాంకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బ్యాంకులో పనిచేసే 82,000 మంది సిబ్బందిని నిధుల సమీకరణకు వెళ్లాలని కోరింది.పీటీఐ నివేదిక ప్రకారం.. ఇటీవల పెరిగిన డిపాజిట్ల ఉపసంహరణతో బ్యాంకింగ్‌ వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కెనరా బ్యాంక్ టాప్ మేనేజ్మెంట్ ఉద్యోగులందరికీ డిపాజిట్ల సేకరణకు పిలుపునిచ్చింది. 2024 జనవరి 26న ప్రారంభమైన ఈ డ్రైవ్‌కు సిబ్బంది మనస్ఫూర్తిగా సహకరించారు.‘బ్యాంక్‌ డిపాజిట్‌లను పెంచడానికి సహకరించాలని మొత్తం 82,000 మంది సిబ్బందిలో ప్రతిఒక్కరికీ పిలుపునిచ్చాం. కాసా (కరెంట్, సేవింగ్స్ అకౌంట్) లేదా రిటైల్ టర్మ్ డిపాజిట్ రూపంలో ఒక్కొక్కరూ రూ.10 లక్షలు తీసుకురావాలని కోరాం' అని కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కె సత్యనారాయణ రాజు తెలిపారు.సీడీ నిష్పత్తి విషయంలో కెనరా బ్యాంక్‌ 80 శాతం పరిమితిని చేరుకునే అంచున ఉందని ఆయన తెలిపారు. పీరియడ్ ఎండ్ లో అధిక సంఖ్యలో డిపాజిట్లు పెట్టడం ఈ డ్రైవ్ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. కాసా బ్యాలెన్స్ లలో కూడా స్థిరత్వం ఉన్నందున ఈ డ్రైవ్ మొత్తం వ్యాపారానికి సహాయపడిందని పేర్కొన్నారు. ఈ డ్రైవ్ కారణంగా కెనరా బ్యాంక్ బల్క్ డిపాజిట్లపై ఆధారపడటం కూడా తగ్గిందని ఆయన అన్నారు. అధిక వ్యయ రుణాల వాటా 25 శాతం నుంచి 23 శాతానికి తగ్గిందని వివరించారు.

Indian Army Rank wise Salary as per 2024 records5
భారత సైన్యం వేతన వివరాలు ఇలా..

భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో విరోచితంగా పోరాడుతున్న భారత సైన్యం వేతన వివరాలు ఎలా ఉన్నాయో కింద తెలియజేశాం. దేశం కోసం ప్రాణత్యాగం చేసే త్యాగధనులకు ఎప్పటికీ ఈ వేతనాలు ప్రాధాన్యం కావు. పుట్టిన భూమి రక్షణ కోసం, తమ వంతు సాకారం చేస్తూ రణరంగంలో ప్రాణాలు వదిలిన సైనికుల కఠోర దీక్ష ముందు ఇవి ఏ మూలకూ సరిపోవు. చట్టపరంగా వారి సేవలకు గౌరవంగా ఇచ్చుకునే ఈ కొద్దిపాటి వేతన వివరాలు (2024 లెక్కల ప్రకారం సుమారుగా) కింది విధంగా ఉన్నాయి.హోదానెల వారీ వేతనంసిపాయిరూ.25,000ల్యాన్స్‌ నాయక్‌రూ.30,000నాయక్‌రూ.35,000హవల్దార్‌రూ.40,000నాయబ్‌ సుబేదార్‌రూ.45,000సుబేదార్‌రూ.50,000సుబేదార్‌ మేజర్‌రూ.65,000లెఫ్ట్‌నెంట్‌రూ.68,000కెప్టెన్‌రూ.75,000మేజర్‌రూ.1,00,000లెఫ్టెనెంట్‌ కల్నల్‌రూ.1,12,000కల్నల్‌రూ.1,30,000బ్రిగేడియర్‌రూ.1,39,000 నుంచి రూ.2,27,000 వరకుమేజర్‌ జనరల్‌రూ.1,44,000 నుంచి రూ.2,18,200లెఫ్టెనెంట్‌ జనరల్‌రూ.1,82,200 నుంచి రూ.2,24,100చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌రూ.2,50,000ఇదీ చదవండి: ఏ రంగంపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారంటే..అదనపు ప్రయోజనాలు, అలవెన్సులుడియర్నెస్ అలవెన్స్ (డీఏ)మిలిటరీ సర్వీస్ పే (ఎంఎస్‌పీ)ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)రవాణా భత్యంఫీల్డ్ ఏరియా అలవెన్స్హై ఆల్టిట్యూడ్ అలవెన్స్స్పెషల్ డ్యూటీ అలవెన్స్వైద్య సౌకర్యాలుపెన్షన్ & రిటైర్మెంట్ బెనిఫిట్స్

Amenities Charges Burden on Home Buyers in Hyderabad6
అమ్మో.. అపార్ట్‌మెంట్‌!!

పదేళ్ల క్రితం కాప్రాలో అపార్ట్‌మెంట్‌ కొన్న.. చ.అ.కు రూ.3 వేల చొప్పున 1,100 చ.అ.లకు రూ.33 లక్షలు అయ్యింది. ఆ సమయంలో కార్పస్‌ ఫండ్, వసతుల నిర్వహణ కోసమని రూ.5 లక్షలు వసూలు చేశారు. ప్రతి నెలా అపార్ట్‌మెంట్‌ నిర్వహణ ఖర్చు కోసం నెలకు రూ.2 వేలు చెల్లిస్తున్నా. అయితే ప్రస్తుతం వ్యక్తిగత అవసరాల కోసం ఆ ఫ్లాట్‌ను అమ్మేద్దామని నిర్ణయించుకున్నా. కొనడానికి ఎవరొచ్చినా సరే అపార్ట్‌మెంట్‌ ధరనే లెక్కిస్తున్నారే తప్ప.. నేను చెల్లించిన కార్పస్‌ ఫండ్‌ పరిగణలోకి తీసుకోవటం లేదు. – ఓ రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన ఇదీ..నగరంలోని ఓ ఐటీ కంపెనీలో హెడ్‌గా పనిచేశాను. స్విమ్మింగ్‌ పూల్, జిమ్, పిల్లలకు ప్లే ఏరియా వంటివి ఉన్నాయని కూకట్‌పల్లిలో ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో రూ.80 లక్షలకు ఫ్లాట్‌ కొన్నా. వీటి కోసం డెవలపర్‌కు అదనంగా రూ.10 లక్షలు చెల్లించాను. అందులో ఉన్నంత వరకూ బాగానే ఉంది. ప్రస్తుతం వృత్తిరీత్యా బెంగళూరుకు బదిలీ అయ్యింది. ఎప్పుడైతే సొసైటీకి అపార్ట్‌మెంట్‌ అప్పగించారో రెండేళ్ల తర్వాత సరైన నిర్వహణ లేక స్విమ్మింగ్‌ పూల్‌ పాడైపోయింది. జిమ్‌లోని వస్తువులు మూలనపడ్డాయి. – ఓ ఐటీ ఉద్యోగి వ్యథ ఇదీ.....వీళ్లిద్దరే కాదు గృహ కొనుగోలుదారుల అందరిపైనా వసతుల భారం పడుతుంది. సామాన్యుడి సొంతింటి కలకు నిర్మాణ వ్యయం, స్థలాల ధరలు ఎంత భారం అవుతున్నాయో.. అదే స్థాయిలో వసతుల చార్జీలు భారంగా మారిపోయాయి. క్లబ్‌హౌస్, పార్కింగ్, సెలబ్రిటీ జిమ్, స్విమ్మింగ్‌ పూల్, స్క్వాష్‌ కోర్ట్, టేబుల్‌ టెన్నిస్, క్రికెట్‌ పిచ్, బ్యాడ్మింటన్‌ కోర్ట్, ఇండోర్‌ గేమ్స్, చిల్డ్రన్‌ పార్క్, జాగింగ్‌ అండ్‌ వాకింగ్‌ ట్రాక్స్, యోగా, మెడిటేషన్‌ హాల్, గెస్ట్‌ రూమ్స్, 7 స్టార్‌ రెస్టారెంట్‌.. ఇలా బోలెడన్నీ వసతులను ప్రకటిస్తున్నారు. అన్నింటికీ రూ.లక్షల్లోనే చార్జీలను వసూలు చేస్తున్నారు. రెరా నిబంధనల ప్రకారం అపార్ట్‌మెంట్‌ ధరలోనే వసతుల చార్జీలు కలిపి ఉండాలి. కానీ, నిర్మాణ సంస్థలు వేర్వేరుగా వసూలు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ పాయింట్స్, గ్రీనరీ, పైప్‌డ్‌ గ్యాస్, విద్యుత్, తాగునీరు ఇలా కనీస మౌలిక వసతులకు రూ.లక్షలలో వసూలు చేస్తున్నారు. రెండేళ్ల పాటు క్లబ్‌హౌస్‌ నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని ప్రకటిస్తూనే.. మరోవైపు సభ్వత్య రుసుము రూ.2–3 లక్షల వరకూ బాదుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరోఓసీ రాకముందే వసూళ్లు.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌(ఓసీ) రాకముందు వసతుల ఏర్పాటు, నిర్వహణకు చార్జీలు వసూలు చేయకూడదనేది నిబంధన. కానీ, నిర్మాణ సంస్థలు పట్టించుకోవటం లేదు. పోనీ, ఆయా ప్రభుత్వ విభాగాలైనే నియంత్రిస్తున్నాయా అంటే పట్టించుకునే నాథుడే లేడు. మౌలిక వసతులను కల్పించిన తర్వాతే మున్సిపల్‌ విభాగం ఓసీని విడుదల చేయాల్సి ఉంటుంది. స్విమ్మింగ్‌ పూల్, జిమ్, ఇండోర్‌ గేమ్స్, జాగింగ్, వాకింగ్‌ ట్రాక్స్‌.. అంటూ కొనుగోలుదారుడికి ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల వసతులను కల్పించాడా లేదా అని పర్యవేక్షించే వారే కరువయ్యారు. కానీ, భౌతికంగా ఆయా వసతులను డెవలపర్‌ కల్పించాడా లేదా అని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే వారే లేరు. ఒక్కసారి ఓసీ రిలీజ్‌ అయ్యాక ఇక ఆ అపార్ట్‌మెంట్‌కు డెవలపర్‌కు సంబంధం ఉండదు.👉ఇది చదివారా? వీకెండ్‌ ఇల్లు.. రూ.10 కోట్లయినా పర్లేదు..!వెంచర్లలో రిసార్ట్‌ అని వసూళ్లు.. ఓపెన్‌ ప్లాట్లు చేసే బిల్డర్లు కూడా మీము ఏం తక్కువ తిన్నామా అన్నట్లు అపార్ట్‌మెంట్లలో కల్పించే వసతులను వెంచర్లలో కూడా కల్పిస్తామని మాయమాటలు చెబుతున్నారు. మున్సిపల్‌ నిబంధనల ప్రకారం వెంచర్లలో రహదారులు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విద్యుత్‌ వ్యవస్థ వంటివి కల్పించాల్సిన బాధ్యత డెవలపర్లదే.. కానీ, బిల్డర్లు వీటికి కూడా వసతుల ఏర్పాటు పేరిట చార్జీలు వసూలు చేస్తున్నారు. వీకెండ్‌ రిసార్ట్, ఫార్మింగ్, గోల్ఫ్‌ కోర్స్, క్లబ్‌హౌస్‌ సభ్యత్వం అని రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. శామీర్‌పేట, షాద్‌నగర్, తుక్కుగూడ, యాదాద్రి, చేవెళ్ల, శ్రీశైలం జాతీయ రహదారి వంటి పలు ప్రాంతాల్లోని వెంచర్లలో ఆధునిక వసతులు కల్పిస్తున్నామని తెగ ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు.🔶ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఓ నిర్మాణ సంస్థ అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. ఇందులో ధర చదరపు అడుగు(చ.అ.) రూ.9 వేలకు విక్రయిస్తుంది. 2,050 చ.అ.అపార్ట్‌మెంట్‌కు రూ.1,84,50,000 అవుతుంది. ఇక, ఈ అపార్ట్‌మెంట్‌లో వసతుల చార్జీలు కింది పట్టికలో చూద్దాం!అపార్ట్‌మెంట్‌కు రూ.1,84,50,000 అయితే, వసతులకు చెల్లించాల్సింది రూ.2,92,22,468. వసతులు, అపార్ట్‌మెంట్‌ ధర రెండూ కలిపితే రూ.2,13,72,468 అయ్యిందన్నమాట.ఇలా చేస్తే బెటర్‌.. 🔹 వసతుల కల్పనకు అయ్యే వ్యయాన్ని కొనుగోలుదారుల నుంచి వసూలు చేయడం సరైంది కాదు. నిర్మాణ సంస్థలు కల్పించే వసతులతో సగానికి పైగా అమినిటీస్‌ నివాసితులు వినియోగించరు. పైగా ప్రతినెలా నిర్వహణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో గేటెడ్‌ కమ్యూనిటీల్లోని నివాసితులకు అపార్ట్‌మెంట్‌ కొనుగోలు భారంగా మారుతుంది. నిర్మాణం పూర్తయ్యాక ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా రెండేళ్ల పాటు వసతుల నిర్వహణ నిర్మాణ సంస్థే చేయాలి. 🔹 ప్రాజెక్ట్‌లో విక్రయాలు పూర్తయ్యాక డెవలపర్‌ కమ్యూనిటీని హౌసింగ్‌ సొసైటీకి అప్పగిస్తారు. అక్కడి నుంచి అందులోని వసతులను నివాసితులే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మొదట్లో బాగానే ఉన్నా రోజులు గడుస్తున్న కొద్దీ ఆయా వసతుల నిర్వహణ పట్టించుకునే వారే ఉండరు. స్విమ్మింగ్‌ పూల్‌ ఎండిపోతుంది. నిర్వహణ లేక జిమ్, ఇతర వసతులు మూలనపడిపోతాయి. 🔹 అపార్ట్‌మెంట్‌ నిర్వహణ ఖర్చులు చ.అ.ల చొప్పున కాకుండా నివాసితుందరికీ ఒకటే విధంగా ఉండాలి. పెద్ద సైజు గృహాలకు ఎక్కువ రహదారి, డ్రైనేజీ ఎక్కువ నీళ్లు, ఎక్కువ కాంతి వాడుకోలేరు కదా. అందుకే ఎన్ని ఫ్లాట్ల సంఖ్యను బట్టి చార్జీలను విభజించాలి. 🔹 హౌసింగ్‌ సొసైటీల్లోని క్లబ్‌హౌస్‌లను థర్డ్‌ పార్టీకి అప్పగించాలి. రెస్టారెంట్, సూపర్‌మార్కెట్, మెడికల్‌ వంటి ఇతరత్రా వాటికి అప్పగించాలి. ఆ అద్దెతో కమ్యూనిటీలో ఇతరత్రా ఖర్చులను వినియోగించుకోవచ్చు. 🔹 ఒకటే ఏరియాలో ఉండే 3–4 ప్రాజెక్ట్‌లకు ఒకటే క్లబ్‌హౌస్‌ కట్టుకోవటం ఉత్తమం. దీంతో నిర్మాణ సంస్థకు ఖర్చు ఆదా అవటంతో పాటు నివాసితులకు నిర్వహణ భారం కాదు.

Why India Defence Tech Sector A Surge in Investor Interest7
ఏ రంగంపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారంటే..

భారత్‌-పాక్‌ యుద్ధం నేపథ్యంలో భౌగోళిక రాజకీయ మార్పుల కారణంగా భారతదేశ రక్షణ సాంకేతిక రంగాన్ని పెట్టుబడిదారులు అవకాశంగా చూస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం బలమైన విధాన మద్దతు, వేగవంతమైన సాంకేతిక పురోగతి ఇందుకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు కేంద్రం దృష్టి సారించడం, పరిశ్రమ ఆవిష్కరణలు, వ్యూహాత్మక పరిష్కారాలకు భారత్‌ గ్లోబల్ హబ్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు ఈ రంగంపై ఆసక్తిగా ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.పెట్టుబడుల వృద్ధికి కారణాలుదేశీయ రక్షణ తయారీని బలోపేతం చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ చర్యల వల్ల వివిధ కంపెనీలతో ఇటీవల 253 అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకోవడంతో రూ.53,439 కోట్ల పెట్టుబడులు సమకూరే అవకాశం ఉంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్దపీట వేయడం వల్ల రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో పెట్టుబడిదారులకు భారత్ ఆకర్షణీయంగా మారుతోంది.సాంకేతికత అభివృద్ధిసివిలియన్‌, మిలిటరీ అప్లికేషన్లకు సర్వీసులు అందించే డ్యుయల్‌-యూజ్‌ టెక్నాలజీలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. నిఘా, వ్యూహాత్మక కార్యకలాపాల కోసం స్వయంప్రతిపత్తి కలిగిన డ్రోన్ల తయారీ సంస్థలపై దృష్టి సారిస్తున్నారు. రియల్ టైమ్ ముప్పును గుర్తించడం కోసం ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలను రూపొందించే కంపెనీలను గుర్తిస్తున్నారు. సముద్ర భద్రత, అన్వేషణ కోసం అండర్ వాటర్ డ్రోన్లు, అధునాతన డిఫెన్స్ ఇమేజింగ్, ఇంటెలిజెన్స్ కోసం హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహాల వంటి వాటిపై పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు.ఇదీ చదవండి: ఐఫోన్‌ అంతరించనుందా..?కంపెనీల తీరుడిఫెన్స్ టెక్ స్టార్టప్‌లు డీప్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (ఆర్ అండ్ డీ), మాడ్యులర్ టెక్నాలజీ, రెగ్యులేటరీ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాధాన్యత ఇస్తూ దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉన్నాయి. కంపెనీలు తక్కువ ఖర్చుతో సుస్థిరమైన, కృత్రిమ మేధ ఆధారిత రక్షణ పరిష్కారాలపై దృష్టి సారిస్తున్నాయి.

Investment lessons from Mother8
అమ్మ నేర్పించే పెట్టుబడి పాఠాలు

మాతృమూర్తుల ప్రపంచం చాలా అసాధారణంగా, అద్భుతంగా ఉంటుంది. ఇల్లు, కుటుంబం, ఆర్థిక వ్యవహారాలను మాతృమూర్తులు చక్కబెట్టే తీరును ఒకసారి పరిశీలిస్తే వారు ఎంత ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తారనేది అర్థమవుతుంది. పరిమిత వనరులతోనే అన్ని అవసరాలను చక్కబెట్టడం నుంచి దీర్ఘకాలిక కోణంలో పిల్లల భవిష్యత్‌ కోసం ఎన్నో సంవత్సరాల ముందు నుంచే ప్రణాళికలు వేసి, అమలు చేయడం వరకు అమ్మ ఎంతో ఓర్పుగా, క్రమశిక్షణగా అనుసరించే విధానం ఒక మాస్టర్‌క్లాస్‌గా ఉంటుంది. ఇన్వెస్టర్లకు కూడా ఇదే ఓరిమి, క్రమశిక్షణ, దీర్ఘకాలిక దృక్పథాలు ఉంటే సంపద సృష్టికి దోహదం చేస్తాయి. డబ్బు గురించి ఎలా ఆలోచించాలి, ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి, మనకు ఎంతో ఇష్టమైన వారి జీవితాలను తీర్చిదిద్దే నిర్ణయాలకు ఎలా కట్టుబడి ఉండాలనే విషయాలకు సంబంధించి అమ్మ నుంచి ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకోవచ్చు. ఓర్పు: ప్రక్రియను విశ్వసించడం ఒకసారి చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకోండి. పిల్లలు మొదటి మాట పలకడం కావచ్చు, మొదటి అడుగు వేయడం కావచ్చు ప్రతీ దాని కోసం అమ్మ ఎంతో ఓపికగా ఎదురుచూస్తుంది. తొందరపడదు. పిల్లలు తప్పకుండా సాధిస్తారు, వారిలో ఆ సామర్థ్యం ఉంది అని గట్టిగా నమ్ముతుంది. పెట్టుబడులు కూడా ఇందుకు భిన్నమైనవి కావు. మార్కెట్లు పెరుగుతాయి, పడతాయి. కానీ పెట్టుబడులను అలా కొనసాగించడం వల్ల కాంపౌండెడ్‌ ప్రభావంతో సంపద స్థిరంగా వృద్ధి చెందుతుంది. స్వల్పకాలిక ఒడిదుడుకుల ప్రభావాలకు మనం సులభంగా భయపడిపోవచ్చేమో. కానీ చిన్ననాటి మైలురాళ్లలాగే, ఆర్థిక మైలురాళ్లను సాధించడానికి కూడా సమయం పడుతుంది. నిలకడగా, చిన్న మొత్తాలను పెట్టుబడులు పెడుతూ సంవత్సరాలు గడిచే కొద్దీ పెద్ద నిధిని సమకూర్చుకునేందుకు సిప్‌లు (సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లు) చక్కని సాధనాలుగా నిలుస్తాయి. రూపీ కాస్ట్‌ యావరేజింగ్, కాంపౌండింగ్‌ ప్రయోజనాలను పొందుతూ కాలక్రమేణా సంపదను పెంచుకునేందుకు ఇవి తోడ్పడతాయి. క్రమశిక్షణ: చిన్న చిన్న పనులు, భారీ ఫలితాలు అమ్మ రోజువారీ దినచర్యే మనకు క్రమశిక్షణ పాఠంగా నిలుస్తుంది. పేరెంటింగ్‌ కావచ్చు, ఇన్వెస్టింగ్‌ కావచ్చు క్రమం తప్పకుండా, తరచుగా చేసే పనులు చిన్నవిగానే కనిపించినా భవిష్యత్తును తీర్చిదిద్దే పెద్ద ఫలితాలనిస్తాయి. ఎలాంటి సవాళ్లనైనా అధిగమించగలిగే సామర్థ్యాలనిస్తాయి. మార్కెట్లు పతనమైనప్పుడైనా లేక వ్యక్తిగతంగా ఆటంకాలు ఏర్పడిన కష్ట పరిస్థితుల్లోనైనా సిప్‌ల ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించడం వల్ల ఆర్థిక సామర్థ్యం బలపడుతుంది. సిప్‌ను మధ్య మధ్యలో మానేసినా ఫర్వాలేదని అప్పుడప్పుడు అనిపించినప్పటికీ, అలా చేయడం వల్ల, దీర్ఘకాలిక లక్ష్యాలకు హాని కలుగుతుంది. పేరెంటింగ్‌లాగే ప్రతి విషయంలోనూ నిలకడగా ఉండటం ముఖ్యం.సిప్‌లు: అమ్మ స్టయిల్‌లో పెట్టుబడులు పెట్టడం మాతృమూర్తులు కేవలం నేటి గురించే కాదు, భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తారు. పిల్లల చదువుల కోసం పొదుపు చేయడం కావచ్చు లేదా డబ్బు విలువ గురించి నేర్పించడం కావచ్చు, వారు నిలకడగా చేసే చిన్న చిన్న పనులే భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయి. సిప్‌లు కూడా ఇలాగే ఉంటాయి. ఆలోచనాత్మకంగా, నిలకడగా పని చేస్తాయి. క్రమశిక్షణతో క్రమం తప్పకుండా చేసే పెట్టుబడులే, అమ్మ కృషిలాగే, పెరిగి పెద్దయి, మంచి ఫలితాలనిస్తాయి. సత్వర లాభాల వెంటబడకుండా, అనిశ్చితుల్లోనూ పెట్టుబడులకు కట్టుబడాలి. ఫలితాలు వచ్చేందుకు తగిన సమయం ఇవ్వాలి. అమ్మలాగా పెట్టుబడి పెట్టడమంటే, సహన శక్తిపై నమ్మకం ఉంచడం. ప్రణాళికలు పట్టాలు తప్పకుండా చూసుకోవడం. సురక్షితమైన, స్వతంత్రమైన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం. ఇది స్మార్ట్‌ ఇన్వెస్టింగ్‌ మాత్రమే కాదు, దీర్ఘకాలిక దృక్పథంతో నెమ్మదిగా, అర్థవంతమైన విధంగా సంపదను పెంపొందించుకోవడం కూడా. ఒక్క ముక్కలో చెప్పాలంటే, మనం ఎంచుకున్న మ్యుచువల్‌ ఫండ్‌ స్కీములో క్రమం తప్పకుండా (సాధారణంగా నెలవారీగా), ఇంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్‌ చేసేందుకు సిప్‌ ఉపయోగపడుతుంది. ఈ విధానంతో మూడు శక్తివంతమైన ప్రయోజనాలు ఉన్నాయి: రూపీ–కాస్ట్‌ యావరేజింగ్‌: మార్కెట్‌ హెచ్చుతగ్గులను అధిగమించేందుకు సిప్‌లు ఆటోమేటిక్‌గా సహాయపడతాయి. మార్కెట్లు పడినప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి. మార్కెట్లు పెరిగినప్పుడు కాస్త తక్కువ యూనిట్లు వస్తాయి. క్రమేణా కొనుగోలు ధర, నిర్దిష్ట సగటు స్థాయిలో ఉండటం వల్ల కాస్త అదనపు ప్రయోజనాలు చేకూరతాయి.అలవాటు ఏర్పడటం: మాతృమూర్తుల దినచర్య ఎలాగైతే ఉంటుందో, సిప్‌లు కూడా ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేస్తాయి. ప్రతి నెలా సిప్‌ కట్టడమనేది ఒక అలవాటుగా మారుతుంది. దీర్ఘకాలిక పొదుపునకు దోహదపడుతుంది. సరళత్వం: తక్కువ మొత్తాలతోనే పెట్టుబడులను పెట్టడాన్ని ప్రారంభించేందుకు సిప్‌లు ఉపయోగపడతాయి. యువ ఇన్వెస్టర్లకు లేదా వివిధ బాధ్యతలున్న కుటుంబాలకు ఇలాంటి విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతల్లో మార్పులు, ఆదాయం పెరిగే కొద్దీ, పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవచ్చు. దీర్ఘకాలిక విజన్‌: భారీ లక్ష్యాలపై దృష్టిమాతృమూర్తులు కేవలం ఇవాళ్టి గురించే ఆలోచించరు. రాబోయే రోజుల గురించి కూడా ముందు నుంచే ప్రణాళికలు వేస్తూ ఉంటారు. స్కూలు ఫీజుల కోసం పొదుపు చేయడం దగ్గర్నుంచి పిల్లల పెళ్ళిళ్ల ఖర్చుల వరకు ప్రతి విషయం గురించి ఎన్నో సంవత్సరాల ముందు నుంచే ఆలోచిస్తారు. పెట్టుబడులు పెట్టే విషయంలోనూ ఈ దీర్ఘకాలిక విజన్‌ ఉండటం చాలా ముఖ్యం. సంపద సృష్టి అనేది కేవలం ట్రెండ్‌ల వెంట పరుగెత్తడం ద్వారా కాదు, ప్రణాళికలు పట్టాలు తప్పకుండా చూసుకోవడం ద్వారానే సాధ్యపడుతుంది. పిల్లల చదువులు, ఇంటి కొనుగోలు లేదా రిటైర్మెంట్‌ నిధిని సమకూర్చుకోవడం ఇలా లక్ష్యాల ఆధారితమైనదిగా ఇన్వెస్ట్‌మెంట్‌ ఉండాలి.-రోహిత్‌ మ‍ట్టూ, నేషనల్‌ హెడ్‌ (రిటైల్‌ సేల్స్‌), యాక్సిస్‌ మ్యుచువల్‌ ఫండ్‌

End of the iPhone Era AI Powered Innovations and Industry Shifts9
ఐఫోన్‌ అంతరించనుందా..?

ఏఐ ఆధారిత టెక్నాలజీలు చివరికి స్మార్ట్‌ఫోన్ల స్థానాన్ని భర్తీ చేయగలవని, వినియోగదారులు వ్యక్తిగత పరికరాలతో సంభాషించేలా ఈ సాంకేతికతలు కీలక మార్పులు తెస్తాయని యాపిల్‌ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎడ్డీ క్యూ తెలిపారు. వచ్చే దశాబ్ద కాలంలో ఐఫోన్ లభ్యతపై ఈ ప్రభావం ఉండనుందని చెప్పారు. ఇటీవల యాంటీట్రస్ట్ ట్రయల్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘ఐపాడ్ ఒకప్పుడు మ్యూజిక్ వినియోగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఐఫోన్లు అందుబాటులోకి వచ్చాక క్రమంగా వాటి వినియోగం తగ్గిపోయింది. చివరకు ఐపాడ్‌లను నిలిపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లు, నెక్స్ట్ జనరేషన్ ఎయిర్‌పాడ్‌లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి ఏఐ-ఆధారిత ప్రత్యామ్నాయాలు మనం కమ్యూనికేట్ చేసే సమాచారాన్ని యాక్సెస్ చేసే విధానం మారుతుంది. ఈ మార్పు రానున్న రోజుల్లో ఐఫోన్లను రిప్లేస్‌ చేసే అవకాశం ఉంది’ అని ఎడ్డీ ‍క్యూ తెలిపారు.యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీలు‘వచ్చే తరం కంప్యూటింగ్‌లో ముందుండాలనే లక్ష్యంతో యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీలను అన్వేషిస్తోంది. మెటా వంటి కంపెనీలు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), ఏఐ ఇంటిగ్రేటెడ్ వేరబుల్స్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సాంప్రదాయ స్మార్ట్‌ఫోన్లకు మించి మెరుగైన సామర్థ్యం, అంతరాయం లేని కనెక్టివిటీని ఈ టెక్నాలజీలు అందించే అవకాశం ఉంది. వాయిస్ కంట్రోల్డ్‌ అసిస్టెన్స్‌, రియల్-టైమ్ కాంటెక్స్ట్‌వల్‌ అవేర్‌నెస్‌, అడాప్టివ్ ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ వంటి ఆవిష్కరణలు వచ్చే రోజుల్లో ప్రామాణికంగా మారవచ్చు’ అని క్యూ అన్నారు.ఇదీ చదవండి: బలంగా ఎదిగేందుకు భారత్‌ సిద్ధంయాపిల్ విజన్‘ఐఫోన్ యాపిల్‌కు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పటికీ భవిష్యత్తులో కంపెనీ దీనికి ప్రత్యామ్నాయాన్ని సృష్టించేందుకు సిద్ధం అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఆర్, స్మార్ట్ డివైజ్ ఎకోసిస్టమ్స్‌లో యాపిల్ సాధించిన పురోగతితో కంపెనీ వ్యూహాత్మకంగా తదుపరి తరం కంప్యూటింగ్‌లో ముందంజలో ఉంది’ అని క్యూ చెప్పారు.

Gold and Silver Price Today On May 12th 202510
బంగారం జాక్‌పాట్‌! ఈరోజు కొంటే..

దేశంలో పసిడి ప్రియులకు బంగారం ధరలు (Gold Prices) శుభవార్త చెప్పాయి. రూ.లక్షకు చేరువలో ఉన్న మేలిమి బంగారం తులం ధర నేడు (మే 12) భారీగా దిగివచ్చింది. ఆభరణాలకు వినియోగించే పసిడి లోహం కూడా రూ.90వేల దిగువకు వచ్చేసింది. మే 12 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.96,880- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,800హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1800, రూ.1650 చొప్పున పతనమయ్యాయి.👉ఇది చదివారా? బంగారం మాయలో పడొద్దు.. సీఏ చెప్పిన లెక్కలు చూస్తే..చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.96,880- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,800చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1800, రూ.1650 చొప్పున పతనమయ్యాయి. ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,030- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,950ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1800, రూ.1650 చొప్పున పతనమయ్యాయి. ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.96,880- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,800ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్‌లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1800, రూ.1650 చొప్పున పతనమయ్యాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.96,880- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,800బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1800, రూ.1650 చొప్పున పతనమయ్యాయి. వెండి ధరలు కూడా భారీగానే..దేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీ మీద ఏకంగా రూ.2000 మేర తగ్గి రూ.1,09,000 వద్దకు వచ్చింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలో రూ.1150 తగ్గి రూ. 97,900 వద్దకు దిగివచ్చింది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

బిజినెస్ పోల్

Advertisement
Advertisement
Advertisement
 

Business exchange section

Currency Conversion Rate

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 109000.00 2000.00 2.00
Gold 22K 10gm 88800.00 1650.00 1.90
Gold 24k 10 gm 96880.00 1800.00 1.90

Egg & Chicken Price

Title Price Quantity
Chicken (1 Kg skin less) 243.00 1.00
Eggs 64.00 12.00

Stock Action