మగసానితిప్పలో ఆధ్యాత్మిక పరవశం.. ఆహ్లాదాన్ని పంచే అందాలెన్నో
గోదావరి నదీపాయల మీదుగా పడవ ప్రయాణం
మంత్రముగ్ధులను చేస్తున్న మడ అడవుల అందం
పర్యాటకంగా ప్రోత్సహిస్తే మంచి ఫలితం
సాక్షి, అమలాపురం/ కాట్రేనికోన: గౌతమీ నదీ సాగర సంగమ ప్రాంతం. పాయలు.. పాయలుగా విడిపోయే నది. వాటిని ఆనుకుని ఇరువైపులా చిట్టిపొట్టి మొక్కలు.. చిక్కని గుబురు పొదలు. వాటి మధ్య సాగే పడవ ప్రయాణం. మడ పీతలు.. అందమైన పక్షులు.. అరుదైన వృక్షజాతులు.. ఔషధ మొక్కలు ఇలా దారి పొడవునా కనిపించే అందమైన సుందర దృశ్యాలు ఎన్నో మరెన్నో. అంబేడ్కర్ కోనసీమ జిల్లా బలుసుతిప్ప శివారు మగసానితిప్పకు వెళ్లే పడవ ప్రయాణం పైరు పచ్చని కోనసీమలో సరికొత్త అందాలను కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. కొబ్బరి తోటలు.. పచ్చని పొలాలు.. పంట కాలువల అందాలనే కాదు.. మడ అడవులు.. నదీపాయలు.. పడవ ప్రయాణాలు.. ఇలా ‘స్వర్గమే కళ్లముందు’ కదలాడుతోంది.
మగసానితిప్ప ఓ కుగ్రామం (Maasaani Tippa Village). గోదావరి నదీపాయలు, మడ అడవులు నడుమ ఒక చిన్న దీవి. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప పంచాయతీ శివారు గ్రామం. అగ్నికుల క్షత్రియులు ఉండే ఆ గ్రామానికి వెళ్లాలంటే పడవ ఒక్కటే మార్గం. అటువంటి గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం కాల భైరవస్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి సుమారు 1,800 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు.
గతంలో స్వామివారి ఆలయాన్ని సమీపంలో ఉన్న బలుసుతిప్ప గ్రామంలో చౌళరాజులు నిర్మించారని ఆలయ చరిత్ర చెబుతోంది. తుపాను సమయంలో మూలవిరాట్ సముద్రంలో కూరుకుపోతుండగా, మత్స్యకారులు అడ్డుకుని ఊరికి ఈశాన్యంగా ఉన్న మగసానితిప్పలో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఆలయం నిర్మించి వందేళ్లకు పైబడి అవుతోంది. తొలుత మత్స్యకార పద్దెలు పూజాదికాలు నిర్వహించగా, గత 80 ఏళ్లుగా బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నారు.
పర్యాటకంగా ప్రోత్సహించాలి
పర్యాటకంగా ప్రోత్సహిస్తే ప్రయాణికులు, భక్తుల సంఖ్య మరింత పెరగనుంది. ఏకో టూరిజంలో భాగంగా గతంలో పలు సందర్భాల్లో పర్యాటక బోట్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వచ్చినా తరువాత పట్టించుకునేవారు లేకుండా పోయారు. బలుసుతిప్ప, జి.మూలపొలం నుంచి ప్రత్యేక పర్యాటక బోట్లు ఏర్పాటు చేయడం, మగసానితిప్పలో సేద తీరేందుకు ఏర్పాట్లు చేస్తే పర్యాటక అభివృద్ధి జరుగుతుంది.
పెరిగిన తాకిడి
అతి పురాతన ఈ ఆలయానికి ఇటీవల కాలంలో భక్తుల తాకిడి పెరిగింది. గతంలో అప్పుడప్పుడు ఒకరిద్దరు భక్తులు మాత్రమే బయట నుంచి వచ్చేవారు. మహాశివరాత్రి నాడు మాత్రం పెద్ద ఎత్తున భక్తులు వచ్చేవారు. కానీ ఇప్పుడు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మరీ ముఖ్యంగా కార్తిక మాసంలో రోజూ భక్తులు వస్తుండగా ఆయ్యప్ప, భవానీ మాలధారులు భారీగా వస్తున్నారు. ప్రతి నెలా అష్టమి రోజు ఇక్కడ గుమ్మడి కాయలో దీపం పెట్టడం వల్ల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం.
ఆనవాయితీగా దీపారాధన
కాల భైరవస్వామి వెలసి 18 దశాబ్దాలు దాటిందని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించి వందేళ్లు దాటుతోంది. ఏడు దశాబ్దాలుగా మా తండ్రి, తరువాత నేను అర్చకత్వం చేస్తున్నాం. గతంలో భక్తులు పెద్దగా వచ్చేవారు కాదు. ఇప్పుడు పెరిగింది. అష్టమి రోజున ఇక్కడ గుమ్మడికాయలో దీపారాధన చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీనిపై నమ్మకంతో భక్తులు అధికంగా వస్తున్నారు.
– ఓం నమశ్శివాయ, ఆలయ పూజారి, మగసానితిప్ప
ముచ్చటగొలిపేలా..
ఈ గ్రామానికి వెళ్లేందుకు రెండు జల మార్గాలున్నాయి. ఒకటి బలుసుతిప్ప, రెండోది ఐ.పోలవరం మండలం జి.మూలపొలం నుంచి ఇంజన్ పడవల (బోట్లు) మీద రాకపోకలు సాగించాల్సి ఉంది. ఈ పడవల ప్రయాణం ఒక అద్భుతం. మనో ఫలకంపై చెరగని ముద్రగా నిలిచిపోతోంది అంటే అతిశయోక్తి కాదు. ఒంపులు తిరుగుతూ సాగే నదీపాయల మధ్య బోటు ప్రయాణం.. ఇరువైపులా దట్టమైన పొదరిల్లుగా అల్లుకుపోయిన మడ చెట్లు.. నీటి మీద తేలియాడే వాటి వేర్లు ముచ్చటగొల్పుతాయి. అడవుల్లో ఉండే ఔషధ మొక్కల నుంచి వచ్చే పరిమళాలు ప్రకృతి ప్రేమికులను మరో లోకానికి తీసుకుపోతాయి. చెట్ల కొమ్మల మీద పాకుతున్న మడ పీతలు.. అక్కడక్కడా కనిపించే మడ పిల్లులు.. విదేశీ పక్షులు కనువిందు చేస్తాయి.
చిన్న కాలువలుగా.. వెంటనే పెద్ద నదిని తలపించే పాయలు.. తీరాన్ని ఆనుకుని గోదావరి దీవుల మధ్య సంప్రదాయ పద్ధతిలో జీవనం సాగించే అగ్నికుల క్షత్రియులు (మత్స్యకారులు). చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ మడ అడవుల్లో పీతలు, చేపల, రొయ్యల వేట ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి. మడ అడవులను ఆనుకుని మత్స్య సంపద కోసం ఏర్పాటు చేసిన వలలు, వాటి వద్ద మత్స్యకారుల సందడి ముచ్చట గొల్పుతాయి. పడవలకు ఎదురుగా వచ్చే వేట పడవలు... రాకపోకలు సాగించే గ్రామస్తులు, గంటపాటు సాగే ప్రయాణంలో కంటిని కట్టిపడేసే అందచందాల గురించి ఎలా ఎన్ని చెప్పుకొన్నా.. ఎంత చెప్పుకొన్నా తక్కువే. ప్రకృతి ప్రేమికులు జీవితంలో ఒక్కసారైనా ప్రయాణం చేయాలనిపించే ప్రాంతం ఇది.
Comments
Please login to add a commentAdd a comment