
గోదావరి–బనకచర్ల అనుసంధానం, గెజిట్ నోటిఫికేషన్ అమలే ప్రధాన అజెండా
సాక్షి, అమరావతి: గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో జరగనుంది. గోదావరి–బనకచర్ల అనుసంధానం, అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్‌ల మదింపు, బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు, పెద్దవాగు ఆధునికీకరణ ఈ సమావేశం ప్రధాన అజెండా.
జీఆర్‌ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన జరగనున్న ఈ 17వ సర్వ సభ్య సమావేశంలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీలను బనకచర్లకు తరలించేలా ఏపీ ప్రభుత్వం చేపట్టిన అనుసంధానంపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీఆర్‌ఎంబీకి లేఖ రాసింది. సర్వ సభ్య సమావేశంలో ఆ అనుసంధానంపై చర్చించాలని కోరింది.