Godavari board
-
పోలవరం అనుమతీ చెల్లదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని సీతారామ– సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే అంశంపై నిర్వహించనున్న టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) సమావేశానికి తమను పిలవలేదని, సీడబ్ల్యూసీ అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. అలా అయితే, గోదావరి పరీవాహక ప్రాంతంలోని మిగతా రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలను ఆహ్వానించకుండానే.. 2009లో టీఏసీ నిర్వహించి పోలవరం ప్రాజెక్టుకు ఇచి్చన అనుమతులూ చెల్లుబాటు కావు అని స్పష్టం చేసింది. సీతారామ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీలోని టీఏసీ అనుమతులకు సిఫార్సు చేస్తూ గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశంలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బోర్డుకు ఇటీవల ఏపీ లేఖ రాసింది. ‘ప్రస్తుతం 2017 మార్గదర్శకాలు అమల్లో ఉండగా, 1996 మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులివ్వడం సరికాదు’అని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ జి.అనిల్‌కుమార్ సోమవారం గోదావరి బోర్డుకు లేఖ రాశారు. ‘పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ 2009, 2011లో అనుమతులను 1996 మార్గదర్శకాల ప్రకారమే ఇచి్చంది. వీటి ఆధారంగానే తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యవహరిస్తోంది’అని బదులిచ్చారు. న్యాయస్థానానికి వెళ్లక తప్పని పరిస్థితి కల్పించారని ఏపీ పేర్కొనగా, తప్పుడు ఉద్దేశాలతో కేసులేసినా నిలబడవని తెలంగాణ కౌంటర్ ఇచి్చంది. గోదావరి ట్రిబ్యునల్ అవసరం లేదు అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్ 3 కింద ఏపీ, తెలంగాణ మధ్య గోదావరి జలాల పంపకానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఏపీ కోరగా, అది ఏమాత్రం అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. తాము 531.908 టీఎంసీల గోదావరి జలాల వినియోగం కలిగి ఉన్నట్టు సీడబ్ల్యూసీ నిర్ణయించడం ఏకపక్షమన్న ఏపీ వాదనను కూడా తెలంగాణ తోసిపుచ్చింది. ‘రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఉమ్మడి ఏపీకి ఉన్న 1,486 టీఎంసీల నీటి వాటా నుంచి తెలంగాణకు 967.94 టీఎంసీలు, ఏపీకి 518.215 టీఎంసీలను కేటాయిస్తూ ఉమ్మడి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ 2014 జనవరి 2న రాష్ట్ర ప్రణాళిక సంఘం కార్యదర్శికి లేఖ రాశారు. దానినే నాటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వరద జలాలు/మిగులు జలాల ఆధారంగా చేపట్టిన పురుషోత్తపట్నం లిఫ్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతలపూడి లిఫ్టు, గోదావరి–పెన్నా అనుసంధానం తదిత ర ప్రాజెక్టులకు నీటి హక్కులు సాధించుకునేందుకే ఏపీ తప్పుడు ఉద్దేశాలతో ట్రిబ్యునల్ ఏర్పాటును కోరుకుంటోంది. ఈ ప్రాజెక్టులకు నేటికీ సీడబ్ల్యూసీ నుంచి టెక్నో ఎకనామికల్ క్లియరెన్స్, టీఏసీ అనుమతి లేదు. దీంతో వీటిని రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాల్సి ఉంటుంది. గోదావరి జలాల్లో ఏపీకి 531.908 టీఎంసీల న్యాయబద్ధమైన వినియోగం ఉన్నట్టు నిరూపించడంలో ఆ రాష్ట్రం విఫలమైంది’అని తెలంగాణ స్పష్టం చేసింది. ఏపీ అభ్యంతరాలను సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుంది సీతారామ ప్రాజెక్టు వల్ల ఏపీ హక్కులకు ఎలాంటి నష్టం ఉండదని సీడబ్ల్యూసీ చెప్పడం సరికాదని ఆ రాష్ట్రం పేర్కొనగా.. ఏపీ అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సీడబ్ల్యూసీ ఈ మేరకు తేల్చిందని తెలంగాణ వివరణ ఇచి్చంది. ఇచ్చంపల్లి ప్రాజెక్టు ద్వారా 85 టీఎంసీల వినియోగంపై గోదావరి ట్రిబ్యునల్ విధించిన ఆంక్షలు ఆ ప్రాజెక్టుకే పరిమితమని, సీతారామ ప్రాజెక్టుకు వర్తించవని తెలిపింది. 35 టీఎంసీలతో దేవాదుల, 195 టీఎంసీలతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడంతో ఆ 85 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టేనని, దీంతో సీతారామ ప్రాజెక్టుకు నీటి లభ్యత లేదన్న ఏపీ వాదనను తోసిపుచి్చంది. ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు కట్టుబడే దేవాదుల, కాళేశ్వరంతో పాటు పోలవరం ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతిలిచి్చందని తెలిపింది.పోలవరం ప్రాజెక్టుపై ప్రభావం ఉండదు‘పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే సమయంలో అక్కడ 991 టీఎంసీల నీటి లభ్యత ఉందని వ్యాప్కోస్ నిర్ధారించగా, 861 టీఎంసీలేనని సీడబ్ల్యూసీ కుదించింది. 2018 నాటి సీతారామ ప్రాజెక్టు డీపీఆర్ ప్రకారం పోలవరం వద్ద నీటి లభ్యత 460.7 టీఎంసీలకు తగ్గింది. సీతారామ డీపీఆర్ ప్రకారం అక్కడ నికర లోటు 13.64 టీఎంసీల నుంచి 151 టీఎంసీలకు పెరి గింది. గోదావరిలో మిగులు జలాల లభ్యత లేదని న దుల అనుసంధానం సందర్భంగా సీడబ్ల్యూసీ తేల్చింది. ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గిన నేపథ్యంలో పోలవరం వద్ద నీటి లభ్యతపై తాజా అధ్యయనం జరపాలి’అని ఏపీ కోరింది. సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ డైరెక్టరేట్ పరీ వాహకంలోని అన్ని రాష్ట్రాల ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభా వం ఉండదని నిర్ధారించిందని తెలంగాణ బదులిచ్చింది. -
టెక్నికల్ క్లియరెన్స్‌కు ‘సీతారామ’
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం– సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు డీపీఆర్‌ను టెక్నికల్ అప్రైజల్ క్లియరెన్స్ కోసం పంపించేలా కేంద్ర జలసంఘానికి సిఫారసు చేస్తున్నామని గోదావరినది యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) చైర్మన్ ముఖేష్‌కుమార్ సిన్హా తెలిపారు. ప్రాజెక్టుపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలు, అనుమానాలను సైతం రికార్డు చేసి సీడబ్ల్యూసీకి పంపిస్తామన్నారు. ఏపీ లేవనెత్తిన సందేహాల్లో చాలావాటిని ఇప్పటికే సీడబ్ల్యూసీ నివృత్తి చేసిందని చెప్పారు. ఇంకా ఏమైనా అనుమానాలుంటే సీడబ్ల్యూసీని నేరుగా సంప్రదించవచ్చని ఏపీని సూచించారు. గోదావరిబోర్డు 16వ సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగింది. సీతారామ ఎత్తిపోతల పథకం–సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు అనుమతులపై ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. గోదావరిబోర్డు ముందు సీతారామ ప్రాజెక్టు డీపీఆర్ రాగా, దానికి టెక్నికల్ అప్రైజల్ క్లియరెన్స్ కోసం బోర్డు సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకుంది.దీంతో ప్రాజెక్టుకు అనుమతులు తుది అంకానికి చేరాయి. తదుపరి దశలో సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) డీపీఆర్‌ను పరీక్షించి క్లియరెన్స్ ఇవ్వనుంది. టీఏసీ క్లియరెన్స్ లభిస్తే ప్రాజెక్టుకు అనుమతులు లభించినట్టే భావిస్తారు. ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశమై ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆమోదిస్తే అన్ని రకాల అనుమతులు లభించినట్టే. గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ(జనరల్) జి.అనిల్ కుమార్, అంతర్రాష్ట్ర విభాగం సీఈ మోహన్‌కుమార్, గోదావరి బేసిన్ డీడీ సుబ్రహ్మణ్య ప్రసాద్, ఏపీ తరఫున ఈఎన్సీ వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర విభాగం సీఈ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రాతిపదికన తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు? రెండు రాష్ట్రాల మధ్య గోదావరి నీటి పంపకాలే జరగలేదని, ఎలాంటి అవగాహన ఒప్పందం లేదని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ ఎలా క్లియరెన్సులు జారీ చేస్తుందని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావుఅభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులతో ఏపీలోని పోలవరం, గోదావరి డెల్టా సిస్టమ్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తున్నామని, దీనికి అనుమతులను తిరస్కరించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో 33 టీఎంసీలను తరలించడానికి చేపట్టిన ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులకు బదులుగా 70 టీఎంసీలను తరలించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టు రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమన్నారు. ఏపీ అభ్యంతరాలు గోదావరి బోర్డు పరిధిలోకి రావు ఉమ్మడి రాష్ట్రంలో 1,486 టీఎంసీల గోదావరి జలాల వినియోగం కోసం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు రచించగా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పుతో పాటు ఆయా ప్రాజెక్టుల లొకేషన్లు, జలాలపై ఉన్న హక్కులను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 518 టీఎంసీల జలాలపై హక్కులు ఏర్పడుతాయని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు. ఏపీ సమర్పించిన ప్రాజెక్టుల వివరాల ప్రకారం ఆ రాష్ట్రానికి 531 టీఎంసీల జలాలపై హక్కులున్నట్టు సీడబ్ల్యూసీ తేల్చిందని, ఆ జలాలకు రక్షణ కల్పిస్తూనే తెలంగాణలోని ప్రాజెక్టులను అనుమతులు ఇస్తోందని తెలిపారు. సీతారామ ప్రాజెక్టుపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలు, అనుమానాలు గోదావరి బోర్డు పరిధిలో రావని తెలిపారు. అవి సీడబ్ల్యూసీ పరిధిలో వస్తాయని, అక్కడే నివృత్తి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్టులకు క్లియరెన్స్‌ల విషయంలో సీడబ్ల్యూసీ ఏపీని సంప్రదించలేదని ఆ రాష్ట్రం చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను, నీటి అవసరాలను, ఆయకట్టు వివరాలను, డాక్యుమెంట్లను సీడబ్ల్యూసీకి సమర్పించినట్టు తెలిపారు. వీటిని పరిగణ నలోకి తీసుకొని ఎగువ, దిగువ పరీవాహకంలోని రాష్ట్రాల అవసరాలన్నింటినీ పరిరక్షిస్తూ సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌లు ఇస్తోందన్నారు. ఈ విషయంలో ఏపీ అభ్యంతరాలు సమంజసం కాదన్నారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు, ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ప్రాజెక్టుల నిర్మాణ ప్రణాళికలకు అనుగుణంగానే ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. -
కొత్త ట్రిబ్యునల్‌పై నిర్ణయాధికారం కేంద్రానిదే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య గోదావరి నదీ జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ వేయాలనే ఏపీ విజ్ఞప్తిని గోదావరి బోర్డు సమావేశం ఎజెండాలో పెట్టడంపై తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం ప్రకారం ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం కేంద్రానికే ఉందని స్పష్టం చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్–85 కింద అప్పగించిన అధికారాలకే గోదావరి బోర్డు పరిమితం కావాలని చెప్పింది. బోర్డు పరిధిలోకి రాని అంశాలను ఎజెండాలో ఎలా చేర్చుతారని ప్రశ్నించింది. దీంతో ఈ అంశంపై గోదావరి బోర్డు సమావేశంలో చర్చించబోమని బోర్డు చైర్మన్ ముకేశ్ కుమార్ సిన్హా ప్రకటించారు. శుక్రవారం జలసౌధలో గోదావరి బోర్డు సమావేశం వాడీవేడిగా జరిగింది. తెలంగాణ నుంచి ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, నీటిపారుదల శాఖ సంయుక్త కార్యదర్శి భీంప్రసాద్, అంతర్రాష్ట్ర ఎస్ఈలు కోటేశ్వరరావు, శ్రీధర్‌రావు దేశ్‌పాండే, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్య ప్రసాద్, ఏపీ నుంచి నీటిపారుదల శాఖ సంయుక్త కార్యదర్శితో పాటు సీఈ (హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర) కుమార్, ఈఈ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. సరిహద్దుల వద్దే టెలిమెట్రీలు పెట్టాలి గోదావరి బోర్డు సమావేశం ఎజెండాలో కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం జారీ చేసిన టీవోఆర్ (టర్మ్ అండ్ రిఫరెన్స్)ను చేర్చగా... ట్రిబ్యునల్ పరిధిలో ఉన్న అంశాన్ని చర్చించడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా టెలిమెట్రీ కేంద్రాలు పెట్టాలనే ప్రతిపాదనలను తెలంగాణ వ్యతిరేకించింది. అంత్రరాష్ట్ర సరిహద్దుల్లోనే టెలిమెట్రీ కేంద్రాలు పెట్టాలని, జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్హెచ్పీ) కిందఏర్పాటు చేయాలని కోరింది. కాగా తెలంగాణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లోకె నాల్, ఎస్సారెస్పీ–2 విస్తరణ, శ్రీపాద ఎల్లంపల్లి, కాళేశ్వరం అదనపు టీఎంసీ, కుప్తీ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ డిమాండ్ చేసింది. పై 4 ప్రాజెక్టుల్లో మూడింటికి టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం లభించిందని, కుప్తీ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే అందిస్తామ ని తెలంగాణ తెలిపింది. గోదావరిలో న్యాయమైన వాటా ప్రకారమే ప్రాజెక్టులు కడుతున్నామని స్పష్టం చేసింది. అదనపు సిబ్బంది అవసరం లేదు గోదావరి బోర్డుకు అదనంగా సిబ్బందిని సమకూర్చాలని చేసిన ప్రతిపాదనలను రెండు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ప్రాజెక్టులు అప్పగించనప్పుడు అదనంగా సిబ్బంది అవసరమే లేదని స్పష్టం చేశాయి. 2024–25లో బోర్డుకు రూ.16 కోట్ల బడ్జెట్ కేటాయింపునకు ఆమోదం తెలపాలని ప్రతిపాదించగా.. 2023–24లో వ్యయం రూ.8 కోట్లకు మించదని, రూ.10 కోట్లు కేటాయిస్తే సరిపోతుందని పేర్కొన్నాయి. గోదావరి జలాల వినియోగంతో పాటు పంటల సాగు వివరాలను ఉపగ్రహ చిత్రాల సహకారంతో సేకరించాలని బోర్డు చేసిన ప్రతిపాదనలను తెలుగు రాష్ట్రాలు తోసిపుచ్చాయి. సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి అజగేషన్, సభ్యులు పాల్గొన్నారు. -
గోదావరిలో చుక్కనీటినీ వదులుకోం
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో తమ వాటా 967 టీఎంసీల్లో చుక్కనీటిని కూడా వదులుకోబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. గోదావరిలో నీటిలభ్యతను తేల్చుతూ ఇటీవల కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) గోదావరి బోర్డుకు సమర్పించిన నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాళేశ్వరం వద్ద గోదావరిలో ప్రాణహిత నది కలిసేచోట నుంచి గోదావరి నది సముద్రంలో కలిసేవరకు ఉన్న జీ–10 సబ్ బేసిన్‌లోని తెలంగాణ వాటాలో 28.847 టీఎంసీలను సీడబ్ల్యూసీ తక్కువగా చూపించిందని తప్పుబట్టింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ తాజాగా గోదావరి బోర్డు చైర్మన్ ఎంకే సిన్హాకు లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1,486 టీఎంసీలకుగాను తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు, ఏపీ ప్రాజెక్టులకు 518 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. జీ–10 సబ్ బేసిన్లో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు 287.189 టీఎంసీలు అవసరమని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మరో 126.642 టీఎంసీలు కావాలని, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టులకు 8.887 టీఎంసీలు, విద్యుదుత్పత్తి అవసరాలకు 12.2 టీఎంసీలు అవసరమని తేల్చిచెప్పారు. జీ–10 సబ్ బేసిన్లో మొత్తం 434.918 టీఎంసీల కేటాయింపులు అవసరమని, సీడబ్ల్యూసీ నివేదికలో 406.07 టీఎంసీలను మాత్రమే చూపించిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిలభ్యత సీడబ్ల్యూసీ 498.07 టీఎంసీలని నిర్ధారించగా, సీడబ్ల్యూసీ పరిధిలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ(టీఏసీ) అనుమతుల ప్రకారం గోదావరి డెల్టా, పోలవరం అవసరాలకు 484.5 టీఎంసీలు అవసరమని గుర్తుచేశారు. పోలవరం దిగువ 45.83 టీఎంసీల లభ్యత ఉందని, పోలవరం అవసరాలకు 438 టీఎంసీలు సరిపోతాయని స్పష్టం చేశారు. -
గోదావరిలో 3,396.9 టీఎంసీల లభ్యత
సాక్షి, అమరావతి : గోదావరి జల వివాదాల (బచావత్) ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చే నాటికి ప్రతి ఏటా గోదావరిలో మొత్తం 4,535.1 టీఎంసీల లభ్యత ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా అంచనా వేసింది. 75 శాతం లభ్యత ఆధారంగా 3,396.9 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్)లో 1941–42 నుంచి 1979–80 వరకు వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా గోదావరిలో నీటి లభ్యతపై సీడ బ్ల్యూసీ ఈ అధ్యయనం చేసింది. గోదావరిలో సబ్ బేసిన్ వారీగా నీటి లభ్యత, బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను తేల్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరిలో 75% లభ్యత ఆధారంగా 1,430 టీఎంసీల లభ్యత ఉందని 2004లో వ్యాప్కోస్ లెక్కేయగా, సీడబ్ల్యూసీ తాజా అధ్య యనంలో 1,435 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. వ్యాప్కోస్ అంచ నా కంటే సీడబ్ల్యూసీ అధ్యయనంలో 5 టీఎంసీలు అధికంగా ఉన్నట్లు స్ప ష్టమవుతోంది. ఈ అధ్యయనం ప్రకారం ఉమ్మడి మధ్యప్రదేశ్‌కు 679.6 టీఎంసీలు, మహారాష్ట్రకు 951, కర్ణాటకకు 37.8, ఉమ్మడి ఏపీకి 1,435, ఒడిశాకు 293.6 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించినట్లు అంచనా వేస్తూ సీడబ్ల్యూసీ ఇటీవల గోదావరి బోర్డుకు నివేదిక స మర్పించింది. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అభిప్రాయాలను గో దావరి బోర్డు కోరింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గోదావరి జ లాలపై 7 అధ్యయనాలు జరగ్గా సీడబ్ల్యూసీ చేసిన తాజా అధ్యయనం ఎనిమిదోది. తాజా అధ్యయనం నేపథ్యం ఇదీ ఏపీలో ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో చేపట్టే ప్రా జెక్టులకు 1,238.46 టీఎంసీలు (902.46 నికర, 336 మిగులు) అవసరమని గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం పలు సందర్భాల్లో తెలిపింది. తెలంగాణ కూడా ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, భవి ష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు 1,767 టీఎంసీలు (967 నికర, 800 మిగులు) అవసరమని బోర్డుకు తెలిపింది. 2 రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటే 3,005.46 టీఎంసీలు అవసరం. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి, 2 రాష్ట్రాలకు కేటాయింపులు చేశాకే కొత్త ప్రాజెక్టులకు అనుమతివ్వాలని జనవరి 3న జరిగిన సర్వసభ్య సమావేశంలో 2 రాష్ట్రాలు బోర్డును కోరాయి. గోదా వరిలో సబ్ బేసిన్ల వారీగా నీటి లభ్యతను తేల్చకుండానే అప్పట్లో రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాల ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ జలాలను పంపిణీ చేసింది. ఇదే అంశాన్ని వివరిస్తూ గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోరాయి. దీంతో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు వెలువడే నాటికి గోదావరిలో నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జనవరి 19న సీడబ్ల్యూసీకి గోదావరి బోర్డు లేఖ రాసింది. బోర్డు ప్రతిపాదన మేరకు సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద పురుడుపోసుకునే గోదావరి 1,465 కి.మీ పొడవున ప్రవహించి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద బంగాళా ఖాతంలో కలుస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో 3,12,150 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ నదీ పరీవాహక ప్రాంతం ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 9.5 శాతంతో సమానం. గోదావరి జలాలను బేసిన్ పరిధిలోని రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ 1980 జూలై 7న బచావత్ ట్రిబ్యునల్ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అదే ఏడాది ఆ అవార్డును కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో 1941–42 నుంచి 1979–80 వరకు అంటే 40 ఏళ్లు గోదావరి బేసిన్లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ తాజాగా అధ్యయనం చేసింది. -
సీతారామా.. నీళ్లెక్కడ?
సాక్షి, అమరావతి: సీతారామ ఎత్తిపోతల, సీతమ్మ సాగర్ బహుళార్ధసాధక ప్రాజెక్టుకు నీళ్లెక్కడివని తెలంగాణ ప్రభుత్వాన్ని గోదావరి బోర్డు ప్రశ్నించింది. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేయలేదని, నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందమే కుదరలేదని స్పష్టంచేసింది. నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టును ఎలా చేపట్టారని తెలంగాణను నిలదీసింది. దమ్ముగూడెం ఆనకట్టకు 200 మీటర్ల దిగువన 36.57 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో సీతమ్మసాగర్ బ్యారేజీ, దానికి అనుబంధంగా 320 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్ కేంద్రం నిర్మించి రోజుకు 9 వేల క్యూసెక్కుల చొప్పున 70 టీఎంసీలను తరలించి 6.74 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా సీతారామ ఎత్తిపోతలను తెలంగాణ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను గోదావరి బోర్డుకు అందజేసింది. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి, రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసే వరకు తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకూడదని, తద్వారా దిగువ రాష్ట్రం హక్కులను పరిరక్షించాలని గోదావరి బోర్డు, కేంద్ర జల్ శక్తి శాఖలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక లేఖలు రాసింది. ఇదే అంశంపై జనవరి 3న జరిగిన సర్వ సభ్య సమావేశంలోనూ సీడబ్ల్యూసీని కోరింది. తాజాగా సీతారామా ఎత్తిపోతలపై గోదావరి బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పోలవరం ఆయకట్టుకు రక్షణ కల్పిస్తేనే పోలవరం ప్రాజెక్టు వద్ద 75 శాతం లభ్యత ఆధారంగా 561 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) 141వ సమావేశంలో తేల్చింది. ఎగువన ఏ ప్రాజెక్టు చేపట్టినా పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన 561 టీఎంసీలకు రక్షణ కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. కానీ.. సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌లో సీతమ్మ సాగర్ వద్ద 347.06 టీఎంసీల లభ్యత ఉంటుందని తెలంగాణ పేర్కొంది. దీనిని అధ్యయనం చేసి నీటి లభ్యతను ఖరారు చేయాలని సీడబ్ల్యూసీకి గోదావరి బోర్డు ప్రతిపాదించింది. సీతారామ ఎత్తిపోతల చేపడితే పోలవరం వద్ద 561 టీఎంసీల లభ్యతపై స్పష్టత ఇవ్వాలని కోరింది. కృష్ణా బేసిన్‌కు ఎలా తరలిస్తారు? సీతారామ ఎత్తిపోతల ద్వారా 10.109 టీఎంసీల గోదవరి జలాలను కృష్ణా బేసిన్‌కి తరలించి నాగార్జునసాగర్, వైరా, పాలేరు ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరిస్తామని డీపీఆర్‌లో తెలంగాణ సర్కార్ పేర్కొంది. ఏ ప్రాతిపదికన గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తారో స్పష్టత ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌ను గోదావరి బోర్డు కోరింది. వీటిపై స్పష్టత ఇస్తేనే సీతారామ ఎత్తిపోతల, సీతమ్మసాగర్ డీపీఆర్ మదింపు, అనుమతి ప్రక్రియ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల డిమాండ్ 1,743 టీఎంసీలు ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టుల అవసరాలకు 776 టీఎంసీలు అవసరమని ఏపీ, 967 టీఎంసీలు అవసరమని తెలంగాణ ప్రతిపాదించాయని గోదావరి బోర్డు పేర్కొంది. అంటే.. రెండు రాష్ట్రాల అవసరాలు 1,743 టీఎంసీలని లెక్కగట్టింది. కానీ, గోదావరిలో ఆ మేరకు నీటి లభ్యత లేదని రెండు రాష్ట్రాలూ అంగీకరిస్తున్నాయని తెలిపింది. ఉమ్మడి ఏపీ 2014 జనవరి 2న రాసిన లేఖ ప్రకారం గోదావరిలో నీటి లభ్యత 1,486.155 టీఎంసీలని తెలంగాణ అంటుండగా, 2004 నాటి వ్యాప్కోస్ నివేదిక ప్రకారం గోదావరిలో కేవలం 1,360 టీఎంసీలని, పునరుత్పత్తితో కలిసి 1,430 టీఎంసీలని ఏపీ ప్రభుత్వం పేర్కొంటోంది. పునరుత్పత్తి జలాలను పరిగణలోకి తీసుకోకూడదని గోదావరి ట్రిబ్యునల్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. వ్యాప్కోస్ నివేదిక ప్రకారం నీటి లభ్యత 1,360 టీఎంసీలే. ఇదిలా ఉండగా.. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల ద్వారా 2000 – 2020 మధ్య కాలంలో సగటున వరుసగా 72 టీఎంసీలు, 11 టీఎంసీలను వాడినట్టు తెలంగాణ పేర్కొంది. ఈ నేపథ్యంలో గోదావరి బేసిన్, సబ్ బేసిన్ల వారీగా నీటి లభ్యతపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని గోదావరి బోర్డు కోరింది. -
ముందు వాటాలు తేల్చండి!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ తరలింపు పనులపై ఏపీ ప్రభుత్వం మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విభజన చట్టం ప్రకారం ట్రిబ్యునల్ ద్వారా గోదావరి జలాల్లో వాటాలు తేలే వరకు లేదా నీటి వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరే వరకు ఈ పనులకు ఎలాంటి అనుమతులు జారీ చేయరాదని డిమాండ్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు రెండు టీఎంసీల గోదావరి జలాలను తరలించే పనులకు 2018 జూన్ 6న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. నీటి వాటాలు తేలేదాకా ఆ అనుమతులను పునఃసమీక్షించడంతో పాటు మూడో టీఎంసీ పనులకు అనుమతి ఇవ్వొద్దని కోరింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తాజాగా గోదావరి బోర్డు చైర్మన్ ఎంకే సిన్హాకు లేఖ రాశారు. వాటాలు తేలకుండానే ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులకు అనుమతి ఇస్తే.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను హరించినట్లేనని తేల్చి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ)ను కేంద్రం ఏర్పాటు చేయాలని ఏపీ కోరింది. డీపీఆర్‌ల పరిశీలనకు సుప్రీం అనుమతి నేపథ్యంలో లేఖ... కాళేశ్వరం మూడో టీఎంసీ తరలింపు పనులకు పర్యావరణ అనుమతి లేకపోవడంతో గతంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ఆ ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనను గోదావరి బోర్డు ఆపేసింది. డీపీఆర్ పరిశీలనకు గోదావరి బోర్డుకు ఇటీవల సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. -
వాటాలు తేల్చాకే కాళేశ్వరానికి మూడో టీఎంసీ
సాక్షి, అమరావతి: గోదావరి జలాల్లో నీటి వాటాలు తేలే వరకు మూడో టీఎంసీని తరలించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులకు అనుమతి ఇవ్వకూడదని గోదావరి బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. విభజన చట్టం ప్రకారం ట్రిబ్యునల్ ద్వారా నీటి వాటాలు తేలే వరకు లేదా నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరాకే కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని గుర్తు చేసింది. కానీ.. నిబంధనలను తుంగలో తొక్కి గోదావరి జలాలను రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా కాళేశ్వరం ఎత్తిపోతలకు 2018 జూన్ 6న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) అనుమతి ఇచ్చిందని ఎత్తిచూపింది. నీటి వాటాలు తేలేదాకా ఆ అనుమతిని పునఃసమీక్షించడంతో పాటు మూడో టీఎంసీకి అనుమతి ఇవ్వొద్దని గోదావరి బోర్డు చైర్మన్ ఎంకే సిన్హాకు తెగేసి చెబుతూ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. వాటాలు తేలకుండానే ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులకు అనుమతి ఇస్తే.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను హరించినట్లేనని తేల్చి చెప్పారు. ఏపీ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత గోదావరి బోర్డుపై ఉందని గుర్తు చేశారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటైతేనే.. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్(జీడబ్ల్యూడీటీ)ను కేంద్రం ఏర్పాటు చేయాలి. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో గోదావరి జలాలను పంపిణీ చేయడానికి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరారు. కానీ.. ఇప్పటి దాకా ట్రిబ్యునల్‌ను కేంద్రం ఏర్పాటు చేయలేదు. ట్రిబ్యునల్ ఏర్పాటైతేనే రెండు రాష్ట్రాల నీటి వాటాలు తేలే అవకాశం ఉంది. నీటి వాటాలు తేలకుండానే తెలంగాణ సర్కార్ చేపట్టిన కాళేశ్వరం (రెండు టీఎంసీలు), చనాకా–కొరటా, చిన్న కాళేశ్వరం, గుత్ప ఎత్తిపోతలకు సీడబ్ల్యూసీ టీఏసీ అనుమతి ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డు సమావేశాల్లో, కేంద్ర జల్ శక్తి శాఖ సమావేశాలు, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతి లేకుండానే కాళేశ్వరం ఎత్తిపోతల విస్తరణ (మూడో టీఎంసీ తరలింపు) పనులు చేపట్టడంపై తెలంగాణ రైతులు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనను గోదావరి బోర్డు ఆపేసింది. ఈ నెల 6న ఆ డీపీఆర్‌ను పరిశీలించాలని గోదావరి బోర్డుకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీకి 1,238.436 టీఎంసీలు అవసరం గోదావరి పరివాహక ప్రాంతం(బేసిన్)లో ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులకు 1,238.436 టీఎంసీలు అవసరమని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించింది. ఇందులో ఇప్పటికే పూర్తయి, వినియోగంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు పోలవరానికి 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 737.153 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టి, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 75 శాతం లభ్యత ఆధారంగా 165.280 టీఎంసీలు అవసరం. మొత్తంగా 75 శాతం లభ్యత ఆధారంగా 902.433 టీఎంసీలు అవసరం. వరద జలాలను వినియోగించుకునే పూర్తి స్వేచ్ఛను, ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన మిగిలిన నికర జలాలను వాడుకునే హక్కును దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ కల్పించింది. విభజన నేపథ్యంలో బేసిన్లో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. 336 టీఎంసీల వరద జలాలను వాడుకోవడానికి ప్రాజెక్టులు చేపడతామని ఇప్పటికే కేంద్రానికి ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. -
నీటి లభ్యత తేల్చాకే కొత్త ప్రాజెక్టులకు అనుమతి
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతపై శాస్త్రీయ అధ్యయనం చేసి.. రెండు రాష్ట్రాల వాటాలు తేల్చాకే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని గోదావరి బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా చనాకా–కొరటా, చిన్న కాళేశ్వరం, గుత్ప ఎత్తిపోతలకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక అనుమతి ఇవ్వడం సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. వాటి అనుమతిని పునఃసమీక్షించి.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించాలని కోరింది. దీనిపై గోదావరి బోర్డు చైర్మన్ ఎమ్కే సిన్హా స్పందిస్తూ.. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సిఫార్సు చేస్తామన్నారు. ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లపై రెండు రాష్ట్రాల అభిప్రాయాలను నమోదు చేసి సీడబ్ల్యూసీకి పంపుతామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఎమ్కే సిన్హా అధ్యక్షతన గోదావరి బోర్డు 14వ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ఏపీ తరఫున ఈఎన్సీ నారాయణరెడ్డి, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు, తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. కడెం–గూడెం ఎత్తిపోతల, మోదులకుంటవాగు ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ కోరడంపై ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కడెం–గూడెం ఎత్తిపోతల డీపీఆర్‌లోనే కడెం వాగులో 17 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తెలంగాణ సర్కార్ పేర్కొందని.. అలాంటప్పుడు గోదావరి నుంచి 11.5 టీఎంసీలను ఎత్తిపోయాల్సిన అవసరం ఏముంటుందని నిలదీసింది. నీటి లభ్యత, వాటా తేల్చే దాకా కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేందుకు అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పింది. తెలంగాణ ప్రాజెక్టులకు ఎలా అనుమతి ఇస్తారు చనాకా–కొరటా, చిన్న కాళేశ్వరం, గుత్ప ఎత్తిపోతలకు తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా.. కనీసం తమను సంప్రదించకుండా సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ ఎలా అనుమతి ఇస్తుందని ఏపీ అధికారులు నిలదీశారు. దీనిపై వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్న సీడబ్ల్యూసీ (హైడ్రాలజీ విభాగం) డైరెక్టర్ నిత్యానందరాయ్ స్పందిస్తూ.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ఆ మూడు ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతి ఇచ్చామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర పరిధిలో గోదావరిలో 1,430 నుంచి 1,480 టీఎంసీల లభ్యత ఉంటుందని తెలిపారు. గత ఐదేళ్లలో సగటున 1,600 టీఎంసీల లభ్యత ఉందని.. వాటి ఆధారంగానే ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చామన్నారు. దీనిపై ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరగని నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులకు ఎలా అనుమతి ఇస్తారని నిలదీశారు. దీనిపై నిత్యానందరాయ్ స్పందిస్తూ.. ఇకపై ఏపీ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. పోలవరం బ్యాక్‌వాటర్‌పై తెలంగాణ పేచీ పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో భద్రాచలం పరిసర ప్రాంతాలు భారీ ఎత్తున ముంపునకు గురవుతున్నాయని.. దీనిపై మళ్లీ అధ్యయనం చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని చర్చించడానికి గోదావరి బోర్డు సరైన వేదిక కాదన్న ఏపీ అభిప్రాయంతో ఎమ్కే సిన్హా ఏకీభవించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమావేశంలో తెలంగాణ ఈ అంశాన్ని లేవనెత్తిందని గుర్తు చేశారు. బ్యాక్‌వాటర్ ప్రభావం అంశాన్ని పీపీఏలోనే చర్చించాలని తేల్చిచెప్పడంతో తెలంగాణ కూడా అంగీకరించింది. కాగా ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు ఆధునికీకరణకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఆయకట్టు ఆధారంగా ఆధునికీకరణకు అయ్యే వ్యయాన్ని దామాషా పద్ధతిలో ఏపీ 85 శాతం, తెలంగాణ 15 శాతం భరించనున్నాయి. అలాగే గోదావరి ప్రాజెక్టులపై 23 చోట్ల టెలీమీటర్లను ఏర్పాటు చేసి నీటి వినియోగాన్ని లెక్కించడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. బోర్డు నిర్వహణకు 2023–24లో చెరో రూ.ఐదు కోట్ల చొప్పున విడుదల చేయడానికి కూడా సమ్మతించాయి. -
ఏకాభిప్రాయంపై చివరి ప్రయత్నం
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చివరి ప్రయత్నంగా ఈనెల 3న గోదావరి బోర్డు, 11న కృష్ణా బోర్డు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకుంటే కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తెచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలని బోర్డులు నిర్ణయించాయి. కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు చరమగీతం పాడేందుకు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని 2020 అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీలో సీఎం జగన్ కోరారు. తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేయడం వల్ల ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా జలాలు వృథాగా కడలిపాలయ్యాయి. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కారు హరిస్తుండటంపై సుప్రీం కోర్టును ఆంధ్రప్రదేశ్ ఆశ్రయించడంతో కేంద్రంలో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తెలంగాణ సహాయ నిరాకరణ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులను ఆర్నెళ్లలోగా కృష్ణా, గోదావరి బోర్డులకు రెండు రాష్ట్రాలు అప్పగించాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు నోటిఫికేషన్ జారీ రోజు నుంచి ఆర్నెళ్లలోగా అనుమతి పొందాలి. లేదంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగానికి అనుమతించరు. బోర్డుల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి 60 రోజుల్లోగా ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీగా బోర్డుల ఖాతాల్లో జమ చేయాలి. అయితే ఒకేసారి కాకుండా ఎప్పటికప్పుడు నిధులను సమకూర్చుతామని రెండు రాష్ట్రాలు బోర్డులకు స్పష్టం చేశాయి. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి. ఈ క్రమంలో తన భూభాగంలో శ్రీశైలం, సాగర్ విభాగాలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా తెలంగాణ సర్కార్ మాత్రం తన భూభాగంలోని విభాగాలను అప్పగించబోమని స్పష్టం చేసింది. ఏకాభిప్రాయం సాధ్యమేనా..? బోర్డుల నోటిఫికేషన్ అమలుకు తొలుత కేంద్రం నిర్దేశించిన గడువు గతేడాది జనవరి 15తో పూర్తయింది. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గడువును మరో ఆర్నెళ్లు పొడిగిస్తూ జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో విభజన చట్టం 11వ షెడ్యూల్లో పేర్కొన్న హంద్రీ–నీవా, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కల్వకుర్తి(పాతది), నెట్టెంపాడు(పాతది) ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోవాలని ఆదేశించింది. కేంద్రం పొడిగించిన గడువు కూడా గత జూలై 15తోనే పూర్తయింది. తెలంగాణ సర్కార్ కృష్ణా బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి, భక్తరామదాస, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోలేదు. గోదావరి బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని రెండు రాష్ట్రాలు కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) డీపీఆర్‌లు సమర్పించాయి. శ్రీశైలం, సాగర్ నిర్వహణకు సంబంధించి ఆర్ఎంసీ(రిజర్వాయర్ల మేనేజ్మెంట్ కమిటీ) రూపొందించిన విధి విధానాలను ఆంధ్రప్రదేశ్ ఆమోదించగా తెలంగాణ సర్కార్ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చివరి ప్రయత్నంగా సర్వ సభ్య సమావేశాలను నిర్వహించేందుకు బోర్డులు సిద్ధమయ్యాయి. -
కాళేశ్వరం సవరణ డీపీఆర్ వెనక్కి.. పరిశీలించలేమన్న గోదావరి బోర్డు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ డీపీఆర్‌పై పరిశీలన జరిపి, అనుమతుల కోసం కేంద్ర జలసంఘాని(సీడబ్ల్యూసీ)కి సిఫారసు చేసేందుకు గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) నిరాకరించింది. ఈ ప్రాజెక్టుపై కోర్టుల్లో కేసులుండటం వల్ల తాము డీపీఆర్‌ను పరిశీలించలేమని రాష్ట్ర నీటిపారుదల శాఖకు తేల్చిచెప్పింది. తొలుత రోజుకు 2 టీఎంసీల గోదావరి జలాలను తరలించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 2 టీఎంసీల పనులకు సంబంధించిన డీపీఆర్‌కు ఇప్పటికే కేంద్రం నుంచి అన్ని అనుమతులు లభించాయి. తర్వాత కా లంలో రోజుకు అదనపు టీఎంసీ తరలించే పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అదనపు టీఎంసీ పనుల ప్రాజెక్టుకూ అనుమతులు తీసుకోవాలని గతేడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో కేంద్రం ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేనందున అదనపు టీఎంసీ పనులపై హైకోర్టు సైతం స్టే విధించింది. 2 టీఎంసీల పనులతో పాటు అదనపు టీఎంసీ పనులు సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినవేనని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కేంద్రం సూచనతో 2టీఎంసీల పనుల డీపీఆర్‌లో అదనపు టీఎంసీ పనులను సైతం చేర్చి సవరించిన డీపీఆర్‌కు అనుమతుల కోసం ఇటీవల గోదావరి బోర్డు కు సమర్పించింది. కోర్టు కేసులను కార ణంగా చూపి డీపీఆర్‌ను పరిశీలించడా నికి బోర్డు నిరాకరించగా, పనుల నిలుపుదలకే హైకోర్టు ఆదేశించిందని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు తెలియజేసింది. డీపీఆర్‌ను పరిశీలించి నిబంధనల ప్రకారం సీడబ్ల్యూసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి పంపించాలని కోరింది. -
గోదావరి బోర్డుకు కాళేశ్వరం సవరణ డీపీఆర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ డీపీఆర్‌ను గోదావరి బోర్డు (జీఆర్ఎంబీ)కు సమర్పించింది. తొలుత రోజుకు 2 టీఎంసీల గోదావరి జలాలు ఎత్తిపోసే లక్ష్యంతో కాళేశ్వరాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. దానికి సంబంధించిన అనుమతులన్నీ కేంద్రం నుంచి పొందింది. తర్వాత మరో టీఎంసీ అదనంగా తరలించే పనులను చేపట్టింది. అయితే కేంద్రం ఈ మూడో టీఎంసీ పనులను అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చుతూ.. ఆరునెలల్లో అనుమతి తీసుకోవాలని 2021 జూలై 15న ఆదేశించింది. అయితే రోజుకు రెండు టీఎంసీలు తరలించే ప్రాజెక్టు, అదనపు టీఎంసీ తరలించే పనులు వేర్వేరు కాదని, రెండూ కాళేశ్వరంలో అంతర్భాగమేనని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనితో సవరించిన కాళేశ్వరం డీపీఆర్‌ను సమర్పించి అనుమతులు పొందాలని కేంద్రం సూచించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సవరణ డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు సమర్పించి హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్ అనుమతులు పొందింది. తాజాగా రూ.1.15 లక్షల కోట్ల అంచనాతో సవరించిన డీపీఆర్‌ను గోదావరి బోర్డుకు అందించింది. గోదావరి బోర్డు డీపీఆర్‌పై సాంకేతిక పరిశీలన జరిపాక.. సీడబ్ల్యూసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఓకే చేస్తుంది. చివరిగా అపెక్స్ కౌన్సిల్లో డీపీఆర్‌పై చర్చించి ఆమోదముద్ర వేస్తారు. మరో రూ.30వేల కోట్లు: కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే రూ.85 వేలకోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. కొత్త డీపీఆర్ ప్రకారం మిగతా పనుల పూర్తికి ఇంకో రూ.30వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఆర్ఈసీ, పీఎఫ్‌సీతోపాటు పలు బ్యాంకుల నుంచి కాళేశ్వరం కార్పొరేషన్‌కు రావాల్సిన రుణాలు ఏప్రిల్ నుంచి నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల పనులకు రాష్ట్ర బడ్జెట్ నిధులే దిక్కు అని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: కాళేశ్వరం వృథా కాదు.. ఆదా! -
కృష్ణా, గోదావరి గెజిట్లు అమలయ్యేనా?
సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు చరమగీతం పాడటమే లక్ష్యంగా కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలుకు గడువు సమీపిస్తోంది. కానీ.. ఇప్పటికీ షెడ్యూల్–2లో ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడంపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ల గడువును కేంద్రం మరోసారి పొడిగిస్తుందా.. లేదంటే అపెక్స్ కౌన్సిల్ నిర్వహించి రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయానికి కృషిచేస్తుందా.. అన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో తెలుగురాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటుచేస్తూ 2014 మే 28న కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. కానీ పరిధిని కేంద్రం ఖరారు చేయకపోవడంవల్ల రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారంలో బోర్డులు ప్రభావం చూపలేకపోతున్నాయి. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో ఇదే అంశాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించారు. తక్షణమే బోర్డుల పరిధిని ఖరారుచేయాలని విజ్ఞప్తిచేశారు. మరోవైపు నీటి కేటాయింపులు జరిగే వరకు బోర్డుల పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తోసిపుచ్చుతూ బోర్డుల పరిధిని ఖరారు చేస్తామని తేల్చిచెప్పారు. తరువాత కేంద్రం ఈ విషయంలో తీవ్ర జాప్యం చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ కృష్ణా జలాలను వృథాగా సముద్రంలో కలిసేలా చేస్తోంది. ఇలా ఏపీ హక్కులను కాలరాస్తుండటాన్ని గతేడాది జూన్‌లో ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌లకు ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఎట్టికేలకు గెజిట్ నోటిఫికేషన్లు జారీ ఏపీ హక్కులను కాలరాస్తున్న తెలంగాణ సర్కార్ తీరుపై సీఎం జగన్ సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే గతేడాది జూలై 15న రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్లు జారీచేసింది. నోటిఫికేషన్ జారీచేసిన రోజు నుంచి ఆరునెలల్లో అంటే 2022 జనవరి 15న అమల్లోకి రావాలి. నోటిఫికేషన్ అమలుపై పలుమార్లు బోర్డులతో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఒకేసారి సీడ్‌మనీ కింద రూ.200 కోట్లు డిపాజిట్ చేయలేమని, ఎప్పటికప్పుడు నిర్వహణ వ్యయాన్ని అందజేస్తామని రెండు రాష్ట్రాలు చెప్పాయి. గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు సిద్ధమేనని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటేనే తమ ప్రాజెక్టులను అప్పగిస్తామని తేల్చిచెప్పింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసేవరకు ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించే ప్రసక్తే లేదని తెలంగాణ స్పష్టం చేసింది. అలాగే అనుమతిలేని ప్రాజెక్టులకు అనుమతి తీసుకునేందుకు ఏపీ సర్కార్ సీడబ్ల్యూసీకి డీపీఆర్‌లు సమర్పించింది. కానీ, తెలంగాణ సర్కార్ కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే డీపీఆర్‌లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ల అమలు గడువును ఆరునెలలు పొడగిస్తూ ఫిబ్రవరి 2న కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈ నోటిఫికేషన్లు ఈనెల 15 నుంచి అమలు కావాల్సి ఉంది. కుదరని ఏకాభిప్రాయం గెజిట్ నోటిఫికేషన్ల అమలుపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడానికి కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎం.పి.సింగ్, ఎం.కె.సిన్హా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ పాతపాటే పాడుతోంది. దీంతో ఈనెల 15 నుంచి కూడా గెజిట్ నోటిఫికేషన్లు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ల అమలు గడువును కేంద్రం మరోసారి పొడగిస్తుందా? లేదంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధకు కృషిచేస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. -
నీటి పంపిణీ తర్వాతే డీపీఆర్‌లు
సాక్షి, అమరావతి: ‘కొత్తగా గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. నదిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా మదింపు చేసి, రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయాలి. అప్పటివరకు ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల డీపీఆర్‌లకు సాంకేతిక అనుమతి ఇవ్వకూడదు. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించాలి’ అని గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. తెలంగాణ చేపట్టిన చనాకా – కొరటా, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లను మదింపు చేయవద్దని కోరింది. గోదావరి ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయలేదని గుర్తు చేసింది. వాటికి అనుమతి ఇస్తే గోదావరి డెల్టా, పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. విభజన చట్టం ప్రకారం వాటికి సాంకేతిక అనుమతి ఇచ్చి, సీడబ్ల్యూసీ ఆమోదానికి పంపాలని పట్టుబట్టింది. గోదావరి బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్‌సింగ్ ఏపీ వాదనతో ఏకీభవించారు. తెలంగాణ ప్రతిపాదించిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లకు సాంకేతిక అనుమతి ఇవ్వకుండా రెండు రాష్ట్రాల వాదనలను సీడబ్ల్యూసీకి పంపుతామని చెప్పారు. హైదరాబాద్‌లోని గోదావరి బోర్డు కార్యాలయంలో బుధవారం చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, సీఈ మోహన్‌కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరిధిపై తలోమాట గోదావరి ప్రధాన పాయపై ఎస్సారెస్పీ నుంచి సీతారామసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగును మాత్రమే బోర్డు పరిధిలోకి తేవాలని అన్నారు. దీనికి ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. పరిధిపై మరో మారు చర్చిద్దామని, బోర్డుకు తగినంత మంది సిబ్బందిని కేటాయించాలని చైర్మన్ కోరారు. ఇందుకు ఏపీ సుముఖత వ్యక్తం చేయగా.. తెలంగాణ అంగీకరించలేదు. జూలై 15లోగా అనుమతి తీసుకోవాల్సిందే గోదావరి బేసిన్లో అనుమతి లేని ప్రాజెక్టులకు జూలై 15లోగా అనుమతి తీసుకోవాలని, లేదంటే వాటి ద్వారా నీటి వినియోగాన్ని అనుమతించబోమని ఛైర్మన్ స్పష్టంచేశారు. గోదావరిలో నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, మదింపు చేయాలని 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కోరామని ఏపీ అధికారులు గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయడానికి కొత్తగా గోదావరి ట్రిబ్యునల్ వేయాలని కోరామన్నారు. వీటిపై బోర్డు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ రెండు అంశాలు బోర్డు పరిధిలో లేవని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని బోర్డు చైర్మన్ చెప్పారు కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి సంప్రదించాలని ఏపీ అధికారులకు సూచించారు. -
శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు..
సాక్షి, అమరావతి: గోదావరి ప్రధాన పాయపై శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగుకే బోర్డు పరిధిని పరిమితం చేయాలని తెలంగాణ సర్కార్ తేల్చిచెప్పింది. పరిధిపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడాన్ని బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ దృష్టికి తీసుకెళ్లామని సబ్ కమిటీ కన్వీనర్ బీపీ పాండే తెలిపారు. గోదావరి బోర్డు పరిధి, స్వరూపంపై నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సోమవారం వర్చువల్ విధానంలో సమావేశమైంది. బోర్డు నోటిఫికేషన్‌లోని షెడ్యూల్–2 కింద ఉన్న ప్రాజెక్టుల సమాచారాన్ని తక్షణమే అందజేయాలని సబ్ కమిటీ కన్వీనర్ బీపీ పాండే కోరారు. ఇప్పటికే ప్రాజెక్టుల సమాచారం ఇచ్చామని ఏపీ తరఫున సమావేశంలో పాల్గొన్న గోదావరి డెల్టా సీఈ పుల్లారావు వివరించారు. తెలంగాణ సర్కార్ ఇప్పటికీ ప్రాజెక్టుల సమచారాన్ని ఇవ్వకపోవడంపై కన్వీనర్ బీపీ పాండే అసహనం వ్యక్తం చేశారు. దాంతో తమ ప్రభుత్వంతో చర్చించి ప్రాజెక్టుల సమాచారాన్ని ఇస్తామని తెలంగాణ సీఈ మోహన్‌కుమార్ చెప్పారు. -
డీపీఆర్‌లను వెంటనే సీడబ్ల్యూసీకి పంపండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్లో చేపట్టిన ఎత్తిపోతల పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను ఆమోదించే విషయంలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డీపీఆర్‌ల పరిశీలనల పేరిట అనవసర కాలయాపన చేస్తోందని గోదావరి బోర్డు తీరును తప్పుపట్టింది. పరిధికి మించి వ్యవహరిం చడం మాని డీపీఆర్‌లను వెంటనే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి పంపాలని కోరింది. ఈ మేరకు గురువారం నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, గోదావరి బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని క్లాజ్ 85(8)(డి) ప్రకారం కృష్ణా, గోదావరిలో చేపట్టే కొత్త ప్రాజెక్టులతో అవతలి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఉందా? లేదా? అన్న అంశాలను మాత్రమే పరిశీలన చేయాల్సి ఉంటుందని, ట్రిబ్యునల్లు తమ అవార్డులో పేర్కొన్న నీటి లభ్యతకు నష్టం కలిగించే అంశాలపైనే తమ పరిశీలనలు తెలపాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. అలాకాకుండా విభజన చట్టంలో పేర్కొన్న అధికారాలకు మించి అనేక అంశాలపై రిమార్కులు రాస్తూ కాలయాపన చేస్తున్నారని ఆక్షేపించారు. హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, వ్యయ అంచనాలకు సంబంధించి పరిశీలనకు కేంద్ర జల సంఘంలో అనేక డైరెక్టరేట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ దృష్ట్యా క్లాజ్ 85(8)(డి)లో పేర్కొన్న అంశాలకే బోర్డు పరిమితం కావాలని సూచించారు. -
‘సీతారామ’ కొత్త ఆయకట్టు కొంతేనా?
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల గరిష్ట నీటి వినియోగం లక్ష్యంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకంపై గోదావరి బోర్డు ప్రశ్నల వర్షం కురిపి స్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్రం నుంచి స్పష్టత కోరిన బోర్డు తాజాగా మరో లేఖను సంధిం చింది. గతంలో గరిష్ట వరద వచ్చినప్పుడు ఉండే ముంపు సమస్యలు, ప్రాజెక్టు డిజైన్లపై పలు ప్రశ్నలు లేవనెత్తిన బోర్డు.. తాజాగా కొత్త ఆయ కట్టుకు ప్రతిపాదించిన నీటి వినియోగం, విద్యుత్ లెక్కలపై ప్రశ్నలు వేసింది. పాక్షిక వివరాలతో నివేదికను ఆమోదించలేమని, పూర్తి వివరాలను వీలైనంత త్వరగా తమకు సమర్పించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. బోర్డు సంధించిన ప్రశ్నలు ఇలా.. ► పాత ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా 33 టీఎంసీలను వినియోగిస్తూ 4.10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చేలా ప్రతిపాదిం చారు. తదనంతరం సమీకృత దుమ్ముగూడెం ప్రాజెక్టును 50 టీఎంసీల నీటిని వినియోగిస్తూ 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చేలా ప్రతి పాదించారు. కానీ ప్రస్తుతం సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 70 టీఎంసీల నీటిని తీసుకుంటూ కేవలం 3.35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టునే ఎందుకు ప్రతిపాదించారో కారణాలు చెప్పాలి. ► కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లెక్కల ప్రకారం దుమ్ముగూడెం వద్ద గరిష్ట వరద 36 లక్షల క్యూసెక్కులుగా ఉన్నప్పుడు గోదావరి నీటిమట్టం 62.86 మీటర్లుగా ఉంది. 50 ఏళ్ల గరిష్ట వరద చూసినప్పుడు గరిష్ట నీటిమట్టం 60.43 మీటర్లుగా ఉంది. కానీ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్‌ను 56.5 మీటర్ల ఎత్తులోనే నిర్మిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే గరిష్ట వరద నమోదైనప్పుడు హెడ్‌వర్క్ పనులు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయి. ఈ అంశానికి సంబంధించి అన్ని వరద లెక్కల వివరాలు సమర్పించాలి. ► గోదావరిలో వరద ఉన్న 90–120 రోజుల్లోనే గోదావరి నుంచి 70 టీఎంసీల నీటిని వినియోగిస్తామని తెలిపారు. మరి వరద ముగిశాక రబీకి అవసరమైన 29.42 టీఎంసీలను ఎక్కడి నుంచి మళ్లిస్తారో వెల్లడించాలి. ► ఇక 70 టీఎంసీలను తరలిస్తున్నా ఆ నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్లు లేవా? ► ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న హెడ్‌రెగ్యు లేటర్‌ను 400 క్యూసెక్కుల నీటిని తీసుకొనేలా డిజైన్ చేయగా కాల్వ సామర్థ్యాన్ని మాత్రం 256 క్యూసెక్కులకే డిజైన్ చేశారు. దీనిపై తేడాలెందుకో తెలపాలి. ► ప్రాజెక్టు అప్రైజల్ కమిటీకి ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టు విద్యుత్ అవసరాలు 694 మెగావాట్లుగా పేర్కొనగా డీపీఆర్‌లో వాటిని 725 మెగావాట్లుగా పేర్కొన్నారు. ఏది సరైనదో వివరణ ఇవ్వాలి. ► స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ నిర్ధారించిన ఒక్కో యూనిట్ విద్యుత్ ధర, డీపీఆర్‌లో పేర్కొన్న యూనిట్ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. ఇందుకుగల కారణాలు తెలపాలి. ► ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 1,480 టీఎంసీల గోదావరి లభ్యత జలాల్లో 900 టీఎంసీలు తమవేనని తెలంగాణ చెబుతోంది. కానీ డీపీఆర్‌లో సాంకేతికంగా 1,480 టీఎంసీల నీటికి ఆమోదం లభించలేదని వ్యాప్కోస్ తెలిపినట్లుగా పేర్కొ న్నారు. అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన తెలంగాణ నీటిని వినియోగిస్తుందో స్పష్టత ఇవ్వాలి. -
ప్రాజెక్టుల పరిశీలనకు కృష్ణా, గోదావరి బోర్డులు
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల స్వాధీనంపై కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు కృష్ణా, గోదావరి బోర్డులు స్వయంగా రంగంలోకి దిగుతున్నాయి. ప్రాజెక్టుల స్వాధీనం దిశలో ఉన్న అవాంతరాలు, వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రాజెక్టుల పరిధిలో పర్యటించనున్నాయి. సోమవారం నుంచి గోదావరి బోర్డు సబ్‌కమిటీ దేవాదుల, ఎస్సారెస్పీ పరిధిలో పర్యటించనుండగా, కృష్ణా బోర్డు సబ్‌కమిటీ శ్రీశైలంలో పర్యటించనుంది. నిజానికి అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలు కావాల్సి ఉన్నా ఇంతవరకు ప్రాజెక్టుల స్వాధీనంపై స్పష్టత లేక అనిశ్చితి కొనసాగుతోంది. కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల పరిధిలో 15 ఔట్లెట్ల స్వాధీనానికి బోర్డులు తీర్మానించినా, తెలంగాణ నుంచి అంగీకారం కుదరక అడుగు ముందుకు పడటం లేదు. ఈ అనిశ్చితి కొనసాగుతుండగానే రవికుమార్ పిళ్లై, డీఎం రాయ్పురేల నేతృత్వంలోని కృష్ణా బోర్డు సబ్‌కమిటీ శ్రీశైలం పరిధిలో పర్యటించాలని నిర్ణయించింది. శ్రీశైలంలో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలు, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుల పరిధిలో ఉన్న సిబ్బంది, ఆపరేషన్ ప్రొటోకాల్, వరద నియంత్రణ పద్ధతులు, ఇతర పథకాలకు నీటి అవసరాలు, వినియోగం తదితర అంశాలపై స్థానిక ఇంజనీర్లతో చర్చించనుంది. ఇక కేంద్ర జల సంఘం సీఈ అతుల్‌కుమార్ నాయక్ నేతృత్వంలోని గోదావరి బోర్డు సబ్ కమిటీ దేవాదులలోని గంగారం పంప్‌హౌస్, ఎస్సారెస్పీ పరిధిలోని కాకతీయ కెనాల్ పరిధిలోని క్రాస్ రెగ్యులేటర్‌ను పరిశీలించనుంది. షెడ్యూల్–2లో పేర్కొన్న ఈ ప్రాజెక్టులను బోర్డులు స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా, స్వాధీనం అనంతరం ఉండే పరిస్థితులు, వాటి నిర్వహణపై కమిటీలు అధ్యయనం చేయనున్నాయి. చదవండి: Hyderabad RTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సిటీ బస్సు ఇక చిటికలో -
అప్పగింతపై చెరోదారి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పర భిన్న వైఖరులను అవలంబిస్తున్నాయి. గత బోర్డు సమావేశంలో తీర్మానించిన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జున సాగర్‌లపై ఉన్న 6 ఔట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేయగా.. తెలంగాణ మాత్రం తన వైఖరిని వెల్లడించలేదు. శ్రీశైలం, సాగర్‌లపై ఉన్న తమ పవర్ హౌస్‌లను మినహాయించి మిగతా ఔట్లెట్లను అప్పగించేందుకు ప్రభుత్వ స్థాయిలో కొంత సానుకూలత కనిపిస్తున్నా...ఇదివరకే నియమించిన ఏడుగురు సభ్యుల సబ్‌కమిటీ నివేదిక ఆధారంగానే ప్రాజెక్టుల అప్పగింతపై తుది నిర్ణయం చేయనుంది. ఈ నేపథ్యంలో గెజిట్ అమలుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. దసరా తర్వాత ప్రస్తుత పరిస్థితిని కేంద్ర జల శక్తి శాఖకు నివేదించి దాని అభిప్రాయం మేరకు కృష్ణా బోర్డు ముందుకెళ్లనుంది. తెలంగాణ అప్పగించాకే.. గోదావరిలో పెద్దవాగు, కృష్ణాలో 15 ఔట్లెట్లను తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని బోర్డులు ఇదివరకే రెండు రాష్ట్రాలను కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల అప్పగింతకు ముందునుంచి సంసిద్ధంగానే ఉన్న ఏపీ.. తీర్మానం మేరకు శ్రీశైలం స్పిల్‌వే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా (మల్యాల), ముచ్చిమర్రి ఎత్తిపోతలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే శ్రీశైలం కుడి విద్యుత్ కేంద్రం, సాగర్ కుడికాల్వ విద్యుత్ కేంద్రాలను సైతం అప్పగిస్తూ ఆ రాష్ట్ర జల వనరులు, ఇంధన శాఖ కార్యదర్శులు శ్యామలరావు, నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటి పరిధిలో పనిచేసే 181 మంది సిబ్బందిని బోర్డు పరిధిలోకి తెస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ కృష్ణా బోర్డు సమావేశంలో చేసిన తీర్మానం మేరకు తెలంగాణలోని శ్రీశైలం, సాగర్‌లపై ఉన్న 9 అవుట్లెట్లను స్వాధీనం చేసుకున్నప్పుడే..తమ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలనే షరతు విధించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువున ఉన్న జూరాల ప్రాజెక్టుతో పాటు దాన్నుంచి నేరుగా నీటిని తీసుకునేలా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సైతం అవి పూర్తయిన వెంటనే స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. వాటిని స్వాధీనం చేసుకోకపోతే దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్లకు వచ్చే ప్రవాహాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే వాటిని సైతం స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు. గోదావరికి సంబంధించిన పెద్దవాగుపై మాత్రం ఇంకా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. పవర్‌హౌస్‌లపై తెలంగాణ ససేమిరా పెద్దవాగును బోర్డుకు అప్పగించేందుకు సిధ్దంగా ఉన్న తెలంగాణ.. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై మాత్రం తర్జనభర్జనలు పడుతోంది. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌పై ఉన్న 3 పవర్‌హౌస్‌లను అప్పగించేందుకు ఏమాత్రం అంగీకరించేది లేదని స్పష్టం చేస్తోంది. ఇవి మినహాయిస్తే మిగతా 6 ఔట్లెట్ల విషయంలో మాత్రం కొంత సానుకూలంగా ఉంది. ఈ మేరకు ఇంజనీర్ ఇన్ చీఫ్ నుంచి ప్రభుత్వ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ సైతం వెళ్లింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తెలుపని రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత పరిణామాలను అధ్యయనం చేసి జూరాల, శ్రీశైలం, సాగర్ల అపరేషన్ ప్రోటోకాల్ ముసాయిదాను నిర్దేశించేందుకు ఇప్పటికే ఈఎన్సీ మురళీధర్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సబ్ కమిటీని నియమించింది. సబ్ కమిటీలో సీనియర్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయవాదులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ 15 రోజల్లో తన నివేదికను అందించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో దసరా సెలవుల అనంతరం కమిటీ భేటీ కానుంది. అనంతరం తన పరిశీనలను ప్రభుత్వానికి అందజేస్తే దానిపై ప్రభుత్వ స్థాయిలో మరోమారు చర్చించాక ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం చేయనుంది. ఒకవేళ కమిటీ ఏవైనా అభ్యంతరాలు లేవనెత్తితే.. వాటిపై స్పష్టత కోరుతూ బోర్డులు, కేంద్రానికి లేఖలు రాయనుంది. తమ అభ్యంతరాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలు చూపితేనే అప్పగింతపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. -
రెండు బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలుపై అనిశ్చితి
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై అనిశ్చితి నెలకొంది. గెజిట్ నోటిఫికేషన్ అమలే అజెండాగా ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల మినిట్స్‌ను (చర్చించిన అంశాలను) కృష్ణా, గోదావరి బోర్డు సభ్య కార్యదర్శులు డీఎం రాయ్‌పురే, బీపీ పాండే బుధవారం రెండు రాష్ట్రాలకు పంపారు. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు.. ప్రాజెక్టులను అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీకరించింది. కానీ శ్రీశైలం, సాగర్ జలవిద్యుత్ కేంద్రాలను కృష్ణాబోర్డుకు అప్పగించడంపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగించేలా ఉత్తర్వులు జారీచేసేందుకు మొగ్గుచూపలేదు. 2 రాష్ట్రాలు ప్రాజెక్టులను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేస్తేగానీ.. వాటిని బోర్డులు తమ పరిధిలోకి తీసుకోలేవు. తెలంగాణ సహాయ నిరాకరణ నేపథ్యంలో నిర్దేశించిన రోజు గురువారం నుంచి (నేటి నుంచి) గెజిట్ నోటిఫికేషన్‌ను అమలు చేయలేని పరిస్థితిని కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు 2 బోర్డుల అధికారవర్గాలు తెలిపాయి. కేంద్ర మార్గదర్శకాల మేరకు చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. ఏపీ రెడీ.. తెలంగాణ నో.. రెండు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత తొలుత ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను పూర్తిస్థాయి (15 అవుట్లెట్లు)లో బోర్డు పరిధిలోకి తీసుకుంటామని కృష్ణాబోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ మంగళవారం జరిగిన సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. తన భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసేందుకు అంగీకరించింది. కానీ తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుల వారీగా ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసేవరకు గెజిట్ నోటిఫికేషన్‌ను అమలు చేయకూడదంటూ తెలంగాణ సర్కార్ పాత పల్లవి అందుకుంది. ఈ క్రమంలోనే తమ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు అధికంగా ఉన్నాయని, శ్రీశైలం, సాగర్ విద్యుత్ కేంద్రాలను బోర్డుకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీశైలం ఎడమగట్టు, సాగర్ విద్యుత్ కేంద్రాలను తెలంగాణ సర్కార్ బోర్డుకు అప్పగించకపోతే.. గెజిట్ నోటిఫికేషన్ అమలు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. విద్యుదుత్పత్తి పేరుతో తెలంగాణ సర్కార్ అనధికారిక నీటి వినియోగాన్ని నియంత్రించినప్పుడే రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేసింది. పెద్దవాగుకు, కృష్ణా ప్రాజెక్టులకు లంకె ఇక పెద్దవాగు ప్రాజెక్టును గోదావరి బోర్డుకు అప్పగించేందుకు 2 రాష్ట్రాలు అంగీకరించాయి. దాన్ని గోదావరి బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. కానీ తెలంగాణ సర్కార్ పెద్దవాగును అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేయడానికి వెనుకడుగు వేస్తోంది. పెద్దవాగును గోదావరి బోర్డుకు అప్పగిస్తే శ్రీశైలం, సాగర్‌లలో 9 అవుట్లెట్లను కృష్ణాబోర్డుకు అప్పగించేలా ఉత్తర్వులు జారీచేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. కేంద్రం కోర్టులో బంతి గెజిట్ నోటిఫికేషన్ అమలుకు ఏపీ సర్కార్ సహకరిస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వ దాటవేత వైఖరిని రెండు బోర్డులు కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాయి. ప్రత్యేక సమావేశాల్లో చర్చించిన అంశాలను వివరించి.. బోర్డులకు ప్రాజెక్టులను అప్పగించడంపై తెలంగాణ సర్కార్ తీరును కేంద్రానికి వివరించాయి. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే. ప్రత్యేక సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఉమ్మడి ప్రాజెక్టులతో గెజిట్ నోటిఫికేషన్ అమలుకు ముందడుగు వేసేలా కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. -
పెద్దవాగుతో మొదలు!
సాక్షి, హైదరాబాద్: గోదావరి బోర్డు పరిధిలోకి వెళ్లే ప్రాజెక్టులపై కొంత స్పష్టత వచ్చింది. ఇరు రాష్ట్రాల సమ్మతి మేరకు అక్టోబర్ 14 నుంచి గోదావరి బేసిన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న పెద్దవాగు ప్రాజెక్టును తొలి దశలో బోర్డు తన పరిధిలోకి తీసుకునేందుకు మార్గం సుగమమైంది. శ్రీరాంసాగర్ మొదలు సీతమ్మసాగర్ వరకు గోదావరిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులన్నిం టినీ బోర్డు పరిధిలో ఉంచాలన్న ఏపీ డిమాండ్‌పై ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడంతో పెద్దవాగు నిర్వహణ బాధ్యతల ను ప్రయోగాత్మకంగా చేట్టాలని సోమవారం జరిగిన బోర్డు భేటీలో నిర్ణయమైంది. పెద్దవాగును అప్పగిస్తూ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాక, వీటి నిర్వహణను బోర్డు చేపట్టనుంది. అయితే, దశలవారీగా ప్రాజెక్టులను అధ్యయనం చేసి వాటిని బోర్డు పరిధిలోకి తీసుకురానున్నట్లు గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. పెద్దవాగు.. సీలేరులపైనే కీలక చర్చ ప్రాజెక్టుల పరిధి, సిబ్బంది నియామకం, నిధులు తదితర అంశాలపై చర్చించేందుకు సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి బోర్డు పూర్తిస్థాయి భేటీ జరిగింది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన భేటీకి తెలంగాణ, ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శులు రజత్‌కుమార్, శ్యామలరావుతోపాటు ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు. గోదావరిపై తెలంగాణ ఎస్సారెస్పీ నుంచి సీతమ్మసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవా లని ఏపీ పట్టుబట్టింది. దీనికి తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఉమ్మడిగా ఉన్న పెద్దవాగును మాత్రమే బోర్డుపరిధిలో ఉంచాలని కోరింది. పెద్దవాగు కింద ఉన్న 16 వేల ఎకరాల ఆయకట్టులోనూ 13 వేల ఎకరాల మేర ఆయకట్టు ఏపీలో ఉన్నందున నిర్వహణకు వ్యయంలో ఏపీనే 85% చెల్లించాలని కోరింది. అయితే తొలిదశలో ట్రయల్ మాదిరి పెద్దవాగును పరిధిలోకి తెచ్చుకొని, దాని అమలు, నిర్వహణ బాధ్యతలు చూస్తామని బోర్డు స్పష్టం చేసింది. దశలవారీగా మిగతా ప్రాజెక్టులను అధ్యయనం చేసి బోర్డు పరిధిలోకి తెస్తామంది. ఏ రాష్ట్ర సిబ్బంది ఆ రాష్ట్ర పరిధిలోనే పనిచేస్తారని తెలిపింది. పెద్దవాగుకు అవసరమైన ఉత్తర్వులు వెం టనే విడుదల చేసేందుకు ఏపీ సమ్మతి తెలిపింది. సీలేరు విద్యుదుత్పత్తి ప్రాజెక్టును సైతం బోర్డు పరి ధిలోకి తేవాలని తెలంగాణ కోరింది. సీలేరు విద్యుత్‌లో సగం తెలంగాణకు రావాల్సి ఉన్నా ఏపీ ఇవ్వ డంలేదంది. దీనిపై ఏపీ అభ్యంతరం చెప్పగా, బోర్డు సైతం విద్యుదుత్పత్తి కేంద్రాల అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున.. తోసిపుచ్చింది. బడ్జెట్ ఉద్దేశం చెబితే సీడ్‌మనీ విడుదల బోర్డులుకు ఇరు రాష్ట్రాలు చెల్లించాల్సిన చెరో రూ.200 కోట్ల సీడ్‌మనీ అంశంపైనా బోర్డు భేటీలో చర్చ జరిగింది. కేవలం ఒక్క ప్రాజెక్టునే బోర్డు పరిధిలో ఉంచినప్పుడు రూ.200 కోట్ల నిధులు అవసరం ఏముంటుందని రెండు రాష్ట్రాలు ప్రశ్నించాయి. నిధుల విడుదల ఆర్థికశాఖతో ముడిపడి ఉన్నందున బడ్జెట్ ఉద్దేశాలను బోర్డు తమకు చెబితే వాటినే ఆర్థిక శాఖకు తెలియజేస్తామని ఇరు రాష్ట్రాలు వివరించాయి. నేడు కృష్ణా బోర్డు భేటీ కృష్ణా బోర్డు మంగళవారం భేటీ జరుగనుంది. ప్రాజెక్టుల అధీనంతోపాటు నిధులు, సిబ్బంది పై బోర్డులో చర్చించనున్నారు. విద్యుదుత్పత్తి కేంద్రాల చుట్టూనే ప్రధానచర్చ జరిగే అవకాశాలున్నాయి. వీటితోపాటే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలోని ఔట్లెట్లపై నిర్ణయాలు వచ్చే అవకాశాలున్నాయి. -
కుదరని ఏకాభిప్రాయం
సాక్షి, అమరావతి: గోదావరి, కృష్ణా బోర్డు పరిధిపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఆదివారం జరిగిన సబ్ కమిటీల సమావేశాల్లో రెండు రాష్ట్రాల అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. పరిధిపై నిర్ణయాధికారాన్ని సోమవారం జరిగే గోదావరి బోర్డు ప్రత్యేక సమావేశానికి గోదావరి బోర్డు సబ్ కమిటీ అప్పగించగా.. కృష్ణా సబ్ కమిటీ సోమవారం మరోసారి సమావేశమై పరిధిని కొలిక్కి తెచ్చే యత్నం చేయాలని నిర్ణయించింది. రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జులై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ ఈనెల 14 నుంచి అమల్లోకి వస్తుంది. దీని అమలు కోసం బోర్డు పరిధి, స్వరూపంపై ముసాయిదా నివేదిక ఇచ్చేందుకు రెండు బోర్డుల చైర్మన్లు సబ్ కమిటీలను ఏర్పాటుచేశారు. ఇవి ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యాయి. గోదావరి బోర్డు సమావేశం సోమవారం.. కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం మంగళవారం జరగనున్న నేపథ్యంలో వాటి పరిధి, స్వరూపంపై ముసాయిదా నివేదిక రూపొందించేందుకు ఆదివారం సబ్ కమిటీలు మరోసారి సమావేశమయ్యాయి. గోదావరి బోర్డు పరిధి పెద్దవాగుతో మొదలు.. కన్వీనర్ బీపీ పాండే నేతృత్వంలో గోదావరి బోర్డు సబ్ కమిటీ ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమైంది. అందులో తేలింది ఏమిటంటే.. ► రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగును తొలుత బోర్డు పరిధిలోకి తీసుకుని.. ఆ తర్వాత దశల వారీగా ఇతర ప్రాజెక్టులను తీసుకుంటామని బీపీ పాండే తెలిపారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ అంతర్రాష్ట్ర విభాగం సీఈ శ్రీనివాసరెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. కేవలం 16 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే పెద్దవాగు ప్రాజెక్టును మాత్రమే బోర్డు పరిధిలోకి తీసుకోవడంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. తెలంగాణలో శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ (సీతారామ ఎత్తిపోతల్లో అంతర్భాగం) వరకూ అన్ని ప్రాజెక్టులను గోదావరి బోర్డు పరిధిలోకి తీసుకుని.. నీటి వినియోగాన్ని నియంత్రిస్తేనే దిగువనున్న పోలవరం, గోదావరి డెల్టా హక్కులను పరిరక్షించడానికి సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. దాంతో పరిధిపై నిర్ణయాధికారాన్ని సోమవారం జరిగే గోదావరి బోర్డు ప్రత్యేక సమావేశానికి అప్పగించాలని సబ్ కమిటీ నిర్ణయించింది. ► బోర్డు నిర్వహణకు సీడ్ మనీ కింద రెండు రాష్ట్రాలు చెరో రూ.200 కోట్లను డిపాజిట్ చేయాలని బీపీ పాండే కోరారు. ఈ అంశంపై ప్రభుత్వాలతో చర్చించి చెబుతామని ఏపీ, తెలంగాణ సీఈలు శ్రీనివాసరెడ్డి, మోహన్‌కుమార్‌లు తెలిపారు. కృష్ణా సబ్ కమిటీకి వివరాలివ్వని తెలంగాణ.. మరోవైపు.. కన్వీనర్ ఆర్కే పిళ్లై నేతృత్వంలో కృష్ణా బోర్డు సబ్ కమిటీ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో సమావేశమైంది. ఇందులో.. ► గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు షెడ్యూల్–2లో అన్ని ప్రాజెక్టులు, సిబ్బంది తదితర వివరాలన్నీ ఏపీ అధికారులు ఇప్పటికే సబ్ కమిటీకి అందజేశారు. కానీ.. తెలంగాణ ఇవ్వకపోవడంపై పిళ్లై అసహనం వ్యక్తంచేశారు. ► జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల స్పిల్ వేలు, వాటిపై ఉన్న విద్యుత్కేంద్రాలు, కాలువలకు నీటిని విడుదలచేసే రెగ్యులేటర్లు, ఎత్తిపోతల పథకాలను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ అధికారులు ప్రతిపాదించారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. జూరాల ఉమ్మడి ప్రాజెక్టు కాదని.. దాన్ని బోర్డు పరిధిలోకి తీసుకోకూడదని స్పష్టంచేశారు. అయితే.. సుంకేశుల బ్యారేజీ, కేసీ కెనాల్‌ను బోర్డు పరిధిలోకి ఇచ్చేదిలేదని ఏపీ అధికారులు స్పష్టంచేశారు. అలాగే, శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కే పరిమితం కావాలని.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌ను బోర్డు పరిధిలోకి తీసుకోకూడదన్నారు. ► శ్రీశైలం ఎడమ గట్టు, సాగర్, పులిచింతల విద్యుత్కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవాలా? వద్దా? అన్నది ప్రభుత్వంతో చర్చించి చెబుతామని తెలంగాణ అధికారులు చెప్పారు. ఇలా.. రెండు రాష్ట్రాల అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తంకావడం, తెలంగాణ అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో కృష్ణా బోర్డు సబ్ కమిటీ సమావేశాన్ని సోమవారం మరోసారి నిర్వహించాలని కన్వీనర్ ఆర్కే పిళ్లై నిర్ణయించారు. ఈ సమావేశంలో పరిధి నిర్ణయాధికారాన్ని మంగళవారం జరిగే కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశానికి అప్పగించనున్నారు. -
Sitarama project: ముంపు సంగతేంటి...?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలపై సునిశిత పరిశీలన చేస్తున్న గోదావరి బోర్డు.. తాజాగా సీతారామ ఎత్తిపోతలపై అనేక ప్రశ్నలు సంధించింది. ప్రాజెక్టు హైడ్రాలజీ వివరాలు, డ్రాయింగ్లు, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, నిధుల ఖర్చులు, వచ్చిన అనుమతులకు సంబంధించి అన్ని వివరాలు తమ ముందుంచాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. డీపీఆర్ ఆమోద ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా తాము కోరిన వివరాలన్నీ సమర్పించాలంటూ తాజాగా రాష్ట్రానికి లేఖ రాసింది. ఇందులో ప్రధానంగా.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లెక్కల ప్రకారం దుమ్ముగూడెం వద్ద గరిష్ట వరద 36 లక్షలుగా ఉన్నప్పుడు గోదావరి నీటి మట్టం 62.86 మీటర్లుగా ఉందని పేర్కొంది. 50 ఏళ్ల గరిష్ట వరద చూసినప్పుడు అత్యధిక నీటి మట్టం 60.43 మీటర్లు ఉందని చెప్పింది. కానీ, ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ 56.5 మీటర్లులో నిర్మి స్తున్నారని, గరిష్ట వరద నమోదైనప్పుడు హెడ్‌వర్క్ పనులు ముంపునకు గురయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోందన్న అనుమానాన్ని బోర్డు వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర వరదల లెక్కలతో తమకు నివేదించాలని కోరింది. రబీకి ఎక్కడి నుంచి మళ్లిస్తారు... ఇక గోదావరిలో వరద ఉన్న 90–120 రోజుల్లోనే గోదావరి నుంచి 70 టీఎంసీల నీటిని తీసుకుంటా మంటున్నారని, వరద ముగిశాక రబీకి అవసరమైన 29.42 టీఎంసీల నీటిని ఎక్కడి నుంచి మళ్లిస్తారో వెల్లడించాలని కోరింది. హెడ్‌రెగ్యులేటర్‌ను 400 క్యూసెక్కుల నీటిని తీసుకునేలా డిజైన్ చేయగా, కాల్వ సామర్థ్యాన్ని 256 క్యూసెక్కులకే డిజైన్ చేశారని, ఈ తేడాలెందుకో తెలపాలని కోరింది. ఇప్పటికే ప్రాజెక్టులో 50శాతం పనులు పూర్తయ్యా యని చెబుతున్నారని, అయితే ప్రస్తుతం మిగిలిన పనులు, నిధుల ఖర్చు వివరాలు తెలపాలంది. ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ అవసరాలు, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ నిర్ధారించిన ఒక్కో యూనిట్ విద్యుత్ ధరలు, దీనికి అనుగుణంగా కాస్ట్ బెనిఫిట్ రేషియో వివరాలు అందించాలని తెలిపింది. గోదావరికి సంబంధించి తెలంగాణ, ఏపీ సరిహద్దులుగా ఉన్న కొత్త మ్యాప్‌లు, పరివా హక రాష్ట్రాలో వివిధ సందర్భాల్లో జరిగిన ఒప్పం దాల నివేదికలు తమ ముందుంచాలని తెలిపింది. కాళేశ్వరం, సీతారామ ద్వారా 307 టీఎంసీల మేర నీటిని తెలంగాణ వినియోగిస్తుందన్నందున దుమ్ముగూడెం వద్ద లభ్యతగా ఉండే మిగతా జలాలు, సహజ(ఎకో) ప్రవాహాల వివరాలు అందించాలంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు లభించిన అన్ని రకాల అనుమతులు ముఖ్యంగా పర్యావరణ, అటవీ, రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం వంటి వివ రాలను సమర్పించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. -
ఉమ్మడి ప్రాజెక్టులతో మొదలు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తొలిదశలో రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలు ముడిపడిన సాగు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు వెళ్లనున్నాయి. ఈనెల 14 నుంచి జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులతోపాటు జలవిద్యుత్ కేంద్రాలు, వాటిలో పనిచేసే సిబ్బంది, కార్యాలయాలు, వాహనాలు సహా అన్నీ కృష్ణా బోర్డు అధీనంలోకి తీసుకుని నిర్వహించనుంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో రెండు రాష్ట్రాల ప్రయోజనాలతో ముడిపడిన పెద్దవాగు ప్రాజెక్టును మాత్రమే ప్రస్తుతానికి గోదావరి బోర్డు అధీనంలోకి తీసుకోనుంది. ఆ తర్వాత దశలవారీగా మిగతా ప్రాజెక్టులను బోర్డులు తమ పరిధిలోకి తీసుకోనున్నాయి. ఈనెల 10, 11 తేదీల్లో కృష్ణా, గోదావరి బోర్డుల సబ్ కమిటీల సమావేశాలు నిర్వహించి, 12న రెండు బోర్డుల ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి.. రెండు రాష్ట్రాలకు స్పష్టత ఇవ్వాలని బోర్డుల చైర్మన్లకు కేంద్ర జల్‌శక్తిశాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ సూచించారు. ఈనెల 14 నుంచి బోర్డుల పరి«ధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న గెజిట్ నోటిఫికేషన్‌ను జారీచేసిన కేంద్రం.. ఈ నోటిఫికేషన్ అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్ అమలు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్‌లతో కేంద్ర జల్‌శక్తిశాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ సమావేశమయ్యారు. నోటిఫికేషన్ అమలు చేయాల్సిందే బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులు, వాటి వివరాలు, రాష్ట్రాలు అందించిన సమాచారం, సిబ్బంది నియామకం, నిధుల చెల్లింపు, సీఐఎస్ఎఫ్ భద్రత, రాష్ట్రాల అభ్యంతరాలు, ఇంతవరకు పూర్తిచేసిన చర్యలు తదితర వివరాల గురించి రెండు బోర్డుల చైర్మన్లను దేవశ్రీ ముఖర్జీ ఆరా తీశారు. ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తేవడానికి రెండు రాష్ట్రాల నుంచి అనేక అభ్యంతరాలున్నాయని బోర్డుల చైర్మన్లు వివరించారు. కృష్ణా ప్రధాన పాయపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను కృష్ణాబోర్డు అధీనంలోకి తీసుకుని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం సూచిస్తోందని చెప్పారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను మాత్రమే బోర్డు పరిధిలోకి తీసుకోవాలని తెలంగాణ సర్కారు కోరుతోందన్నారు. దీనిపై దేవశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులతోపాటు వాటిపై ఆధారపడిన జలవిద్యుత్ కేంద్రాలను బోర్డు అధీనంలోకి తీసుకోవాలని ఆదేశించారు. గోదావరి బేసిన్లో ఒక్క పెద్దవాగు ప్రాజెక్టు కింద మాత్రమే రెండు రాష్ట్రాల ఆయకట్టు ఉందని గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చెప్పగా.. ఆ ప్రాజెక్టును తొలుత అధీనంలోకి తీసుకుని తర్వాత మిగతా ప్రాజెక్టులపై దృష్టిసారించాలని దేవశ్రీ ముఖర్జీ చెప్పారు. బోర్డు నిర్వహణకు సీడ్ మనీ కింద ఒక్కో బోర్డుకు ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్లు డిపాజిట్ చేయాలని, ఆ మేరకు ప్రభుత్వాలకు లేఖలు రాసి నిధులు డిపాజిట్ చేయించుకోవాలని బోర్డుల చైర్మన్లకు సూచించారు. ఈ నేపథ్యంలో 10వ తేదీ నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించేందుకు బోర్డుల చైర్మన్లు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఈనెల 12న నిర్వహించే ప్రత్యేక సమావేశంలో బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు, జలవిద్యుత్ కేంద్రాలు, సిబ్బంది, కార్యాలయాలు తదితర వివరాలపై మరింత స్పష్టత వస్తుందని బోర్డుల అధికారవర్గాలు తెలిపాయి. -
Projects: వీడని సందిగ్ధత.. ఏవి ఎవరి పరిధిలో..?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వివాదాలకు చరమగీతం పాడే దిశగా వెలువ రించిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు గడువు దగ్గర పడుతున్నా.. బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులపై మాత్రం సందిగ్ధత వీడటం లేదు. గెజిట్ ప్రకారం కృష్ణా బేసిన్‌లోని 36 ప్రాజెక్టులు, గోదావరి బేసిన్‌లోని 71 ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి రావాల్సి ఉండగా.. ఇన్ని ప్రాజెక్టులను తీసుకోవ డంపై రెండు తెలుగు రాష్ట్రాలు అభ్యంతరాలు లేవ నెత్తుతున్నాయి. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టు లను మాత్రమే బోర్డు పరిధిలో ఉంచాలని తెలుగు రాష్ట్రాలు కోరుతుంటే.. గోదావరిలో ఒకే ఒక్క ప్రాజెక్టును మాత్రమే బోర్డు పరిధిలో ఉంచాలని తెలంగాణ కోరుతోంది. దీంతో కేంద్రం, బోర్డులు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారింది. ఒక్కొక్కరిది ఒక్కో వాదన కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలోని తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ అక్టోబర్ 14 నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వెళ్లాల్సి ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థ (ట్రాన్స్మిషన్ లైన్స్), ఆయకట్టుకు నీటిని విడుదల చేసే ప్రాంతాలు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ తదితర బాధ్యతలను బోర్డులే నిర్వహిస్తాయి. ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల పరిధిలోని హెడ్‌వర్క్స్ మాత్రమే బోర్డుల పరిధిలో ఉండాలని తెలంగాణ అంటోంది. శ్రీశైలంపై ఆధారపడి చేపట్టిన కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి పథకాలు వద్దని అంటోంది. బనకచర్ల వద్దు ఆంధ్రప్రదేశ్ మాత్రం.. సాగర్, శ్రీశైలం, పులి చింతలతో పాటు జూరాలను కృష్ణా బోర్డు పరిధిలో ఉంచాలని కోరుతోంది. అయితే బనకచర్లను మా త్రం వద్దంటోంది. ఎందుకంటే పోతిరెడ్డిపాడు ద్వారానే నీళ్లు బనకచర్లను చేరతాయి. పోతిరెడ్డి పాడు ద్వారా జరిగే నీటి వినియోగానికి లెక్కలు ఉంటాయి కాబట్టి, బనకచర్లను చేర్చాల్సిన అవసరం లేదని వాదిస్తోంది. ఈ మేరకు తన అభి ప్రాయాలను కేంద్రానికి పంపింది. దీనిపై ఇంత వరకు బోర్డు, కేంద్రం నుంచి స్పందన రాలేదు. పెద్దవాగును ఉంచితే చాలు: తెలంగాణ గెజిట్‌లో పేర్కొన్న మేరకు పెద్దవాగు రిజర్వాయర్, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీ తరలింపు, పోలవరం 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, తోట వెంకటాచలం పుష్కర, తాడిపూడి, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలు, కాటన్ బ్యారేజీ, తొర్రిగడ్డ, చింతలపూడి, చాగల నాడు, వెంకటనగరం ఎత్తిపోతలు గోదావరి బోర్డు పరిధిలో ఉండనున్నాయి. అలాగే ఎస్సారెస్పీ స్టేజ్–1, కాళేశ్వరం, కాళేశ్వరం అదనపు టీఎంసీ, దేవాదుల, తుపాకుల గూడెం బ్యారేజీ, ముక్తేశ్వర్, సీతారామ ఎత్తిపోతలు, మాచ్‌ఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టు, సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లు కూడా బోర్డు అధీనంలో ఉండనున్నాయి. అయితే గోదావరిలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు లేని దృష్ట్యా వీటిపై బోర్డు పెత్తనం అవసరం లేదని తెలంగాణ అంటోంది. ఒకవేళ పెట్టాల్సి వస్తే ఖమ్మం జిల్లాలో ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న పెద్దవాగును మాత్రమే ఉంచాలని కోరుతోంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని బోర్డు, ఈ నెల 6,7 తేదీల్లో అక్కడ పర్యటించేందుకు మాత్రం ఏర్పాట్లు చేసుకుంటోంది. -
‘సీతారామ’ డీపీఆర్‌ను ఆమోదించొద్దు
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతపై అంచనా వేసి, నీటి పంపిణీపై రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవడం లేదా ట్రిబ్యునల్ పంపిణీ చేసేవరకు తెలంగాణ సర్కార్ సమర్పించిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదించవద్దని కేంద్రం, గోదావరి బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. గోదావరి జలాల విషయంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌లకు గురువారం రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు లేఖ రాశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి ఇచ్చినప్పుడు నీటిలభ్యతను అధికంగా చూపించారని, దానిపై తమ అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల వల్ల పోలవరం, గోదావరి డెల్టాకు నీటిలభ్యత తగ్గుతుందని, ఆ ప్రాజెక్టును ఆమోదిస్తే దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను దెబ్బతీసినట్లవుతుందని స్పష్టం చేశారు. సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌కు పంపిన గోదావరి బోర్డు.. అక్టోబర్ 6లోగా అభిప్రాయాలు చెప్పాలని కోరింది. ఈ నేపథ్యంలో ఈ పథకంపై అభిప్రాయాలను చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖలో కొన్ని ప్రధానాంశాలు.. ► ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన గోదావరిలో 991.19 టీఎంసీల నీటిలభ్యత ఉంటుందని సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌లో వ్యాప్కోస్ లెక్కగట్టింది. పోలవరం వద్ద 460.36 టీఎంసీల మిగులు ఉంటుందని తేల్చింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిగణనలోకి తీసుకుంటే పోలవరం వద్ద 315.54 టీఎంసీలే మిగులు ఉంటుంది. ► పోలవరం వద్దకు సగటున 561 టీఎంసీల ప్రవాహం వస్తుందని లెక్కకట్టిన సీడబ్ల్యూసీ ఆ ప్రాజెక్టుకు 2006 సెప్టెంబర్ 12న హైడ్రాలాజి క్లియరెన్స్ ఇచ్చింది. కానీ పోలవరం వద్ద నీటిలభ్యత 460.36 టీఎంసీలే ఉంటుందని సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌లో ఉండటంపై 2018లోనే అభ్యంతరం వ్యక్తం చేశాం. 2018లో 32 టీఎంసీల సామర్థ్యంతో డీపీఆర్ ఇచ్చిన తెలంగాణ ఇప్పుడు సామర్థ్యాన్ని 70 టీఎంసీలకు పెంచిన నేపథ్యంలో పోలవరం, గోదావరి డెల్టాలకు తీవ్ర నీటికొరత ఏర్పడుతుంది. ► పోలవరం ప్రాజెక్టు, గోదావరి డెల్టా అవసరాలు 554.81 టీఎంఎసీలు. పోలవరం డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించిన సమయంలో పోలవరం ప్రాజెక్టులో 34.92 టీఎంసీల ఆవిరి నష్టాలు ఉంటాయని తేల్చింది. పోలవరం కుడి, ఎడమ కాలువల అదనపు అవసరాలు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతలపూడి, ముసురుమిల్లి, వెంకటనగరం, భూపతిపాలెం, అప్పర్ సీలేరు, లోయర్ సీలేరు, మాచ్‌ఖండ్ తదితర ప్రాజెక్టుల అవసరాలు లెక్కిస్తే.. గోదావరిలో 75 శాతం నీటిలభ్యత కింద రాష్ట్ర వాటా 775 టీఎంసీలు. ► ఈ నేపథ్యంలో 2018 ఫిబ్రవరి 15న కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తక్షణమే గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీతో అంచనా వేయించాలి. ఎగువ రాష్ట్రాలు పూర్తిచేసిన, నిర్మాణంలో ఉన్న, చేపట్టనున్న ప్రాజెక్టుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు నీటి కేటాయింపులు చేయాలి. ఆ తర్వాతే డీపీఆర్‌లను ఆమోదించాలి. -
6లోగా అదనపు సమాచారమివ్వండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీబేసిన్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లపై ఇతర సమాచారంగానీ, పరిశీలనలనుగానీ తమకు అక్టోబర్ 6వ తేదీలోగా సమర్పించాలని తెలంగాణకు గోదావరి బోర్డు సూచించింది. ఈలోగా అందించిన సమాచారం మేరకే ప్రాజెక్టుల అనుమతుల విషయమై ముందుకు వెళతామని, ఎలాంటి అదనపు సమాచారం ఇవ్వకుంటే తెలంగాణ తరఫున చెప్పడానికి అదనంగా ఏమీ లేదన్నట్లుగానే భావిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు రెండ్రోజుల కిందట బోర్డు సభ్యకార్యదర్శి బీపీ పాండే ఒక్కో ప్రాజెక్టుపై విడివిడిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సీతారామ, తుపాకులగూడెం, చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల, చనాకా–కొరట ప్రాజెక్టుల డీనీఆర్‌లను తెలంగాణ ఇదివరకే సమర్పించగా, దీనిపై బోర్డు స్క్రూటినీ మొదలుపెట్టింది. ఒక్కో ప్రాజెక్టుకు కేటాయించిన నీరు, ప్రాజెక్టు వ్యయం, వృధ్ధిలోకి తెచ్చే ఆయకట్టుతోపాటు తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్న వివరాలను రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లలో వివరించింది. అయితే సీతారామసహా కొన్ని ప్రాజెక్టులపై గోదావరి బోర్డు అదనపు సమాచారం కోరింది. సీతారామ ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు నీటి లభ్యత తగ్గే అవకాశాలున్నాయా అంటూ పలు ప్రశ్నిలు సంధించినట్లు తెలిసింది. దీంతోపాటే చనాకా–కొరటకు సంబంధించి మహారాష్ట్రకు దక్కే జలాలు, ఆ ప్రాంతంలో ఆయకట్టు వివరాలను సేకరించినట్లుగా తెలిసింది. తాము కోరుతున్న సమాచారంతోపాటు ఇతరత్రా ఎలాంటి సమాచారాన్నైనా అక్టోబర్ 6లోగా తమకు అం దించాలని కోరింది. ఈ వివరాలను సైతం పరిశీలనలోకి తీసుకొని డీపీఆర్‌లను మదింపు చేస్తామని తెలిపింది. చనాకా–కొరటపై సీడబ్ల్యూసీకి ప్రజెంటేషన్ చనాకా–కొరట ప్రాజెక్టుపై శుక్రవారం హైదరాబాద్‌లోని కేంద్ర జలసంఘం ఇంజనీర్లకు ఆదిలాబాద్ సీఈ శ్రీనివాస్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బ్యారేజీ నిర్మాణం, ఇప్పటివరకు చేసిన పనులు, వ్యయం, భూసేకరణ, మహారాష్ట్ర సహకారం, తెలంగాణ, మహారాష్ట్రలో వృద్ధిలోకి వచ్చే ఆయకట్టు తదితరాలపై వివరణ ఇచ్చారు. 28న కృష్ణా బోర్డు సబ్ కమిటీ మరోమారు భేటీ గెజిట్ నోటిఫికేషన్ అంశాల అమలుపై చర్చించేందుకు కృష్ణాబోర్డు సబ్‌కమిటీ మంగళవారం మరోమారు భేటీ కానుంది. ప్రాజె క్టుల సమాచారం, సిబ్బంది, భద్రత వంటి అంశాలపై కమిటీ చర్చించనుంది. తెలంగాణ ఇప్పటికే కొంత సమాచారాన్ని బోర్డుకు అందించగా, మరికొంత సమాచారాన్ని మం గళవారం నాటి భేటీలో సమర్పించనుంది. -
దూకుడుకు కళ్లెం పడేనా?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు అటు కేంద్రం, ఇటు బోర్డులు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, దీనిని అడ్డుకునే దిశగా తెలంగాణ మరోమారు రంగంలోకి దిగుతోంది. అక్టోబర్ 14నుంచి గెజిట్ అమల్లోకి వచ్చేందుకు కేవలం 20 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అయితే ఇంతవరకు బోర్డుల స్వరూపమే సిద్ధం కాలేదనే కారణంతో గెజిట్ అమలు వాయిదా వేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు మరోమారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలవాలని నిర్ణయించారు. ఈ నెల 25న షెకావత్‌తో భేటీ కానున్న సీఎం..గెజిట్‌పైనే చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గెజిట్ అమలుపై చర్యలు వేగిరం ఈ నెల 6న భేటీ సందర్భంగా కూడా గెజిట్ అమలును వాయిదా వేయాలని షెకావత్‌ను కేసీఆర్ కోరారు. అమలుకు గడువు తక్కువగా ఉండ డంతో.. సిబ్బంది నియామకం, వ్యవస్థ స్థాపన, ప్రాజెక్టులకు అనుమతులు, పర్యవేక్షణ తదితర సమస్యలు ఆటంకంగా మారతాయని వివరిం చారు. దీనిపై ఆ భేటీలో కేంద్రం ఎలాంటి నిర్ణయం చెప్పకున్నా, తర్వాతైనా సానుకూలంగా స్పందించ వచ్చని తెలంగాణ ఎదురుచూసింది. అయితే దీనిపై ఎలాంటి సానుకూల నిర్ణయాలు వెలువడక పోగా.. గెజిట్ అమలు దిశగా కేంద్రం, బోర్డులు చర్యలు వేగిరం చేశాయి. గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ సీఐఎస్ఎఫ్ సిబ్బంది నియామకం అంశాన్ని తెరపైకి తెచ్చాయి. సీఐఎస్ ఎఫ్ సిబ్బందికి అవసరమయ్యే వసతి సౌకర్యాలు, మౌలిక వసతులు, వాహనాలు, కార్యాలయాల ఏర్పాటు, వారి జీతభత్యాలకు సంబంధించి ఓ ముసాయిదా పత్రాన్ని అందజేసి దానిపై ప్రభుత్వా ల వివరణలు కోరాయి. రెండు నదీ బేసిన్లపై ఉన్న ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాల వివరాలతో పాటు ప్రాజెక్టుల డీపీఆర్ లను పది రోజుల్లో తమకు సమర్పించాలని ఆదేశిం చాయి. ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ చూస్తున్న ఏజెన్సీల వివరాలు కోరాయి. వివాదాలపై విన్నపాలు..: బోర్డుల వేగాన్ని చూస్తే అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలు పక్కాగా ఉండనుందని తెలుస్తోంది. దీనిపై వెనకడుగు వేసే పరిస్థితులు కానరావడం లేదు. అయితే మరోపక్క గోదావరి మళ్లింపు జలాల అంశంపై ఏపీ, తెలం గాణ మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గెజిట్ అమలు విషయంలో ఉన్న అభ్యంతరాలను సీఎం కేసీఆర్ కేంద్రమంత్రికి విన్నవించే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
Andhra Pradesh: గెజిట్ అమలుపై ముందుకే!
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ), గోదావరీ నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ)ల పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా కేంద్ర జల్‌శక్తి శాఖ మరో అడుగు ముందుకేసింది. నోటిఫికేషన్ అమలును అక్టోబరు 14 నుంచి కాకుండా కొంతకాలం వాయిదా వేయాలని ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరిన సంగతి తెలిసిందే. అయితే గెజిట్ అమలు సాఫీగా సాగేలా జల్‌శక్తి శాఖ ఆయా బోర్డులకు చీఫ్ ఇంజనీర్ల స్థాయి ఉన్నతాధికారులను నియమించింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధి విస్తృతమైన నేపథ్యంలో మానవ వనరులు బలోపేతంతో పాటు బోర్డులు మెరుగైన రీతిలో పనిచేసేలా సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ గ్రూప్ ‘ఏ’ సర్వీసుకు చెందిన సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ అధికారులు నలుగురిని నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. సీడబ్ల్యూసీ ప్రధాన కార్యాలయం చీఫ్ ఇంజనీర్ డాక్టర్ ఎం.కె.సిన్హా, సీడబ్ల్యూసీ యమునా బేసిన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ జి.కె.అగర్వాల్‌ను గోదావరి నదీ యాజమాన్య బోర్డులో నియమించింది. సీడబ్ల్యూసీ కావేరీ అండ్ సదరన్ రీజియన్ ఆర్గనైజేషన్ (కోయంబత్తూరు) చీఫ్ ఇంజనీర్ టి.కె.శివరాజన్, సీడబ్ల్యూసీ అప్పర్ గంగా బేసిన్ ఆర్గనైజేషన్ (లక్నో) చీఫ్ ఇంజనీర్ అనుపమ్ ప్రసాద్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో నియమించింది. ఈ నలుగురు అధికారులు ఆయా బోర్డుల చైర్మన్‌కు తక్షణం రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరిచిన ప్రాజెక్టుల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలని సూచించింది. రెండు బోర్డులకు అత్యంత ప్రాధాన్యం గల అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఈ నియామకాలు మూడు నెలల కాలానికి లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు వర్తిస్తాయని పేర్కొంది. ఈ అధికారులు చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో పూర్తి అధికారాలతో ఫుల్ టైమ్ పనిచేస్తారని తెలిపింది. గెజిట్ అమలుపై బోర్డుల చైర్మన్లతో చర్చ కేఆర్ఎంబీ చైర్మన్ ఎం.పి.సింగ్, జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌లతో కేంద్ర జల్‌శక్తి శాఖ అదనపు కార్యదర్శి దేవాశ్రీ ముఖర్జీ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. గత శుక్రవారం జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కొనసాగింపుగా అదనపు కార్యదర్శి ఈ సమావేశాన్ని నిర్వహించారు. బోర్డుల పరిపాలనా సంబంధిత అంశాలు, నోటిఫికేషన్‌పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తెలిపిన అభ్యంతరాలు, గెజిట్ అమలులో ఇబ్బందులు, మానవ వనరులు తదితర అంశాలపై చర్చించారు. సీడబ్ల్యూసీ ౖచైర్మన్ ఎస్.కె.హల్దర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నేడు కృష్ణా, గోదావరి బోర్డుల కీలక సమావేశం
ఢిల్లీ: నేడు ఢిల్లీలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రెండు బోర్డుల చైర్మన్లతో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ భేటీ కానున్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు, కార్యాచరణపై అమలుపై చర్చ జరపనున్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు పలు సవరణలు సూచిస్తూ రెండు రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలపై కేంద్రం దృష్టి సారించింది. (చదవండి: చిరంజీవిని పట్టుకుని కన్నీరు మున్నీరైన ఉత్తేజ్) గెజిట్ నోటిఫికేషన్ అమలు, రెండు రాష్ట్రాల ప్రతిపాదనలపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ శుక్రవారం కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. ఇందులో భాగంగా ఢిల్లీలో నేడు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. చదవండి: వివాహేతర సంబంధం: కలిసి ఉండలేమన్న బాధతో.. -
ఢిల్లీలో చర్చిద్దాం రండి..
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు పలు సవరణలు సూచిస్తూ రెండు రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలపై కేంద్రం దృష్టి సారించింది. గెజిట్ నోటిఫికేషన్ అమలు, రెండు రాష్ట్రాల ప్రతిపాదనలపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ శుక్రవారం కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. ఇందులో భాగంగా ఢిల్లీలో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి హాజరు కావాలని కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లకు సూచిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థి శనివారం ఈ మెయిల్ ద్వారా సమాచారం పంపారు. బోర్డు పరిధిపైనే ప్రధానంగా చర్చ కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా.. విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేసిన ఏడేళ్ల తర్వాత జూలై 15న వాటి పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులను ఆయా బోర్డుల పరిధిలోకి తెచ్చింది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల లోగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి అనుమతి తెచ్చుకోవాలని, లేదంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగాన్ని ఆపేస్తామని పేర్కొంది. షెడ్యూల్–2లోని ప్రాజెక్టులను బోర్డులే అధీనంలోకి తీసుకుని.. సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) బలగాల పహారాలో వాటిని నిర్వహిస్తాయని స్పష్టం చేసింది. బోర్డులు సమర్థవంతంగా పని చేయడానికి వీలుగా ఒక్కో బోర్డు ఖాతాలో సీడ్ మనీ కింద రూ.200 కోట్ల చొప్పున రెండు రాష్ట్రాలు జమ చేయాలని దిశానిర్దేశం చేసింది. అక్టోబర్ 14 నుంచే అమలుకు కేంద్రం దిశా నిర్దేశం కేంద్రం ఆదేశాల మేరకు గెజిట్ నోటిఫికేషన్ అమలుపై గత నెల 3, 9న బోర్డుల సమన్వయ కమిటీ నిర్వహించిన ఉమ్మడి సమావేశానికి తెలంగాణ సర్కార్ గైర్హాజరైంది. ఈ క్రమంలో గత నెల 16న నిర్వహించిన ఉమ్మడి బోర్డుల సమావేశానికి తెలంగాణ సర్కార్ ప్రతినిధులు హాజరయ్యారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రెండు బోర్డుల చైర్మన్లు తమ అభిప్రాయాలను వివరించారు. బోర్డు పరిధి, గెజిట్ నోటిఫికేషన్ అమలు ఖరారుపై సోమవారం నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని చర్చిస్తూనే.. మరో వైపు అక్టోబర్ 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగానే చర్యలు చేపట్టాలని రెండు బోర్డులకు ఇప్పటికే కేంద్రం దిశా నిర్దేశం చేసింది. సవరణలు చేయాలి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ► కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నాం. ఇదే సమయంలో పలు సవరణలను ప్రతిపాదిస్తున్నాం. ► కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులనే బోర్డు పరిధిలోకి తీసుకుని, నిర్వహించి.. మిగతా ప్రాజెక్టుల్లో రోజు వారీ నీటి వినియోగాన్ని రెండు రాష్ట్రాల నుంచి సేకరిస్తే సరిపోతుంది. దీని వల్ల కృష్ణా బోర్డుపై భారం తగ్గుతుంది. ► ఉమ్మడి ప్రయోజనాలతో ఏమాత్రం సంబంధం లేని ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీలను బోర్డుల పరిధి నుంచి తప్పించాలి. మాచ్‌ఖండ్, సీలేరు విద్యుదుత్పత్తి కేంద్రాలను గోదావరి బోర్డు నుంచి తప్పించాలి. ► ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను అనుమతి ఉన్నట్లుగానే గుర్తించాలి. రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన ప్రాజెక్టులనే కొత్త ప్రాజెక్టులుగా పేర్కొనాలి. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు గుర్తించాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలలలోగా అనుమతి తెచ్చుకోవాలన్న నిబంధనను సడలించాలి. వాయిదా వేయాలి : తెలంగాణ సర్కార్ ► నీటి కేటాయింపులు తేలే వరకూ గెజిట్ నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలి. అనుమతి లేని ప్రాజెక్టులుగా గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొనడం వల్ల వాటికి రుణాలు తెచ్చుకోవడం సమస్యగా మారుతుంది. ► అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతి తెచ్చుకోవాలన్న నిబంధనలను సడలించాలి. -
ప్రాజెక్టుల భద్రతపై కేంద్రం కసరత్తు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డులు తమ అధీనంలోకి తీసుకుని నిర్వహించే ప్రాజెక్టులకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలతో (సీఐఎస్ఎఫ్) భద్రత కల్పించేందుకు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ సిబ్బందితో భద్రత ప్రక్రియను త్వరగా చేపట్టాలని జల్ శక్తి శాఖ కోరింది. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది నియామకానికి కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది. బోర్డులు, రాష్ట్రాల నుంచి అందించాల్సిన సహకారం, ఒప్పందాలు తదితరాలపై వివరణ ఇస్తూ గోదావరి, కృష్ణా బోర్డులకు లేఖ రాసింది. సీఐఎస్ఎఫ్ సిబ్బందికి వసతి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, వాహనాలు, కార్యాలయాల ఏర్పాటు, జీతభత్యాలకు సంబంధించి ముసాయిదా పత్రాన్ని రెండు బోర్డులకు పంపింది. షెడ్యూల్–2 ప్రాజెక్టులకు భద్రత.. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులను కేంద్ర జల్ శక్తి శాఖ షెడ్యూల్–2లో చేర్చింది. ఈ ప్రాజెక్టులు, వాటి కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫర్నిచర్‌తో సహా అన్నింటినీ బోర్డులు తన అధీనంలోకి తీసుకుని రోజు వారీ నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తాయి. వాటి పరిధిలోని రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సహా అంతా బోర్డు పర్యవేక్షణలోనే పని చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తారు. ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడని ప్రాజెక్టులను షెడ్యూల్–2 నుంచి తప్పించాలని, జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతలను మాత్రమే కృష్ణా బోర్డు తన అధీనంలోకి తీసుకుని నిర్వహిస్తే సరిపోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. గోదావరిపై ఎగువన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కోరింది. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ స్పందించాల్సి ఉంది. బోర్డుల పరిధిని నిర్ణయించడం కోసం రెండు బోర్డులు ఉప సంఘాన్ని నియమించాయి. డీఐజీ స్థాయి అధికారితో పర్యవేక్షణ.. షెడ్యూల్–2లోని ప్రాజెక్టుల భద్రతను పర్యవేక్షించే డీఐజీ ర్యాంకు అధికారి మొదలు సీనియర్ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లతో సహా ఇతర సిబ్బంది జీతభత్యాలు, బ్యారక్‌లు, కార్యాలయాలు, నిర్వహణకు చెల్లించాల్సిన మొత్తాలు, తదితరాలపై సవివరంగా ముసాయిదాలో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ రూపొందించిన ముసాయిదా కాపీని బోర్డులు శుక్రవారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు పంపాయి. ఇవీ చదవండి: Andhra Pradesh : 27 నెలల్లో 68 మెగా పరిశ్రమలు వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ.. -
అసంపూర్తిగా 'బోర్డుల' ఉమ్మడి భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ గత నెల 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలే అజెండాగా సోమవారం నిర్వహించిన రెండు బోర్డుల ఉమ్మడి సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఏపీ ప్రభుత్వం తరఫున రెండు బోర్డుల్లో సభ్యులైన జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సర్కార్ తరఫున సభ్యులైన ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ గైర్హాజరయ్యారు. దాంతో బోర్డుల స్వరూపాన్ని ఖరారు చేసేందుకు ఉద్దేశించిన ఉమ్మడి భేటీ అసంపూర్తిగా ముగిసింది. కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన రెండు బోర్డులు ఉమ్మడిగా సమావేశమయ్యాయి. నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లోగా ఇరు రాష్ట్రాలతో చర్చించి.. బోర్డుల స్వరూపాన్ని ఖరారు చేసుకోవాలని కేంద్రం దిశానిర్దేశం చేసిందని బోర్డుల చైర్మన్లు చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు అన్ని ప్రాజెక్టుల సమాచారాన్ని అందజేయాలని కోరగా.. ఏపీ అధికారులు సానుకూలంగా స్పందించారు. నోటిఫికేషన్లో కొన్ని అంశాలను సవరించాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి శాఖకు ప్రతిపాదనలు పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలతో ఏమాత్రం సంబంధం లేని ప్రాజెక్టులను కూడా బోర్డుల పరిధిలోకి తేవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి ప్రాజెక్టులు మినహా అన్ని ప్రాజెక్టుల సమాచారాన్ని నెలలోగా అందజేస్తామని చెప్పారు. ఒకేసారి రూ.200 కోట్లు ఎందుకు.. బోర్డులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించేందుకు వీలుగా సీడ్ మనీ కింద ఒక్కో బోర్డు ఖాతాలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చెరో రూ.200 కోట్ల చొప్పున జమ చేయాలని చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ సూచించారు. రెండు బోర్డుల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని.. ఆయా బోర్డులు పంపిన బిల్లులను 15 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని గెజిట్ నోటిఫికేషన్లో ఉందని ఏపీ అధికారులు ఎత్తి చూపారు. దీనివల్ల బోర్డుల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఈ దృష్ట్యా ఒకేసారి ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున రెండు బోర్డులకు రూ.400 కోట్లను డిపాజిట్ చేయాల్సిన అవసరం ఏముంటుందని ఏపీ అధికారులు ప్రశ్నించారు. గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు 60 రోజుల్లోగా సీడ్ మనీ జమ చేయాల్సిందేనని చైర్మన్లు చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని ఏపీ అధికారులు స్పష్టం చేశారు. విభజన చట్టంలో ప్రాజెక్టులకు రక్షణ.. విభజన చట్టంలో 11వ షెడ్యూల్లో ఏపీలోని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టులు.. తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు కేంద్రం రక్షణ కల్పించిందని ఏపీ అధికారులు గుర్తు చేశారు. కానీ.. గెజిట్ నోటిఫికేషన్లో వెలిగొండ ప్రాజెక్టు పేరు తప్పుగా పడిందని.. ఆ ప్రాజెక్టుకు రక్షణ కల్పించాలని ఏపీ అధికారులు కోరారు. దీన్ని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి.. తగిన చర్యలు తీసుకుంటామని కృష్ణా బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారు. ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించే అంశంపై కేంద్ర హోంశాఖతో కేంద్ర జల్ శక్తి శాఖ చర్చలు జరుపుతోందని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులను మాత్రమే బోర్డుల అధీనంలోకి తీసుకుని.. వాటికే సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తే వ్యయం తగ్గుతుందని, లేదంటే భద్రత వ్యయం భారీగా పెరుగుతుందని ఏపీ అధికారులు స్పష్టం చేశారు. దీన్ని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తామని బోర్డుల చైర్మన్లు చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 14 నుంచే అమల్లోకి వస్తుందని.. సమయం తక్కువగా ఉండటంతో బోర్డుల స్వరూపాన్ని ఖరారు చేయడానికి ఇకపై తరచుగా సమావేశాలు నిర్వహిస్తామని.. సహకరించాలని చేసిన సూచనకు ఏపీ అధికారులు సానుకూలంగా స్పందించారు. సమావేశానికి తెలంగాణ సర్కార్ ప్రతినిధులు గైర్హాజరైన నేపథ్యంలో మళ్లీ బోర్డుల ఉమ్మడి భేటీని నిర్వహించాలని నిర్ణయించారు. -
గెజిట్ నోటిఫికేషన్ అమలే అజెండా
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గత నెల 15న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలే అజెండాగా సోమవారం సంయుక్తంగా సమావేశం నిర్వహించేందుకు రెండు బోర్డులు సిద్ధమయ్యాయి. పరిధిలో కొన్ని అంశాలపై అభ్యంతరాలను ప్రస్తావించడంతోపాటు ఏపీకి న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటి కోటా కోసం బోర్డుల సమావేశంలో బలమైన వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణ సర్కార్ తొలుత లేఖ పంపగా.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన 30 రోజుల్లోగా బోర్డుల స్వరూపాన్ని ఖరారు చేయాలని, సమయం తక్కువగా ఉన్నందున తప్పనిసరిగా హాజరు కావాలని బోర్డులు తేల్చి చెప్పాయి. సోమవారం ఎన్జీటీలో కేసుల విచారణకు హాజరు కావాల్సి ఉన్నందున సమావేశాన్ని మరో రోజుకు వాయిదా వేయాలని రెండు బోర్డులకు తెలంగాణ సర్కార్ ఆదివారం మరోసారి వేర్వేరుగా లేఖలు రాసింది. అయితే దీన్ని పరిగణనలోకి తీసుకోని బోర్డులు సోమవారం సమావేశాన్ని యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించాయి. అక్టోబర్ 14 నుంచి అమల్లోకి గెజిట్ నోటిఫికేషన్ బోర్డుల సమన్వయ కమిటీ సమావేశానికి ఈనెల 3న తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు గైర్హాజరయ్యారు. అయినప్పటికీ ఆ సమావేశాన్ని బోర్డులు యథాతథంగా నిర్వహించాయి. పూర్తి స్థాయి బోర్డుల సమావేశాన్ని నిర్వహించిన తర్వాతే సమన్వయ కమిటీల భేటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్కార్ ఆ భేటీకి గైర్హాజరైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈఎన్సీ సి.నారాయణరెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని బోర్డుల పరిధిపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. జల్ శక్తి శాఖ స్పందన ఆధారంగా మిగిలిన అంశాలపై ముందుకెళ్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సర్కార్ హాజరు కాకపోవడంతో సమన్వయ కమిటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. అక్టోబర్ 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ప్రతిపాదించిన మేరకు పూర్తి స్థాయి బోర్డుల సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్లు నిర్ణయించారు. ఆ మేరకు సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ దీనికి సైతం గైర్హాజరు కావాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించడం గమనార్హం. -
కృష్ణా, గోదావరి బోర్డుల దూకుడు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డులు గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. గత నెల 29న సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన గోదావరి బోర్డు కమిటీ భేటీని మంగళవారం నిర్వహించనున్నట్లు 30న రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. అయితే దీనిపై సోమవారం తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ ప్రాజెక్టులను గోదావరి బోర్డు పరిధిలోకి తీసుకెళ్తే రాష్ట్రాలకు తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని, అందుకే వీటిని పూర్తిస్థాయి బోర్డు భేటీలో చర్చించాల్సి ఉందని పేర్కొంది. బోర్డు భేటీలో అభిప్రాయాలు, మార్గదర్శకాలు తెలుసుకోకుండా నేరుగా సమన్వయ కమిటీ భేటీలో గెజిట్‌పై చర్చించడం సాధ్యం కాదని తెలిపింది. అయితే దీనిపై గోదావరి బోర్డు వెంటనే స్పందించి గత నెల 28న కేంద్ర జల శక్తి శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్థీ రాసిన లేఖను ప్రస్తావిస్తూ తెలంగాణకు లేఖ రాసింది. ‘గెజిట్ నోటిఫికేషన్ అమలుకు ఒక నిర్ధిష్ట సమయాన్ని పేర్కొన్నాం. దీనికి అనుగుణంగా అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, తగిన సమాచారం ఆగస్టు 2లోగా మాకు ఇవ్వాలి’ అని కేంద్రం రాసిన లేఖను బోర్డు తన లేఖలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే సమన్వయ కమిటీ భేటీని అత్యవసరంగా నిర్వహిస్తున్నామని వెల్లడించింది. కృష్ణా బోర్డు సైతం... గోదావరి బోర్డు మాదిరిగానే కృష్ణా బోర్డు సైతం 12 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ సోమవారమే లేఖ రాసింది. ఆ వెంటనే గోదావరి బోర్డు కమిటీతోపాటే ఉమ్మడి కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ భేటీ ఉంటుందని సాయంత్రానికి మరో లేఖ రాసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు హైదరాబాద్ జలసౌధలో ఉమ్మడి భేటీ జరగనుంది. అనుమతుల్లేని ప్రాజెక్టులు, బోర్డులకు ఇవ్వాల్సిన నిధులు, సీఐఎస్ఎఫ్ భద్రత, విద్యుదుత్పత్తి విషయమై గెజిట్‌లో పేర్కొన్నట్లుగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అయితే భేటీకి తెలంగాణ ఇంజనీర్లు హాజరవుతారా? అన్నది మంగళవారం ఉదయానికే స్పష్టత రానుంది. ఏపీ ఇంజనీర్లు మాత్రం హాజరవుతారని చెబుతున్నారు. -
గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌లు పంపండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ బేసిన్లో చేపట్టిన కొత్త ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లను తక్షణమే పంపాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. గతంలో జరిగిన బోర్డు భేటీలు, అపెక్స్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన హామీల మేరకు వ్యవహరించాలని.. త్వరగా డీపీఆర్‌లను అందించేలా సంబంధిత అధికారులను ఆదేశించా లని కోరింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జల వనరుల శాఖ కార్యదర్శులకు బోర్డు సభ్యుడు పీఎస్ కుటియాల్ శుక్రవారం లేఖ రాశారు. గత ఏడాది జూన్‌లో జరిగిన బోర్డు భేటీ సందర్భంగా.. ప్రభుత్వ అనుమతి తీసుకొని డీపీఆర్‌లు సమర్పి స్తామని తెలంగాణ అధికారులు వెల్లడించారని, ఏపీ అధికారులు కూడా ఇంకా డీపీఆర్‌లు ఇవ్వని ప్రాజెక్టుల వివరాలు అందజేస్తామని పేర్కొన్నారని వివరించారు. జూన్ 10 నాటికల్లా డీపీఆర్‌లు సమర్పించాలని బోర్డు ఛైర్మన్ ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. గత ఏడాది అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా కూడా.. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని కేంద్ర జల శక్తి మంత్రి సూచించారని.. దానికి ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారని లేఖలో ప్రస్తావించారు. ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దన్నా.. రెండో అపెక్స్ భేటీ తర్వాత డీపీఆర్‌లు సమర్పించాలని బోర్డు నవంబర్‌లో ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసిందని, అనుమతులు లేని ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లరాదని ఆదేశించిందని పీఎస్ కుటియాల్ లేఖలో గుర్తు చేశారు. ఎన్నిసార్లు కోరినా తెలంగాణ డీపీఆర్‌లు ఇవ్వలేదన్నారు. ఏపీ పట్టిసీమ, పురుషోత్తమపట్నం డీపీఆర్‌లు ఇచ్చినా, పూర్తి వివరాలు లేవని.. వాటిని పొందుపరచాలని సూచించామని తెలిపారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టిపెట్టాలని.. వెంటనే డీపీఆర్‌లు అందించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. కాగా డీపీఆర్‌లు ఇవ్వాలని బోర్డు కోరిన ప్రాజెక్టుల్లో.. గోదావరి ఎత్తిపోతల పథకం ఫేజ్–3, సీతారామ, కంతనపల్లి, మిషన్ భగీరథ, లోయర్ పెన్‌గంగపై చేపట్టిన మూడు బ్యారేజీలు, రామప్ప–పాకాల నీటి తరలింపు, కాళేశ్వరంలోని మూడో టీఎంసీకి సంబంధించిన పనులు ఉన్నాయి. -
మా నీళ్లు.. మా హక్కు
సాక్షి, అమరావతి: ట్రిబ్యునల్ కేటాయించిన జలాలు మా రాష్ట్ర హక్కు.. వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తాగు, సాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామన్న విషయాన్ని అపెక్స్ కౌన్సిల్‌కు స్పష్టంచేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై మంగళవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యేందుకు సోమవారం ఢిల్లీకి వచ్చిన ఆయన.. రాత్రి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో అపెక్స్ కౌన్సిల్లో లేవనెత్తాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ వివరాలు.. ► శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచే కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ ద్వారా రోజూ 2.95 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉందని.. అదే నీటి మట్టం నుంచి నీటిని తరలించడానికే రాయలసీమ ఎత్తిపోతలను చేపడితే తప్పేంటని ప్రశ్నించాలని నిశ్చయించారు. ► అలాగే, శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా 796 అడుగుల నుంచే రోజూ నాలుగు టీఎంసీలను నాగార్జునసాగర్‌కు తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉందని.. ఈ సీజన్ ఆరంభంలో సాగర్‌లో నీటి నిల్వలున్నా.. కృష్ణా బోర్డు ఆదేశాలను ధిక్కరించి తెలంగాణ నీటిని తరలిస్తోందని.. దీనివల్లే నీటిమట్టం తగ్గిపోతోందన్న అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయించారు. శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా కాలువలోకి ప్రస్తుతమున్న డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు చేరుతాయని.. ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి సగటున 20 రోజులు కూడా ఉండదనే వాస్తవాన్ని అపెక్స్ కౌన్సిల్‌కు వివరించనున్నారు. ► నీటి మట్టం 854 అడుగుల్లో ఉంటే కాలువలోకి ఏడు వేల క్యూసెక్కులే చేరుతాయని.. అదే 841 అడుగులకు చేరితే కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేసినా నీటిని తరలించలేమని వివరించనున్నారు. ► దీనివల్ల తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టులో సాగునీరు, తాగునీటికి ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పనున్నారు. ► దీనికి పరిష్కారంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం మినహా మరొక మార్గంలేదని స్పష్టం చేయనున్నారు. ► రాయలసీమ ఎత్తిపోతల ద్వారా వాటాకు మించి ఒక్క చుక్కను కూడా అదనంగా తరలించబోమని.. పాత ఆయకట్టుకే నీళ్లందిస్తామని.. తెలంగాణ ప్రాజెక్టులకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టంచేయాలని సమావేశంలో నిర్ణయించారు. కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయాలి ► కృష్ణా బోర్డు ఏర్పాటై ఏడేళ్లవుతున్నా ఇప్పటికీ దాని పరిధిని ఖరారు చేయకపోవడం.. వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఆమోదించకపోవడంపై అపెక్స్ కౌన్సిల్‌ను ప్రశ్నించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ► ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నిర్వహణ బాధ్యతలను ఏపీకి అప్పగించారని.. కానీ, ఎడమ గట్టు కేంద్రాన్ని తెలంగాణ అధీనంలో ఉంచారని.. అదే సాగర్ నిర్వహణ బాధ్యతలను తెలంగాణకు అప్పగించారని.. కానీ, ఏపీ భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను తెలంగాణ అధీనంలో ఉంచడంపైనా ప్రశ్నించనున్నారు. ► తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి.. శ్రీశైలం, సాగర్లను బోర్డు పరిధిలోకి తేవాలని డిమాండ్ చేయనున్నారు. అలాకాని పక్షంలో శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రంతోపాటు ప్రాజెక్టును పూర్తిస్థాయలో ఏపీ అధీనంలోకి తేవాలని.. సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఏపీ పరిధిలోకి తీసుకొచ్చేలా కోరాలని నిర్ణయించారు. న్యాయబద్ధంగానే నీటిని పంపిణీ చేయాలి ► కేడబ్ల్యూడీటీ–2 తుది తీర్పు వెలువడే వరకూ 2015లో జూన్ 18, 19న కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను పంపిణీ చేయాలని మరోసారి కేంద్రాన్ని కోరాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ► కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని ప్రతిపాదించనున్నారు. ► బేసిన్లో జూన్ 2, 2014 నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగానే గోదావరి జలాలను పంపిణీ చేయాలని అపెక్స్ కౌన్సిల్‌ను కోరనున్నారు. ► గోదావరి బోర్డు పరిధిని ఖరారు చేసి.. వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఆమోదించాలని కోరనున్నారు. -
పోలవరం కుడి కాల్వ విస్తరణపై చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం కుడికాల్వ సామర్థ్య విస్తరణపై తెలంగాణ అభ్యంతరాలు లేవనెత్తింది. గోదావరి మిగులు జలాల్లో వాటాలు తేల్చకుండా కాల్వ విస్తరణ ద్వారా అదనంగా 3 టీఎంసీల నీటిని తీసుకోవడంపై బోర్డుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు విఘాతం కల్గించేలా ఉన్న ఈ చర్యలను అడ్డుకోవాలని గోదావరి నదీయాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ బోర్డుకు లేఖ రాశారు. గత నెల 16న ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలను అందులో పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంత కరువు నివారణ చర్యల్లో భాగంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం వేగం పెంచడంతోపాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా డెల్టా, సాగర్ కుడి కాల్వ కింది ఆయకట్టు అవసరాలను తీర్చేందుకు పోలవరం కుడి కాల్వ సామర్థ్యాన్ని 50 వేల క్యూసెక్కులకు పెంచుతామని గవర్నర్ పేర్కొన్న విషయాన్ని బోర్డు దృష్టికి తెచ్చారు. ఈ ప్రసంగానికి బలాన్ని ఇస్తూ కొన్ని పత్రికలు పోలవరం కుడి కాల్వ ప్రస్తుత సామర్ధ్యం 17,633 క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచి మొత్తంగా 300 టీఎంసీల నీటిని తీసుకునేలా రూ.68 వేల కోట్లతో ఏపీ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని రాసిన విషయాన్ని కూడా అందులో పేర్కొన్నారు. ఈ కాల్వ సామర్థ్యం పెంపుతో ప్రస్తుతం 1.5 టీఎంసీలు తీసుకెళ్లే సామర్థ్యానికి అదనంగా మరో 3 టీఎంసీలు కలిపి రోజుకు 4.5 టీఎంసీలు తీసుకునే అవకాశం ఏపీకి ఉంటుందని బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారాæ పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణా బేసిన్ మీదుగా పెన్నా బేసిన్‌కు తరలించడం అవుతుందని తెలిపారు. ఏలూరు కెనాల్‌కు అనుమతిచ్చినట్లు ప్రస్తావన కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో 80 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీక రించేలా ఏలూరు కెనాల్‌కు పరిపాలనా అనుమతులు ఇచ్చిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే పోలవరం, పట్టిసీమ మళ్లింపు జలాలతో తెలంగాణకు దక్కే నీటివాటా విషయం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని, ఈ వాటాపై తేల్చే విషయంలో కావాలనే ఏపీ ప్రతిసారీ జాప్యం చేస్తూ బోర్డు చర్చలపై దాటవేత ధోరణి ప్రదర్శిస్తోందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో గోదా వరి మిగులు జలాల వాటాల అంశం తేలకుండా ఈ నదీ ప్రవాహాన్ని కృష్ణా బేసిన్‌కు తరలించేలా ఏపీ చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలపై ముందుకెళ్లకుండా వాటిని అడ్డుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. గోదావరి మిగులు జలాల్లో వాటాను తేల్చకుండా ఈ ప్రాజెక్టులపై ఏపీ ముందుకెళితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల డీపీఆర్‌లను బోర్డుకు సమర్పించడంతోపాటు పారదర్శకంగా ప్రాజెక్టుల ఆమోదం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. -
నెల రోజుల్లో ‘అపెక్స్’ భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న నదీజలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు నెల రోజుల్లో అపెక్స్ కౌన్సిల్ భేటీని నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఈ సమస్యలకు ఫుల్స్టాప్ పెట్టాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ భావిస్తున్నట్లు కృష్ణా, గోదావరి బోర్డు వర్గాలు తెలిపాయి. కృష్ణా బోర్డు చైర్మన్ పరమేశం, గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌లతో కేంద్ర మంత్రి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బోర్డుల వర్కింగ్ మాన్యువల్, కొత్త ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహణ వంటి అంశాలపై వారితో చర్చించారు. అపెక్స్ భేటీ ఎజెండాను పంపాలని కోరినా ఇరు రాష్ట్రాలు ఇంతవరకు పంపలేదని బోర్డు అధికారులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ మరోసారి రెండు రాష్ట్రాలకు లేఖలు రాయాలని, అప్పటికీ స్పందించకపోతే బోర్డుల దృష్టిలో ఉన్న అంశాలతో ఎజెండా ఖరారు చేసి పంపితే నెల రోజుల్లోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ నిర్వహిస్తానని వెల్లడించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటే వర్కింగ్ మాన్యువల్‌పైనా మరోసారి ఇరు రాష్ట్రాల వాదనలు విని త్వరగా ఖరారు చేయాలని సూచించినట్లు తెలిసింది. ‘జలసౌధ’లో కరోనా కలవరం.. నీటిపారుదల శాఖ కార్యాలయమైన జలసౌధలో కరోనా అంశం కలవరపెడుతోంది. ఇప్పటికే జలసౌధలో ఒక ఇంజనీర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా జిల్లాలో పనిచేస్తున్న మరో ఇంజనీర్ సైతం వైరస్ బారినపడ్డారు. దీంతోపాటే జలసౌధలోనే ఉన్న కృష్ణా, గోదావరి బోర్డులు ఈ నెల 4, 5 తేదీల్లో జరిపిన భేటీలకు హాజరైన ఓ జర్నలిస్టుకు కరోనా సోకడంతో బోర్డులో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో జలసౌధలోకి సందర్శకులకు అనుమతిని నియంత్రించారు. -
తెలంగాణతో వివాదాలు కోరుకోవట్లేదు
-
తెలంగాణతో వివాదాలు కోరుకోవట్లేదు
సాక్షి, అమరావతి : పొరుగు రాష్ట్రం తెలంగాణతో తాము ఎలాంటి వివాదాలు, విభేదాలు కోరుకోవట్లేదని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణకు గోదావరి నీటిపై ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవని, దీనిపై గోదావరి యాజమాన్య బోర్డు నుంచి సరైన స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో వివాదం ఏర్పడిన నేపథ్యంలో శుక్రవారం గోదావరి బోర్డు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్ శనివారం మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన రాయలసీమకు నీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని అన్నారు. (ముందుకెళ్లొద్దు: గోదావరి బోర్డు) గోదావరితో పాటు కృష్ణా నదీ జలాల్లో తమకు రావాల్సిన నీటినే తాము వినియోగించుకుంటున్నామని మంత్రి అనిల్ కుమార్ వివరించారు. దానిలో భాగంగానే పోతిరెడ్డిపాడు కాలువల సామర్థ్యం పెంచుతున్నామని తెలిపారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ను 2021 డిసెంబర్ కల్లా పూర్తి చేసి తీరుతామని వెల్లడించారు. ఐదేళ్లపాటు పదవిలో ఉండి పోలవరం గురించి కనీసం ఆలోచన చేయని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు దానిపై మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పోలవరాన్ని సీఎం వైఎస్ జగన్ పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ‘పోలవరం నిర్వాసితులకు ఒక్క ఇల్లు కూడా కట్టలేని అసమర్ధుడు చంద్రబాబు. వైఎస్ జగన్ పాలనకు మార్కులు వేసే సీన్ చంద్రబాబుకు లేదు. ఏడాది కాలంలోనే దేశంలో 4వ బెస్ట్ సీఎంగా వైఎస్ జగన్ నిలిచారు. చంద్రబాబు ఏనాడైనా టాప్ 5లో నిలిచారా?. లోకేష్ మొదటి షోకే వెనక్కి వెళ్లిపోయే ఫ్లాప్ సినిమా లాంటోడు. బీసీలను 30 ఏళ్లు మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. సీఎం జగన్ బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. బీసీలకు ఇన్ని పథకాలు చరిత్రలో ఏ సీఎం ప్రవేశపెట్టలేదు’ అని అన్నారు. -
తెలుగు రాష్ట్రాలకు గోదావరి బోర్డు ఆదేశం
-
ముందుకెళ్లొద్దు: గోదావరి బోర్డు
సాక్షి, అమరావతి: కేంద్ర జల్‌శక్తి శాఖ ఉత్తర్వుల ప్రకారం.. గోదావరిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని ఉభయ తెలుగు రాష్ట్రాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది. తెలంగాణలో కాళేశ్వరంతో సహా అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇవ్వాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది. గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) డీపీఆర్‌లను పరిశీలించి సాంకేతికంగా సిఫార్సు చేయాలని, అపెక్స్ కౌన్సిల్ నుంచి ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. ఈనెల 10వ తేదీలోగా డీపీఆర్‌లు ఇవ్వాల్సిందేనని ఇరు రాష్ట్రాలకు బోర్డు స్పష్టం చేసింది. అపెక్స్ కౌన్సిల్‌కు తక్షణమే అజెండాను పంపాలని మరోసారి సూచించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన గోదావరి బోర్డు సమావేశమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్, బోర్డు సభ్య కార్యదర్శి పాండే తదితరులు పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతే ప్రాతిపదిక విభజన తర్వాత అంటే 2014 జూన్ 2 తర్వాత చేపట్టినవి, సీడబ్ల్యూసీ నుంచి సాంకేతిక అనుమతి లేని ప్రాజెక్టులన్నీ కొత్తవిగానే పరిగణిస్తామని బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. 450.31 టీఎంసీల తరలింపు పనులు... ► తెలంగాణ సర్కార్ గోదావరిపై కొత్తగా ప్రాజెక్టులు చేపట్టలేదని ఆ రాష్ట్ర అధికారులు పేర్కొనటంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘గోదావరి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే 225 టీఎంసీల సామర్థ్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల, 22 టీఎంసీల సామర్థ్యంతో జీఎల్ఐఎస్–3, 70 టీఎంసీలతో సీతారామ ఎత్తిపోతల, 100 టీఎంసీలతో తుపాకులగూడెం, 23.76 టీఎంసీలతో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, 0.35 టీఎంసీల సామర్థ్యంతో భీమ్కుంద్ బ్యారేజీ, ఐదు టీఎంసీలతో చనాఖా–కోరటా, 1.20 టీఎంసీలతో పింపరాడ్–పర్సోడా బ్యారేజీల నిర్మాణాన్ని తెలంగాణ చేపట్టింది. రామప్ప లేక్ నుంచి పాకాల లేక్‌కు మళ్లింపు ద్వారా మూడు టీఎంసీలు వెరసి 450.31 టీఎంసీల గోదావరి జలాలను తరలించేలా తెలంగాణ సర్కార్ పనులు చేపట్టింది’ అని ఏపీ అధికారులు వివరించారు. డెల్టా, పోలవరం ఆయకట్టుపై తీవ్ర ప్రభావం... ► తెలంగాణ సర్కార్ కాళేశ్వరం ఎత్తిపోతల సామర్థ్యాన్ని 225 టీఎంసీల నుంచి 450 టీఎంసీలకు, సీతారామ ఎత్తిపోతల సామర్థ్యాన్ని 70 నుంచి 100 టీఎంసీలకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల 150 ఏళ్ల చరిత్ర ఉన్న గోదావరి డెల్టా, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఏపీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ కేటాయింపులే ప్రామాణికం.. ► గోదావరి జలాల్లో 967 టీఎంసీలను వినియోగించుకునేలా తెలంగాణలో ప్రాజెక్టులు చేపడతామని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారని, దీని ఆధారంగా తమ రాష్ట్రానికి గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉన్నట్లు స్పష్టమవుతోందని, వాటా జలాలను వినియోగించుకోవడానికే ప్రాజెక్టులు చేపట్టామని తెలంగాణ అధికారులు పేర్కొనడంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి కేటాయింపులకు బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికమని, అందులో తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చేశారో చూపాలని ఏపీ అధికారులు ప్రశ్నించారు. కాళేశ్వరంతో సహా అన్ని డీపీఆర్‌లు ఇవ్వాల్సిందే... ► ఈ దశలో గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ జోక్యం చేసుకుంటూ కాళేశ్వరం సహా అన్ని కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెంటనే అందజేయాలని సూచించారు. తాము పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల డీపీఆర్‌లను ఇప్పటికే ఇచ్చామని, చింతలపూడి సామర్థ్యం పెంపు డీపీఆర్‌ను అందచేస్తామని ఏపీ అధికారులు తెలిపారు. తమ ప్రభుత్వంతో చర్చించి కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇస్తామని తెలంగాణ అధికారులు బోర్డుకు వివరించారు. ► పట్టిసీమ, పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్న గోదావరి జలాలకుగానూ కృష్ణా నీటిలో తమకు 45 టీఎంసీల వాటా అదనంగా ఇవ్వాలని తెలంగాణ అధికారులు పేర్కొనటంపై ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ తీర్పు ఉమ్మడి రాష్ట్రానికి వర్తిస్తుందని, నదీ పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఆ 45 టీఎంసీలు దక్కుతాయని, ఈ అంశాన్ని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) తేల్చుతుందని స్పష్టం చేశారు. టెలిమెట్రీకి అంగీకారం.. ► గోదావరి జలాల వినియోగం లెక్కలను తేల్చడానికి టెలీమీటర్లు ఏర్పాటు చేయాలన్న బోర్డు ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. వీటిని ఏర్పాటు చేసే ప్రాంతాలను గుర్తించేందుకు సీడబ్ల్యూసీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సీపీడబ్ల్యూఆర్‌ఎస్ (పుణే) అధికారులతో కమిటీని నియమించాలని బోర్డు నిర్ణయించింది. కమిటీ నివేదిక ఆధారంగా టెలీమీటర్ల ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ► పెద్దవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ నిధులను ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో కేటాయించాలన్న గోదావరి బోర్డు ప్రతిపాదనను ఇరు రాష్ట్రాలు ఆమోదించాయి. -
తెలంగాణ వాదనపై ఏపీ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్ : గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉందన్న తెలంగాణ వాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. గోదావరి జలాలపై తెలంగాణ నీటిపారుదల అధికారులు వాదనకు ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చేసిందో చూపించాలని ఏపీ అధికారులు నిలదీశారు. కాగా గోదావరి నదిపై రెండు తెలుగు రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, వర్కింగ్ మాన్యువల్ ఖరారు, బడ్జెట్, సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై చర్చించేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన భేటీ ముగిసింది. (డీపీఆర్‌లు ఇవ్వాల్సిందే) బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికం గోదావరి బోర్డు సమావేశంలో భాగంగా గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉందన్న తెలంగాణ వాదననలు ఏపీ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన ఆధారంగా గోదావరిలో 967 టీఎంసీలు వాటా ఉంటుందని తెలంగాణ బోర్డు దృష్టికి తీసుకురాగా.. దీనిపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్‌లో తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చూపలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికంగా తీసుకోవాలని ఏపీ అధికారులు బోర్డు చైర్మన్‌కు విన్నవించారు. కొత్త ప్రాజెక్టులకు బ్రేక్.. అలాగే బచావత్ ట్రిబ్యునల్‌లో ఎక్కడా కూడా తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు చేయలేదని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ఇరు రాష్ట్రాల అధికారుల వాదనలు విన్న బోర్డు చైర్మన్ చంద్రశేఖర్.. నీటి వినియోగం లెక్కలు తేల్చేందుకు టెలీమీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని రెండు రాష్ట్రాలను ఆదేశించారు. ఈ నెల 10వ తేదీలోగా ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లు ఇవ్వాలని ఇరు రాష్ట్రాలకు సూచించారు. బోర్డు సూచనకు ఇరు ప్రభుత్వాల అధికారులు అంగీకరించారు. ఈ సమావేశంలో ఏపీ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ వాదనలు విపించారు. కేంద్రం ఆదేశాలతో.. కాగా విభజన చట్టానికి విరుద్ధంగా, ‘అపెక్స్ కౌన్సిల్’ అనుమతి లేకుండా గోదావరిపై తెలంగాణ చేపట్టిన ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు, నీటి మళ్లింపు ప్రాజెక్టులు, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు తదితర అంశాలపై గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచుతుండటాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ అనుమతించే వరకూ ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గోదావరి బోర్డు చైర్మన్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ దృష్ట్యా వాటిని నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్‌ను గోదావరి బోర్డు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బోర్డు సమావేశం జరిగింది. గురువారంమే కృష్ణా బోర్డు సమావేశం జరిగిన విషయం తెలిసిందే. -
నేడు కృష్ణా బోర్డు భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జల వివాదాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు గురువారం ఇక్కడ జలసౌధలో భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ఆరంభం అయ్యే ఈ భేటీకి బోర్డు చైర్మన్ పరమేశంతో పాటు ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ కార్యదర్శులు రజత్‌కుమార్, ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డిలు హాజరుకానున్నారు. ఇరు రాష్ట్రాలు లేవనెత్తుతున్న కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ అంశంతో పాటు, టెలిమెట్రీల వ్యవస్థ ఏర్పాటు, ఈ వాటర్ ఇయర్లో నీటి పంపిణీ, మళ్లింపు జలాల వాటా తదితర అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించనున్నారు.ఈ బోర్డులో ప్రస్తావనకు తేవాల్సిన అంశాలపై శాఖ ఇంజనీర్లు రజత్‌కుమార్‌తో చర్చించారు. బోర్డు ముందు తేవాల్సిన అంశాల వారీగా నివేదికను సిద్ధం చేసుకున్నారు. గోదావరి బోర్డు ఎజెండా ఖరారు ఇక ఈనెల 5న జరిగే గోదావరి భేటీలో చర్చికు లేవనెత్తే ఎజెండా అంశాలను గోదావరి బోర్డు సిద్ధం చేసింది. ఏపీ అభ్యంతరం చెబుతున్న కాళేశ్వరం, సీతారామ తదితర ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, బోర్డుకు నిధుల కేటాయింపు, సిబ్బంది నియామకం, టెలిమెట్రీ ఏర్పాటు తదితర అంశాలను ఎజెండాలో చేర్చింది. -
నీటి లెక్కలు తేల్చుకుందాం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాలపై నెలకొన్న వివాదాలపై వాదనలను బలంగా వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వ సన్నద్ధమైంది. గత ట్రిబ్యునళ్ల తీర్పులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులు, దక్కాల్సిన వాటాలు, వినియోగి స్తున్న జలాలపై నివేదికలు సిద్ధం చేసుకుం ది. ఏపీ అభ్యంతరం చెబుతున్న ప్రాజెక్టుల పై వాదన వినిపించడంతోపాటు మళ్లింపు జలాల్లో దక్కే వాటాలపై ఈ నెల 4న జరి గే కృష్ణా బోర్డు, 5న జరిగే గోదావరి బోర్డు భేటీల్లో తేల్చుకోనుంది. అపెక్స్ కౌన్సిల్, బోర్డు అనుమతి లేదని చెబుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు, ఈ ఏడాదిలో ప్రాజెక్టుల్లో నీటి, విద్యుత్ పంపిణీ, బోర్డులకు రావాల్సిన నిధులు, సిబ్బంది కేటాయింపు అం శాలను బోర్డులు ఎజెండాలో చేర్చాయి. సీఎం సూచనలు..: కృష్ణా, గోదావరి బోర్డు భేటీల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సీ ఎం కేసీఆర్ ఇంజనీర్లకు మార్గదర్శనం చే శారు. మంగళవారం ఇరిగేషన్ శాఖ ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, హరిరా మ్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండేతో ఆయన సమీక్షించారు. గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రం లో ఇచ్చిన జీవోలను బోర్డు ముందు పెట్టాలని సూచించారు. గోదావరిలో 954 టీ ఎంసీల వినియోగంపై జరిగిన ఒప్పం దా లు, శ్రీకృష్ణ కమిటీలో పొందుపరిచిన అంశాలను ప్రస్తావిస్తూ ఆ కేటాయింపుల్లోంచే వినియోగించుకుంటున్నామనేది గట్టిగా చె ప్పాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల, దుమ్ముగూడెం, పాలమూరు, డిండి ప్రాజెక్టులనే రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రీఇంజనీరింగ్ చేయడాన్ని బోర్డుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ నరసింహారావు రచించిన ‘జల వివాదాల దరిమిలా వ్యవసాయ రంగాల ప్రాధాన్యం’, ‘భారతదేశ నదీ వివాదాల పంపిణీ ఒప్పందాలపై సమగ్ర వీక్షణం’ పుస్తకాలను కేసీఆర్ ఆవిష్కరించారు. -
‘గోదావరి’ కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను వినియోగించుకుంటూ తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ చేసిన ఫిర్యాదులపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు స్పందించింది. గోదావరి బేసిన్లో చేపట్టిన ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై తన అభిప్రాయాలను చెప్పాలని తెలంగాణను ఆదేశించింది. కొత్తగా నిర్మిస్తున్నారని ఏపీ చెబుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని కోరింది. కాళేశ్వరం, సీతారామ, గోదావరి ఎత్తిపోతల పథకం ఫేజ్–3, తుపాకులగూడెం, మిషన్ భగీరథ, లోయర్ పెన్‌గంగపై నిర్మిస్తున్న రాజుపేట్, చనాకా–కొరట, పింపార్డ్, రామప్ప నుంచి పాకాల జలాల మళ్లింపు ప్రాజెక్టులకు గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే తెలంగాణ ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఈనెల 14న ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేసింది. దిగువ రాష్ట్రాల ప్రాజెక్టుల అవసరాలకు విఘాతం కలిగించేలా తెలంగాణ ఈ ప్రాజెక్టులను నిర్మిస్తోందని, పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి వీటిని చేపడుతోందని ఏపీ.. బోర్డు దృష్టికి తెచ్చింది. ఈ ఫిర్యాదుపై అభిప్రాయాలను వెంటనే తెలియజేయాలని తెలంగాణను కోరుతూ గోదావరి బోర్డు సభ్యుడు పీఎస్ కుటియాల్ బుధవారం తెలంగాణకు లేఖ రాశారు. తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతలను 225 నుంచి 450 టీఎంసీలకు, సీతారామ ఎత్తిపోతలను 70 నుంచి 100 టీఎంసీలకు పెంచుతున్నారని ఏపీ లేవనెత్తిన అంశాలను లేఖలో బోర్డు ప్రస్తావించింది. ఏపీ అభ్యంతరాలు చెబుతున్న ఈ ప్రాజెక్టులపై గతేడాది ఆగస్టులోనే చర్చించామని, ప్రాజెక్టుల వివరాలు మాత్రం తెలంగాణ ఇంకా బోర్డుకు సమర్పించలేదని గుర్తు చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 85(8)(డి) ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు కట్టినా బోర్డుకు ప్రతిపాదన పంపాలని, జల వివాదాల ఉల్లంఘనæ జరగడం లేదని తేలాకే బోర్డు అనుమతులు ఇస్తుందని, ఆ తరువాతే ప్రాజెక్టులపై ముందుకెళ్లాలన్నారు. పదో షెడ్యూల్ పేరా–7 ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై చేపట్టే ప్రాజెక్టులకు అపెక్స్ అనుమతి తప్పనిసరన్న విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. ఇప్పటికైనా ఏపీ చేసిన ఫిర్యాదుపై తెలంగాణ తన అభిప్రాయాన్ని చెప్పడంతో పాటు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కోరింది. -
కృష్ణా కథ మళ్లీ మొదటికి!
సాక్షి, అమరావతి: కృష్ణానదీ జలాల బోర్డు వర్కింగ్ మాన్యువల్, రెండోదశ టెలీమీటర్ల ఏర్పాటు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. గోదావరి బోర్డు తరహాలో కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్‌ను ఆమోదించలేమని తెలంగాణ సర్కార్ పేర్కొంది. కృష్ణా బోర్డు చైర్మన్‌కు ఓటు హక్కు ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించగా తెలంగాణ సర్కార్ అందుకు అభ్యంతరం తెలిపింది. ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను తెలంగాణ తోసిపుచ్చింది. రెండోదశలో టెలీమీటర్ల ఏర్పాటు ప్రాంతాలపైనా ఏకాభిప్రాయం కుదరలేదు. కృష్ణా నదీజలాల బోర్డు ఇన్ఛార్జ్ చైర్మన్ హెచ్‌కే సాహూ నేతృత్వంలో బోర్డు బుధవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. బోర్డు అధికారులతోపాటు సభ్య కార్యదర్శి పరమేశం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీఈ నారాయణరెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా నాగేంద్రరావు దీనికి హాజరయ్యారు. గోదావరి బోర్డు తరహాలోనే కృష్ణా బోర్డు వర్కింగ్ మ్యాన్యువల్ రూపకల్పనపై చర్చ జరిగింది. గోదావరి బోర్డు వర్కింగ్ మ్యాన్యువల్ ప్రకారం చైర్మన్‌కు ‘విచక్షణ’ అధికారాలుంటాయి. ఓటు హక్కు కూడా ఉంటుంది. బోర్డు సమావేశంలో ఏదైనా ఒక అంశంపై ఓటింగ్ నిర్వహిస్తే రెండు రాష్ట్రాలకూ సమానంగా ఓట్లు వస్తే చైర్మన్ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే కృష్ణా బోర్డు చైర్మన్‌కు ఓటు హక్కు కల్పించే ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించింది. ఈ మేరకు వర్కింగ్ మ్యాన్యువల్‌లో మార్పులు చేయాలని పేర్కొంది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చాకేనన్న తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డు పరిధిలోకి తెచ్చి నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో తెలంగాణ సర్కార్ విభేదించింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడి అమల్లోకి వచ్చేవరకూ బోర్డు పరిధిని నిర్ణయించరాదంది. దీంతో వర్కింగ్ మాన్యువల్ కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. టెలీమీటర్లపై మరోసారి చర్చకు నిర్ణయం రెండు రాష్ట్రాల అభిప్రాయాల మేరకు వర్కింగ్ మాన్యువల్‌లో మార్పుచేర్పులు చేస్తామని బోర్డు ఇన్చార్జ్ చైర్మన్ హెచ్‌కే సాహూ తెలిపారు. రెండోదశలో 29 ప్రదేశాల్లో టెలీమీటర్లు ఏర్పాటు చేయాలని బోర్డు ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్‌లోని 21 ప్రదేశాల్లో, తెలంగాణలోని 8 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించింది. శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద టెలీమీటర్లు ఏర్పాటు చేస్తే సరిపోతుందని తెలిపింది. కండలేరు, సోమశిల తదితర ప్రాజెక్టుల వద్ద వీటి ఏర్పాటు అవసరం లేదంది. పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వద్ద సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) ఏర్పాటు చేసిన టెలీమీటర్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన అన్ని ఎత్తిపోతల పథకాలపై టెలీమీటర్లు అమర్చాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ సర్కార్ తోసిపుచ్చింది. చిన్న నీటివనరుల విభాగంతోపాటు మధ్య తరహా ప్రాజెక్టుల కింద వినియోగిస్తున్న కృష్ణా జలాల లెక్కలను తెలంగాణ సర్కార్ వెల్లడిస్తే ఎత్తిపోతల పథకాల లెక్కలు చెప్పడానికి తాము సిద్ధమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెండో దశ టెలీమీటర్ల ఏర్పాటుపై మరోసారి చర్చించాలని బోర్డు నిర్ణయించింది. -
‘గోదావరి’లో టెలిమెట్రీ అక్కర్లేదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల్లో తెలుగు రాష్ట్రాలు చేస్తున్న నీటి వినియోగ లెక్కలు పక్కాగా ఉండేందుకు ఏర్పాటు చేస్తున్న టెలిమెట్రీ వ్యవస్థను గోదావరి బేసిన్ ప్రాజెక్టుల పరిధిలో అమలు చేయాలన్న బోర్డు ఆలోచనలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. గోదావరి బేసిన్ పరిధిలో ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ఉమ్మడి ప్రాజెక్టులు, నీటి లభ్యత విషయంలో వివాదాలు లేనప్పుడు టెలిమె ట్రీ వ్యవస్థ ఎందుకని, అక్కర్లేదని తెలంగాణ చెప్పింది. దీనిపై ఇటీవల గోదావరి బోర్డుకు లేఖ రాసింది. అప్పటి వరకు పక్కన పెట్టండి.. గోదావరి బేసిన్‌లోని నిజాంసాగర్, సింగూరు, శ్రీరాంసాగర్, దేవాదుల, తుపాకులగూడెం తదితర ప్రాజెక్టుల పరిధిలోని 120 ప్రాంతాల్లో టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. దీనిపై తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ఇరు రాష్ట్రాలను కోరింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరిలో ఇరు రాష్ట్రాల నీటి వినియోగ లెక్కలు పక్కాగా ఉన్నాయని తెలిపింది. గోదా వరి బేసిన్లో సరిపడా లభ్యత జలాలు ఉన్నాయని, ఇవికాక ఏటా వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తా యని తెలిపింది. గోదావరి, దాని ఉపనదులు, ప్రధా న డ్యామ్ ప్రాంతాల్లో 27 గేజ్ డేటా స్టేషన్లు ఉన్నాయని, ఇవన్నీ కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో సక్రమంగా నిర్వహిస్తున్నారని వివరించింది. ఈ గేజ్ స్టేషన్ల ద్వారా ఎప్పటికప్పుడు గోదావరి ప్రవాహాలు, వరద అంచనా, గణింపు జరుగుతున్నాయని పేర్కొంది. ఒకమారు కృష్ణా బేసిన్లో టెలి మెట్రీ వ్యవస్థను అమలు పరిస్తే, తర్వాత భవిష్యత్తులో గోదావరి బేసిన్లో ఈ వ్యవస్థను అమలు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించింది. అప్పటి వరకు టెలిమెట్రీ అంశాన్ని పక్కన పెట్టడం మంచిదని తెలి పింది. దీనిపై గోదావరి బోర్డు ఎలా స్పందిస్తుందన్న ది వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే కృష్ణా బేసిన్ పరి« దిలో తొలి విడతలో 18, రెండో విడతలో 29 ప్రాం తాల్లో టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటుకు రెండేళ్ల కింద నిర్ణయించినా అమలు కాలేదు. దీంతో గోదావరి బేసిన్ పరిధిలో టెలిమెట్రీ ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
‘సీతారామ’పై కొత్త ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకంపై గోదావరి బోర్డు మళ్లీ కొత్త ప్రశ్నలు లేవనెత్తింది. ప్రాజెక్టు పాతదేనని తెలంగాణ స్పష్టం చేసినా, దాన్ని పరిగణనలోకి తీసుకోని బోర్డు మళ్లీ ప్రశ్నలు సంధించింది. నిర్మాణ ప్రాంతం, ఆయకట్టు, నీటి పరిమాణం, వ్యయం మారాయంటూ దానిపై సమాధానాలు కోరింది. ఈ మేరకు శుక్రవారం ఓ లేఖ ద్వారా రాష్ట్రాన్ని ఆదేశించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి జలాలను తీసుకుంటూ రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇందిరాసాగర్ ఇన్‌టేక్‌కు చెందిన పనులు ఏపీలోకి వెళ్లడం, రాజీవ్‌సాగర్ పనులన్నీ వన్యప్రాణి క్షేత్రంలో ఉండటంతో వీటిని సమీకృతం చేసి కొత్తగా సీతారామ ఎత్తిపోతలను చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏదేని కొత్త ప్రాజెక్టు చేపడితే దానికి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం)కు సమర్పించిన నివేదికలో ఈ ప్రాజెక్టు లేనందున దీన్ని కొత్త ప్రాజెక్టుగా గుర్తిస్తామని గోదావరి బోర్డు గతంలోనే తెలిపింది. దీనిపై వివరణ ఇచ్చిన తెలంగాణ కాళేశ్వరం మాదిరే దీన్ని రీ–డిజైన్ చేశామని అందుకే పాత ప్రాజెక్టుగా గుర్తించాలని కోరింది. దీనిపై బోర్డు ప్రశ్నలు లేవనెత్తింది. గతంలో రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా 33 టీఎంసీల నీటినే తీసుకోవాలని ఉందని, ప్రస్తుత రీ–డిజైన్‌లో దాన్ని 70 టీఎంసీలకు పెంచారని, ఇక గతంలో ఆయకట్టు 3.24లక్షలుండగా, దాన్ని 6.74లక్షల ఎకరాలకు పెంచారని, వ్యయం రెండు ప్రాజెక్టులకు కలిపి రూ.3,505 కోటుండగా, అది 13,384.80కోట్లకు పెరిగిందని, ఈ దృష్ట్యా దీన్ని కొత్త ప్రాజెక్టుగా ఎందుకు పరిగణించరాదని ప్రశ్నించింది. -
‘సీతారామ’ కొత్తదా? పాతదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల కొత్తదా, పాతదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ప్రాజెక్టు పాతదేనని రాష్ట్రం పలుమార్లు స్పష్టం చేసినా దీన్ని కొత్త ప్రాజెక్టుగానే పరిగణిస్తామంటూ గోదావరి బోర్డు పదేపదే లేఖలు రాస్తుండటం వివాదానికి దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పాతదే అని చెప్పడానికి గల కారణాలను పేర్కొంటూ మరోసారి లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి జలాలను తీసుకుంటూ రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇందిరాసాగర్ ఇన్‌టేక్‌కు సంబంధించిన పనులు ఏపీలోకి వెళ్లాయి. ఇక రాజీవ్‌సాగర్ పనులన్నీ వన్యప్రాణి క్షేత్రంలో ఉండటంతో అటవీ అను మతులు ఇబ్బందిగా పరిణమించాయి. దీంతో దీన్ని రీ ఇంజనీరింగ్ చేసిన ప్రభుత్వం రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను సమీకృతం చేసి గోదావరి నుంచి 50 టీఎంసీల జలాలను తీసుకుంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5లక్షల ఎకరాలకు నీరిచ్చేలా సీతారామ ఎత్తిపోతలను చేపట్టింది. అనంతరం గోదావరి నీటిని 70 టీఎంసీలు తీసుకునే వెసులుబాటు ఉందని గుర్తించి, అందుకు అనుగుణంగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్‌ల్లోని ఆయకట్టుతో తాగు, పరిశ్రమల అవసరాలకు నీరిచ్చే అవకాశం ఉందని గుర్తించి.. దీనికిఅనుగుణంగా ఆయకట్టును 5లక్షల నుంచి 6.74 లక్షల ఎకరాలకు పెంచారు. ఏడాదిగా ఇదే తీరు..: మారిన డిజైన్‌కు అనుగుణంగా కేంద్ర సంస్థల నుంచి అనుమతి కోరుతూ గత ఏడాదే ప్రభుత్వం కేంద్రానికి రిపోర్టు పంపింది. దీనిపై స్పందించిన సీడబ్ల్యూసీ గోదావరి బోర్డు నుంచి వివరణ కోరింది. అయితే అప్పటికే ఏపీ చేసిన ఫిర్యాదుల దృష్ట్యా, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏదేని కొత్త ప్రాజెక్టు చేపడితే దానికి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరని, గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్ (జీఓఎం)కు సమర్పించిన నివేదికలో ఈ ప్రాజెక్టు లేనందున దీన్ని కొత్త ప్రాజెక్టుగా గుర్తిస్తామని తెలిపింది. దీనిపై అంతకుముందు గోదావరి బోర్డు సమావేశాల్లో తెలంగాణ వివరణ ఇచ్చినా, దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కొత్త ప్రాజెక్టేనని చెబుతూ వచ్చింది. ఇటీవల సైతం ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తమకు సమర్పించాలని బోర్డు రాష్ట్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో బోర్డుకు వివరణ ఇచ్చేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. కాళేశ్వరం ఎత్తిపోతల మాదిరే రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పాత ప్రాజెక్టులనే రీ డిజైన్ చేశామని, కాళేశ్వరం పాతదేనని కేంద్ర జల సంఘం గుర్తించినప్పుడు సీతారామ సైతం పాతదే అన్న అభిప్రాయాన్ని బోర్డుకు తెలియజేయాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి బోర్డుకు లేఖ రాసే అవకాశాలున్నట్లు తెలిసింది. -
కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం
ధర్మారం: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం శివారులో నిర్మిస్తున్న ప్యాకేజీ 6 టన్నెల్ పనులను శుక్రవారం కృష్ణా, గోదావరి బోర్డు కార్యదర్శుల బృందం సందర్శించింది. కృష్ణాబోర్డు మెంబర్ కార్యదర్శి పరమేశం, గోదావరి బోర్డు మెంబర్ కార్యదర్శి డాక్టర్ సమీర్ చటర్జీ ఆధ్వర్యంలో ప్యాకేజీ 6 లోని సర్జిఫూల్, పంపుహౌస్, విద్యుత్ సబ్‌స్టేషన్, టన్నె ల్ నిర్మాణాలను తిలకించారు. ప్రాజెక్టు ఎస్ఈ వెంకట్రాములు ఆధ్వర్యంలో ఏఈ ఉపేందర్ నిర్మాణ వివరాల ప్రయోజనాలు బృందం సభ్యులకు వివరించారు. కార్యదర్శులు చటర్జీ, పరమేశంలు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ద్వా రా గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రం సస్యశ్యామలవుతుందన్నారు. -
టెలీమెట్రీలపై కదలిక!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ఏర్పాటు చేస్తున్న టెలీమెట్రీలపై ఎట్టకేలకు కృష్ణాబోర్డులో కదలిక వచ్చింది. టెలీమెట్రీ వ్యవస్థను కార్యాచరణలోకి తీసుకురావడంలో జాప్యంపై తెలంగాణ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో వాటిని అమల్లోకి తెచ్చే దిశగా రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏర్పాటుచేసిన టెలీమెట్రీ ప్రాంతాల్లో వాటి పనితీరును పరిశీలించేందుకు ప్రత్యేక సాంకేతిక నిపుణులతో అధ్యయనం చేయిస్తోంది. బుధవారం సోమర్ కంపెనీకి చెందిన నిపుణులు, బోర్డు సభ్యులు పోతిరెడ్డిపాడు ప్రాంతంలో పర్యటించి టెలీమెట్రీల పనితీరును పరిశీలించారు. వాస్తవానికి మొదటి విడతలో 18 చోట్ల టెలీమెట్రీల ఏర్పాటు ఈ ఏడాది మే నాటికే పూర్తయినా కార్యరూపంలోకి రాలేదు. దీంతో ప్రాజెక్టుల వద్ద నీటి వినియోగం ఇంకా మాన్యువల్‌గానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పోతిరెడ్డిపాడు కింది వినియోగంపై అనేక ఆరోపణలొచ్చాయి. దీనికి తోడు ఇక్కడ ఏర్పాటు చేసిన టెలీమెట్రీని ట్యాంపరింగ్ చేసి లెక్కలు తారుమారు చేశారని గత బోర్డు సమావేశంలో తెలంగాణ ఫిర్యాదు చేసింది. అయితే టెలీమెట్రీలు అధికారికంగా అమల్లోకి రానందున ట్యాంపరింగ్ అవకాశం లేదని బోర్డు వివరణ ఇచ్చింది. అయినా కూడా కేంద్ర జల వనరుల శాఖకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. దీనిపై టెలీమెట్రీ వ్యవస్థలో అనుభవం ఉన్న సాంకేతిక నిపుణులతో పరిశీలన మొదలు పెట్టింది. శుక్రవారం వీరు పోతిరెడ్డిపాడు కింద పర్యటించి ప్రవాహ లెక్కలను పరిశీలించారు. శనివారం శ్రీశైలం, అనంతరం నాగార్జునసాగర్, జూరాల పరిధిలో పర్యటించనున్నారు. గోదావరిపై త్రిసభ్య కమిటీ.. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల పరిధిలో సైతం టెలీమెట్రీ వ్యవస్థల ఏర్పాటుకు ప్రాంతాలను నిర్ధారించేందుకు గోదావరి బోర్డు కమిటీ ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులు ఇద్దరు, బోర్డు నుంచి ఒకరు సభ్యులుగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. -
వర్కింగ్ మాన్యువల్ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ తెలంగాణ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నియంత్రణ అంశంపై గోదావరి బోర్డు ముందు తన వాదనను గట్టిగా వినిపించేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చేనెల రెండోవారంలో సమావేశం ఉంటుందని బోర్డు స్పష్టం చేయడం, అందులో వర్కింగ్ మాన్యువల్ అంశాన్ని ప్రధానాంశంగా చేర్చడంతో దీనిపై ఎలా సమాధానమివ్వాలనే దాన్ని ఇప్పటికే డ్రాఫ్ట్ నోట్ సిద్ధంచేసింది. గోదావరి బోర్డుకు వర్కింగ్ మాన్యువల్ అక్కర్లేదని స్పష్టం చేయాలని నిర్ణయించింది. గోదావరిలోని ప్రాజెక్టులకింద ఇరురాష్ట్రాలు నీటిని కానీ, విద్యుత్నుగానీ పంచుకోనప్పుడు వాటిని ఉమ్మడి ప్రాజెక్టులుగా భావించలేమని, వాటిని బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదని తెలంగాణ మొదటి నుంచీ చెబుతోంది. అయితే దీనికి విరుద్ధ వాదనలు వినిపిస్తున్న ఏపీ, ప్రాజెక్టులను నియంత్రించాల్సిందేనంటూ కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర జల సంఘం, గోదావరి బోర్డులపై ఒత్తిడి తెస్తోంది. దీనికి తలొగ్గిన బోర్డు తెలంగాణకు చెందిన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లిలు, ఏపీకి చెందిన సర్ అర్థర్‌కాటన్ బ్యారేజీలు తమ పరిధిలోకి తెచ్చుకునే యత్నాలు చేస్తోంది. ఈ వివాదమే కొనసాగుతుండగా, తాజాగా ఎస్సారెస్పీ స్టేజ్ 1, 2, అలీసాగర్–గుత్ప, సదర్‌మఠ్, దేవాదుల, తుపాకులగూడెం, ప్రాణహిత–చేవెళ్ల, కాళేశ్వరంలను బోర్డు నియంత్రణలో ఉంచాలని కోరుతోంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలంగాణ... ప్రాజెక్టులపై బోర్డు పర్యవేక్షణ సరిపోతుందని, నియంత్రణ అక్కర్లేదని గట్టిగా వాదించాలని భావిస్తోంది. -
కాళేశ్వరం... పాత ప్రాజెక్టే
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కాదని, ముమ్మాటికీ పాత ప్రాజె క్టేనని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలం గాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో కేంద్ర జల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సూచనలు, ఇచ్చిన సలహాల మేరకే పాత ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టామని వివరించింది. గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కిన నికర జలాలను వినియోగించుకుంటూనే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని, ఈ అంశంలో ఎలాంటి అంత ర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారం లేదని వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టని, దానికి కేంద్రం, బోర్డు నుంచి అనుమతులు లేవంటూ ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) తమకు సమర్పిం చాలని ఇప్పటికే బోర్డు తెలంగాణను కోరింది. అయితే డీపీఆర్ సమర్పించలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని గత నెలలో విన్నవించింది. దీనికి నీటిపారుదలశాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషీ సానుకూలత తెలపడంతో శుక్రవారం సాయం త్రం ఆయన చాంబర్లో బోర్డు చైర్మన్ హెచ్‌కే సాహూ భేటీ అయ్యారు. తెలంగాణ తరఫున ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు హాజర య్యారు. గోదావరి జలాల లభ్యత, వినియోగం, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు, రీ ఇంజనీరింగ్ అవ సరం, రిజర్వాయర్ల సామర్ధ్యం పెంపు వల్ల పెరి గిన అంచనా వ్యయాలపై జోషీ వివరణ ఇచ్చారు. అన్నింటిపై స్పష్టత తీసుకున్న బోర్డు... దీనిపై తమ అభిప్రాయాలను కేంద్రానికి తెలియ జేస్తామని తెలిపింది. బోర్డు వర్కింగ్ మాన్యువల్ౖ పెనా చర్చ జరిగింది. తాము అందించిన మాన్యు వల్పై అభిప్రాయాలు తెలపడంతోపాటు గోదా వరి బేసిన్ పరిధిలో చేపట్టిన, చేపట్టబోయే ప్రాజె క్టుల సమాచారాన్ని ఇవ్వాలని బోర్డు చైర్మన్ కోరగా అధికారులు అంగీకరించినట్లు సమాచారం. -
పట్టిసీమ, పోలవరం వాటాలపై ఏం చేద్దాం?
నేడు ఢిల్లీలో ఏకే బజాజ్ కమిటీతో కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్ల భేటీ సాక్షి, హైదరాబాద్: పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలపై తెలంగాణ, ఏపీ మధ్య వివాదం నేపథ్యంలో.. ఏకే బజాజ్ కమిటీతో కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు శ్రీవాత్సవ, హెచ్‌కే సాహూ బుధవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. మళ్లింపు జలాల వాటాలను ఎలా తేల్చాలి, ఇప్పటికే ట్రిబ్యునల్ చేసిన కేటా యింపులను మార్చే అధికారాలపై బోర్డు చైర్మన్లు బజాజ్ కమిటీతో చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు దక్కుతాయని, ఇం దులో భాగంగా 45 టీఎంసీలు తమకు వస్తాయని తెలంగాణ అంటోంది. గతేడాది ఏపీ ఏకంగా 53 టీఎంసీల మేర నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలిం చుకున్నా రాష్ట్రానికి చుక్క నీటి వాటా ఇవ్వలేదు. ఈ ఏడాది సైతం మరో 28 టీఎంసీల మేర వినియోగించింది. ఈ నేపథ్యంలో బోర్డు సభ్యకార్యదర్శి సమీర్ ఛటర్జీ బుధ వారం ఇరు రాష్ట్రాల ఇంజనీర్లతో భేటీ కానున్నారు. -
పులిచింతలపై నిలదీద్దాం
♦ పరిహారంపై ఏపీ తీరును ఎండగట్టేందుకు సిద్ధమైన తెలంగాణ ♦ ఇప్పటికే అక్రమ ప్రాజెక్టులపై గరంగరం ♦ పురుషోత్తపట్నం, శివభాష్యం సాగర్‌పై బోర్డుకు, కేంద్రానికి ఫిర్యాదులు ♦ మున్నేరు బ్యారేజీపైనా అభ్యంతరం ♦ తాజాగా పులిచింతలను తెరపైకి తెస్తున్న తెలంగాణ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం, బోర్డుల వద్ద అడ్డుపుల్లలు వేస్తున్న ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ ముప్పేట దాడి చేస్తోంది. ఇప్పటికే ఏపీ గోదావరిపై చేపట్టిన పురుషోత్తపట్నం, కృష్ణా నదిపై చేపట్టిన శివభాష్యం సాగర్, మున్నేరు బ్యారేజీ నిర్మాణంపై అభ్యంతరాలు తెలిపిన తెలంగాణ... తాజాగా పులిచింతల పరిహారం అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమైంది. ఏటా పులిచింతల పరిహారంపై ప్రశ్నిస్తున్నా స్పందన లేకపోవడంతో దీనిపై ఏపీని గట్టిగా నిలదీయాలన్న పట్టుదలతో ఉంది. వరుసగా అస్త్రాలు.. తెలంగాణ చేపడుతున్న అనేక ప్రాజెక్టుల విషయంలో ఏపీ జోక్యం పెరిగింది. కృష్ణా, గోదావరి జలాల్లో వాటాల మేరకు నీటి వినియోగం చేస్తున్నామని చెబుతున్నా... ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్ర జల సంఘం, బోర్డుల వద్ద ఫిర్యాదులు చేస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ.. పోలవరం ఎడమకాల్వపై ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నంపై గోదావరి బోర్డుకు ఫిర్యా దు చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కర్నూలు జిల్లాలో చేపడుతున్న శివభాష్యం సాగర్‌పైనా ఇటీవలే కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసిం ది. కృష్ణా జిల్లాలో చేపట్టిన మున్నేరు బ్యారేజీ నిర్మాణంపై కూడా అభ్యంతరాలు లేవనెత్తింది. ఈ బ్యారేజీ నిర్మాణంతో తెలంగాణ ప్రాంతం లో ముంపు ఉంటుందని సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. ఇప్పుడు పులిచింతలపై దృష్టి సారించింది. అసంపూర్ణ పునరావాసంతో ఏటా పులిచింతల కింద తెలంగాణ గ్రామాలు ముంపు బారిన పడుతున్నా ఏపీ స్పందన సరిగా లేదని తెలంగాణ గుర్రుగా ఉంది. పులిచింతలలో 45.7 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఈ నీటితో నల్లగొండ జిల్లాలో 13 గ్రామాలు ముంపునకు గురవుతు న్నాయి. ఈ గ్రామాల పునరావాసానికి పరిహా రం కింద రూ.381 కోట్లు ఖర్చవుతుందని లెక్కలు వేశారు. ఈ నిధుల విడుదలలో జాప్యం కారణంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం రేగింది. ఓ దశలో గవర్నర్ జోక్యం చేసుకోవడంతో పరిహార చెల్లింపులకు ఓకే చెప్పిన ఏపీ.. రూ.53 కోట్లు ఒకమారు, రూ.75 కోట్లు ఇంకోమారు విడుదల చేసింది. ఇవిపోను ఇంకా భూసేకరణకు రూ.20 కోట్లు, దేవాలయాల పునర్నిర్మాణానికి రూ.15 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.25 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు రూ.50 కోట్లు, ఇతర వసతులకు మొత్తంగా రూ.115 కోట్లు రావాల్సి ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని గతేడాది అక్టోబర్‌లో ఏపీకి విన్నవించింది. రూ.49 కోట్లు మాత్రమే ఇచ్చిన ఏపీ రాష్ట్రం విన్నవించిన ఆరు నెలలకు స్పందించిన ఏపీ.. పులిచింతల జలాశయంలో ముంపునకు గురైన నాలుగు ఎత్తిపోతల పథకాలను మరోచోటుకు తరలించడానికి రూ.49 కోట్ల పరిహారాన్ని గత నెల చివరి వారంలో విడుదల చేసింది. మిగతా రూ.66 కోట్లపై పేచీ పెడుతోంది. భూనిర్వాసితులు, సహాయ పునరావాస ప్యాకేజీ కింద పరిహారం ఇప్పటికే చెల్లించామని, తెలంగాణకు బకాయిలేమీ లేమని చెబుతోంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం.. ఏపీకి లేఖ రాసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై స్పందించకుంటే బోర్డులోనే తేల్చుకోవాలని భావిస్తోంది. -
పురుషోత్తపట్నం అక్రమమే
ఏపీపై గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నం ప్రాజెక్టు ముమ్మాటికీ అక్రమమేనని, ఎలాంటి అనుమతులు లేకుండానే దీన్ని చేపట్టారని రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీన్ని నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి శుక్రవారం గోదావరి బోర్డుకు లేఖ రాశారు. అందులో ఏపీ చేపట్టిన ప్రాజెక్టు వివరాలు పేర్కొంటూ ఎలా అక్రమమో వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ గోదావరి జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1,486 టీఎంసీల వినియోగంలో ఎక్కడా పురుషోత్తపట్నం ప్రస్తావన లేదని, ఆ తర్వాత సైతం దీని వివరాలలేవీ గోదావరి బోర్డుకు ఏపీ చెప్పలేదని పేర్కొన్నారు. తనకున్న కేలాయింపులను కాదని ఏపీ ఈ ప్రాజెక్టును చేపడితే తెలంగాణ నీటి వాటాల్లోని హక్కులకు భంగం తప్పదని వివరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకోలేదని ఆ లేఖలో తెలిపారు. ‘మున్నేరు’ బ్యారేజీతో రాష్ట్రంలో ముంపు కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో చేపట్టిన ‘మున్నేరు’ బ్యారేజీ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తింది. ఈ బ్యారేజీ నిర్మాణంతో తెలంగాణ ప్రాంతంలో ముంపు ఉందని కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పనులు ముందుకు సాగకుండా వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ అంతరాష్ట్ర నీటి పారుదల విభాగం అధికారులు కేంద్ర జల సంఘానికి లేఖ రాశారు. -
కాళేశ్వరానికి ఏపీ మోకాలడ్డు!
ప్రాజెక్టును అపెక్స్ కౌన్సిల్‌కు లాగే యత్నం సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకొనేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టుపై కొన్నా ళ్లుగా తెర ముందు కొట్లాడిన ఏపీ.. ఇప్పుడు తెరవెనుక దాన్ని అడ్డుకునే మంత్రాంగం నడుపుతోంది. పర్యావరణ అనుమతులు రాకుండా, వివాదాస్పద ప్రాజెక్టుగా చూపి అపెక్స్ కౌన్సిల్ ముందుకు లాగేలా ప్రయత్నిస్తోంది. దీనికి కృష్ణా బోర్డు, కేంద్ర కమిటీ లోని కొందరు సభ్యులు ఏపీకి సహకరి స్తున్నారని తెలంగాణ అనుమానిస్తోంది. ప్రాణహిత–చేవెళ్లను విభజించి.. గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో రూ.80,499.71 కోట్ల భారీ అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. ముందుగా చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రెండుగా విభ జించి దీనికి రూపకల్పన చేశారు. మొత్తంగా 150 టీఎంసీల సామర్థ్యం సమకూ రేలా 26 రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రణాళిక వేశారు. ఆ రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణా నికి మొత్తం 80వేల ఎకరాల భూమి అవసరం. పాత ప్రాజెక్టుకు ఇప్పటికే అన్ని రకాల అనుమతులున్న దృష్ట్యా సీడబ్ల్యూసీ నుంచి కొత్తగా అనుమతులు అక్కర్లేదని, కేవలం పర్యావరణ అనుమతులు తీసుకుంటే సరిపోతుందని తెలంగాణ భావించింది. అధికారుల సహాయంతో ఏపీ కొర్రీలు! మొదటగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)కు ఓకే చెప్పిన ఈఏసీ.. తర్వాత తన మినిట్స్‌లో మాత్రం ప్రాజెక్టు ఆర్థిక, సాంకేతిక సాధ్యా సాధ్యాలపై ముందుగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. ఈఏసీలోని ఓ సభ్యుడి అభ్యంతరం కారణంగానే పర్యావరణ అనుమతులు ఆగిపోయాయి. ఆ సభ్యుడు ఏపీకి అనుకూ లంగా వ్యహరిస్తున్నారని తెలంగాణ భావిస్తోంది. అదీగాక ఈఏసీ ముందు తెలంగాణ ప్రజెంటేషన్ ఇచ్చాక.. కృష్ణా బోర్డులోని కొందరు అధికారుల సూచన లతో ఏపీ సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కమిటీలో ప్రాజెక్టు అనుమతులను వ్యతిరే కించిన సభ్యుడే కేంద్రం ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ కమిటీలోనూ సభ్యుడిగా ఉన్నారు. దీంతో ఆ సభ్యుడికి కాళేశ్వరం అంశాలను వివరించి, ప్రాజెక్టును అడ్డుకునేలా ఏపీ వ్యూహ రచన చేసినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నా యి. ఇక కృష్ణా బోర్డు చైర్మనే గోదావరి బోర్డు కూ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నందున.. బోర్డులో ని ఏపీకి చెందిన అధికారులు తెలివిగా వ్యవ హరించి వివాదాన్ని గోదావరి బోర్డు ముందుకు వచ్చేలా చేశారనే వాదన వినిపి స్తోంది. బోర్డులో వివాదం పరిష్కారం కాని పక్షంలో కేంద్రమంత్రి, సీఎంల స్థాయిలో ఉన్న అపెక్స్ కౌన్సిల్ ముందుకు తీసుకెళ్లాలనే వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15న కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చిం చేందుకు గోదావరి బోర్డు చైర్మన్‌ను సీడబ్ల్యూ సీ ఆహ్వానించింది. అనంతరం 20న మరో మారు బోర్డు సమక్షంలో చర్చించనుంది. -
ప్రాజెక్టులు ఎవరి పరిధో తేల్చేద్దాం!
♦ 22న గోదావరి బోర్డు భేటీ ♦ తెలంగాణ, ఏపీలకు నోటీసులు ♦ వర్కింగ్ మాన్యువల్‌పై చర్చిద్దామని వెల్లడి ♦ 6 రాష్ట్ర ప్రాజెక్టులను తన పరిధిలోకి తీసుకెళ్త్తామన్న బోర్డు ♦ వ్యతిరేకిస్తున్న తెలంగాణ సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల నియంత్రణ అంశాన్ని తేల్చి, తుది నోటిఫికేషన్ జారీ చేసేందుకు గోదావరి బోర్డు సమాయత్తమవుతోంది. ఇప్పటికే ప్రాజెక్టుల నియంత్రణపై ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన బోర్డు.. తెలంగాణలోని ఆరు ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకుంటా మని పేర్కొంది. దీనిపై చర్చించేందుకు ఈ నెల 22న ప్రత్యేకంగా సమావేశం నిర్వ హించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సమా వేశ తేదీలపై స్పష్టతనిస్తూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ గురువారం నోటీసులు ఇచ్చా రు. ముసాయిదా నోటిఫికేషన్‌పై అభ్యంతరా లుంటే ఈ భేటీలో చర్చిద్దామని సూచించారు. బోర్డు తయారు చేసిన వర్కింగ్ మాన్యువల్‌ను సైతం నోటీసుకు జత చేసి పంపారు. ఏ ప్రాజెక్టు ఎవరి పరిధిలోకి.. తెలంగాణ సాగు, తాగు అవసరాలను తీరు స్తున్న శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టు లను తన పరిధిలోకి తెచ్చుకుంటామంటూ బోర్డు ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొం ది. ఆయా ప్రాజెక్టుల బ్యారేజీ హెడ్‌వర్క్స్, డ్యామ్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు, రెగ్యు లేటర్లతో పాటు విద్యుత్ పాంట్ల హెడ్‌వర్క్ లు, రిజర్వాయర్ల పరిధిలోని ఎత్తిపోతల పథ కాలు, నీటి విడుదల చేసే ఇతర నిర్మాణాలన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయని తెలిపింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్లో రాష్ట్ర విభజన సమ యానికి ఉన్న నీటి కేటారుుంపులనే విని యోగించుకోవాలంది. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. గోదావరిలో 1,480 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా.. 880 టీఎం సీలకు మించి వాడటం లేదని... మొత్తంగా తెలంగాణకు 954.23 టీఎంసీల వాటా ఉంటే 450 టీఎంసీలే వినియోగమవుతున్నాయని, ఏపీకి ఉన్న 530 టీఎంసీల వాటాలో 450 టీఎంసీలే వినియోగిస్తోందని వివరించింది. ఈ వినియోగాలు ఏ రాష్ట్ర ప్రయోజనాలను కూడా దెబ్బతీయడం లేదని స్పష్టం చేసింది. అసలు గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టులేవీ లేనందున వాటిని బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదని వివరించింది. ఏపీ అడ్డగోలు వాదనలు ఏపీ మాత్రం బోర్డు ఎదుట అడ్డగోలు వాదనలు చేస్తోంది. ముసాయిదాలో బోర్డు పేర్కొన్న ఆరు ప్రాజెక్టులతోపాటు తెలంగాణ చేపడుతున్న కాళేశ్వరం, తమ్మిడిహట్టి, రాజాపేట, ఛనాఖా-కొరట, పింపార్డ్, తుపాకులగూడెం, సీతారామ, సదర్‌మఠ్ ప్రాజెక్టులను సైతం బోర్డు పరిధిలోకి తేవాలంటూ ఒత్తిడి తెస్తోంది. బోర్డు కూడా ఆ ఆరు ప్రాజెక్టులతో పాటు గోదావరి నీటిని వినియోగించుకుంటూ చేపట్టే ప్రాజెక్టు లన్నింటిపైనా తమ పర్యవేక్షణ ఉంటుందని తన నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ అంశాలు రాష్ట్రాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని నిర్ణయించింది. పరిష్కారం దొరక్కుంటే అపెక్స్‌కు వెళ్లొచ్చు బోర్డు గురువారం విడుదల చేసిన వర్కింగ్ మాన్యువల్‌లో అపెక్స్ కౌన్సిల్ అంశంపై స్పష్టతనిచ్చింది. ఏదైనా అంశంపై బోర్డు సమావేశంలో స్పష్టత రాని పక్షంలో, లేదా బోర్డులో తమకు పరిష్కారం దొరకదని భావించిన పక్షంలో రాష్ట్రాలు కానీ, బోర్డు కానీ నేరుగా అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లవచ్చని పేర్కొంది. ఇక పునర్విభన చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న మేరకు కేంద్రం గుర్తించి గెజిట్‌లో పేర్కొన్న ప్రాజెక్టులపై తమ నియంత్రణ ఉంటుందని స్పష్టం చేసింది. -
ఆరు రాష్ట్ర ప్రాజెక్టులపై గోదావరి బోర్డు పెత్తనం!
-
ఆరు రాష్ట్ర ప్రాజెక్టులపై గోదావరి బోర్డు పెత్తనం!
ఏపీ ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయం ► ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్, ఎల్లంపల్లి, కడెం, లోయర్ మానేరుపై అజమాయిషీ ► తమ పరిధిలోకి తీసుకుంటామంటూ ముసాయిదా నోటిఫికేషన్ ► ఏపీ నుంచి కాటన్ బ్యారేజీనే పేర్కొన్న బోర్డు ► ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టులకున్న కేటాయింపులే వాడాలని సూచన ► అభ్యంతరాలకు 29 వరకు గడువు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను వినియోగించుకుంటున్న తెలంగాణ ప్రాజెక్టులపై పెత్తనానికి గోదావరి బోర్డు తెరలేపింది. ఆంధ్రప్రదేశ్ ఒత్తిళ్లకు తలొగ్గి శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం ముసారుుదా (డ్రాఫ్ట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఏపీ నుంచి కేవలం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీయే తమ యాజమాయిషీ పరిధిలోకి వస్తుందన్న బోర్డు... తెలంగాణ సూచించిన పట్టిసీమ, తాడిపూడి, పుష్కర, వెంకటాపురం ప్రాజెక్టుల అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు. ప్రాజెక్టుల పరిధిపై ఇప్పటికే కృష్ణా బోర్డుతో నెలకొన్న వివాదం ఏకంగా అపెక్స్ కౌన్సిల్ పంచాయితీ వరకూ వెళ్లగా ప్రస్తుతం గోదావరి ప్రాజెక్టుల నియంత్రణ అంశం ఎటువైపు మళ్లుతుందనేది ఆసక్తిగా మారింది. గోదావరి బోర్డు పరిధిలోకి తేవాల్సిన ప్రాజెక్టులు, పరిధి అంశాలపై మూడు రోజుల కిందట బోర్డు చర్చించింది. ఈ సందర్భంగా బోర్డు పరిధి, నిర్వహణపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపిన బోర్డు అందుకు తగ్గట్లే శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 29 లోగా దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని అందులో స్పష్టం చేసింది. నియంత్రణ అంతా బోర్డు చేతుల్లోకి.. బోర్డు విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం ఫేజ్-1లో భాగంగా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి తెలంగాణలో ఇప్పటికే ఉన్న ఆరు ప్రాజెక్టులు, ఏపీలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ బోర్డు పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాజెక్టుల బ్యారేజీ హెడ్‌వర్క్స్, డ్యామ్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు, రెగ్యులేటర్లతోపాటు విద్యుత్ పాంట్ల హెడ్ వర్క్‌లు, రిజర్వాయర్ల పరిధిలోని ఎత్తిపోతల పథకాలు, నీటిని విడుదల చేసే ఇతర నిర్మాణాలన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయి. గతంలో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాల మరకు లేదా ట్రిట్యునల్ ఇచ్చిన అవార్డుల మేరకు ప్రాజెక్టులవారీగా చేసిన కేటారుుంపుల మేరకే మేజర్, మీడియం ప్రాజెక్టుల్లో నీటి వినియోగం చేయాలి. ఇందుకు రాష్ట్ర విభజన సమయానికి ఉన్న నీటి కేటారుుంపులనే పరిగణనలోకి తీసుకుంటారు. మైనర్ ఇరిగేషన్‌కు సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. బోర్డు పరిధిలోకి రాకున్నా, రెండు రాష్ట్రాలతో సంబంధం ఉండే ఇతర ప్రాజెక్టులను సైతం బోర్డు స్వయంగా పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరా, విద్యుదుత్పత్తిని నియంత్రించడంతోపాటు డ్యామ్, రిజర్వాయర్, రెగ్యులేటర్, కాల్వల నిర్వహణను చూస్తుంది. రిజర్వాయర్ల పరిధిలో చేపల పెంపకం అనుమతి లీజుల అంశాలన్ని పర్యవేక్షిస్తుంది. బోర్డు పేర్కొన్న లోయర్ మానేరు, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులు ఇంకా నిర్మాణ దశలో ఉన్నందున వాటికి సంబంధించిన పురోగతి నివేదికలు, డ్రాయింగ్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. కొన్ని పనులు విడిగా..మరికొన్ని ఉమ్మడిగా.. రాష్ట్రాలు, బోర్డు విడివిడిగా, సంయుక్తంగా చేయాల్సిన పనుల అంశాన్ని సైతం గోదావరి బోర్డు నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొంది. ప్రాజెక్టుల చారిత్రక వివరాలు, ప్రస్తుత డేటా, నిర్వహణ విధానం, ప్రభుత్వ నిర్ణయాలను ఆయా రాష్ట్రాలు బోర్డుకు ముందుగానే చెప్పాలి. ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చు, భద్రాతాపరమైన అంశాలు, అవసరమైన మరమ్మతులను పేర్కొనాలి. బోర్డుకు అవసరమైన అధికారులు, బడ్జెట్‌ను రాష్ట్రాలు చూసుకోవాలి. వరద పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, డ్యామ్‌ల భద్రత వంటి అంశాలను బోర్డు, రాష్ట్రాలు సంయుక్తంగా చూసుకోవాలి. వీటన్నింటికీ ముందు ఇరు రాష్ట్రాలు అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు, డ్యామ్ సేఫ్టీకి తీసుకున్న చర్యలు, గతంలో విపత్తు నిర్వహణ, కావాల్సిన నిధులకు సంబంధించిన అన్ని నివేదికలు సమర్పించాలి. -
954.2 టీఎంసీలకూ లెక్క
గోదావరిలో నీటి వాటా వినియోగంపై రాష్ట్ర ప్రణాళిక కేంద్ర జల సంఘం, గోదావరి బోర్డుకు వివరాలు సమర్పణ ఇప్పటికే ప్రాజెక్టుల కింద 433.04 టీఎంసీల వినియోగం కొత్త ప్రాజెక్టులతో 475.79 టీఎంసీలు వినియోగంలోకి 45.38 టీఎంసీల వినియోగానికి కొత్త ప్రాజెక్టులు దుర్గంగుట్ట (కంతనపల్లి) అందులో భాగమేనని వివరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరిలో హక్కుగా కలిగిన వాటా మేరకు నీటి వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం తుదిరూపు ఇచ్చింది. హక్కుగా ఉన్న 954.2 టీఎంసీల వాటాలో ప్రతి నీటి చుక్కనూ ఒడిసి పట్టేందుకు చేపట్టనున్న ప్రాజెక్టుల సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే వినియోగంలో ఉన్న 433.04 టీఎంసీల వాటాపోనూ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులతో 475.79 టీఎంసీలు, చేపట్టనున్న ప్రాజెక్టులతో మరో 45.38 టీఎంసీలను వినియోగంలోకి తేవాలని భావిస్తోంది. ఈ వివరాలను రాష్ట్ర నీటిపారుదలశాఖ... కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు పంపింది. గోదావరిపై ప్రాజెక్టుల రీ-ఇంజనీరింగ్‌తోపాటు వివిధ దశల్లో ఉన్న కొత్త ప్రాజెక్టులన్నీ తమ వాటాలోంచి నీటిని తీసుకునేందుకు ఉద్దేశించినవేనని స్పష్టం చేసింది. ఏపీ ఫిర్యాదుతో కదిలిన రాష్ట్రం... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గోదావరిలో మొత్తంగా 1,480 టీఎంసీల నీటి వాటా హక్కుగా ఉండగా విభజన అనంతరం తెలంగాణకు 954.23 టీఎంసీల వాటా దక్కింది. నీటిని సమర్థంగా వినియోగంలోకి తెచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం రీ ఇంజీనీరింగ్ పేరిట కంతనపల్లి వంటి ప్రాజెక్టుల వాటాను పెంచింది. ఇందిరా, రాజీవ్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను సమీకృతం చేసి మరింత నీటిని వినియోగంలోకి తేవాలని భావిస్తోంది. దీంతోపాటే అదనంగా గోదావరిపై వరుస బ్యారేజీల నిర్మాణం చేసి ఎక్కడికక్కడ నీటిని నిల్వ చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది. కంతనపల్లి ప్రాజెక్టుతో గిరిజన ప్రాంతాల ముంపును దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయంగా దుర్గంగుట్ట వద్ద బ్యారేజీ నిర్మాణానికి సర్వే చేయిస్తోంది. అయితే ప్రాజెక్టుల రీ-ఇంజినీరింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీడబ్ల్యూసీ, గోదావరి బోర్డులకు ఫిర్యాదు చేసింది. దుర్గంగుట్ట బ్యారేజీకి అనుమతులు లేవంటూ రెండు నెలల కిందట కేంద్రానికి లేఖలు రాసింది. దీనిపై కదిలిన సీడబ్ల్యూసీ, బోర్డు... నీటి వాటాలపై వివరణ ఇవ్వాలని తెలంగాణను ఆదేశించింది. దీనికితోడు గోదావరిలో హక్కుగా ఉన్న 954 టీఎంసీల్లో నిర్మితమైన, నిర్మితమవుతున్న, ప్రతిపాదనల దశలో ఉన్న ప్రాజెక్టుల్లో కలిపి మొత్తంగా 628.64 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోనున్నారని, మిగతావన్నీ మిగులు జలాలేనని జాతీయ జలాభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) తేల్చిచెబుతోంది. ఈ లెక్కలు తప్పని రాష్ట్రంలో మొత్తంగా 773 టీఎంసీల మేర నీటి వినియోగం ఉంటుందని రాష్ట్రం రెండు నెలల కిందటి వరకు చెబుతూ వచ్చింది. అయితే తాజాగా ఏపీ ఫిర్యాదు, కేంద్రం ఆదేశాల నేపథ్యంలో గోదావరిపై ఇప్పటికే ఉన్న, భవిష్యత్తులో వినియోగంలోకి తేనున్న నీటి వాటాలు హక్కుగా సంక్రమించిన వాటాకు సరిసమానమని స్పష్టం చేస్తూ నివేదిక సమర్పించింది. కొత్తగా 521.17 టీఎంసీల కోసం ప్రణాళిక... రాష్ట్రంలో నిర్మితమైన ప్రాజెక్టులతో మొత్తంగా 433.04 టీఎంసీల వినియోగం జరుగుతున్నట్లు అధికారుల నివేదిక చెబుతోంది. ఇందులో గోదావరి జీ-4 బేసిన్లో నిజాంసాగర్, సింగూర్, పోచారం, ఘనఫూర్ తదితర ప్రాజెక్టుల కింద 104.63 టీఎంసీలు వినియోగంలో ఉండగా జీ-5లో ఎస్సారెస్పీ-1, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి, గుత్ప ప్రాజెక్టుల కింద 135.44 టీఎంసీలు, ఇదే బేసిన్లో ఎస్సారెస్పీ దిగువన ఉన్న ఎల్లంపల్లి, కడెం, స్వర్ణ తదితర ప్రాజెక్టుల కింద 39.33 టీఎంసీలు, జీ-6లో దిగువ, ఎగువ మానేరు, శనిగరం ప్రాజెక్టుల కింద 60.88 టీఎంసీలు, జీ-7లో దిగువ పెన్‌గంగ, సాత్నాల వంటి మధ్య తరహా ప్రాజెక్టుల కింద 32.33 టీఎంసీలు, జీ-9లో పెద్దవాగు, నీల్వాయి వంటి ప్రాజెక్టుల కింద 11.54 టీఎంసీలు, జీ-10లో దేవాదుల సహా ఇతర ప్రాజెక్టుల కింద 51.77 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నట్లు లెక్కలు తేల్చారు. ఇక నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులతో మొత్తంగా 475.79 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేనున్నట్లు వివరించారు. ఇందులో ప్రధానంగా ఎస్సారెస్పీ-2 22.99 టీఎంసీలు, వరద కాల్వ-19.27, ఎల్లంపల్లి -60, ప్రాణహిత-160, కంతనపల్లి-100, దేవాదుల -60 టీఎంసీలతో చేపట్టినట్లు తెలిపారు. ఇక మరో 45.38 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని ప్రతిపాదనలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇందులో మోదికుంట వాగు-3.2 టీఎంసీలు, సంగంపల్లి-1.8, మందమర్రి 1.7, దిగువ పెన్‌గంగ-5.12 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టేవిగా చూపారు. నిర్మాణం పూర్తయిన వాటిని మినహాయిస్తే కొత్తగా 521.17 టీఎంసీలను వినియోగంలోకి తెచ్చేలా ప్రణాళికలు వేసినట్లుగా నివేదిక ద్వారా తేల్చి చెప్పారు. -
ఎవరి ‘పట్టు’ వారిదే
-
ఎవరి ‘పట్టు’ వారిదే
పట్టిసీమపై గోదావరి బోర్డు ముందు ఏపీ, తెలంగాణ భిన్నవాదనలు పోలవరంలో అంతర్భాగం కాదు ఆ ప్రాజెక్టు పూర్తిగా అక్రమం గోదావరి నీటిని ఏకపక్షంగా మళ్లించే హక్కు ఏపీకి లేదు: తెలంగాణ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమేనన్న ఏపీ ఎటూ తేల్చని బోర్డు.. కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు గోదావరి నదీ యాజమాన్య బోర్డు ముందు భిన్నవాదనలు వినిపించాయి. ప్రాజెక్టు పూర్తిగా అక్రమమని తెలంగాణ స్పష్టం చేయగా, పోలవరంలో అంతర్భాగంగానే ప్రాజెక్టును చేపట్టామని ఏపీ పేర్కొంది. తమ హక్కులకు భంగం కలిగేలా చేపడుతున్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన బాధ్యత బోర్డుపై ఉందని తెలంగాణ గట్టిగా వాదించింది. దాన్ని చేపట్టే పూర్తి హక్కు తమకు ఉందని ఏపీ కూడా అంతే గట్టిగా చెప్పడంతో బోర్డు ఎటూ తేల్చలేకపోయింది. గురువారమిక్కడి జలసౌధలో చైర్మన్ రాం శరాణ్ అధ్యక్షతన గోదావరి బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, సభ్యుడు(విద్యుత్ ) ఎస్కే పట్నాయక్, కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) సీఈ ఎన్.కె.మాథుర్, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ చీఫ్ ఇంజనీర్(అంతర్రాష్ట్ర వ్యవహారాలు) రామకృష్ణ హాజరయ్యారు. ఏడాది తర్వాత జరిగిన ఈ సమావేశంలో బోర్డు నిర్వహణ, బడ్జెట్ అంశాలను వదిలిస్తే ప్రధాన వాదన పట్టిసీమ చుట్టే తిరిగింది. తెలంగాణ వాదన ఇదీ.. పట్టిసీమపై ఏపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని తెలంగాణ వాదించింది. ‘‘పోలవరం ప్రాజెక్టులో భాగం కాని పట్టిసీమతో కొత్తగా 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ఏపీ చూస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 84(3), 85(8)కు వ్యతిరేకంగా ఏకపక్షంగా దీనిపై నిర్ణయం చేసింది. బోర్డు కానీ అపెక్స్ కౌన్సిల్ నుంచి కానీ అనుమతి తీసుకోలేదు. 1978నాటి ఒప్పందం గోదావరి నీటి వినియోగంలో ఏపీకి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది. వివిధ బేసిన్ల నుంచి వచ్చే నీటిపై ఏపీకి హక్కులు ఉండేలా ఆ ఒప్పందంలో ఉంది. ఆ హక్కులు ఇప్పుడు విభజన తర్వాత తెలంగాణకు వర్తిస్తాయి. పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే అయితే తెలంగాణకు ఆ నీటిలో వాటా ఉంటుంది. తెలంగాణను కాదని ఏకపక్షంగా గోదావరి నీటిని మళ్లించడానికి ఏపీకి హక్కు లేదు’’ అని తెలిపింది. ఏపీ ఏమందంటే..? తెలంగాణ వాదనపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగానే పట్టిసీమ చేపట్టామని తెలిపింది. పోలవరం నుంచి 80 టీఎంసీల నీటిని కుడి కాల్వ ద్వారా కృష్ణాకు మళ్లించడానికి అనుమతి ఉందని, అదే నీటిని పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా మళ్లిస్తున్నందున.. ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేద ని పేర్కొంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరంలో అంతర్భాగం అని పార్లమెంట్లో కేంద్రమంత్రి చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ సందర్భంగా తెలంగాణ చేపడుతున్న పలు కొత్త ప్రాజెక్టులు, రీ ఇంజనీరింగ్ చేస్తున్న ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం తెలిపింది. అయితే అవన్నీ ప్రాథమిక దశలో ఉన్నాయని, ఇంకా డీపీఆర్‌లు కూడా తయారు కాలేదని తెలంగాణ పేర్కొంది. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులపైనా సందిగ్ధత బోర్డు పరిధిలోకి తేవాల్సిన ప్రాజెక్టుల అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, కంతనపల్లి, దుమ్ముగూడెం వంటి ప్రాజెక్టులతోపాటు, ఎస్సారెస్పీ, నిజాంసాగర్, కడెం, అలీసాగర్, సింగూర్, సదర్‌మఠ్ బ్యారేజీలను బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ వాదించింది. దీన్ని తెలంగాణ వ్యతిరేకించింది. ప్రధాన ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ కొనసాగుతోందని, ఏ ప్రాజెక్టుకు ఎంత నీటి వాటా అన్న అంశం తేలనప్పుడు, ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం సరికాదని పేర్కొంది. అందుకు ఏపీ.. నీటి వినియోగానికి కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి ఉన్న అన్ని ప్రాజెక్టులు బోర్డు పరిధిలో ఉండాలని కోరింది. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టును కూడా బోర్డు పరిధిలో చేర్చడానికి అంగీకరించకుండా.. తమ రాష్ట్రంలోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలో చేర్చాలని అడగడం, సీలేరు విద్యుత్‌ను షెడ్యూలింగ్‌లో పేర్కొనాలని డిమాండ్ చేయడంలో అర్థం లేదని ఏపీ వాదించింది. బోర్డు పరిధిపై స్పష్టత రాకుండా సీలేరు విద్యుత్‌పై చర్చించాల్సిన అవసరం లేదంటూ ఏపీ చేసిన వాదనతో బోర్డు ఏకీభవించింది. సీలేరు విద్యుత్‌పై కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయం తీసుకుంటుందని, బోర్డులో చర్చించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బోర్డు వ్యయం రూ.8 కోట్లు: చైర్మన్ శరాణ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో బోర్డు నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకు రూ.8 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని, ఈ మొత్తాన్ని రెండు రాష్ట్రాలు చెరిసగం భరించడానికి అంగీకరించాయని సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ రాం శరాణ్ ‘సాక్షి’కి చెప్పారు. బోర్డు ముసాయిదా నియమావళికి ఇరు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని, దీన్ని కేంద్ర జల వనరుల శాఖకు పంపిస్తామని తెలిపారు. ప్రాజెక్టుల డేటా ఇవ్వడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని వెల్లడించారు. -
ఎందుకు, ఏమిటి, ఎలా?
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ చేస్తున్న రీ ఇంజనీరింగ్ ప్రణాళికలపై గోదావరి బోర్డు ముందు స్పష్టత తెచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 20న జరగనున్న బోర్డు సమావేశంలో గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులు ప్రాణహిత-చేవెళ్ల, ఇందిరమ్మ వరద కాల్వ, కంతనపల్లి, దుమ్ముగూడెం ప్రాజెక్టులపై తెలంగాణ విధానాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రీ ఇంజనీరింగ్ ద్వారా గోదావరి జలాల వినియోగం ఏమైనా పెరుగుతుందా? దిగువకు నీటి ప్రవాహాలకు ఆటంకం ఉంటుందా? తదితరాలపై తెలంగాణ వివరణ కోరే అవకాశాలున్నాయని నీటిపారుదల శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పాటే సీలేరు విద్యుత్ వినియోగం, నీరజామాధూర్ కమిటీ నివేదిక, బోర్డుకు కార్యాలయం కేటాయింపు, వాహనాల కూర్పు తదితరాలపైనా చర్చించనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. వ్యాప్కోస్ ప్రతినిధులతో ఈఎన్సీ భేటీ: గోదావరి ప్రాజెక్టులపై రాష్ట్రం నుంచి ఏపీ వివరణ కోరనున్న నేపథ్యంలో తెలంగాణ సైతం అప్రమత్తమైంది. గోదావరిపై ప్రాజెక్టుల సర్వే బాధ్యతలు చూస్తున్న వ్యాప్కోస్ సంస్థ ప్రతినిధులతో శాఖ ఈఎన్సీ మురళీధర్ బుధవారం సమావేశం నిర్వహించారు. సర్వే వివరాలపై ఆరా తీశారు. పూర్తిస్థాయి వివరాలు అందేందుకు ఆలస్యమైతే ప్రాథమిక నివేదికనైనా తమకు సమర్పించాలని ఈఎస్సీ కోరినట్లు తెలిసింది. 21న కృష్ణా బోర్డు సమావేశం: ఈ నెల 21న మరోమారు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, ఇరు రాష్ట్రాల వినియోగం, భవిష్యత్ అవసరాలపై సమావేశం చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటే ప్రస్తుతం డిసెంబర్ 15 వరకు జరిపిన కేటాయింపుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని తెలంగాణ కోరుతోంది. ముఖ్యంగా శ్రీశైలం నుంచి గతంలో నీటి విడుదలకు అనుమతిచ్చినా, 2 టీఎంసీలను తాము వినియోగించుకోలేకపోయామని, ఆ నీటిని ప్రస్తుతం జరిపిన కేటాయింపుల్లో కలపకపోవడంతో ఆ మేరకు నష్టం జరుగుతుందని తెలంగాణ ఇటీవల బోర్డు దృష్టికి తెచ్చింది. దీనిపై బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
గోదావరి బోర్డు భేటీ వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అధికారుల విజ్ఞప్తి మేరకు నేడు జరగాల్సిన గోదావరి బోర్డు సమావేశం వాయిదా పడింది. తిరిగి సెప్టెంబర్ 23న బోర్డు సమావేశం నిర్వహిస్తారు. రక్షాబంధన్‌తో పాటు అసెంబ్లీ సమావేశాలకు సమాయత్తం కావాల్సి వున్నందున భేటీని వాయిదా వేయాల్సిందిగా ఏపీ అధికారులు కోరడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. -
రేపు గోదావరి బోర్డు సమావేశం
♦ రెండు రాష్ట్రాలకు లేఖలు పంపిన బోర్డు సభ్యకార్యదర్శి ♦ భేటీలో పట్టిసీమే ప్రధానాంశం! హైదరాబాద్: గోదావరి బోర్డు సమావేశం ఈ నెల 29న జరగనుంది. రాఖీపౌర్ణమిని పురస్కరించుకుని 29న గోదావరి బోర్డుకు సెలవు దినం అయినప్పటికీ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఉన్న దృష్ట్యా శనివారమే భేటీ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి రామ్‌శరణ్ లేఖలు పంపారు. ప్రస్తుతం జరిగే సమావేశ ఎజెండాలో బోర్డుకు అధికారుల కేటాయింపు, కార్యాలయ నిర్వహణ ఖర్చులకు నిధుల అంశం వంటి ఏడు విషయాలను పొందుపరచగా, పట్టిసీమ ప్రాజెక్టు అంశంపైనే ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం 80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా అక్రమమని, రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఈప్రాజెక్టును చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బోర్డుకు ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్ కానీ, బోర్డు అనుమతి కానీ లేకుండానే ప్రాజెక్టును చేపడుతోందని, రాష్ట్ర హక్కులకు భంగం కలిగేలా చేపడుతున్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరింది. ఇది ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84(3), 85(8)లకు వ్యతిరేకంగా ఉందని, గతంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల మధ్య జరిగిన ఒప్పందం మేరకు పోలవరం ప్రాజెక్టు నుంచి మాత్రమే 80 టీఎంసీల నీటిని మళ్లించాలని, అంతకుమించి నీటిని మళ్లిస్తే, ఆ నీటిని మూడు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని పేర్కొన్నా వాటన్నింటినీ ఉల్లంఘిస్తోందని రాష్ట్రం బోర్డుకు రాసిన లేఖలో తెలిపింది. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమే అయితే 80 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాలకు ఉన్న 35 టీఎంసీల వాటాను కర్ణాటక, మహారాష్ట్రలు కృష్ణా జలాల్లో మినహాయించుకునే అవకాశం ఉంటుంది. మిగతా 45 టీఎంసీల వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినది కాగా ఆ నీటిని వాటాల మేరకు పంచుకుంటే తెలంగాణకు 19 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుందనేది రాష్ట్రం వాదనగా ఉంది. కానీ ఈ వాదనను ఏపీ కొట్టిపారేస్తోంది. ఈ అంశాన్ని బోర్డు ముందు పెట్టి అక్కడ ఏపీ చేసే వాదనను బట్టి ముందడుగు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
గోదావరి బోర్డు కొత్త చైర్మన్‌గా రామ్‌శరణ్
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ యాజమాన్య బోర్డు నూతన చైర్మన్‌గా రామ్‌శరణ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఆయన కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో లక్నో కేంద్రంగా పనిచేస్తున్న ఎగువ గంగా పరీవాహక సంస్థ చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఆయన సీనియర్ పరిపాలనా గ్రేడ్ అధికారి హోదాలో ఉండగా, హయ్యర్ పరిపాలనా గ్రేడ్ అధికారిగా పదోన్నతి కల్పించి గోదావరి బోర్డు చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. బోర్డు తొలి చైర్మన్‌గా ఉన్న ఎం.ఎస్.అగర్వాల్ ఇటీవల పదవీ విరమణ చేసిన నేపథ్యంలో.. కొత్త నియామకం జరిగింది. ఈనెల 5న ఆయన గోదావరి బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. సీడబ్ల్యూసీకి బోర్డు భేటీ నివేదిక గోదావరి బోర్డు రెండో సమావేశం వివరాలతో కూడిన నివేదికను పాత చైర్మన్ ఎం.ఎస్.అగర్వాల్ సీడబ్ల్యూసీకి సమర్పించారు. సీలేరు విద్యుత్ వివాదంపై కేంద్ర విద్యుత్ అథారిటీ(సీఈఏ) ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని, కేంద్రం నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నివేదించారు. బూర్గంపహాడ్ అంశాన్ని తెలంగాణ లేవనెత్తినా.. ఏపీ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిందని నివేదికలో పేర్కొన్నారు. -
గోదావరి బోర్డు మొక్కుబడి భేటీ
* బోర్డు చైర్మన్ పదవీ విరమణ నేపథ్యంలో సమావేశం * సీలేరు, బూర్గంపహాడ్ అంశాలను ప్రస్తావించిన తెలంగాణ * సీలేరు విద్యుత్ వివాదం కేంద్రం పరిధిలోనిదని చెప్పిన బోర్డు సాక్షి, హైదరాబాద్: గోదావరి బోర్డు రెండో సమావేశం మంగళవారం మొక్కుబడిగా సాగింది. బోర్డు చైర్మన్ ఎం.ఎస్.అగర్వాల్ బుధవారం పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన వీడ్కోలుకే పరిమితమైంది. సీలేరు విద్యుత్‌పై చర్చించినప్పటికీ, విద్యుత్ షెడ్యూలింగ్‌పై సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి వచ్చిన నివేదికకు కేంద్ర విద్యుత్ శాఖ ఆమోదం తెలపకపోవడం, ఆ నివేదిక బోర్డుకు అందకపోవడంతో ఏ విషయం తేల్చలేదు. సీలేరుపై తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అంటూ సమావేశాన్ని ముగించింది. బోర్డు తొలి సమావేశం జరిగిన సమయానికి పూర్తిస్థాయి చైర్మన్ లేరు. చైర్మన్‌గా అగర్వాల్‌ను నియమించిన తర్వాత బోర్డు భేటీ జరగలేదు. ఆయన బుధవారం పదవీ విరమణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అధ్యక్షతన ఒక్కసారైనా బోర్డు సమావేశమవ్వాలనే ఉద్దేశంతో మంగళవారం భేటీ ఏర్పాటు చేశారు. జలసౌధలో జరిగిన ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖల కార్యదర్శులు ఎస్కే జోషీ, ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావులు హాజరయ్యారు. సమావేశం అనంతరం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘బోర్డుకు అవసరమైన సదుపాయాల కల్పనకు, సిబ్బంది, నిధులను కేటాయించడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. బోర్డు మార్గదర్శకాలు, వర్కింగ్ మాన్యువల్ ముసాయిదాపై జనవరి 10లోగా అభిప్రాయాలు పంపడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. బోర్డును సాంకేతికంగా బలోపేతం చేయడానికి గోదావరి బేసిన్లో అన్ని ప్రాజెక్టుల సమాచారాన్ని అందుబాటులో ఉంచడానికి ఒప్పుకున్నాయి. బోర్డు చైర్మన్‌గా అగర్వాల్ విశిష్ట సేవలు అందించారని రెండు రాష్ట్రాలూ తెలిపాయి’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ఈ సమావేశంలో సీలేరు వివాదాన్ని ప్రస్తావించింది. ఈ ప్రాజెక్టుకు 740 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉందని, 58:42 నిష్పత్తిలో తెలంగాణకు ఇవ్వాల్సిన వాటాను ఆంధ్రప్రదేశ్ ఇవ్వడంలేదని తెలిపింది. దీనిపై ఏపీ స్పందిస్తూ.. సీలేరు ప్రాజెక్టు పూర్తిగా ఏపీకే చెందుతుందని, విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణకు సంబంధం లేదని చెప్పింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం చెబుతూ, గోదావరి పరీవాహకంలో ఉన్న ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయని, సీలేరు సైతం బోర్డు పరిధిలో అంశమేనని వాదించింది. ఈ సమయంలో బోర్డు జోక్యం చేసుకుంటూ.. దీనిపై కేంద్రం ఇవ్వాల్సిన నివేదిక రానందున ఈ అంశాన్ని తాము తేల్చలేమని, కేంద్రమే తేల్చాలని స్పష్టం చేసింది. పోలవరం ముంపును కారణంగా చూపుతూ ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో మిగతా ప్రాంతాన్నీ ఏపీలో కలపాలని వస్తున్న డిమాండ్లపై తెలంగాణ స్పష్టత కోరింది. దీనిపై ఏపీ స్పందిస్తూ, ఈ విషయంపై జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని తెలిపింది. బూర్గంపహాడ్పై తామెలాంటి లేఖలు రాయలేదని, సర్వేలు చేయలేదని స్పష్టం చేసింది. -
'గోదావరి'పై మరో రచ్చ
-
‘గోదావరి’పై మరో రచ్చ
* నదీ జలాలపై రాజుకుంటున్న కొత్త వివాదం * బూర్గంపహాడ్ మండలంలోని మిగతా గ్రామాలనూ తమకే ఇవ్వాలని కేంద్రంపై ఏపీ ఒత్తిడి * అక్కడి 10 వేల ఎకరాల ఆయకట్టు ముంపు పరిధిలోనిదేనంటూ వాదన * గోదావరి బోర్డు భేటీలో చర్చించాలంటూ పట్టు * కిన్నెరసానిలో 10 టీఎంసీల నీటిని కొట్టేసేందుకే ఆంధ్రప్రదేశ్ యత్నమంటున్న తెలంగాణ సర్కారు * ఇప్పటికే ఆ ప్రాజెక్టు పనులు 69 శాతం పూర్తి * 24న జరగనున్న బోర్డు సమావేశం.. వాదనలకు సిద్ధమవుతున్న ఇరు రాష్ట్రాల అధికారులు * పోలవరం ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న గోదావరి బోర్డు చైర్మన్ ఎంఎస్ అగర్వాల్ * నేటి నుంచి రెండు రోజులపాటు పోలవరం, గోదావరి పరీవాహక జిల్లాల్లో పర్యటన సాక్షి, హైదరాబాద్: పోలవరం ముంపు ప్రాంతాలను కలుపుకోవడం ద్వారా ఇప్పటికే సీలేరు విద్యుత్ ప్రాజెక్టును దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్... ఇప్పుడు కిన్నెరసాని నీటిపైనా కన్నేసింది. అదే ముంపును సాకుగా చూపుతూ.. పది టీఎంసీల నీటికి టెండర్ పెట్టింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ మండలం పరిధిలోని మిగతా ముంపు గ్రామాలనూ తమకే కేటాయించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకురావడంతో పాటు గోదావరి బోర్డు సమావేశంలోనూ చర్చకు పెట్టేలా యత్నాలు ముమ్మరం చేసింది. దీంతో గోదావరి నది నీటి వాడకంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరో చిచ్చు రగులుకుంటోంది. పోలవరం ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరాలు లేవనెత్తినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ ఏడు మండలాల విలీనంతో తెలంగాణకు చెందాల్సిన సీలేరు జల విద్యుత్ కేంద్రాలు కూడా ఏపీ పరిధిలోకి వెళ్లిపోయాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. గోదావరిలో నీటి లోటు ఉన్న సమయంలో ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రమే అవసరాల మేరకు నీటిని వినియోగించుకుంటే... దిగువన ఉన్న తమ పరిస్థితి ఏమిటో తేల్చాలంటూ గోదావరి బోర్డును ఆశ్రయించింది. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల అంశాన్ని కూడా బోర్డు ఎజెండాలో పెట్టాలని నిర్ణయించడం కొత్త వివాదానికి దారి తీస్తోంది. ఇంతకుముందు తెలంగాణ ముంపు గ్రామాలను ఏపీలో విలీనం చేసే క్రమంలో... ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని 11 గ్రామ పంచాయతీల్లో ఆరు పంచాయతీలు ఏపీలోకి వెళ్లాయి. ఇప్పుడు అదే పోలవరం ముంపును సాకుగా చూపుతూ మిగతా గ్రామాలను సైతం ఏపీలో కలపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లిన ఏపీ... గోదావరి బోర్డు సమావేశంలోనూ దీన్ని చర్చకు పెట్టి, బోర్డు నుంచి సానుకూలత తెచ్చుకునేలా ప్రయత్నాలు ప్రారంభించింది. అసలు ఉద్దేశం ఆ నీళ్లే.. మిగతా ముంపు గ్రామాలను ఏపీలో కలపాలన్న డిమాండ్ వెనుక అసలు ఉద్దేశం గోదావరి ఉపనది అయిన కిన్నెరసాని నీటిని సొంతం చేసుకోవడమేనని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఏటా 8 నుంచి 10 టీఎంసీల నీటి లభ్యత ఉండే ‘కిన్నెరసాని’తో కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం పారిశ్రామిక యూనిట్లకు నీటిని సరఫరా చేయాలని, 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కిన్నెరసాని ప్రాజెక్టును చేపట్టి ఇప్పటికే 69 శాతం పనులను సైతం పూర్తి చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం.. కిన్నెరసాని కింది ఆయకట్టు ప్రాంతం అంతా పోలవరం ముంపు ప్రాంతమేనని, దాన్ని విలీనం చేయకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యం కాదని వాదిస్తోంది. ఈ దృష్ట్యా 10 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న గ్రామ పంచాయతీలను మొత్తంగా ఏపీలో కలపాలని కోరుతోంది. అయితే ఈ ప్రాంతం ఏపీ పరిధిలోకి వెళితే కిన్నెరసాని నీటి వినియోగంపై పూర్తి ఆధిపత్యం ఆ రాష్ట్రం చేతుల్లోకి వెళుతుందని తెలంగాణ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంపును సాకుగా చూపి ‘కిన్నెరసాని’లో లభించే 10 టీఎంసీల నీటిని మళ్లించుకోవాలన్నదే ఏపీ ఉద్దేశమని భారీ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ‘ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక ఇ చ్చాం. తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. బోర్డు సమావేశం నాటికి పూర్తి స్థాయిలో దీనిపై నిలదీస్తాం..’ అని ఆ అధికారి చెప్పారు. ఈ నెల 24న జరగనున్న బోర్డు సమావేశంలో ఈ అంశంపై ఇరు పక్షాలు వాదనలు వినిపించనున్నాయి. నేటి నుంచి బోర్డు చైర్మన్ పర్యటన.. గోదావరి నది జలాల వాడకంపై తెలంగాణ, ఏపీల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలో... గోదావరి బోర్డు చైర్మన్ ఎంఎస్ అగర్వాల్ శుక్రవారం నుంచి రెండు మూడు రోజుల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. శుక్రవారం ఆయన ధవళేశ్వరం వద్ద పర్యటించి, అనంతరం ఉభయ గోదావరి జిల్లాల్లో, పోలవరం ముంపు ప్రాంతాల్లో పరిశీలన చేపడతారని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఆ తరువాత ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా భద్రాచలం దాకా గోదావరి నీటిమట్టాలు, దాని తీరుతెన్నులపైనా పరిశీలన చేసే అవకాశముందని పేర్కొన్నాయి. పోలవరం పర్యటనలో భాగంగా ముంపు ప్రాంతాలు, కిన్నెరసాని ప్రాజెక్టును కూడా ఆయన సందర్శించవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని.. వచ్చే బోర్డు సమావేశం నాటికి ఇరు రాష్ట్రాల అభిప్రాయాలతో పాటు తనకు ఒక అవగాహన ఉండాలనే ఆయన పర్యటిస్తున్నారని తెలిపాయి.