కేంద్ర జలసంఘాన్ని కోరాలని గోదావరిబోర్డు సమావేశంలో నిర్ణయం తీవ్రంగా వ్యతిరేకించిన ఏపీ
సందేహాలను ఇప్పటికే సీడబ్ల్యూసీ నివృత్తి చేసిందన్న బోర్డు చైర్మన్
ఏపీ అభ్యంతరాలు అసమంజసమని స్పష్టం చేసిన తెలంగాణ
వాడీవేడిగా సాగిన గోదావరి బోర్డు 16వ సమావేశం
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం– సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు డీపీఆర్‌ను టెక్నికల్ అప్రైజల్ క్లియరెన్స్ కోసం పంపించేలా కేంద్ర జలసంఘానికి సిఫారసు చేస్తున్నామని గోదావరినది యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) చైర్మన్ ముఖేష్‌కుమార్ సిన్హా తెలిపారు. ప్రాజెక్టుపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలు, అనుమానాలను సైతం రికార్డు చేసి సీడబ్ల్యూసీకి పంపిస్తామన్నారు. ఏపీ లేవనెత్తిన సందేహాల్లో చాలావాటిని ఇప్పటికే సీడబ్ల్యూసీ నివృత్తి చేసిందని చెప్పారు.
ఇంకా ఏమైనా అనుమానాలుంటే సీడబ్ల్యూసీని నేరుగా సంప్రదించవచ్చని ఏపీని సూచించారు. గోదావరిబోర్డు 16వ సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగింది. సీతారామ ఎత్తిపోతల పథకం–సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు అనుమతులపై ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. గోదావరిబోర్డు ముందు సీతారామ ప్రాజెక్టు డీపీఆర్ రాగా, దానికి టెక్నికల్ అప్రైజల్ క్లియరెన్స్ కోసం బోర్డు సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
దీంతో ప్రాజెక్టుకు అనుమతులు తుది అంకానికి చేరాయి. తదుపరి దశలో సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) డీపీఆర్‌ను పరీక్షించి క్లియరెన్స్ ఇవ్వనుంది. టీఏసీ క్లియరెన్స్ లభిస్తే ప్రాజెక్టుకు అనుమతులు లభించినట్టే భావిస్తారు. ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశమై ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆమోదిస్తే అన్ని రకాల అనుమతులు లభించినట్టే.
గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్ కుమార్, అంతర్రాష్ట్ర విభాగం సీఈ మోహన్‌కుమార్, గోదావరి బేసిన్ డీడీ సుబ్రహ్మణ్య ప్రసాద్, ఏపీ తరఫున ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర విభాగం సీఈ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఏ ప్రాతిపదికన తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు?
రెండు రాష్ట్రాల మధ్య గోదావరి నీటి పంపకాలే జరగలేదని, ఎలాంటి అవగాహన ఒప్పందం లేదని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ ఎలా క్లియరెన్సులు జారీ చేస్తుందని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావుఅభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులతో ఏపీలోని పోలవరం, గోదావరి డెల్టా సిస్టమ్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సీతారామ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తున్నామని, దీనికి అనుమతులను తిరస్కరించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో 33 టీఎంసీలను తరలించడానికి చేపట్టిన ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులకు బదులుగా 70 టీఎంసీలను తరలించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టు రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమన్నారు.
ఏపీ అభ్యంతరాలు గోదావరి బోర్డు పరిధిలోకి రావు
ఉమ్మడి రాష్ట్రంలో 1,486 టీఎంసీల గోదావరి జలాల వినియోగం కోసం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు రచించగా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పుతో పాటు ఆయా ప్రాజెక్టుల లొకేషన్లు, జలాలపై ఉన్న హక్కులను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 518 టీఎంసీల జలాలపై హక్కులు ఏర్పడుతాయని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు. ఏపీ సమర్పించిన ప్రాజెక్టుల వివరాల ప్రకారం ఆ రాష్ట్రానికి 531 టీఎంసీల జలాలపై హక్కులున్నట్టు సీడబ్ల్యూసీ తేల్చిందని, ఆ జలాలకు రక్షణ కల్పిస్తూనే తెలంగాణలోని ప్రాజెక్టులను అనుమతులు ఇస్తోందని తెలిపారు.
సీతారామ ప్రాజెక్టుపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలు, అనుమానాలు గోదావరి బోర్డు పరిధిలో రావని తెలిపారు. అవి సీడబ్ల్యూసీ పరిధిలో వస్తాయని, అక్కడే నివృత్తి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్టులకు క్లియరెన్స్‌ల విషయంలో సీడబ్ల్యూసీ ఏపీని సంప్రదించలేదని ఆ రాష్ట్రం చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను, నీటి అవసరాలను, ఆయకట్టు వివరాలను, డాక్యుమెంట్లను సీడబ్ల్యూసీకి సమర్పించినట్టు తెలిపారు.
వీటిని పరిగణ నలోకి తీసుకొని ఎగువ, దిగువ పరీవాహకంలోని రాష్ట్రాల అవసరాలన్నింటినీ పరిరక్షిస్తూ సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌లు ఇస్తోందన్నారు. ఈ విషయంలో ఏపీ అభ్యంతరాలు సమంజసం కాదన్నారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు, ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ప్రాజెక్టుల నిర్మాణ ప్రణాళికలకు అనుగుణంగానే ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment