సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలపై సునిశిత పరిశీలన చేస్తున్న గోదావరి బోర్డు.. తాజాగా సీతారామ ఎత్తిపోతలపై అనేక ప్రశ్నలు సంధించింది. ప్రాజెక్టు హైడ్రాలజీ వివరాలు, డ్రాయింగ్‌లు, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, నిధుల ఖర్చులు, వచ్చిన అనుమతులకు సంబంధించి అన్ని వివరాలు తమ ముందుంచాలని రాష్ట్రాన్ని ఆదేశించింది.
డీపీఆర్ ఆమోద ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా తాము కోరిన వివరాలన్నీ సమర్పించాలంటూ తాజాగా రాష్ట్రానికి లేఖ రాసింది. ఇందులో ప్రధానంగా.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లెక్కల ప్రకారం దుమ్ముగూడెం వద్ద గరిష్ట వరద 36 లక్షలుగా ఉన్నప్పుడు గోదావరి నీటి మట్టం 62.86 మీటర్లుగా ఉందని పేర్కొంది. 50 ఏళ్ల గరిష్ట వరద చూసినప్పుడు అత్యధిక నీటి మట్టం 60.43 మీటర్లు ఉందని చెప్పింది. కానీ, ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ 56.5 మీటర్లులో నిర్మి స్తున్నారని, గరిష్ట వరద నమోదైనప్పుడు హెడ్‌వర్క్ పనులు ముంపునకు గురయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోందన్న అనుమానాన్ని బోర్డు వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర వరదల లెక్కలతో తమకు నివేదించాలని కోరింది.
రబీకి ఎక్కడి నుంచి మళ్లిస్తారు...
ఇక గోదావరిలో వరద ఉన్న 90–120 రోజుల్లోనే గోదావరి నుంచి 70 టీఎంసీల నీటిని తీసుకుంటా మంటున్నారని, వరద ముగిశాక రబీకి అవసరమైన 29.42 టీఎంసీల నీటిని ఎక్కడి నుంచి మళ్లిస్తారో వెల్లడించాలని కోరింది. హెడ్‌రెగ్యులేటర్‌ను 400 క్యూసెక్కుల నీటిని తీసుకునేలా డిజైన్ చేయగా, కాల్వ సామర్థ్యాన్ని 256 క్యూసెక్కులకే డిజైన్ చేశారని, ఈ తేడాలెందుకో తెలపాలని కోరింది. ఇప్పటికే ప్రాజెక్టులో 50శాతం పనులు పూర్తయ్యా యని చెబుతున్నారని, అయితే ప్రస్తుతం మిగిలిన పనులు, నిధుల ఖర్చు వివరాలు తెలపాలంది.
ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ అవసరాలు, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ నిర్ధారించిన ఒక్కో యూనిట్ విద్యుత్ ధరలు, దీనికి అనుగుణంగా కాస్ట్ బెనిఫిట్ రేషియో వివరాలు అందించాలని తెలిపింది. గోదావరికి సంబంధించి తెలంగాణ, ఏపీ సరిహద్దులుగా ఉన్న కొత్త మ్యాప్‌లు, పరివా హక రాష్ట్రాలో వివిధ సందర్భాల్లో జరిగిన ఒప్పం దాల నివేదికలు తమ ముందుంచాలని తెలిపింది.
కాళేశ్వరం, సీతారామ ద్వారా 307 టీఎంసీల మేర నీటిని తెలంగాణ వినియోగిస్తుందన్నందున దుమ్ముగూడెం వద్ద లభ్యతగా ఉండే మిగతా జలాలు, సహజ(ఎకో) ప్రవాహాల వివరాలు అందించాలంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు లభించిన అన్ని రకాల అనుమతులు ముఖ్యంగా పర్యావరణ, అటవీ, రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం వంటి వివ రాలను సమర్పించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment