
క్యాపిటల్ ఘటనలో నిందితులకు క్షమాభిక్ష, టిక్‌టాక్ అంశంతోపాటు పలు ఆసక్తికర అంశాలపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం తొలిసారి వ్యక్తిగత ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఫాక్స్ న్యూస్ ఛానెల్ ప్రతినిధి సీన్ హన్నిటీ అధ్యక్షుడు ట్రంప్‌ను పలు ఆసక్తికర అంశాలపై ప్రశ్నలు సంధించగా.. తనదైన శైలిలో ఆయన స్పందించారు.
టిక్ టాక్ బ్యాన్‌పై.. చైనాలో ఆ యాప్ తయారైందని మీరు అంటున్నారు. కానీ, ఆ దేశంలో ఇంకా చాలా తయారవుతున్నాయి. మరి ఇక్కడ వాటి ప్రస్తావన ఎందుకు రావడం లేదు. కేవలం అమెరికా యువతపై నిఘా పెట్టడమే చైనా పనా?. యువత కేవలం సరదా కాలక్షేపం కోసం మాత్రమే ఆ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.
టిక్‌టాక్‌పై తాజాగా అమెరికా నిషేధం విధించగా.. దానిని ఎత్తివేసే ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టింది
👉కాపిటల్ భవనంపై దాడి కేసులో.. చాలా మంది అమాయకులు. అర్థమైందా?.
2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ హిల్(Capitol Hill) భవనంపై జరిగిన దాడి ఘటనలో పాల్గొన్న 1,600 మందికి ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. ఆ అల్లర్లలో పాల్గొన్న తన మద్దతుదారులను విడుదల చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
👉జో బైడెన్(Joe Biden) పోతూపోతూ..విశిష్ట అధికారాలను ఉపయోగించి స్వీయ క్షమాభిక్ష పెట్టుకున్నారు. తన కుటుంబ సభ్యులతో సహా తనకు కావాల్సిన వాళ్లకు క్షమాభిక్షలు ప్రసాదించుకున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. గతంలో నేను అధ్యక్షుడిగా దిగిపోయే సమయంలో.. నన్ను అలా చేయమని నా చుట్టూ ఉన్న అధికారులు సూచించారు. చివరకు.. నాకు నేనుగా క్షమాభిక్ష విధించుకునే ఆప్షన్‌ను కూడా నా ముందు ఉంచారు. కానీ, నేనెవరికీ క్షమాభిక్ష ప్రసాదించే ఉద్దేశం లేదని చెప్పా. మేం ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటప్పుడు క్షమాభిక్ష ఎందుకు?. మా వాళ్లంతా దేశభక్తులే అని అన్నారాయన.
👉ఓవల్ ఆఫీస్(అమెరికా అధ్యక్ష కార్యాలయం)కు తిరిగి రావడంపై.. స్పందిస్తూ.. ఇక్కడ బోలెడంత పని ఉంది. ద్రవ్యోల్బణం, యుద్ధాలు.. ఇలా ఎన్నో సంక్షోభాలు నడుస్తున్నాయి. అసలు ఈ టైంలో మనం ఇక్కడ ఉండాల్సింది కాదు(నవ్వుతూ..).
👉లాస్ ఏంజెల్స్ కార్చిచ్చుపై.. ఇది ముమ్మాటికీ ఆ రాష్ట్ర గవర్నర్ గావిన్ న్యూసోమ్ చేతకానితనమే. ఉత్తరాది నుంచి వచ్చే నీటిని అతను విడుదల చేయాల్సి ఉంది. తద్వారా మంటలను కట్టడి చేసే అవకాశం ఉండేది.
👉అక్రమ వలసదారుల్లో(Illegal Immigrants) నేరస్తుల సంఖ్య అధికంగానే ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి 2 కోట్లకు పైగా నేరస్తులు అమెరికాకు అక్రమంగా వలసలు వచ్చారు!. బైడెన్ పాలనతో ప్రపంచంలోని జైళ్లన్నీ ఖాళీగా మగ్గుతున్నాయి(సెటైరిక్‌గా). వలసదారుల చట్టం అమలు కోసం శాంక్చురీ సిటీలకు కేటాయించే ఫెడరల్ ఫండ్స్‌కు కోత విధించాల్సిన అవసరం ఉంది. నేను చేయగలిగిన పని అదొక్కటే అనిపిస్తోంది.
👉దేశంలో ఉగ్రవాదుల సంఖ్య పెరిగిపోయింది. వాళ్ల లెక్కలు తేల్చాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment