వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు అక్కడి భారతీయ విద్యార్థుల్లో ఆందోళనలు పెంచుతోంది. ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టడానికి వారిలో చాలామంది పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పారు. కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టాల భయమే ఇందుకు కారణం. వారిలో చాలామంది ఉన్నత చదువుల కోసం అప్పులు చేసి అమెరికా వచ్చినవాళ్లే. దాంతో తల్లిదండ్రులకు భారంగా కావద్దని పార్ట్‌టైమ్‌గా చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తుంటారు.
ఎఫ్–1 వీసాపై ఉన్న విద్యార్థులకు వారానికి 20 గంటల వరకు పని చేయడానికి అనుమతిస్తారు. కానీ చట్టం, వీసా నిబంధనలు అనుమతించని ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. కానీ ఇకపై అలాంటివి చేస్తూ పట్టుబడితే నేరుగా డీపోర్టేషనేనని ట్రంప్ హెచ్చరించడంతో మన విద్యార్థులు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. కొన్ని నెలలపాటు పరిస్థితి చూశాకే పార్ట్‌టైం కొలువులపై నిర్ణయానికి వస్తామంటున్నారు.
ధీమా పోయింది..
ఇప్పటిదాకా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చనే ధీమా ఉండేదని, ఇప్పుడది కాస్తా పోయిందని మన విద్యార్థులు ఆవేదన చెందుతుందున్నారు. ‘‘రూ.42 లక్షలు అప్పు చేసి మరీ వచ్చా. కాలేజీ కాగానే చిన్న కఫేలో రోజుకు ఆరు గంటలు పని చేసేవాన్ని. గంటకు ఏడు డాలర్ల చొప్పున ఇచ్చేవారు. నెలవారీ ఖర్చులు హాయిగా వెళ్లిపోయేవి.
కానీ ఇలా అనధికారికంగా పని చేస్తున్న వారిపై ఇమ్మిగ్రేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలియడంతో గత వారం రాజీనామా చేశా’’ఇల్లినాయీ వర్సిటీకి చెందిన ఓ భారతీయ విద్యార్థి చెప్పారు. ‘‘ఇప్పటికే నా పొదుపులో చాలావరకు వాడేశా. రూమ్మేట్స్ నుంచి అప్పు తీసుకుంటున్నా. ఇంకెంతకాలం నెట్టుకురాగలనో తెలియడం లేదు’’అని టెక్సాస్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న మరో విద్యార్థి వాపోయాడు. ఈ అనిశ్చితి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపుతోంది.
అతి పెద్ద విద్యార్థి సమూహం...
అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో మనవాళ్లు అతి పెద్ద సమూహం. ఈ విషయంలో చైనాను కూడా దాటేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) నివేదిక ప్రకారం 2022–23లో 2.69 లక్షల భారత విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. అంతకుముందు ఏడాది కంటే అది ఏకంగా 35% అధికం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment