
ప్రాణి ఏదైనా పిల్లల పట్ల చూపించే ప్రేమ, తీసుకునే జాగ్రత్తలు ఒకేతీరుగా ఉంటాయి. అందుకు తాజా ఉదాహరణ ఈ ఘటన. సోమవారం దక్షిణ కాలిఫోర్నియాలో 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఒక్కసారిగా కదలికలను గమనించిన శాన్‌డియాగో జంతు ప్రదర్శనశాలలోని ఏనుగులు అప్రమత్తమయ్యాయి. జూ సఫారీ పార్కులో ఉన్న ఆఫ్రికన్ ఏనుగుల గుంపు ఒకేచోట చేరింది. తమ పిల్లలను రక్షించుకోవడానికి వలయం ఏర్పాటు చేసింది.
మధ్యలో పిల్లలను ఉంచిన ఏనుగులు ఏ పక్క నుంచి ఏ ముప్పు ఉందోనని చుట్టుపక్కల పరిశీలించడం మొదలుపెట్టాయి. చెవులు చాచి, కళ్లు పరిసరాలను పరిశీలిస్తూ, ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నట్టుగా నిలబడి ఉన్నాయి. గుంపులో ఉన్న మగ ఏనుగు పిల్ల కూడా రక్షణ వలయంలోకి వచ్చి నిలబడింది. దానికి తల్లి ఏనుగు తొండంసాయంతో నేనున్నా అనే భరోసాను సైతం ఇచ్చింది. భూమి కంపించడం ప్రారంభించిన క్షణాల్లోనే ఏనుగులు చర్యకు దిగాయి.
ఎన్‌క్లోజర్‌లోని నిఘా కెమెరాలు ఈ దృశ్యాలను బంధించాయి. ‘అలర్ట్ సర్కిల్’అనిపిలిచే ఈ సహజ రక్షణ వలయం. బలహీనమైన సభ్యులు భయపడకుండా ఉండేందుకు ఏనుగులు ఈ విలక్షణమైన పవర్తనను కలిగి ఉంటాయి. ఇది వాటి తెలివితేటలకు, సామాజిక బంధానికి నిదర్శనమని జంతుప్రదర్శనశాల క్షీరదాల క్యూరేటర్ మిండీ ఆల్‌బ్రైట్ తెలిపారు. ఏనుగులు తమ పాదాల ద్వారా భూకంప కార్యకలాపాలను గ్రహించగలవని, ఆయా జంతువులకు ముందుగానే తెలిసిపోతుందని వెల్లడించారు. సుమారు గంట తర్వాత భూప్రకంపనలు రావడంతో ఆ గుంపు మరోసారి రక్షణ వలయాన్ని ఏర్పరిచింది. ముప్పేమీ లేదని నిర్ణయించుకున్నాకే విశ్రాంతి తీసుకుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్