Southern California
-
తుపాకుల రాజ్యం.. జనాభా కంటే వాటి సంఖ్యే ఎక్కువ
అమెరికాలో బఫెలో నగరంలో ఆదివారం ఓ శ్వేతజాతి దురహంకారి కాల్పుల్లో 10 మంది నల్ల జాతీయులు దుర్మరణం పాలయ్యారు. సోమవారం కూడా వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు బలయ్యారు. ఈ ఏడాది అక్కడ ఇప్పటికే ఇలాంటి మూకుమ్మడి కాల్పుల ఘటనలు ఏకంగా 198 జరిగాయి. అంటే సగటున వారానికి పదన్నమాట! 2017లో లాస్‌వెగాస్‌లో జరిగిన కాల్పుల్లో ఏకంగా 56 మంది పౌరులు మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారు. అమెరికాలో ఈ నిత్య మారణకాండకు అక్కడి తుపాకుల సంస్కృతే ప్రధాన కారణం. అమెరికాలో తుపాకుల సంస్కృతి దాదాపు ఆ దేశ పుట్టుకతోనే మొదలైందని చెప్పవచ్చు. బ్రిటిష్ పాలనలో ఉండగా అమెరికాలో పోలీసు వ్యవస్థ గానీ, చెప్పుకోదగ్గ భద్రతా వ్యవస్థ గానీ లేకపోవడంతో స్వీయరక్షణ కోసం పౌరులు తుపాకులు చేపట్టడం మొదలుపెట్టారు. తుపాకుల వ్యాపారంలో బ్రిటిష్ కంపెనీలు విపరీతంగా ఆర్జించాయి. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే రెండో రాజ్యాంగ సవరణ పౌరులకు తుపాకులు ధరించే స్వేచ్ఛ కల్పించింది. ఇన్నేళ్లలో తుపాకీ సంస్కృతికి దేశంలో లక్షలాది మంది బలైనా తుపాకుల చట్టానికి చిన్నాచితకా మార్పులతో సరిపెడుతూ వచ్చారు. ఇందుకు ప్రధాన కారణం అమెరికాకు చెందిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ). ఏమిటీ ఎన్ఆర్ఏ? అమెరికా అంతర్యుద్ధంలో పాలుపంచుకున్న ఇద్దరు సైనికులు తుపాకుల సంస్కృతిని ప్రచారం చేసేందుకు 1871లో ఎన్ఆర్ఏను స్థాపించారు. ప్రభుత్వం ఎప్పుడు తుపాకుల నియంత్రణకు ప్రయత్నించినా ఈ సంస్థ లాబీయింగ్‌తో దాన్ని విజయవంతంగా అడ్డుకుంటూ వస్తోంది. సెనేటర్లను ప్రలోభపెట్టేందుకు, ప్రభావితం చేసేందుకు తన దగ్గరున్న అపార వనరులను ఏటా భారీగా వెదజల్లుతోంది. పైగా మాజీ అధ్యక్షులు, నేతలు, సినీ స్టార్ల వంటి ప్రముఖులెందరో ఈ సంస్థలో సభ్యులు. ఇటీవల పరిస్థితిలో కాస్త మార్పు వస్తోంది. తుపాకుల నియంత్రణ కోసం కొన్ని సంస్థలు రంగంలోకి దిగాయి. ఎన్‌ఆర్‌ఏకు దీటుగా నిధులు సేకరించి తుపాకీ సంస్కృతి వ్యతిరేక ప్రచారానికి వెచ్చిస్తున్నాయి. ఈ సంస్థలు 2018లో తొలిసారి ఎన్ఆర్ఏ కంటే ఎక్కువగా ఖర్చు చేసినట్టు అంచనా. పౌరులదీ అదే దారి తుపాకుల వాడకం, నియంత్రణ విషయంలో అమెరికా పౌరులు కూడా రెండుగా చీలిపోయారు. తుపాకుల వాడకంపై గట్టి నియంత్రణ ఉండాలని కేవలం 52 శాతం మందే కోరుతున్నట్టు గాలప్ అనే సంస్థ 2020లో చేసిన సర్వేలో తేలింది. తుపాకుల వాడకానికి ఉన్న స్వేచ్ఛ ఇలాగే కొనసాగాలని 32 శాతం చెప్పారు. 11 శాతం మందైతే ప్రస్తుతమున్న కొద్దిపాటి నియంత్రణను కూడా ఎత్తేయాలంటున్నారు! చట్టసభ్యుల విషయానికొస్తే డెమొక్రాట్లలో 91 శాతం, రిపబ్లికన్లలో 24 శాతం తుపాకులపై నియంత్రణ డిమాండ్‌కు మద్దతిస్తున్నారు. అంగడి సరుకులు మన దగ్గర కూరగాయల దుకాణాల్లాగే అమెరికాలో అడుగడుగునా తుపాకుల దుకాణాలున్నాయి. తుపాకీ సంపాదించడం అమెరికా పౌరులకు చాలా సులువైన వ్యవహారం. 21 ఏళ్లు దాటి, నేరచరిత్ర, మానసిక సమస్యలు లేకుంటే చాలు. తుపాకీ లైసెన్సు దొరికేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికాలో ప్రతి 100 మంది పౌరులకు ఏకంగా 120 తుపాకులున్నాయి! ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న యెమన్‌లో ప్రతి ఇద్దరిలో ఒకరి వద్ద మాత్రమే తుపాకీ ఉంది. నలుగురు అధ్యక్షులు బలయ్యారు ఎక్కడపడితే అక్కడ అతి సులువుగా దొరుకుతున్న తుపాకులు అమెరికాలో విచ్చలవిడి హత్యలతో పాటు ఆత్మహత్యలకూ కారణమవుతున్నాయి. 2020లో 19,384 మంది కాల్పులకు బలైతే, కాల్చుకుని చనిపోయిన వారి సంఖ్య 24,292! నలుగురు అమెరికా అధ్యక్షులు కూడా తుపాకులకే బలైపోయారు. అబ్రహం లింకన్, జేమ్స్ ఎ.గార్ఫీల్డ్, విలియం మెకెన్లీ, జాన్ ఎఫ్.కెనెడీ తూటాలకు నేలకొరిగారు. రోనాల్డ్ రీగన్, ఆండ్రూ జాక్సన్, హారీ ఎస్.ట్రూమన్ తదితర అధ్యక్షులపై హత్యా ప్రయత్నాలు జరిగినా ప్రాణాలతో బయట పడ్డారు. తుపాకుల నీడలో ► అమెరికాలో సగటున రోజుకు 50 మందికి పైగా తుపాకులకు బలైపోతున్నారు. ► జనాభాలో 58 శాతం మంది జీవితంలో ఏదో ఒక సమయంలో తుపాకుల బెదిరింపులకు లోనైనవారే. ► దేశంలో సగటున ఏటా 37 మంది టెర్రరిస్టుల దాడిలో చనిపోతుంటే, తుపాకుల సంస్కృతికి ఏకంగా 11,000 మంది బలవుతున్నారు. ► దేశంలో 63 వేల మంది లైసెన్సుడ్ ఆయుధ వ్యాపారులున్నారు. వీరు ఏటా 83 వేల కోట్ల రూపాయల విలువైన తుపాకులు అమ్ముతున్నారు. అమెరికాలో మళ్లీ కాల్పులు మరో ముగ్గురి దుర్మరణం లాగునావుడ్స్: అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం కొనసాగుతూనే ఉంది. దక్షిణ కాలిఫోర్నియా చర్చి, హూస్టన్‌లో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు మరణించారు. దక్షిణ కాలిఫోర్నియా చర్చిలో మధ్యాహ్న భోజన సమయంలో ఒక వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులకు సమాచారమంది వారు వచ్చేలోపే కాల్పులకు ఒకరు బలవగా ఐదుగురు వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం భక్తులు దుండగున్ని బంధించారు. కాల్పులకు దిగిన వ్యక్తి 60 ఏళ్ల ఆసియా సంతతికి చెందినవాడని పోలీసులు తెలిపారు. కాల్పుల వెనుక ఉద్దేశం తెలియరాలేదు. ఇంకో ఘటనలో హూస్టన్ మార్కెట్లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. వీటిలో ఇద్దరు మరణించగా ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బఫెలోలో ఓ శ్వేతజాతి యువకుడు పదిమందిని కాల్చిచంపిన విషయం తెలిసిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రోడ్డుపై పెద్ద సంఖ్యలో పడి ఉన్న కరెన్సీ నోట్లు..
Armored Truck Spills Cash On Highway: కాలిఫోర్నియా: స్థలం: అమెరికాలో దక్షిణ కాలిఫోర్నియాలోని ఫ్రీవే రహదారి. సమయం: శుక్రవారం ఉదయం 9.15 గంటలు. దృశ్యం: రోడ్డుపై పెద్ద సంఖ్యలో పడి ఉన్న కరెన్సీ నోట్లు, ఒకరితో ఒకరు పోటీ పడుతూ వాటిని జేబుల్లో నింపుకుంటున్న జనం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శాన్‌డిగో నుంచి కాలిఫోర్నియాలోని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కార్యాలయానికి డబ్బు సంచులతో బయలుదేరిన వాహనం తలుపు మార్గమధ్యంలో అకస్మాత్తుగా తెరుచుకుంది. కొన్ని సంచులు కిందపడి పోయాయి. వాటిలోని డబ్బులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. చాలావరకు ఒక డాలర్, 20 డాలర్ల నోట్లే ఉన్నాయి. గమనించిన వాహనదారులు వాటిని జేబుల్లో వేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువైపులా రోడ్డును దిగ్బంధించారు. వాహనదారులను అడ్డుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆదేశించడంతో కొందరు ఇచ్చేశారు. చాలామంది అక్కడి నుంచి జారుకున్నారు. డెమీ బాగ్బీ అనే బాడీ బిల్డర్ ఈ దృశ్యాలన్నీ ఫోన్లో చిత్రీకరించి, ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. ఎన్ని డబ్బులు పోయాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రోడ్డుపైనే కూలిన వింటేజ్ విమానం
కాలిఫోర్నియా : దక్షిణ కాలిఫోర్నియాలో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. ఓ మినీ వింటేజ్ విమానం రోడ్డుపైనే కూలిపోయింది. ప్రయాణ సమయంలోనే కాండర్ స్క్వాడ్రన్ ఆఫీసర్స్, ఎయిర్‌మెన్స్ అసోసియేషన్‌కు చెందిన నార్త్ అమెరికన్ ఎస్ఎన్జే-5 విమాన ఇంజిన్ ఫెయిల్ అయింది. పైలట్ రాబ్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ఎవరూలేని ఓ రోడ్డుపై ల్యాండ్ చేశారు. అయితే అగోరా హిల్స్‌లోని 101 ఫ్రీవేపై ల్యాండింగ్ చేస్తుండగా విమాన రెక్క డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. లాస్ ఏంజిల్స్ కౌంటీ ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పైలట్‌ను విమానంలో నుంచి బయటకు తీశారు. తర్వాత కొద్దిసేపటికే విమానం మంటలకు ఆహుతైంది. ఈ ప్రమాదంతో కిలోమీటర్లమేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాద సమయంలో విమానంలో పైలట్ మినహా ఎవరూ లేరు. అదే సమయంలో రోడ్డుపై కూడా వాహనాలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. విమాన ఇంజిన్ ఫెయిలవ్వడంతో రద్దీగా లేని ఫ్రీవేపై ల్యాండ్ చేయాలనుకున్నానని రాబ్ తెలిపారు. ఎవరికీ గాయాలవ్వకుండా విమానాన్ని ల్యాండ్ చేయగలిగానన్నారు. -
విమానంలో మంటలు..తప్పిన పెనుప్రమాదం
-
అమెరికాలో మళ్లీ కాల్పులు
లాంగ్‌బీచ్/హూస్టన్: అమెరికాను మళ్లీ కాల్పులు వణికించాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. దక్షిణ కాలిఫోర్నియాలోని లాంగ్‌బీచ్‌లో జరిగిన ఘటనలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపటంతో ఓ వ్యక్తి మరణించాడు. తర్వాత ఆ దుండగుడిని పోలీసులు హతమార్చారు. హూస్టన్‌లోని ఆటోషాప్‌లో గతంలో పనిచేసిన ఓ వ్యక్తి తోటి ఉద్యోగులపై కాల్పులు జరిపి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. లాంగ్‌బీచ్ నగరంలోని ప్రధాన కూడలిలోని రెండంతస్తుల భవనంలో పలు ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. మధ్యాహ్నం 2.25 (స్థానిక కాలమానం ప్రకారం) గంటల ప్రాంతంలో అందరూ పనిచేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి చొరబడి అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోయాడు. కార్యాలయంలో ఉన్నవారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు డెస్కుల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. క్షణాల్లో స్పందించిన పోలీసులు కాల్పులకు పాల్పడిన వ్యక్తిని కాల్చి చంపారని మేయర్ రాబర్ట్ గార్సియా వెల్లడించారు. అటు హూస్టన్‌లో జరిగిన ఘటనలో.. ఆటో షాప్‌లో గతంలో పనిచేసిన ఓ వ్యక్తి ఇటీవలే ఉద్యోగం మానేశాడు. ఏం జరిగిందో తెలియదు గానీ.. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో (స్థానిక కాలమానం) దుకాణంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో ఉద్యోగులతోపాటు పలువురు వినియోగదారులూ షాప్‌లో ఉన్నారు. హఠాత్తుగా కాల్పులు ప్రారంభించిన ఆ వ్యక్తి ఇద్దరు ఉద్యోగులను చంపేసి బయటకు వచ్చాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. -
కాలిఫోర్నియాను వెంటాడుతున్న కార్చిచ్చు
-
అమెరికాకు తప్పిన మరో ముప్పు!
శాంటా మోనికా: అమెరికాకు మరో ముప్పు తప్పింది. ఆర్లెండో నైట్ క్లబ్ లో నరమేధం జరిగిన కొద్ది గంటల్లోనే దక్షిణ కాలిఫోర్నియాలో మరో సాయుధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ హోలాండ్ గే పరేడ్ వైపు వెళుతున్న జేఫర్సన్ విల్లేకు చెందిన జేమ్స్ వెస్లే హొవెల్(20) అనే వ్యక్తిని ఆదివారం శాంటా మోనికాలో పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి మూడు తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ హోలాండ్ లో స్వలింగ సంపర్కుల ర్యాలీలో పాల్గొనేందుకు అతడు వెళుతున్నట్టు గుర్తించారు. ఆర్లెండో నైట్ క్లబ్ దాడితో అతడికి ఏమైనా సంబంధం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. వెస్ట్ హోలాండ్ లో స్వలింగ సంపర్కుల ర్యాలీలో హింసకు పాల్పడేందుకే వెళుతున్నట్టు హొవెల్ చెప్పాడని శాంటా మోనికా పోలీస్ చీఫ్ జాక్వెలైన్ సీబ్రూక్స్ ట్వీట్ చేశారు. తర్వాత ఆమె తన ప్రకటనను సరి చేసుకున్నారు. పరేడ్ కు వెళుతున్నానని మాత్రమే అతడు చెప్పాడని తెలిపారు. హొవెల్ వెనుక ఎవరున్నారనే దానిపై ఎఫ్ బీఐ దర్యాప్త్ చేస్తోంది. అతడి ఫేస్బుక్ పోస్టింగులను పరిశీలించింది. నియంత అడాల్ఫా హిట్లర్ కోట్ ను హిల్లరీ క్లింటన్ మాటలతో పోలుస్తూ జూన్ 3న ఫొటో పోస్ట్ చేశాడు. ఎయిర్ ఫిల్టర్ కంపెనీలో హొవెల్ ఆడిటర్ గా పనిచేస్తున్నట్టు ఫేస్బుక్ స్టేటస్ లో ఉంది. -
కాలిఫోర్నియాలో భూకంపం
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో శుక్రవారం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంపన తీవ్రత 5.2గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.05 ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వీసెస్ వెల్లడించింది. తూర్పు లాస్ ఏంజెలెస్ ఏడారిలోని వాయువ్య బొరెగొ స్ప్రింగ్స్ కు 13 మైళ్ల దూరంలో భూకంపన కేంద్రాన్ని గుర్తించింది. భూకంపన తీవ్రతను మొదట 5.1 గా ప్రకటించి గంట తర్వాత 5.2 గా సవరించింది. 30 సెకన్ల పాటు భూమి కంపించినట్టు వెల్లడించింది. లాస్ ఏంజెలెస్ పశ్చిమ ప్రాంతం, శాన్ డియాగోలో ప్రకంపనల తీవ్రత కనిపించిందని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరిగినట్టు సమాచారం లేదు. 1937లో 6 తీవ్రతతో భూకంపం వచ్చిందని భూగర్భ శాస్త్రవేత్త లూసీ జోన్స్ వెల్లడించారు. 1980లో 5.3 తీవ్రతతో భూమి కంపించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. -
రాకాసి కుక్కలు చంపేశాయి
లాస్ ఎంజెల్స్: మార్నింగ్ వాక్కు వెళ్లిన 65 ఏళ్ల పెద్దాయనపై రెండు కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశాయి. ఆయన భార్యను కూడా తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటనకు సంబంధించి కుక్కల యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన ఎమిలియో రియోస్(65) అనే వ్యక్తి ప్రతి రోజు మాదిరిగానే ఉదయం లేచి తన ఇంటి ఎదురుగా ఉన్న పచ్చిక బయల్లో కాస్త నడిచి వ్యాయామం చేసేందుకు బయటకు వెళ్లాడు. అతడు అలా వెళ్లాడో లేదో వెంటనే రెండు పిట్ బుల్స్ (అమెరికా సంతతికి చెందిన కుక్కలు) ఒక్కసారిగా ఆయనపై విరుచుకు పడ్డాయి. విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశాయి. అంతటితో ఆగకుండా అతడి భార్యపై కూడా దాడికి పాల్పడ్డాయి. దాంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు రాగా అవి పరారయ్యాయి. అనంతరం వచ్చిన పోలీసులు ఆ రాకాసి కుక్కలను మత్తుమందిచ్చిపట్టుకున్నారు. అందులో ఓ పిట్ బుల్ మాత్రం మత్తుమందు ఇచ్చినా పోలీసులపై దాడి చేసే ప్రయత్నం చేసింది.