వలసదార్ల బహిష్కరణలపై గొంతెత్తిన ప్రజలు
లాస్ ఏంజెలెస్‌లో జాతీయ రహదారి దిగ్బంధం
వాషింగ్టన్: అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపడుతున్న చర్యలను వేలాది మంది వ్యతిరేకించారు. అక్రమ వలసదారులను నిర్బంధించి మూకుమ్మడిగా సామూహిక బహిష్కరణలు చేపడతానన్న ట్రంప్ నిర్ణయాన్ని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు ఆదివారం దక్షిణ కాలిఫోర్నియాలో ర్యాలీ చేపట్టారు. లాస్ ఏంజెలెస్‌లోని డౌన్‌టౌన్‌తో సహా నిరసనకారులు ప్రధాన జాతీయ రహదారిని కొన్ని గంటల పాటు దిగ్బంధించారు.
ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘ఎవ్వరూ చట్టవిరుద్ధం కాదు’, ‘ఇమ్మిగ్రెంట్స్ అమెరికాను గొప్పగా మార్చారు’వంటి నినాదాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. మధ్యాహ్నానికల్లా యూఎస్ 101లోని అన్ని మార్గాలను దిగ్బంధించడంతో ట్రాఫిక్ స్తంభించింది. కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ అధికారుల బందోబస్తు నిలవగా నిరసనకారులు వీధుల్లో బైఠాయించారు. ఫ్రీవే పూర్తిగా తెరవడానికి ఐదు గంటలకు పైగా సమయం పట్టింది.
తూర్పున రివర్‌సైడ్ నగరంలో వందలాది మంది నిరసన తెలిపారు. ఓ కూడలి వద్ద జెండాలు ఎగురవేస్తున్న నిరసనకారులకు మద్దతుగా వాహనదారులు ఆపకుండా అంతా ఒకేసారి హారన్ మోగించి తమ మద్దతు తెలిపారు. శాన్‌డియాగో నగరంలోని కన్వెన్షన్ సెంటర్ వద్ద వందలాది మంది ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అరెస్టులకు నిరసనగా డల్లాస్‌లో నిరసనకారులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఐసీఈ దాడులను నిరసిస్తూ ఆర్లింగ్టన్ నగరంలో వందలాది మంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిటీ హాల్ వెలుపల జెండాలతో నిరసన తెలిపారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా టారెంట్ కౌంటీలో నిరసనకారులు ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment