అమెరికాలో బఫెలో నగరంలో ఆదివారం ఓ శ్వేతజాతి దురహంకారి కాల్పుల్లో 10 మంది నల్ల జాతీయులు దుర్మరణం పాలయ్యారు. సోమవారం కూడా వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు బలయ్యారు. ఈ ఏడాది అక్కడ ఇప్పటికే ఇలాంటి మూకుమ్మడి కాల్పుల ఘటనలు ఏకంగా 198 జరిగాయి. అంటే సగటున వారానికి పదన్నమాట! 2017లో లాస్‌వెగాస్‌లో జరిగిన కాల్పుల్లో ఏకంగా 56 మంది పౌరులు మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారు. అమెరికాలో ఈ నిత్య మారణకాండకు అక్కడి తుపాకుల సంస్కృతే ప్రధాన కారణం.
అమెరికాలో తుపాకుల సంస్కృతి దాదాపు ఆ దేశ పుట్టుకతోనే మొదలైందని చెప్పవచ్చు. బ్రిటిష్ పాలనలో ఉండగా అమెరికాలో పోలీసు వ్యవస్థ గానీ, చెప్పుకోదగ్గ భద్రతా వ్యవస్థ గానీ లేకపోవడంతో స్వీయరక్షణ కోసం పౌరులు తుపాకులు చేపట్టడం మొదలుపెట్టారు. తుపాకుల వ్యాపారంలో బ్రిటిష్ కంపెనీలు విపరీతంగా ఆర్జించాయి. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే రెండో రాజ్యాంగ సవరణ పౌరులకు తుపాకులు ధరించే స్వేచ్ఛ కల్పించింది. ఇన్నేళ్లలో తుపాకీ సంస్కృతికి దేశంలో లక్షలాది మంది బలైనా తుపాకుల చట్టానికి చిన్నాచితకా మార్పులతో సరిపెడుతూ వచ్చారు. ఇందుకు ప్రధాన కారణం అమెరికాకు చెందిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్‌ఆర్‌ఏ).
ఏమిటీ ఎన్‌ఆర్‌ఏ?
అమెరికా అంతర్యుద్ధంలో పాలుపంచుకున్న ఇద్దరు సైనికులు తుపాకుల సంస్కృతిని ప్రచారం చేసేందుకు 1871లో ఎన్‌ఆర్‌ఏను స్థాపించారు. ప్రభుత్వం ఎప్పుడు తుపాకుల నియంత్రణకు ప్రయత్నించినా ఈ సంస్థ లాబీయింగ్‌తో దాన్ని విజయవంతంగా అడ్డుకుంటూ వస్తోంది. సెనేటర్లను ప్రలోభపెట్టేందుకు, ప్రభావితం చేసేందుకు తన దగ్గరున్న అపార వనరులను ఏటా భారీగా వెదజల్లుతోంది. పైగా మాజీ అధ్యక్షులు, నేతలు, సినీ స్టార్ల వంటి ప్రముఖులెందరో ఈ సంస్థలో సభ్యులు. ఇటీవల పరిస్థితిలో కాస్త మార్పు వస్తోంది. తుపాకుల నియంత్రణ కోసం కొన్ని సంస్థలు రంగంలోకి దిగాయి. ఎన్‌ఆర్‌ఏకు దీటుగా నిధులు సేకరించి తుపాకీ సంస్కృతి వ్యతిరేక ప్రచారానికి వెచ్చిస్తున్నాయి. ఈ సంస్థలు 2018లో తొలిసారి ఎన్‌ఆర్‌ఏ కంటే ఎక్కువగా ఖర్చు చేసినట్టు అంచనా.
పౌరులదీ అదే దారి
తుపాకుల వాడకం, నియంత్రణ విషయంలో అమెరికా పౌరులు కూడా రెండుగా చీలిపోయారు. తుపాకుల వాడకంపై గట్టి నియంత్రణ ఉండాలని కేవలం 52 శాతం మందే కోరుతున్నట్టు గాలప్ అనే సంస్థ 2020లో చేసిన సర్వేలో తేలింది. తుపాకుల వాడకానికి ఉన్న స్వేచ్ఛ ఇలాగే కొనసాగాలని 32 శాతం చెప్పారు. 11 శాతం మందైతే ప్రస్తుతమున్న కొద్దిపాటి నియంత్రణను కూడా ఎత్తేయాలంటున్నారు! చట్టసభ్యుల విషయానికొస్తే డెమొక్రాట్లలో 91 శాతం, రిపబ్లికన్లలో 24 శాతం తుపాకులపై నియంత్రణ డిమాండ్‌కు మద్దతిస్తున్నారు.
అంగడి సరుకులు
మన దగ్గర కూరగాయల దుకాణాల్లాగే అమెరికాలో అడుగడుగునా తుపాకుల దుకాణాలున్నాయి. తుపాకీ సంపాదించడం అమెరికా పౌరులకు చాలా సులువైన వ్యవహారం. 21 ఏళ్లు దాటి, నేరచరిత్ర, మానసిక సమస్యలు లేకుంటే చాలు. తుపాకీ లైసెన్సు దొరికేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికాలో ప్రతి 100 మంది పౌరులకు ఏకంగా 120 తుపాకులున్నాయి! ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న యెమన్‌లో ప్రతి ఇద్దరిలో ఒకరి వద్ద మాత్రమే తుపాకీ ఉంది.
నలుగురు అధ్యక్షులు బలయ్యారు
ఎక్కడపడితే అక్కడ అతి సులువుగా దొరుకుతున్న తుపాకులు అమెరికాలో విచ్చలవిడి హత్యలతో పాటు ఆత్మహత్యలకూ కారణమవుతున్నాయి. 2020లో 19,384 మంది కాల్పులకు బలైతే, కాల్చుకుని చనిపోయిన వారి సంఖ్య 24,292! నలుగురు అమెరికా అధ్యక్షులు కూడా తుపాకులకే బలైపోయారు. అబ్రహం లింకన్, జేమ్స్ ఎ.గార్‌ఫీల్డ్, విలియం మెకెన్లీ, జాన్ ఎఫ్.కెనెడీ తూటాలకు నేలకొరిగారు. రోనాల్డ్ రీగన్, ఆండ్రూ జాక్సన్, హారీ ఎస్.ట్రూమన్ తదితర అధ్యక్షులపై హత్యా ప్రయత్నాలు జరిగినా ప్రాణాలతో బయట పడ్డారు.
తుపాకుల నీడలో
► అమెరికాలో సగటున రోజుకు 50 మందికి పైగా తుపాకులకు బలైపోతున్నారు.
► జనాభాలో 58 శాతం మంది జీవితంలో ఏదో ఒక సమయంలో తుపాకుల బెదిరింపులకు లోనైనవారే.
► దేశంలో సగటున ఏటా 37 మంది టెర్రరిస్టుల దాడిలో చనిపోతుంటే, తుపాకుల సంస్కృతికి ఏకంగా 11,000 మంది బలవుతున్నారు.
► దేశంలో 63 వేల మంది లైసెన్సుడ్ ఆయుధ వ్యాపారులున్నారు. వీరు ఏటా 83 వేల కోట్ల రూపాయల విలువైన తుపాకులు అమ్ముతున్నారు.
అమెరికాలో మళ్లీ కాల్పులు
మరో ముగ్గురి దుర్మరణం
లాగునావుడ్స్: అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం కొనసాగుతూనే ఉంది. దక్షిణ కాలిఫోర్నియా చర్చి, హూస్టన్‌లో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు మరణించారు. దక్షిణ కాలిఫోర్నియా చర్చిలో మధ్యాహ్న భోజన సమయంలో ఒక వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులకు సమాచారమంది వారు వచ్చేలోపే కాల్పులకు ఒకరు బలవగా ఐదుగురు వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం భక్తులు దుండగున్ని బంధించారు. కాల్పులకు దిగిన వ్యక్తి 60 ఏళ్ల ఆసియా సంతతికి చెందినవాడని పోలీసులు తెలిపారు. కాల్పుల వెనుక ఉద్దేశం తెలియరాలేదు. ఇంకో ఘటనలో హూస్టన్ మార్కెట్లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. వీటిలో ఇద్దరు మరణించగా ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బఫెలోలో ఓ శ్వేతజాతి యువకుడు పదిమందిని కాల్చిచంపిన విషయం తెలిసిందే.
– సాక్షి, నేషనల్ డెస్క్
తుపాకుల రాజ్యం.. జనాభా కంటే వాటి సంఖ్యే ఎక్కువ
Published Tue, May 17 2022 5:14 AM | Last Updated on Tue, May 17 2022 8:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment