gun culture
-
డాడీ త్వరలోనే మంచి గిఫ్టు ఇస్తానన్నాడు.. అంతలోనే ఇలా..
దిల్సుఖ్నగర్ (హైదరాబాద్)/చౌటుప్పల్ రూరల్: ఉన్నత చదువులు, ఉన్నతమైన జీవితం కోసం అమెరికా వెళ్లిన యువకుడు అక్కడ దుండగుల కాల్పులకు బలయ్యా డు. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసిన రవితేజ.. మాస్టర్స్ చదివేందుకు 2022లో అమెరికాకు వెళ్లాడు. వాషింగ్టన్లో మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న కొడుకు మృతిచెందాడన్న వార్త తల్లిదండ్రులను కలచివేసింది. యాదాద్రి–భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయిలగూడెంకు చెందిన కొయ్యడ చంద్రమౌళి–సువర్ణ దంపతులు కొంతకాలం నుంచి ఆర్కే పురం డివిజన్ గ్రీన్‌హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. చంద్రమౌళి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి కుమారుడు రవితేజ (26), ఒక కుమార్తె ఉన్నారు. రవితేజ ప్రస్తుతం కనెక్టికట్‌లో ఓ రెస్టారెంట్లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం కారు అద్దెకు తీసుకొని కేక్ డెలివరీ చేయడానికి వెళ్లారు. అయితే, దుండగులు అప్పటికే చోరీకి పాల్పడి.. పారిపోయే క్రమంలో రవితేజ ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందారు. రవితేజ ఎంతసేపటికీ తిరిగి రెస్టారెంట్‌కు రాకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టిన లొకేషన్‌కు వెళ్లి చూడగా రవితేజ మృతదేహం కనిపించింది. ఈ సమాచారాన్ని సోమవారం తెల్లవారుజామున రవితేజ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రవితేజ సోదరి ఆస్పత్రికి వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో హైదరాబాద్‌లోని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో గ్రీన్‌హిల్స్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాను మాస్టర్ డిగ్రీ పట్టా అందుకునే కార్యక్రమానికి రావాలని రవితేజ తల్లిదండ్రులకు చెప్పగా వారు పాస్‌పోర్ట్, వీసా తీసుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారని, ఇంతలోనే కుమారుడు మృతి చెందడంతో వారు విషాదంలో మునిగిపోయారని బంధువులు చెప్పారు. డాడీ త్వరలోనే మంచి గిఫ్టు ఇస్తానన్నాడుతాను గత శనివారం కొడుకుతో మాట్లాడానని చంద్రమౌళి చెప్పారు. తనకు త్వరలోనే మంచి జాబ్ వస్తుందని... మిమ్మల్ని చూసుకుంటానని చెప్పాడన్నారు. త్వరలోనే నీకు మంచి గిఫ్టు ఇస్తానన్నాడని, అయితే అది ఇదేనా అంటూ ఆయన భోరున విలపించారు. తన కొడుకు మృతదేహాన్ని వెంటనే హైదరాబాద్‌కు వచ్చేలా చూడాలని చంద్రమౌళి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్.. రవితేజ కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి సహాయం చేస్తానని చెప్పారని ఆయన కార్యాలయం తెలిపింది. -
దుండగుల గమ్యం గజ్వేల్!
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకతో పాటు నగరంలో తుపాకీతో కాల్పులకు తెగబడిన దుండగులు అఫ్జల్‌గంజ్ ఫైరింగ్ తర్వాత గజ్వేల్ వెళ్లాలని భావించారు. సికింద్రాబాద్ నుంచి ఆటోను ఆ ప్రాంతానికే మాట్లాడుకున్నారు. అయితే మార్గమధ్యంలో డ్రైవర్ వ్యవహారశైలిపై వారికి అనుమానం రావడంతో తిరుమలగిరిలో దిగిపోయారని పోలీసుల తాజా దర్యాప్తులో తేలింది. రోషన్ ట్రావెల్స్‌కు చెందిన మేనేజర్ జహంగీర్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు చేస్తున్న నగర పోలీసులు వివిధ కోణాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తున్నారు. బీదర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సైతం దర్యాప్తులో పాలు పంచుకుంటోంది. ఆటో దిగి బ్యాగులు, వస్త్రాలు కొని... ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనంపై బీదర్‌లో దాడి చేసి, ఒకరిని కాల్చి పంపిన దుండగులు నగదుతో హైదరాబాద్ చేరుకున్న విషయం విదితమే. అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి రాయ్‌పూర్‌కు టిక్కెట్లు బుక్ చేసుకోవడం, మినీ బస్సులో బ్యాగుల తనిఖీ, జహంగీర్‌పై కాల్పులు తర్వాత దుండుగల గమ్యం మారింది. అఫ్జల్‌గంజ్ నుంచి ఆటో ఎక్కిన ఇద్దరూ రైలు మిస్ అవుతుందని, తొందరగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు తీసుకువెళ్లాలని డ్రైవర్‌ను కంగారు పెట్టారు. సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్ వరకు వెళ్లిన ఈ ద్వయం అక్కడ కొత్త బ్యాగ్‌లు, వస్త్రాలు ఖరీదు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో లాడ్జిల్లో గదులు ఇప్పించే దళారులు తిరుగుతూ ఉంటారు. అలాంటి ఓ వ్యక్తి వీరి వద్దకు వచ్చి రూమ్ కావాలా అంటూ ప్రశి్నంచాడు. గజ్వేల్‌లో మకాం వేయాలని ప్లాన్... తాము ఉండటానికి రూమ్ కావాలని చెప్పిన దుండగులు అయితే ఇక్కడ వద్దని, గజ్వేల్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాల్సి ఉందని చెప్పారు. అక్కడ అద్దె ఇల్లు దొరికే వరకు హోటల్లో రూమ్ కావాలని చెప్పారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద దళారి తనకు పరిచయస్తుడైన గజ్వేల్‌లోని దళారితో మాట్లాడాడు. అతడు రోజుకు రూ.1500 అద్దెకు రూమ్ సిద్ధంగా ఉందని చెప్పడంతో ఇరువురినీ గజ్వేల్ వెళ్లమని ఇక్కడి దళారి సూచించాడు. అలా వెళ్లడానికి ఆటో మాట్లాడి పెట్టమని దుండగులు కోరడంతో సికింద్రాబాద్ దళారి రూ.1500 కిరాయికి ఆటో సైతం మాట్లాడి పెట్టాడు. గజ్వేల్ దళారి నెంబర్ ఆటోడ్రైవర్‌కు ఇచ్చి, ఇద్దరినీ అతడి వద్ద దింపి రమ్మని చెప్పాడు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతూనే ఆటోడ్రైవర్ ఓసారి దళారితో మాట్లాడాడు.పదేపదే దళారీతో మాట్లాడుతుండటంతో... వీరి ఆటో బయలుదేరిన తర్వాత గజ్వేల్ దళారి రెండుసార్లు డ్రైవర్‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆటో తిరుమలగిరి వరకు వెళ్లిన తర్వాత మరోసారి కాల్ చేయడంతో దుండగులకు అనుమానం వచి్చంది. అక్కడ ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆటో ఆపమని చెప్పిన ఇరువురూ బ్యాగ్‌లతో సహా ఆటో దిగి రూ.500 చెల్లించి వెళ్లిపోయారు. అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో నగదును ట్రాలీ బ్యాగ్‌ల నుంచి మరో బ్యాగుల్లోకి మార్చుకున్నారు. ఆపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత వ్రస్తాలు సైతం మార్చేశారు. అక్కడ నుంచి మళ్లీ తిరుమలగిరి ప్రధాన రహదారి మీదికి వచ్చి బోయిన్పల్లి వైపు వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ఈ విషయాలు గుర్తించిన పోలీసులు ఇప్పటికే ఆటోడ్రైవర్లు, దళారుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేశారు.బీ–క్లాస్ పట్టణాలనే ఎంచుకుని... ఈ నేరాలు జరిగిన తీరు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు దుండగులు బీ–క్లాస్ సిటీలు, పట్టణాలనే ఎంపిక చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. పోలీసుల అప్రమత్తత, హడావుడి తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే దుండగులు ఇలా చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలోని ఈ తరహాకు చెందిన పట్టణం బీదర్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్‌లో ఫైరింగ్ తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లకుండా ఇలాంటి పట్టణమే అయిన గజ్వేల్ వెళ్లడానికి ప్రయతి్నంచారు. ఈ కీలకాంశాన్ని సైతం పరిగణలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. మరోపక్క బీదర్‌లో నేరం చేయడానికి, అక్కడ నుంచి సిటీ రావడానికి నిందితులు వినియోగించిన వాహనాన్ని సైతం హైదరాబాద్ పోలీసులు స్వాదీనం చేసుకున్నారని తెలిసింది. -
12 మందిని కాల్చి ఆపై ఆత్మహత్య
పొడ్గొరిక(మాంటెనెగ్రో): నూతన సంవత్సర సంబరాలు జరుగుతున్న వేళ మాంటెనెగ్రోలోని సెటింజె పట్టణంలో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. అకో మార్టినోవిక్(45) అనే వ్యక్తి ఉన్మాదిగా మారి బార్ యజమాని, అతడి ఇద్దరు పిల్లలతోపాటు సొంత కుటుంబ సభ్యులను సైతం పొట్టనబెట్టుకున్నాడు. స్థానిక బార్లో బుధవారం ఉదయం నుంచి మార్టినోవిక్ గడిపాడు. సాయంత్రం గొడవకు దిగి ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి తుపాకీ తీసుకుని బార్లోకి ప్రవేశించిన అతడు బార్‌లోని వారిపైకి కాల్పులకు దిగాడు. అనంతరం బయటకు వెళ్లి మరో మూడు చోట్ల కాల్పులు జరిపాడు. పోలీసులు వెంబడించడంతో అక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొడ్గొరికకు వెళ్లాడు. పోలీసులు చుట్టుముట్టడంతో తనను తాను కాల్చుకున్నాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. హింసా ప్రవృత్తి, చంచల స్వభావి అయిన మార్టినోవిక్పై గతంలో పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. యూరప్‌లోని చిన్న దేశం మాంటెనెగ్రో జనాభా 6.20 లక్షలు. ఆయుధాలను కలిగి ఉండటం ఇక్కడో సంప్రదాయం. తుపాకీ సంస్కృతి కారణంగా తరచూ నేరాలు జరుగుతుంటాయి. తాజా ఘటన జరిగిన సెటింజెలోనే 2022 ఆగస్ట్‌లో ఓ దుండగుడు ఇద్దరు చిన్నారులు సహా 10 మందిని కాల్చి చంపాడు. ఓ వ్యక్తి సకాలంలో అతడిని కాల్చి చంపడంతో మారణ హోమానికి పుల్‌స్టాప్ పడింది. -
తుపాకీ నియంత్రణకు కొత్త చట్టం
వాషింగ్టన్: అమెరికాలో తుపాకీ సంస్కృతికి చరమగీతం పాడేందుకు దేశాధ్యక్షుడు బైడెన్ కీలక చట్టం తెచ్చారు. అమెరికా అత్యున్నత అధకారమైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఈచట్టం తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై శుక్రవారం సంతకం చేశారు. కొత్త చట్టం ప్రకారం లైసెన్స్‌లేని తుపాకులు, సీరియల్ నంబర్‌లేని తుపాకులు, 3డీ పద్ధతిలో ముద్రించిన తుపాకుల కట్టడి, నిషేధంపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. సాధారణ గన్, పిస్టల్‌ను ఆటోమేటిక్ మెషీన్ గన్‌గా మార్చే యంత్రాలను నిషేధించేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం దఖలు పడనుంది. మరికొద్ది వారాల్లో అధ్యక్షుడిగా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై బైడెన్ సంతకం చేయడం గమనార్హం. 3డీ ప్రింటెడ్ గన్లను స్కానింగ్ యంత్రాలు, మెటల్ డిటెక్టర్లు కూడా గుర్తించలేకపోతున్నాయని బైడెన్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తంచేశారు. కొత్త చట్టంపై ముసాయిదా రూపకల్పన బాధ్యతలను 2023లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అప్పగించడం తెల్సిందే. ఉత్తర్వులకు ముందు అప్పీల్ ఉత్తర్వులపై సంతకం చేయడానికి ముందు అధ్యక్షుడు బైడెన్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ చేశారు. ‘‘అమెరికాలో పిల్లల మరణాలకు వ్యాధులు, ప్రమాదాలకంటే తుపాకీ హింసే ప్రధాన కారణం. ఇది బాధాకరం. ఈ హింసను అంతం చేయడానికి నాతో, ఉపాధ్యక్షురాలు హారిస్‌తో చేతులు కలపండి. తుపాకీ హింసను అరికట్టేందుకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తున్నా’’అని అన్నారు. ఆయుధాలను పూర్తిగా నిషేధించాలని ఇటీవలే బైడెన్ పిలుపునిచ్చారు. ఒక దేశంగా తుపాకీ హింసను అంగీకరించలేమన్నారు. దేశంలో తుపాకీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా కాంగ్రెస్‌ను కోరారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి అమ్మకాలపై సమగ్ర తనిఖీలు, సమతుల్యత పాటించాలని పిలుపునిచ్చారు. ఈ చర్యలేవీ చనిపోయిన పిల్లలను తిరిగి తీసుకురాలేవని, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే భవిష్యత్‌లో పిల్లల ప్రాణాలను కాపాడగలమని చెప్పారు. -
కోర్టులో జడ్జిని కాల్చి చంపిన పోలీసు
ఫ్రాంక్ఫర్ట్: అమెరికాలో తుపాకీ సంస్కృతికి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. గతంలో జరిగిన ఘటనల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోగా ఈసారి ఏకంగా న్యాయమూర్తి బలయ్యారు. న్యాయమూర్తి పైకి ఆ ప్రాంత పోలీసు ఉన్నతాధికారి బులñ æ్లట్ల వర్షం కురిపించడం గమనార్హం. గురువారం కెంటకీ రాష్ట్రంలోని లెట్చర్ కౌంటీలోని వైట్స్‌బర్గ్ జిల్లా కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న 54 ఏళ్ల జిల్లా జడ్జి కెవిన్ ములిన్స్‌ను ఆయన ఛాంబర్‌లోనే లెట్చర్ కౌంటీ షరీఫ్ షాన్ ఎం.స్టైన్స్ కాలి్చచంపారు. విషయం తెల్సి పోలీసులు పక్కనే ఉన్న పాఠశాలలోని విద్యార్థులను వెంటనే ఇళ్లకు పంపించేశారు. కాల్పులు జరిగినప్పుడు కోర్టులో దాదాపు 50 మంది ఉన్నారు. అసలేం జరిగిందంటే? గత ఎనిమిదేళ్లుగా అదే కౌంటీలో షరీఫ్‌గా పనిచేస్తున్న షాన్ గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వైట్స్‌బర్గ్ కోర్టు భవనానికి వచ్చి జడ్జి ములిన్స్‌తో విడిగా అత్యవసరంగా మాట్లాడాలని అనుమతి కోరాడు. దీంతో జడ్జి ఆయనను తన ఛాంబర్‌కు తీసుకెళ్లి గది తలుపులు మూసేశారు. చాలాసేపు వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని బయట వరండాలో వేచి ఉన్న వ్యక్తులు చెప్పారు. అయితే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందని, తర్వాత షరీఫ్ షాన్ చేతులు పైకెత్తి బయటికొచ్చి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. ఛాంబర్ లోపలికి వెళ్లి చూస్తే బుల్లెట్ల గాయాలతో రక్తమోడి జడ్జి నిర్జీవంగా పడి ఉన్నారని కెంటకీ రాష్ట్ర పోలీసు అధికార ప్రతినిధి మ్యాట్ గేహార్ట్ శుక్రవారం వెల్లడించారు. జడ్జిని షరీఫ్ ఎందుకు చంపారనే కారణం ఇంకా తెలియరాలేదు. ఏ విషయం మీద జడ్జి, షరీఫ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందన్న విషయం ఇంకా వెల్లడికాలేదు. షరీఫ్‌ను అరెస్ట్ చేసి పోలీసులు హత్యానేరం కింద దర్యాప్తు మొదలుపెట్టారు. -
అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి
అమెరికాలోని ఓక్లాండ్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కాల్పుల మోతతో ఆ ప్రాంతంలోని వారంతా భయాందోళనలకు లోనయ్యారు.మీడియాకు శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈస్ట్ ఓక్లాండ్లోని నివాస ప్రాంతంలోని 83వ అవెన్యూలోని 1600 బ్లాక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సమయానికే దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారైన దుండగుని కోసం గాలింపు చేపట్టారు. -
కారుతో ఢీకొట్టి.. తుపాకీతో కాల్చి..
పహాడీషరీఫ్: బైక్‌పై వెళ్తున్న రౌడీషీటర్‌ను గుర్తు తెలియని దుండగులు కారుతో ఢీ కొట్టి.. కళ్లలో కారం చల్లి.. తుపాకీతో కాలి్చ.. కత్తులతో నరికి చంపిన దారుణ ఘటన బాలాపూర్ పీఎస్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్పేట్ షరీఫ్‌నగర్‌లో నివాసం ఉండే రియాజుద్దీన్ అలియాస్ మెంటర్ రియాజ్ (45) లలితాబాగ్ రక్షాపురంలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. గురువారం రాత్రి రాయల్ కాలనీలో జరిగిన ఓ విందుకు హాజరై.. స్నేహితుడు నజీర్‌తో కలిసి బాలాపూర్‌లోని వైన్స్‌లో మద్యం తాగారు.అనంతరం రాత్రి 10.30 గంటలకు నజీర్ ఇంటికి వెళ్లగా, రియాజ్ తన బైక్‌పై షరీఫ్‌నగర్‌కు బయల్దేరాడు. ఆర్సీఐ రోడ్డులో ‘మంచి’ స్కూల్ వద్దకు రాగానే ముందస్తు పథకంలో భాగంగా వెనక నుంచి కారులో వచి్చన దుండగులు బైక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో రియాజ్ కింద పడిపోగా.. కళ్లలో కారం చల్లి, తుపాకీతో ఛాతీలో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. అయినప్పటికీ కొన ఊపిరితో ఉన్నాడని భావించి కత్తులతో తల, ఛాతీ భాగాల్లో ఇష్టానుసారంగా పొడిచారు. వచి్చన కారులోనే పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత వాహనదారుల ద్వారా సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లగా.. రక్తపు మడుగులో పడి ఉన్న రియాజ్ అప్పటికే మృతి చెందాడు. రాచకొండ పోలీస్ కమిషనర్ సు«దీర్‌బాబు, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, బాలాపూర్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్లు భూపతి, గురువారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. హత్యకు వినియోగించిన బుల్లెట్ షెల్‌తో పాటు ఐరన్ రాడ్డును స్వా«దీనం చేసుకున్నారు. క్లూస్ టీంతో శాంపిళ్లు సేకరించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగి ఉంటుందని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని సీపీ తెలిపారు. రియాజ్‌తో పాటు మద్యం తాగిన నజీర్ ఇచి్చన పక్కా సమాచారంతోనే నిందితులు వెంబడించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
ఫ్లోరెన్స్: అమెరికాలో కెంటకీ రాష్ట్రం ఫ్లోరెన్స్‌లోని ఓ ఇంట్లో బర్త్ డే పార్టీ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం వేకువజామున ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు కారకుడిగా భావిస్తున్న యువకుడిని పోలీసులు వెంటాడారు. ఛేజింగ్ సమయంలో అతడు కారు సహా లోయలో పడిపోయాడని పోలీసులు తెలిపారు. అతడు తనను తాను కాల్చుకున్నాడని, గాయాలతో ఆస్పత్రిలో మృతి చెందాడని చెప్పారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. -
అమెరికా స్పోర్ట్స్ పరేడ్‌లో కాల్పులు
కేన్సాస్ సిటీ: అమెరికాలో మరోమారు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మిస్సోరి రాష్ట్రం(స్టేట్) కేన్సాస్ సిటీలో స్పోర్ట్స్ పరేడ్‌పై దుండగులు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 22 మంది దాకా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారని.. వాళ్ల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. కేన్సాస్ సిటీ చీఫ్స్ ‘సూపర్ బౌల్’ విజేతగా నిలవడంతో.. పరేడ్ నిర్వహించారు. ఆ సమయంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరేడ్‌లో వేలాది మంది పాల్గొనగా.. ఎటునుంచి కాల్పులు జరుగుతున్నాయో తెలియక అక్కడికి వచ్చిన వారు పరుగులు పెట్టారు. క్షతగాత్రులను పోలీసులు సమీప ఆసుపత్రులకు తరలించారు. కాల్పులు జరిపిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు కేన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ స్టేసీ గ్రేవ్స్ తెలిపారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. సూపర్ బౌల్ ఛాంపియన్షిప్ అనేది అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లో భాగం. ఏటా సూపర్ బౌల్ ఛాంపియన్ షిప్ జరుగుతుంది. గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేన్సాస్ జట్టు శాన్‌ఫ్రాన్సిస్కోపై నెగ్గింది. దీంతో ఆ జట్టు విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా.. వేల మంది ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. New video shows moment gunfire erupts at the Super Bowl rally in Kansas City. At least 22 people shot pic.twitter.com/dUYM9G07fg — BNO News (@BNONews) February 15, 2024 అమెరికాలో గన్ కల్చర్‌లో మాస్ షూటింగ్(సామూహిక కాల్పుల) ఘటనలూ తరచూ చోటుచేసుకుంటున్నాయి. కిందటి ఏడాది.. ఎన్బీఏ ఛాంపియన్షిప్ విజయం నేపథ్యంలో డెన్వర్(కొలరాడో)లో నిర్వహించిన ఫ్యాన్స్ సంబురాల్లోనూ కాల్పులు జరిగాయి. అప్పుడు పది మంది గాయపడ్డారు. అంతకు ముందు.. 2019లో టోరంటోలో జరిగిన కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు. -
US: రెండేళ్ల తమ్ముడిని కాల్చి చంపిన మూడేళ్ల అన్న
ఒహియో: అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని సిన్సినాటి నగరంలో దారుణ ఘటన జరిగింది. మూడేళ్ల అన్న రెండేళ్ల వయసున్న తన తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపాడు. తర్వాత విచారణలో పోలీసులడిగితే టీవీలో స్పైడర్ మ్యాన్ ప్రోగ్రామ్ చూసి తండ్రి టేబుల్ డ్రాలో ఉన్న గన్ తీసి తమ్ముడిని కాల్చానని చెప్పాడు. ఈ సమాధానంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది. అసలు సంఘటన వివరాల్లోకి వెళితే కెంటాన్ కౌంటీలో తల్లిదండ్రులకు చెందిన ఫుల్ లోడెడ్ గన్‌తో మూడేళ్ల బాలుడు తన తమ్ముడిని కాల్చి చంపాడు. దీంతో తీవ్ర గాయాలైన బాలుడి తమ్ముడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తల్లిదండ్రులు నిర్లకక్ష్యంగా ఫుల్ లోడెడ్ తుపాకీని పిల్లలకు అందుబాటులో ఉంచడం వల్లే ఈ దారుణ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. దీంతో బాలుడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఇళ్లలో ఉన్న తుపాకులపై తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరోసారి గుర్తు చేసిందని పోలీసులు అంటున్నారు. ఇదీచదవండి.. తగ్గిన భారత టూరిస్టులు.. పెరిగిన చైనా వాటా -
Chicago: ఉన్మాది కాల్పుల్లో ఏడుగురి మృతి!
స్ప్రింగ్ఫీల్డ్: తుపాకీ సంస్కృతి తమకు వద్దే వద్దంటూ అమెరికన్లు గళమెత్తుతున్నా.. యువత మాత్రం వదలడం లేదు. తాజాగా మరోసారి గన్‌కల్చర్ పంజా విసింది. సోమవారం చికాగో నగరంలో ఓ దుండగుడు రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. ఆయుధాలతో పరారీలో ఉన్న ఆ ఉన్మాది కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇల్లానాయిస్ స్టేట్ చికాగో జోలియట్ ప్రాంతంలోని 2200 block of West Acres Roadలో సోమవారం ఈ ఘోరం జరిగింది. బాధిత కుటుంబాల ఇళ్లలోకి చొరబడి మరీ ఆ వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనల్లో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక మీడియా ఛానెల్స్ చెబుతుండగా.. స్థానిక పోలీసులు మాత్రం మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు. ACTIVE INCIDENT (UPDATED) JANUARY 22, 2024 3:00 PM At this moment, Detectives and Officers are conducting an active homicide investigation after Officers located multiple deceased individuals who had sustained gunshot wounds in two homes in the 2200 block of West Acres Road. pic.twitter.com/zOTKSjs0RC — Joliet Police Department (@JolietPolice) January 22, 2024 మరోవైపు నిందితుడిని 23 ఏళ్ల రోమియో నాన్స్‌గా ప్రకటించిన పోలీసులు.. బాధిత కుటుంబాలకు అతనికి పరిచయం ఉందని భావిస్తున్నారు. ఘటన తర్వాత కారులో ఆ యువకుడు పరారు అయ్యాడు. మరింత నరమేధం జరపకమునుపే అతన్ని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయతిస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు ఎఫ్‌బీఐ సంబంధిత టాస్క్‌ఫోర్స్ ఆ ఉన్మాది కోసం గాలింపు చేపట్టాయి. -
US: పాఠశాలలో కాల్పుల కలకలం
న్యూయార్క్: అమెరికాలోని అయోవాలో పాఠశాలలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని మృతి చెందాడు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులతో సహా పాఠశాల నిర్వహకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. శీతాకాలం సెలవుల తర్వాత పాఠశాలలు మొదటిరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 7:30కి పిల్లలు బ్రేక్ ఫాస్ట్ కోసం తరగతి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఓ పిల్లాడు కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో నలుగురు పిల్లలతో సహా పాఠశాల నిర్వహకుడు కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. కాల్పులు జరిపిన విద్యార్థిని డైలాన్ బట్లర్(17 )గా అధికారులు గుర్తించారు. బట్లర్ కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాల్పుల శబ్దం విన్న వెంటనే తరగతి గదిలోకి పారిపోయామని స్థానిక విద్యార్థులు తెలిపారు. అందరూ బయటకి రండి అని పిలుపు విన్న తర్వాతే బయటకు వచ్చానని ఓ విద్యార్థి పేర్కొన్నారు. పాఠశాల ప్రాంగణంలో నేలంతా రక్తసిక్తమైందని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. అమెరికా గన్ కల్చర్ రోజురోజుకీ ఎక్కువవుతోంది. పాఠశాలల్లో కాల్పుల ఘటన ఈ ఏడాది రెండోది. వర్జీనియాలో స్కూల్ బయటే ఓ కాల్పులకు పాల్పడిన ఘటన తర్వాత రోజు ఇది జరిగింది. మొత్తంగా 2018 నుంచి అమెరికా స్కూళ్లలో కాల్పుల ఘటనల సంఖ్య 182కు చేరింది. ఇదీ చదవండి: సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్ -
కెనడాలో హిందూ వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు
ఒట్టావా: కెనడాలో హిందూ లక్షిత దాడులు మరోసారి జరిగాయి. సర్రేలో హిందూ వ్యాపారవేత్త ఇంటిపై దుండగులు కాల్పులు జరిపారు. తుపాకులతో ఇంటిపై 11 బుల్లెట్లు పేల్చినట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 27 ఉదయం 14900 బ్లాక్ 80 అవెన్యూలో కాల్పుల ఘటన జరిగింది. కాల్పులు జరిపిన నివాసం సర్రేలోని లక్ష్మీ నారాయణ మందిర్ అధ్యక్షుడు సతీష్ కుమార్ పెద్ద కుమారుడికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. కెనడాలో కొద్ది రోజులుగా హిందూ లక్షిత దాడులు జరుగుతున్నాయి. దేవాలయాలే లక్ష్యంగా దుండగులు దాడులు చేస్తున్నారు. ఇటీవల సర్రేలోని లక్ష్మీ నారాయణ్ ఆలయంపై ఇటీవల దాడులు జరిగాయి. సర్రేలో ఖలిస్థానీల మద్దతుతో ర్యాలీలు కూడా వెలుగు చూశాయి. నిజ్జర్ హత్య కేసు తర్వాత ఈ దాడులు ఎక్కువయ్యాయి. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌ను సర్రేలోనే దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. గురుద్వాలో ఉన్న నిజ్జర్‌పై జులై 18న కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఇది కాస్త కెనడా- భారత్ మధ్య వివాదంగా మారింది. ఇదీ చదవండి: ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణ శిక్ష రద్దు -
రైలు టాయిలెట్లో గన్ మర్చిపోయాడా?
కర్ణాటక: రైలుబోగీలోని ఓ మరుగుదొడ్డిలో పిస్తోల్‌ను మండ్య రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మండ్య జిల్లా డీఆర్ కానిస్టేబుల్ నాగరాజును సస్పెండ్ చేశారు. వివరాలు...మండ్య జిల్లాలో డీఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగరాజు అంగరక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతను సోమవారం బెంగళూరు నుంచి మండ్యకు కాచిగూడ రైలులో ప్రయాణించాడు. ఆ సమయంలో మరుగుదొడ్డిలోకి వెళ్లిన నాగరాజు తన పిస్తోల్ తీసి వాష్బేసిన్పై పెట్టి మరచిపోయి బయటకు వచ్చేశాడు. కొద్ది సేపు అనంతరం ఓ ప్రయాణికుడు బాత్రూమ్కు వెళ్లి అక్కడ పిస్తోల్ ఉండటాన్ని గమనించి తోటి ప్రయాణికులకు చెప్పడంతో క్షణాల్లో అందరికి తెలిసిపోయింది. అంతలోనే రైలు మండ్య నగరం చేరుకుంది. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బెంగళూరు రైల్వే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. వారి ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టి ఆ పిస్తోల్ మండ్య జిల్లాలో అదనపు బలగాల్లో పనిచేస్తున్న నాగరాజుదిగా గుర్తించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాగరాజును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ యతీశ్ ఆదేశాలు జారీ చేశారు. -
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
న్యూయార్క్: అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూ హాంప్‌షైర్‌లోని ఓ సైకియాట్రిక్ ఆస్పత్రిలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పలువురికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. నగరంలో మానసిక రోగులకు చికిత్సనందించే ఆస్పత్రి అది. శుక్రవారం ఆస్పత్రిలోకి ఓ దుండగుడు ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఆస్పత్రి లాబీలో మొదట కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఆస్పత్రికి సమీపంలోనే ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఓ అనుమానిత వ్యక్తిని హతమార్చినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎంత మంది బాధితులున్నారో స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఆస్పత్రి పోలీసుల పర్యవేక్షలో ఉంది. పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఇదీ చదవండి: Israel-Hamas war: అల్–షిఫాలో మృత్యుఘోష -
టీచర్‌పై గన్‌తో కాల్పులు జరిపి వార్నింగ్.. 40 సార్లు కాలుస్తా అంటూ..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు విద్యార్థులు రెచ్చిపోయారు. తమ స్కూల్‌కు చెందిన టీచర్‌పై గన్‌తో కాల్పులు జరిపి.. 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ ఇద్దరు యువకులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఇద్దరు విద్యార్థులు ఒక టీచర్‌పై తుపాకీతో కాల్పులు జరిపారు. ఖండౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలుపూర్‌లో సుమిత్ సింగ్ అనే వ్యక్తి ఒక కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతడి కోచింగ్ సెంటర్లో చదివిన ఇద్దరు విద్యార్థులు గురువారం ఆ టీచర్‌ను బయటకు పిలిచారు. వెంట తెచ్చిన గన్‌తో ఆయన కాలుపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాలికి బుల్లెట్ గాయమైన టీచర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Video 1: Two students shot their teacher outside coaching in Agra,UP. Uploaded a video bragging about the shooting Video 2: We were inspired by videos of Lawrence Bishnoi. Please bail me out Those who consider Lawrence Bishnoi a hero have unknowingly made their children… pic.twitter.com/oHouUPysQG — journalist Miku (@snehasismiku) October 6, 2023 ఈ సందర్భంగా సదరు విద్యార్థులు తాము గ్యాంగ్‌స్టర్లమని నినాదాలు చేశారు. ఇక, ఆ యువకులు.. టీచర్‌పై ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. మరోవైపు టీచర్ కాలుపై కాల్పులు జరిపి పారిపోయిన విద్యార్థులు అనంతరం ఒక రీల్ చేశారు. వీడియోలో ‘ఆరు నెలల తర్వాత తిరిగి వస్తా. ఆ టీచర్‌ను 40 సార్లు కాల్చుతా, ఇంకా 39 బుల్లెట్లు మిగిలి ఉన్నాయి’ అని ఒక విద్యార్థి అందులో పేర్కొన్నాడు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు యువకులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. టీచర్‌పై కాల్పులతోపాటు బెదిరింపు వీడియోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్లీజ్ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి.. -
అమెరికాలో మరోసారి కాల్పులు
రాలీ: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. నార్త్ కరోలినా స్టేట్ ఛాపెల్ హిల్‌లోని యూనివర్సిటీ University Of North Carolina సైన్స్ భవనంలో తుపాకీతో వచ్చిన ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ఓ సిబ్బంది(ఫ్యాకల్టీ) మృతి చెందినట్లు తెలుస్తోంది. సోమవారం క్యాంపస్‌లో లాక్డౌన్ ఎత్తేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఆ వెంటనే ఈ కాల్పలు ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనలో మరెవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. ఎమర్జెన్సీ నెంబర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడు గంటల తర్వాత అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడింది అతనేనా? అని ధృవీకరణ రావాల్సి ఉండగా.. దుండగుడు కాల్పులకు తెగబడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. గన్ కల్చర్‌కు సంబంధించిన ఈ ఘటనపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Law enforcement have Arrested the Suspect in University of North Carolina Shooting#ChapelHill #UNCShooting#UNC #NorthCarolina #shooting #breaking #chapelhill #Carolina #University #USA #Shotting #Firing pic.twitter.com/Nte6OxelM6 — Chaudhary Parvez (@ChaudharyParvez) August 29, 2023 -
గన్ మిస్ ఫైర్..హెడ్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ గన్ మిస్‌ఫైర్ అయి తీవ్ర గాయాలతో మృతి చెందిన సంఘటన హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సూర్యాపేట జిల్లా గరిడెపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన 12వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ (పీసీ–1769) శ్రీకాంత్ (29) హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఖబూతర్‌ఖానా ఔట్ పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. 2018 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్ రెండున్నర సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి నైట్ డ్యూటీలో ఉండి..ఔట్ పోస్టులో నిద్రిస్తుండగా పక్కనే ఉన్న గన్ మిస్‌ఫైర్ కావడంతో గొంతుకు గాయమైంది. దీంతో శ్రీకాంత్‌ను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు ఉన్నతాధికారులు ఉస్మానియాకు చేరుకొని వివరాలను సేకరించారు. మూడు నెలల క్రితం కోదాడ ప్రాంతానికి చెందిన యువతితో శ్రీకాంత్‌కు వివాహం నిశ్చయమైందని, వచ్చే ఏడాది వేసవిలో వివాహం జరగాల్సి ఉందని, అంతలోనే ఇలా జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు విలపించారు. -
Hyderabad: హోటల్ మేనేజర్‌పై కాల్పులు
హైదరాబాద్: మియాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని మదీనాగూడలో బుధవారం అర్ధరాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఓ హోటల్ మేనేజర్‌పై గుర్తుతెలియని వ్యక్తి మొత్తం ఆరు రౌండ్లు కాల్చారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు. నిందితుడి కోసం ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని డీసీపీ జి.సందీప్ తెలిపారు. కోల్‌కతాకు చెందిన దేవేందర్ గాయన్ (35) ఆరు నెలలుగా మదీనగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్లో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. సికింద్రాబాద్ సమీపంలోని సుచిత్ర ప్రాంతంలో కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి విధులు ముగించుకున్న ఆయన హోటల్ నుంచి బయటకు వచ్చారు. అప్పటికీ హోటల్ మూసి వేయకపోవడంతో వినియోగదారుల రాకపోకలు సాగుతున్నాయి. తన ఇంటికి వెళ్లడానికి సిద్ధమైన దేవేందర్‌కు హోటల్ ముందరే అతడి స్నేహితుడు కనిపించాడు. దీంతో అక్కడే ఆగిన ఆయన స్నేహితుడితో మాట్లాడుతున్నారు. అదే సమయంలో మదీనగూడ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. దేవేందర్‌కు సమీపంలోనే ఆగి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. మొత్తం ఆరు రౌండ్లు కాల్చగా..నాలుగు దేవేందర్ శరీరంలోకి దూసుకుపోయాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. కాల్పులు జరిపిన అనంతరం చందానగర్ వైపు పారిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో కన్నుమూశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలితో పాటు ఆస్పత్రికి చేరుకున్నారు. దేవేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు దేవేందర్ గత చరిత్ర, కుటుంబ నేపథ్యం సహా వివిధ అంశాలు ఆరా తీస్తున్నారు. దేవేందర్‌ను టార్గెట్‌గా చేసుకున్న సదరు వ్యక్తి ఆ హోటల్ వద్ద రెక్కీ చేసి ఉంటాడని, కొద్దిసేపు వేచి చూసి ఉంటాడని అనుమానిస్తున్నారు. దీంతో గడిచిన వారం రోజులుగా ఆ హోటల్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు, మదీనగూడ–సుచిత్ర, మదీనగూడ–చందానగర్ మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను సేకరిస్తున్నారు. నిందితుడి కోసం ఎస్ఓటీ పోలీసులు గాలింపు ప్రారంభించారు. -
ఉన్నట్టుండి తుపాకీ కాల్పుల మోత.. టెక్సాస్ మాల్లో ఏం జరిగిందంటే..
అది 2023, మే 6.. అమెరికాలోని టెక్సాస్ స్టేట్‌లోని ఎలన్ పట్టణంలోగల ఒక షాపింగ్ మాల్లో ఉన్నట్టుండి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కాల్పులకు పాల్పడిన వ్యక్తితో పాటు మొత్తం 9 మంది మృతి చెందారు. వీరిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. ఏడుగురు గాయపడ్డారు. హంతకుడిని పోలీసులు మట్టుబెట్టారు. ప్రత్యక్ష సాక్షి చెప్పిందిదే.. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలోను, ఫొటోలలోను రక్తపుమడుగులో నేలపై పడి ఆర్తనాదాలు చేస్తున్న బాధితులు, మృతులు దయనీయ స్థితిలో కనిపించారు. వారి మధ్య హంతకుడు కూడా ఉన్నాడు. అతని మృతదేహం వద్ద ఒక తుపాకీ కూడా ఉంది. ఈ ఘటనను చూసిన ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. అతను షాపింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి తుపాకీ కాల్పుల మోత వినిపించింది. వెంటనే అతను ఒక పక్కకు వెళ్లి దాక్కున్నాడు. ఇంతలో పోలీసులు షాపింగ్ మాల్లోని వారిని బయటకు వెళ్లిపోవాలని చెప్పడంతో తాను కూడా బయటకు వెళ్లిపోయానన్నారు. అక్కడ తనకు చాలా మృతదేహాలు కనిపించాయన్నారు. తెలుగు యువతి దుర్మరణం ఈ ఘటనలో ఒక తెలుగు యువతి దుర్మరణం పాలయ్యింది. హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఐశ్వర్య టెక్సాస్ కాల్పులలో మృతి చెందింది. ఆమె రంగారెడ్డి జిల్లా జడ్జి తాతికొండ నర్సరెడ్డి కుమార్తె. ఐశ్వర్య అమెరికాలోని ఒక కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. అలెర్ట్ అయిన పోలీసులు ఈ కాల్పుల ఘటన జరిగిన వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు. మారణాయుధంతో దాడులకు తెగబడిన నరరూపరాక్షసుడిని మట్టుబెట్టారు. అతనొక్కడే ఈ కాల్పులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. దుండగుడిని 33 ఏళ్ల మారిసియో గార్సియాగా గుర్తించారు. ఈ ఘటనకు కారణమేమిటన్నదానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. 4 నెలల్లో 198 కాల్పుల ఘటనలు గన్ కల్చర్ ఆర్కైవ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది అమెరికాలో ఇప్పటివరకూ మొత్తం 198 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 30న జరిగిన మాస్ షూటింగ్లో ఆగంతకుడు ఐదుగురిని తుపాకీ కాల్పులకు బలితీసుకున్నాడు. ఈ ఘటనలో 9 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. 33 కోట్ల జనాభాలో 40 కోట్ల తుపాకులు అమెరికా స్వాతంత్ర్యం సాధించి 231 ఏళ్ల దాటినా గన్ కల్చర్ అంతంకాలేదు. దీని వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. 2019కి సంబంధించిన ఒక రిపోర్టు ప్రకారం అమెరికాలో 63 వేల మంది గన్‌కల్చర్ డీలర్లు ఉన్నారు. వీరు అదే ఏడాది ఆమెరికా పౌరులకు 83 వేల కోట్ల రూపాయల విలువైన తుపాకులను విక్రయించారు. ప్రపంచంలోని మొత్తం 85.7 కోట్ల సివిలియన్ గన్లలో ఒక్క అమెరికాలోనే 39.3 కోట్లు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా 5 శాతం. అయితే ప్రపంచం మొతంలో గల సివిలియన్ గన్లలో 46 శాతం కేవలం అమెరికాలోనే ఉండటం విశేషం. ఇది కూడా చదవండి: ఫ్రాన్స్ అల్లర్లలో కొత్త కోణం.. అల్లరి మూకల చేతుల్లో ఆధునాతన ఆయుధాలు -
గన్‌తో ఆటలాడుతూ గర్భంతో ఉన్న అమ్మ కడుపులోకి బుల్లెట్ దించేసి..!
అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. గన్‌తో ఆటలాడుతూ ప్రెగ్నెంట్‌గా ఉన్న అమ్మ(31) కడుపులోకి బుల్లెట్ దించేశాడు ఓ రెండేళ్ల చిన్నారి. దీంతో ఎనిమిది నెలల గర్బంతో ఉన్న తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఆటలాడుతూ తండ్రి బెడ్ రూమ్‌లోకి వెళ్లాడు రెండేళ్ల చిన్నారి. లాకర్లో ఉన్న గన్ను ఆటబొమ్మ అనుకుని తీసుకున్నాడు. సినిమాల్లో చూసిన మాదిరే ఆటలాడసాగాడు. ఇతర గదిలో పనిలో ఉన్న అమ్మ(లారా ఐగా) వద్దకు వచ్చి పిస్టల్‌ను పేల్చేశాడు. తల్లి అరుపులతో తల్లిడిల్లిపోగా పిల్లాడు కూడా ఏడవడం ప్రారంభించాడు. కొనప్రాణాలతో ఉన్న బాధితురాలు భర్తకు ఫోన్ చేసింది. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ బాధితురాలు మృతి చెందింది. తన పిల్లాడే ఆటబొమ్మ అనుకుని గన్‌తో కాల్చాడని ఆస్పత్రికి వెళ్లే క్రమంలో పోలీసులకు బాధితురాలు వెల్లడించింది. గన్‌లో 12 రౌండ్స్ బుల్లెట్లు లోడ్ చేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గన్ను పిల్లలకు అందకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: అందం కోసం కొత్త దంతాలు.. ‘షార్క్’లా మారిన యువకుడు! -
పడగ విప్పిన గన్ కల్చర్.. తొమ్మిది మంది మృతి!
అగ్రరాజ్యంలో మరోసారి గన్ కల్చర్ కోరలు చాచింది. ఫాదర్స్ డే వీకెండ్ సందర్భంలో చికాగో ప్రజలు ఓవైపు సంబురాలు మునిగిపోగా.. మరోవైపు కాల్పుల ఘటనలు తొమ్మిది మంది ప్రాణాల్ని బలిగొన్నాయి. దాదాపు 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ హింస అత్యంత విషాదకరమని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో సంతాపం తెలిపింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు సబర్బన్ చికాగో, వాషింగ్టన్ స్టేట్, సెంట్రల్ పెన్సిల్వేనియా, సెయింట్ లూయిస్, సదర్న్ కాలిఫోర్నియా, బాల్టిమోర్ ప్రాంతాల్లో వేర్వేరు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ► సౌత్‌వెస్ట్ చికాగోకు 20 మైళ్ల దూరంలో ఇల్లినాయీస్ రాష్ట్రం లోని విలోబ్రూక్లో ఆదివారం ఉదయం ఓ భవన పార్కింగ్ ప్రదేశంలో జూన్ టీన్త్ వేడుకల్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. ► ఇక శనివారం వాషింగ్టన్ స్టేట్ క్యాంప్ గ్రౌండ్లో ఆగంతకుడు యాధృచ్ఛికంగా కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ► కాలిఫోర్నియా లోని కార్సన్లో ఓ ఇంటివద్ద పూల్ పార్టీ జరుగుతుండగా కాల్పులు సంభవించి ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. బాధితులంతా 16 నుంచి 24 ఏళ్ల లోపు వాళ్లే. ► జార్జి నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. ► పెన్సిల్వేనియా లోని వాకర్ టౌన్షిప్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ప్రభుత్వ సైనికుడు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటనలో నిందితుడు తన ట్రక్కుని డ్రైవ్ చేసుకుంటూ లూయిస్‌టౌన్ బారక్స్ వైపు రాత్రి 11 గంటల సమయంలో దూసుకు వచ్చి అక్కడ ఉన్నవారిపై కాల్పులు జరిపి పారిపోయాడు. ► బాల్టిమోర్‌లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారు. ఆయా ఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్ష భవనం.. తుపాకీ సంస్కృతి కట్టడికి ఇకనైనా ముగింపు పలకాలని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో ఘటనలపై దర్యాప్తులు కొనసాగుతున్నాయని ఆయా రాష్ట్ర గవర్నర్లు, పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
మళ్లీ అమెరికాలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి
అమెరికా మరొకసారి కాల్పులతో దద్దరిల్లింది. న్యూమెక్సికోలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవ్వగా, అందులో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు సైతం ఉన్నారు. గాయపడ్డ పోలీస్ ఆఫీసర్ల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ తన ఫేస్బుక్ అకౌంట్లో తెలిపింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో అనుమానితున్ని పోలీసులు హతమార్చారు. 18 ఏళ్ల యువకుడు ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని న్యూ మెక్సికో రాష్ట్రంలోని చర్చికి బయటే హతమార్చినట్లు పేర్కొన్నారు. అయితే మృతులు వివరాలను కానీ, గాయపడిన వారి వివరాలను కానీ పోలీసులు వెల్లడించలేదు. సంఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, నిందితుడి వివరాలు తెలియరాలేదని పేర్కొన్నారు. కాల్పులకు కారణం తెలియరాలేదన్నారు. ఈ కాల్పుల ఘటనను కొంతమంది వీడియో రూపంలో చిత్రీకరించడమే కాకుండా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. బ్లాక్ డ్రెస్‌లో వచ్చిన ఆ 18 ఏళ్ల యువకుడు చేతిలో గన్ పెట్టుకుని హల్చేశాడు. ఈ క్రమంలోనే న్యూ మెక్సికోలోని క్రిస్ట్ సైంటిస్ట్ ఫస్ట్ చర్చి బయట కాల్పులకు దిగాడు. అయితే వెంటనే తేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని హతమార్చడంతో ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగారు. కాగా, ఇటీవల కాలంలో అమెరికాలో కాల్పులు విపరీతంగా పెరిగాయి. అగ్రరాజ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి క్షేమంగా వస్తారనే భరోసా లేకుండా ఉంది. ఏ క్షణంలో ఎవరు కాల్పులకు తెగబడతారో చెప్పలేని దుస్థితి నెలకొంది. -
క్షణాల్లో కాల్చివేత, అమెరికాలో సంచలనం.. దడ పుట్టిస్తున్న వీడియో
ఇల్లినాయిస్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది. మౌంట్ వెర్నాన్ లో తెల్లవారుజామున 3గంటలకు హైవేపై ఆగిన ఓ కారును పోలీసులు గుర్తించారు. ఎందుకు ఆగిందో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిన పోలీసులు ఓ వ్యక్తిని, అతనితో పాటు ఓ మహిళను గుర్తించారు. వివరాలు సేకరించగా ఇద్దరు కూడా తప్పుడు పేర్లు చెప్పినట్టు ఆన్ లైన్ రికార్డుల్లో తేలింది. వాళ్లిద్దరు పాత నేరస్థులు బ్రాండెన్ గ్రిఫిన్ (23), ఆయన భార్య క్రిస్టియానో శాంటోస్ (31)గా గుర్తించారు. తప్పుడు వివరాలు చెప్పడంతో పాటు వీరిద్ధరిపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వేర్వేరు కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులుకు సహకరించాల్సింది పోయి పెనుగులాటకు దిగాడు గ్రాఫిన్. పోలీసుల దగ్గర ఉన్న ఓ తుపాకీని లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా.. వారు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయాడు గ్రాఫిన్. క్రిస్టియానో శాంటోస్ ను అరెస్ట్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో అంతా పోలీసులు ధరించిన బాడీ కెమెరాలో రికార్డు అయింది. లొంగిపోవాలని సూచించినప్పటికీ గ్రాఫిన్ కాల్పులకు దిగాడని పోలీసులు తెలిపారు. 🚨Officer Involved Shooting 📌#MTVernon #Illinois 23-year-old Brandon Griffin and 31-year-old Christine Santos were stopped by the Illinois State Police and both had arrest warrants. Following an altercation: Griffin was later found deceased after shooting at the troopers. pic.twitter.com/LJSxWTIcoZ — Illinois Crime Cam (@illinoiscrime) May 12, 2023 -
అమెరికాలో తుపాకీ అప్పగిస్తే.. గిఫ్ట్ కార్డు బహుమానం
న్యూయార్క్: తుపాకీ సంస్కృతిని అరికట్టేందుకు అమెరికాలోని న్యూయార్క్ నగరం వినూత్న ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఒక్కో తుపాకీకి 500 డాలర్ల విలువైన గిఫ్ట్ కార్డు ఇస్తామని ప్రకటించి, అందుకు గాను 9 కేంద్రాలను శనివారం ఏర్పాటు చేసింది. వీటికి పౌరుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వివిధ రకాల అసాల్ట్ రైఫిళ్లు, ఘోస్ట్ గన్స్ కలిపి 3 వేలకు పైగా తుపాకులను పౌరులు అప్పగించినట్లు న్యూయార్క్ అధికారులు తెలిపారు. మొదటి ఆయుధానికి 500 డాలర్లు, ఆపై ప్రతి ఆయుధానికి 150 డాలర్ల చొప్పున అందజేశామన్నారు. బ్రూక్లిన్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మూడు గంటల్లోనే 90 గన్లను సరెండర్ చేయగా, సిరాక్యుజ్లో అత్యధికంగా 751 ఆయుధాలను అప్పగించారన్నారు. తమ వద్దకు చేరిన ప్రతి ఆయుధంతో ఒక జీవితాన్ని కాపాడినట్లే, ఒక ప్రమాదకర కాల్పుల ఘటనను నివారించినట్లేనన్నారు. ఇదీ చదవండి: ఇదేం విడ్డూరం.. ఇదేం పెళ్లి! -
సినిమా స్టైల్ క్రైం స్టోరీ : ‘ముక్కోటి’కి ముందురోజే ముహూర్తం..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/మానకొండూరు: కాల్పుల మోతతో మానకొండూరు ఉలిక్కిపడింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పల్లెలో తుపాకులు గర్జన విని జనం భీతిల్లారు. రౌడీషీటర్ అరుణ్‌పై కత్తులు, తుపాకులతో జరిగిన హత్యాయత్నం జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నేరచరిత్ర కలిగిన అరుణ్ ఆది నుంచి వివాదాస్పదుడే. వరుసగా ఇతనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గత సీపీ సత్యనారాయణ ఇతనికి కమిషరేట్ నుంచి బహిష్కరణ విధించారు. ఇటీవల కమిషనరేట్ బహిష్కరణ పూర్తిచేసుకుని వచ్చిన అరుణ్‌పై తుపాకులతో హత్యాయత్నం జరగడం గమనార్హం. వాస్తవానికి ఈ ఘటనకు బీజం ఇప్పుడు పడింది కాదు, పాత కక్షల నేపథ్యంలో ఈ ఏడాది వైకుంఠ ఏకాదశికి ముందురోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలో ప్రధాన నిందితుడు సాయితేజ్ హనుమాన్ ఆలయంలోనే అరుణ్‌ని చంపుతానని ప్రతినబూనాడు. వస్తూనే దాడి.. కాల్పులు ● పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలో ఉండే వీణవంక సాయితేజ్ ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ముందురోజు రాత్రి (నూతన సంవత్సరం రోజు) జీఎం కాలనీలోని హనుమాన్ గుడిలో తన సోదరి మరణానికి కారణమైన ‘మానకొండూరు అరుణ్ గాని తలకాయ కోసి.. జీఎం కాలనీ చౌరస్తాలో పెట్టకపోతే నేను సూరి కొడుకునే కాదు’ అని శపథం చేశాడు. ● ఈ విషయాన్ని పలువురు స్థానికులు వీడియో కూడా తీశారు. ఇప్పుడు ఈ వీడియో కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో ‘సాక్షి’ చేతికి చిక్కింది. అప్పటి నుంచి సమయం కోసం ఎదురుచూస్తున్న సాయి.. బుధవారం అర్ధరాత్రి తన మిత్రులు భువనగిరి జిల్లా దత్తారుపల్లికి చెందిన పాల మల్లేశ్, మానకొండూరు మండలం కెల్లెడ గ్రామానికి చెందిన బైరగోని మధు, గోదావరిఖనికి చెందిన చంటితో కలిసి రాత్రి 9 గంటల సమయంలో వాహనంలో మానకొండూరుకు వచ్చాడు. ● వెల్ది గ్రామానికి వెళ్లే మార్గం నుంచి వీరు గ్రామంలోకి తుపాకీ, కత్తులతో వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. దాదాపు 9.30 గంటల సమయంలో అరుణ్ తన ఇంటి ముందు సోదరులతో కలిసి మద్యం తాగుతుండగా.. వీరికి తారసపడ్డాడు. వారిని చూడగానే భయంతో అరుణ్ పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. ● అతడిని వెంబడించిన నలుగురు బీరు బాటిళ్లతో దాడిచేశారు. అడ్డువచ్చిన అరుణ్ భార్య సుమ, పెద్ద కూతురు వైష్ణవిని తుపాకీ చూపించి తీవ్రంగా కొట్టారు. పారిపోతున్న అరుణ్‌పై రెండు రౌండ్లు కాల్పులు జరపగా గురితప్పాయి. ఓ ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నాడు. అరుణ్‌పై కోపంతో సదరు ఇంట్లోని ఐదుగురు కుటుంబసభ్యులను విచక్షణారహితంగా, రక్తాలు కారేలా కొట్టారు. ● వీరి అరుపులు విన్న స్థానికులు వచ్చారు. వచ్చిన వారిని తుపాకీ చేతబూనిన వ్యక్తి బెదిరించి పంపాడు. తరువాత చాలామంది రావడంతో సాయితేజ్ పరారు కాగా.. పాలమల్లేశ్, మధును పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ● పేలని బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాడింది కంట్రీమేడ్ తుపాకీ (తపంచా) అని తూటా ఆధారంగా నిర్ధరణకు వచ్చారు. మరో నిందితుడు చంటి కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడని సమాచారం. తనకు సంబంధం లేదంటున్న అరుణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నిందితులు గోదావరిఖనికి చెందిన సాయితేజ్, చంటి, మరో ఇద్దరు మిత్రులు అని వెల్లడించాడు. ఎందుకు దాడి చేశారు..? అని అడిగిన ప్రశ్నకు.. తాను ఒక ప్రభుత్వ ఉద్యోగిని అని, తనకువారితో ఎలాంటి సంబంధమూ లేదని, వారు గంజాయి విక్రయిస్తారని తెలిపాడు. సంబంధం లేని వ్యక్తి చేసే పని, చిరునామా, పేరుతో సహా ఎలా తెలపగలిగాడు..? అన్న విషయంపై పోలీసులు దృష్టి సారించారు. అతనికి సాయితేజకు ఉన్న వైరం ఏంటీ..? అతని సోదరి మరణంలో అరుణ్ ప్రమేయం ఎంతవరకు ఉంది..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. నిందితులకు, బాధితుడికి నేరచరిత ఉన్న విషయం వాస్తవమేనని, అన్ని కోణాల్లోనూ కేసు దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్ సీపీ ఎల్.సుబ్బారాయుడు ‘సాక్షి’కి తెలిపారు. నిందితుల కోసం మొత్తం మూడు బృందాలు సాయి కోసం గాలిస్తున్నాయి. ఇందులో రెండు హైదరాబాద్‌కు వెళ్లగా.. ఒక టీం గోదావరిఖనికి వెళ్లినట్లు సమాచారం. బిహార్ నుంచి ఆయుధం..? ఈ కేసులో ప్రధాన నిందితుడు సాయికి ఆయుధం ఎక్కడిది..? అన్న విషయంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తుపాకీ కాల్చడంలో నిందితులకు అనుభవం లేదని తాజా ఘటనతో తేలిపోయింది. బుల్లెట్లు వేగంగా లోడు చేయలేకపోవడం.. గురిచూసి కాల్చలేకపోయిన విధానాన్ని బట్టి నిందితులు ఇటీవలే తుపాకీ కొనుగోలు చేసి ఉంటారని పోలీసులు అంచనాకు వచ్చారు. రెండు నెలల క్రితం ఓ కేసు విషయంలో సాయి సెల్లోకేషన్ బిహార్‌లో చూపించిందని గోదావరిఖని పోలీసులు తెలిపారు. అదే సమయంలో అతను కాశీయాత్రకు వెళ్లి వచ్చాడని గుర్తుచేసుకుంటున్నారు. దీంతో సాయికి బిహార్‌లో మిత్రులు ఉండి ఉంటారని, వారి ద్వారానే ఆయుధం కొని ఉంటాడని అనుమానిస్తున్నారు. మాట్లాడకుండానే.. దాడి చేశారు.. మానకొండూర్‌లో ఉన్న మా అత్త గారింటికి నా పిల్లలను చూసేందుకు వచ్చాను. బుధవారం రాత్రి అన్నం తిని బయట ఉండగా గొడవ అవుతోంది. ఈ లోగానే అరుణ్ మా ఇంటి వైపు వచ్చాడని కొందరు మా ఇంటివైపు పరుగు తీసుకుంటూ వచ్చారు. వాడేడి అంటూ ఆగ్రహంతో నాపై స్టీలు ప్యాల క్యాన్‌తో దాడి చేశారు. తల పగిలి రక్తస్రావం జరిగింది. ఇంట్లో వాళ్లపై దాడి చేశారు. ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. తర్వాత భయాందోళనతో చాలా సేపు తలుపు వేసుకుని ఇంట్లోనే ఉన్నాం, పోలీసులు వచ్చాక బయటకు వచ్చా. – బీరం శ్రీనివాస్, గాయపడ్డ వ్యక్తి -
మద్యం మత్తులో తగాదా..
అన్నానగర్: పెరంబలూరు సమీపంలో మంగళవారం అక్రమ సంబంధాన్ని బయటపెడతానని బెదిరించిన ఓ యువకుడిని కాల్చి చంపి తుపాకీతో పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. పెరంబలూరు జిల్లా కున్నం తాలూకా మంగళమేడు సమీపంలోని నమైయూర్ గ్రామంలోని నరియాడై నరికురువర్ కాలనీకి చెందిన రజని (45) భార్య జయంతి. వీరికి ముగ్గురు పిల్లలు. అదే ప్రాంతానికి చెందిన అజిత్ (26). ఇతని భార్య శాంతి. వీరికి ఓ చిన్నారి ఉన్నాడు. శాంతి ఇటీవల మరణించింది. డబ్బు విషయంలో రజనీకాంత్, అజిత్ మధ్య తగాదాలున్నాయి. రజనీకి అదే ప్రాంతానికి చెందిన సీ్త్రకి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అజిత్ మీ సంబంధాన్ని బయటపెడుతానని బెదిరించి రజనీ నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరూ మద్యం మత్తులో తగాదా పడ్డారు. దీంతో కోపోద్రిక్తుడైన రజనీ లైసెన్స్ లేకుండా తన వద్ద ఉంచుకున్న గన్‌తో అజిత్‌ను కాల్చి పారిపోయాడు. తీవ్రగాయాలైన అజిత్‌ను స్థానికులు పెరంబలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న మంగళమేడు పోలీసులు అజిత్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అలాగే కేసు నమోదు చేసి నిందితుడు రజనీ కోసం వెతుకుతున్నారు. -
ఇదొక జబ్బులా ఉంది! స్కూల్లో కాల్పుల ఘటనపై జోబైడెన్ ఫైర్
అమెరికాలో నాషెవల్లేలోని ఓ ప్రైవేట్ ఎలిమింటరీ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటనపై అధ్యక్షుడు జోబైడెన్ సీరియస్ అయ్యారు. దీన్ని ఒక జబ్బుగా అభివర్ణించారు. తుపాకీ సంస్కృతికి అడుకట్టే వేసేలా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన తరుణమిది. ఈ మేరకు బైడెన్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉమెన్స్ బిజినెస్ సమ్మిట్‌లో మాట్లాడుతూ..ఈ తుపాకీ సంస్కృతిపై మండిపడుతూ.. ఇది ఒక జబ్బుగా పరిణమిస్తోంది. ఇది ఎందుకు జరిగింది, కారణాలేంటి అనేదానిపై వాస్తవాలను సేకరిస్తున్నాం. ఈ ఘటన చాలా హృదయవిదారకంగా ఉంది. ఒక కుటుంబానికి పీడకలగా మారింది ఈ ఘటన. ఈ తుపాకీ సంస్కృతి మన కమ్యూనిటీలను, సమాజాన్ని చీల్చివేయడమే గాక దేశాన్ని విభజించి కూల్చేస్తోంది. అందువల్ల సాధ్యమైనంత త్వరిగతిన తుపాకీ హింసను అరికట్టేలా ఆయధాల నిషేధాన్ని ఆమోదించాలని కాంగ్రెస్‌కి పిలుపునిచ్చారు. అలాగే మన పాఠశాలలను జైళ్లుగా మారకుండా మరింత కృషి చేయాలని చెప్పారు. ఈ ఘటనపై నిమిషాల వ్యవధిలోనే స్పందించి ప్రమాదాన్ని త్వరతగతిన నియంత్రించినందుకు పోలీసులను అభినందించారు బైడెన్. కాగా, ఈ కాల్పుల వద్ద రెండు ఏకే 47 పిస్టల్‌ను స్వాధీనం చేసుకోవడమే గాక ఈ ఘటనకు పాల్పడిన ఆడ్రీ హేలా అనే మహిళను అక్కడికక్కడే కాల్చి చంపారు పోలీసులు. (చదవండి: ‘రాహుల్ గాంధీ’ వ్యవహారంపై స్పందించిన అమెరికా) -
స్కూల్లో నరమేధం.. చిన్నారులు, సిబ్బంది మృతి
నాష్విల్లే: అగ్రరాజ్యంలోని గన్ కల్చర్ మరోసారి ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. టేనస్సీ స్టేట్ రాజధాని నాష్‌విల్లేలోని ఓ ప్రైవేట్ ఎలిమెంటరీ స్కూల్లో సోమవారం ఘోరం జరిగింది. ఓ మహిళ జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు(9 ఏళ్లలోపు వయసు వాళ్లే), ముగ్గురు సిబ్బంది(స్కూల్ హెడ్ సహా) ఉన్నారు. కాల్పులు జరిపింది అదే స్కూల్ పూర్వ విద్యార్థి కాగా, ఆమెను అక్కడిక్కడే కాల్చి చంపారు పోలీసులు. నాష్‌విల్లేకు చెందిన 28 ఏళ్ల ఆడ్రీ హేల్ ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు ప్రకటించారు. రెండు రైఫిల్స్ Assault Rifles, ఓ హ్యాండ్ గన్‌తో స్కూల్ సైడ్ డోర్ నుంచి ప్రవేశించిన దుండగురాలు.. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే కుప్పకూలారు. ఎమర్జెన్సీ కాల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. పదిహేను నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరిన్ని దాడులకు ప్లాన్! మిగతా పిల్లలు, స్టాఫ్‌ను భద్రంగా బయటకు తీసుకొచ్చారు. కాల్పులకు దిగిన మహిళను అక్కడిక్కడే కాల్చి చంపారు. ఇదిలా ఉంటే.. ఆడ్రీ హేల్ అదే స్కూల్లో పూర్వ విద్యార్థి. ఆమెను ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించారు పోలీసులు. ఆమెకు ఎలాంటి నేర చరిత్ర లేదని, బహుశా కోపంలోనే ఆమె అలా దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు. పక్కా ప్లాన్‌తోనే ఆమె కాల్పులకు తెగబడింది. కేవలం స్కూల్‌ను మాత్రమే ఆమె లక్ష్యంగా చేసుకోలేదు. ఆమె దగ్గర మరికొన్ని లొకేషన్లకు సంబంధించిన మ్యాప్‌లు దొరికాయి. అందులో ఈ స్కూల్ ఒకటి. బహుశా.. ఆమె మరిన్ని దాడులకు సిద్ధమై ఉందేమో అని ఓ అధికారి తెలిపారు. కోపంలోనే ఆమె కాల్పులకు దిగిందా? లేదా ఇంకా వేరే కారణం ఉందా? అనేది దర్యాప్తులో తేలుస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే కాల్పుల ఘటనపై వైట్‌హౌజ్ స్పందించింది. హృదయవిదారకరమైన ఘటన అని ఓ ప్రకటన విడుదల చేసింది. జో బైడెన్ ప్రభుత్వం చేస్తున్న ఆయుధ నిషేధ చట్టానికి Assault weapons Ban మద్దతు ఇవ్వాలంటూ రిపబ్లికన్లను వైట్‌హౌజ్ ఆ ప్రకటనలో కోరింది. ఇదిలా ఉంటే.. అమెరికాలో సామూహిక కాల్పుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ప్రత్యేకించి స్కూల్స్‌పై దాడుల్లో నరమేధం ఎప్పటికప్పుడు ఆయుధాల నిషేధ చట్టం గురించి చర్చ తీసుకొస్తోంది అక్కడ. కిందటి ఏడాది టెక్సాస్ రాష్ట్రంలోని ఉవాల్డేలో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు చనిపోయారు. 2012లో.. కనెక్టికట్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటనలో 26 మంది చనిపోగా.. అందులో 20 మంది పిల్లలే ఉన్నారు. -
అమెరికా తుపాకీ సంస్కృతికి నాలుగేళ్ల చిన్నారి బలి
హూస్టన్: ఇంటికో తుపాకీ పథకం అమల్లో ఉందా అన్నట్లు కనిపించే అమెరికాలో గన్ కల్చర్.. నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను తోడేసింది. టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగర సమీపంలోని హ్యారిస్ కౌంటీలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. కౌంటీ పోలీసు అధికారి ఎడ్ గోంజాల్వేజ్ తెలిపిన వివరాల ప్రకారం ‘బామెల్ నార్త్ హూస్టన్ రోడ్‌లోని ఓ అపార్ట్మెంట్లోని ఇంట్లో ఐదుగురు పిల్లలు ఆడుకుంటున్నారు. వీరిలో నాలుగు, మూడేళ్ల అక్కాచెల్లెళ్లు ఇంటి పడకగదిలోకెళ్లి అక్కడే ఉన్న సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌ను చూశారు. పిస్టల్‌ను చేతిలోకి తీసుకున్న చెల్లెలు వెంటనే అక్కకు గురిపెట్టి కాల్చింది. తుపాకీ శబ్దంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అక్కడికొచ్చి చూసేసరికి నాలుగేళ్ల అమ్మాయి రక్తమోడుతూ కనిపించింది. 911కు ఫోన్‌చేసి అత్యవసర సిబ్బంది వచ్చి వైద్యంచేసేలోపే చిన్నారి ప్రాణాలు విడిచింది. లోడ్ చేసిన తుపాకులను జాగ్రత్త చేయాలని ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా తుపాకీ యజమానుల నిర్లక్ష్యం ఇలా ఎందరో అమా యకుల ప్రాణాలను బలికోరుతోంది’ అని ఆయన విచారం వ్యక్తంచేశారు. -
Gun Culture: ఒకే రోజు 813 తుపాకీ లైసెన్సులు రద్దు..
పంజాబ్‌లో తుపాకి సంస్కృతికి వ్యతిరేకంగా భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం విరుచుకుపడింది. విచ్చలవిడిగా వినియోగిస్తున్న తుపాకులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఒకే రోజు సుమారు 813 ఆయుధాల లైసెన్సులను రద్దు చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు దాదాపు 2 వేలకు పైగా ఆయుధ లైసెన్సులు రద్దు చేసింది. ఈ మేరకు లూథియానా రూరల్ నుంచి 87, షాహీద్ భగత్‌సింగ్ నగర్ నుంచి 48, గురుదాస్‌పూర్ నుంచి 10, ఫరీద్కోట్ నుంచి 84, పఠాన్‌కోట్ నుంచి 199, హోషియాపూర్ నుంచి 47, కపుర్తలా నుంచి 6, ఎస్ఏఎస్ కస్బా నుంచి 235, సంగర్ నుంచి 16 తపాకీ లైసెన్స్‌లను రద్దు చేసింది. అలాగే తుపాకుల లైసెన్సు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమాలను పేర్కొంది. పంజాబ్‌లో బహిరంగ కార్యక్రమాలు, మతపరమైన ప్రదేశాలు, వివాహ వేడుకలు లేదా ఇతర కార్యక్రమాల్లో ఆయుధాలు తీసుకువెళ్లడం, ప్రదర్శించడాన్ని నిషేధించింది. రానున్న రోజుల్లో పోలీసులు వివిధ ప్రాంతాల్లో రాండమ్ చెకింగ్లు నిర్వహిస్తారని, హింసను ప్రోత్సహించేలా ఆయుధాలను ప్రదర్శించడంపై పూర్తి నిషేధం ఉంటుందని అధికార ఆప్ ప్రభుత్వం తెలిపింది. పంజాబ్‌లో మొత్తం మూడు లక్షల ఆయుధాల లైసెన్సులు ఉన్నాయని, ఈ తుపాకీ సంస్కృతిని అంతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా, 28 ఏళ్ల పంజాబీ గాయకుడు సిద్ధు మూస్ వాలా హత్యోదంతంతో రాష్ట్ర ప్రభుత్వం తుపాకీ సంస్కృతిపై దృష్టి సారించి, నియంత్రణ కోసం పిలుపునిచ్చింది. వాస్తవానికి సిద్ధు మూస్ వాలా వివాదాస్పద పంజాబీ పాటలకు ప్రసిద్ధి, అవి తుపాకీ సంస్కృతిని బహింరంగంగా ప్రోత్సహించడమే గాక గ్యాంగ్స్టర్లను కీర్తించింది. అతను రైఫిల్‌తో కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనిపై కేసు కూడా నమోదైంది. (చదవండి: ఫుల్‌గాతాగి పెళ్లి మండపంలోనే నిద్రపోయిన వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే..) -
అమెరికా పరిస్థితి మరీ దారుణం.. లైసెన్స్ చూపిస్తే తుపాకీ ఇవ్వాల్సిందే!
అగ్రరాజ్యం అమెరికాలో తరచూ కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల మూడు వేరు వేరు ఘటనల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్మూన్ బేలో రెండు ప్రాంతాలు తుపాకీ మోతలతో దద్దరిల్లాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మౌంటైన్ మష్రూమ్ సోయిల్ ఫామ్‌లో ఈ కాల్పులు జరిగినట్లు వెల్లడించారు పోలీసులు. షూటర్‌ను స్పాట్లోనే అరెస్ట్ చేశారు. మరోవైపు డెస్ మొయిన్స్లోని ఓ స్కూల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మరణించగా.. ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డాడు. అమెరికాలో ఇలా తుపాకీ కాల్పులు జరగడం కొత్త కాదు. ఏటా తుపాకీ కాల్పుల్లో ఎందరో అమాయకులు చనిపోతున్నారు. అగ్రరాజ్యం పేరును తుపాకీ రాజ్యంగా మారిస్తే బెటరన్న సెటైర్లు వినపడుతున్నాయి. ఎందుకంటే 33 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో తుపాకులు ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటే గుండె గుభేల్ మంటుంది. అమెరికాలో అక్షరాలా 39 కోట్లకు పైగా తుపాకులు ఉన్నాయి. అవి 33 కోట్ల మంది ప్రజల ఇళ్లల్లో ఏ క్షణంలోనైనా పేలడానికి సిద్ధంగా ఉన్నాయి. 1968 నుండి 2017 వరకు 50 ఏళ్ల వ్యవధిలో అమెరికాలో తుపాకులు 15 లక్షలమంది ప్రాణాలు తీసేశాయి. వాటిలో ఆత్మహత్యలూ ఉన్నాయి. హత్యలూ ఉన్నాయి. ఆకతాయిగా చిన్నపిల్లలే దీపావళి తుపాకీ కాల్చినట్లు కాల్చి సాటి పిల్లల్ని హతమార్చిన ఘటనలూ ఉన్నాయి. 1775లో అమెరికా స్వాతంత్ర్య పోరాటం నాటి నుండి ఇప్పటి వరకు అమెరికాలో జరిగిన అన్ని యుద్ధాలు.. అమెరికా సైన్యం పాల్గొన్న అన్ని యుద్ధాల్లో కలుపుకున్నా అమెరికాలో తుపాకుల బారిన పడి చనిపోయిన వారికన్నా తక్కువ మందే మరణించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా నేవల్ బేస్ పెరల్ హార్బర్ పై జపాన్ చేసిన మెరుపుదాడిలో చనిపోయింది కేవలం 2400 మంది మాత్రమే. సెప్టెంబరు 11న ట్విన్ టవర్స్ పై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో మూడువేల చిల్లర మంది మాత్రమే చనిపోయారు. అంతకు ఎన్నో వందల రెట్లు మంది ఏటా తుపాకీ కాల్పుల్లో చనిపోతున్నారు. సగటున ప్రతీ ఏటా 41 వేల మంది తుపాకీ గుళ్లకు తలలు వాల్చేస్తున్నారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్రతీ రోజూ సగటున 53 మంది తుపాకీ కాల్పుల్లో చనిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు అయిదు నెలలు పూర్తి కాకుండానే తుపాకీ కాల్పుల్లో 17 వేల మందిచనిపోయారు. రాబోయే 7 నెలల్లో ఇంకెంతమందిని తుపాకులు పొట్టన పెట్టుకుంటాయో చెప్పలేని పరిస్థితి. బొమ్మలు కొన్నంత ఈజీగా.. మన దగ్గర సూపర్ మార్కెట్ల తరహాలోనే అమెరికాలో తుపాకుల దుకాణాలు లాభసాటి వ్యాపారాలు చేసుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాయి. తుపాకీ కొనడానికి కూడా పెద్ద కష్టపడక్కర్లేదు. ఎవరికైనా లైసెన్స్ ఉంటుంది. దాన్ని చూపిస్తే చాలు షాప్‌లో తుపాకీ అమ్మేస్తారు. ఆ తుపాకీ కూడా పెద్ద ఖరీదేం కాదు. నలుగురు యువకులు ఓ మందు పార్టీకి ఖర్చుపెట్టే సొమ్ముతో ఓ మాంచి తుపాకీ వచ్చేస్తుంది. తుపాకీ కొనడానికి కూడా పెద్ద ఆంక్షలు లేవు. 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా సరే అమెరికాలో యధేచ్ఛగా తుపాకీ కొనుక్కోవచ్చు. దాన్ని జేబులో పెట్టుకుని తిరగచ్చు. తుపాకీ ఎందుకు కొన్నావ్? జేబులో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావ్? అని ఎవరూ అడగరు. చిత్రం ఏంటంటే అమెరికాలో మద్యం కొనడానికి కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. కానీ తుపాకీ మాత్రం 18 ఏళ్లు నిండితే చాలు. ఇంత లిబరల్ గా తుపాకులు అమ్మేస్తున్నారు కాబట్టే కొనేవాళ్లు కొనేస్తున్నారు. కొన్న తర్వాత ఇళ్లల్లో బీరువాల్లో దాచుకుని మురిసిపోతున్నారు. ఏక్షణంలో నైనా తమ తుపాకీని ఓసారి కాల్చాలని అనిపిస్తే కాల్చేస్తున్నారు. తుపాకుల అమ్మకం అమెరికాలో అతి పెద్ద వ్యాపారం. ఒక్క 2020 లోనే అమెరికాలో 26 లక్షల తుపాకులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇంత విచ్చలవిడిగా తుపాకులు అందుబాటులో ఉండడం వల్లనే అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇప్పుడు పుట్టింది కాదు.. అమెరికాలో తుపాకీ సంస్కృతి ఇప్పుడు పుట్టింది కాదు. బ్రిటిష్‌తో స్వాతంత్ర్య పోరాటం చేసే సమయంలో పూర్తి స్థాయి ఆర్మీ లేని అమెరికా పౌరులందరికీ తుపాకులు కలిగి ఉండే హక్కు కల్పించింది. అవసరం వచ్చినపుడు ప్రజలు స్వచ్ఛందంగా తమ సొంత తుపాకులతో యుద్దంలో పాల్గొనాల్సి ఉండేది. దీంతో పాటే ఆహారం కోసం వేటపై ఆధార పడే వాళ్లకు తుపాకులు కలిగి ఉండే హక్కు ఉండేది. అమెరికాకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగంలోని రెండవ సవరణలో ప్రతీ అమెరికన్ పౌరుడూ తుపాకీ కలిగి ఉండే స్వేఛ్చను కల్పించారు. శతాబ్ధాల క్రితం పౌరులకు సంక్రమించిన ఈ రాజ్యాంగ బద్ధ హక్కే ఇపుడు అమెరికాని ఆందోళనలోకి నెట్టేస్తోంది. విచ్చలవిడిగా తుపాకులు అందుబాటులో ఉండడం వల్లనే అమెరికాలో హింస పేట్రేగిపోతోందా? లేక విశృంఖలంగా తుపాకీలు కాల్చేవారిలో మానసిక పరమైన రుగ్మతలు ఏమన్నా ఉన్నాయా అన్న కోణాల్లో సైంటిస్టులు అధ్యయనాలు చేశారు. వాటిలో ఆసక్తికరమైన నిజాలు వెలుగు చూశాయి. కొంత మందిలో మానసిక సమస్యలు ఉంటాయి. అలాంటి వారు ఎప్పుడు ఏం చేస్తున్నారో వారికి తెలీదు. అటువంటి వారు తమ చేతుల్లో ఉన్న తుపాకులను తమపై వినియోగించుకోవచ్చు లేదంటే ఎదుటి వారిని కాల్చి చంపనూ వచ్చు. అందు చేత ఇది మానసిక పరమైన సమస్యే అంటున్నారు వారు. దీనికి ఇంటిమిటెంట్ ఎక్ప్ ప్లోజివ్ డిజార్డర్ అని పేరు పెట్టారు. ఆ సమస్య ఉన్నవాళ్లకి ఉన్నట్లుండి విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంలో వాళ్లు ఎంతకైనా తెగిస్తారు. తమ చేతుల్లో తుపాకీ ఉంటే అయిన వాళ్లను కూడా కాల్చి చంపేస్తారు. ఆమధ్య టెక్సాస్ లో 18ఏళ్ల కుర్రాడు తన 18వ పుట్టినరోజు జరుపుకున్న మర్నాడే దుకాణానికి వెళ్లి ఓ తుపాకీ కొన్నాడు. వెంటనే ఫేస్ బుక్ లో తాను ఆ తుపాకీతో స్కూల్ కి వెళ్లి కాలుస్తానని పోస్ట్ పెట్టాడు కూడా. అయితే దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆ కుర్రాడు తాను కొన్న తుపాకీతో తన నాయనమ్మను కాల్చి చంపి ఆ తర్వాత స్కూల్ కి వెళ్లి పదేళ్ల వయసుండే పిల్లలపై కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 19 మంది అక్కడి కక్కడే చనిపోయారు. ఆయుధ వ్యాపారులదే పవర్.. అదీ కాక తుపాకుల వ్యాపారంలో మునిగి తేలే ఆయుధ వ్యాపారులే అమెరికాని శాసిస్తూ ఉంటారు. ఆయుధ వ్యాపారులకు కోపం తెప్పించే పని చేయడానికి ఏ ప్రభుత్వమూ సాహసించదు. గతంలో తుపాకుల విక్రయాలపై ఆంక్షలు ఉండాల్సిందేనని బారక్ ఒబామా గట్టిగానే అన్నారు కానీ రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్న ఒబామా ఆపని చేయలేకపోయారు. ఒబామా తర్వాత అధ్యక్షుడైన ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేత కాబట్టి తుపాకులకు సహజంగానే సానుకూలం. ఇపుడు డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ అధ్యక్షుడి గా ఉన్నాడు. ► 1999లో కొలరాడో లో తుపాకీ కాల్పుల్లో 12 మంది చిన్నారులు మృతి చెందారు. ► 2005 మార్చ్ లో మిన్నెసోటా లో కాల్పుల ఘటనలో ఏడుగురు చనిపోయారు. ► 2007 లో వర్జీనియాలో కాల్పుల్లో 32 మంది చనిపోయారు. ► 2012లో కనెక్టికట్ లో 26 మంది దుర్మరణం చెందారు. ► 2015లో ఓరేగాన్ లో 9 మంది విగతజీవులయ్యారు. ► 2018లో హ్యూస్టన్ లో 10 మంది ,ఫ్లోరిడాలో 17 మంది చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషాదాలు. అమెరికా చరిత్ర నిండా ఎన్నో బుల్లెట్ గాయాలు. తల్లిదండ్రులకు తీరని గర్బశోకాలు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ తుపాకులను ఇంత విచ్చలవిడిగా వినియోగించిన దాఖలాలు లేవు. తుపాకుల విక్రయంలోనూ అమెరికాకు దరిదాపుల్లో మరో దేశం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో పాలకుల నిర్లక్ష్యమే అతి పెద్ద విలన్ అంటున్నారు మేథావులు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరచి తుపాకీల వ్యాపారంపైనా వాటి వినియోగంపైనా ఉక్కుపాదం మోపకపోతే అమాయక బాల్యం తుపాకీ కాల్పుల్లో కాలిపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. చదవండి: ప్రపంచదేశాలకు ‘చెత్త’ సవాల్.. ఆకాశం కూడా ఆగమాగం.. ఏంటీ పరిస్థితి? -
ఎడతెగని ఉన్మాదం
ఎక్కడో ఒకచోట చాలా తరచుగా ఉన్మాదుల తుపాకులు పేలుతూనే ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టు మనుగడ సాగిస్తున్న అమెరికాలో మరోసారి ఏడుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన రెండు ఉదంతాల్లో వీరు మరణించగా ఆదివారం ఉన్మాది కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన 22 ఏళ్ల తెలుగు విద్యార్థి దేవాశిష్ ఆ మరునాడు కన్నుమూశాడు. నూతన సంవత్సరం ప్రారంభమైన ఈ మూడు వారాల్లో ఇంతవరకూ మొత్తం ఆరు ఉదంతాలు జరగ్గా దుండగుల తుపాకులకు 39 మంది బలయ్యారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థమవుతుంది. ప్రపంచ జనాభాలో అమెరికా వాటా అయిదు శాతం. కానీ ప్రపంచంలో ప్రైవేటు వ్యక్తుల దగ్గరుండే తుపాకుల్లో సగభాగం ఆ దేశంలోనే ఉంటాయి. అంతేకాదు...ఏటా ఉన్మాదులు తుపాకులతో రెచ్చిపోతున్న ఘటనల్లో మూడోవంతు అమెరికాలోనే చోటుచేసుకుంటాయి. కాల్పుల ఘటనల్లో మరణిస్తున్నవారినీ, తుపాకులతో కాల్చుకుని ప్రాణాలు తీసుకునేవారినీ కలుపుకుంటే ఏటా 40,620 మంది ఈ మారణాయుధాల కారణంగా చనిపోతున్నారని నిరుడు ఒక నివేదిక తెలిపింది. అంటే రోజూ సగటున 110మంది తుపాకులకు బలైపోతున్నారు. తుపాకుల సంస్కృతిని అరికట్టడం తక్షణావసరమని గ్రహించడానికి ఈ గణాంకాలు చాలవా? కానీ ప్రభుత్వ విధానాలనూ, రాజకీయాలనూ తుపాకులే శాసిస్తున్నచోట ఈ విజ్ఞతను ఆశించటం దురాశే అవుతుంది. నిరుడు వరసగా వర్జీనియా, కొలరాడో, ఇల్లినాయ్, ఓక్లహమా, టెక్సాస్, న్యూయార్క్ తదితరచోట్ల విచ్చలవిడి కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నప్పుడు మూడు దశాబ్దాల్లో తొలిసారి తుపాకుల కొనుగోలుపై పరిమిత స్థాయి సంస్కరణలు తీసుకురావాలని సెనేట్‌లో ఒప్పందం కుదిరింది. దానిపై చర్చ సాగుతుండగానే న్యూయార్క్ తుపాకుల చట్టాన్ని కొట్టేస్తూ ఆత్మరక్షణ కోసం తుపాకులు కలిగి ఉండటం ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తుపాకులుండరాదని మెజారిటీ ప్రజానీకం భావించేచోట అవి నానాటికీ తామరతంపరగా పెరుగుతూ పోవటం ఒక వైచిత్రి. తుపాకి ఉండటం తమ హోదాకూ, గౌరవానికీ చిహ్నమని, ఆత్మరక్షణకు తప్పనిసరని భావించేలా చేయటంలో అక్కడి తుపాకి పరిశ్రమలు విజయం సాధించాయి. ఎక్కడో ఒకచోట తుపాకి పేలినప్పుడల్లా జనంలో ఆగ్రహావేశాలు రగలటం, తుపాకుల అమ్మకంపై నియంత్రణ విధించాలని కోరటం షరా మామూలే. కానీ ఆ వెంటనే తుపాకి లాబీ రంగప్రవేశం చేసి ఈ చర్చనంతటినీ తలకిందులు చేస్తోంది. మానసిక రోగులవల్ల తలెత్తుతున్న సమస్యను తుపాకుల అమ్మకానికి ముడిపెడుతున్నారని వక్రభాష్యాలకు దిగుతోంది. ఆ తర్వాత అంతా సద్దుమణుగుతోంది. తుపాకుల అమ్మకాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. అమెరికాలో పౌరుల వద్ద మొత్తం 39 కోట్ల తుపాకులు చలామణీలో ఉన్నాయని... ప్రతి వంద మంది పౌరుల దగ్గరా సగటున కనీసం 120 తుపాకులు ఉండొచ్చని స్విట్జర్లాండ్‌కు చెందిన పరి శోధనా సంస్థ లెక్కగట్టింది. ఇది 2018 నాటి మాట. అమెరికాలో ఏ రాష్ట్రంలోనూ తుపాకుల అమ్మకానికి సంబంధించిన డేటా బేస్ లేదు. పైగా పకడ్బందీ చట్టాలు కొరవడి బ్లాక్ మార్కెట్ జోరుగా సాగుతుంటుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నకాలంలో ప్రతి అయిదు కుటుంబా ల్లోనూ ఒక కుటుంబం తుపాకి కొనుగోలు చేసిందని మరో సంస్థ తేల్చింది. ఇదంతా చూస్తే ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల దగ్గరుండే తుపాకుల సంఖ్య ఎన్ని కోట్లు దాటివుంటుందో ఊహకందదు. హార్వర్డ్, నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలు 2016లో తేల్చిన లెక్క ఆసక్తికరమైంది. అమెరికాలో అమ్ముడైన తుపా కుల్లో సగభాగం కేవలం 3 శాతంమంది దగ్గర కేంద్రీకృతమయ్యాయని ఆ పరిశోధన సారాంశం. తుపాకుల విచ్చలవిడి అమ్మకానికీ, వాటి ద్వారా జరిగే హింసకూ మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని చెప్పడానికి పెద్ద పరిశోధన అక్కరలేదు. కానీ అలా పరిశోధించి చెప్పే నివేదికలకు కూడా అక్కడి తుపాకి లాబీ పెద్ద ప్రాధాన్యం ఇవ్వదు. వాటికి పోటీగా నివేదికలు విడుదల చేసి పౌరులను అయోమయంలోకి నెట్టే యత్నం చేస్తుంది. కాల్పులు జరిగినచోట ‘మంచి వ్యక్తి’ గనుక తుపాకితో ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవికాదని ఆ నివేదికలు చెబుతుంటాయి. విచ్చలవిడి కాల్పుల ఉదంతాల నిరోధానికి పౌరుల దగ్గర మరిన్ని తుపాకులుండటమే పరిష్కా రమని తుపాకుల తయారీ పరిశ్రమలకు చెందిన జాతీయ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏ) సంస్థ చెప్పిందంటే దాని తెలివి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్, స్వీడన్, జర్మనీ, బెల్జియంలలో తుపాలకు అమ్మకంపై గట్టి నియంత్రణలున్నాయి. కెనడాలో 2020 కాల్పుల ఉదంతం తర్వాత రెండు వారాల్లోనే ఆయుధ ధారణపై కఠిన ఆంక్షలు విధిస్తూ చట్టం తీసుకొచ్చారు. న్యూజిలాండ్‌లో 51మందిని కాల్చిచంపిన క్రైస్ట్ చర్చ్ నగరం ఉదంతం తర్వాత పౌరుల దగ్గరున్న తుపాకులను ప్రభుత్వం కొని ధ్వంసం చేసేలా చట్టం తెచ్చారు. ఆస్ట్రేలియాలో 1996నాటి కాల్పుల ఘటన తర్వాత పౌరులనుంచి 6,50,000 తుపాకులు సేకరించి ధ్వంసం చేశారు. ఆ దేశాల్లో ఇలాంటి చట్టాలు తెచ్చాక హింస గణనీయంగా తగ్గింది. అయినా ఎన్ఆర్ఏ తన తర్కం వీడదు. ఫలితంగా తరచు దుండగుల తుపాకులకు పదులకొద్దీమంది నేలకొరుగుతున్నారు. అనేకులు గాయాలపాలై వికలాంగులవుతున్నారు. అక్కడ చదువుల కోసం, కొలువుల కోసం వెళ్తున్న మన పౌరులు అనేక మంది ఈ మారణహోమంలో సమిధలవుతున్నారు. అమెరికన్ సమాజం కళ్లు తెరడానికి మరెన్ని బలిదానాలు జరగాలో?! -
మనుషుల కంటే తుపాకులెక్కువ ! 3 వారాలు.. 38 కాల్పులు.. 70 ప్రాణాలు
మీకు ఒక విషయం తెలుసా..? అమెరికాలో నిప్పులు గక్కిన తుపాకీ తూటాలకు 1968–2017 మధ్య 15 లక్షల మంది అమాయకులు బలయ్యారు. ఈ సంఖ్య అమెరికా స్వాతంత్య్ర సంగ్రామం నుంచి ఆ దేశం చేసిన యుద్ధాల్లో కోల్పోయిన సైనికుల కంటే ఎక్కువ. గత ఏడాదే అమెరికా తుపాకుల విక్రయానికి సంబంధించి బైడెన్ ప్రభుత్వం కఠిన చట్టాన్ని తెచ్చింది. అయినప్పటికీ కొత్త సంవత్సరంలో కేవలం మూడు వారాల్లో 38 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. దాదాపుగా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యంలో ఈ దారుణ మారణకాండను ఇక అరికట్టలేరా ? అమెరికా నెత్తురోడుతోంది. గన్ కల్చర్ విష సంస్కృతి మరింతగా విస్తరిస్తోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కాల్పుల శబ్దాలు భయపెడుతున్నాయి. అయితే చంపడం, లేదంటే ఆత్మహత్య చేసుకొని చావడం. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి బయటకు వెళితే క్షేమంగా వెనక్కి వస్తారో లేదో తెలీదు. చదువుకోవడానికి బడికి వెళితే ఏ ఉన్మాది ఏం చేస్తాడోనని హడలిపోవాలి. నైట్ క్లబ్బులో విందు వినోదాలైనా, రాత్రి పూట ఒంటరిగా బయటకు వెళ్లినా ఎటు వైపు నుంచి ఈ తూటా దిగుతుందో చెప్పలేము. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్న వాళ్లలో యువత ఎక్కువ మంది ఉన్నారని తేలడంతో గత ఏడాది జూన్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ వారి చేతుల్లోకి తుపాకులు వెళ్లకుండా విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ కొత్త చట్టాన్ని తెచ్చారు. అయినా కాల్పులు పెరిగాయే తప్ప తగ్గలేదు. 2023కి అగ్రరాజ్యం కాల్పులతో స్వాగతం పలికింది. ఒహియో, ఫ్లోరిడా, షికాగో, కరోలినా, పెన్సిల్వేనియాలలో తుపాకీల మోత మోగింది. అప్పట్నుంచి 38 సార్లు కాల్పులు జరిగితే 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 21న కాలిఫోర్నియాలో మాంటెరరీ పార్క్‌లో చైనీయుల కొత్త సంవత్సరం వేడుకల్లో జరిగిన కాల్పుల్లో 11 మంది మరణిస్తే 48 గంటలు తిరక్కుండానే కాలిఫో ర్నియా హాఫ్ మూన్ బే వ్యవసాయక్షేత్రంలో ఏడు గురు తూటాలకు బలయ్యారు. షికాగోలో జరిగిన మరో కాల్పుల ఘటనలో ఇద్దరు మరణించారు. ఎన్నాళ్లీ నెత్తుటి మోత ..! అమెరికా రాజ్యాంగానికి రెండో సవరణ పౌరులు తుపాకులు కలిగి ఉండే హక్కుని కల్పించింది. రెండు ప్రధాన పార్టీల్లో రిపబ్లికన్లు తుపాకీలు కలిగి ఉండడానికి మద్దతుగా ఉండడం ఈ విషసంస్కృతిని కూకటి వేళ్లతో పెకిలించివేయడానికి వీల్లేకుండా చేస్తోంది. ప్రభుత్వం గన్ కల్చర్‌పై కఠిన ఆంక్షలు విధించాలని భావించిన సమయంలో సుప్రీం కోర్టు బహిరంగంగా తుపాకీ తీసుకువెళ్లే హక్కు అమెరికన్లకు ఉందంటూ గత ఏడాది సంచలన తీర్పు ఇచ్చింది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ప్రజాప్రతినిధులతో బలమైన లాబీయింగ్ చేస్తూ తుపాకుల నిషేధానికి ఎప్పటికప్పుడు అడ్డం పడుతూ ఉంటుంది. టెక్సాస్ పాఠశాలలో ఒక టీనేజర్ జరిపిన కాల్పుల ఘటనలో 21 మంది విద్యార్థులు బలవడంతో ఒక్కసారిగా ప్రజల్లో కూడా తుపాకీ సంస్కృతిపై వ్యతిరేకత వచ్చి అదొక ప్రజా ఉద్యమంగా మారింది. అమెరికా ప్రజల్లో 60శాతం మంది తుపాకుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీనేజర్లకి తుపాకులు విక్రయిస్తే వారి నేరచరితను విచారించాలంటూ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రిపబ్లికన్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేయడం లేదు. శక్తిమంతమైన రాష్ట్రాలు తలచుకుంటేనే ఈ తుపాకుల హింసకు అడ్డుకట్టపడుతుందనే అభిప్రాయాలున్నాయి. ► అమెరికాలో తుపాకీ తూటాలకు రోజుకి సగటున 53 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ► కరోనా సమయంలో కాల్పుల ఘటనలు ఎక్కువగా జరిగాయి. ఆ సమయంలో తుపాకుల అమ్మకాలు ఏకంగా 63% పెరిగాయి. ► 2013 నుంచి ఏఆర్–15 రైఫిల్స్ అమ్మకాలు ఏడాదికి కోటికి పైగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ► 2020లో కాల్పులు దేశ చరిత్రలో మాయని మచ్చగా నిలిచాయి. ఆ ఏడాది 610 కాల్పులు జరగ్గా 45,222 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో హత్యలు, ఆత్మహత్యలు కూడా ఉన్నాయి. ► 2021లో రైఫిళ్లు, పిస్తోళ్లు వంటి చిన్న ఆయుధాల మార్కెట్ 370 కోట్ల డాలర్లుగా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అడవికి ఊపిరి.. తుపాకీకి ఉరి
కొత్త సంవత్సరంలో ముచ్చటగా మూడోసారి బ్రెజిల్ గద్దెనెక్కిన లూలా డ సిల్వా రెండు కీలక అంశాలపై దృష్టి సారించారు. జనవరి 1న దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేసినప్పుడు తుపాకుల సంస్కృతిని కట్టడి చేస్తానని, అమెజాన్‌లో బంగారం తవ్వకాలకు అడ్డుకట్ట వేసి అడవులకి కొత్త ఊపిరిలూదుతానని ప్రకటించారు. ఈ రెండు అంశాలు లూలా ప్రభుత్వానికి ఎందుకంత ప్రాధాన్యంగా మారాయి ? వామపక్ష భావజాలం కలిగిన నాయకుడైన లూలా రెండు పర్యాయాల పాలనలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చి జన హృదయాలను గెలుచుకున్నారు. వీటిని కూడా నెరవేరిస్తే ఆయన పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోవడం ఖాయం. సరిగ్గా 20 ఏళ్ల కిందట బ్రెజిల్ అధ్యక్షుడిగా లూలా డ సిల్వా తొలిసారి అధ్యక్షుడైనప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఈ సారి ఎన్నికల్లో లూలా అత్యంత స్వల్ప మెజార్టీతో నెగ్గారు. 50.9% ఓటు షేర్ లూలాకు వస్తే, మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకి 49.1% ఓట్లు వచ్చాయి. కేవలం రెండు శాతం ఓట్లతో తేడాతో నెగ్గిన లూలా తాను అనుకున్నవీ ఎంత సాధించగలరో అన్న అనుమానాలైతే ఉన్నాయి. ఇప్పటికే బోల్సోనారో మద్దతుదారులు రోడ్లపైకెక్కి తిరిగి తమ నాయకుడినే అధ్యక్షుడిని చేయాలంటూ దేశాన్ని రణరంగంగా మారుస్తున్నారు. శాంతి భద్రతలకే సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో లూలా తన పీఠాన్ని కాపాడుకోవడానికే సర్వశక్తులు ఒడ్డాల్సి వస్తోంది. దేశానికి ఒకప్పుడు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 4.4 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేసి ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు అందుకున్న లూలా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక అవినీతి ఆరోపణలపై జైల్లో గడపడంతో ఆయనపైనున్న విశ్వాసం కొంతవరకు ప్రజల్లో సన్నగిల్లింది. ఆ తర్వాత కేసుల నుంచి విముక్తుడైనప్పటికీ తుపాకుల సంస్కృతిని, అమెజాన్ అడవుల్ని కాపాడితే మరోసారి లూలా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోవడం ఖాయం. అందుకే తన ప్రమా ణ స్వీకారం రోజే బోల్సోనారో తుపాకులు సులభంగా కొనుక్కోవడానికి వీలుగా జారీ చేసిన డిక్రీలను రద్దు చేశారు. తుపాకుల నియంత్రణకు, బంగారం తవ్వకాలకి సంబంధించి కొత్త డిక్రీలు జారీ చేసి అభిమానుల నుంచి జేజేలు అందుకున్నారు. పెచ్చు మీరుతున్న తుపాకుల సంస్కృతి బ్రెజిల్లో మార్కెట్‌కి వెళ్లి బీన్స్ కొనుక్కోవడం ఎంత తేలికో తుపాకుల కొనుగోలు కూడా అంతే సులభం. జైర్ బోల్సోనారో 2019 జనవరి 1న దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక తుపాకుల నియంత్రణ చట్టాలను సులభతరం చేశారు. గన్ లైసెన్స్లకుండే గడువుని అయిదేళ్ల నుంచి పదేళ్లకు పెంచారు. దీంతో ఆత్మరక్షణ పేరుతో తుపాకుల్ని విచ్చలవిడిగా కొనేవారి సంఖ్య పెరిగిపోయింది. తుపాకుల మరణాల్లో ప్రపంచంలో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంది. సగటున ఏడాదికి 40 వేల మంది మృత్యువాత పడడం చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల్ని బహిరంగంగా ప్రశంసించే బోల్సోనారో అమెరికా బాటలో విచ్చలవిడి తుపాకుల విక్రయానికి తెరతీశారు. దీంతో బ్రెజిల్ తుపాకుల కాల్పుల ఘటనతో రక్తమోడుతోంది. లూలా డ సిల్వా అధ్యక్షుడయ్యాక తుపాకుల నియంత్రణకి చేపడుతున్న చర్యలు ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. ఒక సర్వే ప్రకారం దేశంలో మూడింట రెండు వంతుల మంది ప్రజలు తుపాకులు ప్రజల చేతుల్లో ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమెజాన్ అడవుల్లో గోల్డ్ మైనింగ్ అమెజాన్ అటవీ ప్రాంతంలో 60శాతానికిపైగా బ్రెజిల్లో ఉంది. భూమ్మీద ఉండే ఆక్సిజన్‌లో 10శాతం ఇక్కడ నుంచి వస్తూ ఉండడంతో భూమాతకి ఊపిరితిత్తులుగా అమెజాన్‌ను అభివర్ణిస్తారు. ప్రపంచంలో అతి పెద్ద అన్‌రిజిస్టర్డ్ మైనింగ్ ఇండస్ట్రీకి ఈ అడవులే వేదికయ్యాయి. గనుల నుంచి బంగారాన్ని వెలికి తీయడానికి పాదరసాన్ని వాడుతుంటారు. ఈ పాదరసంతో అమెజాన్ నదుల్లో నీరు విషతుల్యంగా మారుతున్నాయి. దీంతో ఈ అడవుల్లో ఉన్న 25 లక్షల రకాల జీవజాలానికి ముప్పు ఏర్పడుతోంది. అడవుల్లో నివసించే స్థానిక గిరిజనులకు గోల్డ్ మైనర్ల నుంచి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. బ్రెజిల్ అటవీ ప్రాంతంలో బంగారం స్మగ్లర్లను గారింపీర్స్ అని పిలుస్తారు. వీరందరి వెనకాల మాజీ అధ్యక్షుడు బోల్సోనారో ఉన్నారనే ప్రచారం ఉంది. బోల్సోనారో తండ్రి కూడా గారింపీర్ కావడంతో అమెజాన్ అడవులు నాశనం కావడానికి బోల్సోనారో కుటుంబమే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కరోనా సంక్షోభ సమయంలో అయిదు నెలల కాలంలో బంగారం ధరలు 40% పెరిగిపోవడంతో గోల్డ్ స్మగ్లర్లు ఈ ప్రాంతంలో తమ పట్టు పెంచుకున్నారు. వీరికి రాజకీయ నేతల అండదండలు ఉండడంతో వీరిని కాదని చర్యలు తీసుకోవడం అంత సులభం కాదు. అధ్యక్ష ఎన్నికల్లో అమెజాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్ని జిల్లాల్లోనూ బోల్సొనారో కంటే లూలా వెనుకబడ్డారు. అందుకే ఆయన ప్రతీ నిర్ణయం ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. ► ప్రపంచ మార్కెట్లో లభ్యమయ్యే బంగారంలో 20% అమెజాన్ అడవుల నుంచే వస్తుంది. ► ఈ గోల్డ్ మైనింగ్‌లు 2 లక్షల మందికి జీవనాధారంగా ఉన్నాయి. ► అమెజాన్‌లో బంగారం తవ్వకాల కోసం 2017 నుంచి అడవుల నరికివేత పెరిగిపోతోంది. ► అమెజాన్ అటవీ విస్తీర్ణం ఇప్పటికే 20% తగ్గిపోయింది. అంటే ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల సైజుతో ఇది సమానం. ఇందులో మైనింగ్ కోసమే 90% చెట్లను నరికేశారు. ► పర్యావరణ పరిరక్షణ చట్టాలను మాజీ అధ్యక్షుడు బోల్సోనారో తుంగలో తొక్కడంతో 2019లో అమెజాన్ అడవుల్లో 10,500 హెక్టార్ల విస్తీర్ణం తగ్గిపోయింది. ► 2018 సంవత్సరంతో పోలిస్తే గోల్డ్ మైనింగ్ కోసం 2019లో 23% అధికంగా, 2020 నాటికి 80శాతం అధికంగా అడవుల్ని నరికివేశారు. ► ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో తుపాకుల సంఖ్య దాదాపుగా 20 లక్షలకి చేరుకుంది. ► 2018తో పోల్చి చూస్తే తుపాకుల్ని వినియోగించే ప్రజల సంఖ్య రెట్టింపైంది. ► గత ఏడాది జులైలో తుపాకులకి లైసెన్స్ ఇచ్చే సంస్థ సీఏసీ దగ్గర 6 లక్షలకు పైగా తుపాకుల లైసెన్స్ మంజూరు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ► 2018తో పోల్చి చూస్తే ఇది ఏకంగా 500% ఎక్కువ. ► 2019లో అత్యధికంగా 49,436 మంది తూటాలకు బలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇటలీ కేఫ్‌లో కాల్పులు.. ప్రధాని మెలోనీ స్నేహితురాలు మృతి
రోమ్: ఇటలీ రాజధాని రోమ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో దేశ ప్రధాని స్నేహితురాలు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. రోమ్‌లోని ఫిడెన్ జిల్లాలోని ఓ కేఫ్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం జరగాల్సిన తమ అపార్ట్మెంట్ కమిటీ రెసిడెంట్స్ కమిటీ సమావేశంపై చర్చించేందుకు కొందరు సభ్యులు ఓ కేఫ్‌లో సమావేశమయ్యారు. ఇంతలోనే తుపాకీతో అక్కడికి చేరుకున్న ఓ వ్యక్తి అందరినీ చంపేస్తానని అరుస్తూ ఒక్కసారిగా వారిపైకి కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళలు చనిపోగా మరో నలుగురు గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నికొలెట్టా గొలిసానో(50) తన స్నేహితురాలేనంటూ ప్రధాని జార్జియా మెలోనీ గతంలో ఆమెతో దిగిన సెల్ఫీని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పారీ్టకి చెందిన మెలోనీ దేశ తొలిæ మహిళా ప్రధానిగా అక్టోబర్‌లో బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
చికెన్‌లో గన్.. ఎయిర్పోర్ట్ అధికారులు షాక్!
ఇంతవరకు కొంతమంది నేరస్తులు రకరకాల మార్గాల్లో ఆయుధాలను, బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కంటపడకుండా తరలిస్తుంటారని తెలుసు. కొంతమంది విగ్గుల్లోనూ, షూ, పెన్ వంటి విచిత్రమైన ప్రదేశాల్లో చాలా గమ్మత్తుగా బంగారాన్ని తరలించడం చూశాం. అలాగే ఆయుధాలను కూడా చాలా వెరైటీగా తరలిస్తుంటారు. ఐతే ఇక్కడొక వ్యక్తి వారందరికంటే భిన్నంగా ఆయుధాన్ని తరలించే యత్నం చేసి పట్టుబడ్డాడు. వివరాల్లోకెళ్తే...యూఎస్‌లోని ఒక వ్యక్తి చికెన్‌లో గన్ని స్టఫ్ చేసి చక్కగా ప్యాకింగ్ చేసుకుని ఫ్లోరిడాలో లాడర్డేల్ హాలీవుడ్ విమానాశ్రయానికి వచ్చాడు. అక్కడ అందరీ ప్రయాణికులను తనిఖీ చేసినట్లుగానే ఇతన్ని తనిఖీ చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు. అతని వద్ద ఉన్న ప్యాకింగ్ చికెన్‌ని చూసి కాస్త ఆశ్చర్యంతోపాటు సందేహం కూడా వచ్చింది అధికారులకు. దీంతో ఆ ప్యాకింగ్ కవర్ని ఓపెన్ చూసి పరిశీలించగా...ఆ చికెన్ లోపల గన్ని కుక్కి ఉంచాడాన్ని చూసి ఒక్కసారిగా అధికారులు షాక్‌కి గురయ్యారు. ఇంతవరకు తాము వివిధ రకాల్లో ఆయుధాలను తరలించడం చూశాం గానీ ఇలా ఇంత వింతగా తరలించేందుకు యత్నించడం చూసి ఆశ్చర్యపోయాం అన్నారు. దీంతో సదరు వ్యక్తి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు ఎయిర్పోర్ట్ పోలీసులు. వాస్తవానికి యూఎస్ ఎయిర్‌లైన్స్‌లో తుపాకీలను నిషేధించ లేదు. కానీ ప్రయాణికులు వాటిని తీసుకుని వెళ్లేటప్పుడూ..తనిఖీ చేసే సామానుల్లోనే తీసుకువెళ్లాలి. పైగా ఆ తుపాకీలను అన్లోడ్ చేసి హార్డ్ కంటైనర్‌లో లాక్ చేసి పట్టుకెళ్లాలి. ఇలా అక్రమ మార్గంలో తరలించేందుకు యత్నిస్తే మాత్రం పోలీసులు కచ్చితంగా సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటారు. There’s a personal fowl here. Our officers @FLLFlyer made this very raw find. We hate to break it to you but stuffing a firearm in your holiday bird for travel is just a baste of time. So, don’t wing it, you'll find all the proper packaging info here: https://t.co/Zm2XnorDx7 pic.twitter.com/BpdbEwwouX — TSA (@TSA) November 7, 2022 (చదవండి: ఆవకాయబద్ద గొంతులో ఇరుక్కుని మహిళ పాట్లు! ఆశ్చర్యపోయిన వైద్యులు) -
రష్యా కేఫ్‌లో అగ్నికీలలు
మాస్కో: రష్యాలోని కోస్ట్రోమా పట్టణంలో శనివారం ఓ కేఫ్‌లో ఇరు వర్గాల మధ్య గొడవలో ఫ్లేర్ గన్ను పేల్చడంతో చెలరేగిన మంటలకు 13 మంది బలయ్యారు. ఏకంగా 37,000 చదరపు అడుగుల మేర విస్తరించిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చెమటోడ్చారు. సమీప భవనాల వారిని ఖాళీ చేయించారు. అనుమానితున్ని అరెస్టు చేశారు. 2009లోనూ పెర్మ్ నగరంలో నైట్‌క్లబ్‌లో బాణసంచా పేల్చడంతో మంటలంటుకుని 150 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. -
అమెరికాలో మళ్లీ కాల్పులు
పిట్స్బర్గ్: అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో కాల్పులు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు మరణించారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. శనివారం రాత్రి 10 గంటలకు నార్త్‌సైడ్ ఇంటర్సెక్షన్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. కాల్పులకు బాధ్యులు ఎవరన్నది ఇంకా నిర్ధారించలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. అలాగే బాధితుల వివరాలను పోలీసులు బయటపెట్టలేదు. కాల్పులు జరిపింది ఒక్కరేనా లేక ఎక్కువ మంది ఉన్నారా? అనే దానిపై దర్యాప్తు సాగుతోంది. -
ఉత్తర కరొలినాలో కాల్పుల కలకలం
రాలీ: యూఎస్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర కరొలినాలో (North Carolina) ఓ దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. రాజధాని రాలీ Raleigh నగరంలోని న్యూస్ రివర్ గ్రీన్వే సమీపంలో అక్కడి కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడినట్లు మేయర్ మేరీ బల్డవిన్ ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ఓ టీనేజర్ ఈ కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్న పోలీసులు.. ఓ ఇంట్లో దాక్కున్నాడనే సమాచారంతో చుట్టుమట్టి అదుపులోకి తీసుకునే యత్నం చేశారు. చివరకు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నార్త్ కరొలినా కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం అంచనా వేస్తున్నారు. మరణించినవారిలో ఒక పోలీస్(ఆఫ్ డ్యూటీలో ఉన్నారు) కూడా ఉన్నాడని పేర్కొన్నారు. గన్ వయొలెన్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు(యూఎస్ఏ) ప్రధాన సమ్యగా మారింది. 2021 ఏడాదిలోనే 49వేల మందికిపైగా మరణించారు. ఈ లెక్కన రోజుకు సగటున 130 మంది మరణించారన్నమాట. అంటే.. ఇది ఆత్మహత్యల కేసుల కంటే బాగా ఎక్కువనేది విశ్లేషకుల అభిప్రాయం. The Raleigh Police Department is currently on the scene of an active shooting in the area of the Neuse River Greenway near Osprey Cove Drive and Bay Harbor Drive. Residents in that area are advised to remain in their homes. — Raleigh Police (@raleighpolice) October 13, 2022 -
మూడేళ్ల చిన్నారి చేతిలో తల్లి మృతి
అమెరికాలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తన తల్లిని కాల్చి చంపింది. ఈ ఘటన సౌత కరోలినాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మూడేళ్ల పసిపాపకి అనుకోకుండా తుపాకీ లభించింది. అంతే ఆ చిన్నారి ఆ తుపాకీని పట్టుకుని ఆడుకోవడం ప్రారంభించింది. దీన్నీ చూసిన చిన్నారి తల్లి వెంటనే అప్రమత్తమై ఆమె వద్ద నుంచి లాక్కునేందుకు యత్నించింది. ఐతే చిన్నారి నుంచి లాక్కునే క్రమంలో తల్లిపై ప్రమాదవశాత్తు కాల్పులు జరిపింది ఆ చిన్నారి. ఆ ప్రమాదంలో చిన్నారి తల్లి తీవ్రంగా గాయపడింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆ చిన్నారి అమ్మమ్మ వెల్లడించారు. బాధితురాలు స్పార్టన్‌బర్గ్‌లో నివశించే కోరా లిన్ బుష్ అనే మహిళగా గుర్తించారు అధికారులు. ఇలా యూఎస్‌లోని చిన్నారుల్లో దాదాపు 194 మంది ప్రమాదవశాత్తు కాల్పులు జరిపారని, అందువల్ల సుమారు 82 మంది మరణించగా, 123 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. (చదవండి: అణుయుద్ధం జరిగినప్పుడూ... జుట్టుకి కండీషనర్ వద్దు..హెచ్చరించిన పుతిన్) -
హుజురాబాద్‌లో గన్ కలకలం.. నాకేం జరిగినా కేసీఆర్‌దే బాధ్యత: ఈటల షాకింగ్ కామెంట్స్
సాక్షి, హుజురాబాద్: బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఓ నాయకుడి వద్ద గన్ కనిపించడం కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, బహిరంగ కార్యక్రమంలో ఇలా గన్‌తో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. అయితే, దీనికి సంబంధించిన వీడియోపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో గన్ లైసెన్స్‌లు విచ్చలవిడిగా ఇస్తున్నారు. నాకు, నా కుటుంబ సభ్యులకు ఏం జరిగినా సీఎం కేసీఆర్‌దే బాధ్యత. మా రక్తం బొట్టు చిందినా సీఎందే పూర్తి బాధ్యత. ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదు. నాపై నయిమ్ గ్యాంగ్ రెక్కీ నిర్వహించినప్పుడే భయపడలేదన్నారు. ఇక, గన్ లైసెన్స్‌లపై కరీంనగర్ పోలీసు కమిషనర్ సత్యనారాయణ స్పందించారు. ఈ క్రమంలో సీపీ మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లలో హుజురాబాద్‌లో కేవలం ఇద్దరికి మాత్రమే గన్ లెసెన్స్ ఇచ్చినట్టు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఒక్కరూ కూడా గన్ లైసెన్స్ కోసం దరఖాస్తున చేసుకోలేదని స్పష్టం చేశారు. ఇక, గన్‌తో కనిపించిన నేతను సైతం పోలీసులు స్టేషన్‌కు పిలిపించుకుని మరోసారి ఇలా జరిగితే లైసెన్స్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. -
మునుగోడులో కాల్పుల కలకలం! అసలు కారణం ఇదేనా?
మునుగోడు, నార్కట్‌పల్లి: వాటర్ బాటిల్స్ సరఫరా చేసే డీలర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ద్విచక్ర వాహనంపై వచ్చి దాడి చేసి వెంటనే పరారయ్యాడు. మూడు చోట్ల బుల్లెట్ గాయాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికంగా జరిగిన గొడవలే దీనికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారంలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. (చదవండి: కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్.. మునుగోడు ఉపఎన్నికలో సామాజిక అస్త్రంగా!) గోదాంకు వెళ్లి వస్తుండగా.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల గ్రామానికి చెందిన నిమ్మల స్వామి కొన్నేళ్లపాటు ట్రాక్టర్ నడిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ వాటర్ బాటిల్ కంపెనీ డీలర్షిప్ తీసుకుని.. మునుగోడు, చండూరు మండలాలకు సరఫరా చేస్తున్నారు. మునుగోడులోని లక్ష్మిదేవిగూడెంలో ఉన్న తన గోదాముకు బ్రాహ్మణవెల్లెంల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. గురువారం రాత్రి ఆయన బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా.. సింగారం గ్రామ శివార్లలో మరో బైక్‌పై వచ్చి న దుండగులు పిస్టల్‌తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. స్వామి వెన్నెముక భాగంలో రెండు, కుడి అరచేతికి ఒక బుల్లెట్ తగిలి కిందపడిపోయారు. సమీపంలోని ఇళ్లవారు ఇది చూసి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారమిచ్చారు. కుటుంబ సభ్యులు స్వామిని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా.. చిట్యాలకు చెందిన రేడియం స్టికర్స్ వేసే వ్యక్తి లేదా మునుగోడుకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారులు తనపై కాల్పులు జరిపి ఉంటారని స్వామి అనుమానం వ్యక్తం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. (చదవండి: వైఎస్సార్ తెలంగాణ పార్టీలోకి కాంగ్రెస్ యువ నేత.. కండువా కప్పి ఆహ్వానించిన షర్మిల) -
మాదాపూర్ ఫైరింగ్‌తో ఉలికిపాటు.. హైదరాబాద్‌లో పెరుగుతున్న గన్ కల్చర్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వరుస స్నాచింగులకు పాల్పడి తమను పట్టుకోవడానికి ప్రయత్నించిన హెడ్–కానిస్టేబుల్‌ను కత్తితో పొడిచిన కలబురిగి స్నాచర్లు ఇషాన్, రాహుల్ తమ వెంట రెండు తుపాకులు తెచ్చుకున్నారు. ఈ విషయం గురువారం వారిని అరెస్టు చేసిన సందర్భంలో వెలుగులోకి వచ్చింది. సోమవారం మాదాపూర్ ఠాణా పరిధిలోని నీరూస్ చౌరస్తాలో రియల్టర్లుగా మారిన ఇద్దరు నేరచరితుల మధ్య రేగిన వివాదం కాల్పులకు దారి తీసింది. ఇలా రాజధానిలో తరచూ తుపాకీ వినియోగమనేది కలకలం సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో చిన్న వివాదానికీ తుపాకులు, తూటాలు ‘తెరపైకి’ వస్తున్నాయి. తుపాకులకు సంబంధించిన అత్యధిక నేరాలు అక్రమాయుధాలతోనే జరుగుతున్నాయి. రాజధానిలో ఉన్న లైసెన్స్డ్ ఆయుధాలకు వాటికి రెండు రెట్లకుపైగా అక్రమ ఆయుధాలు వినియోగంలో ఉన్నాయన్నది అనధికారిక అంచనా. ఇవి అనేక ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అక్కడ కుటీర పరిశ్రమలుగా... బిహార్, ఉత్తరప్రదేశ్‌ల్లోని అనేక ప్రాంతాల్లో తుపాకుల తయారీ ఓ కుటీర పరిశ్రమగా సాగుతోంది. నగరానికి సరఫరా అవుతున్న నాటు తుపాకుల్లో దాదాపు 90 శాతం ఇక్కడ నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ఒకప్పుడు కేవలం తపంచాలకు మాత్రమే పరిమితమై ఉన్న ఈ ‘పరిశ్రమలు’ ఇప్పుడు అత్యాధునికమైనవీ తయారు చేస్తున్నాయి. బిహార్‌లోని ముంగేర్, గయ, యూపీలోని నాన్గల్, హసన్పూర్ తదితర ప్రాంతంలో తయారవుతున్న నాటు తుపాకులకు సేఫ్టీలాక్ వంటి ఆధునిక ఫీచర్స్ కూడా ఉంటున్నాయి. కేవలం కంపెనీ మేడ్ పిస్టల్స్‌కు మాత్రమే ఇది ఉండేది. ఇక్కడ తయారయ్యే వాటిలో రివాల్వర్లకు సైతం సేఫ్టీ లాక్ ఏర్పాటు చేస్తున్నారు. బిహార్, యూపీల నుంచి నగరానికి సరఫరా అవుతున్న వాటిలో ఆటోమేటెడ్, సెమీ– ఆటోమేటెడ్ రకాలతో పాటు అతి చిన్న సైజులో ఉండే సింగిల్ షార్ట్ గన్స్ కూడా ఉంటున్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. కేవలం డిఫెన్స్, పోలీసు శాఖలు మాత్రమే వాడే ప్రొహిబిటెడ్ బోర్‌గా పిలిచే పాయింట్ 9 ఎంఎంలనూ అక్కడి వ్యక్తులు నాటు పద్ధతిలో తయారు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇదీ నాటు ఆయుధాల ‘మెనూ’.. తపంచా: రూ.1000 నుంచి రూ.2 వేలు రివాల్వర్: రూ.5 వేల నుంచి రూ.10 వేలు పిస్టల్: రూ.12 వేల నుంచి రూ.15 వేలు సింగిల్ షార్ట్ గన్: రూ.17 వేల వరకు ఆటోమేటెడ్ పిస్టల్: రూ.18 వేల నుంచి రూ.20 వేలు ఆటోమేటెడ్ రివాల్వర్: రూ. 20 వేలకు పైగా తేలిగ్గా నగరానికి రవాణా.. నగరానికి ఉత్తరాది నుంచి తుపాకులు సరఫరా చేయడానికి ఆయా ముఠాలు ఏమాత్రం కష్టపడట్లేదు. ఈ అక్రమ రవాణా కోసం ప్రత్యేక ముఠాలు కూడా పని చేస్తున్నాయి. వీరికీ రైలు మార్గం ఓ వరంగా మారింది. రైల్వేస్టేషన్లు, జనరల్ బోగీల్లో తనిఖీలు అంతంత మాత్రంగా ఉండటంతో వీటిలోనే ఆయుధాలు రవాణా చేస్తున్నాయి. వీటికి తోడు ట్రాన్స్పోర్ట్ లారీల్లోనూ ఇవి నగరానికి వస్తున్నాయి. ఓ పక్క ముఠాలే కాకుండా... అక్కడ నుంచి వచ్చే దినసరి కూలీలు సైతం ఆయుధ వ్యాపారాన్ని అదనపు ఆదాయ మార్గంగా భావిస్తున్నారు. పనుల కోసం నగరంలో స్థిరపడిన బిహారీలు రాకపోకలు సాగించే సమయంలో తమతో పాటు కొన్ని ఆయుధాలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. నగరంలోని పాతబస్తీతో పాటు శివార్లలో ఉన్న అనేక ప్రాంతాల్లో వీటిని విరివిగా అమ్ముతున్నారు. నిఘా అంతంత మాత్రమే.. ఎప్పటికప్పుడు ఆయుధాలు, వాటిని విక్రయించేందుకు ప్రయత్నించిన, కొనుగోలు చేసిన వారిని పట్టుకుని చేతులు దులుపుకొంటున్న పోలీసులు వీటి మూలాలను కనుక్కోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. సిటీలో అక్రమ ఆయుధ వ్యాపారంపై పోలీసు నిఘా సైతం అంతంత మాత్రంగానే ఉందని చెప్పవచ్చు. ఈ ఆయుధాలు బిహార్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి వచ్చి చేరుతున్నాయని చెబుతున్న అధికారులు అవి వస్తున్న మార్గాలపై మాత్రం కన్నేసి ఉంచలేకపోతున్నారు. ఫలితంగా ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఓ ముఠా దొరికినప్పుడు వారిని అరెస్టు చేయడంతో సరిపెట్టాల్సి వస్తోంది. ఎవరైనా చొరవ తీసుకుని కాస్త ముందడుగు వేసి దర్యాప్తు కోసం రాష్ట్రం దాటినా... వారికి అక్కడి పోలీసుల నుంచి సరైన సహకారం అందుతుందని ఆశించలేం. ఒక్కోసారి ఎదురుదాడులు జరిగే పరిస్థితి ఉంది. బిహార్, ఉత్తరప్రదేశ్‌ల్లో ఈ పరిస్థితులు మరీ ప్రమాదకరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆసక్తి ఉన్న అధికారులు సైతం మిన్నకుండి పోవాల్సి వస్తోంది. చదవండి: మాదాపూర్‌లో కాల్పుల కలకలం.. రియల్టర్ మృతి -
కారును చుట్టుముట్టిన దొంగలు.. సింహంలా పోరాడిన వ్యక్తి.. వీడియో వైరల్
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాలో దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. ముఠాలుగా యథేచ్చగా దొంగతనాలకు పాల్పడున్నారు. దీంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అయితే ఓ వ్యక్తి దొంగల బారి నుంచి తనను, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు సింహంలా పోరాడాడు. ముసుగులు ధరించిన దొంగల ముఠా ఆయన కారును చుట్టుముట్టగా.. కత్తితో వారిని హడలెత్తించాడు. ఓ దొంగను దాదాపు పొడిచినంత పని చేశాడు. అతని తెగువను చూసి దొంగలంతా అక్కడి నుంచి వెనుదిరిగారు. “But why would I need a gun in South Africa” pic.twitter.com/po6zq83e7p — Roman Cabanac (@RomanCabanac) July 20, 2022 ఓవైపు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆత్మరక్షణ కోసం గన్ లెసెన్సులు జారీ చేయకుండా చట్టాన్ని తేవాలని ఆలోచిస్తున్న సమయంలో.. ఈ దొంగల ముఠాకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కుటుంబం కోసం వీరోచితంగా పోరాడిన సదరు వ్యక్తి ధైర్యాన్ని నెటిజన్లు కొనియాడారు. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా గన్ లెైసెన్స్ అంశంపై చర్చిస్తున్నారు . ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు గన్ ఉంటే బాగుండేదని, అందుకే ఆత్మరక్షణ కోసం గన్ లైసెన్సులు జారీ చేయాలనే డిమాండ్ వినపడుతోంది. మరోవైపు అమెరికాలో గన్ కల్చర్ వల్ల మాస్ షూటింగ్‌లు జరిగి వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడ వయోజనులందరికీ అధికారికంగా తుపాకుల పొందేందుకు అనుమతి ఉంటుంది. దక్షిణాఫ్రికాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇదిలాఉండగా.. జులై 10న జొహన్నెస్‌బర్గ్ సమీపంలోని ఓ బార్లో దుండగుల ముఠా అర్ధరాత్రి తుపాకులతో రెచ్చిపోయి 14 మందిని చంపిన విషయం తెలిసిందే. చదవండి: యుద్ధ ట్యాంకర్లతో జనాలను భయపెడుతూ.. మళ్లీ మారణహోమం తప్పదా?! -
Chicago Shooting: నరనరాన హింస.. క్లాస్‌రూమ్‌లోనే అలాంటి వీడియోలు
యువకుడు.. మొరటోడు.. హింసను ప్రేరేపించేలా ర్యాప్‌లు.. పైగా దూకుడు స్వభావం.. ఇవేం చాలవన్నట్లు పేరులోనే ‘క్రైమ్’ ఉంది అతనికి. చికాగో హైల్యాండ్ పార్క్‌లో జులై4న జరిగిన స్వాతంత్ర దినోత్స పరేడ్‌లో నరమేధం తాలుకా అనుమానితుడి ఫ్రొఫైల్ నుంచి పోలీసులు సేకరించిన ఆసక్తికర విషయాలు ఇవి. రాబర్ట్ బాబీ క్రైమో III(22).. చికాగో ఇల్లినాయిస్ హైల్యాండ్ పార్క్ పరేడ్ నరమేధంలో ఆరుగురిని మట్టుపెట్టడంతో పాటు 36 మందిని గాయపరిచాడన్న ఆరోపణల మీద అరెస్ట్ అయ్యాడు. అయితే అతని గురించి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తూ పోయే విషయాలు తెలిశాయి. రాబర్ట్ బాబీ క్రైమో.. ఈ ప్రపంచానికి కొత్తగా పరిచయం కావొచ్చు. కానీ, అక్కడి ప్రజలకు మాత్రం అతనిలో పేరుకుపోయిన హింసాత్మక ప్రవర్తన గురించి చాలాకాలంగానే తెలుసు!. ఎలాగంటారా?.. ర్యాపర్ అయిన క్రైమో తన యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా బాగా ఫేమస్. హింసను ఉసిగొల్పే లిరిక్స్, కాల్పులు, చావులు, హింసకు సంబంధించిన కంటెంట్‌నే ఎక్కువగా ప్రమోట్ చేస్తాడు అతను. Robert "Bobby" Crimo III ha sido identificado como la persona de interés en el tiroteo masivo mortal en #HighlandPark, Illinois- Chicago. Seis muertos y decenas de heridos en la masacre del desfile festivo del #4deJulio. Video que muestra algo de su aturdida personalidad.#EEUU. pic.twitter.com/OWGdZ01YqM — MikyRodriguezOficial (@MikyRodriguezO1) July 4, 2022 కాల్పుల ఘటన తర్వాత అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని ఛానెల్స్ మొత్తాన్ని యూట్యూబ్ నుంచి డిలీట్ చేయించారు. సోషల్ మీడియా అకౌంట్లను తొలగించారు. అయినప్పటికీ.. అతనికి సంబంధించిన వీడియోలు కొన్ని ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘అవేక్ ది ర్యాపర్’ పేరుతో అతని వీడియోలన్నీ హింసను ప్రొత్సహించేవిగా ఉండడం గమనార్హం. క్రైమో వీడియోల్లో యూట్యూబ్ కూడా నిబంధనల ఉల్లంఘన కింద తీసేయని వీడియోలు చాలానే ఉన్నాయి. హెల్మెట్, బుల్లెట్‌ఫ్రూఫ్ కోట్ ధరించి తరగతి గదిలోనే యువతను రెచ్చగొట్టే వీడియోలు చాలానే తీశాడు అతను. ఒంటి నిండా టాటూలతో విచిత్రమైన వేషధారణలతో ర్యాప్‌లు కడుతూ.. వాటి లిరిక్స్‌లోనూ తనలో పేరుకుపోయిన హింసా ప్రవృత్తిని చూపిస్తుంటాడు అతను. హోండా ఫిట్ కారు రూఫ్‌టాప్ నుంచి హై పవర్డ్ రైఫిల్‌తో క్రైమో కాల్పులు జరిపాడన్నది హైల్యాండ్ పార్క్ పోలీసులు వాదన. ఇక ఘటన జరిగిన తర్వాత.. సుమారు ఐదు మైళ్ల పాటు రాబర్ట్‌ను పోలీసులు ఛేజ్ చేశారని, ఆపై అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికాలో పేట్రేగిపోతున్న గన్ కల్చర్, ఇంటర్నెట్ కంటెంట్‌పై సరైన ఆంక్షలు, నియంత్రణ లేకపోవడం.. మరో యువకుడితో మారణ హోమం సృష్టించిందన్న వాదన వినిపిస్తోంది ఇప్పుడు. ఇలాంటి వాళ్లను ముందస్తుగానే గుర్తించి.. నిలువరిస్తే నరమేధాలు జరగవన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. -
తండ్రి తుపాకితో ఆడుకుంటూ...పసికందుని కాల్చి చంపిన మైనర్
US Boy Playing With His Father Gun: ఎనిమిదేళ్ల బాలుడు తండ్రి తుపాకితో ఆడుకుంటూ...అనుకోకుండా జరిపిన కాల్పుల్లో పసికందు మృతి చెందింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం....45 ఏళ్ల రోడెరిక్ రాండాల్ తుపాకిని కలిగి ఉండకుండా నిషేధింపబడిన నేరచరిత్ర కలిగిన వ్యక్తి. ఒక రోజు అతను తన కొడుకుతో కలిసి తన స్నేహితురాలిని కలిసేందుకు మోటెల్ ప్రాంతానికి వెళ్లాడు. అతడి స్నేహితురాలు తన ఇద్దరు కలలు, ఒక ఏడాది కుమార్తెతో అక్కడకి వచ్చింది. ఆ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వాళ్లంతా కలుసుకుని కాసేపు ఆనందంగా గడిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఏదో పని పై రాండల్ బయటకి వెళ్లాడు. ఇంతలో కొడుకు అలమరాలో దాచిన తుపాకీని తీసి ఆడుకుంటున్నాడు. అదే సమయంలో బాలికల తల్లి నిద్రిస్తుంది. అంతే ఆ పిల్లాడు ఆ గన్‌తో ఆడుకుంటూ..ఆడుకుంటూ ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అంతే అక్కడే ఉన్న పసికందు శరీరంలోకి తూట దూసుకుపోయింది. అక్కడికక్కడే ఆ పసికందు మృతి చెందింది. ఐతే ఇలాంటి దారుణ ఘటనలు యూఎస్‌లో ఏటా కోకొల్లలు. పెద్దలు దాచిన గన్ని పిల్లలు తెలుసుకుని ఆడుకుంటూ తమను కాల్చుకోవడం లేదా తమ తోటివారిని కాల్చడం జరుగుతోంది. ఇలా ఏటా మైనర్లు హత్యలు చేయడం...తెలిసి తెలియని వయసులో జైలు పాలుకావడం జరుగుతోందని, ప్రతి ఏడాది సగటున ఇలాంటి ఘటనలల్లో 350 మందికి పైగా మృతి చెందుతున్నారని యూఎస్ పోలీసులు చెబుతున్నారు. సదరు వ్యక్తి పై నిర్లక్ష్యం, చట్ట విరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉండటం తదితర ఆరోపణలతో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇటీవలే యూఎస్ అత్యున్నత న్యాయస్థానం న్యూయార్క్ పౌరులు తమ వెంట గన్లు తీసుకువెళ్లొచ్చు అంటూ సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు దేశ అధ్యక్షుడు జోబైడెన్ సైతం న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పైగా ఇది రాజ్యాంగానికి, ఇంగిత జ్ఞాననికి విరుద్ధంగా ఉందంటూ ఆవేదన చెందారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి తీర్పులు ఇవ్వడం అత్యంత బాధకరం. (చదవండి: శిథిలాల నడుమ అయిన వాళ్ల కోసం.. గుండెల్ని పిండేస్తున్న ఫొటో) -
గన్ కంట్రోల్ బిల్లుకు అమెరికా సెనేట్ అమోదం
వాషింగ్టన్: ఆత్మరక్షణ కోసం తుపాకులు వాడటం అమెరికన్లకు రాజ్యాంగమిచ్చిన హక్కు అంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, తుపాకుల నియంత్రణకు రూపొందిన చరిత్రాత్మక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఎగువ సభ సెనేట్ ఆమోద ముద్ర వేసింది. తుపాకుల కొనుగోలుపై ఆంక్షలు విధించే అత్యంత కీలకమైన ఈ బిల్లును ఆమోదించింది. 50 మంది డెమొక్రాట్లతో పాటు తుపాకుల నియంత్రణను తీవ్రంగా వ్యతిరేకించే రిపబ్లికన్ పార్టీకి చెందిన 15 మంది సెనేటర్లు కూడా అనుకూలంగా ఓటేయడం విశేషం. దాంతో 100 మంది సభ్యుల సెనేట్‌లో 65–33 తేడాతో బిల్లు గట్టెక్కింది. దీన్ని త్వరలో డెమొక్రాట్ల ఆధిక్యమున్న దిగువ సభ (ప్రతినిధుల సభ)లో బిల్లు ప్రవేశపెడతారు. అయితే ఆమోదం లాంఛనమే. అనంతరం అధ్యక్షుడు జో బైడెన్ సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. దీనిపై బైడెన్ హర్షం వెలిబుచ్చారు. ‘‘28 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌లో చలనం వచ్చింది. తుపాకుల హింసకు అడ్డుకట్ట పడాలని కుటుంబాలకు కుటుంబాలు రోడ్డెక్కడంతో కాంగ్రెస్ సభ్యులంతా ఏకమయ్యారు’’ అని వ్యాఖ్యానించారు. బిల్లులో ఏముంది? 21 ఏళ్ల కంటే తక్కువున్న వారు తుపాకులు కొనుగోలు చేస్తే వారి నేపథ్యంపై విస్తృతంగా వివరాలు సేకరిస్తారు. పాఠశాలల్లో భద్రతను పెంపొందించడానికి, ప్రజల్లో మానసిక సమస్యల నివారణకు ఆరోగ్య కార్యక్రమాలకు 1500 కోట్ల డాలర్ల నిధుల్ని కేటాయిస్తారు. ఎవరి చేతులోనైనా తుపాకులు ప్రమాదకరమని భావిస్తే లైసెన్స్ రద్దు చేసి తుపాకులు వెనక్కు తీసుకునే అధికారాలు రాష్ట్రాలకు సంక్రమిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్ ఫ్లాగ్ చట్టాలు అమలు చేయడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. -
తుపాకి నీడలో అమెరికా
ఇంకా నాగరిక విలువలూ, ప్రజాస్వామిక విలువలూ పూర్తిగా వికసించని మూడు శతాబ్దాలనాడు అంటిన తుపాకి సంస్కృతి చీడను అమెరికా సమాజం ఇప్పటికీ వదుల్చుకోలేకపోతున్నదని గురువారం అక్కడ జరిగిన రెండు భిన్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఈమధ్యకాలంలో వరసగా టెక్సాస్, న్యూయార్క్, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో ఉన్మాదుల తుపాకి గుళ్లకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాక అమెరికన్ కాంగ్రెస్ ఈ సంస్కృతిని నియంత్రించడానికి నడుం బిగించింది. తుపాకి పరిశ్రమల లాబీకి అండదండలందించే రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనెటర్లను సైతం ఈ ఉదంతాలు పునరాలోచింపజే సిన పర్యవసానంగా గురువారం రాత్రి సెనేట్ 65–33 వోట్ల తేడాతో తుపాకుల లభ్యతను కఠినం చేసే బిల్లును ఆమోదించింది. అదే రోజు మధ్యాహ్నం తుపాకి నియంత్రణకు న్యూయర్క్ రాష్ట్రం 109 ఏళ్లక్రితం తీసుకొచ్చిన చట్టం చెల్లదంటూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మారణాయుధాలు ధరించి తిరగడం అమెరికన్ పౌరుల హక్కని తేల్చిచెప్పింది. ఈ తీర్పు ఇంగిత జ్ఞానానికీ, రాజ్యాంగ విలువలకూ గొడ్డలిపెట్టని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరిగానే వ్యాఖ్యానించారు. ఈమధ్య బఫెలోలో జరిగిన హత్యాకాండకు పదిమంది పౌరులు బలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తుపాకుల బెడదను మరింత పెంచగల ఈ తీర్పునివ్వడానికి న్యాయమూర్తులు వెనకాడలేదు. వాస్తవానికి న్యూయార్క్ తుపాకి నియంత్రణ చట్టం అంత కఠినమైనదేమీ కాదు. మారణాయుధాలు దగ్గర ఉంచుకుంటామనేవారు అందుకు గల కారణాలు వివరించాలి. అవి సంతృప్తికరమైతే లైసెన్సు మంజూరు చేస్తారు. కానీ ఇలా షరతు విధించడం పౌరుల హక్కులను హరించడమే అంటున్నది సుప్రీంకోర్టు. గడపదాటి బయటి కెళ్లే ప్రతి ఒక్కరివద్దా ఆత్మరక్షణ కోసం మారణాయుధం ఉండాల్సిందేనని చెబుతున్నది. అందుకు రెండో రాజ్యాంగ సవరణను చూపుతున్నా దాన్ని న్యాయమూర్తులు సక్రమంగా అవగాహన చేసుకోలేదన్నది న్యాయ కోవిదుల వాదన. వరదలూ, తుపానులూ, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల ముందు ఎటూ మనిషి నిస్స హాయంగా తలవంచక తప్పడంలేదు. అమెరికాలో తుపాకి సంస్కృతి కూడా ఈమాదిరి వైపరీత్యం గానే పరిణమించింది. మొత్తం 19 రాష్ట్రాలు, వాషింగ్టన్లలో ఏదోమేరకు తుపాకి నియంత్రణ చట్టాలున్నాయి. కానీ అవి పెద్దగా అక్కరకు వచ్చిన దాఖలాలు లేవు. అయినా కూడా రాలిపడు తున్న అమాయక ప్రాణాలకు కాదు... ఉన్మాదుల హక్కుకే విలువ అధికమన్నట్టు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో న్యూయార్క్‌లోనూ, అదే మాదిరి చట్టాలు అమల్లో ఉన్న కాలిఫోర్నియా, హవాయీ, మసాచూసెట్స్, న్యూజెర్సీ తదితర రాష్ట్రాల్లోనూ మారణా యుధాలు విచ్చలవిడిగా పెరిగే ప్రమాదం ఉంటుంది. తాజాగా అమెరికన్ సెనేట్ ఆమోదించిన బిల్లు కూడా ఏమంత సమర్థవంతమైనది కాదు. అది డెమొక్రాట్లు ఆశించిన స్థాయి బిల్లు కాదు. రిపబ్లికన్లలో కొందరి ఆమోదమైనా పొందడం కోసం డెమొక్రాట్లు రాజీ పడి చేసిన మార్పుల పర్యవసానంగా రూపొందిన బిల్లు. మరో వారం పదిరోజుల్లో డెమొక్రాట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రతినిధుల సభలో ఈ బిల్లు ఆమోదం పొందితే చట్టమవుతుంది. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రభావం ఆ చట్టంపై ఏమేరకుంటుందో చూడాల్సి ఉంది. ప్రమాదకరమైన వ్యక్తుల చేతుల్లోకి మారణాయుధాలు పోకుండా ప్రయత్నించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలని సెనేట్ ఆమోదించిన బిల్లు ప్రతిపాదిస్తోంది. విద్యాసంస్థల భద్రతకూ, మానసిక వ్యాధులను అరికట్టడానికీ రాష్ట్రాలకు వందలకోట్ల డాలర్ల అదనపు నిధులివ్వడానికి వీలుకల్పిస్తోంది. అలాగే 21 ఏళ్లలోపువారికి మారణాయుధాల లభ్యత కఠినతరం చేస్తోంది. అలాంటివారి గత చరిత్రనూ, వారి మానసిక ఆరోగ్యాన్నీ మారణాయుధాల విక్రేత పోలీసుల సాయంతో తెలుసుకోవాల్సి ఉంటుంది. మూడురోజులపాటు జరిగే ఈ ప్రక్రియలో అనుమానాస్పద అంశాలు కనిపిస్తే రెండో దశ తనిఖీ ఉంటుంది. అది పదిరోజులపాటు సాగుతుంది. అసలు మారణాయుధాల కొనుగోలుకు ఇప్పుడున్న కనిష్ఠ వయసు అర్హతను 18 నుంచి 21కి మార్చాలన్న డెమొక్రాట్ల ప్రతిపాదనకు రిపబ్లికన్లు అంగీకరించలేదు. సాధారణ పౌరులకు తుపాకులు దక్క నీయకుండా ఏం చేయాలన్న ఆలోచనకు బదులు వాటి పేరుతో విద్యాసంస్థలకూ, ఆసుపత్రులకూ కోట్లాది డాలర్లు దక్కేలా చేయడం వల్ల ఒరిగేదేమిటో అంతుబట్టదు. పైకి ప్రజాస్వామ్య దేశంగా కనబడే అమెరికాలో తుపాకుల తయారీ యాజమాన్యాల నేతృత్వంలోని నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్(ఎన్ఆర్ఏ) సమాజాన్ని శాసిస్తున్నది. తుపాకి కలిగి ఉండటం ఒక హోదాకు చిహ్నమనీ, అది లేకపోతే ఆత్మరక్షణ అసాధ్యమనీ పౌరులకు భ్రమలు కల్పించడంలో అది ఎన్నడో విజయం సాధించింది. రెండు ప్రధాన పార్టీల్లోనూ ఎన్ఆర్ఏ లాబీలు పనిచేస్తుంటాయి. కాకపోతే రిపబ్లికన్లతో పోలిస్తే డెమొక్రాట్లు కాస్త నయం. 2020లో తుపాకులకు 45,222 మంది మరణించారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో మూకుమ్మడి హత్యా కాండలు మొదలుకొని ఆత్మహత్యల వరకూ అన్నీ ఉన్నాయి. తుపాకి నీడన బతుకీడ్చే దుస్థితినుంచి సాధ్యమైనంత త్వరగా అమెరికా బయటపడాలని, బైడెన్ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం ఆ దిశగా ఒక మంచి ప్రారంభమవుతుందని ఆశించాలి. -
బైడెన్‌కు ఎదురుదెబ్బ.. తీవ్ర నిరాశ చెందానంటూ ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు.. సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. న్యూయార్క్ పౌరులు తుపాకుల్ని తమ వెంట తీసుకెళ్లేందుకు(బహిరంగ ప్రదేశాల్లో కూడా) మార్గం సుగమం చేస్తూ.. గురువారం ఆదేశాలు జారీ చేసింది అమెరికా అత్యున్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలో.. సుప్రీం ఆదేశాలపై తీవ్ర నిరాశ చెందినట్లు అధ్యక్షుడు బైడెన్ ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి, ఇంగిత జ్ఞానానికి (కామన్సెన్స్) విరుద్ధంగా ఉంది. ఈ తీర్పు అమెరికన్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టేది అని వ్యాఖ్యానించారయన. అయితే తీర్పు ఎలా ఉన్నా.. రాష్ట్రాలు మాత్రం తమ తమ పరిధిలో తుపాకీ నియంత్రణ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని, తద్వారా కాల్పుల నేరాలకు కట్టడి వేయాలని కోరారు ఆయన. న్యూయార్క్‌లో పౌరులు తుపాకీ వెంట తీసుకెళ్లే హక్కులపై ఆంక్షలు విధిస్తూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. అయితే.. ఆ చట్టాన్ని కొట్టేస్తూ గురువారం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికన్లకు తుపాకీలను మోసుకెళ్లే ప్రాథమిక హక్కు ఉంటుందని ప్రభుత్వానికి గుర్తు చేసింది సుప్రీం కోర్టు. న్యూయార్క్ చట్టం ప్రకారం.. సాధారణ పౌరులు తుపాకులను మోసుకెళ్లే వాళ్లు.. సరైన కారణం, వివరణలు ఇవ్వాల్సి ఉంటుంది. అది ప్రత్యేక అవసరమా? లేదంటే ఆత్మ రక్షణ అన్న విషయం మీద కూడా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. బైడెన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగలడంతో నేషనల్ రైఫిల్ అసోషియేషన్ సంబురాలు చేసుకుంటోంది. 2020 లెక్కల ప్రకారం.. అమెరికా పౌరుల దగ్గర 390 మిలియన్ల తుపాకులు ఉన్నాయి. సుమారు 45 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. Gun Safety Billకు ఆమోదం ఇదిలా ఉంటే.. సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలినా బైడెన్ సర్కార్ మాత్రం గన్ వయలెన్స్ కట్టడికి ఓ ముందడుగు వేసింది. గురువారం రాత్రి ద్వైపాక్షిక గన్ సేఫ్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది అమెరికా సెనేట్. అమెరికాలో పేట్రేగిపోతున్న తుపాకీ హింస నేపథ్యంలోనే.. కట్టడి దిశగా ఈ బిల్లు తీసుకొచ్చింది బైడెన్ ప్రభుత్వం. గత మూడు దశాబ్దాల తర్వాత తుపాకీ హింస కట్టడికి.. ఇదే అతిపెద్ద సంస్కరణ కావడం విశేషం. ప్రస్తుతం ఈ బిల్లు.. ఓటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. వీలైనంత త్వరగా శుక్రవారం లోపే ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మెక్సికోలో పేలిన తుపాకీ.. ఆరుగురి దుర్మరణం
అమెరికాలో తుపాకీ నరమేధం శాంతించడం లేదు. తాజాగా మెక్సికో వీధుల్లో దుండగుల కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఐదుగురు స్కూల్ పిల్లలే కావడం గమనార్హం. మధ్య మెక్సికోలో సాయుధులైన దుండగులు.. గువానాజువాటో వీధుల్లో తెగపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురు స్టూడెంట్స్‌తో(16 నుంచి 18 ఏళ్ల మధ్య వాళ్లు) పాటు ఓ వృద్ధురాలు మృతి చెందింది. చనిపోయిన వాళ్లంతా బారోన్ కమ్యూనిటీకి చెందిన వాళ్లేనని గువానాజువాటో మేయర్ నిర్ధారించారు. ఇదిలా ఉంటే.. రెండు వారాల కిందట గువానాజువాటోలోని సెలాయా నగరంలో జరిగిన ప్రతీకార దాడుల్లో పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. డ్రగ్స్, చమురు దొంగతనాల నేపథ్యంలోనే ఇక్కడ గ్యాంగ్ వార్లు జరుగుతున్నాయి. 2006 డిసెంబర్ నుంచి ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పదన మిలిటరీ యాంటీ డ్రగ్ ఆపరేషన్ వల్ల మెక్సికోలో ఇప్పటిదాకా మూడున్నర లక్షల హత్యలు జరిగాయి. చదవండి: అవమానాలు-కుటుంబ పరిస్థితులతో కిరాతకుడిగా.. -
Gun Culture: పంజాబ్‌లో ముఠా సంస్కృతి.. ఇదో రకం రక్తచరిత్ర
అదో గ్రామీణ పంజాబ్ రోడ్డు. తెల్ల కారు, దాని వెనకాల నల్లజీపు. అంతలో హఠాత్తుగా తూటాల శబ్దాలు. ఎర్రగా పరుచుకున్న రక్తపు మడుగు. పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా తాలూకు ఓ మ్యూజిక్ వీడియోలోని దృశ్యాలివి. ఆయన హత్య జరిగిన తీరు కూడా అచ్చం ఆ వీడియోను తలపించేలా ఉండటం అందరినీ విస్మయపరుస్తోంది. పంజాబ్‌లో గాయకులది, గ్యాంగ్స్టర్లది అవినాభావ బంధం. కొందరు సింగర్ల పాటలకు గ్యాంగ్ కల్చరే థీమ్‌గా ఉంటుంది. ఇంకొందరు గాయకులు తమ బకాయిల వసూలుకు గ్యాంగ్స్టర్లను నియమించుకుంటారు. మరోవైపు గ్యాంగస్టర్స్ డబ్బులు దండుకోవడానికి గాయకులను బెదిరిస్తూ ఉంటారు. మొత్తమ్మీద ఇదో రకం రక్తచరిత్ర... సిద్ధూ మూసేవాలా. ‘సో హై’ వీడియో ద్వారా 2017లో పంజాబీ పాప్ ప్రపంచంలో అడుగు పెట్టారు. చూస్తుండగానే అందనత్త ఎత్తుకు ఎదిగారు. ఆయన పాడిన పాటలన్నీ గ్యాంగస్టర్ థీమ్‌తో ఉన్నవే. రెండు చేతులకూ వజ్రాల వాచీలు, చేతిలో ఏకే 47 గన్, దాన్ని పేల్చడానికి శిక్షణ తీసుకోవడం, కారులోంచి నోట్లు వెదజల్లడం వంటి సీన్లతో సిద్ధూ పాటలు యూత్‌ను ఊపేశాయి. ఆయన హత్యకు నెల రోజుల ముందే ముఠా నేరాలకు తెర దించేందుకు యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను సీఎం భగవంత్ మాన్ ఏర్పాటు చేశారు. గ్యాంగస్టర్లే యూత్ ఐకాన్లు విలాస జీవితానికి అలవాటు పడ్డ గ్యాంగ్‌స్టర్స్‌కు పంజాబీ యువతలో ఫాలోయింగ్ ఎక్కువ. ఈ గ్యాంగ్స్టర్స్ సోషల్ మీడియాలో పెట్టే తమ ఖరీదైన కార్లు, బైకులు, రైఫిళ్ల పోస్టులకు లెక్కలేనన్ని లైకులొస్తుంటాయి. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి గ్యాంగ్స్టర్లుగా మారిన వారు ఒక్కసారిగా వచ్చిపడుతున్న భారీ డబ్బును ఆడంబరంగా ప్రదర్శించడం రివాజుగా మారింది. అదే యూత్‌ను బాగా ఆకర్షిస్తూ పంజాబ్‌లో గన్ కల్చర్‌ను పెంచుతోంది. నిరుద్యోగం, ఈజీ మనీకి అలవాటు పడడం, హై–ఫ్లై లైఫ్‌స్టైల్ వారిని నేర ప్రపంచానికి దగ్గర చేస్తున్నాయి. ఇది కాలేజీ దశ నుంచే మొదలవుతోంది. చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ సింగర్లకు, యువ నేతలకు, గ్యాంగ్స్టర్లకు అడ్డాగా మారింది. లారెన్స్ బిష్ణోయి వంటి గ్యాంగ్స్టర్లు విద్యార్థి దశ నుంచే నేరాల్లో మునిగి తేలుతున్నారు. గతేడాది 70 ముఠాలకు చెందిన 500 మంది గ్యాంగ్స్టర్లను అరెస్టు చేశారు. అయినా పలు ముఠాలు రాష్ట్రంలో చురుగ్గా ఉన్నాయి. డబ్బు కోసం ఏమైనా చేస్తారు గ్యాంగ్ కల్చర్ ఎందరో గాయకుల నిండు ప్రాణాలు బలిగొంది. 2018 ఏప్రిల్‌లో పరమేశ్ వర్మ అనే గాయకున్ని డబ్బుల కోసం బెదిరించారు. ఇచ్చాక కూడా చంపేశారు. ఇది దిల్‌ప్రీత్‌సింగ్ దహాన్ అలియాస్ బాబా అనే గ్యాంగ్‌స్టర్ పనేనని విచారణలో తేలింది. డబ్బులతో కెనడా పారిపోయి అక్కడ సెటిలయ్యే ప్రయత్నాల్లో ఉండగా అతన్ని అరెస్టు చేశారు. సిద్ధూ హత్య తమ గ్యాంగ్ పనేనని అంగీకరించిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే గ్యాంగ్‌స్టర్‌గా పేరు మోసిన అతనిపై ఏకంగా 25 కేసులున్నాయి. జస్దీప్ సింగ్ అలియాస్ జగ్గు, గౌండర్ అండ్ బ్రదర్, బాంబిహ గ్రూపులు రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిని అమెరికా, కెనడా నుంచి నడుపుతుంటారు. పంజాబీ మ్యుజీషియన్ మంక్రీత్ తుల్లాఖ్ తదితరులకు కూడా ఈ గ్రూపుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. తుపాకీ స్టైలే...! పంజాబీ పాప్ గీతాల రూటే వేరు. అవి అత్యంత ఆడంబరంగా రూపొందుతాయి. గాయకులు ఖరీదైన బట్టలు వేసుకుంటారు. షూస్, వాచీలు కూడా విదేశాల నుంచి తెప్పించినవే వాడతారు. మెడ నిండా బంగారు గొలుసులు, వేళ్లకు ఉంగరాలు, వజ్రాల వాచీలు అదనపు ఆకర్షణ. చేతిలో స్పోర్ట్స్ గన్ లేదంటే రైఫిల్ తప్పనిసరి. పాటల సాహిత్యం కూడా గన్ కల్చర్ చుట్టూ తిరుగుతుంది. సింగర్ చేతిలో రైఫిల్‌తో స్టైల్‌గా చిందులేస్తూ పాడుతుంటే జనం వెర్రెత్తిపోతుంటారు. ఇలా గన్ కల్చర్ థీమ్‌తో పాటలల్లే సిద్ధూ యూట్యూబ్ చానల్‌కు కోటికి పైగా సబ్స్క్రైబర్లున్నారు! ఇన్‌స్ట్రాగాంలో ఆయనను 85 లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు!! పాంచ్ గోలీ (ఐదు తూటాలు) అనే పాటలో తుపాకీ ఎలా పేల్చాలో ఐదుగురు పోలీసు అధికారులు సిద్ధుకు నేర్పే సీన్లువివాదం రేపాయి. పాటల్లో ముఠా సంస్కృతిని, హింసను ప్రేరేపిస్తున్నారంటూ సిద్ధుపై 2020లో కేసులు నమోదయ్యాయి. దేశ జనాభాలో పంజాబ్ వాటా 2 శాతమైతే దేశం మొత్తమ్మీద ఉన్న తుపాకీ లైసెన్సుల్లో 10% అక్కడే ఉన్నాయి! అక్కడ 4 లక్షల దాకా గన్ లైసెన్సులున్నాయి. వాటిని తీసుకుంటున్న వారి సంఖ్య ఇటీవల శరవేగంగా పెరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రతి వెయ్యి మందిలో 13 మంది దగ్గర గన్స్ ఉన్నాయి. 2020లో రాష్ట్రంలో 362 కాల్పుల ఘటనలు జరిగాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆయుధాలను నిషేధించాలన్న బైడెన్... కుదరదు అని చెప్పేసిన రిపబ్లికన్లు
Biden asked How Much More Carnage: టెక్సాస్ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో జరిగిన మారణహోమం మరువుక మునుపే సెయింట్ ఫ్రాన్సిస్ ఆసుపత్రిలో ఒక దుండగుడు కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంకా ఇలాంటి ఎన్ని మారణహోమాలను చూడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అమెరికాలో తుపాకీలను నిషేధించాలంటూ పిలుపు నివ్వడమే కాకుండా ఈ తుపాకీ హింస పై తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా చట్ట సభ సభ్యులను కోరారు. అంతేకాదు కఠినతరమైన తుపాకీ చట్టాలను తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు కూడా. ఐతే అందుకు రిపబ్లికన్ సెనెటర్లలోని మెజారిటీ సభ్యలు నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో బైడైన్ యూఎస్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక కాల్పులను చూస్తున్నప్పటికీ ఈ చట్టాలకు మద్దతు ఇవ్వడానికి ముందకు రాలేకపోతున్నారంటే మీకు మనస్సాక్షి అనేదే లేదంటూ ఆక్రోశించారు. కనీసం పాఠశాలల్లో, ఆసుపత్రులలో హింసాత్మక చర్యలు జరగకుండా ఉండేలా ఆయుధాలను కొనుగోలు చేసే వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని చట్టసభ సభ్యులను కోరారు. గత రెండు దశాబ్దాలుగా విధులు నిర్వర్తిస్తూ చనిపోతున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది కంటే చిన్నారులే ఈ తుపాకీలకు బలవుతున్నారని ఆవేదనగా చెప్పారు. ఆయుధాలను సురక్షింతంగా ఉంచడం తప్పనిసరి చేస్తూ...హింసాత్మక నేరాలు జరుగతున్నప్పుడు ఆ తుపాకీలను రూపొందించిన తయారీదారులను సైతం ఈ నేరాలకు బాద్యులుగా చేసి చర్యలు తీసుకోవాలని చట్టసభ సభ్యులను కోరారు. అంతేకాదు ప్రొటెక్టింగ్ అవర్ కిడ్స్ యాక్ట్"ను ఆమోదించాలని, తుపాకీలను కొనుగోలు చేసే వయసు కూడా పెంచాలని నొక్కిచెప్పారు. ఐతే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆత్మరక్షణ కోసం తుపాకీలు వాడకాన్ని అనుమతించాలని, స్కూళ్లలల్లో ఇలాంటి హింసాత్మక కాల్పుల జరగకుండా గట్టి భద్రత కోసం కృషి చేయాలని చెబుతుండటం గమనార్హం. (చదవండి: అఫ్గన్ గడ్డపై భారత బృందం.. తాలిబన్ల విన్నపాలు) -
టెక్సాస్ నరమేధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
A good guy with a gun: టెక్సాస్ యువాల్డే రాబ్ ఎలిమెంటరీ స్కూల్ మారణహోమం గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్రంప్ హ్యూస్టన్‌లోని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతూ...తుపాకితో కాల్పులకు పాల్పడుతున్న చెడ్డ వ్యక్తిని నియంత్రించాలంటే మంచి వ్యక్తి కూడా తుపాకిని చేతబట్టాల్సిందేనని అన్నారు. ముల్లుని ముల్లుతోనే తీయాలన్న సామెత మాదిరి అలాంటి నరమేధాన్ని ఆపాలంటే మంచివాళ్లకు కూడా తుపాకీని చేత పట్టకు తప్పదని చెప్పారు. అలాగే తుపాకీ రహిత పాఠశాలలను మూసేయాలని పిలుపునిచ్చారు. ఎప్పుడైన ఒక సాయుధవ్యక్తి ఇలానే దాడులకు దిగితే ఆయుధాలు(తుపాకీలు) లేని పాఠశాలలు తమను తాము రక్షించుకోలేవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే పాఠశాలలకు సింగిల్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ, స్ట్రాంగ్ ఫెన్సింగ్, మెటల్ డిటెక్టర్లు తప్పనిసరిగా ఉండాలని ట్రంప్ సూచించారు. అయినా ఉక్రెయిన్‌కి సాయం అందిస్తున్న అమెరికాకు స్కూళ్లల్లో ఈ సౌకర్యాలను కల్పించడం ఏమంతా పెద్ద విషయం కాదని అన్నారు. (చదవండి: నేపాల్‌లో విమానం మిస్సింగ్.. అందులో నలుగురు భారతీయులు) -
మిస్టర్ బైడెన్.. ముందు అమెరికన్లను కాపాడండి: ట్రంప్ ఫైర్
అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. హంతకుడు రామోస్ ఫేస్బుక్లో ముందుగా ప్రకటించి మరీ నరమేధానికి పాల్పడ్డాడు. ఉన్మాది కాల్పుల్లో 19 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా అమెరికాకు చెందిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ హూస్టన్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. దేశంలోని స్కూళ్లలో భద్రతను పెంచేందుకు నిధులను కేటాయించాలని జో బైడెన్ సర్కార్‌ను ఆయన కోరారు. మన పిల్లల్ని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అమెరికాలోని స్కూళ్లను పిల్లలకు సురక్షితంగా ఉండేలా మార్చుకోవాలన్నారు. ఈ క్రమంలోనే.. కఠిన తుపాకీ చట్టాల అమలును ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమను తాము కాపాడుకునేందుకు మాత్రమే ఆయుధాలు ఉపయోగించాలని సూచించారు. అనంతరం.. ప్రపం దేశాలు, ఉక్రెయిన్‌కు నిధులు ఇవ్వడం, రక్షణ కల్పించడం కాదు. అమెరికాలోని స్కూల్స్‌కు నిధులు, రక్షణ కల్పించాలన్నారు. ఇక, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లో ట్రిలియన్ల డాలర్లను ఖర్చు చేశామని, కానీ అక్కడ ఏమీ లభించలేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. TRUMP: "If the United States has $40 billion dollars to send to Ukraine, we should be able to do whatever it takes to keep our children safe at home." pic.twitter.com/1AGQjFmIfk — Election Wizard 🇺🇸 (@ElectionWiz) May 27, 2022 ఇది కూడా చదవండి: నీ వల్లే ఇలాంటి పరిస్థితులు మాజీ ప్రధానిపై ఆగ్రహం -
భయంలోనూ సమయస్ఫూర్తి.. రక్తాన్ని పూసుకుని శవంలా నటించి..
ప్రాణాలు పోతున్నా.. తుపాకీ ఘటనలకు అడ్డుకట్ట వేయడంలో అగ్రరాజ్యం ఘోరంగా విఫలమవుతోంది. టెక్సాస్ స్కూల్ కాల్పుల ఘటనపై బైడెన్ ప్రభుత్వాన్ని విమర్శించని వాళ్లంటూ లేరు ఇప్పుడు. చనిపోయిన పిల్లలు, టీచర్ల కుటుంబాల వ్యథ ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ‘‘మీకు దణ్ణం పెడతాం. ఏదో ఒకటి చేయండి. చనిపోయిన ఈ పిల్లల్ని గుర్తుపెట్టుకుని.. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడండి. నా మనవరాలు చిన్నపిల్ల. అలాంటి ప్రాణాలు మరిన్ని పోకుండా చూడండి. దయచేసి చర్యలు తీసుకోండి’’ అని కన్నీళ్లతో బతిమాలుతోంది 63 ఏళ్ల ఓ బామ్మ. ఆమె పదేళ్ల మనవరాలు అమెరీ గార్జా.. కాల్పుల ఘటనలో కన్నుమూసింది. ఇదిలా ఉంటే.. 11 ఏళ్ల వయసున్న మియా సెర్రిల్లో కాల్పుల ఘటన నుంచి ప్రాణాలతో బయటపడింది. సమయస్ఫూర్తితో ఆమె వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో కాల్పుల సమయంలో మియా.. ఓ స్నేహితురాలు పూర్తిగా రక్తపుమడుగులో పడి ఉండడం గమనించింది. వెంటనే ఆ రక్తం తన ఒంటికి, బట్టలకు రాసుకుని చనిపోయినట్లు నటించింది. ఇంతలో తుపాకీతో వచ్చిన దుండగుడు.. ఆమె శరీరాన్ని తన్నుకుంటూ పరీక్ష చేసి వెళ్లిపోయాడట. అంతేకాదు.. అలా నటించే ముందు చనిపోయిన తన టీచర్ దగ్గరి నుంచి ఫోన్ తీసుకుని.. 911 ఎమర్జెన్సీ నెంబర్‌కు సాయం కోసం ఫోన్ చేసినట్లు వెల్లడించింది. కాల్పులు జరిపిన వ్యక్తి తన దగ్గరకు వచ్చినప్పుడు.. తనను కూడా కాలుస్తాడని భయపడిపోయిందట!. అయితే దాడిలో బుల్లెట్ శకలాలతో స్వల్పంగా గాయపడిన ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకున్నా.. దాడి భయం మాత్రం ఆమెలో ఇంకా పోలేదు. ఇదిలా ఉంటే 19 మందిని పొట్టనబెట్టుకున్న 18 ఏళ్ల సాల్వడోర్ రామోస్‌ను మట్టుపెట్టేందుకు గంటకు పైగా సమయం తీసుకున్నారు. దీంతో టెక్సాస్ పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: నరమేధాలకు కారణం వాళ్లేనా? -
రిపబ్లికన్లే అడ్డంకి
ముక్కుపచ్చలారని పసిమొగ్గలు రక్తమోడుతున్నారు. చదువులమ్మ చెట్టు నీడలోనే వారికి నూరేళ్లూ నిండిపోతున్నాయి. పదేళ్ల క్రితం శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూలు నుంచి నిన్నటి టెక్సాస్ ఘటన వరకు బడిలో తుపాకుల శబ్దం గుండెల్లో దడ పుట్టిస్తోంది. అగ్రరాజ్యంలో తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలు ఎందుకు రాలేకపోతున్నాయి ? సాటి మనుషుల ప్రాణాల కంటే మర తుపాకీలే అమెరికన్లకు ఎక్కువా? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. నిత్యం ఎక్కడో చోట కాల్పుల ఘటనలు జరుగుతున్నా, పాఠశాలల్లోకి దుండగులు చొరబడి అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను తీస్తున్నప్పటికీ అగ్రరాజ్యం తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలను తీసుకురావడంలో విఫలమవుతోంది. దీనికి ప్రధానంగా సాంస్కృతికపరమైన, రాజకీయప రమైన కారణాలను చెప్పుకోవచ్చు. మితిమీరిన వ్యక్తి స్వేచ్ఛతో తుపాకీ ఉండడం తమ హక్కు అని 74% మంది అమెరికన్లు భావిస్తారని ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో వెల్లడైంది. వ్యక్తిగత భద్రత కోసం తుపాకీ ఉండాలని 26% మంది అమెరికన్లు భావిస్తారు. ప్రైవేట్ వ్యక్తులు తుపాకులు కలిగిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో జనాభా కంటే ఆయుధాల సంఖ్యే ఎక్కువగా ఉండడం ఆందోళనకరంగా మారింది. దేశంలో ప్రతి 100 మంది జనాభాకు 120 తుపాకులు ఉన్నాయి. అంటే సగటున ప్రతి ఒక్కరి దగ్గర తుపాకీ ఉన్నట్టే. 2020 నాటికి అగ్రరాజ్యం జనాభా 33 కోట్లు ఉంటే, ఆ దేశ ప్రజల దగ్గర 40 కోట్ల ఆయుధాలున్నాయి. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోవడానికి రాజకీయ ఏకాభిప్రాయం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తుపాకీ నియంత్రణ చట్టాలను కఠినతరం చేయాలని ఇప్పుడిప్పుడే సాధారణ ప్రజలు స్వరం పెంచుతున్నప్పటికీ డెమొక్రట్లు, రిపబ్లికన్ల మధ్య విధానపరంగా విభేదాలున్నాయి. 2012 సంవత్సరంలో కనెక్టికట్‌లోని న్యూటౌన్‌లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూలులో తుపాకీ గుళ్లకి 20 మంది చిన్నారులు బలయ్యాక 13 రాష్ట్రాలు తుపాకుల విక్రయంలో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. అవన్నీ డెమొక్రట్ల పాలనలో ఉన్న రాష్ట్రాలే. అదే సమయంలో రిపబ్లికన్ల అధీనంలో ఉన్న 14 రాష్ట్రాల్లో ప్రజలు కూరగాయలు కొన్నంత సులుభంగా తుపాకులు కొనే వెసులుబాటు ఉంది. ప్రజలు తమ ప్రాణ రక్షణ కోసం తుపాకులు తమ వెంట ఉంచుకోవచ్చునని మొదట్నుంచీ రిపబ్లికన్ల వాదనగా ఉంది. అమెరికా రాజ్యాంగంలోని రెండో సవరణ ప్రకారం ‘‘ఆయుధాలు దగ్గర ఉంచుకోవడం ప్రజల హక్కు. రాష్ట్రాల భద్రత కోసం పౌర సైన్యం అత్యంత అవసరం. ఈ నియమాలను ఉల్లంఘించకూడదు’’ అని చెబుతోంది. తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలు ఉండాలన్న డిమాండ్లు వచ్చిన ప్రతీసారి రిపబ్లికన్లు రాజ్యాంగ సవరణని గుర్తుచేస్తూ ప్రజల హక్కులు కాలరాయొద్దని గళమెత్తుతున్నారు. అమెరికాలో తుపాకుల నియంత్రణ చట్టాలను నేషనల్ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏ) సమర్థంగా అడ్డుకుంటూ ఉండడంతో విచ్చలవిడిగా తుపాకులు అందుబాటులోకి వస్తున్నాయి. తుపాకులపై నిషేధం విధిస్తే అమెరికన్లకు రక్షణ ఉండదని, గన్ ఫ్రీ స్కూలు జోన్స్ వల్ల ఎక్కువ ప్రమాదాలు ముంచుకొస్తున్నాయని ఎన్ఆర్ఏ సీఈవో వేన్ లాపీరే అభిప్రాయపడ్డారు. ఎన్ఆర్ఏ సభ్యుల్లో 77% రిపబ్లికన్లే కావడం గమనార్హం. మానసిక వ్యాధికి మందు వేయాలని వాదనలు తుపాకుల నియంత్రణ చట్టాలను విమర్శించేవారు కాల్పులకు పాల్పడినవారంతా ఏదో ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నవారేనని వాదిస్తున్నారు. కాల్పులకు అడ్డుకట్ట వేయాలంటే వ్యక్తుల స్వేచ్ఛను హరించేలా తుపాకుల్ని నియంత్రించడం కాకుండా మతి స్థిమితంలేని వారికి చికిత్స చేయాలన్నది రిపబ్లికన్ల వాదనగా ఉంది. తుపాకుల్ని అమ్మే ముందు వారి నేర చరితను చూడాలన్న డిమాండ్లను రిపబ్లికన్లు అంగీకరించడం లేదు. ► 2012 డిసెంబర్లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూలు విషాదం మొదలు ఇప్పటివరకు 948 సార్లు స్కూళ్లలో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ► 46 లక్షల మంది పిల్లల ఉండే ఇళ్లలో తుపాకుల్లో బుల్లెట్లు్ల లోడ్ చేసే ఉండటం అత్యంత ఆందోళనకరం. ఆ తుపాకులను తల్లిదండ్రులు జాగ్రత్త పరచకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. ► పాఠశాలల్లో కాల్పుల ఘటనల్లో వాడిన తుపాకుల్లో 68% ఇంటి నుంచి, స్నేహితులు, బంధువుల నుంచి తీసుకువచ్చినవే. ► స్కూళ్లలో జరిగే తుపాకీ కాల్పుల్లో 93% ముందస్తుగా ప్రణాళిక చేసుకున్నవే. ► శ్వేత జాతీయుల కంటే నల్లజాతి వారే నాలుగు రెట్లు అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
తుపాకీ బలి కోరుతుంది!
అపరిమితమైన తుపాకీ అమ్మకాలు... బాధ్యత లేని ప్రవర్తనలు. అమెరికాలో తరచూ జరుగుతున్న సామూహిక కాల్పుల ఘటనలపై ఓ ఆయుధ నిపుణుడి సంక్షిప్త వ్యాఖ్య ఇది. ఇటీవలే న్యూయార్క్ దగ్గరి బఫలోలో పది మంది నల్లజాతి అమెరికన్ల హత్యాకాండ సాగింది. పదిరోజులైనా గడవక ముందే మంగళవారం టెక్సాస్ రాష్ట్రం, ఉవాల్డేలోని ప్రాథమిక పాఠశాలలో 19మంది చిన్నారు లనూ, ఇద్దరు టీచర్లనూ బలిగొన్న కాల్పుల ఘటన నివ్వెరపరుస్తోంది. తల్లితండ్రుల గర్భశోకం చూస్తుంటే గుండె చెరువవుతోంది. అమెరికాలో ప్రబలిన ప్రమాదకర «ధోరణికి తాజా ఈ ఘటనలు ప్రతీకలు. ఏటేటా పెరుగుతున్న ఈ కాల్పులతో అక్కడి ఆయుధాల చట్టంపై మళ్ళీ చర్చ రేగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో జాతి దుర్విచక్షణ దాడులు, బజార్లు – బడులు – బహిరంగ ప్రదేశాల్లో అమాయకులపై కాల్పులు ఇప్పుడు తరచూ వింటున్నాం. గత నాలుగు దశాబ్దాల్లో ఇవి బాగా పెరిగాయి. చిత్రం ఏమిటంటే, ఈ దురంతాలకు పాల్పడ్డవారిలో అధిక శాతం మంది చట్టబద్ధంగా తుపాకీలు కొనుక్కున్నవారే. గణాంకాలు చూస్తే, అమెరికా పౌరుల వద్ద సొంతంగా 39 కోట్ల మారణాయుధాలు ఉన్నాయి. ప్రతి 100 మంది పౌరులకూ 120కి పైగా తుపాకీలు ఉన్నాయన్న మాట. ఇది ప్రపంచంలోకెల్లా అత్యధిక తలసరి ఆయుధస్వామ్యం. సంక్షుభిత యెమెన్ లాంటి చోట్ల కన్నా ఇది ఎక్కువ. చేతిలో సొంత ఆయుధంతో అమెరికాలో విచక్షణారహిత వాడకమూ పెరిగింది. ఆయుధ కొనుగోళ్ళు, వాడకంపై అనేక విధాన మార్పులు చేసినా పరిస్థితిలో మార్పు లేదు. గత యాభై ఏళ్ళలో 14 లక్షల మందికి పైగా అమెరికా పౌరులు ఈ తుపాకీ సంస్కృతికి బలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయుధాల కొనుగోలు, వాడకంపై చట్టాలను కఠినతరం చేయాలన్న వాదన అమెరికాలో పదే పదే వినిపిస్తోంది. కానీ, అనేక కారణాలతో అది సాధ్యం కాకపోవడం విచారకరం. అమెరికా రాజ్యాంగంలోని ‘రెండో సవరణ’ పౌరులకు చిరకాలంగా సొంత ఆయుధాల హక్కు కల్పిస్తోంది. మారిన పరిస్థితుల్లో దీన్ని మార్చాలనే చర్చ చాలాకాలంగా ఉన్నదే. ఒబామా, డొనాల్డ్ ట్రంప్ నుంచి ఇవాళ్టి జో బైడెన్ దాకా దేశాధ్యక్షులు సైతం అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఈ తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా పలుమార్లు భావోద్వేగ ప్రసంగాలు చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పేమీ రాలేదన్నది చేదు నిజం. సొంతంగా తుపాకీల కొనుగోలును సమర్థించేవారు, వ్యతిరేకించేవారుగా అమెరికా సమాజం, రాజకీయవాదులు రెండు వర్గాలుగా చీలారు. ఈ అంశాన్ని రాజకీయకోణంలో చూడడం మరీ దురదృష్టకరం. డెమోక్రాట్లు చట్టాల్లో మార్పు కోరు తుంటే, పౌరులకు స్వీయరక్షణ హక్కు ఉండాల్సిందేనంటూ రిపబ్లికన్లు పట్టుబడుతున్నారు. దేశాధ్యక్షులైన పలువురు డెమోక్రాట్లు గతంలో కనీసం ప్రాథమిక తుపాకీ నియంత్రణ చట్టాలు తేవాలని చూసినా, చట్టసభలో ఆమోదముద్ర వేయించలేకపోయారు. 2018లో 68 శాతం మంది కఠినమైన ఆయుధ చట్టాలను కోరితే, గత ఏడాది జరిగిన ప్యూ పోల్‌లో వారి సంఖ్య తగ్గి, 53 శాతం మందే కఠిన చట్టాలకు జై కొట్టడం విచిత్రం. అయితే, మూడు, నాలుగు తరగతులు చదువుతున్న పదేళ్ళ లోపు పసిమొగ్గల్ని చిదిమేసిన తాజా ఘటన కరడుగట్టిన ఆయుధ సమర్థకులను సైతం కదిలిస్తోంది. పదిహేనేళ్ళ క్రితం వరకు అమెరికాలోని మారణాయుధాల పరిశ్రమ స్వయం ప్రకటిత విధి, నిషేధాలను పాటించేది. తాజా ఘటనల్లో షూటర్లు వాడిన వ్యూహాత్మక తుపాకీల లాంటి వాటిని అప్పట్లో కేవలం పోలీసు, సైనిక వర్గాల వ్యాపార ప్రదర్శనల్లోనే పరిశ్రమ వర్గాలు చూపేవి. కానీ, ఆయుధ లాబీ దురాశతో క్రమంగా పరిస్థితి మారింది. వీలైనన్ని ఎక్కువ తుపాకీలను విక్రయించాలనే యావ పెరిగింది. అమెరికాలో తొలిసారిగా నల్లజాతి వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జాతి దుర్విచక్షణను ఆసరాగా చేసుకుంది. దాంతో, అమెరికాలో 2008 నాటికి 80 లక్షల లోపున్న తుపాకీల అమ్మకాలు కాస్తా 2016 నాటికి రెట్టింపై, 160 లక్షలకు చేరాయి. ఇవాళ అమెరికాలో 18 ఏళ్ళ వయసు దాటిన ఎవరైనా సరే తుపాకీలు, శక్తిమంతమైన తూటాలు, శరీర కవచాలను యథేచ్ఛగా కొనుక్కోవచ్చు. దాదాపు వంద కోట్ల డాలర్ల విలువైన మార్కెట్ ఉన్న ఆయుధ లాబీ ప్రాబల్యాన్ని అడ్డుకొని, చివరకు ఫెడరల్ తుపాకీ లైసెన్సుల చట్టంలో మార్పు తేవడం పాలకులకు సైతం వల్ల కాని దుఃస్థితి వచ్చిపడింది. ఆయుధాల ఆర్థిక, రాజకీయ లాభాల వేటను ఇకపై కొనసాగనిస్తే ప్రమాదం. అమెరికన్లు తమనూ, తమ వాళ్ళనూ రక్షించుకోవడానికి సొంతంగా ఆయుధాలు కలిగి ఉండడం తమ ‘సంస్కృతి’ అని బలీయమైన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ లాంటి గ్రూపులు అంటున్నాయి. ఆ మాటలు సమర్థనీయం కానే కాదు. నిజానికి, వలస వచ్చిన అనేక దేశప్రజల కూడలి అమెరికాలో పౌరులంటే ఇప్పుడు ప్రపంచ పౌరులే. అలా ఇప్పుడు అమెరికా బాధ... ప్రపంచానికి బాధ. కాల్పుల సంస్కృతికి తోడ్పడేలా చట్టాలున్నప్పుడు వాటిని సవరించుకోవడమే తక్షణ అవసరం. అవసరమైతే అధ్యక్షుడు తన ప్రత్యేక పాలనాధికారాలు వాడాలి. అలాగే ఒంటరితనం వేధిస్తున్న టీనేజ్ దుండగుల నేరపూరిత ధోరణులను పసిగట్టేలా మానసిక వైద్య వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలి. పొంచి ఉన్న బయటి దేశాల ముప్పు గురించి ఎప్పుడూ చెప్పే అమెరికా ఈ అంతర్గత ముప్పును ఎంత తొందరగా అరికడితే అంత మంచిది. లేదంటే చేతపట్టినవాడిని సైతం ఆయుధం బలి తీసుకుంటుంది. తుపాకీకి తన, మన తేడా ఉండదు మరి! -
Sakshi Cartoon: అమెరికాలో మళ్లీ కాల్పులు-తుపాకుల సంస్కృతే ప్రధాన కారణం
అమెరికాలో మళ్లీ కాల్పులు-తుపాకుల సంస్కృతే ప్రధాన కారణం -
తుపాకుల రాజ్యం.. జనాభా కంటే వాటి సంఖ్యే ఎక్కువ
అమెరికాలో బఫెలో నగరంలో ఆదివారం ఓ శ్వేతజాతి దురహంకారి కాల్పుల్లో 10 మంది నల్ల జాతీయులు దుర్మరణం పాలయ్యారు. సోమవారం కూడా వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు బలయ్యారు. ఈ ఏడాది అక్కడ ఇప్పటికే ఇలాంటి మూకుమ్మడి కాల్పుల ఘటనలు ఏకంగా 198 జరిగాయి. అంటే సగటున వారానికి పదన్నమాట! 2017లో లాస్‌వెగాస్‌లో జరిగిన కాల్పుల్లో ఏకంగా 56 మంది పౌరులు మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారు. అమెరికాలో ఈ నిత్య మారణకాండకు అక్కడి తుపాకుల సంస్కృతే ప్రధాన కారణం. అమెరికాలో తుపాకుల సంస్కృతి దాదాపు ఆ దేశ పుట్టుకతోనే మొదలైందని చెప్పవచ్చు. బ్రిటిష్ పాలనలో ఉండగా అమెరికాలో పోలీసు వ్యవస్థ గానీ, చెప్పుకోదగ్గ భద్రతా వ్యవస్థ గానీ లేకపోవడంతో స్వీయరక్షణ కోసం పౌరులు తుపాకులు చేపట్టడం మొదలుపెట్టారు. తుపాకుల వ్యాపారంలో బ్రిటిష్ కంపెనీలు విపరీతంగా ఆర్జించాయి. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే రెండో రాజ్యాంగ సవరణ పౌరులకు తుపాకులు ధరించే స్వేచ్ఛ కల్పించింది. ఇన్నేళ్లలో తుపాకీ సంస్కృతికి దేశంలో లక్షలాది మంది బలైనా తుపాకుల చట్టానికి చిన్నాచితకా మార్పులతో సరిపెడుతూ వచ్చారు. ఇందుకు ప్రధాన కారణం అమెరికాకు చెందిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ). ఏమిటీ ఎన్ఆర్ఏ? అమెరికా అంతర్యుద్ధంలో పాలుపంచుకున్న ఇద్దరు సైనికులు తుపాకుల సంస్కృతిని ప్రచారం చేసేందుకు 1871లో ఎన్ఆర్ఏను స్థాపించారు. ప్రభుత్వం ఎప్పుడు తుపాకుల నియంత్రణకు ప్రయత్నించినా ఈ సంస్థ లాబీయింగ్‌తో దాన్ని విజయవంతంగా అడ్డుకుంటూ వస్తోంది. సెనేటర్లను ప్రలోభపెట్టేందుకు, ప్రభావితం చేసేందుకు తన దగ్గరున్న అపార వనరులను ఏటా భారీగా వెదజల్లుతోంది. పైగా మాజీ అధ్యక్షులు, నేతలు, సినీ స్టార్ల వంటి ప్రముఖులెందరో ఈ సంస్థలో సభ్యులు. ఇటీవల పరిస్థితిలో కాస్త మార్పు వస్తోంది. తుపాకుల నియంత్రణ కోసం కొన్ని సంస్థలు రంగంలోకి దిగాయి. ఎన్‌ఆర్‌ఏకు దీటుగా నిధులు సేకరించి తుపాకీ సంస్కృతి వ్యతిరేక ప్రచారానికి వెచ్చిస్తున్నాయి. ఈ సంస్థలు 2018లో తొలిసారి ఎన్ఆర్ఏ కంటే ఎక్కువగా ఖర్చు చేసినట్టు అంచనా. పౌరులదీ అదే దారి తుపాకుల వాడకం, నియంత్రణ విషయంలో అమెరికా పౌరులు కూడా రెండుగా చీలిపోయారు. తుపాకుల వాడకంపై గట్టి నియంత్రణ ఉండాలని కేవలం 52 శాతం మందే కోరుతున్నట్టు గాలప్ అనే సంస్థ 2020లో చేసిన సర్వేలో తేలింది. తుపాకుల వాడకానికి ఉన్న స్వేచ్ఛ ఇలాగే కొనసాగాలని 32 శాతం చెప్పారు. 11 శాతం మందైతే ప్రస్తుతమున్న కొద్దిపాటి నియంత్రణను కూడా ఎత్తేయాలంటున్నారు! చట్టసభ్యుల విషయానికొస్తే డెమొక్రాట్లలో 91 శాతం, రిపబ్లికన్లలో 24 శాతం తుపాకులపై నియంత్రణ డిమాండ్‌కు మద్దతిస్తున్నారు. అంగడి సరుకులు మన దగ్గర కూరగాయల దుకాణాల్లాగే అమెరికాలో అడుగడుగునా తుపాకుల దుకాణాలున్నాయి. తుపాకీ సంపాదించడం అమెరికా పౌరులకు చాలా సులువైన వ్యవహారం. 21 ఏళ్లు దాటి, నేరచరిత్ర, మానసిక సమస్యలు లేకుంటే చాలు. తుపాకీ లైసెన్సు దొరికేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికాలో ప్రతి 100 మంది పౌరులకు ఏకంగా 120 తుపాకులున్నాయి! ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న యెమన్‌లో ప్రతి ఇద్దరిలో ఒకరి వద్ద మాత్రమే తుపాకీ ఉంది. నలుగురు అధ్యక్షులు బలయ్యారు ఎక్కడపడితే అక్కడ అతి సులువుగా దొరుకుతున్న తుపాకులు అమెరికాలో విచ్చలవిడి హత్యలతో పాటు ఆత్మహత్యలకూ కారణమవుతున్నాయి. 2020లో 19,384 మంది కాల్పులకు బలైతే, కాల్చుకుని చనిపోయిన వారి సంఖ్య 24,292! నలుగురు అమెరికా అధ్యక్షులు కూడా తుపాకులకే బలైపోయారు. అబ్రహం లింకన్, జేమ్స్ ఎ.గార్ఫీల్డ్, విలియం మెకెన్లీ, జాన్ ఎఫ్.కెనెడీ తూటాలకు నేలకొరిగారు. రోనాల్డ్ రీగన్, ఆండ్రూ జాక్సన్, హారీ ఎస్.ట్రూమన్ తదితర అధ్యక్షులపై హత్యా ప్రయత్నాలు జరిగినా ప్రాణాలతో బయట పడ్డారు. తుపాకుల నీడలో ► అమెరికాలో సగటున రోజుకు 50 మందికి పైగా తుపాకులకు బలైపోతున్నారు. ► జనాభాలో 58 శాతం మంది జీవితంలో ఏదో ఒక సమయంలో తుపాకుల బెదిరింపులకు లోనైనవారే. ► దేశంలో సగటున ఏటా 37 మంది టెర్రరిస్టుల దాడిలో చనిపోతుంటే, తుపాకుల సంస్కృతికి ఏకంగా 11,000 మంది బలవుతున్నారు. ► దేశంలో 63 వేల మంది లైసెన్సుడ్ ఆయుధ వ్యాపారులున్నారు. వీరు ఏటా 83 వేల కోట్ల రూపాయల విలువైన తుపాకులు అమ్ముతున్నారు. అమెరికాలో మళ్లీ కాల్పులు మరో ముగ్గురి దుర్మరణం లాగునావుడ్స్: అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం కొనసాగుతూనే ఉంది. దక్షిణ కాలిఫోర్నియా చర్చి, హూస్టన్‌లో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు మరణించారు. దక్షిణ కాలిఫోర్నియా చర్చిలో మధ్యాహ్న భోజన సమయంలో ఒక వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులకు సమాచారమంది వారు వచ్చేలోపే కాల్పులకు ఒకరు బలవగా ఐదుగురు వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం భక్తులు దుండగున్ని బంధించారు. కాల్పులకు దిగిన వ్యక్తి 60 ఏళ్ల ఆసియా సంతతికి చెందినవాడని పోలీసులు తెలిపారు. కాల్పుల వెనుక ఉద్దేశం తెలియరాలేదు. ఇంకో ఘటనలో హూస్టన్ మార్కెట్లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. వీటిలో ఇద్దరు మరణించగా ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బఫెలోలో ఓ శ్వేతజాతి యువకుడు పదిమందిని కాల్చిచంపిన విషయం తెలిసిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వయెలెన్స్.. వయెలెన్స్.. వయెలెన్స్
వయెలెన్స్.. వయెలెన్స్.. వయెలెన్స్.. అమెరికాలో నియంత్రణ కాలేకపోతోంది. తుపాకీల గర్జనతో మరోసారి అమెరికా ఉలిక్కి పడింది. చికాగో (Chicago) నగరంలోని వారాంతంలో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఎనిమిది మందికి పైగా మృతిచెందారు. మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. సౌత్ కిల్ప్యాట్రిక్లో పేలిన ఘటన.. అటుపై బ్రైటన్ పార్క్, సౌట్ ఇండియానా, నార్త్ కెడ్జి అవెన్యూ, హోమ్‌బోల్ట్ పార్క్‌లో వరుసగా చోటు చేసుకున్నాయి. తొలి ఘటన శుక్రవారం జరగ్గా.. 69 ఏండ్ల వృద్ధుడు మరణించాడు. ఆ తర్వాతి కాల్పుల ఘటనల్లో దాదాపు అన్ని వయస్సుల వాళ్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. గన్ వయొలెన్స్ అమెరికాలో ఎంతకీ తగ్గడం లేదు. ఓ పరిశోధన సంస్థ ప్రకారం.. కేవలం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 140కి పైగా కాల్పుల ఘటనలు సంభవించాయి. ఇలాంటి ఘటనలను నియంత్రించేందుకే ఘోస్ట్ గన్స్‌పై నిషేధం విధించాడు ఆ దేశ అధ్యక్షుడు జో బైడన్. అయితే ఈ చట్టం తీసుకొచ్చినా కూడా.. ఘటనలు మాత్రం ఆగడం లేదు. చదవండి: ఘోస్ట్ గన్స్ ఎఫెక్ట్.. ప్రాణ భయంతో ఎనిమిదో అంతస్తు నుంచి దూకింది! -
Russia: కాల్పుల కలకలం.. నలుగురి మృతి
రష్యాలో మంగళవారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మధ్య రష్యాలోని ఉల్యానోవ్స్క్లోని ఓ కిండర్‌గార్టెన్‌లోకి దుండగుడు ఒకడు తుపాకీతో ప్రవేశించి కాల్పులకు తెగపడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మృతి తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. కాల్పులకు తెగపడింది ఎవరు? ఎందుకు చేశాడనే వివరాలు తెలియాల్సి ఉంది. -
తలకు తుపాకీ గురి పెట్టి మరీ.. బలవంతంగా పెళ్లి చేశారు
పట్నా: ఇంట్లో పండగ చేసుకోబోతున్నారు.. అందుకని బంధువులను ఆహ్వానించడం కోసం పొరుగురికి వెళ్లాడు ఓ యువకుడు. అక్కడ అతడికి అనుకోని వింత అనుభవం ఎదురయ్యింది. బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా.. కొందరు వ్యక్తులు అతడిని బంధించి.. తలకు తుపాకీ గురి పెట్టి బెదిరించి.. ఏకంగా పెళ్లి చేశారు. పారిపోవడానికి ప్రయత్నిస్తే.. బాధితుడిపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఆ వివరాలు.. (చదవండి: Mystery Case: ఐదేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ..) బిహార్ నలంద జిల్లా, ధనుకి గ్రామానికి చెందిన నితీష్ కుమార్ ఛథ్ పండుగకు రమ్మని ఆహ్వానించడం కోసం నవంబర్ 11న వదిన వాళ్ల ఊరికి వెళ్లాడు. వారిని కలిసి.. పండుగకు రావాల్సిందిగా ఆహ్వానించి.. ఇంటికి తిరిగి బయలు దేరాడు. అలా వస్తుండగా.. మార్గమధ్యంలో ఆయుధాలు ధరించి ఉన్న కొందరు వ్యక్తులు నితీష్‌ను కిడ్నాప్ చేశారు. సరాసరి పెళ్లి మంటపానికి తీసుకెళ్లి.. అతడిని పెళ్లి కుమారుడిగా అలంకరించారు. ఈ క్రమంలో నితీష్ అక్కడ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడంతో.. అతడిని కొట్టారు. అంతటితో ఆగక తుపాకీతో నితీష్ తలకు గురిపెట్టి.. బెదిరించి బలవంతంగా పెళ్లి చేశారు. (చదవండి: ‘అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?’) ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న నితీష్.. జరిగిన సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చదవండి: భార్యాభర్తలను ఇంటి బయటకు ఈడ్చకెళ్లి.. కిరాతకంగా హత్య -
తుపాకీలతో పట్టపగలు దోపిడీ దొంగల బీభత్సం
-
మానసను బలిగొంది ప్రేమా? ఉన్మాదమా?
సరదా స్నేహాలు.. విపరీత అనర్థాలకు దారితీస్తున్నాయి. యుక్తవయసులో తెలిసీ తెలియక చేస్తున్న పనులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆకర్షణతో ఒకరికపై ఒకరు పెంచుకుంటున్న ‘ప్రేమ’ అనే ఫీలింగ్.. చివరకు విషాదాన్ని మిగులుస్తోంది. కేరళలో జరిగిన మానస హత్య ఘటన ‘ప్రేమోన్మాదం’ చర్చను మరోసారి తెర మీదకు తెచ్చింది. కొచ్చి: Dental Hose Surgeon మానస హత్య కేసు ప్రస్తుతం కేరళను కుదిపేస్తోంది. పట్టపగలే ఇంట్లోకి చొరబడి మరీ మానసను తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు.. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు.. మరిన్ని వివరాలను సేకరించారు. కొచ్చికి 35 కిలోమీటర్ల దూరంలో కొత్తమంగళం దగ్గర నెల్లికులిలో ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఇదసలు ప్రేమా? ఉన్మాదమా? అనే అంశంపై యువతలో సోషల్ మీడియాలో, ముఖ్యంగా క్లబ్‌హౌజ్‌లో ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. బ్రేకప్‌కి ఏడాది పీవీ మానస(24) స్వస్థలం కన్నూర్. ఇందిరా గాంధీ కాలేజీలో డెంటల్ కోర్సు ఫైనల్ ఇయర్ చదువుతోంది. అక్కడే స్నేహితురాల్లతో రూమ్‌లో ఉంటోంది. ఇక రాఖిల్(32?) కూడా అదే జిల్లాకు చెందిన వాడు. ఏడాది క్రితం ఈ ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు. ఆపై ప్రేమలో పడ్డారు. అయితే నెల క్రితం మానస, రాఖిల్‌కు బ్రేకప్ చెప్పింది. దీంతో రాఖిల్ ఆమెను బతిమాలడం మొదలుపెట్టాడు. కాళ్ల మీద పడ్డాడు. ఈ విషయంపై కన్నూర్ పోలీస్ స్టేషన్లో మానస ‘వేధింపుల ఫిర్యాదు’ చేసింది. ఈ ఫిర్యాదుపై పోలీస్ పంచాయితీ జరగ్గా.. రాఖిల్ పేరెంట్స్ రిక్వెస్ట్‌తో బెదిరించి వదిలేశారు పోలీసులు. దీంతో తన బ్రేకప్ కథకు ముగింపు పలకాలని పక్కా ఫ్లాన్ వేసుకున్నాడు. దగ్గరగా కాల్పులు శుక్రవారం మధ్యాహ్నం కొత్తమంగళంలో మానస ఉంటున్న రూమ్‌కి వెళ్లాడు. ఆమెతో గొడవకు దిగి.. మరో రూంలోకి లాక్కెళ్లాడు. రూమ్ మేట్స్ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వాళ్లను తుపాకీతో బెదిరించి ఆపై మానసపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో కేరళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈమధ్య వరుసగా వరకట్న మరణాలు చోటు చేసుకోడం, అవి మరిచిపోక ముందే మానస ఘటన చోటు చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాఖిల్‌కు తుపాకీ ఎలా దొరికిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
గోల్ఫ్ కోర్టులో కాల్పులు.. ముగ్గురి దుర్మరణం
అమెరికాలో గన్ కల్చర్ మరోసారి కలకలం రేపింది. జార్జియాలోని ఓ గోల్ఫ్ కోర్టులో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ ప్రొఫెషనల్ గోల్ఫ్ ఆటగాడితో పాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కెన్నెసాలోని పైన్‌ట్రీ కౌంట్రీ క్లబ్లో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. జెన్ సిల్లర్ అనే ఆటగాడితో పాటు మరో రెండు మృతదేహాలను కాబ్ కౌంటీ పోలీసులు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. 41 ఏళ్ల సిల్లర్ తలలో బుల్లెట్ దూసుకుపోయిందని.. దీంతో అక్కడిక్కడే చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. ఇక దగ్గర్లో ఉన్న పొదల్లో నుంచి పాల్ పియర్సన్ అనే వ్యక్తితో పాటు మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, వాళ్ల శరీరంలోనూ బుల్లెట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. దుండగుడి కోసం ప్రస్తుతం తనీఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. సిల్లర్ మృతిపట్ల గోల్ఫ్ అసోషియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు గోఫండ్‌మీ పేజీ ద్వారా విరాళాల సేకరణ చేపట్టారు. -
US: కాల్పుల కలకలం.. భయం గుప్పిట్లో ప్రజలు
వాషింగ్టన్: అమెరికాలోని నైరుతి రాష్ట్రమైన అరిజోనాలో ఓ దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. నిందితుడు మోటారు వాహనంపై వీధిలో తిరుగుతూ.. యధేచ్చగా కాల్పులు జరిపాడు. ఫీనిక్స్ పరిసర ప్రాంతాల్లోని ఎనిమిది చోట్ల ఒకటిన్నర గంటలపాటు బీభత్సం సృష్టించాడు. వెస్ట్ వ్యాలీలో కేవలం 90 నిమిషాల వ్యవధిలో మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మరణించగా.. మరో తొమ్మిది మందికి గాజు ముక్కలు గుచ్చుకుని గాయపడ్డారు. వీటివల్ల ప్రాణాపాయం లేదని తెలిసింది. కాగా ఈ ఘటనపై పియోరియా పోలీసు ప్రతినిధి బ్రాండన్ షెఫెర్ట్ మాట్లాడుతూ.. నిందితుడు ఇలా ఎందుకు చేశాడో తెలియదని, ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఘటన చాలా మందిని భయబ్రాంతులకు గురి చేసిందని తెలిపారు. గత ఏడాది 43,000 మంది మృతి ఇక గత నెలలో కాలిఫోర్నియాలోని సమీప రాష్ట్రంలో రైల్వేలో పనిచేసే ఓ ఉద్యోగి తొమ్మిది మందిని కాల్చి చంపాడు. అంతే కాకుండా మార్చి నెలలో కొలరాడోలో ఓ కిరాణా దుకాణంలో జరిగిన మరో ఘటనలో పది మంది మరణించారు. గత ఏడాది అమెరికాలో ఆత్మహత్యలు, కాల్పుల్లో మరణించిన వారు 43,000 మంది. కాగా, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బైడెన్ తొలిసారిగా దేశంలోని తుపాకీల సంస్కృతికి చరమగీతం పాడటంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దేశంలో గన్స్ అతి వాడకాన్ని నియంత్రిస్తూ బైడెన్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నట్టుగా వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈరోజు అమెరికా సైన్యం వద్ద కంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏఆర్, ఏకే రైఫిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా రైఫిల్స్ కంటే ఇలాంటి హ్యాండ్ గన్స్ వల్లే ఎక్కువగా నేరాలు, హత్యలు జరుగుతున్నాయి. చదవండి: ఇకపై వాహనాలకు ఏకీకృత కాలుష్య సర్టిఫికెట్ -
తుపాకీకి భయపడి బిల్డింగ్ పైనుంచి దూకిన చిన్నారులు
మాస్కో: చదువుకునేందుకు పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తుపాకీ గుళ్లకు భయపడి బిల్డింగ్ పైనుంచి దూకేశారు. ఓ ఆగంతకురాలి దుశ్చర్యతో అమాయకులైన చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణభయంతో ఆమె బారి నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు చిన్నారులు పాఠశాల భవనం మూడో అంతస్తు పై నుంచి దూకారు. అయితే తీవ్ర గాయాలతో మృతి చెందారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది చిన్నారులు ప్రాణాలు వదిలారు. ఈ ఘటన రష్యాలోని కజాన్ పట్టణంలో చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువతి తుపాకీ ధరించి పాఠశాలలోకి ప్రవేశించి కాల్పులకు పాల్పడింది. దీంతో చిన్నారులు ఆందోళన చెందుతూ హాహాకారాలు చేశారు. తూటాల నుంచి తప్పించుకునేందుకు చిన్నారులు పాఠశాల భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకారు. ఇద్దరు విద్యార్థులు కిందకు దూకగా.. 9 మంది చిన్నారులు ఆమె కాల్పుల బారిన పడి మృతి చెందారు. కాల్పుల భయంతో పరుగులు పెట్టడంతో పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పాఠశాలకు భద్రతా దళాలు, అంబులెన్స్‌లు చేరుకున్నాయి. మృతదేహాలను, గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఎందుకు కాల్పులకు పాల్పడిందనే విషయం ఇంతవరకు తెలియదు. చదవండి: భారత్‌పై నిషేధం: నిర్మోహమాటంగా కోర్టు నిరాకరణ చదవండి: ‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ Children seen jumping from building amid school shooting in Kazan, Russia; at least 9 killed pic.twitter.com/c8vlJcq4zV — BNO News (@BNONews) May 11, 2021 -
‘కదిలావో కాల్చేస్తా..’ టీచర్‌ను బెదిరించిన బాలిక
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈసారి ఏకంగా పాఠశాలలోనే కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆరో తరగతి చదువుతున్న బాలిక పాఠశాలకు తుపాకీతో వచ్చింది. వచ్చి రాగానే తన తోటి విద్యార్థులపై కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఆమె టీచర్‌ను భద్రతా దళాలు వచ్చేంతవరకు తుపాకీతో పట్టుకుందని సమాచారం. అమెరికాలోని ఇదోహ రాష్ట్రంలో రిగ్బి మిడిల్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలిక తుపాకీతో పాఠశాలకు వచ్చింది. అదును చూసి తనతో తెచ్చుకున్న తుపాకీతో కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో తన తోటి విద్యార్థులు ఇద్దరు, పాఠశాల సిబ్బంది ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులతో ఒక్కసారిగా పాఠశాలలో కలకలం రేపింది. వెంటనే స్పందించిన నిర్వాహకులు పెద్ద ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు. అయితే బాలిక పోలీసులు వచ్చేదాక కూడా టీచర్‌తో తుపాకీతో నిర్బంధించిందని అక్కడి స్థానిక మీడియా తెలిపింది. గన్‌తో పాఠశాల లోపల, బయట పలు రౌండ్లు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. అయితే బాలిక తుపాకీ ఎందుకు పాఠశాలకు తీసుకొచ్చిందో తెలియడం లేదు. ఇంత చిన్న వయసులో గన్ కల్చర్‌కు అలవాటు పడడంతో ఆందోళన రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కొత్త సీఎం స్టాలిన్: తొలి ఐదు సంతకాలు వీటిపైనే చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ -
అమెరికాలో ‘రెడ్‌ఫ్లాగ్ లా’ అమలుకు బైడెన్ కసరత్తు!
వాషింగ్టన్: అమెరికాలో తరచూ చోటుచేసుకుంటు న్న కాల్పుల ఘటనలు మహమ్మారిలా మారాయని అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఇవి అంతర్జాయతీయంగా ఇబ్బందికరంగా తయార య్యాయని పేర్కొన్నారు. దేశంలో తుపాకీ హింస ను అరికట్టేందుకు ఆయన పలు చర్యలను ప్రకటిం చారు. ఇందులోభాగంగా దేశీయంగా తయారయ్యే కొన్ని రకాల తుపాకులపై నియంత్రణలను విధిం చడంతోపాటు అసాల్ట్ రైఫిళ్లపై గతంలో అమలైన నిషేధాన్ని తిరిగి కొనసాగించాలని కాంగ్రెస్‌పై ఒత్తిడి తేనున్నారు. ‘ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై పలువురు కాంగ్రెస్ సభ్యులు సూచనలు చేశారు. కానీ, తుపాకీ సంస్కృతికి చెక్ పెట్టేలా ఒక్క చట్టాన్ని కూడా ఆమోదించలేదు. కాంగ్రెస్ ఈ విష యంలో సానుకూలంగా స్పందించినా లేకున్నా తుపాకీ హింస నుంచి అమెరికా ప్రజలకు రక్షణ కల్పించేందుకు అవసరమైన అన్ని రకాల ప్రత్యా మ్నాయాలను ఉపయోగించుకుంటాను’అని బైడెన్ గురువారం వైట్‌హౌస్ వద్ద మీడియా సమావేశంలో ప్రకటించారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి వంటి కేసులపై విచారణ చేపట్టిన మాజీ అధికారి డేవిడ్ చిప్‌మ్యాన్‌ను బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆరŠమ్స్, ఎక్స్‌ప్లోజివ్స్(ఏటీఎఫ్) చీఫ్‌గా నియమించనున్నట్లు ప్రకటించారు. ‘తుపాకీ కాల్పుల ఘటనలు మహమ్మారిలా మారాయి. అంతర్జాతీయంగా ఇబ్బందికరంగా, మనకు మాయని మచ్చలా తయారయ్యాయి. ఇది ఆగిపోవాలి’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రతి రోజూ 316 కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటుండగా 106 మంది చనిపోతున్నారు. ఆసియన్ అమెరికన్లపై జార్జియాలో జరిగిన కాల్పుల్లో 8 మంది చనిపోగా కొలరాడోలో 10 మంది మృతి చెందారు. ఈ రెండు ఘటనలకు మధ్యలో కేవలం వారం వ్యవధిలోనే 850 కాల్పుల ఘటనలు సంభవించాయి. ఈ ఘటనల్లో 250 చనిపోగా 500 మంది గాయపడ్డారు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘యుద్ధాల్లో వాడే 100 రౌండ్లు, 100 బుల్లెట్ల సామర్థ్యం కలిగిన ఆయుధాలను పౌరులు కలిగి ఉండటంలో అర్థం లేదు. వాస్తవానికి వీటి అవసరం ఎవరికీ ఉండదు’ అని బైడెన్ తెలిపారు. ఈ సమావేశం అనంతరం కొద్దిసేపటికే టెక్సాస్‌లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా ఐదుగురు గాయపడటం గమనార్హం. ఈ ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఓ పోలీస్ కూడా కాల్పుల్లో గాయాలపాలయ్యాడు. బుధవారం సౌత్ కరోలినాలో ఒక వ్యక్తి ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురిని కాల్చి చంపాడు. విభేదిస్తున్న ప్రతిపక్షం ‘తాజా నిబంధనలు రాజ్యాంగం రెండో సవరణ ప్రకారం తుపాకీ కలిగి ఉండే అమెరికన్ల హక్కులకు ఎలాంటి ఆటంకం కలిగించవు, వారి హక్కుకు హామీ ఇస్తుంది’ అని బైడెన్ తెలిపారు. తుపాకులపై గట్టి నియంత్రణలుండాలని అధికార డెమోక్రటిక్ పార్టీ సభ్యులు వాదిస్తుండగా, ప్రతిపక్ష రిపబ్లికన్లు మాత్రం ప్రజలకు తుపాకీ యాజమాన్య హక్కులుండాలని వాదిస్తున్నారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ కూడా బైడెన్ ఉత్తర్వులను వ్యతిరేకిస్తోంది. భారీ సంఖ్యలో మరణాలు సంభవించిన కాల్పుల ఘటనల్లో పలుమార్లు నిందితులు అసాల్ట్ రైఫిళ్లనే వాడారు. వీటి విక్రయంపై 1994 నుంచి 2004 వరకు నిషేధం అమల్లో ఉంది. అనంతరం ఈ నిషేధాన్ని పొడిగించకపోవడంతో ప్రస్తుతం అసాల్ట్ రైఫిళ్లపై ఎలాంటి నియంత్రలు లేవు. ఘోస్ట్ గన్స్కు చెక్ కిట్లలో సులువుగా మార్కెట్లలో లభించే ఏఆర్–15 వంటి పిస్టళ్లను ఇంటి వద్దే అసెంబుల్ చేసుకుని, యథేచ్ఛగా వాడేసుకునే వీలుంది. రైఫిళ్లతో పోలిస్తే వీటిపై నియంత్రణలు తక్కువ. వీటి వినియోగం సులువు. తక్కువ పొడవుండే బారెళ్లతో ఉండే వీటిని వేగంగా రీలోడ్ చేయడం చేయెచ్చు. కొలరాడో ఘటనలో నిందితుడు వీటినే వినియోగించారు. ఇటువంటి వాటిని అధికారులు ఘోస్ట్ గన్స్‌గా పిలుస్తున్నారు. వీటిపై ఎలాంటి నంబర్లు కానీ, ఇతర గుర్తింపు కానీ ఉండవు. ఎవరైనా వీటిని నేరాలకు పాల్పడేందుకు ప్రయోగిస్తే వాస్తవ యజమానులను గుర్తించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇకపై వీటి లభ్యతను అడ్డుకునేందుకు వెంటనే నిబంధనలు తయారు చేయాలని అధ్యక్షుడు బైడెన్ న్యాయశాఖను ఆదేశించారు. దీంతోపాటు రాష్ట్రాలు కూడా తమ అవసరాలకు అనుగుణంగా సొంత చట్టాలను అమలు చేసేందుకు ‘రెడ్‌ఫ్లాగ్ లా’ ముసాయిదా తయారు చేయాలని కోరారు. ఇది అమల్లోకి వస్తే ప్రమాదకరమైన వ్యక్తుల వద్ద నుంచి ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకునే అధికారం కోర్టులు, అధికారులకు దఖలు పడుతుంది. -
అమెరికాలో తుపాకీ.. ఇక అంత ఈజీ కాదు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బైడెన్ తొలిసారిగా దేశంలోని తుపాకీల సంస్కృతికి చరమగీతం పాడటంపై దృష్టి సారించారు. దేశంలో గన్స్ అతి వాడకాన్ని నియంత్రిస్తూ బైడెన్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నట్టుగా వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ‘గన్ వయలన్స్ పబ్లిక్ హెల్త్ ఎపడిమిక్’ పేరుతో బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఫెడరల్ ఏజెంట్, తుపాకుల నియంత్రణ వ్యవస్థకి సలహాదారుడైన డేవిడ్ చిప్‌మ్యాన్‌ను బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ఆర్మ్స్,ఎక్స్‌ప్లోజివ్స్‌కు (ఏటీఎఫ్)కు డైరెక్టర్‌గా నియమించారు. అమెరికాలో ఘోస్ట్ గన్స్ తయారీని నియంత్రించడానికి బైడెన్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ గన్స్ రిజిస్టర్ అయినవి కావు. తుపాకీ విడి భాగాలను ఒక చోట అమర్చి ఇంట్లోనే తయారు చేస్తూ వీటిని యథేచ్ఛగా అమ్మేస్తూ ఉంటారు. అలాంటి తుపాకులతో కాల్పులకు దిగితే అదెక్కడ తయారైందో తెలుసుకోవడం కష్టం. అందుకే ఈ తుపాకుల నియంత్రణకు ఏయే చర్యలు తీసుకోవాలో చెప్పాలంటూ న్యాయశాఖని బైడెన్ ఆదేశించారు. ఇందుకోసం నెలరోజులు గడువు ఇచ్చారు. నేషనల్ ఫైర్ ఆర్మ్స్ చట్టం కిందకి పిస్టల్స్‌ని నియంత్రించాలని నిర్ణయించారు. ఈ పిస్టల్స్‌ని అత్యవసర వినియోగానికి రైఫిల్స్ కింద మార్చే వీలుంటుంది. బౌల్డర్‌లో ఇటీవల జరిగిన కాల్పుల్లో రైఫిల్‌గా మార్చిన పిస్టల్‌నే నిందితుడు వినియోగించినట్టుగా తేలింది. దీంతో వీటిపైనా నియంత్రణ విధించాలని నిర్ణయించారు. ఎవరికైనా ప్రాణభయం ఉంటే తుపాకులు వెంట ఉంచుకుంటారు. అలాంటి వారు కూడా తుపాకుల వాడకానికి దూరంగా ఉండేలా న్యాయశాఖ సిఫారసులు చేయాలి. తుపాకుల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాలంటే బైడెన్ చేపట్టిన చర్యలన్నీ చట్టంగా మారాల్సి ఉంది. కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు వీటికి మద్దతు ఇస్తారో లేదా అన్నది అనుమానమే. వీటిలో చాలా ప్రతిపాదనలకు రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్‌లో తుపాకుల నియంత్రణకు సంబంధించిన చట్టాలన్నీ ఆమోదం పొందేలా రాజకీయ మద్దతు కూడగట్టడానికి బైడెన్ సర్కార్ వ్యూహరచన చేస్తోంది. -
తుపాకీ మరణాలు ఆగేదెన్నడు?
గత బుధవారం ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసు వద్ద జరిగిన తుపాకీ కాల్పుల ఘటనలో 9 సంవత్సరాల పాపతోపాటు నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. దానికి కొద్దిరోజుల ముందు కొలరాడో సరుకుల దుకాణంలో పదిమంది, అట్లాంటా ప్రాంతంలోని మసాజ్ కేంద్రంలో 8 మంది వ్యక్తులు దుండగుల కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు. 1975 నుంచి అమెరికాలో జరిగిన ఆత్మహత్యలు, హత్యలు, ప్రమాదాలలో మరణాలు (15 లక్షల మంది), అమెరికా స్వాతంత్య్ర యుద్ధ కాలం నుంచి ఆ దేశ చరిత్రలో జరిగిన అన్ని యుద్ధాల్లో సంభవించిన మరణాలను (14 లక్షల మంది) మొత్తంగా కలిపి చూసినా సరే అమెరికాలో తుపాకీ కాల్పుల వల్లే ఇంకా ఎక్కువమంది ప్రజలు మరణించారని సమాచారం. ఈ కాల్పుల్లో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఒక ఏడాదిలోపే నాలుగేళ్ల పిల్లలను 80 మందిని తుపాకులు పొట్టన బెట్టుకుంటున్నాయి. అదే సమయంలో 50 మంది కంటే తక్కువగానే పోలీసు అధికారులు కాల్పుల్లో చనిపోతున్నారు. భారీ కాల్పులకు ఉపయోగపడే తుపాకుల పట్ల చాలామందికి ఆకర్షణ ఎక్కువ. గతంలో అమెరికన్లు వేటాడటం కోసం ఉపయోగించే తుపాకులు నేరాలకు ఎన్నడూ వాడేవారు కాదు. కానీ గడిచిన కొన్ని దశాబ్దాలుగా అంతగా ప్రమాదం కలిగించని ఆయుధాల స్థానంలో మిలటరీ ఉపయోగించే సెమీ–ఆటోమేటిక్ రైఫిల్స్ అంటే ఏఆర్–15 లేదా ఏకే–47 వంటి మారణాయుధాలు వచ్చి చేరుతున్నాయి. వీలైనంత ఎక్కువ మందిని చంపాలని కోరుకున్నప్పుడు మారణాయుధాలే వ్యక్తుల ఎంపికగా మారుతున్నాయి. అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్‌లో ఇపుడున్న పరిస్థితుల్లో తుపాకుల నిరోధక చట్టం వంటిది తీసుకురావడం అసాధ్యం, అసంభవమే అని చెప్పాలి. ఉదారవాదులు పదేళ్లపాటు మారణాయుధాలపై నిషేధించాలని కోరుతూ వచ్చారు కానీ అది ప్రాణాలను కాపాడినట్లు బలమైన సాక్ష్యం కనిపించడం లేదు. కానీ ఏఆర్–15 ఒక సాంప్రదాయిక చిహ్నంగా మారిపోయింది కాబట్టే ఈరోజు అమెరికా సైన్యం వద్ద కంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏఆర్, ఏకే రైఫిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా రైఫిల్స్ కంటే ఇలాంటి హ్యాండ్ గన్స్ వల్లే ఎక్కువగా నేరాలు, హత్యలు జరుగుతున్నాయి. ఎలాంటి రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా మార్కెట్లోకి వస్తున్న ఈ మారణాయుధాలను (వీటినే అమెరికాలో దెయ్యపు తుపాకులు అంటారు) తన కార్యనిర్వాహక ఆదేశం ద్వారా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అరికట్టవచ్చు. ఎందుకంటే వీటిలో చాలావరకు పూర్తి తయారీ కాని తుపాకులుగానే ముద్రపడుతూ బయటికి వస్తున్నాయి. కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన తుపాకీ హింసలపై నిపుణుడు డాక్టర్ గరెన్ వింటెముట్ దీనిపై జోక్ చేస్తూ ‘దెయ్యపు తుపాకులను సొంతం చేసుకున్నారు. వాటిని కనిపెట్టడం అసాధ్యం’ అంటూ వ్యాఖ్యానించారు. జాతీయవాదులు దీన్ని సాకుగా తీసుకుని ఈ ఘోస్ట్ గన్స్ నుంచి రహస్యంగా మారణాయుధాల తయారీకి పూనుకుంటున్నారు. గత సంవత్సరం అలాంటి తుపాకీతోనే అతివాద ఉద్యమ మద్దతుదారు నిఘా అధికారిని కాల్చి చంపాడు. పోతే మిచిగాన్ గవర్నర్ గ్రెచెన్ విట్మార్ని అపహరించాలని ప్రయత్నించిన వ్యక్తి కూడా ఈ ఘోస్ట్ గన్నే కలిగి ఉండటం గమనార్హం. 2019లో ఒక్క సంవత్సరంలోనే 10 వేలకు పైగా దెయ్యపు తుపాకులను నిఘా సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. అధ్యక్షుడు బైడెన్ ఈ ఘోస్ట్ గన్స్ ప్రమా దాన్ని తగ్గించడానికి వెంటనే కార్యనిర్వాహక ఆదేశాన్ని ఇవ్వడం మంచిది. ఈ తుపాకులను ఎక్కడెక్కడ నేరాల్లో ఉపయోగించారో డేటాను సేకరించాలి. రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం తుపాకుల నియంత్రణలో ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు కూడా అమెరికాలో తుపాకీ మరణాలను అంత సులభంగా తగ్గించలేవు. కానీ తుపాకుల నిషేధం దిశగా తీసుకునే కనీస చర్యలు కూడా అమెరికా సమాజాన్ని ఎంతో కొంత సురక్షితంగా ఉంచుతాయనడంలో సందేహం లేదు.. వ్యాసకర్త: నికోలస్ క్రిస్టాఫ్ అమెరికన్ జర్నలిస్ట్, పులిట్జర్ గ్రహీత -
స్కూలుకు తుపాకీ తెచ్చిన బాలుడు
నాప్లెస్: ఫ్లోరిడాలోని నాప్లెస్లోఉన్న ఓసియోలా ఎలిమెంటరీ స్కూలుకు చెందిన 11 ఏళ్ల బాలుడు తన బ్యాగులో తుపాకీ పెట్టుకొని పాఠశాలకు రావడం కలకలం రేపింది. కౌంటీ షెరిఫ్ అందించిన వివరాల ప్రకారం.. 4వ గ్రేడ్ చదువుతున్న బాలుడు తనతో పాటు తుపాకీని స్కూలుకు తెచ్చుకున్నాడు. అయితే అందులో బుల్లెట్లు లేవు. ఆ తుపాకీని తోటి విద్యార్థులకు చూపించి బెదిరించినట్లు పాఠశాల అధికారులు గుర్తించారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు బాలున్ని అదుపులోకి తీసుకున్నారు. -
నాటు తుపాకీ కలకలం
వెల్దుర్తి(తూప్రాన్): నేరప్రవృత్తి కలిగిన ఓ యువకుడి వద్ద నాటు తుపాకీ వెలుగుచూడడం వెల్దుర్తి మండలంలో కలకలం సృష్టించింది. పాతకక్షలు దృష్టిలో పెట్టుకొని హతమారుస్తామంటూ సర్పంచ్‌పై తుపాకీతో పాటు కత్తులతో నలుగురు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. గమనించిన గ్రామస్తులు బెదిరింపులకు పాల్పడిన వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మండలంలోని మంగళపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. సర్పంచ్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మన్నె రమేశ్ అనే యువకుడు అతని తండ్రి యాదయ్య, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ నెల 27న సాయంత్రం విజయబ్యాంకు వద్ద నిలబడి ఉన్న సర్పంచ్ రామకృష్ణారావుతో గొడవ పెట్టుకొని తుపాకి, కత్తులతో చంపుతానని బెదిరించారు. వీరిద్దరి మధ్య గత కొద్ది రోజులుగా పాత కక్షలు ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గ్రామస్తుల రాకను చూసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. అనంతరం దేహశుద్ధి చేసి వారు ఉపయోగించిన తుపాకి, కత్తులను పోలీసులకు అప్పగించారు. అడవి జంతువుల వేట..! మన్నె రమేష్ గత నాలుగైదు నెలలుగా ఎస్బీఎంఎల్ కంట్రీ మేడ్ వెపన్తో స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అడవి జంతువులను వేటాడుతున్నాడని సమాచారం. ఈ విషయమై గ్రామస్తులు అతడిని చాలాసార్లు అడిగినా సమాధానం దాటవేశాడని తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గంగరాజు పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. -
గన్ మిస్ ఫైర్.. తప్పిన పెను ప్రమాదం
నిర్మల్‌టౌన్: కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ శంకర్‌గౌడ్ చేతిలో ఉన్న తుపాకి మిస్‌ఫైర్ అయి ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శంకర్‌గౌడ్ గార్డుగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం తన తుపాకిని శుభ్రం చేస్తుండగా, అనుకోకుండా ట్రిగ్గర్‌కు వేలు తగిలి తుపాకి పేలింది. దీంతో శంకర్‌గౌడ్ ఎడమభాగంలోని ఛాతి, భుజం భాగం ప్రాంతాల్లో తీవ్ర గాయాలయ్యాయి. బుల్లెట్ బయటకు రావడంతో పెనుప్రమాదం తప్పింది. బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్తే ప్రాణానికి ప్రమాదం సంభవించే అవకాశం ఉండేది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది చికిత్స నిమిత్తం క్షతగాత్రున్ని జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి శంకర్‌గౌడ్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. -
వ్యక్తిగత భద్రతకు ఇక రెండు ఆయుధాలే
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం అమలులో ఉన్న ఆయుధ చట్టంలో కేంద్ర ప్రభుత్వం కీలక సవరణ చేసింది. వ్యక్తిగత భద్రత కేటగిరీలో గరిష్టంగా రెండు తుపాకులు మాత్రమే కలిగి ఉండేలా మార్పు తీసుకువచ్చింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం మూడో ఆయుధం కలిగిన వారు తక్షణం దానిని డిపాజిట్ చేయాలని స్పష్టం చేశారు. సాధారణంగా తుపాకీ లైసెన్సును మూడు కేటగిరీల్లో జారీ చేస్తారు. వ్యక్తిగత భద్రత, సెక్యూరిటీ గార్డులు, ఫైరింగ్, క్రీడల సంబంధికులకు వీటిని ఇస్తుంటారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఒక లైసెన్సుపై గరిష్టంగా మూడు తుపాకులు కలిగి ఉండేందుకు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కేవలం 4,700 లైసెన్సులు ఉండగా.. ఆయుధాల సంఖ్య మాత్రం 10 వేల వరకు ఉంది. అయితే సదరు లైసెన్సుపై ఎన్ని ఆయుధాలు కలిగి ఉండవచ్చనే అంశాన్ని జారీ సమయంలోనే స్పష్టం చేస్తారు. అంతకుమించి తుపాకులు కలిగి ఉండటానికి ఆస్కారం ఉండదు. వ్యక్తిగత భద్రత కేటగిరీలో ఆయుధ లైసెన్సు తీసుకుని దాని ఆధారంగా దానిని ఖరీదు చేసిన వారు మరో కేటగిరీలో వినియోగించడం చట్ట విరుద్ధం. గతంలో అమలులో ఉన్న ఆయుధ చట్టం నిబంధనల ప్రకారం వ్యక్తిగత భద్రత కేటగిరీలో ఒక్కో వ్యక్తి గరిష్టంగా మూడు ఆయుధాలు కలిగి ఉండటానికి ఆస్కారం ఉండేది. అయితే దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నట్లు గుర్తించిన కేంద్రం గత ఏడాది కీలక సవరణలు చేసింది. దాని ప్రకారం ఈ కేటగిరీలో గరిష్టంగా రెండు ఆయుధాలు మాత్రమే కలిగి ఉండాలి. దీనికి సంబంధించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని అధికారికంగా అందుకున్న నగర పోలీసు విభాగం అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం సీపీ వ్యక్తిగత కేటగిరీలో రెండు ఆయుధాలు మాత్రమే కలిగి ఉండాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడో ఆయుధాన్ని తక్షణం స్థానిక పోలీస్ స్టేషన్ లేదా అధీకృత ఆయుధ విక్రేతల వద్ద డిపాజిట్ చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న లైసెన్సు రెన్యువల్ సమయంలో ఆయుధాల సంఖ్యను రెండుకు తగ్గించనున్నారు. లైసెన్సుదారుడు డిపాజిట్ చేసిన ఆయుధాన్ని మరో లైసెన్సుదారుడికి లేదా లైసెన్డ్సు ఆయుధ విక్రేతకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. దీనికి ఏడాది గడువు ఇస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. లైసెన్సు ఆయుధాలు కలిగి ఉన్న వారి జాబితా, వివరాలు పోలీసుస్టేషన్ల వారీగా అందుబాటులో ఉంటాయి. లాక్డౌన్ హడావుడి ముగిసిన తర్వాత ఆడిటింగ్ చేపట్టాలని పోలీసు విభాగం నిర్ణయించింది. అందులో ఎవరైనా తమ మూడో ఆయుధం డిపాజిట్ చేయనట్లు తేలితే వారికి నోటీసులు జారీ చేయడంతో పాటు చట్ట పరంగా చర్యలు తీసుకోనున్నారు. నగర పోలీసు విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘తొలుత కేంద్రం వ్యక్తిగత భద్రత కేటగిరీలో ఒకరికి ఒక ఆయుధం మాత్రమే ఉండేలా మార్పులు చేయాలని భావించింది. అయితే అనేక వర్గాల నుంచి వచ్చిన ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని రెండు ఆయుధాలకు పరిమితం చేసింది. మూడో ఆయుధం కలిగిన వారు వెంటనే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది’ అని అన్నారు. ఇకపై ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పోలీసులు, సాయుధ బలగాల నుంచి ఆయుధం లాక్కుంటే వారికి గరిష్టంగా జీవితఖైదు పడేలా మరో సవరణను కేంద్రం తీసుకువచ్చింది. -
లాక్డౌన్ నిందితునిపై తూటా
కర్ణాటక, యశవంతపుర: లాక్డౌన్ తనిఖీల సమయంలో బుధవారం విధులలో ఉన్న పోలీసులపై దాడి చేసి పారిపోయిన యువకునిపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన బెంగళూరులో జరిగింది. లాక్డౌన్ సందర్భంగా సంజయనగర భూపసంద్ర వద్ద చెక్‌పోస్ట్‌ను పెట్టివాహనాలను తనిఖీ చేశారు. బైకులపై వచ్చిన 10 మంది యువకుల పోలీసులు వాహనాలను తనికీ చేశారు. ఆగ్రహం చెందిన యువకులు పోలీసులు బసవరాజు, మంజునాథ్‌లపై దాడి చేసి పారిపోయారు. కాల్పులు జరిగాయిలా నిందితులను అరెస్ట్ చేయటానికి బుధవారం రాత్రి గాలించి ప్రధాన నిందితుడు తాజుద్దీన్‌తో పాటు 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో నిందితున్ని సంజయనగర సీఐ జాలాజీ, మహిళా ఎస్ఐ రూపా, హెడ్ కానిస్టేబుల్ మంజునాథ్‌లు మహజర్ కోసం ఘటనాస్థలిని పరిశీలించటానికీ తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితుడు పోలీసులపై దాడి చేసి పారిపోవటానికి యత్నించాడు. లొంగిపోవాలని హెచ్చరించినా పట్టించుకోకుండా దాడి చేయటానికి యత్నించాడు. సీఐ బాలాజీ నిందితుడిపై కాల్పులు జరిపారు. నిందితుని కాలికి తూటా తగిలి అక్కడిక్కడే కుప్పకూలాడు. తక్షణం పోలీసులు అతన్ని పట్టుకున్నారు. గాయాలైన నిందితుడు తాజుద్దీన్, ఎస్ఐ రూపా, హెడ్‌కానిస్టేబుల్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
తుపాకుల వ్యాపారం గుట్టురట్టు
భువనేశ్వర్: రాజధాని నగరంలో తుపాకుల వ్యాపారం ముఠా గుట్టు రట్టయింది. స్పెషల్ టాస్క్ఫోర్సు (ఎస్టీఎఫ్) చేపట్టిన దాడుల్లో నిందితులు పట్టుబడ్డారు. నగరంలో మారణాయుధాల విక్రయ సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ముందస్తు సమాచారం ఆధారంగా ఎస్టీఎఫ్ సోమవారం చేపట్టిన దాడులు ఫలప్రదమయ్యాయి. ఈ దాడుల్లో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరిని స్థానిక ప్రైవేట్ కళాశాలలో బీబీఏ విద్యార్థిగాగుర్తించారు. మారణాయుధాల అక్రమ లావాదేవీల్లో విద్యార్థి ప్రధాన నిందితుడు కావడం సర్వత్రా కలకలం సృష్టించింది. నిందితుడిని ఝార్కండ్ నుంచి వచ్చిన షాను పొద్దార్‌గా గుర్తించారు. 7.65 మిల్లీమీటర్ల మూడు ఆటోమేటిక్ పిస్తోళ్లతో ఐదు మ్యాగజైన్లు, 22 రౌండ్ల పేలని తూటాల్ని స్వాధీ నం చేసుకున్నారు. స్థానిక ఖండగిరి ఐటీఆర్ కళాశాల ప్రాంతంలో సురేష్ పాణిగ్రాహి అనే వ్యక్తికి ఈ ఆయుధాల్ని విక్రయించేందుకు వచ్చి నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఒక్కో తుపాకీ రూ.1 లక్ష వెలతో విక్రయించేందుకు కుదిరిన ఒప్పందం మేరకు ఆయుధాలు ఏర్పాటు చేసినట్లు నిందితుడి ప్రాథ మిక సమాచారం. తుపాకులపై ఉన్న ముద్రలను బట్టి అవి కిర్కీ (పూణే) ఆయుధాగారం నుంచి బయటపడినట్లు తెలుస్తోందని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ డీఐజీ జె.ఎన్.పంకజ్ తెలిపారు. పటిష్టంగా విచారణ మావోయిస్టు వర్గాలతో నిందితుడికి రహస్య సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది. ఈ ఆయుధాల సేకరణ, క్రయ–విక్రయాలు, సరఫరా–కొనుగోలు వగైరా సమాచారం ఆరా తీసేందుకు విచారణ పటిష్టంగా నిర్వహిస్తున్నారు. తెర వెనుక ముఠా గుట్టు తెలుసుకునేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కృషి చేస్తోంది. నిందితులను కోర్టులో హాజరుపరిచి అభ్యర్థించి త్వరలో రిమాండ్‌కు తీసుకుని మారణాయుధాల లావాదేవీల్లో నిందితుడి పాత్ర, అనుబంధ వర్గాల గుట్టురట్టు కోణంలో ప్రశ్నిస్తామని ఎస్టీఎఫ్ డీఐజీ పంకజ్ తెలిపారు. -
అమెరికాలో కాల్పులు ఆరుగురు మృతి
జెర్సీ సిటీ: అమెరికా న్యూజెర్సీ నగరంలో తుపాకీ విష సంస్కృతి మరోసారి చెలరేగింది. మంగళవారం రాత్రి నగర వీధుల్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందారు. వీరిలో ముగ్గురు సాధారణ పౌరులు కాగా, ఒక పోలీసు అధికారి, కాల్పులకు తెగబడిన ఇద్దరు దుండగులు ఉన్నారు. దుండగులు యూదులకు చెందిన కొషర్ సూపర్ మార్కెట్‌ని లక్ష్యంగా చేసుకున్నట్టు నగర మేయర్ స్టీవెన్ చెప్పారు. ఇది ఉగ్రవాదుల దాడి కాదని, కేవలం యూదుల్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు దిగారని, పోలీసులు వారిని హతం చేశారని ట్వీట్ చేశారు. -
భీతిల్లుతున్న మన్యం
గూడెంకొత్తవీధి(పాడేరు):మావోయిస్టు పార్టీలో 12 ఏళ్లపాటు వివిధ స్థాయిల్లో పనిచేసి, చాలాకాలం అజ్ఞాతంలో గడిపాడు, అరెస్ట్ అయ్యి మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి చివరకు వారి చేతుల్లో బలయ్యాడు. జీకే వీధి మండలం పెదపాడు గ్రామానికి చెందిన తాంబేలి లంబయ్య అలియాస్ దివుడును పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో మావోయిస్టులు హతమార్చడంతో ఏజెన్సీలో కలకలం రేగింది. ఇన్ఫార్మర్ల నెపంతో మావోయస్టుల చేతిలో హత్యకు గురైన వారిలో దివుడు మూడో వ్యక్తి. వరుస హత్యలతో ఏజెన్సీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇన్ఫార్మర్లుగా ముద్రపడిన వారు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరిని మావోయిస్టులు హత్య చేస్తారో తెలియక భీతిళ్లుతున్నారు. సంఘటన స్థలం వద్ద లభ్యమైన తూటా ఉద్యమం కోసం పుష్కర కాలం శ్రమించి, ఇప్పుడు కుటుంబ సభ్యులతో జీవనం గడుపుతున్న లంబయ్య(48)ను హత్య చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల ఉద్యమంవైపు ఆకర్షితుడైన లంబయ్య ఆ పార్టీలో చేరి,వివిధ స్థాయిల్లో పనిచేసి గాలికొండ దళ సభ్యునిగా ఎదిగాడు. సుమారు 12ఏళ్ల పాటు దళంలో చురుగ్గా వ్యవహరించి అనేక సంఘటనల్లో పాల్గొన్నాడు. చాలా కాలం అజ్ఞాతంలో గడిపాడు. 2011లో చెరుకుంపాకల ఎదురుకాల్పుల ఘటనలో పోలీసులకు ఆయుధాలతో పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు లంబయ్యను అరెస్టు చేసి జైలుకు పంపారు. మూడేళ్ల పాటు విశాఖ కారాగారంలో శిక్ష అనుభవించి, 2013లో లంబయ్య బెయిల్‌పై విడుదలై గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బెయిల్‌పై వచ్చిన లంబయ్య తరచూ కోర్టు వాయిదాల నిమిత్తం విశాఖ, నర్సీపట్నం ప్రాంతాలకు వెళ్లివస్తుండేవాడు. ఈ ఆరేళ్ల కాలంలో మన్యంలోని మావోయిస్టులకు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు, లొంగుబాటులు, అరెస్టుల వంటి సంఘటనలు జరిగాయి. జైలుకెళ్లివచ్చిన లంబ య్య, పోలీసులతో లోపాయికారిగా ఒప్పం దాలు కుదుర్చుకుని మావోయిస్టుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాడన్నది వారి అభియోగం. ఈ క్రమంలోనే పలు సంఘటనలకు బాధ్యుడిగా చేస్తూ మావోయిస్టులు లంబయ్యను మంగళవారం రాత్రి తుపాకీతో కాల్చి చంపారు. 12ఏళ్ల పాటు పార్టీకి సేవలందించిన లంబయ్యను దారుణంగా కాల్చిచంప డంపట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని డోలీలో తరలిస్తున్న బంధువులు దిక్కెవరు... లంబయ్యను మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో హతమార్చడంతో అతని కుటుంబ సభ్యులు భోరున విలపించారు. లంబయ్యకు భార్య జీమొ, కుమారులు రాంబాబు, దాసు, నాగేష్, మంగుడు, కుమార్తెలు సీతమ్మతో పాటు కోడలు ఉన్నారు. వీరంతా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. లంబయ్యను మావోయిస్టులు పొట్టనపెట్టుకోవడంతో తమకు దిక్కెవరంటూ వారు రోదించారు. పెదపాడు గ్రామంలో ఉంటున్న వీరంతా బుధవారం తెల్లవారు జామున సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. లంబయ్య హత్యతో పెదపాడు గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. దుర్భర పరిస్థితుల మధ్య మృతదేహం తరలింపు మావోయిస్టుల చేతిలో హతమైన లంబయ్య మృతదేహాన్ని దుర్భర పరిస్థితుల మధ్య పోస్టుమార్టం నిమిత్తం ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తరలించారు. సంఘటన జరిగిన ప్రాంతం మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. కుంకుంపూడి సమీపంలో ఉన్నప్పటికీ కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. భారీ వర్షం కారణంగా మృతదేహం తరలింపునకు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తీములబంధ వరకు లంబయ్య మృతదేహాన్ని డోలీలో తరలించి, అక్కడి నుంచి ఆటోలో చింతపల్లి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పెదపాడు గ్రామానికి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యుకులు, గ్రామస్తులు నరకయాతన పడ్డారు. -
ధార్వాడ దడదడ
కర్ణాటక, హుబ్లీ: వాణిజ్య నగరం ధార్వాడ తుపాకీ చప్పుళ్లలో దద్దరిల్లుతోంది. బుధవారం ఉదయం ఓ ప్రైవేటు కంపెనీ మేనేజర్‌ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఉత్తర కన్నడ జిల్లా దాండేలికి చెంది న శ్యాంసుందర్ దేవరాజ్ (42) హత్యకు గురైన వ్యక్తి. ఉదయం 8 గంటల ప్రాంతంలో ధార్వాడ–హళియాళ రోడ్డులో నిగది సమీపంలో ఘటన జరిగింది. శ్యాం సుందర్ హుబ్లీ విమానాశ్రయం ద్వారా ఢిల్లీకి వెళ్లడానికి కారులో వస్తుండగా దాండేలి నుంచే వెంటాడిన ఈ ముగ్గురు దుండగులు హళియాళ రోడ్డులో నిగది గ్రామం వద్ద వెళ్తున్న కారును ఓవర్టేక్ చేసి కారు కిటికి నుంచే తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. తుపాకీ గుళ్లు శ్యామ్ సుందర్ ఎడమ భుజంలోకి దూసుకెళ్లగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిచిపోయింది. కొందరు స్థానికులు గమనించి తక్షణమే అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలను వదిలారు. శ్యామ్ సుందర్ ప్యానాసోనిక్ కంపెనీలో మేనేజర్‌గా పని చేసేవారు. రాజకీయ కక్షలే కారణమా? రాజకీయ విబేధాల వల్ల హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. కొంతకాలం కిందట మున్సిపల్ ఎన్నికల్లో దాండేలి నగరసభకు శ్యామ్‌సుందర్ భార్య కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కొందరితో ఆయనకు విబేధాలు నెలకొన్నాయి. ఎన్నికల తరువాత ఆయన ఢిల్లీలోను, బెంగళూరులోనూ మకాం మార్చారు. గత జనవరి నుంచి ఢిల్లీలోనే నివసిస్తున్నారు. కుటుంబాన్ని కలవడానికి శనివారం దాండేలికి వచ్చారని శ్యాం సుందర్ సోదరుడు జాన్సన్ తెలిపారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ వర్థిక కటియార, డీఎస్పీ రామనగౌడ హట్టి, సీఐ శివానంద కమతగి, ఎస్ఐ ఆనంద టక్కనవర తదితరులు పరిశీలించారు. ఈఘటనపై ధార్వాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఐదురోజుల్లోనే రెండోసారి కాల్పులు కాగా ఐదు రోజుల క్రితం హుబ్లీ మంజునాథ నగర క్రాస్ వద్ద బీహార్‌కు చెందిన సర్వేష్ యోగేంద్రసింగ్ అనే వ్యక్తిని తుపాకీతో కాల్చి హత్య చేశారు. రెండు నెలల క్రితమే హుబ్లీకి వచ్చారు. భార్యతో కలిసి నివసించేవారు. ఆమె 8 నెలల గర్భిణి. బైక్‌మీద వచ్చిన ముగ్గురు దుండగులు ఆయనను హత్యచేసి పరారయ్యారు. వరుస హత్యలతో జంటనగరాల వాసుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. -
అమెరికాలో ‘చచ్చేవరకు ఉండే జబ్బు’
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్పాసో, ఒహాయో రాష్ట్రంలోని డేటన్ నగరాల్లో ఆగస్టు మూడు, నాలుగు తేదీల్లో జరిగిన సామూహిక జన హనన కాండలో దాదాపు 30 మంది అమాయకులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఒకటి వాల్ మార్ట్ మాల్లో జరగ్గా, మరొకటి నైట్ బార్ వద్ద జరిగింది. రెండు సంఘటనల్లోనూ హంతకులను పోలీసులు అక్కడికక్కడే కాల్చి చంపివేశారు. మొదటి హత్యాకాండలో ఓ తెల్ల జాతీయుడు శ్వేత జాత్యాహంకారంతో ఈ సామూహిక జన హననానికి పాల్పడగా, రెండో సంఘటనలో పాఠశాలలో అవమానానికి గురైన ఓ విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇలాంటి వారికి డానిష్ తత్వవేత్త ‘సిక్నెస్ అన్టుడెత్ (చచ్చేవరకు ఉండే జబ్బు)’ జబ్బందని పిలుస్తున్నారు. చదవండి: అగ్రరాజ్యంలో కాల్పుల అలజడి ఇలాంటి సామూహిక జన హననం అమెరికాకు కొత్త కాదు. స్కూళ్లలో, క్లబ్బుల్లో, పబ్బుల్లో, బార్లలో, బీచుల్లో, చర్చీల్లో తరచుగా జరుగుతూనే ఉన్నాయి. డల్లాస్‌లో మైక్ జాన్సన్, ఓర్లాండోలో ఒమర్ మెటీన్ ఇలాంటి హత్యాకాండలకే పాల్పడ్డారు. ఎప్పుడు , ఎక్కడా జనం ఎక్కువగా గుంపులు, గుంపులుగా ఉంటారో వాటినే లక్ష్యంగా చేసుకుని ఈ హంతకులు ఇలాంటి మారణకాండలకు పాల్పడుతున్నారు. వీలైనంత ఎక్కువ మందిని చంపాలనే కసితోనో, ఆక్రోశంతోనో వారీ లక్ష్యాలను ఎంచుకుంటున్నారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా, వీడియో గేమ్స్‌కు అలవాటు పడ్డ యువతనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి సంఘటనలపై వ్యాఖ్యానించి చేతులు దులుపుకున్నారు. ఇది కొంత వరకే నిజం. సమాజంలో ఒంటరి వాళ్లుగా భావిస్తున్న వాళ్లు వీడియో గేమ్లకో, సోషల్ మీడియాలకో బానిసలై జీవితం పట్ల అసంతప్తితోనో, అసహనంతోనో ఇలాంటి దాడులకు పాల్పడుతుండవచ్చు. సహజంగానే వీరిని మానసిక రోగులని, సైకోలని పిలుస్తున్నాం. వీరిలో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటుండగా, కొంతమంది లక్ష్యరహిత ప్రతీకారం కోసం ఇలా జన హననానికి పాల్పడుతున్నారు. అసలు వారు సైకోలుగా ఎందుకు తయారవుతున్నారు ? అందుకు దారితీస్తున్న సామాజిక పరిస్థితులేమిటీ? సామాజిక, మానసిక శాస్త్రవేత్తల ప్రకారం సమాజంలో ప్రతి వ్యక్తి తన కాళ్లమీద నిలబడే గౌరవప్రదమైన జీవితాన్ని, అందుకు సరిపడే హోదాను కోరుకుంటారు. సమాజంతోపాటు చేస్తున్న వృత్తిలోనూ రాణించాలనుకుంటారు. మరికొందరు నలుగురితో సమానంగా కాకుండా నలుగురిలో ఒకరుగా గుర్తింపు పొందాలనుకుంటారు. లక్షలు లక్షలు సంపాదించే విలాస జీవితాన్ని కోరుకుంటారు మరికొందరు. వారంతా అందుకు సమాజంలో పోటీ పడాల్సి వస్తోంది. అందుకు వారి వారి జీవితాల్లో ఒడిదుడుకులు తప్పవు. తోటివారితో పోటీ పడలేక జీవితంలో ఓడిపోయిన వాళ్లు, చేతకాని వాళ్లులాగా మిగిలిపోతున్న వాళ్లు, నా అని పలకరించే వాళ్లు లేక లోలోన నలిగిపోతున్న వాళ్లు, మానసికంగా కుమిలిపోతున్న వాళ్లు, ఒత్తిళ్లుకు గురవుతున్న వాళ్లు, అనవసరపు ఆక్రోశం, ఆవేశంతో రగిలిపోతున్నవాళ్లు మొత్తం సమాజం మీదనే కోపం పెంచుకుని సైకోలుగా తయారవుతున్నారు. కొందరు విద్యార్థి దశలోనే మానసిక ఒత్తిడి తట్టుకోలేక సైకోలుగా మారుతున్నారు. వ్యక్తుల సామాజిక పరిస్థితులనుబట్టి వారిలో మానసిక ఒత్తిడుల హెచ్చు తగ్గులు ఉంటాయి. ప్రేమానురాగాలకు ఆస్కారం ఉన్న చోట ఇలాంటి ఒత్తిడులు తక్కువగా ఉంటాయి. ఎవరికి వారే యమునా తీరే! అన్న చందంగా బతికే అమెరికాలాంటి సమాజంలో సైకోలు సులువుగా తయారవుతారు, తయారవుతున్నారు. ప్రపంచంలోని జాతులన్నీ అక్కడే ఉంటాయి. తమ ఉద్యోగాలను, తమ జీతాలను తన్నుకుపోతున్నారంటూ పరస్పర అపోహల్లో వాళ్లు బతుకుతుంటారు. ఇటీవల అక్కడ శ్వేత జాత్యాహంకారం పెచ్చరిల్లడానికి అదే కారణం. వారి దాడుల్లో ఎక్కువ మంది మరణించడానికి కారణం ‘223 కాలిబర్ అసాల్ట్ రైఫిల్’ లాంటి మారణాయుధాలను వారు ఉపయోగంచడం, అవి వారికి సులువుగా అందుబాటులో ఉండడం. ఎల్ పాసోలో శ్వేతజాత్యాహంకారి ఉపయోగించిన రైఫిల్ ఇదే. దాన్ని అతడు టెక్సాస్ నుంచి ఆన్లైన్ బుకింగ్ ద్వారా స్థానిక తుపాకుల షాపు నుంచి సులువుగా కొనుగోలు చేశాడు. తుపాకీల లైసెన్స్ చట్టాలను కఠినతరం చేయాలని, సామూహిక హననానికి ఉపయోగపడే తుపాకుల కొనుగోళ్లపై పూర్తిగా నిషేధం విధించాలని ఎప్పటి నుంచే అమెరికాలో చర్చోప చర్చలు కొనసాగుతున్నాయి. నిషేధం కన్నా నియంత్రనే మంచిదని సూచిస్తున్నవాళ్లు ఉన్నారు. బరాక్ ఒబామా హయాంలో తుపాకుల అమ్మకాలపై కొంత నియంత్రణ తీసుకొచ్చారు. జాత్యాహంకారం పెరుగుతున్న నేటి ట్రంప్ హయాంలో ఈ నియంత్రణ మరింత అవసరం. -
అంతు చిక్కని ఆయుధ రహస్యం!
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డుపై (ఓఆర్ఆర్) ఆత్మహత్య చేసుకున్న యువ వ్యాపారి ఫైజన్ అహ్మద్ (35) కేసుపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కణతపై కాల్చుకునేవదుకు అతను వినియోగించిన నాటు తుపాకీ మూలాలు కనిపెట్టడంపై నార్సింగి పోలీసులు దృష్టి పెట్టారు. ఆత్మహత్యాయత్నం తర్వాత ఫైజన్ కొన్ని గంటల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినా వాంగ్మూలం ఇవ్వకుండానే చనిపోయారు. దీంతో సవాల్‌గా మారిన ఈ కేసును నార్సింగి పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని తూర్పు మండల పరిధిలోని మలక్‌పేట ప్రెస్‌రోడ్‌కు చెందిన ఫైజన్ అహ్మద్ కొన్నేళ్ల క్రితం జ్యోతిషి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అతను తన మకాంను లోయర్ ట్యాంక్‌బండ్‌లోని జలవాయు విహార్ అపార్ట్మెంట్లోకి మార్చాడు. సఫిల్‌గూడకు చెందిన పీవీ సుబ్రమనియన్కు చెందిన ఫ్లాట్ నెం.206ను 2013 అక్టోబర్‌లో అద్దెకు తీసుకున్నాడు. అప్పటి నుంచి భార్యతో కలిసి అక్కడే ఉంటున్న ఫైజన్ కుటుంబం చుట్టుపక్కల వారికి దూరంగా ఉండేది. విదేశాలకు వెళ్లే వారికి వీసా ప్రాసెసింగ్ చేసేందుకు పంజగుట్టలో ఓ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసిన ఫైజన్‌కు అందులో తీవ్ర నష్టాలు వచ్చాయి. దీంతో కొన్నాళ్లుగా ఫ్లాట్ అద్దె, అపార్ట్మెంట్ మెయింటనెన్స్ కూడా చెల్లించలేదు. గత అక్టోబర్‌లో అతను డ్రివెన్ బై యు మొబిలిటీ సంస్థ నుంచి బెంజ్ కారును అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల 4న అతను నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని మంచిరేవుల సమీపంలో ఓఆర్ఆర్ పక్కనే తన కారును ఆపి నాటు తుపాకీతో కుడి కణితపై కాల్చుకున్నాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఫైజన్‌ను ఓఆర్ఆర్పై విధులు నిర్వహిస్తున్న పోలీసులు గుర్తించి గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోలీసులు కారులో ఉన్న ఫైజన్ సెల్‌ఫోన్‌తో పాటు ఆత్మహత్యకు వినియోగించిన నాటు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫైజన్ వినియోగించింది నాటు తుపాకీ కావడంతో అది అక్రమ ఆయుధంగా నిర్థారించారు. దీంతో కేసులో ఆయుధ చట్టాన్నీ చేర్చి దర్యాప్తు చేపట్టారు. అతడి వద్దకు ఈ ఆయుధం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? తదితర అంశాలు ఆరా తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఫైజన్ అత్తగారిది మధ్యప్రదేశ్‌లోని మాండ్లా ప్రాంతం కావడంతో తరచూ అక్కడికు వెళ్ళి వస్తుండేవాడు. మాండ్లా పరిసరాల్లో కొన్ని జిల్లాల్లో నాటు తుపాకులు తేలిగ్గా లభిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచే ఆ తుపాకీని ఖరీదు చేసుకుని వచ్చి ఉండచ్చని భావిస్తున్నారు. ఈ మిస్టరీని ఛేదించడంపై నార్సింగి పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ అసలు విషయం అంతుచిక్కట్లేదు. -
వేటాడుతున్న నాటు తూటా
మన్యంలో నాటుతుపాకులు కలకలం రేపుతున్నాయి. గిరిజనులు వాటిని సొంతంగా తయారు చేసుకుంటూ యథేచ్ఛగా జంతువులను వేటాడడంతో పాటు తమ విరోధులపై కాల్పులు జరుపుతూ ప్రాణాలు బలిగొంటున్నారు. తుపాకులు దగ్గర ఉండడంతో చిన్నపాటి గొడవ జరిగినా కాల్పులు జరుపుతున్నారు. మన్యంలో తరచూ నాటు తుపాకులు గర్జిస్తుండడంతో అశాంతి వాతారణం నెలకుంటోంది. విశాఖపట్నం, కొయ్యూరు(పాడేరు): మన్యంలో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. అడవి పందులు, దుప్పులు,కొండ గొర్రెలు, కణుజులను వేటాడేందుకు అధికంగా నాటు తుపాకులను వినియోగిస్తున్నారు.చింతపల్లి,గూడెంకొత్తవీధి,కొయ్యూరు మండలాలో గిరిజ నుల వద్ద 250 నాటుతుపాకులున్నాయి. జంతువులను వేటా డేందుకు ఉపయోగించాల్సిన తుపాకీ గుళ్లు మనుషుల గుండెలను చీల్చుతున్నాయి. కొన్నిసార్లు కక్షతో విరోధులపై తుపాకులను గురిపెడుతుంటే, మరికొన్ని సార్లు గురి తప్పి గాయపరుస్తున్నాయి. తాజాగా ఐదు రోజుల కిందట ఆర్.కొత్తూరు పంచాయతీ మల్లవరంలో జంపాశ్రీను అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కురుజు రమణాజీ నాటు తుపాకీతో కాల్చి చంపాడు. మన్యానికి సమీపంలో ఉన్న రోలుగుంట మండలంలో అడవి పందుల వేటకు వెళ్తుండగా నాటు తుపాకీ పేలి గతంలో ఓయువకుడు మృతువాతపడ్డాడు. ఇలాంటి సంఘటనలు తరచూ మన్యంలో జరుగుతున్నాయి. గతంలో వింటిబద్దలు,బాణాలతో జంతువులను వేటాడేవారు. ఇప్పుడు వాటిస్థానంలో ఎక్కువగా నాటు తుపాకులు దర్శనమిస్తున్నాయి.ప్రతీ ఏటా వేసవిలో విశాఖ మన్యానికి ఒడిశా నుంచి వేటగాళ్లు వస్తారు. స్థానికులు వారి నుంచి కూడా తుపాకులు సేకరిస్తున్నారు. నాటు తుపాకులు కలిగి ఉన్న వేటగాళ్లను చూసీ మావోయిస్టులుగా భావించి పోలీసులు కాల్పులు జరిపి సంఘటనలు కూడా ఉన్నాయి. స్థానిక గిరిజనులే కాకుండా ఒడిశా నుంచి వచ్చిన వారు, విశాఖ–తూర్పుగోదావరి సరిహద్దుల్లో అటు తూర్పుగోదావరికి చెందిన గిరిజనులు కూడా నాటు తుపాకులతో జంతువులను వేటాడుతున్నారు. దీంతో మన్యం నిత్యం నాటు తుపాకీ కాల్పుల మోతలతో దద్దరిల్లుతోంది. దృష్టిపెట్టని పోలీసు,అటవీశాఖ అధికారులు ఆయుధాల చట్టం ప్రకారం లైసెన్స్ లేని నాటుతుపాకులు కలిగి ఉండడం నేరం. అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలి. మన్యంలో ఎవరి వద్ద నాటు తుపాకులున్నాయో అటవీ శాఖ సిబ్బంది వద్ద సమాచారం ఉంది. అయితే వారెవరూ ఉన్నతాధికారులకు తెలియజేయడం లేదు.పోలీసులు కూడా నాటు తుపాకులపై దృష్టిపెట్టడం లేదు.దీంతో తీవ్ర నష్టం జరిగిపోతోంది. జంతువులను విచ్చలవిడిగా చంపేస్తున్నారు.మరోవైపు కక్షలు ఉంటే విరోధులపై కాల్పులు జరుపుతున్నారు. దీంతో నిత్యం తుపాకీలు గర్జిస్తున్నాయి. దృష్టి సారిస్తాం.. నాటు తుపాకులు ఎవరివద్ద ఉన్నా యో సమాచారం సేకరిస్తాం. తరువాత దాడులు చేసి స్వాధీనం చేసుకుంటాం. వెంటనే వారిపై కేసులు నమోదు చేస్తాం.అనుమతి లేకుండా ఆయుధాలు కలిగి ఉండడం చట్టరిత్యా నేరం .కె.ఆరీఫ్ హఫీజ్, ఏఎస్పీ, నర్సీపట్నం -
ప్రైవేటు ఉపాధ్యాయురాలిపై ఉన్మాది కాల్పులు
బొమ్మనహళ్లి : ఉదయం 8.15 గంటలు..ఓ ప్రైవేటు టీచర్ బస్సు కోసం వేచి ఉంది. పక్కనే విద్యార్థులు కూడా నిలబడి ఉన్నా రు. ఇంతలో ఓ వ్యక్తి అక్కడకు చేరుకొని టీచర్‌పై ఐదురౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె కుప్పకూలి అక్కడికక్కడే మృ తి చెందగా కాపాడేందుకు అడ్డుగా వెళ్లిన విద్యార్థి గాయపడ్డాడు. కాల్పులు జరిపిన వ్యక్తి సమీపంలోని తోటలోకి వెళ్లి రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరం కోడుగు జిల్లా విరాజ్ పేట తాలూకాలోని బాళలే గ్రామంలో శుక్రవారం చో టు చేసుకుంది. గుణికొప్పలు గ్రామంలో ఉన్న లయన్స్ హైస్కూల్లో ఆశా కావేరమ్మ(50) టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు భర్త లేడు. భార్య లేని పొన్నంపేట ప్రాంతానికి చెందిన జగదీష్ (60) ఆశా కావేరమ్మపై కన్నేశాడు. తనను ప్రేమించాలని ఐదేళ్లుగా వెంటబడుతున్నాడు. తనకు ఇలాంటివి ఇష్టం లేదని ఆశా కావేరమ్మ చెప్పినప్పటికీ జగదీష్ వినిపించుకోలేదు. రెండు సంవత్సరాల క్రితం జగదీష్ ఆశా ఇంటికి వెళ్లి అత్యాచార యత్నం చేశాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెయిల్‌పై బయటకి వచ్చిన జగదీష్..మళ్లీ ఆశా వెంటబడ్డాడు. ఆమె తిరస్కరించడంతో అంతమొందించాలని నిర్ణయించాడు. శుక్రవారం ఉదయం ఆశా కావేరమ్మ పాఠశాలకు వెళ్లేందుకు బాళలె పోలిసు స్టేషన్‌కు ఎదరుగానే ఉన్న బస్టాండు వద్ద నిలబడి ఉంది. విద్యార్థులు సైతం అక్కడే బస్సు కోసం వేచి ఉన్నారు. ఇంతలో జగదీష్ అక్కడ ప్రత్యక్షమై రివల్వార్తో ఆశాకావేరమ్మపై ఐదు రౌండ్లు కాల్పులు జురిపాడు. పక్కనే ఉన్న ఒక విద్యార్థి అడ్డుకునేందుకు వెళ్లగా బాలుడికి కూడా గాయాలయ్యాయి. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆశాకావేరమ్మ కుప్పకూలి మృతి చెందింది. నిందితుడు కాల్పులు జరిపిన అనంతరం సమీపంలోని ఓ తోటలోకి వెళ్లి రివాల్వార్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే ఉన్న కార్మికుడు అడ్డుకునేందుకు వెళ్లి కాల్పుల్లో గాయపడ్డాడు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించి గాయపడిన విద్యార్థి, కార్మికుడిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
సహనం కోల్పోతున్న సిబ్బంది..
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో మరోసారి తూటా పేలింది. ఆర్టీసీ సిటీ బస్సులో గురువారం ప్రయాణం చేస్తుండగా ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌నాయుడు రెచ్చిపోయాడు. తన సర్వీస్ పిస్టల్‌తో బస్సులోనే ఓ రౌండ్ కాల్పులు జరిపాడు. మిట్ట మధ్యాహ్నం పంజగుట్ట ఠాణా పరిధిలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. వీఐపీ జోన్‌తో పాటు వెపన్స్ జోన్గానూ పేరున్న వెస్ట్‌జోన్‌లోనే తాజా ఘటన జరగడం గమనార్హం. నగరవ్యాప్తంగా ఉన్న లైసెన్స్డ్ ఆయుధాల్లో మూడొంతులు ఇక్కడే ఉన్నాయి. గత గణాంకాల ప్రకారం నగరంలోని 5 జోన్లలో కలిపి 5,145 ఆయుధ లైసెన్సులు, 6,568 వెపన్స్ ఉన్నాయి. వీటిలో కేవలం వెస్ట్‌జోన్‌లోనే 2,192 లైసెన్స్‌లు, 2,866 ఆయుధాలున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతోద్యోగులతో సహా ధనికవర్గం ఎక్కువగా ఉండే వెస్ట్‌జోన్‌లో ఆయుధాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రక్షణ కోసం కొందరు, స్టేటస్ సింబల్‌గా మరికొందరు వీటిని తమ దగ్గర ఉంచుకుంటున్నారు. ఇక్కడే అత్యధికం.. నగరంలో తుపాకీ ఉపయోగించి జరిగే నేరాల్లో అత్యధికం ఇక్కడే నమోదవుతూ ఉంటాయి. ఏడాదికి కనీసం ఒకటైనా ‘తుపాకీ’ సంచలనం జరుగుతూ ఉంటుంది. వీటిలో కొన్ని కొలిక్కి రానివీ ఉన్నాయి. ఆ సంఘటనలివీ... ♦ కేకే కుమారుడు వెంకట్రావ్ ఇంట్లో జరిగిన కాల్పుల్లో ప్రశాంత్‌రెడ్డి మరణించారు. ఈ కేసులో కోర్టులో వీగిపోయింది. ♦ వ్యాపారవేత్త రాజీవ్ సిసోడియాను కిరాయి హంతకులు కాల్చి చంపారు. ♦ రియాల్టర్ అర్షద్ సైతం తుపాకీ కాల్పుల్లోనే మరణించారు. ఇది కోర్టులో నడుస్తోంది. ♦ టైర్ల వ్యాపారి విజయ రాఘవన్‌పై కాల్పులు జరిగాయి. ఈ కేసు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ♦ అనంతపురం ఫ్యాక్షనిస్టు మద్దెలచెర్వు సూరిని బంజారాహిల్స్ పరిధిలోనే అతని అనుచురుడు భానుకిరణ్ కాల్చి చంపాడు. ఈ కేసులో భాను ఇంకా చిక్కలేదు. ♦ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, అదే నియోజకవర్గానికి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే సోదరికి మధ్య ఓ స్థలానికి సంబంధించి నెలకొన్న వివాదం కాల్పుల వరకు తీసుకెళ్లింది. సహనం కోల్పోయిన ఓ మాజీ ఎమ్మెల్యే గాల్లోకి మూడు రౌండ్లు కాల్చారు. ♦ అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్ ఉగ్రవాదుల, ఎస్పీ ఉమేశ్‌చంద్ర నక్సలైట్ల తూటాలకు బలైంది... గ్యాంగ్‌స్టర్ అజీజ్‌రెడ్డి పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించిందీ ఈ జోన్లోనే. ♦ ఎస్సార్‌నగర్ పరి«ధిలో అర్ధరాత్రి వేళ ప్లాట్‌ఫామ్‌పై నిద్రిస్తున్న చెప్పుల వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ కేసులో నిందితులు ఎవరనేది ఇప్పటికీ తేలలేదు. సహనం కోల్పోతున్న సిబ్బంది.. నిత్యం విధులు, క్షణం తీరికలేని బతుకులు... ఇదీ ప్రస్తుతం పోలీసుల జీవన విధానం. ఈ పరిస్థితులతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సిబ్బంది సహనం కోల్పోతున్నారు. చిన్ని చిన్న విషయాలకే తీవ్ర స్థాయిలో స్పందిస్తూ వివాదాస్పదులవుతున్నారు. ఏమాత్రం సమస్యలు ఎదురైనా ప్రాణాలు తీసుకోవడానికీ వెనుకాడట్లేదు. కొన్ని విపరీత సందర్భాల్లో కాల్పులకూ తెగబడుతున్నారు. వీటికి తోడు మిస్‌ఫైర్స్ ఉండనే ఉంటున్నాయి. ఆ సంఘటనలివీ... ♦ విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఆర్ ఎస్సై భరత్ భూషణ్‌పై కానిస్టేబుల్ రవి దాడి చేసిన ఘటన సుల్తాన్‌బజార్ పరిధిలో జరిగింది. ♦ వారాసిగూడ బ్రాహ్మణ బస్తీలో నివసిస్తున్న కానిస్టేబుల్ జగదీశ్ నెల రోజుల్లో పెళ్లి ఉండగా... మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. ♦ పేట్లబుర్జులో ఆరెస్సైగా పనిచేస్తున్న రామ్మోహన్ స్వల్ప వివాదమై అంబర్పేట్ ప్రాంతంలో ఓ వ్యక్తిపై తుపాకీ గురి పెట్టాడు. ♦ నగర కమిషరేట్ పరిధిలో పనిచేసిన ఇన్స్పెక్టర్ వీరమోహన్ క్షణం తీరిక లేని విధి నిర్వహణతో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఈ నిరాశ నిస్పృహలో తన తుపాకీతోనే కాల్చుకొని ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ♦ సీఆర్పీఎఫ్ 42వ బెటాలియన్ కానిస్టేబుల్ టి.స్టీఫెన్ పద్మారావునగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో రైఫిల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ♦ నాంపల్లిలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ చేతిలో తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ♦ పాతబస్తీలోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఏకే–47 మిస్‌ఫైర్ కావడంతో కానిస్టేబుల్ సోమప్ప మరణించాడు. ♦ సైబర్ కంట్రోల్ ఎస్సై కె.వెంకటయ్య కుమారుడు చిన్నికృష్ణ కానిస్టేబుల్‌గా ఎంపికైనా... కిడ్నీ వ్యాధి బాధిస్తుండటంతో తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. ♦ ప్రేమించి మోసం చేసిందని ఆరోపిస్తూ కూకట్పల్లి ఠాణాలో ఓ కానిస్టేబుల్ తోటి మహిళా కానిస్టేబుల్‌పై తుపాకీ గురిపెట్టాడు. ఆపై తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు యత్నించాడు. బస్సునుపరిశీలించిన ఈడీ మారేడుపల్లి: పంజగుట్టలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌నాయుడు కాల్పులకు పాల్పడిన బస్సును గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఈడీ వినోద్‌కుమార్, సికింద్రాబాద్ ఆర్ఎం శ్రీధర్ కంటోన్మెంట్ డిపోలో గురువారం పరిశీలించారు. ఈ డిపోకు చెందిన ఏపీ 28జడ్ 4468 నంబర్ బస్సు పైభాగం నుంచి బుల్లెట్ దూసుకుపోవడంతో టాప్కు రంధ్రం ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్ ఎస్డీవై పాషా, కండక్టర్ భూపతిలను విచారించనున్నట్లు ఈడీ వినోద్‌కుమార్ తెలిపారు. సంఘటన జరిగిన చోట బస్సును నిలపకుండా మణికొండకు వెళ్లి తిరిగి సికింద్రాబాద్‌కు రావడంపై విచారణ చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. పోలీసుల విచారణ అనంతరం ఆర్టీసీ విచారణ కొనసాగుతుందని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. తమకు సంఘటన జరిగిన వెంటనే సమాచారం అందిందని, దీనిపై అన్ని కోణాల నుంచి నివేదికను తెప్పించుకుని విచారణ చేపడతామన్నారు. ఈ బస్సు నైట్‌హాల్ట్ డ్యూటీ కావడంతో బుధవారం మధ్యాహ్నం 3:15గంటలకు డిపో నుంచి బయటకు వెళ్లింది. గురువారం మధ్యాహ్నం 12గంటలకు తిరిగి డిపోకు చేరాల్సి ఉంది. -
ఇన్‌ఫార్మరే వేటగాడు!
ప్రకాశం, గిద్దలూరు: అడవిలో అరుదుగా కనిపించే ఎలుగుబంటిని నాటు తుపాకీతో కాల్చి చంపిన సంఘటన మండలంలోని ఉయ్యాలవాడ పంచాయతీ పరిధి అంకాలమ్మపల్లె సమీప నల్లమల అడవిలో జరిగింది. ఈ సంఘటన గురువారం జరగ్గా శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. నల్లమల అడవులకు దగ్గరగా ఉన్న అంకాలమ్మపల్లెకు చెందిన ఇద్దరు అడవిలో తిరిగే ఎలుగుబంటిని నాటు తుపాకీతో కాల్చి చంపారు. మృతి చెందిన ఎలుగుబంటి కళేబరాన్ని గ్రామానికి సమీపంలో ఉన్న కొత్త చెరువులోకి తీసుకొచ్చారు. ఎలుగుబంటికి చర్మం తీసి మాంసం ముక్కలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలో సమాచారం అందుకున్న అటవీ అధికారులు కొత్తచెరువుకు వెళ్లి దాడులు నిర్వహించగా ఎలుగుబంటి కళేబరం వద్ద ముగ్గురు కనిపించారు. ఇందులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అటవీ అధికారులు కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో దొరికిన వారిలో అంకాలమ్మపల్లెకు చెందిన ఉయ్యాలవాడ బాలచెన్నయ్య, దిగువమెట్ట తండాకు చెందిన లక్ష్మీనాయక్ ఉన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన అటవీ అధికారులు స్థానిక కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించారు. ఇన్‌ఫార్మరే వేటగాడయ్యాడా? అడవుల్లో ఎలాంటి చట్టవ్యతిరేక చర్యలు జరిగినా అధికారులకు తక్షణమే సమాచారం ఇచ్చేందుకు ప్రతి గ్రామంలోనూ కొంత మందిని ఇన్ఫార్మర్లుగా ఏర్పాటు చేసుకోవడం పోలీసు, అటవీ, ఎక్సైజ్ వంటి శాఖలకు అవసరం. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తిని అటవీశాఖాధికారులు ఇన్ఫార్మర్గా నియమించుకున్నారు. ఇన్ఫార్మర్గా వ్యవహరించిన వ్యక్తే నాటు తుపాకీతో ఎలుగుబంటిని చంపేసి మాంసం విక్రయించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సంఘటన జరిగినప్పుడు సమాచారం ఇవ్వాల్సిన ఇన్ఫార్మర్ ఎలుగుబంటి కళేబరాన్ని, నిందితులు పట్టుబడిన తర్వాత అటవీశాఖ ఉన్నతాధికారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. మీ అధికారులకు సమాచారం ఇచ్చానని, వారు పట్టించుకోలేదని కింది స్థాయి ఉద్యోగులపై ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానం వచ్చిన వారు ఆరా తీయగా అసలు నిందితుడు ఇన్‌ఫార్మరే అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనలో పట్టుబడిన ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నామని, ఇందులో ఇంకా ఎవరైనా ఉంటే వారిని కూడా త్వరలో అరెస్టు చేయనున్నట్లు గిద్దలూరు రేంజి అధికారి కుమారరాజ తెలిపారు. పెద్దల సమక్షంలో దహనం అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్న కళేబరానికి సంజీవరాయునిపేట పశువైద్యాధికారి సాయిచక్రవర్తి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో కళేబరాన్ని సంఘటన స్థలంలోనే దహనం చేశారు. అటవీ జంతువులను చంపడం నేరమని, ఎవరైనా ఇలాంటి దారుణాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని, నేరగాళ్లు ఎంతటి వారైనా వదిలి పెట్టమని అటవీశాఖ సబ్ డీఎఫ్ఓ నాగభూషణం, రేంజర్ కుమారరాజ, డిప్యూటీ రేంజర్ వెంకటరమణలు ప్రజలను హెచ్చరించారు. అటవీ జంతువులను కాపాడుకోవాలని అవగాహన కల్పించారు. -
తిక్కారెడ్డి.. అదే వంకరబుద్ధి!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి ప్యాలకుర్తి తిక్కారెడ్డి అదే వంకరబుద్ధి చూపుతున్నారు. ప్రజాభిమానం లేకపోవడంతో ఎన్నికల్లో గెలవలేనన్న ఉద్దేశంతో నాటకాలకు తెరలేపారు. అధికార తెలుగుదేశం పార్టీ తమకేమీ చేయలేదని ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న మంత్రాలయం మండలం కగ్గల్ గ్రామ ప్రజలను రెచ్చగొట్టి.. వారిపై అక్రమ కేసులను బనాయించడమే కాకుండా సొంతంగా దాడులు చేసుకుని సింపతీ కొట్టేసేందుకు పన్నాగం పన్నారు. ఇందుకోసం ముందుగానే వేసుకున్న స్కెచ్ ప్రకారం వేటకొడవళ్లతో తనపై దాడి చేశారంటూ విషప్రచారానికి పూనుకున్నారు. అయితే.. చివరకు కొన్ని వీడియోలు బయటకు రావడంతో నాటు తుపాకీతో కాల్చారంటూ కొత్త నాటకానికి తెరతీశారు. గ్రామంలో జరిగిన మొత్తం ఘటన వీడియో బయటకు వచ్చింది. గన్‌మెన్ ఫైరింగ్‌లోనే తిక్కారెడ్డికి గాయమైనట్టు తేలింది. దీంతో వేటకొడవళ్లు, నాటుతుపాకీ నాటకం కాస్తా తుస్సుమని తేలిపోయింది. ఏం జరిగింది? మంత్రాలయం టీడీపీ టికెట్ ప్రకటించిన తర్వాత తిక్కారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి అంతగా స్పందన కనిపించకపోవడంతో కొత్త నాటకానికి తెరలేపారు. వాస్తవానికి కోసిగి మండలం ఐరన్గల్ గ్రామంలో ప్రచారానికి వెళుతున్నానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, ఇందుకు భిన్నంగా మంత్రాలయం మండలం కగ్గల్ గ్రామానికి వెళ్లారు. ఎంపిక చేసుకున్న అనుకూల మీడియా వారిని మాత్రమే వెంట తీసుకెళ్లారు. తమ గ్రామాన్ని కనీసం పట్టించుకోకుండా ఇప్పుడు ఓట్ల కోసం వస్తారా అని నిలదీసేందుకు గ్రామస్తులు సిద్ధం కావడంతో తిక్కారెడ్డి నాటకానికి తెరలేపారు. ముందే వేసుకున్న స్కెచ్ ప్రకారం తన సొంత గన్మెన్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఇందులో మిస్‌ఫైర్ కావడంతో తిక్కారెడ్డికి కూడా గాయాలయ్యాయి. అయితే, వేటకొడవళ్లతో దాడులు చేశారని మొదట్లో లీకులిచ్చిన తిక్కారెడ్డి..చివరకు ప్రైవేటు తుపాకీతో కాల్చారని కట్టుకథలు అల్లారు. అయితే.. అక్కడ ఉన్న కొద్ది మంది మొత్తం వ్యవహారాన్ని తమ సెల్ఫోన్ల ద్వారా రికార్డు చేయడంతో తిక్కారెడ్డి అసలు స్వరూపం బయటపడింది. ఆయనపై ఎవరూ దాడి చేయలేదని, గన్‌మెన్ ఫైరింగ్‌లోనే గాయాలయ్యాయని తేలిపోయింది. గత ఎన్నికల్లోనూ ఇదే విధంగా రాంపురం గ్రామానికి ప్రచారం పేరుతో వెళ్లి కట్టెలతో దాడులు చేశారంటూ నాటకాలు ఆడారు. అప్పుడు కట్టెలు... ఇప్పుడు వేటకొడవళ్లు, తుపాకీ అంటూ నాటకం మారిందని అక్కడి ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. అబద్ధాన్ని నిజం చేసేందుకు తాపత్రయం.. మంత్రాలయం నియోజకవర్గంలోని కగ్గల్ గ్రామంలో తనపై వేటకొడవళ్లతో, నాటు తుపాకులతో దాడి జరిగిందని నమ్మించేందుకు అధికారపార్టీ అభ్యర్థి తిక్కారెడ్డి తిప్పలు పడ్డారు. ఈ అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు వరుసగా సామాజిక మాధ్యమాల సాక్షిగా ప్రయత్నించారు. ఇక ‘ట్విట్టర్’ మంత్రి లోకేష్.. ‘ ప్రచారానికి వెళ్లిన వారిపై వైఎస్సార్ సీపీ వారు దాడిచేయడంతో టీడీపీ నేత తిక్కారెడ్డి ఏఎస్ఐ గాయపడ్డారు.. ప్రచారం చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని కూడా వైసీపీ రౌడీలు కాలరాస్తున్నారు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. మిగిలిన టీడీపీ నేతలు కూడా తిక్కారెడ్డిని చంపేందుకు ప్రయత్నించారంటూ తీవ్రంగా ఖండించే ప్రయత్నం చేశారు. అయితే, మొత్తం ఘటనపై కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప..ఆదోని డీఎస్పీ వెంకటరాముడు ఆధ్వర్యంలో విచారణ జరిపించారు. తీరా విచారణలో ప్రైవేట్ వ్యక్తులెవ్వరూ కాల్పులు జరపలేదని తేల్చారు. అంతేకాకుండా గన్మెన్లు అత్యుత్సాహం ప్రదర్శించి.. అవసరం లేనప్పటికీ కాల్పులు జరిపి క్రమశిక్షణ ఉల్లంఘించారని తేలింది. దీంతో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించినందుకు గానూ ఇద్దరు గన్మెన్లు (ఎంసీ శ్రీనివాసులు, ఆర్ విజయ్‌కుమార్)ను ఎస్పీ సస్పెండ్ చేశారు. పోలీసుశాఖలో విధుల పట్ల అలసత్వం వహించి క్రమశిక్షణ ఉల్లంఘిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప హెచ్చరించారు. -
ఉలిక్కిపడ్డ నగరం
సాక్షి,సిటీబ్యూరో: న్యూజిలాండ్ క్రిస్ట్‌చర్చ్ సిటీలోని మసీదులో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు హైదరాబాదీలు చిక్కుకున్నారు. వీరిలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరొకరు కనిపించడం లేదని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దుండగులు జరిపిన కాల్పుల్లో అంబర్‌పేట్‌లోని రహత్‌నగర్‌కు చెందిన మహ్మద్ జహంగీర్ కుమారుడు ఇక్బాల్ జహంగీర్ గాయపడ్డాడు. టోలిచౌకి నదీమ్ కాలనీకి చెందిన సయీద్ ఉద్దీన్ కుమారుడైన ఫరాజ్ కనిపించకుండా పోయాడు. వారిని కాపాడాలంటూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర మంత్రి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీఎం కార్యాలయాలకు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఫరాజ్ తండ్రికి మేయర్ పరామర్శ గోల్కొండ: న్యూజిలాండ్‌లోని మసీదులో జరిగిన కాల్పుల సంఘటన టోలిచౌకిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాల్పుల సందర్భంగా కనిపించకుండా పోయిన 17 మందిలో ఫరాజ్ ఒకడు. టోలిచౌకి నదీమ్ కాలనీకి చెందిన సయీద్ ఉద్దీన్ కుమారుడైన ఫరాజ్(31) తొమ్మిదేళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లి అక్కడ ఐటీ నిపుణుడిగా స్థిరపడ్డాడు. ప్రత్యేక ప్రార్థనలకు స్నేహితులతో కలిసి మసీదుకు వెళ్లిన ఫరాజ్ తిరిగి రాలేదు. కాగా నగర మేయర్ బొంతు రామ్మోహన్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌తో కలిసి శుక్రవారం రాత్రి నదీమ్ కాలనీలోని ఫరాజ్ ఇంటికి వెళ్లి అతని తండ్రి సయీద్ ఉద్దీన్‌ను పరామర్శించారు. ఫరాజ్‌కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. భార్య ఇన్షా అజీజ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంబర్‌పేటలో అంబర్‌పేట: న్యూజిలాండ్‌లోని మసీదులో దుండగుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఇక్బాల్ జహంగీర్ కుటుంబ సభ్యులను శుక్రవారం రాత్రి మేయర్ రామ్మోహన్ పరామర్శించి ఓదార్చారు. అంబర్‌పేట్‌లోని రహత్‌నగర్‌కు చెందిన మహ్మద్ జహంగీర్ కుమారుడు ఇక్బాల్ జహంగీర్ 15 ఏళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లి çహోటల్ వ్యాపారంలో స్థిరపడ్డాడు. అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి పోయేవాడు. శుక్రవారం ప్రార్థనల సమయంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇక్బాల్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న నగరంలోని అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వారిని మేయర్ బొంతు రామ్మోహన్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్లు కె.పద్మావతిరెడ్డి, పులి జగన్ పరమర్శించారు. -
పులి పేల్చన తూపాకి
మనిషి రక్తం మరిగిన పులెంత ప్రమాదకారో వేట రుచెరిగిన మనిషీ అంతే ప్రమాదకారి. పులి వేట ఆకలి కోసం అయితే మనిషి వేట అహం చల్లార్చుకోవడం కోసం. వేటలో పులి పంజా విసిరితే మనిషి తుపాకీ పేలుస్తాడు. పులి బలం పులిదైతే, మనిషి జులుం మనిషిది. మిగతాదంతా మామూలే ప్రాణం దక్కించుకోవడానికి రెండు వైపులా అసమాస పోరాటమే.ఏదో పనిమీద కోలంక వెళ్ళొచ్చిన ఫాలయ్య రావారం కృష్ణమూర్తి గారొచ్చేరని చెప్పడంతో రామన్నయ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గబ గబా తయారయ్యి చేలగట్లకడ్డంపడి కోలంక బాట పట్టేడు. వెళతా వెళతా ఓ పంగలకర్రని కూడా నడుం దగ్గర దోపుకున్నాడు. వేట కృష్ణమూర్తిరాజుకి ఆరో ప్రాణం. అదే ఆయన వృత్తి ప్రవృత్తీ కూడా. ఆయన దగ్గరుండే జోడుగుళ్ళ తుపాకీ అంటే కుర్రోళ్ళందరకీ భలే సరదా. చల్లగా... నల్లగా నిగనిగలాడే దాన్నోసారి అలా ముట్టుకొని వళ్ళు మైమరచి పోతుంటారు. పులి వంటి మీద చెయ్యేసి నిమిరినట్టే సంబరపడిపోతుంటారు. తాను ఎన్ని పులులని చంపిందో ఆ తుపాకీకి బాగా జ్ఞాపకమే.అప్పట్లో మారేడుమిల్లి అడవుల్లో... ఓ మేనీటర్ వీరవిహారం చేస్తూ గిరిజనులకి కంటికి కునుకులేకుండా చేసింది. మనిషి నెత్తురు మరిగిన పెద్దపులిని వేటాడ్డానికి, వేటే వ్యసనమైన కృష్ణమూర్తిరాజు అరణ్యవాసం చేపట్టారు. దాని కదలికలని పసిగడుతూ... రోజుకో చోటున మాటు వేస్తూ అదును కోసం ఎదురు చూసారు. పులి బలం ముందు మనిషి బలమెంత? అందుకే... ఆయన పులి బలహీనతల మీద కన్నేసారు. ఒకటి. రెండు..మూడు రోజులు గడిచాయి. రాజుగారి యుక్తి ముందు పులి శక్తి తలొంచింది. చేతిలో తుపాకీ ఢాం అంది. గుండు గురి తప్పలేదు. ఎంతో మంది రక్తం రుచి చూసిన పులి తన రక్తపు మడుగులో తానే గిలగిల్లాడింది. అది మొదలు రాజుగారి తుపాకీకి ఎదురు లేకుండా పోయింది. అరివీర భయంకరమైన ‘మేనీటర్’ ని చంపడం అనేది ఎంతో తెగువ, సాహనం, గుండె దిటవు వున్న వేటగాడికే సాధ్యం. ఇది తెలిసిన వేట ప్రియులు రాజుగారి సాహచర్యం కోసం అన్ని వైపులనుంచీ స్నేహ హస్తం చాపారు. కుర్రజట్టంతా పోరు పెట్టడంతో కృష్ణమూర్తిరాజుగారు వాళ్ళని వెంటేసుకొని మూర్తమ్మ చెరువుకాడకెళ్ళారు. చెరువునిండా చిలకబాతులు కళకళ్ళాడుతూ తిరుగుతున్నాయి. గట్టునున్న తుమ్మ చెట్లమీద నుంచి నత్తగొట్లు ఉండుండి చెరువులోకి దిగి, పెద్ద పెద్ద చేపలని నోట కరుచుకుని ఎగిరిపోతున్నాయి. ఒక్కో ఔత్సాహికుడినీ పిలిచి తుపాకీ ఎలా గురిచూడాలో చెప్పారు.బారెల్ విరిచి గుళ్ళెలా కూరాలో చూపించారు. తుపాకీని దండకి ఎలా దాపెట్టుకోవాలో నేర్పించారు. రెండ్రోజులు కుర్రాళ్ళతోనూ పెద్దోళ్ళతోనూ వేటకబుర్లు చెబుతూ సరదాగా గడిపిన కృష్ణమూర్తిరాజు మూడోరోజు మిత్రుడు సూరిబాబురాజుతో కలిసి వాజేడు అడవుల్లోకి వేటకి వెళ్ళిపోయారు. పులిని చంపాలంటే వేటగాడికి పులి భాష తెలియాలి. పులిని బాగా చదవాలి. కృష్ణమూర్తిరాజు ఆయన తాత చిట్టిరాజు నుంచి ఈ వేట చదువుని బాగా వంటబట్టించుకున్నారు. స్వాతంత్య్రానికి ముందు నుంచీ చిట్టిరాజు మేనీటర్స్ని చంపడంలో చాలా దిట్ట. అడవిదారుల్లో గుర్రాలపై తిరిగే తెల్లోళ్ళని పులులు చంపేసి రక్తం చప్పరించేస్తుండేవి. చేతుల్లో తుపాకులున్నా పులి గాండ్రింపులకే తెల్లోళ్ళు హడలి చచ్చేవారు.దీంతో వాళ్ళు పులికీ తమకీ మధ్య చిట్టిరాజుని అడ్డుగోడగా పెట్టుకునేవారు.ఓ మేనీటర్ బ్రిటిషోళ్ళని పంజాతో అదేపనిగా నంజుకు తినేసేది. వ్యాపారమే తప్ప వేట చేతకాని తెల్లోళ్ళు, తునిరాజు గారి దగ్గర తమ గోడుని వెళ్ళబోసుకున్నారు.ఆయన చిట్టిరాజుని పిలిపించి సంగతి వివరించారు. బ్రిటిష్‌వారికి అడ్డు తగులుతున్న పులులని అంతం చేసెయ్యమన్నారు.‘‘మనం చేయలేని పని పులులు చేస్తున్నాయి. ఓ రకంగా చూస్తూంటే... ఆ పులులు దేశభక్తుల్లా కనిపిస్తున్నాయి’’ అని పులులని ప్రశంసిస్తూ చిట్టిరాజుగారు ఆ పనికి ఒప్పుకోలేదు.‘‘వాటి పంజాలకి మనవాళ్ళూ బలవుతున్నారు కదా? కాబట్టి పులుల్ని చంపాల్సిందే’’ అని రాజావారు తీర్మానించారు.‘‘అయితే ఓ షరతు, నేను పులిని చంపాకా ఈ తెల్లోళ్ళు నాతో కరచాలనం చేయడానికి వీల్లేదు. అలా అయితేనే చంపుతాను’’ అని ఓ నిబంధన పెట్టి పులుల సంహారానికి దిగారు చిట్టిరాజు.చిట్టిరాజుగారి ఈ చర్యతో ఓ సాహసికుడి చేతిని స్పృశించలేక పోతున్నామన్న వ్యధ అప్పటి బ్రిటిష్ అధికారుల్లో వుండేది. పులి ఎప్పుడూ నీరూ తిండీ, దండిగా దొరికే ప్రాంతాన్నే ఆవాసంగా మార్చుకుంటుంది. నీటి వసతి వున్న ప్రాంతంలో మాటు వేసి నీటిని త్రాగడానికి వచ్చే జంతువుని చంపుతుంది. సింహం మృగరాజు అయితే అయివుండొచ్చు. పెద్దపులి అడవికే రారాజు. సింహాలు గుంపులుగా తిరుగుతాయి. కానీ పెద్దపులి ఒంటరిగానే తిరుగుతుంది. అది తిరిగే ప్రాంతానికి మరో పులిని సైతం రానీయదు. అది ఆడైనా, మగయినా దాని అంతు చూసేస్తుంది.వేటగాడిగా మహా గుర్తింపు పొందిన కృష్ణమూర్తిరాజుతో కలిసి వేటాడ్డానికి, సరదాగా ఆయన వేట చూడ్డానికి దేశం నలుమూలలనుంచీ చాలా మంది వస్తుండేవారు. అధికార్లే కాకుండా నాయకులూ, ఇతర ప్రముఖులూ కూడా అందులో వుండేవారు. పగలూ రాత్రి కూడా వేట సాగుతుంటుంది. తూర్పు కనుమల్లోని పెద్ద పులులే కాకుండా చిచ్చర పిడుగుల్లాంటి చిరుతపులులు కూడా రాజుగారి తూటాలకి బలయిపోయాయి. పులిజాడ కనిపించకపోవడంతో సంఘవిద్రోహ శక్తులు అడవిలోకి చొరబడ్డం మొదలయ్యింది. అక్రమాలకి అడవి అడ్డా అవ్వడం చాప కింద నీరులా జరిగిపోయింది. తన విశృంఖల వేటలో పులి లేని అడవితల్లి దిక్కుమాలినదయ్యిందని పులిలాంటి ఆ వేటగాడికి తెలియదు. వేటగాడికి కావాల్సింది ప్రధానంగా సహనం, ఏకాగ్రత, అప్రమత్తత. పులిని వేటాడ్డానికి ఒక్కోసారి కూర్చొన్న చోటునుంచి రెండు మూడు రోజులు కదలకుండా కూర్చోవాలి. అయినా ప్రయోజనం వుండకపోవచ్చు. ఎంత గొప్ప వేటగాడికైనా ఒక్కోసారి ప్రాణాపాయం తప్పకపోవచ్చు. అందుకు కృమూర్తిరాజూ అతీతుడు కాదు. వేటగాళ్ళకి వేటగాళ్ళే మిత్రులు. వారికి జంతువులూ మృగాలూ ఉమ్మడిశత్రువులు. కృష్ణమూర్తిరాజూ ఆయన మిత్రుడు సూరిబాబురాజూ కలిసి మరో మిత్రుడి ఇంట్లో పెళ్ళికి వెళ్ళారు. మాటలమధ్య ఎర్రకొండల్లో పులి వుందన్న సంగతి తెలిసింది. ఇంట్లో అటూ ఇటూ వెదికే సరికి రెండు నాటు తుపాకులు దొరికాయి. లేడికి లేచిందే పరుగన్నట్టు వాడకంలో లేని ఆ రెండు గొట్టాం తుపాకులు, నాలుగు తూటాలు పట్టుకుని బుల్లెట్ బండి మీద కొండల్లోకి పోయారు. వేటగాళ్ళని చూడగానే అలవాటైన గిరిజనులు అవసరమైన సరంజామాతో సన్నధ్ధమై పోయారు.అంతా కలిసి కొండ ప్రక్కన మాటు వేసారు.పులిజాడ కనిపెట్టడానికి వేటగాళ్ళు ముందు వాటి అడుగులని పట్టుకుంటారు.వాటిని బట్టి పులి బరువూ వయస్సూ ఆకారాన్ని అంచనావేస్తారు. పులి ఏదైనా జంతువుని వేటాడాక దాని రక్తం పీల్చేస్తుంది. పాతిక నుంచి ముప్పై కేజీల వరకూ మాంసం లాగిస్తుంది.మిగిలిన మాంసాన్ని పొదల్లోకి తీసుకెళ్లి దాచుకుని మూడురోజుల్లోపు దాన్ని మొత్తం తినేస్తుంది. కడుపు నిండాకా ఆ చుట్టు పక్కల అనువైన చోట విశ్రమిస్తుంది. అది ఎక్కడ? అన్నది ఎవరూ చెప్పలేరు. ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా కావచ్చు. పౌర్ణమి రోజులు, వెన్నెల వానలో అడవి తడిసి ముద్దవుతోంది. కీచురాళ్ళ రొద అంతకంతకీ ఎక్కువవుతోంది. చేరువలో నిద్రపట్టని ఏదో పిట్ట అదే పనిగా అరుస్తోంది. టక్కుమని దాని అరుపు ఆగిపోయింది.దాంతో పులి రాక కోసం వేచి చూస్తున్న మిత్రులిద్దరికీ అది వస్తున్న సంకేతం అందింది.అంతా అప్రమత్తమయ్యారు. ఖాళీ ప్రాంతం నుంచి కొండవైపు చలాకీగా పరిగెడుతోంది చిరుతపులి. కృష్ణమూర్తి సడన్‌గా వేసిన టార్చ్ వెలుగు దాని కళ్ళల్లో మెరిసింది. కొన్ని క్షణాలపాటు చిరుత అయోమయానికి గురయ్యింది.సూరిబాబుగారి తుపాకీలోంచి గాలిని చీల్చుకుంటూ తూటా దూసుకెళ్ళింది.తిరిగి పరుగందుకోబోయిన చిరుత గాండ్రిస్తూ గాల్లోకి ఎగిరి, పొదల్లోకి విరుచుకు పడిపోయింది. గిరిపుత్రులు తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు.వేటగాడు ఏదైనా జంతువుని కొట్టినప్పుడు వెంటనే అది పడిన చోటుకు వెళ్ళడు. కొంత సేపటి తరువాత, ఇక అది చనిపోయి వుంటుందని నిర్థారణ కొచ్చాకా మాత్రమే వెదుక్కుంటూ వెళతాడు. మిత్రులు ఇద్దరూ మిగతా జనంతో పాటూ అక్కడనుంచి వెనుదిరిగారు. కొంతదూరం వెళ్ళాకా మళ్ళీ రేపటిదాకా ఆగడం ఎందుకు? ఈపాటికి చచ్చేవుంటుంది లాక్కొచ్చి పడేద్దాం అని చిరుత పడిన చోటికి వెళ్ళి లైట్లు వేసారు. అందరికీ వళ్ళు జలదరించింది. చిరుత బతికే వుంది. చెట్టు పక్కన బాధతో విల విల్లాడుతోంది. టార్చ్ వెలుతురులో పులికళ్ళు మెరిసాయి.వేటగాళ్ళిద్దరూ అప్రమత్తమయ్యారు. చేతుల్లో తుపాకుల గొట్టాలు విరచి రెండు గుళ్ళు కూరి పులి వేపు గురిపెట్టారు.దెబ్బతిన్న పులి చాలా ప్రమాదకరం. రెచ్చిపోతుంది. ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతుంది. పులి నెమ్మదిగా చీకటిని చాటు చేసుకుంటూ దేహం మొత్తాన్ని చెట్టుచాటుకు లాక్కుంది. తోకని ఒకసారి బలంగా నేలకేసి కొట్టి కృష్ణమూర్తి రాజు మీదకి లంఘించి దూకింది. ఇది ఆయన ఊహించలేదు. గుండు దెబ్బకి రక్తం పోయిన అది నీరసపడి వుంటుందని ఏమరుపాటుగా వున్నారు. దాని పంజా దెబ్బకి ఆయన మెడ విరిగినట్టయ్యింది. క్రింద పడ్డ ఆయన చేతిలోని తూపాకి దూరంగా పడిపోయింది.చిరుత నోరు తెరచి పదునైన కోరలని ఆయన కంఠం వైపు చాపింది. దానినోట్లోంచి కారుతున్న చొంగతో ఆయన లాల్చీ తడిసి పోయింది. సూరిబాబురాజు తుపాకీని గురి చూస్తూ అటూ ఇటూకదులుతున్నారు. తోడొచ్చిన గిరిజనులు దూరంగా పరిగెత్తి భయం భయంగా చూస్తున్నారు.పరిస్థితిని అంచనా వేసిన కృష్ణమూర్తిరాజు అనూహ్యంగా తన ఎడమ చేతిని పులి నోట్లో పెట్టేసారు.దాని నోటినుంచి తన పీకనితప్పించాలంటే అంతకు మించి ఆయనకి మరో మార్గం లేదు.పులి గొంతులో ఇరుక్కున్న కృష్ణమూర్తి రాజు చేతి నుంచి రక్తం ధారపాతంగా కారుతోంది.వెళ్ళకిలా రాజుగారు. రాజుగారి మీద బరువైన పులి.దానినోట్లో చిక్కుకున్న ఆయన చేయి.పులిని గురి చూస్తూ సూరిబాబు గారి తుపాకీ. కానీ ఆయన పులి తల్లోకి పేల్చడానికి వీలు కావడం లేదు, తూటా అటీటైతే కృష్ణమూర్తి రాజుగారికి తగిలే ప్రమాదం వుంది.అంత పులి బరువునూ మోసుకుంటూ, కాళ్ళు నేలకి తన్ని పెట్టి నడుం మీద పాక్కుంటూ పడిపోయిన తన తుపాకీని కుడి చేత్తో అందుకున్నారు కృష్ణమూర్తి రాజు. దాన్ని పులి తల దాకా తెచ్చి ట్రిగ్గర్నొక్కారు. ఆ డొక్కు తుపాకీ చేసిన మోసం అంతా ఇంతా కాదు. అది పేల లేదు. ఆయనకే కాదు అక్కడున్న అందరికీ గుండెలు జారి పోయాయి. కృష్ణమూర్తి రాజుకి ఇదే ఆఖరి రోజు అని అర్థమైపోతోంది.మిత్రులిద్దరిదీ వందల పులులని చంపిన అనుభవం. ఆఖరి ప్రయత్నంగా సూరిబాబురాజు పులిడొక్కలోకి కాల్చారు. పుటుక్కుమందే తప్ప అదీ ఢాం అనలేదు. తుక్కు తుపాకీలతో వేటకొచ్చి ఎంత పెద్ద పొరపాటు చేసారో అప్పుడర్థమయ్యింది ఆయనకి. కోపంగా ఆ తుపాకీని విసిరికొట్టారు.అంతకంతకీ పులిది పై చేయి అయిపోతోంది. చేతినుంచి రక్తం పోతున్న కృష్ణమూర్తి రాజు నీరసపడి పోతున్నారు.పులి పరిస్థితీ అదే. కానీ తన శత్రువు బలహీన పడుతున్న సంగతి గ్రహించి అది పట్టు బిగిస్తోంది.తేరుకున్న సూరిబాబురాజు పులి బలాన్నీ బలహీనతనీ పసిగట్టారు. పులి దాని బలాన్నంతా వెనక కాళ్ళమీదే మోహరించింది. వెంటనే పులి వెనక్కి వెళ్ళి నేలకి అదిమి పెట్టివున్న దాని వెనకి కాళ్ళని బలంగా రెండు చేతులతో పైకి లేపడం మొదలెట్టారు. దూరంగా వున్న గిరిజనులని ‘‘రండ్రా రండి’’ అంటూ పిలిచారు.గిరిజనులు సూరిబాబురాజు చుట్టూ గుమి గూడారు. వాళ్ళ చేతుల్లో బరిసెలూ కత్తులూ గొడ్డళ్ళూ ఉన్నాయి. వెనక కాళ్ళు పట్టు దప్పడంతో పులి నోటిపట్టు కూడా కొంచెం సడలింది. అదే అదునుగా కృష్ణమూర్తిరాజుగారు బలాన్నంతా కూడ గట్టుకుని పులిని తన మీద నుంచి త్రోసేసారు. అది తిరిగి లేచే లోపే ఓ గిరిజనుడు చేతిలోని గొడ్డలితో పులి తలమీద బలంగా వేటు వేసాడు. అలా పులిని వదిలించుకొని కృష్ణమూర్తి రాజు మృత్యుంజయుడయ్యారు. అడవికి పులి కాపలా. రాజసం గాంభీర్యం దాని సొంతం. శక్తికీ యుక్తికీ పట్టుదలకీ అది ప్రతిరూపం. అడవిలో పులి వుందంటే అటు వెళ్ళడానికి మనిషన్నవాడు హడలి చావాల్సిందే.అందుకే పులి మనిషికి శత్రువు. అడవిని జయించాలంటే మనిషి పులిని అంతమొందించాల్సిందే. పులిలేని అడవి అసాంఘిక శక్తులకు ఆడింది ఆట పాడింది పాటగా మారుతుంది. కానీ మనిషే పులై అడవికి కాపలా కాస్తే... ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? పులినోట్లో చెయ్యెట్టి తలని తప్పించుకున్న కృష్ణమూర్తిరాజు కొంతకాలం వేటకి విరామం ప్రకటించక తప్పలేదు. ఆయన గుండె ధైర్యానికి అందరికీ వెన్ను జలదరించింది. ఎన్నో నోరులేని ప్రాణులని చంపిన ఆయనకి, తొలిసారి ఓ పులి ప్రాణం విలువనీ! ప్రాణభయాన్నీ! తెలియజెప్పడమే కాదు, ఆలోచనలోనూ పడేసింది. కానీ... తిరిగే కాలూ పేలే తుపాకీ తీరుబడిగా ఒక్క చోట కుదురుగా వుండవు కదా!కృష్ణమూర్తిరాజుగారి వేట మళ్ళీ మొదలయ్యింది. ఎక్కడా పులుల అలికిడి లేకపోవడంతో అడవిపందులూ, కణుజులూ, కొండగొర్రెలూ అతిధులకీ గ్రామస్థులకీ విందుగా మారుతున్నాయి. మృగాలులేని అడవిలోకి మానవమృగాలు ప్రవేశించాయని కృష్ణమూర్తి ఆలస్యంగా గ్రహించారు. అడవిలో పులులని లేకుండా చేసి తాను ఎంత తప్పు చేసారో ఆయనకి అర్ధం అయ్యింది.దాంతో... ఆయన తుపాకీ ఈ కొత్త జంతువుల వైపు తిరిగింది.కృష్ణమూర్తి తుపాకీమడమ నాటుసారా కుండలని బద్దలు గొట్టేది. ఆయన వెలిగించే అగ్గిపుల్ల గంజాయి పంటని దహించేది. తుపాకీ తూటా లారీ టైర్లలోకి దూరి అక్రమకలప అధికారుల కంట్లో పడేది.అడవిలో ఒంటరిగా తిరిగే రాజుగారు, ఆసాంఘిక శక్తులకి పులిలా కనపడ్డం మొదలెట్టారు. శత్రువులు మొదలయ్యారు. పెరిగారు, వాళ్ళంతా ఏకమయ్యారు. కృష్ణమూర్తి రాజు పులికోసం మాటు వేసినట్టే వాళ్ళు రాజుగారి కోసం మాటువేసి అదును కోసం ఎదురు చూసారు.ఓ రోజు రాత్రి అడవికి వెళ్ళిన రాజుగారికి కొంతమంది అక్రమ వ్యాపారులు అనుకోకుండా కనపడ్డారు. ‘‘మరోసారి కనిపిస్తే కాల్చేస్తా’’ అంటూ హెచ్చరించి ఆయన అక్కడ నుంచి కదిలారు.చక చక మంటూ ఏదో మృగం కదిలిన అలికిడి వినిపించడంతో కృష్ణమూర్తి వెనక్కి చూసారు. అప్పటికే ఆలస్య మయ్యింది. ఓ బడితె దెబ్బ రాజు గారి మెడ వెనకపడింది. కింద పడ్డ రాజుగారు క్షణాల్లో తేరుకొని తుపాకీ గురిపెడుతూ లంఘించి లేచారు. ఓ తూటా ఒకడి కాలిని చీల్చేసింది. మరో తూటా పేల్చేలోగానే ఆ చేతిమీద మరో దెబ్బ తగిలింది. కష్ణమూర్తి రాజుగారి తుపాకీ నేల జారింది. ఆయన మోకాళ్ళ మీద కూలబడి పోయారు. ఒకడు కింద పడ్డ తుపాకీని తీసి మడమతో ఆయన తలపై కసిగా మోదాడు. రాజుగారి కళ్ళు మూతలు పడ్డాయి. ఆయన కళ్ళముందు గుండు దెబ్బ తగిలి విలవిల్లాడిన పెద్దపులులూ... చిరుతలూ... అడవి పందులూ.... దుప్పులూ... కణుజులూ రక్తమోడుతూ కలగా పులగంగా కనిపిస్తుంటే తలవాల్చేసారు.చట్టం తనపని తాను చేసుకుంటూ పోయింది. ప్రాణం తీయడం చట్టరీత్యా నేరం. అది మనిషిదైనా మృగానిదైనా ఒకటే. హత్య చేసిన వాళ్ళే కాదు. ఆ హత్యకి సహకరించిన వాళ్ళూ చట్ట రీత్యా నేరస్థులే. రాజుగారు వన్య ప్రాణులని వేటాడారు. అందుకు ఆయన డబుల్ బ్యారెల్ గన్ సహకరించింది. కనుక అదికూడా శిక్ష అనుభవించి తీరాల్సిందే.అవును... ఇప్పుడు ఆ తుపాకీ రాజుగారు లేని ఒంటరితనాన్ని శిక్షగా అనుభవిస్తోంది. మీరు ఆ జోడుగుళ్ళ తుపాకీని పరామర్శించాలనుకుంటే... జగ్గంపేట పోలీస్ స్టేషన్ కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. - చిరంజీవి వర్మ -
మెట్రో అలర్ట్
సాక్షి,సిటీబ్యూరో: మారణాయుధాలు, ప్రాణాంతక వస్తువులు ఇటీవల ఉప్పల్, మలక్‌పేట్, ఎల్బీనగర్ సహా పలు మెట్రో స్టేషన్లలో భద్రతా తనిఖీల్లో బయటపడడంతో మెట్రో అధికారులు అలర్ట్ అయ్యారు. శత్రుదుర్భేద్యంగా ఉన్న ఈ స్టేషన్లలో ఇటీవల పర్సులో ఇమిడిపోయే కత్తి.. చిన్నారుల ఆటబొమ్మలా కనిపించినా ప్రాణాలు తీసే తుపాకీ.. కుర్రకారును మత్తుతో చిత్తుచేసే హుక్కా గన్.. జనం ప్రాణాలను పొట్టనబెట్టుకునే రసాయనాలు.. అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే లిక్విడ్స్.. డ్రగ్స్ వంటివి గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మారణాయుధాలు, మత్తు పదార్థాలను గుర్తించేలా స్టేషన్లలో విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణనివ్వనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘మొబైల్ ట్రైనర్ వ్యాన్’గా పిలిచే దీన్ని ఆదివారం బేగంపేట్‌లోని హెచ్ఎంఆర్ కార్యాలయం వద్ద హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ వాహనాన్ని నేరుగా ఆయా స్టేషన్ల వద్దకు తీసుకెళ్లడంతో పాటు భద్రతా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎక్కడికక్కడే అవగాహన కల్పించే వెసులుబాటు ఉంది. దేశంలో ఇలాంటి ప్రయోగం నగర మెట్రో ప్రాజెక్టులోనే చేపట్టినట్లు ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఈ వ్యాన్ ద్వారా భద్రతా సిబ్బందికి హెచ్ఎంఆర్ఎల్ భద్రతా విభాగండీసీపీ బాలకృష్ణ నేతృత్వంలో శిక్షణనివ్వాలని ఆదేశించారు. ఈ వాహనంలో టీవీసెట్స్, సీసీటీవీ కెమెరా, ఫైర్ ఎక్విప్మెంట్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లున్నాయి. ఇక స్టేషన్లలో భద్రతా విధులు నిర్వహిస్తున్న 900 మంది సిబ్బందికి ఆడియో–వీడియో చిత్రాలు, పీపీటీ ప్రజెంటేషన్లు, పోస్టర్లు, బోర్డ్స్, హ్యాండ్‌బుక్‌ల ద్వారా భద్రతా సమాచారాన్ని, తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. శిక్షణ ప్రక్రియను సైతం నేషనల్ కమాండ్ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నారు. ఈ వాహనంలోని హార్డ్‌డిస్క్ అధునాతన జీపీఆర్ఎస్ సాంకేతికత ఆధారంగా పనిచేయనుంది. దీంతో ఈ వాహనం ఎక్కడ ఉంది.. ఏయే అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పిస్తుందన్న అంశాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇటీవలికాలంలో లెదర్ పర్సుల్లో ఉన్న కత్తులు, ప్రమాదాలకు ఆస్కారం కల్పించే రసాయనాలు, నిషేధిత డ్రగ్స్‌ను మెట్రో స్టేషన్లలో పలువురు ప్రయాణికుల వద్ద కనుగొనడంతో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక మెటల్ డిటెక్టర్లు, డీఎఫ్ఎండీ స్క్రూటినీ తదితరాలను పకడ్బందీగా నిర్వహించాలని హెచ్ఎంఆర్ ఎండీ ఆదేశించారు. ఇటీవల మెట్రో స్టేషన్ల వద్ద నిర్వహించిన భద్రతా తనిఖీల్లో పట్టుబడిన మారణాయుధాలపై విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని హెచ్ఎంఆర్ భద్రతా సిబ్బందిని ఎన్వీఎస్రెడ్డి ఆదేశించారు. ప్రయాణికులతో స్నేహపూర్వక సంబంధాలు నెరుపుతూనే భద్రతను మరింతగా పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ అధికారులు డీవీఎస్‌రాజు, లక్ష్మణ్, ఆనంద్ మోహన్, విష్ణువర్ధన్‌రెడ్డి, బీఎన్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నెలాఖరున హైటెక్ సిటీకి మెట్రో రైళ్లు అమీర్‌పేట్–హైటెక్‌సిటీ(10 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్ల వాణిజ్య కార్యకలాపాలను ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు హెచ్ఎంఆర్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ మార్గంలో మెట్రో రైళ్లకు 18 రకాల భద్రతా పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. హైటెక్ సిటీకి మెట్రోరైళ్లు కూత పెట్టనుండడంతో ఐటీ, బీపీఓ, కేపీఓ తదితర రంగాల్లో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోకుండానే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. -
వెంకటాద్రి రైలులో తుపాకీ కలకలం!
సాక్షి ప్రతినిధి కడప: అక్కడ ప్రయాణికులెవ్వరూ లేరు.. తుపాకీ మాత్రమే ఉంది. ఎవరైనా వస్తారేమో, ఆయుధం గురించి వాకబు చేస్తారామోనని సిబ్బంది వేచి ఉన్నారు. ఎవ్వరూ రాలేదు. తుపాకీ రైళ్లోకి ఎలా వచ్చింది.. ప్రభుత్వ ఆయుధమా...అక్రమ ఆయుధమా అని సిబ్బంది మదనపడుతున్నారు. ఎంతకీ తెలియడం లేదు. ట్రైన్ ఆఖరు స్టేషన్ రానే వచ్చింది. వెంటనే సిబ్బంది రైల్వే పోలీసులకు తుపాకీ విషయం చేరవేశారు. తుపాకీ స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. తుదకు ఏఆర్ కానిస్టేబుల్ చక్రి ఆయుధంగా గుర్తించారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వెంకటాద్రి రైలులో కలకలం రేపింది. ఏఆర్ కానిస్టేబుల్ చక్రి ఎంపీ రమేష్‌కు గన్‌మెన్‌గా విధుల్లో ఉన్నారు. సోమవారం రాత్రి ఎంపీతో పాటు గన్‌మెన్ హైదరాబాద్ నుంచి ఎర్రగుంట్లకు వెంకటాద్రి రైల్లో ప్రయాణించారు. రాత్రి 4.30గంటలకు ట్రైన్ ఎర్రగుంట్ల చేరుకుంది. ఎంపీ రమేష్‌తో పాటు గన్‌మెన్ చక్రి ట్రైన్ దిగారు. ఎంపీ లగేజీ పట్ల జాగ్రత్త వహించి, చేతబట్టుకున్న గన్‌మెన్ తన ఆయుధం ట్రైన్లోనే మర్చిపోయారు. ఆయుధం మర్చిపోయిన విషయం అసలు గుర్తించలేదు. ట్రైన్ కడప, నందలూరు, రాజంపేట, రైల్వేకోడూరు, రేణిగుంట చేరుకుంది. ఆయుధం మాత్రమే ప్రయాణిస్తోంది. ప్రయాణికులెవ్వరూ లేకపోగా, తుపాకీ మాత్రమే ఉన్న విషయాన్ని గుర్తించిన క్లినింగ్ సిబ్బంది రైల్వే పోలీసులకు తిరుపతిలో సమాచారం ఇచ్చారు. తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి, ఎంపీ రమేష్ గన్‌మెన్ చక్రి ఆయుధంగా గుర్తించి సమాచారం చేరవేశారు. 8.30 గంటలకు వరకూ తన ఆయుధం మిస్ అయ్యిందన్న విషయాన్ని గన్‌మెన్ చక్రి గుర్తించలేదు. రైల్వే పోలీసుల నుంచి సమాచారం రాగానే హుటాహుటిన పయనమయ్యారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిట్టచివర స్టాపింగ్ చిత్తూరు కావడంతో అక్కడికి చేరుకొని రైల్వేపోలీసులకు ఏఆర్ కానిస్టేబుల్ చక్రి వివరాలు తెలియజేశారు. అసలు కంటే కొసరుకే ప్రాధాన్యత.... ప్రజాప్రతినిధుల గన్మెన్లు నాయకుని వ్యక్తిగత భద్రత కంటే ఆ నాయకుని మెప్పు కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికారపార్టీ నేతల వద్ద విధులు నిర్వర్తించేవారు ఈ కోవలో మరింత దూకుడుగా వ్యవహారిస్తున్నారు. అందుకు అనేక ఘటనలు నిదర్శనంగా ఉన్నాయి. మంత్రి ఆదినారాయణరెడ్డి కనుసైగల మేరకు ఆయన గన్మెన్లు ఏకంగా ఓ వ్యాపారిని కిడ్నాప్‌కు పాల్పడిన ఉదదంతం జిల్లా పాఠకులకు విధితమే. వ్యాపారి ఫిర్యాదు మేరకు మంత్రి గన్‌మెన్‌పై కేసు నమోదు కాగా, ప్రస్తుతం వారిలో ఒకరు సస్పెన్షన్ ఎదుర్కొన్నారు. అలాగే ప్రభుత్వ హోదాలో ఉన్నా మరో నాయకుడి గన్‌మెన్ ఏకంగా రాజకీయప్రత్యర్థి పార్టీ గ్రామస్థాయి నాయకులను బెదిరింపులకు పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి గన్‌మెన్ చంద్రశేఖర్‌రెడ్డి తుపాకీ తన కుమారుని అప్పగించిన ఘటనలో ఏకంగా తన ప్రాణాలే పోగొట్టుకున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు గన్‌మెన్ చక్రికి ఎంపీ లగేజీ పట్ల ఉన్న శ్రద్ద తన ఆయుధంపై లేకపోయింది. ఈ ఘటనలన్నీ గన్మెన్లు విధులు, అంకితభావానికి ప్రశ్నార్థకంగా నిలుస్తోండడం విశేషం. -
సెల్‌ఫోన్ కోసం సోదరితో గొడవ
న్యూఢిల్లీ: సెల్‌ఫోన్ విషయంలో సోదరితో గొడవపడి గన్‌తో కాల్చుకొని బాలుడు (17) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఢిల్లీలోని బిందాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిందాపూర్కి చెందిన గుల్హన్(17) ఆదివారం రాత్రి ఫోన్ విషయంలో సోదరితో గొడవ పడ్డాడు. కోపంతో ఆమె ఫోన్‌ని ధ్వంసం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి కాలింగ్‌బెల్ నొక్కాడు. అతని తండ్రి వచ్చి తలుపులు తెరిచి చూసే సరికి ఇంటి ముందు తీవ్ర గాయాలతో పడిపోయి ఉన్నాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు అతన్ని పరిశీలించి అప్పటికే మృతి చెందాడని నిర్దారించారు. ఈ విషయాన్ని పోలీసులకి తెలియజేశారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. బాలుడి చొక్కా నుంచి నాలుగు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయంపై బాలుడి తండ్రిని ప్రశ్నించగా ఫోన్ విషయంలో గొడవపడే ఇంటి నుంచి వెళ్లాడని, సోమవారం ఉదయం గన్‌తో కాల్చుకున్నాడని తెలిపాడు. తాను తలుపులు తీసే కొద్ది నిమిషాల ముందే గన్‌తో కాల్చుకున్నాడని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బాలుడికి గన్ ఎలా లభించిందనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
నాటు తుపాకితో కాల్చి..మామను చంపిన అల్లుడు
తూర్పుగోదావరి, వై.రామవరం (రంపచోడవరం): ఓ అల్లుడు నాటుతుపాకీతో కాల్చి తన మామను హతమార్చాడు. మండలంలోని రేగడిపాలెం గ్రామంలో రాకోటవీధికు చెందిన రాకోట ఆదిరెడ్డి (50) ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహానికి బుధవారం ఉదయం అడ్డతీగల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. రాజవొమ్మంగి మండలం, దూసరపాముకు చెందిన ఇళ్లాపు దారబాబు అనే వ్యక్తి సోమవారం రాత్రి నాటు తుపాకీతో ఆదిరెడ్డిని కాల్చి చంపాడు. మండలంలోని లోతట్టు ప్రాంతం కావడంతో ఆలస్యంగా మంగళవారం సాయంత్రానికి పోలీసులకు సమాచారం అందింది. అడ్డతీగల సీఐ ఎ.మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆయన కథనం ప్రకారం.. మృతుడు ఆదిరెడ్డి రెండో కుమార్తెతో నిందితుడు దారబాబు కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నాడు. ఇలా చేస్తే తమ కుటుంబం పరువు పోతుందని, పెద్దలకు తెలిపి, తన కుమార్తెను వివాహం చేసుకోవాలని ఆదిరెడ్డి అడిగాడు. దీనికి ఆగ్రహించిన నిందితుడు దారబాబు తన వద్ద ఉన్న నాటు తుపాకీతో ఆదిరెడ్డిని కాల్చగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్టున్నట్టు తెలిపారు. నిందితుడిపై క్రైమ్ నంబర్ 39/18 యు/ఎస్ 302 ఐపీసీ, అండ్ సెక్షన్Œ 27(1) ఆఫ్ ఇండియన్స్ ఏఆర్ఎంఎస్ యాక్ట్ 1959 సెక్షన్ల కింద వై.రామవరం పోలీసు స్టేషన్లో కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. మృతదేహాన్ని బుధవారం సాయంత్రం మృతుడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై ఎన్.సతీష్‌బాబు, వారి సిబ్బంది పాల్గొన్నారు. -
నెత్తురోడిన అమెరికా
థౌజండ్ ఓక్స్: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని థౌజండ్ ఓక్స్ నగరంలో ఉన్న బార్లోకి బుధవారం ప్రవేశించిన ఓ మాజీ సైనికుడు సెమీఆటోమేటిక్ తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి సహా 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమాయకుల్ని పొట్టనపెట్టుకున్న అనంతరం సదరు దుండగుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై వెంచుర కౌంటీ షెరిఫ్ జియోఫ్ డీన్ మాట్లాడుతూ.. ‘బోర్డర్‌లైన్ బార్ అండ్ గ్రిల్లో ప్రతి బుధవారం కాలేజ్ కౌంటీ నైట్ పేరుతో వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు వందలాది మంది కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. ఇంతలో ఓ వ్యక్తి రాత్రి 11.30(స్థానిక కాలమానం) గంటలకు బార్లోకి ప్రవేశించాడు. వస్తూనే నాలుగువైపులా స్మోక్ బాంబులను విసిరాడు. విద్యార్థులు, ఇతర కస్టమర్లు పొగకు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా తన సెమీఆటోమేటిక్ తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు. ఇలా 30 రౌండ్ల పాటు కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. రంగంలోకి దిగిన పోలీస్ అధికారి రాన్ హెలుస్.. లోపల చిక్కుకున్న ప్రజలను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపారు. ఈ ఊచకోతకు పాల్పడిన వ్యక్తిని మాజీ మెరైన్ ఇయాన్ డేవిడ్ లాంగ్(28)గా గుర్తించామని జియోఫ్ డీన్ వెల్లడించారు. 12 మందిని పొట్టనపెట్టుకున్న అనంతరం ఇయాన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఇయాన్‌పై తీవ్రమైన నేరాభియోగాలు ఏవీ లేవనీ, చిన్నచిన్న కేసులు ఉన్నాయన్నారు. యూఎస్ మెరైన్ కోర్లో 2008–13 మధ్యకాలంలో ఇయాన్ పనిచేశాడన్నారు. ఇందులో భాగంగా 2010 నవంబర్ నుంచి 2011 జూన్ వరకూ అఫ్గానిస్తాన్‌లో విధులు నిర్వర్తించాడని పేర్కొన్నారు. అయితే ఈ దాడి ఎందుకు చేశారన్న విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. యుద్ధవాతావరణంలో ఉండే వ్యక్తులు ఎదుర్కొనే పోస్ట్ ట్రుమాటిక్ స్ట్రెస్ డిజార్డర్(పీటీఎస్డీ)తో ఇయాన్ ఇబ్బంది పడుతున్నాడన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అతడిని అదుపు చేయడానికి కుటుంబ సభ్యులు ఏకంగా పోలీసులను పిలవాల్సి వచ్చిందన్నారు. కాగా, ఈ దాడి సందర్భంగా పలువురు యువతీయువకులు కిటికీలు అద్దాలు పగులగొట్టి, బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారని డీన్ పేర్కొన్నారు. మరికొందరు బాత్రూముల్లో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామన్నారు. రెండువారాల్లో రెండోసారి అమెరికాలో రెండు వారాల వ్యవధిలో ఇలాంటి దాడి జరగడం ఇది రెండోసారి. పిట్స్‌బర్గ్‌లోని యూదు ప్రార్థనామందిరంపై జరిగిన విద్వేషదాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. కాగా, థౌజండ్ ఓక్స్ కాల్పుల ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కార్ల్ ఎడ్గర్(24) మీడియాతో మాట్లాడుతూ..‘20 మంది స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి ఇక్కడి బోర్డర్‌లైన్ బార్‌కు వచ్చాను. అనంతరం కొద్దిసేపటికే కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రాణాలు రక్షించుకోవడానికి మేమంతా తలోదిక్కు పరిగెత్తాం. ఇప్పుడు నా స్నేహితులను ఫోన్ చేస్తే కలవడం లేదు. ఈ ఘటన అనంతరం వాళ్లంతా తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకుని ఉండొచ్చు. గతేడాది లాస్‌ఏంజెలిస్‌లో ‘రూట్ 91’ సంగీత విభావరిపై జరిగిన కాల్పుల నుంచి నేను, నా స్నేహితులు తప్పించుకోగలిగాం. దాన్నుంచే తప్పించుకోగలిగినప్పడు ఈ కాల్పుల నుంచి వాళ్లు సురక్షితంగా బయటపడి ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. లాస్‌ఏంజెలిస్‌లోని సంగీత విభావరిపై ఓ ఉన్మాది దాడిలో 57 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. -
కాల్పులతో దద్దరిల్లిన అమెరికా
కాలిఫోర్నియా : అమెరికా మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియాలోని తౌజండ్ ఓక్స్ బార్‌లోని డాన్స్‌హాల్‌లో 29 ఏళ్ల వ్యక్తి జరిపిన కాల్పుల్లో 13 మంది (ఓ పోలీస్ అధికారితో సహా) మరణించారు. ఈ ఘటనతో అమెరికాలో గన్‌కల్చర్ మరోసారి చర్చనీయాంశమైంది. ఆత్మరక్షణ పేరిట తుపాకుల వినియోగానికి అక్కడి ప్రభుత్వం అనుమతించడంపై విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో తుపాకులతో జరిపిన హింసాకాండ ఘటనలు కొన్ని... ఆధునిక అమెరికా చరిత్రలో అత్యంత పాశవికంగా జరిగిన తుపాకీ కాల్పుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించిన ఘటనలు... ►2017 అక్టోబర్ 1న నెవడా రాష్ట్రంలో లాస్‌వేగాస్‌లోని మాండలే బే రిసార్ట్, కాసినోలో జరుగుతున్న సంగీతోత్సవ వీక్షకులపై 64 ఏళ్ల స్టీఫెన్ పాడాక్ జరిపిన కాల్పుల్లో అత్యధికంగా 58 మంది మృతి చెందారు. 500 మంది వరకు గాయపడ్డారు ►2016 జూన్ 12న ఒర్లాండోలోని పల్స్ గే నైట్‌క్లబ్‌లో 29 ఏళ్ల సాదిక్ మతీన్ జరిపిన కాల్పుల్లో 49 మంది చనిపోయారు. 50 మందికి గాయాలయ్యాయి. ►2007 ఏప్రిల్ 16న వర్జీనియాలోని వర్జీనియాటెక్ యూనివర్సిటీలో 23 ఏళ్ల విద్యార్ధి సీఉంగ్ హ్యుచో రెండుచోట్ల వరస కాల్పులకు తెగబడగా 32 మంది మరణించారు ►2012 డిసెంబర్ 14న కనెక్టికట్‌లోని న్యూటౌన్‌లో 20 ఏళ్ల అడం లాంజా జరిపిన కాల్పుల్లో 27 మంది మృత్యువాతపడ్డారు. వారిలో ఆరేడేళ్ల వయసున్న పిల్లలు 20 మంది, ఏడుగురు పెద్దవారున్నారు ►2017 నవంబర్ 5న టెక్సాస్‌లోని సదర్లాండ్ స్ప్రింగ్స్‌లోని చిన్న చర్చిలో ప్రార్థన చేస్తున్న వారిపై డెవిన్ ప్యాట్రిక్ కెల్లీ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో 25 మంది హతమయ్యారు ►1991 అక్టోబర్ 16న టెక్సాస్‌లోని కిలీన్లో 35 ఏళ్ల జార్జి హెన్నార్డ్ అనే వ్యక్తి తన ట్రక్‌తో ఓ కెఫిటేరియా గోడను ఢీకొట్టి ఆ తర్వాత తుపాకీతో 23 మందిని కాల్చి చంపాడు. 2018లో ఇప్పటివరకు కొన్ని వందల సంఖ్యలో కాల్పుల ఘటనలు చోటు చేసుకోగా అందులో పది మంది అంతకు పైగా హతులైన ఘటనలు కొన్ని... ►తాజాగా కాలిఫోర్నియాలోని తౌజండ్ ఓక్స్‌లో జరిగిన ఘటనలో 13 మంది చనిపోయారు ►అక్టోబర్ 27న పెన్సిల్వేనియా లోని పిట్స్‌బర్గ్‌లో జరిగిన కాల్పుల్లో 11 మంది మృత్యువాత ►మే 18న టెక్సాస్‌లోని సాంతా ఫేలో జరిగిన కాల్పుల్లో 10మంది మరణం ►ఫిబ్రవరి 14న ఫ్లోరిడాలోని పొంపనో బీచ్ (పార్క్‌ల్యాండ్)లో తుపాకి కాల్పులకు 17 మంది మృతి గత మూడేళ్లలో... నేషనల్ సేఫిటీ కౌన్సిల్, నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్, తదితర సంస్ధల అంచనాల మేరకు ►2017లో 346 సామూహిక కాల్పుల ఘటనలు చోటు చేసుకోగా, 437 మంది హతమయ్యారు. 1,802 మందికి గాయాలయ్యాయి ►2016లో 383 కాల్పుల ఘటనల్లో 456 మంది మృతి చెందగా, 1,537 మంది గాయపడ్డారు ►2015లో 333 తుపాకీ కాల్పుల సంఘటనల్లో 367 మంది మరణించారు. 1,328 మంది గాయపడిన వారిలో ఉన్నారు -
పేలిన గన్
సింహపురి ప్రశాంతతకు మారుపేరనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, లైంగికదాడులు, కిడ్నాప్లతో అట్టుడుకుతోంది. జిల్లా ఓ వైపు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోన్న తరుణంలో అంతే వేగంగా వ్యవస్థీకృత నేరాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఉగ్రవాదులు, మాఫియాలు, అంతర్రాష్ట్ర నేరగాళ్లు జిల్లాలో పాగావేసి తమ నేరసామ్రాజ్యాన్ని విస్తృతం చేస్తున్నారు. నేరగాళ్ల కదలికలను పసిగట్టడంలో నిఘా వ్యవస్థ విఫలమైందనే ఆరోపణలున్నాయి. ఫలితంగా నేరగాళ్లు విజృంభిస్తూ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. నెల్లూరు(క్రైమ్): తుపాకీ కల్చర్ సైతం జిల్లాకు పాకింది. రోజురోజుకు తుపాకీ సంస్కృతి జడలు విప్పుతోంది. నెల్లూరు ఫత్తేఖాన్‌పేట సమీపంలో మహేంద్రసింగ్(47)అనే వ్యాపారిపై ఇద్దరు దుండగులు శనివారం రాత్రి కాల్పులు జరిపి హతమార్చడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా పోలీసులు నిర్లిప్తత వీడకుంటే భారీగా మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని ఓ విశ్రాంత పోలీసు అధికారి వెల్లడించారు. ⇔ వెంకటేశ్వరపురంలోని ఓ బార్‌వద్ద అందరూ చూస్తుండగా రౌడీషీటర్ సాయి అలియాస్ బస్టాండు సాయిని స్నేహితులే అతికిరాతకంగా హతమార్చారు. ⇔ నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైవోవర్ బ్రిడ్జి సమీపంలో బిల్డర్ నెల్లూరు శిరీష్‌కుమార్‌ను ప్రత్యర్థులు కిరాయి హంతకులతో దారుణంగా హత్యచేయించారు. ⇔ పానీపూరిబండి వద్ద చెలరేగిన స్వల్పవివాదం కారణంగా ఇద్దరు పాతనేరస్తులు అన్నదమ్ములపై విచక్షణా రహితంగా దాడిచేశారు. ⇔ నగరంలోని కుమ్మరవీధికి చెందిన వడ్డీ వ్యాపారి తహసీన్‌ను నలుగురు మిఠాయిలో సైనెడ్కలిపి చంపి ఆమె మృతదేహాన్ని వెంకటాచలం సమీప అటవీప్రాంతంలో పూడ్చిపెట్టారు. అనంతరం ఆమెకు చెందిన బంగారు, నగదు, ప్రామిసరీ నోట్లను అపహరించారు. ⇔ తాజాగా నగర నడిబొడ్డులో శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో వ్యాపారి మహేంద్రసింగ్‌పై ఇద్దరు దుండగులు గన్‌తో కాల్పులు జరిపారు. ఈఘటనలో మహేంద్రసింగ్ మృతిచెందాడు. వేళ్లూనుకుంటున్న కిరాయి సంస్కృతి ఉత్తరాది రాష్ట్రాలు, మెగా సిటీలకే పరిమితమైన కిరాయి సంస్కృతి జిల్లాలోనూ పెరుగుతోంది. దుండగులు సుపారీ తీసుకుని ప్రత్యర్థుల ప్రాణాలను ఇట్టే తీసేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. కావలి డివిజన్ పరిధిలో ఓ వ్యక్తి కోర్టువాయిదాకు వెళుతుండగా కిరాయిహంతకులు వేటకొడవళ్లతో దారుణంగా హత్యచేశారు. నెల్లూరు నగరంలో ఓ మహిళను ఆమె భర్తే సుపారీ ఇచ్చి హత్యచేయించాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అక్టోబర్ ఐదో తేదీన వ్యాపార లావాదేవీల్లో నెలకొన్న విభేదాలతో బిల్డర్ శిరీష్‌కుమార్‌ను ప్రత్యర్థులు సుపారీ ఇచ్చి దుండగులతో హత్యచేయించారు. తనిఖీలు నామమాత్రం జిల్లాలో క్రమేపి శాంతిభద్రతలు క్షీణదశకు చేరుకుంటున్నాయి. నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేరస్థులకు నెల్లూరు జిల్లా షెల్టర్ జోన్‌గా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల నిఘా లోపించడం, తనిఖీలు నామమాత్రంగా ఉండటం నేరగాళ్లకు అనుకూలంగా మారింది. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా పెద్ద ఎత్తున ఇతర ప్రాంత వాసులు జిల్లాకు తరలివస్తున్నారు. వారు ఎవరన్నది పోలీసుల వద్ద కచ్చితమైన సమాచారం లేదు. దీంతో కరుడుగట్టిన నేరగాళ్లు, ఉగ్రవాదులు, మవోయిస్టులు, స్మగ్లర్లు, ఆర్థిక నేరగాళ్లు జిల్లాలో తలదాచుకున్న ఘటనలు లేకపోలేదు. గతంలో సిమి ఉగ్రవాదులు జిల్లాలోని తడలో ఉన్నారనే సమాచారం జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఉలికిపాటుకు గురిచేసిన విషయం విదితమే. ఉగ్రవాదులు ఏకంగా కోర్టు ఆవరణలో బాంబులు పేల్చిన సంఘటన జిల్లాలో కలకలం రేకెత్తించింది. నగరానికి చెందిన ఇద్దరు యువకులు తాము డీ–గ్యాంగ్ సభ్యులమని ఏకంగా బీసీసీఐ సభ్యులు రాజీవ్‌శుక్లాకు ఫోనుచేసి ఏకంగా రూ.100కోట్లు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కిడ్నాప్ చేస్తామని హెచ్చరించారు. ఇక ఎర్రస్మగ్లర్లు, గంజాయి స్మగ్లర్లు విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా జరిగితేనే నాకాబందీ దేశంలో లేదా రాష్ట్రంలో ఏదైనా కీలకమైన సంఘటన జరిగిన సమయంలో పోలీసులకు నాకాబందీ గుర్తొస్తుంది. నాకాబందీ అనేది పోలీసులు నెలలో కచ్చితంగా నాలుగుసార్లు చేయాలి. ఇది చాలా వరకు అమలు కావడం లేదు. పోలీసులు అప్పుడప్పుడు చేసే తనిఖీల్లో చాలాసార్లు కీలకమైన సమాచారం లభించిన సందర్భాలూ ఉన్నాయి. అయినా పోలీసులు అధికారులు దీనిని గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇక లైసెన్స్ తుపాకీలను సైతం మూడు నెలలకోసారి కచ్చితంగా తనిఖీ చేయాలన్న నిబంధన ఉంది. తుపాకీనీ ఈ మధ్యకాలంలో ఏవైనా వినియోగించారా? ఎన్ని బుల్లెట్లున్నాయి. అనే విషయంపై ఆరా తీయాలి. అయితే ఈ ప్రక్రియ తూతూమంత్రంగానే సాగుతుందనే విమర్శలున్నాయి. కేవలం ఎన్నికలు, ఇతర కీలక సందర్భాల్లో పోలీసులు ఆయుదాలను జప్తు చేసుకుని ఆ నాలుగురోజులు శాంతిభద్రతలు కాపడుతున్నామని చెబుతున్నారు. ఏదిఏమైనా ప్రశాంత సింహపురి ఒకప్పటి మాటగానే మారింది. జిల్లా ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు. వీటితో పాటు పోలీసుల పనితీరుపై విమర్శలకు పోలీసుశాఖ ఎలాంటి సమాధానం చెబుతుందో వేచిచూడాల్సిందే. పెరుగుతున్న గన్‌కల్చర్ మారుతున్న కాలానికి అనుగుణంగా జిల్లాలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం ఎవరి బతుకు వారిది..ఎవరి వ్యాపకాలు వారివి.. అయితే ఇటీవల అధికమైన తుపాకీ సంస్కృతి జిల్లా వాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. జిల్లాలో గన్‌కల్చర్ పెరుగుతోంది. నేరగాళ్లు తుపాకీలతో కాల్చుతూ, వాటిని చూపిస్తూ ఘాతుకాలకు ఒడిగడుతున్నారు. ⇔ 2013 జూలై ఐదో తేదీన నెల్లూరు హాస్పిటల్ సమీపంలో పట్టపగలు మావోయిస్టు మాజీనేత, అమరవీరుల కుటుంబమిత్రుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు గంటిప్రసాదను గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ⇔ 2015లో కావలికి చెందిన బంగారు వ్యాపారి రామయ్య, సునీల్ రూ. 86.55లక్షలు నగదుతో బంగారం కొనుగోలు చేసేందుకు నవజీవన్ రైల్లో వెళుతుండగా ఓ పోలీసు అధికారి(దొంగల ముఠా నాయకుడు) ఆధ్వర్యంలో ముగ్గురు కానిస్టేబుల్స్, ఓ పాతనేరçస్తుడు తుపాకులతో బెదిరించి నగదు దోచుకెళ్లారు. ⇔ భూవివాదం నేపథ్యంలో తోటపల్లిగూడూరు మండలం సౌత్ ఆమలూరుకు చెందిన కిరణ్‌పై ఆయన సమీప బంధువు రూప్‌కుమార్ తుపాకీతోకాల్పులు జరిపారు. ⇔ 2015 ఆగస్టులో నెల్లూరు నగరంలోని దేవిరెడ్డివారివీధిలో జయంతి జ్యూయలరీస్‌లో దుండగులు లోనికి ప్రవేశించి అక్కడున్న సిబ్బందిని గన్లతో బెదిరించి రూ.లక్షలు విలువచేసే బంగారు నగలను అపహరించుకుని వెళ్లారు. ⇔ బిట్రగుంటలో టాస్క్ఫోర్సు పోలీసులపై తిరగబడ్డ దుండగులు వారి వద్దనున్న తుపాకీలను లాక్కొని పోలీసులపై దాడులుకు పాల్పడ్డారు. ⇔ ఇటీవల పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ల వద్ద నుంచి తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. -
తూటా పేల్చి.. హతమార్చి
నెల్లూరు (క్రైమ్): అంతా పది నిమిషాల వ్యవధిలో జరిగి పోయింది. దుకాణానికి తాళం వేసి ఇంటికి బయలుదేరిన మహేం ద్రసింగ్పై దుండగులు తూటా పేల్చి హతమర్చారు. తుపాకీ కాల్పుల ఘటన జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ సంచలనం రేకెత్తించింది. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హత్య వెనుక గల కారణాలను ఛేదించే పనిలో ఉన్నారు. నెల్లూరు నగరంలోని సీసీ కెమెరాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీ లించడంతో పాటు రాత్రంతా నగరంలో నాకా బందీ నిర్వహించారు. మృతుడికి రెండు సెల్‌ఫోను నంబర్లు ఉండటంతో కాల్ డీటైల్స్‌ను పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎలాంటి సమాచారం చెప్పకపోవడం, ఘటన జరిగిన ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మహేంద్రసింగ్ రాజ్‌పురోహిత్ (40) ది రాజస్థాన్ రాష్ట్రం బార్మేర్ జిల్లా సంద్రి మండలం ఆర్తండి గ్రామం. ఆయనకు అదే జిల్లా లుద్దర గ్రామానికి చెందిన ఉషాదేవితో వివాహమైంది. మహేంద్రసింగ్ 15 ఏళ్ల కిందట ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వలస వచ్చారు. ఫత్తేఖాన్‌పేట రైతుబజారు ఎదురు అక్కనవారి వీధిలో నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తె కోమల్ పేరుతో సంతపేట, ఫత్తేఖాన్‌పేట, తిరుపతిలో పవర్ టూల్స్ సర్వీస్ అండ్ సేల్స్ దుకాణాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని దుకాణ బాధ్యతలను ఆయన అన్న మంగిలాల్ రాజ్‌పురోహిత్ చూసుకుంటున్నాడు. మహేంద్రసింగ్ స్వతహాగా మృదు స్వభావి. అందరితో ఎంతో కలివిడిగా ఉం డేవారు. సామాజిక కార్యకర్త. తనకు ఉన్నదాంట్లోనే ధాన ధర్మాలు చేస్తుండటంతో పాటు స్వగ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వర్తించారు. వినాయకచవితికి ఆయన తన స్వ గ్రామానికి ఒకటిన్నర నెల కిందట వెళ్లి రెండు వారాల కిందట తిరిగి నెల్లూరుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన్ను దుండగులు హతమార్చడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. సంఘటన ఇలా.. ప్రతి రోజు మహేంద్రసింగ్ 9.30 గంటలకే దుకాణంను మూసివేసేవాడు. అయితే శనివారం రాత్రి 10 గంటలకు దుకాణం మూసివేశాడు. దుకాణంలో పనిచేస్తున్న యువకులు ఇంటికి వెళుతుండగా వెనుక ఫోనుల్లో మాట్లాడుకొంటూ దుకాణం వద్ద నుంచి బయలుదేరారు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆయనతో మాట్లాడి అతి దగ్గరగా రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. వారి నుంచి తప్పిం చుకునే ప్రయత్నం చేయడంతో మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడ నుంచి నిందితులు బైక్‌పై పరారైనట్లు సమాచారం. ప్రొఫెషనల్స్ పనే మహేంద్రసింగ్ హత్య ప్రొఫెషనల్స్ పని అయి ఉండొచ్చని, కిరాయి తీసుకుని హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన ప్రాంతంలో ల భ్యమైన తూటా కేస్ల ఆధారంగా ఫిస్టల్‌లో వినియోగించే 9 ఎంఎం బుల్లెట్లుగా పోలీసులు గుర్తించారు. జిల్లాలో తుపాకీ సంస్కృతి లేకపోవడంతో నిందితులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారై ఉం టారని పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యే క బృందాలతో విచారణ చేస్తున్నామని త్వరలోనే కేసులోని మిస్టరీని చేధిస్తామని జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి మహేంద్రసింగ్ మృతదేహానికి ఆదివారం ప్రభుత్వ వైద్యులు జీజీహెచ్‌లో పోస్టుమార్టం పూర్తి చేసి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఏఎస్పీ పి. పరమేశ్వరరెడ్డి, నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులను హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. చిన్నబజారు ఇన్స్పెక్టర్ అబ్దుల్ సుభాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు హత్య వెనుక పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌లో మహేంద్రసింగ్ బావమరిది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడి పోలీసులు సైతం ఆత్మహత్య కిందే పరిగణించి కేసును మూసివేశారు. అయితే ఇటీవల మహేంద్రసింగ్ తన బావమరిదిది ఆత్మహత్య కాదనీ, పలు అనుమానాలున్నాయని, కేసును పునః పరిశీలించాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు తిరిగి ఆ కేసు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే మహేంద్రసింగ్ హత్యకు గురికావడం వెనుక ఈ ఘటనే ఉండొచ్చన్న అనుమానాలను స్నేహితులు వ్యక్తం చేస్తున్నారు. మహేంద్రసింగ్ స్వగ్రామంలో ఓ యువతిని కొందరు కిడ్నాప్ చేసి హత్య చేశారని, అందులో మృతుడి ప్రమేయం ఉందనే ఆరోపణలు సైతం వెల్లు వెత్తుతున్నాయి. మహేంద్రసింగ్ తన స్వగ్రామంలో అనేక సేవా, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి వద్ద మంచి పేరును గడించారు. ఈ క్రమంలో స్థానిక సర్పంచ్ దీన్ని జీర్ణించుకోలేక అతనితో తరచూ గొడవలు పడేవారని పోలీసులకు తెలిసింది. దీంతో ప్రత్యేక బృందం విచారణ నిమిత్తం రాజస్థాన్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. మహేంద్రసింగ్‌కు బంగారు వ్యాపారంలోనూ ప్రమేయం ఉంది. కొన్నేళ్ల కిందట ఓ వ్యక్తి తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పడంతో అతని కోసం రోజుల తరబడి తిరిగి తర్వాత మానుకొన్నాడని బంధువులు పోలీసులకు వెల్లడించారు. నెల్లూరులో మహేంద్రసింగ్ షాపు ఉన్న చోట బిహార్‌కు చెందిన పానీపూరీ నిర్వాహకుడితో తార స్థాయిలో గొడవలు ఉన్నాయని పోలీసులకు సమాచారం. బిహార్‌లో తుపాకీ సంస్కృతి ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు సదరు పానీపూరీ నిర్వాహకుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తొలుత పోలీసులు నగదు కోసం హత్య చేసి ఉంటారని భావించారు. అయితే ఘటన జరిగిన సమయంలో అతని జేబులో సుమారు రూ 1.50 లక్షల నగదు ఉంది. నగదు కోసం హత్య చేసి ఉంటే దుండగులు ఆ నగదును అపహరించుకుని వెళ్లి ఉండేవారు. హత్యకు నగదు కారణం కాదని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీల్లో నిందితులిద్దరిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించడం లేదు. -
అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడు మృతి
న్యూయార్క్: అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో నలుగురు ఆక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో ఒకరు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్విరాజ్(25)గా గుర్తించారు. ఈ ఘటన సిన్సినాటిలోని వాల్నట్ స్ట్రీట్‌లోని బ్యాంక్‌లో చోటుచేసుకుంది. మృతి చెందిన పృథ్వీరాజ్ బ్యాంక్ ఉద్యోగిగా తెలిసింది. కాల్పులుకు పాల్పడిన ఒమర్ పెరాజ్‌ను పోలీసులు మట్టుపెట్టారు. స్పందించిన విదేశాంగ కార్యాలయం అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన వారిలో గుంటూరుకు చెందిన పృథ్వీరాజ్ అని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే న్యూయార్క్ పోలీసులను సంప్రదించామని, పృథ్వీరాజ్ మృతదేహాన్ని భారత్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు. ఘటనా స్థలం.. కాల్పులు జరిపిన దుండగుడు(ఇన్సెట్లో) -
భారత సంతతి యువకుడిపై కాల్పులు.. కలకలం
టొరంటో : భారత సంతతికి చెందిన 27 ఏళ్ల యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో స్వగృహంలోనే ఈ దారుణం జరగడం గమనార్హం. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది బ్రాంప్టన్‌లో చోటుచేసుకున్న 11వ హత్య అని.. ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందంటూ వలసదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శరత్ కొప్పు(25) హత్యకు గరైన విషయం తెలిసిందే. ఆపై పరారీలో ఉన్న నిందితుడ్ని అమెరికా పోలీసులు కాల్చిచంపారు. పోలీసుల కథనం ప్రకారం.. భారత్‌కు చెందిన పల్విందర్ సింగ్ 2009లో ఉపాధి నిమిత్తం కెనడాకు వెళ్లాడు. బ్రాంప్టన్ నగరంలో నివాసం ఉంటున్న పల్విందర్ ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం నలుగురు గుర్తుతెలియని దుండగులు పల్విందర్ ఇంట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి అతడు మృతిచెందాడు. ఈ హత్యకేసులో నిందితులైన మిస్సిస్సౌగాకు చెందిన 18, 19 ఏళ్ల యువకులిద్దరూ లొంగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ‘మరో రెండు రోజుల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకోవాల్సిన నా మిత్రుడు ఇకలేడు. ఇక బర్త్‌డే పార్టీ ఎవరు చేసుకుంటారు మిత్రమా. నువ్వు బతికుండాల్సిన వాడివి’ అంటూ పల్విందర్ స్నేహితుడొకరు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. గన్ కల్చర్ కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు మేయర్ లిండా జెఫ్రీకి ఫిర్యాదు చేశారు. -
సరదాగా కాల్చేస్తుండ్రు!
బడాబాబుల కాల్పుల సరదా మూగజీవుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. పూడూరు మండల పరిధిలోని ఫాంహౌస్‌ల సమీపంలో చోటు చేసుకున్న రెండు సంఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో నాటు తుపాకీతో కుక్కలను కాల్చి.. ఈ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వేటగాళ్లు..అప్పట్లో సంచలనం సృష్టించారు. గత శనివారం మళ్లీ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎన్కెపల్లి శివారులో కాడెద్దుపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సంపన్న వర్గాలకు చెందిన వారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుండటంతో పోలీసులు, అధికారులు అటువైపు తొంగి చూడటం లేదు. రక్తం మరిగిన పులుల్లా గన్ కల్చర్‌కు అలవాటుపడిన దుండగులు మనుషులపై ఎక్కుపెట్టే రోజు రాకముందే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరిగి : అసాంఘిక కార్యకలాపాలు, కాల్పుల సంఘటనలు జరిగిన సమయంలో హల్చల్ చేస్తున్న పోలీసులు ఆ తర్వాత మిన్నకుండిపోతున్నారు. ప్రధాన కేసులన్నీ ఇలాగే నీరుగారుతుండటం.. వీరి పని తీరుపై విమర్శలకు తావిస్తోంది. ఈ కేసులన్నింటిలో బడాబాబులు, ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధుల హస్తం ఉంటుండటంతో పోలీసుల విచారణ సైతం ఎక్కడో ఒక చోట ఆగిపోతోందనే ఆరోపణలున్నాయి. సరదా కోసం కొందరు బడాబాబులు గన్‌తో కుక్కలు, ఎద్దులను వేటాడి చంపుతున్న ఘటనలు చోటుచేసుకోవడం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పరిగి నియోజకవర్గ పరిధిలోని పూడూరు మండల పరిసరాలు దీనికి వేదికవుతున్నాయి. కాల్పల ఘటనలే కాకుండా అసాంఘిక కార్యకలాపాలు, నేరస్తులు తలదాచుకోవటం తదితర కార్యకలాపాలకు ఈ ప్రాంతం అడ్డాగా మా రిందని ప్రజలు చెబుతున్నారు. ఇది తమను ప్ర మాదంలో పడేస్తోందని ఆవేదన వ్యక్తంచేసు ్తన్నా రు. ఏడాది క్రితం తుపాకీతో కుక్కలను వేటాడి.. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంఘటన జరిగి ఏడాదిన్నర కావస్తుండగా.. సరిగ్గా ఇలాంటి సంఘటనే మళ్లీ జరగడం కలకలం రేపుతోంది. తాజాగా ఎద్దును గన్‌తో కాల్చి చంపి కళేబరాన్ని మాయం చేసిన ఉదంతం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కుక్కల వేట.. కొందరు బడా బాబులు తమ సరాదా కోసం అటుగా వెళ్లే పెంపుడు కుక్కలను గన్‌తో వేటాడి చంపారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ విషయం రెడ్‌క్రాస్ సొసైటీ దృష్టికి వెళ్లడంతో.. కేంద్ర మంత్రి మేనకాగాంధీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందో వివరాలు సేకరించాలని ఆమె సొసైటీ ప్రతినిధులకు సూచించారు. పోలీసుల సహకారంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సంఘటన జరిగింది పూడూరు మండల పరిధిలోని మన్నెగూడ సమీపంలోని ఓ ప్రైవేటు ఫాంహౌస్‌లో అని ప్రా థమి కంగా గుర్తించారు. అనంతరం చన్గొముల్ పోలీసులను ఆశ్రయించటంతో వారు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత చేవెళ్ల డీఎస్పీ శృతకీర్తి రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులతో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కానీ ఇప్పటి వరకూ దీనిపై చార్జిషీట్ వేయలేదు. తాజాగా ఎద్దుపై కాల్పులు.... తాజాగా గన్‌తో ఎద్దుపై కాల్పులు జరిపి చంపిన ఘటన స్థానికంగా మరో సారి సంచలనం రేపింది. పూడూరు మండల పరిధిలోని ఎన్కెపల్లి శివారులో ఎద్దుపై తుపాకితో కాల్పులు జరపగా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే ఈ విషయమై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బాధిత రైతు ముందుగా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. కాల్పులకు పాల్పడిన వ్యక్తులు ఎద్దును కొనిస్తామని చెప్పడంతో అతను మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మృతిచెందిన ఎద్దును వెంటనే అక్కడ నుంచి మాయం చేశారు. స్థానికుల్లో ఆందోళన... కాల్పుల ఘటనలకు పాల్పడింది బడాబాబులు, పలుకుబడి, ఆర్థికంగా బాగా ఉన్న వారు కావటంతో కేసు ముందుకు సాగటంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పై నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగానే ఈ కేసు దర్యాప్తులో పురోగతి కనిపించటంలేదని సమాచారం. ఏది ఏమైనా.. గన్ కల్చర్ మంచిది కాదని.. ప్రభుత్వం, పోలీసులు ఈ సంఘటనను కుక్కలు, పశువులపై వేటగానే చూడకుండా తీవ్రంగా పరిగణించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీరిని ఉపేక్షిస్తే మున్ముందు మరిన్ని దుర్ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందని పేర్కొంటున్నారు. ఫిర్యాదు అందలేదు ఇటీవల ఎద్దుపై తుపాకీతో కాల్పులు జరిపి చంపేశారనే విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా కేసు నమోదు చేసి విచారణ చేస్తాం. గతంలో గన్‌తో కుక్కలను వేటాడిన కేసుకు సంబంధించి పురోగతి సాధించాం. త్వరలోనే దీనిపై చార్జిషీటు వేస్తాం. – శ్రీనివాస్, డీఎస్పీ, పరిగి -
‘తుపాకీ’ ప్రకటనలకు ఫేస్బుక్ నో
న్యూయార్క్: అమెరికాలో తుపాకీ సంస్కృతిపై విపరీతమైన చర్చ నడుస్తున్న వేళ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. మైనర్ల(18 ఏళ్లలోపు వారు) ఫేస్బుక్ ఖాతాల్లో తుపాకుల విడిభాగాలు, అనుబంధ ఉపకరణాల ప్రకటనలు ప్రదర్శించడంపై నిషేధం విధించింది. మైనర్ల ఖాతాల్లో ఆయుధాలు, బుల్లెట్ల అమ్మకాల ప్రకటనల్ని ఫేస్బుక్ ఇప్పటికే నిలిపివేసింది. ఫేస్బుక్ తాజా నిర్ణయం ప్రకారం తుపాకీలను నడుముకు పెట్టుకునేందుకు వాడే బెల్టులు, హోల్స్టర్లతో పాటు ఫ్లాష్లైట్ల ప్రకటనల్ని నిషేధించారు. ఈ విధానం జూన్ 21 నుంచి అమల్లోకి రానుంది. -
లండన్ తుపాకీ చట్టాల్ని తప్పుపట్టిన ట్రంప్
లండన్: అమెరికాలో తన ప్రభుత్వం అనుసరిస్తోన్న తుపాకీ సంస్కృతిని సమర్థిస్తూ.. మరోవైపు లండన్‌లోని కఠినమైన తుపాకీ చట్టాల్ని హేళన చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం డాలస్‌లో నేషనల్ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏ) సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ‘లండన్‌లో జరిగిన ఒక అంశం గురించి ఇటీవల చదివాను. అక్కడ నమ్మలేనంత కఠినంగా తుపాకీ చట్టాలున్నాయి. అందువల్ల కత్తిపోటు గాయాలతో చేరిన జనాలతో ఒకప్పటి ప్రముఖ ఆస్పత్రి యుద్ధభూమిని తలపించిందట. ఎందుకంటే వారికి తుపాకులు లేవు.. కత్తులే ఉన్నాయి’ అని అపహాస్యం చేస్తూ మాట్లాడారు. ద.కొరియా అధ్యక్షుడు మూన్తో 22న ట్రంప్ భేటీ మరోవైపు, దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్–జె–ఇన్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈనెల22న సమావేశం కానున్నారు. శ్వేతసౌధంలో ట్రంప్‌తో జరిగే ఈ భేటీ సందర్భంగా ఉ.కొరియా అధినేత కిమ్‌తో గత వారం చర్చించిన అంశాలను మూన్ వివరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. కిమ్‌తో జరగబోయే భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలనూ ట్రంప్, మూన్‌లు చర్చించనున్నారు. -
బొమ్మ తుపాకీ అనుకొని అన్నను కాల్చేశాడు..
వాషింగ్టన్ : అమెరికాలోని గన్ కల్చర్ వల్ల కలిగే నష్టానికి, వీడియో గేమ్‌లు పిల్లల మీద చూపే దుష్ప్రభావానికి నిదర్శనంగా నిలిచింది ఈ సంఘటన. నిజమైన తుపాకీని... బొమ్మ తుపాకీగా భావించి ఏడేళ్ల సోదరుడిని కాల్చి చంపాడు ఐదేళ్ల తమ్ముడు. విషాదం నింపిన ఈ సంఘటన అమెరికాలోని వాషింగ్టన్లో చోటు చేసుకుంది. ఏడేళ్ల జెర్మన్ పెర్రి సౌత్ సెంట్ లూయిస్‌లోని తమ ఇంట్లో బెడ్రూమ్లో కూర్చుని వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. తల్లి వంటగదిలో ఉంది. పెర్రి తమ్ముడు చాక్లెట్ల కోసం తన తల్లిదండ్రుల గదిలోకి వెళ్లి కప్‌బోర్డులో వెతకడం ప్రారంభించాడు. కప్‌బోర్డులో చాక్లెట్లకు బదులు ఆ చిన్నారికి గన్ దొరికింది. దాన్ని తీసుకుని తమ గదిలోకి వెళ్లాడు. అక్కడ వీడియో గేమ్ ఆడుకుంటున్న సోదరుడిని కాల్చాడు. ఇదంతా ఆ పసివాడికి తాను నిత్యం ఆడే వీడియో గేమ్‌లానే తోచింది. ఇంతలో తుపాకీ పేలిన శబ్దం విన్న తల్లిదండ్రులు ఆ గదిలోకి వచ్చి చూసేసరికి పెర్రి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెర్రీ మృతి చెందాడు. మృతుడి తండ్రి జెరికో పెర్రీ తరుపు న్యాయవాది మాట్లాడుతూ బాలుడు ఉపయోగించిన తుపాకీకి లైసెన్స్ ఉందని తెలిపారు. -
విషాద పరంపర
తుపాకి సంస్కృతి మరోసారి అమెరికాలో నెత్తురు పారించింది. ఫ్లోరిడా రాష్ట్రం లోని పార్క్‌లాండ్ నగరంలో ఉన్న పాఠశాలలో ఒక ఉన్మాద యువకుడు సెమీ ఆటోమాటిక్ రైఫిల్ చేతబూని మూడంటే మూడే నిమిషాల్లో 17మంది పసివాళ్ల ఉసురుతీశాడు. మరో 15మందిని గాయపరిచాడు. వీరిలో ముగ్గురు మినహా మిగిలినవారికి ప్రాణాపాయం తప్పి ఉండొచ్చుగానీ ఈ ఉదంతం సృష్టించిన భయో త్పాతం వీరిని జీవితాంతమూ వెంటాడుతూనే ఉంటుంది. కొత్త సంవత్సరం ప్రారం భమై 45 రోజులవుతుండగా అక్కడి పాఠశాలల్లో తుపాకి పేలడం ఇది 18వసారి. 3,200 మంది చదువుకునే ఒక పాఠశాలలో అప్పటికే దాన్నుంచి బహిష్కృతుడైన ఒక ఉన్మాద విద్యార్థి ప్రవేశించి, పిల్లల్ని కాల్చుకుంటూ పోవడం ఊహించడానికే భయంకరమైన సన్నివేశం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా తీవ్ర సంతాపం ప్రకటించడం, ఊరడింపు మాటలు మాట్లాడటం అమెరికాలో మామూలే. అధ్య క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈసారి కూడా ఆ లాంఛనాన్ని పూర్తిచేశారు. దాంతోపాటు ఎప్పటిలాగే దృష్టి మళ్లించే ప్రయత్నం కూడా చేశారు. నిందితుడి మానసిక ఆరోగ్యం బాగా లేదన్నారు. నిరుడు టెక్సాస్ చర్చిలో ఒక ఉన్మాది 26మందిని కాల్చి చంపేసినప్పుడు కూడా ఆయన అచ్చం ఇలానే మాట్లాడారు. అప్పడు మాత్రమే కాదు... తుపాకి పేలినప్పుడల్లా ఆయనకు అందులో మానసిక అనారోగ్యమే సమస్యగా కనిపిస్తుంది. చదువుల బడులు జేమ్స్‌బాండ్ సినిమాల తరహాలో తుపాకి కాల్పులకు వేదికలు కావడం అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక్క అమెరికాలోనే కని పిస్తుంది. ఇది దాని ప్రారబ్ధం కాదు... చేజేతులా చేసుకున్నది. అమెరికా పౌరులకు తుపాకి కలిగి ఉండే హక్కు ఎన్నడో 1791లో అక్కడి రాజ్యాంగానికి చేసిన రెండో సవరణ ద్వారా అమల్లోకొచ్చింది. దీన్ని వదుల్చు కోవడానికి సరిగ్గా యాభైయ్యేళ్లక్రితం ఆ దేశానికి అవకాశం వచ్చింది. 1963లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీని దుండగులు కాల్చిచంపాక సాధా రణ పౌరులకు సులభంగా తుపాకులు అందుబాటులోకి రానీయొద్దన్న డిమాండు వచ్చింది. అయితే అది త్వరలోనే చల్లారిపోయింది. కానీ 1968లో పౌర హక్కుల ఉద్యమ నాయకుడు మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్, సెనెటర్ రాబర్ట్ ఎఫ్ కెనడీ సైతం ఇదే రీతిలో ప్రాణాలు కోల్పోయాక ఆ చర్చ మళ్లీ తలెత్తింది. అది సవ్యంగా కొనసాగి, ఒక అర్ధవంతమైన పరిష్కారం లభించి ఉంటే అమెరికా ఇప్పుడీ పరి స్థితుల్లో ఉండేది కాదు. కానీ ఆ సంవత్సరం తుపాకుల నియంత్రణ చట్టం అమల్లోకొచ్చింది. దాని ప్రకారం తుపాకుల అమ్మకందార్లు పోస్టు ద్వారా జరిగే అమ్మకాల్ని నిలిపేయాలి. అలాగే తుపాకి కొనేవారికి నేర చరిత్ర ఉందో, లేదో చూడాలి. మానసిక రోగులకు అమ్మకూడదు. ఇలాంటివే ఇంకా చాలా నిబంధనలు న్నాయి. కానీ అంగట్లో సరుకులమ్మినట్టు తుపాకులు అమ్మకూడదన్న నిషేధం మాత్రం లేదు. ఫలితంగా ఎవరైనా తుపాకి కొనుక్కోవచ్చు. వారికి దాంతో ఏం పని, ఎందుకు కొన్నారని ఆరా తీసే నాథుడు లేడు. ఆస్ట్రేలియాలో 1996లో ఉన్మాది ఒకడు 35మంది పర్యాటకుల్ని కాల్చిచంపినప్పుడు అక్కడి ప్రభుత్వం చురుగ్గా కదిలి పౌరుల వద్ద ఉన్న తుపాకుల్ని వెనక్కు ఇచ్చేయమని కోరింది. అందుకైన డబ్బు వెనక్కి ఇచ్చింది. అవి తప్పనిసరనుకుంటున్నవారు పోలీసులకు దరఖాస్తు చేసుకుంటే వారు తనిఖీ చేసి పర్మిట్ మంజూరు చేసే విధానం అమల్లోకి తెచ్చారు. బ్రిటన్‌లోనూ, ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ ఇలాంటి విధానమే అమల్లో ఉంది. తుపాకులు విచ్చలవిడిగా లభించేచోట వాటివల్ల ముప్పు ఎక్కువ ఉంటుం దని, పకడ్బందీ నియంత్రణలున్నచోట తీవ్రత తక్కువుంటుందని ఇంగితజ్ఞానం ఉన్నవారికి అర్ధమవుతుంది. కానీ రిపబ్లికన్ పార్టీకి ఆ జ్ఞానం లేదు. బరాక్ ఒబామా పదవిలో ఉన్నప్పుడు ఈ తుపాకుల సంస్కృతిని ధ్వంసం చేయాలని గట్టిగా ప్రయ త్నిస్తే రిపబ్లికన్లు దాన్ని సాగనివ్వలేదు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ)కు వత్తాసుగా, దానికి లబ్ధి చేకూరేలా మొదటినుంచీ అది వ్యవహరిస్తోంది. ప్రపం చంలో పౌరుల దగ్గరున్న తుపాకుల్లో సగం అమెరికా వాసుల్లోనే ఉన్నాయని గణాం కాలు చెబుతున్నాయి. అలాగని అమెరికాలో అందరికీ ఈ పిచ్చి లేదు. జనాభాలో 3 శాతంమంది వద్ద మాత్రమే తుపాకులున్నాయి. అయితే వీరిలో ఒక్కొక్కరి వద్ద సగ టున 40 తుపాకులుంటాయని అంచనా. మొత్తంగా పౌరుల దగ్గరున్న తుపాకుల సంఖ్య 13 కోట్ల 30 లక్షలు. ఇవి నిరుడు వెలువడిన గణాంకాలు. విషాదమేమంటే 1968 నుంచి ఇంతవరకూ తుపాకుల కారణంగా అమెరికాలో మరణించినవారి సంఖ్య ఆ దేశ చరిత్రలో జరిగిన మొత్తం యుద్ధాలన్నిటిలో చనిపోయినవారి అమె రికన్ల సంఖ్య కన్నా చాలా ఎక్కువ. ఏటా అమెరికాలో తుపాకి హింసతో 33,000 మంది చనిపోతున్నారు. ఇందులో మూడింట రెండొంతులు ఆత్మహత్యలు, మిగిలి నవి హత్యలు. గాయపడేవారి సంఖ్య 70వేల పైమాటే. తుపాకులు లేకుండా చేయా లన్న డిమాండు అరణ్యరోదన అవుతుండగా, ఆ బూచి చూపించి ఇతరేతర వ్యాపా రాలు విస్తరిస్తున్నాయి. పిల్లలకు బుల్లెట్ ప్రూఫ్ బ్యాక్‌ప్యాక్‌లు అమ్మడం మొదలు కొని పాఠశాలల పకడ్బందీ రక్షణ బాధ్యత తీసుకుంటామంటూ సొమ్ము చేసుకునే సంస్థల వరకూ అనేకం వెలుస్తున్నాయి. వాటి వ్యాపారం విలువ నిరుడు దాదాపు 300 కోట్ల డాలర్లు! ఇలాంటి విపత్కర పరిస్థితికి దేశం చేరుకుంటే డోనాల్డ్ ట్రంప్ ఎప్పటి మాదిరే ‘మానసిక అనారోగ్యం’ వాదన తీసుకురావడమంటే అమెరికా ప్రజల్ని వంచిం చడమే. మళ్లీ ఒకటి, రెండు వారాల్లో ఇవే ఘటనలు పునరావృతం కావడానికి దోహదపడటమే. ఎటునుంచో ఉగ్రవాదులు చొరబడి దురంతాలకు పాల్పడతారని అనుక్షణం వణికే అమెరికా సమాజం తనలో అంతర్లీనంగా తిష్ట వేసుకుకూర్చున్న శత్రువు జాడను పసిగట్టలేకపోతోంది. దానికి వ్యతిరేకంగా బలమైన స్వరం విని పించలేకపోతోంది. కత్తి అంచున సాగే తన ప్రయాణంలో ప్రతి అడుగూ ప్రాణాంత కమైనదేనని గుర్తించనంతవరకూ... దాన్ని సరిదిద్దుకోనంతవరకూ అమెరికాకు ఇలాంటి విషాద ఉదంతాలు తప్పవు. -
బీరు కొనడం కష్టం... తుపాకీ ఈజీ
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓ పాఠశాలలో ఉన్మాదిగా మారిన ఓ 19 ఏళ్ల విద్యార్థి నికోలస్ క్రజ్ నిర్ధాక్షిణ్యంగా 17 మంది విద్యార్థులను కాల్చి చంపిన విషయం తెల్సిందే. అందుకు ఆ విద్యార్థి ఉపయోగించిన ఆయుధం ‘ఏఆర్–15’ పిస్టల్. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో కాలిఫోర్నియా, న్యూయార్క్ రాష్ట్రాలు మాత్రమే ఈ పిస్టల్ అమ్మకాలను నిషేధించాయి. 21 ఏళ్లున్న వ్యక్తులకు మాత్రమే ఈ పిస్టల్‌ను అమ్మాలని అమెరికా ఫెడరల్ చట్టం సూచిస్తోంది. 18 ఏళ్లకే తుపాకులు విక్రయించవచ్చని పలు రాష్ట్రాలు చట్టాలు చెబుతుండడంతో ఆ ఏడుకే ఏఆర్–15 లాంటి పిస్టళ్లను కూడా ఆయుధ దుకాణాలు స్వేచ్ఛగా అమ్ముతున్నాయి. అందుకనే 19 ఏళ్ల నికోలస్ క్రజ్ కూడా సులభంగానే ఈ లైసెన్స్డ్ పిస్టల్‌ను సులభంగానే కొన్నాడు. తాను ఇలాంటి పిస్టల్‌ను కొని తోటివారిని కాల్చబోతున్నట్లు కూడా ఆన్లైన్లో గతంలోనే హెచ్చరించారట. అలాంటప్పుడు ఆ విద్యార్థి గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, ఆయుధ సంస్థలకు ఆయన ఫొటో పంపించడం లాంటి చర్యలేవీ పోలీసులు తీసుకోలేదు. అమెరికాలో తుపాకీ సంస్కృతికి ఎంతో మంది మరణిస్తున్నప్పటికీ తుపాకీ విక్రయాలను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 21 ఏళ్లలోపు బీరు తాగడానికి వీల్లేదనే చట్టాన్ని మాత్రం దేశంలో కఠినంగా అమలు చేస్తారుగానీ, తుపాకులను అమ్మరాదనే చట్టాన్ని మాత్రం కఠినంగా ఎందుకు అమలు చేయరాదని పాఠశాల దుర్ఘటనలో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. హంతకుడుగా మారిన విద్యార్థి ట్రంప్ లాంటి టోపీని ధరించడం కూడా దేశం ఎటు పోతుందా? అన్న దానికి సూచికగా మారిందని వారంటున్నారు. -
ఉలిక్కిపాటు.. స్కూళ్లలో తుపాకుల కలకలం
వాషింగ్టన్ : అమెరికాలోని పలు పాఠశాలలో తుపాకులు లభ్యం కావటం కలకలం రేపుతోంది. ఫ్లోరిడా మారణహోమం తర్వాత అప్రమత్తమైన అధికారులు పలు స్కూళ్లలో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో తుపాకులను కలిగి ఉన్న పలువురు విద్యార్ధులను అరెస్ట్ చేయగా.. తల్లిదండ్రులు ఉలిక్కి పడ్డారు. గురువారం ఉత్తర టెక్సాస్‌లోనే ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్లవర్ మౌండ్ మర్కస్ హైస్కూల్లో తుపాకీ, మందు గుండు సామాగ్రితో ఉన్న ఓ విద్యార్థి(16)ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తోటి విద్యార్థులు అందించిన సమాచారం మేరకు ప్లానో వెస్ట్ హై స్కూల్లో ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా వారిని అరెస్ట్ చేశామని అధికారులు తెలియజేశారు. గార్లాండ్‌లో చోటు చేసుకున్న ఘటనలో మరో విద్యార్థిని అరెస్ట్ చేశారు. సౌత్ గార్లాండ్ హైస్కూల్లో సెల్ ఫోన్ దొంగతనం అయినట్లు ఫిర్యాదు అందగా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి బ్యాగ్‌లో తుపాకీ దొరికింది. ఇక మరో రెండు చోట్ల దాడులకు పాల్పడతామని బెదిరించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. అర్లింగ్టన్లోని నికోలస్ జూనియర్ హైస్కూల్లో ఓ విద్యార్థి(13)ని, వెదర్ఫోర్ట్ హైస్కూల్లో ఓ బాలికను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందని.. అయితే వాటిని తేలికగా తీసుకోకుండా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ తల్లిదండ్రులను ఉద్దేశించి పోలీస్ శాఖ ఓ లేఖ విడుదల చేసింది. ఫ్లోరిడా రాష్ట్రంలో పార్క్‌లాండ్ మేజరీ స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్లో 19 ఏళ్ల మాజీ విద్యార్థి విచ్చలవిడిగా కాల్పులకు దిగి 17 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన తెలిసిందే. -
పెళ్లి పార్టీలో కాల్పులు.. వధువు మృతి
చంఢీఘడ్ : పంజాబ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి సంబరాల్లో ఒకరి అత్యుత్సాహం పెళ్లికూతురు ప్రాణాలను తీసింది. ఈ ఘటన హోషియార్ పూర్లో గత శనివారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన చరణ్‌జిత్ తన కూతురు సాక్షి అరోరా వివాహం వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. పెళ్లి వేడుకల్లో భాగంగా శనివారం డీజే పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ వేడుకను వధువు భవనంపై నుంచి తిలకిస్తోంది. ఇంతలో పెళ్లికి వచ్చిన అతిధుల్లో ఒకరు అత్యుత్సాహంతో తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోని ఓ బుల్లేట్ భవనంపై ఉన్న వధువు తలకు తగలడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో పెళ్లి వేడుకలో విషాదం అలముకుంది. మృతురాలి తండ్రి చరణ్‌జిత్ ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 302, 34, ఆయుధాల వినియోగ చట్టాల కింద కేసు నమోదు చేశారు. చరణ్ జిత్ స్నేహితుడు, నిందితుడైన ఖోస్లాను అరెస్టు చేసి లైసెన్స్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అశోక్ పరారీలో ఉన్నాడు. ఇక వివాహ వేడుకల్లో గన్ కల్చర్ శృతి మించుతోంది. గతంలో హర్యానాలోని ఓ పెళ్లి సంగీత్‌లో ఇలానే అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరపడంతో వరుడు మృతి చెందాడు. -
గన్ సేఫ్టీపై చర్చిస్తూనే.. చర్చిలో కాల్పులు
న్యూయార్క్: అమెరికాలో జనరల్‌గా నిర్వహించుకునే థాంక్స్ గివింగ్ మీల్ అనుకోని ప్రమాదానికి దారితీసింది. ఇటీవల టెక్సాస్ చర్చిలో జరిగిన కాల్పుల దుర్ఘటన నింపిన విషాదాన్ని తలుచుకుంటూ ఉండగా..మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. పెరుగుతున్న గన్ కల్చర్, ముఖ్యంగా చర్చిలో జరుగుతున్న కాల్పులు, హింసపై అక్కడ కొంతమంది పెద్ద వాళ్లు( సీనియర్ సిటిజన్స్) చర్చిలో సమావేశమయ్యారు. మృతులకు నివాళులర్పించిన అనంతరం కాల్పులు, తదనంతర పరిణామాలు, గన్ సేఫ్టీపై చర్చించుకుంటున్నారు. కానీ తామూ తుపాకి కాల్పుల బాధితులమవుతామని...ఆ ఆహ్లాదకరమైన మధ్యాహ్నం ..భయంకరమైన మలుపు తిరుగుతుందని అస్సలు ఊహించలేదు వారిలో ఓ వృద్ధ జంట. ఏం జరిగిందో తెలుసుకునే లోపే క్షణాల్లో తుపాకీ గుళ్లు ఆ దంపతుల శరీరంలోకి దూసుకుపోయాయి. వివరాల్లోకి వెడితే.. న్యూయార్క్‌లోని ఈస్ట్ టెన్నెసీ చర్చ్‌లో థాంక్స్ గివింగ్ విందును ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 20 మంది సీనియర్ సిటిజన్లు ఈ విందు హాజరయ్యారు. వారిలో యునైటెడ్ మెథడిస్ట్ చర్చి సభ్యుడు పెద్దాయన (81) తన వెంట తెచ్చుకున్న తుపాకిని చూపించి, దాని వాడాలో అక్కడున్న వారికి వివరించాడు. 38-కాలిబర్ రగ్గర్ హ్యాండ్ గన్ను ఓపెన్ చేసి ,మ్యాగజైన్ లోడ్ చేసి అక్కడున్నవారికి చూపించాడు. దాన్ని అలాగే పక్కన పెట్టాడు. ఇంతలో మరో సభ్యుడు తనకూ చూపించమంటూ..వెంటనే ట్రిగ్గర్ నొక్కాడు. అంతే క్షణాల్లో బుల్లెట్ పెద్దాయన అరచేతిలోంచి...పక్కనే వీల్ చైర్లో కూర్చుని వున్న భార్య (80) పొట్ట, ముంజేతిలోకి దూసుకుపోయింది. అయితే ప్రమాదవశాత్తూ జరిగిన ఈ కాల్పుల్లో గాయపడిన భార్యాభర్తలిద్దరి ఆరోగ్యపరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందనీ, ఎవరిమీదా కేసు నమోదు చేయలేదని పోలీసు ఉన్నతాధికారి రుస్ పార్క్స్ తెలిపారు. ఇటీవలి మాస్ షూటింగ్ నేపథ్యంలో స్థానిక చర్చిలలో సెమినార్లు నిర్వహించాలని కౌంటీ షెరీఫ్ విభాగం నిర్ణయించడంతో వీరు కూడా సమావేశమయ్యారని తెలిపారు. కాగా టెక్సాస్‌లోని చిన్నపట్టణం విల్సన్ కంట్రీలోని సుదెర్‌ల్యాండ్‌లో ఉన్న ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో 26 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. -
‘గన్ కల్చర్’ చేసిన మరో గాయం
సందర్భం తన ప్రజలకు తాను అనాలోచితంగా ఇచ్చిన అనర్ధదాయక స్వేచ్ఛ వల్ల పిల్లలు, పెద్దలు, ఎలా పడితే అలా తుపాకులు వాడి కాల్చేసే ఒక సమాజ వ్యవస్థను తనపై తానే విధించుకున్నది కూడా ఆ దేశమే. దీని పర్యవసానమే వంటింటి పట్టకార్లూ, గరిటలూ, తోట పని పారలూ, బొరిగెలూ కొన్నట్టుగా, మారణాయుధాలను అతి తక్కువ నియంత్రణ, నిబంధనలతో అమెరికాలో సాధారణ పౌరులు కొనుగోలు చేయగలరు. మూడేళ్ల పిల్లలు సైతం వాటిని ఉపయోగించగలరు. దాని పర్యవసానం మరీ దారుణం. ఆకు రాలు కాలంలో అమెరికాలో జరిగే పంటల పండుగలే హార్వెస్ట్ ఫెస్టివల్స్. ఆ ఏడాది కొత్త పంటలు అమ్మవార్లకు నివేదించనిదే తినని ఆచారాలు ఇప్పటికీ మన గ్రామీణుల్లో, గిరిజనుల్లో ఉన్నాయి. వాటిలో ఒక ఆచారాన్ని ‘కంది కొత్తలు’అంటారు. దేశాలు ఎంత ఆధునికం అయినా నేలకూ, నీటికీ, పంటలకూ, మనుషులకూ ఉండే విడదీయరాని సంబంధాలే మన దేశపు బతుకమ్మ పండుగలైనా, సంక్రాంతి గొబ్బెమ్మలైనా, భోగిపిడకల దండలైనా! అమెరికా దేశం నలుమూలలా శిశిరంలో జరిగే ఇరవై ఒక్క పంటల పండుగలు ఇచ్చేదైనా ఇదే సందేశం. ఇదే సంబరం వాటి మూలతత్వం. ఆ పండుగ వేళల్లో వంటకాలూ, పాటలూ, ఆటలూ, పోటీలూ, ఒక ‘పచ్చనాకు సాక్షిగా జీవించే’మానవ సమాజపు సహజమైన ఉత్సవం. ఇలా అక్టోబర్‌ఫెస్ట్ నుంచి వైన్ ఫెస్ట్‌ల దాకా (ఫెస్ట్ అంటే జాతర/తిరునాళ్ళ, అమెరికాలో అయినా సరే) అమెరికాలో ఏటేటా జరుగుతాయి. పండుగ మీద ప్రతాపం సమస్త ఉత్పత్తులకూ, శ్రమకూ అమెరికాలో జరుపుకునే పండుగలు ఇవి. కాయగూరలూ(ఒహియో), గుమ్మడి కాయల పండుగలూ(కొలరాడో), గొర్రెల పండుగలూ (ఇదాహొ), ఎద్రియోన్ డాక్ గాలిగుమ్మటాల పండుగలూ (న్యూయార్క్), క్రేన్ బెర్రీ ఫెస్టివల్ (మెసాచూసెట్స్), ఆర్బోరేటమ్లో ఆటమ్ రుతువు అంటూ డెబ్భై అయిదు వేల గుమ్మడికాయలూ, ఆనపకాయలతో చేసే అలంకరణ పండుగలూ (డల్లాస్, టెక్సాస్‌లలో), మేడిసన్ కంట్రీ కవర్డ్ బ్రిడ్జ్ ఫెస్టివల్, సోనొమా కంట్రీ హార్వెస్ట్ ఫెస్టివల్ (వైన్ తయారీ కోసం ద్రాక్షపళ్ళు కాళ్లతో తొక్కే –గ్రేప్ స్టోంపింగ్– పోటీలు ఉంటాయి), సెయింట్ చార్లీలో దిష్టిబొమ్మల పండుగలూ, పెకన్ గింజల డుగ (నార్త్ కరొలినా), కోనా కాఫీ పండుగ (కోనా, హవాయి), హుడ్ రివర్ వేలీ ఫెస్టివల్ (హుడ్ రివర్, ఆరెగాన్), జర్మన్ సంప్రదాయ వంటల పండుగ జిన్ జిన్నాట్టి, (సిన్సినాటీలో), నేషనల్ ఆపిల్ హార్వెస్ట్ ఫెస్టివల్ (పెన్సిల్వేనియా), వారెన్స్ క్రేన్ బెర్రీ ఫెస్టివల్ (విస్కాన్సిన్), హెరిటేజ్ హార్వెస్ట్ ఫెస్టివల్ (మాంటిసెల్లో, వర్జీనియా), వెర్మూంట్ పంప్కిన్ చకింగ్ ఫెస్టివల్ (స్టౌవే, వెర్మాంట్), ఫాల్ ఫర్ గ్రీన్ విల్లే (ఆ ఊరి నలభై హోటళ్ల వంటకాల పండుగ), అకడియా నేషనల్ ఫెస్టివల్ (ఆకడియా, మెయిన్)... ఇలా పంటల, పొలాల, వంటల వినోదాల గ్రామీణ అమెరికా జరుపుకునే సంబరమే మొన్న లాస్‌వెగాస్‌లో జరుగుతున్నది కూడా. అంటే అది కూడా ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. మనకు కావలసింది ఈ పచ్చని అమెరికా పది కాలాలు జీవించడం. పరమ వికృతులు చేసే పని ఇక్కడ ఈ ప్రజలపైనే మనకు సానుభూతి. అక్కడ విచ్చలవిడిగా తుపాకులు కొనుక్కోనిచ్చే తుపాకుల వ్యాపారుల సంఘంతో కాదు. అస్సాల్ట్ రైఫిల్స్, హై కెపాసిటీ బరస్ట్ ఆటోమేటిక్ ఆయుధాలు సామాన్య పౌరులకు ఎంతో తేలిగ్గా అమ్మే దేశం అమెరికా. ఈ పంటల పండుగలో ఆటా, పాటా, ఆహారం కోసం గుమిగూడి, హాయిగా పాల్గొంటున్న బతుకు సందళ్ల కలుపుగోలు అమెరికా సమాజంపై కాల్పులు జరిపినవాడు– అరవై నాలుగేళ్ల తాతయ్య వయసు వ్యక్తి. ఒక హోటల్ ముప్పయ్ రెండో అంతస్తు నుంచి పది నిమిషాల పాటు, సెకనుకు ముప్పయ్ తూటాలు పేల్చే శక్తి గల మారణాయుధాలతో నిరాయుధులు, సంబరాల్లో పాల్గొన్న, సంతోష హృదయులూ, స్త్రీ, బాల, వృద్ధులున్న సమూహం మీద కాల్పులు జరపడం ఇరవయ్యొకటో శతాబ్దపు వికృతరూపులు మాత్రమే చెయ్యగల పని. అమెరికా ప్రజల ఈ జీవోల్లాసాలను ఎంతగా అయినా ప్రేమించవచ్చు. అదే సమయంలో ఒక సైనిక, సాంకేతిక, సామ్రాజ్యవాద, ఏకధృవ పెట్టుబడిదారీ వ్యాపార ధోరణులతో, తానే ప్రపంచం అనుకునే అమెరికా తన ప్రజలను ఎటు వైపు తోస్తున్నదీ అన్నదే ప్రశ్న. ప్రపంచపటంలో నూట డబ్బయ్ ఏడు దేశాల్లో, ఎనిమిది వందల సైనిక కేంద్రాలతో, ఏడాదికి నూరు బిలియన్ల డాలర్లు వీటిపై ఖర్చు పెడుతున్న దేశం. ఇంతకన్నా ఆధిపత్య జోక్యందారీ విధానం ఏదన్నా ఉంటుందా? ఇంతకు ముందు ఏ దేశంలోనైనా, ఎంత వలస పాలనలోనైనా ఉన్నదా అన్నదే పెద్ద ప్రశ్న. అమెరికా అంటేనే ఆయుధాల పోటా పోటీ ఉత్పత్తి. అణ్వాయుధాల తయారీకి పరుగులు. చివరికి తన పారిశ్రామిక, సైనిక విధానాల వలన పర్యావరణ పరంగా కూడా, అతి పెద్ద హానికారక దేశంగా ప్రపంచ దేశాలు నిందిస్తున్నాయి. అయినా తాము అనుసరించే విధానాలకు, పర్యావరణకు జరుగుతున్న నష్టానికి ఏ సంబంధమూ లేదని బీరాలు పలుకుతున్న దేశం అది. ఆ నష్టంతో తమకు ఏమీ సంబంధం లేదని పర్యావరణ ప్రపంచ స్థాయి సదస్సులలోనే చేతులు దులుపుకోగలిగిన అవకాశవాద దేశం అమెరికా. తన ప్రజలకు తాను అనాలోచితంగా ఇచ్చిన అనర్ధదాయక స్వేచ్ఛ వల్ల పిల్లలు, పెద్దలు, ఎలా పడితే అలా తుపాకులు వాడి కాల్చేసే ఒక సమాజ వ్యవస్థను తనపై తానే విధించుకున్నది కూడా ఆ దేశమే. దీని పర్యవసానమే వంటింటి పట్టకార్లూ, గరిటలూ, తోట పని పారలూ, బొరిగెలూ కొన్నట్టుగా, మారణాయుధాలను అతి తక్కువ నియంత్రణ, నిబంధనలతో అమెరికాలో సాధారణ పౌరులు కొనుగోలు చేయగలరు. మూడేళ్ల పిల్లలు సైతం వాటిని ఉపయోగించగలరు. దాని పర్యవసానం మరీ దారుణం. అమెరికాలో ఇంతవరకూ1968 – 2011 మధ్య కాలంలో తుపాకీ కాల్పుల దురంతాల్లో చనిపోయిన వారి సంఖ్య లక్షలలోనే ఉంది. ఆ దేశమే ఇస్తున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇంతవరకూ (240 రోజులకు) 244 కాల్పుల సంఘటనలు జరిగాయి. చిల్లర మల్లర లెక్కేస్తే ఒక్క ఏడాదిలో ఇప్పటి వరకూ, 44, 695 సంఘటనలుగా చెబుతున్నారు. చనిపోయిన వారు పదకొండు వేల ఆరు వందల ఎనభై ఆరు. ఎంత భద్రత ఉన్నదీ సమాజంలో! మన ఆలోచనలకు విరుద్ధమైన ఆలోచనలున్నవారిని కాల్చేస్తూ ఈ సంస్కృతిని మనమూ అనుకరిస్తున్నామా? సొంతింటిని చక్కబరుచుకోలేరు ప్రపంచాన్ని కలవరపరుస్తున్నప్పటికీ ఇలాంటి దుర్దశ గురించి అమెరికాలో ఏ చట్టసభలూ మాట్లాడవు. ఏ సెనేటర్లూ ఈ విషయమై రాజీనామా చేయరు. వీరు తమ దేశాన్ని కాపాడుకోలేని వారు. తుపాకులకు మించిన సహన సంపదే దేశ ప్రగతికి కీలకం అని నేతలు ప్రజలకు బోధించలేరు. పౌరులకు గల జీవించే హక్కు ఎవరూ భంగపరచ వీల్లేనంత విలువ గలదని చెప్పలేరు. ఇతర దేశాలపై మాత్రం తమ ఆధిపత్య వికృతాలకు దౌత్యనీతి అని పేర్లు పెట్టగలరు. వీరిని ‘ఇరవయ్యో శతాబ్దపు వికృత శిశువులు’ అన్నాడు బ్రిటిష్ చరిత్రకారుడు ఆర్నాల్డ్ టాయన్ బీ(1889 – 1975). ప్రపంచ సంపదలను తమ దేశానికి అవసరమైనంత మేరకు ప్రజాస్వామ్యపరంగా పొందగల హక్కు ప్రపంచంలో ప్రతీ దేశానికి ఉన్నదన్న స్పృహ లేకుండా, ఆ న్యాయబద్ధమైన పంపిణీ నిర్వహణను ఒక పెద్దన్నగా చేయవలసిన బాధ్యత వదిలిపెట్టి, ఒక ప్రపంచ దురహంకారిగా మారిన దేశం అమెరికా. ఆ దేశం ఇప్పుడు తన ఇంట్లో తనే ఎలా బొక్క బోర్లా పడుతున్నదో చూస్తుంటే సామాజిక అధ్యయనవేత్తలకు ఆందోళన కలుగుతున్నది. గన్ కల్చర్‌కు స్వస్తి పలకాలి అమెరికా ఇప్పటికైనా తమ గన్ కల్చర్ శాసనాలు, పౌరులు తుపాకులు కలిగి ఉండే హక్కు గురించి తక్షణమే సమీక్షించుకోవాలి. దాదాపు మనిషికొక్క తుపాకీ నిష్పత్తి దాటిపోయి ముప్పయి ఒక్క కోట్ల తుపాకులు ఆ దేశ పౌర సమాజం వద్ద ఉన్నాయి. అలాంటి సమాజం ఎంత కట్టుబాటులో, ఎంత నియంత్రణలో ఉండగలదు? ఈ ఫొటో చూడండి, ఇది అమెరికాను వెంటాడుతున్న తుపాకీ మశూచి. దీన్ని ఆపాలంటే, ఏ ప్రజాస్వామిక ఔదార్య విలువలతో ఆ దేశం ఏర్పడిందో, వాటి సాయం తోనే ఈ దిగజారుడునీ, తమ బతుకుల చుట్టూ అకాల శ్మశానాలను నిర్మించుకోవడమనే విషాదాన్నీ ఆపగలదు. ఆ దిశగా తుపాకీ ఉన్మాదాల అమెరికా కృషి చేయాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. వ్యాసకర్త ప్రముఖ కవి విమర్శకుడు మొబైల్: 9849200385 రామతీర్థ -
గన్ కల్చర్..!
♦ జిల్లా వాసులను కలవరపెడుతున్న తుపాకీ సంస్కృతి ♦ పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న కిరాయి హంతకులు ♦ పక్కా ప్రొఫెషనల్స్‌ను దించుతున్న నేరస్తులు ♦ ఒకే ఒక్క బుల్లెట్‌తో ప్రాణాలు తీసే సమర్ధులు ♦ పోలీసులకు సవాలుగా మారుతున్న తాజా పరిణామాలు విజయనగరం.. ప్రశాంతతకు మారుపేరు. వివిధ సంస్కృతులకు ఆలవాలం. విద్యల నగరంగా ప్రసిద్ధి. అలాంటి జిల్లాలో తుపాకీ సంస్కృతి రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కక్షలు తీర్చుకునేందుకు నేరాలు చేయడంలో ఆరితేరిన వారిని, ఒకే బుల్లెట్‌తో ప్రాణాలు తీసేవారిని వినియోగిస్తుండడం పోలీసులకు సవాల్‌గా మారింది. ‘జూలై 22 శనివారం రాత్రి 9 గంటల సమయం.. పార్వతీపురంలో దుకాణం మూసేసి ఇంటికి తిరిగి వచ్చిన మురళీకృష్ణ ఇంటిలోపలికి వెళ్లేలోపే తుపాకీ కాల్పులకు బలైపోయాడు, ఒకే ఒక్క బుల్లెట్‌తో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.’ ‘ఏప్రిల్ 16న సరిగ్గా సాయంత్రం 6.30 గంటలకు నడక కోసం వెళ్లి తిరిగి వస్తున్న వ్యక్తిపై బొబ్బిలి కోటి చెరువు వద్ద కాల్పులు జరిగాయి. బాధితుడు గాయాలతో తప్పించుకున్నాడు’. సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలోనే ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లాలో తుపాకీ కాల్పులు కలవరపెడుతున్నాయి. కంట్రీ మేడ్ పిస్టల్స్‌తో ప్రాణాలు తీసే సంస్కృతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కేవలం ఒకే ఒక బుల్లెట్‌తో మనిషి ప్రాణాలను తీసే ప్రొఫెషనల్ కిల్లర్స్‌ను దించి హత్యలు చేయిస్తున్నారంటే జిల్లాలో నేరాల ప్రయాణం ఏ దిశగా వెళుతుందో అర్ధం చేసుకోవచ్చు. అనునిత్యం తమ రూపాన్ని, స్వరూపాన్ని మార్చుకుంటూ ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్న నేరస్తులు, వారు అనుసరిస్తున్న విధానాలు పోలీసులకు పెనుసవాళ్లు విసురుతున్నారు. ఒకే ఒక్క బుల్లెట్.. పార్వతీపురం వ్యాపారి మురళీకృష్ణ హత్య కేసుతో పోలీసులకు ఓ విషయం స్పష్టంగా అర్ధమైంది. కంట్రీ మేడ్ పిస్టల్‌ను ఉపయోగించి పక్కా ప్రొఫెషనల్స్ ఈ హత్యకు పాల్పడ్డారు. అది కూడా డబ్బుల కోసం హత్యలు చేసే కిరాయి హంతకులు. అలాగని ఇదేదో పెద్ద ముఠా, దీనికెవరో డాన్ ఉన్నాడనుకుంటే పొరపాటు. ఈ ఆపరేషన్‌లో నేరుగా పాల్గొన్నది కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే. వారు మాత్రం పిస్టల్ వాడటంలో సిద్ధహస్తులు. బుల్లెట్ వృథా కాకుండా 7.65 ఎంఎం పిస్టల్‌లోని ఒకే ఒక బుల్లెట్‌తో అతి సమీపం నుంచి (పాయింట్ బ్లాంక్) కాల్పులు జరిపారు. బైక్ స్టాండ్ వేస్తున్న వ్యాపారి ఎవరో మాట్లాడటానికి తనవైపు వస్తున్నారనుకున్నాడు. వచ్చిన వారు వ్యాపారికి తప్పించుకనే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆయన చూస్తుండగానే కాల్పులు జరిపారు. అది కూడా ఒక్క బుల్లెట్‌కే ప్రాణం పోయే తలభాగంలో కాల్చారు. పని కాగానే అక్కడి నుంచి పరారయ్యారు. కిరాయి తీసుకుని మనుషుల్ని చంపే వాళ్లు మాత్రమే ఇంత పక్కాగా ప్లాన్ చేసి కాల్చగలరు. సింగిల్ మేన్ గ్యాంగ్.. ఒడిశాలో మావోయిస్టుల నుంచి రక్షణ కోసమంటూ 7.65 ఎంఎంæ పిస్టల్స్‌ను కొంతమంది తమ దగ్గరపెట్టుకుంటుంటారు. అలాంటి వారెవరున్నారనేది తెలుసుకున్న మరికొందరు వారిని కలుసుకుని సుపారీ ఇచ్చి హత్యలు చేయిస్తున్నట్టు సమాచారం. ఈ కిల్లర్స్‌కి సాధారణంగా బాస్లంటూ ఎవరూ ఉండరు. తమ వద్ద ఉన్న పిస్టల్‌తో హత్యలు, ఇతర నేరాలు చేయడాన్ని స్వయం ఉపాధిలా భావిస్తుంటారు. కిరాయి తీసుకుని టార్గెట్‌ను కొంతకాలం గమనించి అప్పుడు ప్లాన్ గీసి యాక్షన్‌లోకి దిగుతున్నారు. వీరికి స్థానికంగా కొందరు గైడ్‌లా ఉపయోగపడుతుంటారు. ఆపరేషన్ పూర్తికాగానే కాంటాక్ట్ నంబర్లన్నీ మార్చేసి తమ స్వస్థలానికి వెళ్లిపోయి రోజువారీ పనులు చేసుకుంటారన్నది సమాచారం. ఈ మొత్తం ఆపరేషన్‌లో తమ ప్రాణాలను సైతం వారు పణంగా పెడుతున్నారు. తుపాకులతో పోలీసులకు చిక్కితే, ఆ సమయంలో ఎదురుకాల్పులు జరిగితే వారి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అయినా ఇలాంటి పనులను ఒప్పుకుంటున్నారు. దీనికి కిరాయి కూడా భారీగా ఏమీ తీసుకోరు. తమకు సుపారీ ఇచ్చిన వ్యక్తికి తాము చేయబోయే హత్య వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాన్ని బట్టి దానిలో పర్సంటేజీ ప్రకారం కిరాయి నిర్ణయిస్తుంటారన్నది వినికిడి. దీని వల్ల ఒక్కో హత్యకు ఒక్కో రేటు ఉంటుంది. ఇలాంటి నేరస్తులు జిల్లాలో ప్రవేశించడం ఇప్పుడు సంచలనమవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచే.. పార్వతీపురం వ్యాపారి హత్యలో ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు మా విచారణలో తేలింది. వారు కిరాయి హంతకులు. పిస్టల్ వాడడంలో నిష్ణాతులు. వారికి ఇక్కడ కొందరు సహకరించారు. అయితే, పాత కక్షల వల్ల హత్య జరిగిందా లేక ఆర్థిక లావాదేవీలేమైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. దీని కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. వాటిలో ఒక టీం నోట్ల రద్దు దగ్గర్నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఆర్థి«క లావాదేవీలను పరిశీలిస్తుంది. మరో టీం సాంకేతిక సాక్ష్యాలను సేకరిస్తుంది. మూడో టీం కిరాయి హంతకుల గురించి ఆరా తీస్తుంది. నాలుగో బృందం స్థానికంగా హంతకులకు సహకరించిన వారి గురించి కూపీ లాగుతుంది. స్థానిక వివాదాల గురించి ఐదో బృందం అధ్యయనం చేస్తుంది. జిల్లాలో సుమారు 14 మాత్రమే లైసెన్డస్ తుపాకులు ఉన్నాయి. వాటిని కూడా రెన్యువల్ చేయలేదు. అవన్నీ పోలీస్‌ల ఆధీనంలోనే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచే హంతకులు వస్తున్నారు. –జి.పాలరాజు, జిల్లా ఎస్పీ -
రాజధానిపై ‘తుపాకీ’!
పెరుగుతున్న గన్ కల్చర్.. కబ్జాలు సెటిల్మెంట్లలో తుపాకుల వినియోగం విజయవాడ కేంద్రంగా విడిభాగాల దిగుమతి! ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల్లో పోలీసుల తనిఖీలు సాక్షి, అమరావతి బ్యూరో/చిట్టినగర్: ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి, విజయవాడల్లో ఉత్తర భారతదేశంలో మాదిరి తుపాకీ సంస్కృతి పెరుగుతోందా? తుపాకుల వినియోగం ఎక్కువైందా? అందుకు తగినట్టుగా విడి భాగాలు దేశ రాజధాని ఢిల్లీ నుంచి దిగుమతి అవుతున్నాయా? పోలీసుల్లో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత రాజకీయ, ఆర్థిక కార్యకలాపాలు పెరిగిపోయాయి. వాటితో పాటే భూ కబ్జాలు, సెటిల్మెంట్లు ఎక్కువయ్యాయి. ఎంతగా అంటే అనంతపురం నుంచి విజయవాడకు వచ్చి ఇంటిని కబ్జా చేసే స్థాయికి చేరాయి. ఇలాంటి వివాదాల్లో తుపాకుల వినియోగం ఎక్కువైందని, తుపాకులతో బెదిరించడం వంటి చర్యలు ఎక్కువయ్యాయని పోలీసువర్గాల సమాచారం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంలోనూ తుపాకీ వినియోగం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. గన్ కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో తుపాకులను అక్రమంగా కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. కొంత కాలంగా విజయవాడ కేంద్రంగా తుపాకీ విడిభాగాలు నగరానికి చేరుతున్నాయనే సమాచారం పోలీసులకు అందింది విజయవాడ ఎప్పటినుంచో హోల్‌సేల్ వ్యాపారానికి ప్రసిద్ధి పొందింది. ఇందులో రవాణా రంగానిది కీలక పాత్ర. నిత్యం వందల కోట్ల రూపాయల విలువైన సరుకు నగరానికి దిగుమతి అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్రమార్కులు రవాణా రంగాన్ని తమ వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారని తెలిసింది. ట్రాన్స్‌పోర్టు ద్వారా తుపాకీ విడిభాగాలను పంపితే ఎవరికీ అనుమానం రాదనే భావనతో అక్రమార్కులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. పాతబస్తీ పంజాలో తనిఖీలు విజయవాడకు ప్రతిరోజూ ముంబయి, చెన్నై, బెంగళూరు, కొల్కతా, ఢిల్లీ, జైపూర్‌ల నుంచి సరుకుల రవాణా జరుగుతుంది. అయితే బొమ్మలు, ప్లాస్టిక్ వస్తువుల పేరిట ఢిల్లీ నుంచి విజయవాడకు తుపాకీ విడి భాగాలు రవాణా అవుతున్నాయని నగర పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో వన్‌టౌన్‌లోని పంజా సెంటర్ సమీపంలోని డ్రైన్ వీధిలో ఉన్న ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీ గోడౌన్లో శనివారం తనిఖీలు చేశారు. గోడౌన్‌లోని వెయ్యికి పైగా పార్సిల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాన్స్‌పోర్టు కంపెనీల్లో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఈ తనిఖీలు జరిగాయి. ముఖ్యంగా ఢిల్లీ నుంచి నగరానికి రెగ్యులర్‌గా సరుకును దిగుమతి చేసుకునే వ్యాపారుల వివరాలతో పాటు వారి ఫోన్ నంబర్లు సేకరించారు. సరుకు దిగుమతి చేసుకున్న వారిలో అనుమానితులు ఎవరైనా ఉన్నారా అనే దిశగా విచారణ చేపట్టారు. తనిఖీలతో పనై పోలేదని, తుపాకీ విడిభాగాల రవాణా అనుమానాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. శాంతిభద్రతలకు సంబంధించిన కీలకమైన అంశం కావడంతో పోలీసులు ఈ తనిఖీల వ్యవహారమంతటినీ అత్యంత గోప్యంగా నిర్వహించారు. -
అక్కడ టెర్రరిస్టుల కన్నా తుపాకీ సంస్కృతే డేంజర్
న్యూయార్క్: అమెరికాలో అంతర్జాతీయ టెర్రరిస్టు దాడులను అరికట్టడంలో భాగంగానే ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి ప్రజల రాకలపై, వలసలపై నిషేధం విధించినట్లు దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పుకొంటున్నారు. నిజంగా ఆయన నిషేధం విధించిన సిరియా, ఇరాన్, ఇరాక్, లిబియా, సూడాన్, యెమెన్, సోమాలియా దేశాల నుంచే ఎక్కువ మంది ముస్లింలు అమెరికాకు వస్తున్నారా? వారి వల్లనే టెర్రరిస్టు దాడుల ప్రభావం ఉందా? అన్న అంశాలను పరిశీలిస్తే దిగ్భ్రాంతికర అంశాలు వెలుగు చూశాయి. అమెరికా గడ్డపై గత 40 ఏళ్ల కాలంలో జరిగిన పలు టెర్రరిస్టు సంఘటనలతో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అరెస్ట్ అయినవారు లేదా శిక్షపడిన వారు ఈ ఏడు దేశాల నుంచి వలసవచ్చిన వారిలో 17 మంది మాత్రమే ఉన్నారు. పైగా వారి ప్రమేయమున్న టెర్రరిస్టు దాడుల్లో ఏ ఒక్కరు కూడా మరణించలేదు. విదేశాల నుంచి వచ్చిన టెర్రరిస్టు దాడుల్లో కంటే అమెరికాలో పుట్టి పెరిగిన ఉన్మాదుల కాల్పుల సంఘటనల్లోనే ప్రజలు ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారు. విదేశీయుడి దాడిలో ప్రాణాలు పోయే ప్రమాదం 36 లక్షల మంది ప్రజల్లో ఒక్కరికి మాత్రమే ఉందని క్యాటో ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. అమెరికా వరల్డ్ ట్రేడ్ టవర్‌పై జరిగిన టెర్రరిస్టు దాడి అనంతరం అమెరికాలో ముస్లిం తీవ్రవాదుల వల్ల ఏడాదికి సరాసరి 9 మంది మరణిస్తుండగా, అమెరికా తుపాకీ సంస్కతి వల్ల 12,843 మంది, రోడ్డు ప్రమాదాల వల్ల 30వేల మంది మరణిస్తున్నారు. ఇక ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు 20వేల మంది. వాస్తవానికి అమెరికాకు వలసవస్తున్న కాందిశీకుల్లో ముస్లింలు పది శాతం కూడా లేరని, మొత్తం అమెరికా ప్రజల్లో ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్న వారు 33 లక్షల మంది మాత్రమేనని ప్యూ రిసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఏటా ఎంత మంది అమెరికన్లు దేశంలో ఇస్లాం మతం పుచ్చుకుంటున్నారో, అంతేమంది ముస్లింలు ఇతర మతాల్లోకి మారుతున్నారని తెలిపింది. ట్రావెల్ బ్యాన్ విధించిన ఈ ఏడు ముస్లిం దేశాల నుంచి 2016 సంవత్సరంలో 36,722 మంది మాత్రమే వలసవచ్చారు. వారిలో అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియా నుంచి వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారు. సిరియా నుంచి 12,587 మంది, ఇరాక్ నుంచి 9,880 మంది, సోమాలియా నుంచి 9,020 మంది, ఇరాన్ నుంచి 3,750 మంది, సూడాన్ నుంచి 1458 మంది, యెమెన్ నుంచి 26 మంది వలసరాగా, లిబియా నుంచి ఒక్కరు మాత్రమే వచ్చారు. 2015లో అమెరికాలో వీసాలు పొందిన విదేశీయుల్లో మెక్సికోలు మొదటి స్థానంలో ఉండగా, భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. -
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలో గన్‌కల్చర్
-
బీహార్‌లో రెచ్చిపోయిన దుండగులు
-
అమెరికాలో పెరుగుతున్న తుపాకుల అమ్మకాలు
అమెరికాలో తుపాకుల అమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులోనే తుపాకుల కొనుగోలు కోసం 18,53,815 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయని, ఇది గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఆరు శాతం ఎక్కువని ఎఫ్‌బీఐ అధికారులు తెలిపారు. దరఖాస్తులు వచ్చినంత మాత్రానే అంతమేర తుపాకుల అమ్మకాలు ఉంటాయని భావించలేమని.. అయినా తుపాకుల కొనుగోలుకు పెరుగుతున్న డిమాండ్‌ను ఈ దరఖాస్తుల సంఖ్య సూచిస్తోంది అధికారులు తెలిపారు. తుపాకుల కోసం కొనుగోలుదారులు ముందుగా డీలర్లకు దరఖాస్తు చేసుకోవాలి. అందులో తమ వ్యక్తిగత వివరాలతోపాటు చిరునామాను, దాన్ని ధ్రువీకరించే పత్రాలను సమర్పించాలి. కొనుగోలుదారుల నేరచరిత్రను తెలుసుకోవడం కోసం డీలర్లు ఆ దరఖాస్తులను ఎఫ్‌బీఐ తనిఖీకి పంపుతారు. సర్వసాధారణంగా ఒకటి, అరా మినహా అన్ని దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఇటీవలి కాలంలో అమెరికాలో కాల్పుల ఘటనలు పెరిగిపోవడంతో భయాందోళనలకు గురవుతున్న ప్రజలు ఆత్మరక్షణ కోసం తుపాకుల కొనుగోలుకు పోటీ పడుతున్నారని ఎఫ్‌బీఐ అధికారులు చెబుతున్నారు. అలాగే కాల్పుల ఘటనలు జరిగినప్పుడల్లా చట్టాలు మరింత కఠినతరం అవుతాయేమోనన్న ఆందోళనతో కూడా కొందరు ఇప్పుడే తుపాకులు కొనేసుకోవాలని భావిస్తుండొచ్చన్నారు. దేశంలో తుపాకుల అమ్మకాలు పెరగడానికి దేశాధ్యక్ష ఎన్నికలు కూడా ఒక కారణమేనని చెబుతున్నారు. తాను అధికారంలోకి వస్తే తుపాకుల అమ్మకాలను మరింత కఠినతరం చేస్తామని, దేశంలో జరిగే కాల్పుల ఘటనలకు అమ్మకందార్లను కూడా బాధ్యులను చేస్తామని డెమోక్రట్ల తరఫున దేశాధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్ ప్రకటించారు. తుపాకులను విక్రయిస్తున్న అమెరికాలోని 'స్మిత్ అండ్ వెస్సెన్', 'స్టర్మ్ రూగర్' అనే ప్రముఖ కంపెనీల అమ్మకాలు కూడా ఈసారి భారీగా పెరిగిపోయాయి. స్మిత్ అండ్ వెస్సెన్ కంపెనీ అమ్మకాలు ఈసారి 40 శాతం పెరగ్గా, రూగర్ కంపెనీ అమ్మకాలు 19శాతం పెరిగాయి. -
బలవుతున్న అమెరికా పోలీసులు
న్యూయార్క్: అమెరికాలో పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతిని అరికట్టడంలో భాగంగా అక్కడి పోలీసులు విధి నిర్వహణలో బలవుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకే 51 మంది అమెరికా పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు వదిలారు. డల్లాస్‌లో మంగళవారం రాత్రి నల్లజాతీయుల నిరసన ప్రదర్శనల సందర్భంగా ఒకరు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసు అధికారులు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 2015లో 124 మంది పోలీసులు విధి నిర్వహణలో మరణించారని ‘నేషనల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ మెమోరియల్ ఫండ్’ తెలియజేసింది. 1970 నుంచి విధి నిర్వహణలో పోలీసుల మరణాలు పెరుగుతూ వస్తున్నాయి. 1974లో ఎక్కువ మరణాలు సంభవించాయని, ఆ ఏడాది ఏకంగా 280 మంది పోలీసులు మరణించారు. -
ఫలించిన ‘తుపాకీ సంస్కరణలు’
20 ఏళ్లలో ఆస్ట్రేలియాలో కాల్పులు, దాడుల తగ్గుదల మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో 20 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన తుపాకుల సంస్కరణలు, ఆయుధాల ఉపసంహరణ కార్యక్రమం తరువాత ఉద్దేశపూర్వక దాడులు, మారణ కాండలు గణనీయంగా తగ్గినట్లు సిడ్నీ విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. సంస్కరణలకు ముందు 18 ఏళ్లలో అక్కడ 13 భీకర సామూహిక కాల్పులు జరిగాయి. 1996లో టాస్మానియాలో ఓ వ్యక్తి రెండు రైఫిళ్లతో 35 మందిని కాల్చి చంపి, 19 మందిని గాయపరిచాడు. తదుపరి ఆస్ట్రేలియాలో విప్లవాత్మక మార్పులు చేపట్టారని పరిశోధకులు తెలిపారు. అదే సంవత్సరం జూన్‌లో రాపిడ్ లాంగ్ తుపాకులు, ప్రైవేటు వ్యక్తుల వద్దనున్న ఆయుధాలను నిషేధిస్తూ ఫెడరల్ ప్రభుత్వం చట్టం చేసింది. 1997 జనవరి1 నుంచి ఫెడరల్, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ధరకే నిషేధిత ఆయుధాల తిరిగి కొనుగోలును ప్రారంభించాయని అధ్యయనకర్తలు వెల్లడించారు. ఈ 20 ఏళ్లలో సుమారు 10 లక్షల నిషేధిత ఆయుధాలను ప్రజలు స్వచ్ఛందంగా వదులుకున్నారు. -
తుపాకి చిహ్నం సృష్టికర్త ఇక లేరు!
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ముందు ప్రతిష్టించిన 'తుపాకి కాంస్య విగ్రహం' సృష్టికర్త, ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్వీడన్ శిల్పి కార్ల్ ఫ్రెడ్రిక్ రాయిటర్స్ వార్డ్ ఇక లేరు. ఆయన సోమవారం కన్ను మూసినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయనకు 81 ఏళ్లు. ఫ్రెడ్రిక్ తన స్నేహితుడైన గాయకుడు, శాంతి కార్యకర్త జాన్ లెనాన్కు నివాళిగా ఈ తుపాకి కాంస్య విగ్రహాన్ని రూపొందించారు. అది గొట్టం చివర ముడివేసినట్టు ఉంటుంది. 1980లో లెనాన్‌ను కాల్చి చంపినందుకు తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా, అహింసకు చిహ్నంగా ఈ విగ్రహాన్ని ఫెడ్రిక్ చెక్కారు. ముందుగా ఈ విగ్రహాన్ని న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లోని స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ మెమోరియల్ హాల్లో ప్రతిష్టించారు. లెనాన్ ఆ ప్రాంతంలోనే నివసించడంతో ఆయనకు గుర్తుగా దాన్ని అక్కడ ప్రతిష్టించారు. ఆ తర్వాత లగ్జంబర్గ్ ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ఐక్యరాజ్య సమితికి బహూకరించింది. ఈ చిహ్నానికి ఎంతో ప్రాముఖ్యత లభించడంతో ప్రపంచవ్యాప్తంగా చిహ్నం నమూనాలను 30 రూపొందించారు. వాటిలో పది చిహ్నాలు స్వీడన్లోనే ఉన్నాయి. పారిస్‌లో చదువుకున్న ఫ్రెడ్రిక్ స్టాక్‌హోమ్‌లోని అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన తన శిల్పాలను పలు దేశాల్లో ప్రదర్శించారు. 'ఎట్ ది సేమ్ టైమ్' పేరిట ఆయన కవితల సంకలనాన్ని కూడా ప్రచురించారు. -
తుపాకుల కలకలం వెనుక కథేంటి?
ప్రశాంతంగా ఉండే చోట ల్యాండ్ సెటిల్మెంట్లు, బెదిరింపులు రాజ్యమేలుతున్నాయి. కిరాయి హంతకముఠాలు హల్చల్ చేస్తున్నాయి. నేరాల రేటు తక్కువగా ఉండే మెదక్ జిల్లా నంగునూరు మండలంలో గన్ కల్చర్ కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం రాంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తులు పరస్పరం ఘర్షణ పడగా ఒకరు గాయపడ్డారు. పోలీసుల రంగప్రవేశంతో ముగ్గురు పరారయ్యారు. కాల్పుల్లో గాయపడిన వ్యక్తి దొరికాడు. ఆ ఇంట్లో రెండు తుపాకులు, ఒక తపంచా దొరికాయి. వీరు ఏదైనా దోపిడీ ముఠా సభ్యులా.. లేక మాఫియా గ్యాంగ్‌కు చెందిన వారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిపోయిన వ్యక్తుల వద్ద పెద్దబ్యాగ్ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎక్కడో సెటిల్మెంట్ చేసి సంపాదించన డబ్బు పంపకాల విషయంలో తేడాలు రావడంతో దాడులు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. నంగునూరు మండలం మారుమూల ప్రాంతం కావడంతో పాటు రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ పీస్ జోన్లో ఉండడంతో అసాంఘిక శక్తులు అడ్డాగా మార్చుకుంటున్నాయి. పక్క జిల్లాకు చెందిన ఒక వ్యక్తి నంగునూరు మండలానికి చెందిన మరో వ్యక్తితో కలసి దుబాయికి తీసుకెళ్తామని ఆశచూపి కొందరి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు వినికిడి. అయితే, వారికి డబ్బు అందజేసిన వారు ఒత్తిడి చేయటంతో వారిని బెదిరించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ జిల్లా వారణాసి ప్రాంతానికి చెందిన కిరాయి హంతకులను ఇక్కడికి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ల్యాండ్ సెటిల్మెంట్లు చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. దుండగులు హన్మకొండ ప్రదాన రహదారిపై రాంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద గతంలో దాబా హోటల్ నడిచిన ఇంట్లో పది రోజులుగా బస చేస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. నాడు వెల్కటూర్.. నేడు రాంపూర్.. గత డిసెంబర్ నెలలో వెల్కటూర్‌కు చెందిన బత్తిని వెంకటస్వామి ఇంట్లో పోలీసులు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి నెలలో లారీలో తరలిస్తున్న 200క్వింటాళ్ల గంజాయిని రాజగోపాల్‌పేట పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నుంచి మెదక్ జిల్లా రాజగోపాల్‌పేట వరకు ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్ లేకపోవడంతో నిఘా తక్కువగా ఉంటుంది. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు నంగునూరు మండలం అనువుగా మారింది. అలాగే ఈప్రాంతంలో దాబా హోటళ్లు ఉండడంతోపాటు మద్యం లభిస్తుండటం కూడా అసాంఘిక శక్తులకు ఆసరాగా మారింది. -
తల్లిని షూట్ చేసిన నాలుగేళ్ల బాలుడు!
న్యూయార్క్: అమెరికాలో విచ్చలవిడి గన్‌కల్చర్ ఎలాంటి అనర్థాలకు కారణమౌతుందో చెప్పె ఘటన ఇది. కారులో వెనుక సీట్లో కూర్చున్న ఓ నాలుగేళ్ల బాలుడు.. డ్రైవింగ్ చేస్తున్న తల్లిని వెనుక నుండి షూట్ చేశాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై విచారణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జాక్స్విల్లే ప్రాంతానికి చెందిన జేమీ గిల్ట్ వృత్తి రిత్యా న్యాయవాది. మంగళవారం ఆమె తన నాలుగేళ్ల కొడుకుతో పుట్నం కౌంటీ ప్రాంతంలో కారులో వెళ్తుంది. ఆ సమయంలో కారు వెనుక సీట్లో కూర్చున్న బాలుడు అక్కడే ఉన్న హ్యండ్ గన్ను చేతిలో పట్టుకొని ఆడుతూ అనుకోకుండానే ట్రిగ్గర్ నొక్కేశాడు. దీంతో బుల్లెట్ జేమీ వీపు భాగం నుంచి దూసుకెళ్లింది. జేమీని ప్రాణాపాయ స్థితిలో గమనించిన అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఘటన జరగడానికి కొద్ది గంటల ముందే.. టార్గెట్‌ను షూట్ చేస్తున్నాడంటూ తన కుమారుడి షూటింగ్ ప్రతిభను మెచ్చుకొంటూ జేమీ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేయడం విశేషం. జేమీ ఉదంతంతో గన్‌కల్చర్‌పై సోషల్ మీడియాలో మరోసారి భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పెరుగుతున్న గన్ కల్చర్
బెంగళూరు : బెంగళూరు నగరంలో గన్ వినియోగం పై ఆసక్తి పెరుగుతోంది. ఏడాదికేడాది ఇందుకోసం దరఖాస్తు చేసుకొనేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2015 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ తుపాకీ కొనుగోలు, వినియోగానికి సంబంధించి అనుమతి ఇవ్వాల్సిందిగా 1,500 మంది డీజీపీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 30 శాతం ఎక్కువ. దరఖాస్తు చేసుకున్నవారిలో కేవలం 380 మందికి మాత్రమే పోలీసు అధికారులు అనుమతి ఇవ్వగా 256 మంది తుపాకీ వినియోగానికి సంబంధించిన శిక్షణ పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారు శిక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా గన్ను కొనుగోలు చేయడం ఎలా? శిక్షణ ఎక్కడ తీసుకోవాలి? ఆయుధం ధరలు తదితర విషయాలకు సంబంధించిన కథనం... ఎవరికి గన్‌లెసైన్స్ దొరుకుతుంది? అడిగిన వారందరికీ ఆయుధ లెసైన్స్ దొరకదు. నగర కమిషనరేట్‌లో ఆయుధ లెసైన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత సదరు వ్యక్తి పూర్వాపరాలను స్థానిక పోలీసులు పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తారు. ఆయుధలెసైన్సు దరఖాస్తుకు కారణం?, సమాజంలో వ్యక్తికి ఉన్న స్థానం, విరోధుల నుంచి ప్రాణహానితో పాటు సదరు వ్యక్తి వృత్తి తదితర విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఆయుధ లెసైన్సును పోలీసు ఆధికారులు జారీ చేస్తారు. మూడు చోట్ల శిక్షణ కేంద్రాలు... నగర ఆర్మ్డ్ రిజర్వ్ ఆధ్వర్యంలో మూడు చోట్ల తుపాకి వినియోగం పై శిక్షణ ఇస్తారు. మైసూరు రోడ్డులోని సిర్సీ సర్కిల్, ఆడుగోడి సర్కిల్లోని సీఏఆర్ ఉత్తర విభాగం ప్రాంగణం, యలహంకలోని సీఏఆర్ దక్షిణ విభాగం ప్రాంగణంలో పోలీసు విభాగం నుంచి అనుమతి పొందిన దరఖాస్తుదారులకు శిక్షణ ఇస్తారు. సీఏఆర్ కేంద్ర కార్యాలయానికిచేరిన దరఖాస్తులను అనుసరించి రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలం 10 రోజులు. ఉదయం 6:30 గంటలకు మొదలయ్యే శిక్షణ మూడు నుంచి నాలుగు గంటల పాటు సాగుతుంది. శిక్షణ తర్వాత సీఏఆర్ అధికారులు నిర్వహించే పరీక్షలో పాస్ అయిన వారికి గన్ ఖరీదు చేయడానికి పూర్తి స్థాయి ధ్రువీకరణ పత్రం అందుతుంది. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల విలువ చేసే ఆయుధాలు... రాష్ట్రంలో రివల్వార్, గన్ తదితర ఆయుధాలను విక్రయించేందుకు ప్రభుత్వం నగరంలో 15 సంస్థలకు అనుమతిచ్చింది. ఈ సంస్థలు దేశ, విదేశాలకు చెందిన ఆయుధాలను విక్రయిస్తుంటాయి. రూ.50 వేల నుంచి మొదలు దాదాపు రూ.4 లక్షల విలువ చేసే ఆయుధాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కొక్కసారి 20 నుంచి వంద బులెట్లను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గన్ను దుర్వినియోగం చేస్తే తక్షణం సదరు వ్యక్తి ఆయుధ లెసైన్స్ రద్దు చేసే అధికారం పోలీసు అధికారులకు ఉంటుంది. -
అమెరికా స్కూళ్లలో ఇదేమి ‘దృశ్యం’
న్యూయార్క్: అది మంచు కురుస్తున్న శీతాకాలం ఓ రోజు. ఎముకలు కొంకర్లు తిరిగిపోయే పరిస్థితి. బ్రూక్లిన్‌లోని ఓ హైస్కూల్ ముందు పిల్లలంతా వరుసగా క్యూలో నిలబడ్డారు. ఒకరి తర్వాత ఒకరు చలి నుంచి కాపాడే జాకెట్లను, చేతి గ్లౌజులను, ఆ తర్వాత బెల్టులను, సాక్సులను, షూలను ఒక్కొక్కటిగా విప్పేశారు. గజగజ వణుకుతూ మెటల్ డిటెక్టర్ ద్వారం గుండా వెళ్లేందకు నిలుచున్నారు. ఈలోగా తమ పుస్తకాల బ్యాగులను ఎక్స్ రే యంత్రానికి పంపించారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది తదేకంగా స్కానర్ల వైపు చూస్తున్నారు. అచ్చం మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించే లాంటి ఈ దృశ్యం గంటసేపు కనిపిస్తుంది. ఇది ఒక్క రోజు జరిగేది కాదు. ప్రతి రోజు జరిగేదే. ఇది ఒక్క స్కూల్లో కనిపించే దృశ్యం కాదు. మొత్తం న్యూయార్క్ లోని వేలాది స్కూళ్లలో ప్రతిరోజు కనిపించే దృశ్యం. మెటల్ డిటెక్టర్లు, స్కానింగ్ పరీక్షల కోసం పిల్లలంతా స్కూల్ ప్రారంభ వేళకన్నా గంట ముందే వచ్చి క్యూలో నిలబడాలి. ఇక్కడా వివక్షత కొనసాగుతోంది. శ్వేతజాతీయుల పిల్లలు ఒక్కసారి మెటల్ డిటెక్లర్ల గుండా వెళ్లాల్సి వస్తే, నల్లజాతీయుల పిల్లలు, ఇస్పానిక్ విద్యార్థులు మూడుసార్లు వెళ్లాల్సి ఉంటుంది. జాతి విద్వేషాలకు అంకురార్పణ జరిగేది ఇక్కడే. దాదాపు 22 ఏళ్ల క్రితం మొదలైన్ ఈ చెకింగ్ విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. 1992, ఫిబ్రవరి నెలలో బ్రూక్లిన్‌లోని థామస్ జఫర్ స్కూల్లో ఇద్దరు విద్యార్థులు తుపాకీ గుళ్లకు బలయ్యారు. అదే రోజు అదే స్కూల్‌కు చెందిన మరో విద్యార్థి ఇంటి వద్ద పొరపాటున తుపాకీ పేలడం వల్ల చనిపోయారు. మధ్యాహ్నం అదే స్కూల్లో జరగాల్సిన ఓ కార్యక్రమానికి అప్పటి నగర మేయర్ డేవిడ్ బింకిన్స్ హాజరుకావాల్సి ఉంది. కాల్పుల సంఘటన కారణంగా ఆ కార్యక్రమం రద్దయింది. ఈ సంఘటన నేపథ్యంలోనే నగరంలోని దాదాపు 40 స్కూళ్లలో మెటల్ డెటెక్టర్లు ఏర్పాటు చేశారు. రెండోసారి కూడా మేయర్‌గా డేవిడ్ ఎన్నికవడంతో దీన్ని 1,069 స్కూళ్లకు విస్తరించారు. అదనంగా స్కానర్లను కూడా ఏర్పాటు చేశారు. 1992, 93 ప్రాంతంలో న్యూయార్క్ సిటీ క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మేయర్ డేవిడ్ అప్పట్లో తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. 2003 నాటికి తనికీ వ్యవస్థను అన్ని స్కూళ్లకు విస్తరించారు. అప్పటికి క్రైమ్ రేటు దాదాపు 48 శాతం తగ్గినప్పటికీ ఈ వ్యవస్థను తొలగించలేదు. కాకపోతే కొత్త స్కూళ్లలో ఏర్పాటు చేయలేదు. ఆ తర్వాత ప్రజా సంఘాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఓ స్క్రూటినీ కమిటీ ఏర్పాటు చేసి రెండు స్కూళ్లలో ఈ తనిఖీ వ్యవస్థను తొలగించారు. దీనిపైనా గొడవవడంతో గత జూలైలో పోలీసు విభాగం మరో కమిటీని వేసింది. సరైన మార్గదర్శకాలను సూచించాల్సిందిగా ఆ కమిటీ ఉపాధ్యాయుల కమిటీని కోరింది. ఈ వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. స్కూళ్లలో ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లు, స్కానింగ్ యంత్రాల తనిఖీలో ఇప్పటి వరకు అన్‌లోడెడ్ హ్యాండ్ గన్ ఒకటి, బీబీ గన్స్ మూడు, 73 చాకులు, వందలాది బ్లేడ్లు దొరికాయని పోలీసుల నివేదిక వెల్లడిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దేశంలో తుపాకీ సంస్కృతిని అరికట్టేందుకు చట్టాలను కఠినతరం చేస్తున్నానంటున్న నేపథ్యంలో స్కూళ్లలో తనిఖీ వ్యవస్థ గురించి మళ్లీ చర్చకు వచ్చింది. ఈ వ్యవస్థను కొనసాగించడం వల్ల విద్యార్థులపై దుష్ర్పభావం ఎక్కువగా ఉంటుందని కొంతమంది టీచర్లు వాదిస్తుండగా, కొనసాగించాలని మెజారిటీ ఫ్యాకల్టీ లీడర్లు వాదిస్తున్నారు. దీనికి సమాధానం మెటల్ డిటెక్టర్లు, స్కానర్ల లాంటి యంత్రాల్లో లేదు. మానవ సంబంధాల్లో ఉంది. మరి రేపటి పౌరులైన విద్యార్థులకు ఎలాంటి సంబంధాలను మనం బోధిస్తున్నాం. గురువులైన టీచర్లు, ప్రభుత్వ పెద్దలే విద్యార్థులను నమ్మకపోతే వారు మాత్రం తోటివారిని, ఇతరులను ఎలా నమ్ముతారు. వారికి సరైన సంస్కృతి బాటను చూపించనంతకాలం స్కూళ్లలో మెటల్ డిటెక్టర్లున్నా, లేకపోయినా లోపలికి తుపాకులు వెళుతూనే ఉంటాయి. -
అమెరికా అధ్యక్షుడు ఒబామా కంట కన్నీరు
వాషింగ్టన్: అమెరికాలో పెచ్చుమీరుతున్న తుపాకీ సంస్కృతిపై దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా కన్నీరు పెట్టారు. మూడేళ్ల క్రితం కనెక్టికట్ 20 మంది ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ముష్కరుల తుపాకీ గుళ్లకు బలైన విషయాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేశారు. ఆ చిన్నారులు గుర్తొచ్చిన ప్రతీసారి పిచ్చివాడినై పోతానన్నారు. చెక్కిళ్లపై నుంచి కన్నీరు కారుతుండగా.. తుపాకుల వినియోగాన్ని, తుపాకీ హింసను కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ముందుకు వెళ్లాల్సిందిగా కాంగ్రెస్‌ను డిమాండ్ చేయాలని మంగళవారం వైట్‌హౌస్ కార్యక్రమంలో అన్నారు. తుపాకుల అమ్మకాల కట్టడికి కాంగ్రెస్ వ్యతిరేకతను పట్టించుకోకుండా.. కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇవ్వాలని ఒబామా నిర్ణయించారు. గన్ లాబీ కాంగ్రెస్‌ను బందీగా చేసుకోగలదేమో కానీ అమెరికాను కాదని అన్నారు. ఈ కార్యక్రమానికి కాల్పుల బాధితులు హాజరయ్యారు. -
నగరానికి ‘గన్’డం
ఇప్పుడు నగరాల్లో గన్ సంస్కృతి ఎక్కువైపోయింది. ఇక్కడా అక్కడా అని లేదు ఎప్పుడు ఎక్కడ తుపాకీ పేలుతుందో అని నగర జీవి వణికిపోతు న్నాడు. రాష్ట్రంలో ఆయుధాల లెసైన్స్ కలిగి ఉన్నవారెవరో? లేనివారెవరో తెలియని పరిస్థితి నెలకొంది. బస్టాండ్లలో ఖాకీలపైనే తుపాకీ గురిపెట్టే సాహసానికి పాల్పడ్డారంటే నేరగాళ్లు ఎంత రెచ్చిపోయారో వేరే చెప్పనక్కర లేదు. ఇప్పుడు మన మార్కెట్లలో కూడా తుపాకులు సాధారణ వస్తువుల లాగా దొరుకుతుండటంతో, నేరాలు ఎక్కుైవైపోయాయని సామాజిక శాస్త్ర వేత్తల వాదన. పైగా ఎవరు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారో చెప్పడం కష్టం అని పోలీసు శాఖ కూడా చేతులెత్తేసినట్లుంది. మన పోలీసుల వద్ద ఉన్న ఆయుధాల కంటే నేరస్థుల దగ్గరే అత్యాధునిక ఆయుధాలు ఉండటం, వాటిని విచ్చలవిడిగా ఉపయోగించడానికి సిద్ధపడటమే ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తోంది. మొన్న సరూర్‌నగర్, నిన్న సూర్యాపేట. రేపు మరెక్కడ ఏం జరగబోతోందోనని పోలీసు వర్గాలే ఆందోళన చెందుతు న్నాయి. ఒక పక్క పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తాం, నేరరహిత నగరంగా తీర్చిదిద్దుతామని, స్మార్ట్ సిటీల లక్ష్యమే ఏర్పాటని చెబుతున్న తెలంగాణ సర్కారుకు వరుసగా జరిగిన కాల్పుల సంఘటనలతో ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఇకనైనా అక్రమ ఆయుధాలు కలిగిన వాళ్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. తక్షణమే రాష్ట్ర పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు అందించి పౌరుల భద్రతకు చర్యలు చేపట్టాలి. విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్ -
కలకలం !
బూర్జ మండలంలోకి చొచ్చుకొచ్చిన గన్‌కల్చర్ పీఎల్‌దేవి పేట మాజీ సర్పంచ్‌పై నాటుతుపాకీతో కాల్పులు బూర్జ/ పాలకొండ రూరల్:ప్రశాంతతకు మారుపేరైన శ్రీకాకుళం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల నేరపూరిత చర్యలు, ఘటనలు చోటుచేసుకుంటుండడంతో జనం హడలిపోతున్నారు. కారణాలు ఏవైనా ప్రత్యర్థులను హత మార్చాలనే లక్ష్యంతో ఫ్యాక్షన్ సంప్రదాయానికి పలువురు తెర తీస్తున్నారు. కొద్దిరోజుల క్రితం టెక్కలి నడిబొడ్డున ఓ వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో, గొడ్డళ్లతో దాడిచేసి దారుణంగా హతమార్చిన ఘటన మరువకముందే బూర్జ మండలం పీఎల్‌దేవి పేట గ్రామంలో మాజీ సర్పంచ్‌ను టార్గెట్ చేస్తూ నాటు తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. మన్మథనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని అంతా సందడిగా ఉన్న తరుణంలో శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పీఎల్దేవపేట మాజీ సర్పంచ్ గూండ్రు అప్పన్నపై హత్యాయత్నం జరిగింది. దారికి అడ్డంగా రాళ్లు పేర్చి.. మాజీ సర్పంచ్ అప్పన్నను హతమార్చేందుకు పీఎల్‌దేవిపేట-కె.కె.రాజపురం గ్రామాల మధ్య రోడ్డుకు అడ్డంగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లుపేర్చారు. సంత వ్యాపారంపై ఆధారపడుతున్న అతను ఎప్పటిలాగే శనివారం తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో సీతంపేట మండలం కుసిమి గ్రామంలో జరగనున్న వారపు సంతకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అయితే దారిలో రాళ్లు అడ్డంగా ఉండడంతో వాహనం దిగి వాటిని తొలగించి వెళ్లిపోదామన్న క్రమంలో రహదారికి కుడివైపున లోతు ప్రాంతం నుంచి గుర్తు తెలియని వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులు జరపడంతో తుటా అతని నడుం కుడి భాగం నుంచి దూసుకుపోవడంతో పెద్ద కేకలు వేస్తూ కుప్పకూలిపోయాడు. అప్పన్న వేసిన కేకలు విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరి రాకను గమనించిన అగంతకుడు అక్కడి నుంచి పరారైనట్టు స్థానికులు చెబుతున్నారు. సమాచారం బూర్జ పోలీసులకు చేరడంతోఎస్ఐ లక్ష్మణరావు, ఆమదాలవలస సీఐ సింహాద్రినాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన అప్పన్నను ప్రత్యేక వాహనంలో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సూపరింటెండెంట్ రవీంద్రకుమార్, వైద్యాధికారి శ్రీనివాసరావు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. బాధితుడు అప్పన్న, అతని బంధువుల నుంచి వాగ్మూలం తీసుకున్నారు. అలాగే శ్రీకాకుళం నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీంలను రంగంలోకి దించారు. ఆధిపత్యపోరే కారణమా? అప్పన్నపై కాల్పులు జరగడానికి గ్రామంలో ఆధిపత్యపోరే కారణమని తెలిసింది. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై అనుమానం ఉన్నట్టు బాధితుడు అప్పన్న పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఇదే క్రమంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే గతంలో కూడా తనను హతమార్చేందుకు ఏడాది క్రితం ఇదే తరహా ఘటనకు వ్యూహరచన చేయగా అప్పట్లో తప్పించుకున్నానని బాధితుడు చెబుతున్నాడు. అదే విషయాన్ని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు చెప్పారు. గ్రామస్తుల భయాందోళన ఉగాది పండుగ కావడంతో గ్రామమంతా సంబర వాతావరణంలో ఉండగా తెల్లవారు జామున తుపాకీ మోతలు, మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం, గ్రామస్తులే వ్యూహకర్తలని వదంతులు రావడంతో పీఎల్‌దేవి పేట గ్రామస్తుల్లో ఉత్కంఠ నెలకొంది. గన్ కల్చర్ తమ ప్రాంతానికి పాకడంపై బూర్జ మండల వాసులు ఆందోళన చెందుతున్నారు. -
ప.గో.జిల్లాలో కాల్పుల కలకలం
-
విజయవాడలో పెరుగుతున్న గన్ కల్చర్
విజయవాడ: నగరంలో గన్ కల్చర్ క్రమేపీ పెరుగుతోంది. ఆదివారం ఓ చెత్తకుప్పలో గన్ దొరకడంతో కాస్తా విజయవాడ వాసుల్ని మరింత కలవరానికి గురి చేస్తోంది. 13 వ డివిజన్ రెవిన్యూ కాలనీ లో గన్ లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ గన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు ఈ గన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు. వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి ఆంధ్రాకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గత నెల్లో ఇదే తరహాలో గుంటూరు జిల్లాలో హేమంత్ అనే యువకుడు వద్ద తుపాకీ దొరికిన సంగతి తెలిసిందే. -
తుపాకుల కలకలం
జిల్లాలో పెరుగుతున్న రివాల్వర్ సంస్కృతి వైట్‌కాలర్ క్రిమినల్స్ వద్ద వెపన్లు అనుమతి లేకున్నా.. విచ్చలవిడిగా వాడకం వరంగల్ క్రైం : జిల్లాలో గన్ కల్చర్ పెరుగుతోంది. జల్సాలు.. విలాసాలకు అలవాటుపడుతున్న అనేక మంది పెడదోవ పడుతూ నేరాలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసం పాకులాడుతూ అసాంఘిక కార్యకలాపాలను ఎంచుకుంటూ నేరమయ జీవితానికి నాంది పలుకుతున్నారు. అనేక మంది యువకులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద పనిచేయడం. వ్యాపారులుగా అవతార ం ఎత్తడం... ఆ తర్వాత తలెత్తుతున్న తగాదాల్లో తుపాకులు వాడే సంస్కృతి ఇటీవల పెరిగింది. దీంతో పాటు మాజీ, సూడో నక్సల్స్ డబ్బు కోసం రంగంలోకి దిగుతున్నారు. జిల్లా నుంచి అనేక మంది యువకులు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద బాడీగార్డ్లుగా పనిచేస్తున్నారు. అవసరం వచ్చినపుడు నేరాలకు పాల్పడుతూ అక్కడి సంస్కృతిని వరంగల్‌కు చేరవేస్తున్నారు. లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామంలో రాత్రి వేళల్లో ఇటీవల ఒక వ్యక్తిని కాల్చి చంపారు. ఈ హత్యకు రియల్ ఎస్టేట్ తగాదాలే కారణమని అప్పట్లో పోలీసులు తేల్చారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో ములుగురోడ్డులోని ఒక ల్యాండ్ పంచాయితీలో తలదూర్చిన ఒక లంపెన్ గ్యాంగ్ తుపాకిని వాడినట్లు పోలీసుల రికార్డుల్లో ఉంది. తాజాగా మహబూబాబాద్ మండలం ఏటిగడ్డతండా సమీపంలో జరిగిన సంఘటనతో జిల్లా ప్రజలు మరోమారు ఉలిక్కిపడ్డారు. డబ్బుల కోసం కొంతమంది వ్యక్తులు కలిసి తపంచాలు సేకరించి వాటితో సంచరిస్తూ జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. వసూళ్ల వేటలోపడిన ఈ ముఠా గురువారం రాత్రి అనూహ్యంగా పోలీసులకు చిక్కింది. అదేవిధంగా... వెంకటాపూర్ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి పోలీసులు రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్న సంఘటన కలకలం సృష్టించింది. మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న తరుణంలో ఇలా ఒక్కసారిగా తుపాకులు దొరకడం జిల్లాను వణికించింది. నకిలీ నక్సల్స్‌గా మాజీల అవతారం జిల్లాలో వివిధ విప్లవ పార్టీల్లో పనిచేస్తూ లొంగిపోరుున, అరెస్టైన మాజీ నక్సలైట్లు ఇప్పుడు చందాల వసూళ్ల కోసం సూడో నక్సల్స్‌గా అవతారమెత్తుతున్నారు. గతంలో ఇలాగే ఏటూరునాగారం మండలంలో ఓ నకిలీ దళం పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అంతేగాక నకిలీ నక్సల్స్ డమ్మీ పిస్టళ్లతో వ్యాపారులను బెదిరిస్తూ పోలీసులకు పట్టుబడిన ఉదంతాలు అనేకం ఉన్నారుు. వీరు గతంలో విప్లవ పార్టీల్లో పనిచేసిన అనుభవంతో నకిలీ లెటర్ప్యాడ్లు సృష్టించడం.. విప్లవ పార్టీ నాయకుల తరహాలో చందాల కోసం వ్యాపారులకు లేఖలు రాయడం, ఫోన్లలో బెదిరించడం వంటి ఘటనలకు పాల్పడుతున్నారు. బీహార్‌లో రూ.10 వేల నుంచి రూ.20 వేలకు తపంచా కొనుగోలు చేస్తూ.. వాటితో ఏకంగా మావోరుుస్టుల పేరుతోనే బెదిరింపులకు దిగుతున్నారు. రియల్టర్లకు తుపాకులు ఎందుకో.. రియల్ ఎస్టేట్ పేరుతో దొంగవ్యాపారం చేస్తూ సామాన్య ప్రజలను నిండా ముంచుతున్న అనేక మంది కొంతకాలంగా రివాల్వర్ లెసైన్స్‌లు పొందుతూనే ఉన్నారు. పోలీసు రికార్డులలో ై‘వెట్ కాలర్ క్రిమినల్స్’గా ఉన్న అనేక మంది వద్ద రివాల్వర్లు ఉన్నారుు. వీటితో తమకు అడ్డు వచ్చిన వారిని బె దిరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తన ఇంట్లోనే అక్కడ కూర్చున్న వారి ముందు రివాల్వర్ పేల్చి భయబ్రాంతులకు గురిచేశాడు. బుల్లెట్లు స్లాబ్‌కు తగిలి బిచ్చలు ఊడిన సంఘటన పోలీసు రికార్డుల్లో నమోదైంది. ఇదే విధంగా ఏడాది క్రితం నగర సమీపంలో ఒక రియల్టర్ పార్టీ సందర్భంగా బహిరంగంగానే రివాల్వర్ పేల్చాడు. ఇలా న్యాయపరంగా రివాల్వర్ లెసైన్స్ పొందుతూ... దాన్ని అడ్డుపెట్టుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయాలు పోలీసుల దృష్టికి వస్తున్నప్పటికీ... ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. ఇటీవల వరంగల్ రూరల్ ఎస్పీ, అర్బన్ ఇన్చార్జ్ ఎస్పీ అనుమతి లేకుండా రివాల్వర్ కల్గి ఉంటే వెంటనే సరెండర్ చేయాలని, లేని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అరుునా ఎవరూ రివాల్వర్లను పోలీసు శాఖకు అప్పగించలేదు. ఇదిలా ఉండగా... రాజకీయ నాయకులుగా చెలామని అవుతున్న కొంత మంది గల్లీ లీడర్లు రివాల్వర్ లెసైన్స్ పొందేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. తమపై దాడి చేయించుకోవడం... ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం... ఇలా రెండు మూడు మార్లు చేయించుకుని ప్రాణభయం ఉందని రివాల్వర్ లెసైన్స్ కావాలంటూ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కూడా పోలీసు రికార్డుల్లో ఉంది. అరుునా.. ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజాగా జిల్లాలో కలకలం సృష్టించిన ఘటనల నేపథ్యంలోనైనా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లే ని పక్షంలో జిల్లాలో గన్‌కల్చర్ మరింతగా పెరిగి సమాజానికి, శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. -
గుంటూరు జిల్లాలో ఆయుధాల వ్యాపారం
-
గుంటూరు జిల్లాలో ఆయుధాల వ్యాపారం
శావల్యాపురంలో తపంచాల వ్యాపారం అంశం కలకలం రేపింది. గుంటూరు జిల్లా వినుకొండలో అమ్మేందుకు రెండు తపంచాలను తీసుకెళ్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు, తుపాకుల వాడకాలు పెరిగిపోయాయి. గంజి మురళీధరరావు అనే వ్యక్తి తుపాకుల వ్యాపారం చేయాలని భావించి, పానీపూరీ విక్రయించే సందీప్‌కుమార్ అనే వ్యాపారిని సంప్రదించాడు. అతడి ద్వారా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుధీర్ కుమార్‌ను కలిసి, ఒక్కోటీ రూ. 30 వేల చొప్పున రెండు తపంచాలు కొన్నాడు. వినుకొండలోని ఓ వ్యాపారికి వీటిని విక్రయించేందుకు మారుతి కారులో తీసుకెళ్తుండగా పోలీసులు మార్గమధ్యంలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. వీరి కారును కూడా తనిఖీ చేయగా, రెండు తపంచాలు దొరికాయి. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా.. గతంలో కూడా వీళ్లు ఈ తరహా వ్యాపారం చేశారని తెలిసింది. -
పశ్చిమ ప్రకాశంలో గన్ కల్చర్
-
'గన్‌కల్చర్ ను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు'
విజయవాడ: రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గన్ కల్చర్ ను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి చెందిన 14 ఎకరాల భూమిని సిద్ధార్థ్ కాలేజీ యాజమాన్యం అక్రమంగా వాడుకుంటోందని తెలిపారు. ఆ భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అధికారులపై ఒత్తిడి పెంచి పెన్షన్ కార్డులు తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. -
పెరిగిపోతున్న గన్ కల్చర్
రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఒకప్పుడు కేవలం బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఇది కనిపించేది. తర్వాత సినిమాల ప్రభావంతో అన్ని ప్రాంతాలకూ ఇది విస్తరించింది. తుపాకులు సులభంగా ఎక్కడ దొరుకుతాయంటే బీహార్ అని అందరూ చెబుతున్నారు. ఇది ఎంతెలా పాకిందంటే.. చివరకు ఆంజనేయస్వామి ఆలయంలో పూజారిగా చేస్తున్న యువకుడు కూడా బీహార్ వరకు వెళ్లి రివాల్వర్ కొనుక్కొచ్చి.. ప్రియురాలి భర్తను చంపడానికి ప్రయత్నించారు!! ఇంతకుముందు కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రివాల్వర్లు పేలడం, తుపాకులు గర్జించడం లాంటి సంఘటనలు జరిగాయి. కొల్లేరు ప్రాంతంలో కొంతమంది వేటగాళ్లు పక్షులను వేటాడేందుకు ఉపయోగించే నాటు తుపాకులు కూడా చివరకు బీహార్ నుంచి వచ్చినవేనని చెబుతారు. ఈమధ్య విడుదలైన 'రాంలీలా' చిత్రంలో సైతం విచ్చలవిడిగా ఆయుధాల వాడకాన్ని చూపించారు. మనదేశంలో ప్రధానంగా రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనే తుపాకులు విచ్చలవిడిగా అమ్ముతుంటారు. వాటిని ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాలవాళ్లు కొంటున్నారు. ఎన్నికల సీజన్ దగ్గర పడటంతో తుపాకులు, రివాల్వర్లు, పిస్టళ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా, వారి నిఘా కేవలం లైసెన్సు ఉన్న ఆయుధాలకే పరిమితం అవుతోంది. ఆయుధ లైసెన్సులు ఉన్నవాళ్లు తమ ఆయుధాలను స్టేషన్లలో డిపాజిట్ చేయాలని పోలీసులు ఆదేశించడం, వాళ్లు కొన్నాళ్ల పాటు సరెండర్ చేయడం మామూలే. అయితే.. ఒక్క లైసెన్సుడు రివాల్వర్ ఉంటే, దాంతోపాటు కనీసం అరడజను లైసెన్సు లేని రివాల్వర్లు ఉంటున్నాయన్నది ఒక అంచనా. ఫ్యాక్షన్ ప్రాంతాల్లో అయితే ఇక తుపాకులు, బాంబు పేలుళ్ల గురించి చెప్పనక్కర్లేదు. సినిమాల ప్రభావం, సులభంగా అందుబాటు, సంఘటన జరిగేవరకు ఎవరికీ దొరక్కుండా దాచిపెట్టే సౌలభ్యం.. ఇలాంటి కారణాల వల్లే చిన్న సైజులో ఉండే రివాల్వర్ల పట్ల ఎక్కువ మంది మోజుపడుతున్నారు. రాష్ట్రంలో కూడా నేరాలు పెచ్చుమీరడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.