అంతు చిక్కని ఆయుధ రహస్యం! | Business Man Suicide on ORR Hyderabad | Sakshi
Sakshi News home page

అంతు చిక్కని ఆయుధ రహస్యం!

Published Thu, Aug 1 2019 11:30 AM | Last Updated on Fri, Aug 2 2019 12:35 PM

Business Man Suicide on ORR Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై (ఓఆర్‌ఆర్‌) ఆత్మహత్య చేసుకున్న యువ వ్యాపారి ఫైజన్‌ అహ్మద్‌ (35) కేసుపై సైబరాబాద్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కణతపై కాల్చుకునేవదుకు అతను వినియోగించిన నాటు తుపాకీ మూలాలు కనిపెట్టడంపై నార్సింగి పోలీసులు దృష్టి పెట్టారు. ఆత్మహత్యాయత్నం తర్వాత ఫైజన్‌ కొన్ని గంటల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినా వాంగ్మూలం ఇవ్వకుండానే చనిపోయారు. దీంతో సవాల్‌గా మారిన ఈ కేసును నార్సింగి పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని తూర్పు మండల పరిధిలోని మలక్‌పేట ప్రెస్‌రోడ్‌కు చెందిన ఫైజన్‌ అహ్మద్‌ కొన్నేళ్ల క్రితం జ్యోతిషి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అతను తన మకాంను లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని జలవాయు విహార్‌ అపార్ట్‌మెంట్‌లోకి మార్చాడు. సఫిల్‌గూడకు చెందిన పీవీ సుబ్రమనియన్‌కు చెందిన ఫ్లాట్‌ నెం.206ను 2013 అక్టోబర్‌లో అద్దెకు తీసుకున్నాడు. అప్పటి నుంచి భార్యతో కలిసి అక్కడే ఉంటున్న ఫైజన్‌ కుటుంబం చుట్టుపక్కల వారికి దూరంగా ఉండేది. విదేశాలకు వెళ్లే వారికి వీసా ప్రాసెసింగ్‌ చేసేందుకు పంజగుట్టలో ఓ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసిన ఫైజన్‌కు అందులో తీవ్ర నష్టాలు వచ్చాయి.

దీంతో కొన్నాళ్లుగా ఫ్లాట్‌ అద్దె, అపార్ట్‌మెంట్‌ మెయింటనెన్స్‌ కూడా చెల్లించలేదు. గత అక్టోబర్‌లో అతను డ్రివెన్‌ బై యు మొబిలిటీ సంస్థ నుంచి బెంజ్‌ కారును అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల 4న అతను నార్సింగి పోలీసుస్టేషన్‌ పరిధిలోని మంచిరేవుల సమీపంలో ఓఆర్‌ఆర్‌ పక్కనే తన కారును ఆపి నాటు తుపాకీతో కుడి కణితపై కాల్చుకున్నాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఫైజన్‌ను ఓఆర్‌ఆర్‌పై విధులు నిర్వహిస్తున్న పోలీసులు గుర్తించి గచ్చిబౌలిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోలీసులు కారులో ఉన్న ఫైజన్‌ సెల్‌ఫోన్‌తో పాటు ఆత్మహత్యకు వినియోగించిన నాటు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫైజన్‌ వినియోగించింది నాటు తుపాకీ కావడంతో అది అక్రమ ఆయుధంగా నిర్థారించారు. దీంతో కేసులో ఆయుధ చట్టాన్నీ చేర్చి దర్యాప్తు చేపట్టారు. అతడి వద్దకు ఈ ఆయుధం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? తదితర అంశాలు ఆరా తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఫైజన్‌ అత్తగారిది మధ్యప్రదేశ్‌లోని మాండ్లా ప్రాంతం కావడంతో తరచూ అక్కడికు వెళ్ళి వస్తుండేవాడు. మాండ్లా పరిసరాల్లో కొన్ని జిల్లాల్లో నాటు తుపాకులు తేలిగ్గా లభిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచే ఆ తుపాకీని ఖరీదు చేసుకుని వచ్చి ఉండచ్చని భావిస్తున్నారు. ఈ మిస్టరీని ఛేదించడంపై నార్సింగి పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ అసలు విషయం అంతుచిక్కట్లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement