
‘అఫ్జల్‌గంజ్ కాల్పుల’ నిందితులు ఉన్నది అక్కడే
శ్రీ సాయి గ్రాండ్ ఇన్ హోటల్‌లో ఐదు రోజుల పాటు
బీదర్‌లో నేరం చేసి వచ్చి గది ఖాళీ చేసిన ద్వయం
దర్యాప్తులో ఇది గుర్తించినహైదరాబాద్ పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు అమన్ కుమార్, అలోక్ కుమార్ ఈ నేరాలు చేయడానికి ముందు మియాపూర్‌లో బస చేసినట్లు వెలుగులోకి వచి్చంది. అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన హైదరాబాద్ పోలీసులు ఈ విషయం గుర్తించారు. దీనికి సంబంధించిన రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. నగరంలో నేరం చేసిన తర్వాత దేశ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయినట్లు ఈ ద్వయం ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.
జనవరి 12న నగరానికి రాక...
బీహార్‌లోని వైశాలీ జిల్లా ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్ ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్‌గా చేసుకున్నారు. ఈ గ్యాంగ్ 2023 సెపె్టంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో సెక్యూరిటీ గార్డు జై సింగ్‌ను హత్య చేసి రూ.40 లక్షలు దోచుకుపోయింది. నేపాల్ పారిపోయిన ఈ గ్యాంగ్ యూపీ పోలీసుల హడావుడి తగ్గిన తర్వాత బీహార్ చేరుకుంది. అక్కడ నుంచి తమ స్వస్థలానికి వెళ్లి... ఈ ఏడాది జనవరిలో నగరానికి వచ్చింది. బీదర్‌ను టార్గెట్‌గా చేసుకున్న అమన్, అలోక్ ఆ నెల 12న మియాపూర్‌లోని శ్రీ సాయి గ్రాండ్ ఇన్ హోటల్‌లో బస చేసింది. అక్కడ నుంచి బీదర్‌కు రాకపోకలు సాగించడం తేలికనే ఉద్దేశంతోనే అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అమిత్ కుమార్, మహేష్ కుమార్ పేర్లతో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసిన దుండగులు వాటి ఆధారంగానే రూమ్ తీసుకున్నారు.
మూడు రోజుల పాటు రెక్కీ...
బీదర్‌లో ఎస్‌బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ వ్యాన్‌ను దోచుకోవడానికి ముందు మూడు రోజుల పాటు పక్కాగా రెక్కీ చేసింది. తమ వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై జనవరి 13, 14, 15 తేదీల్లో అక్కడకు వెళ్లి వస్తూ ఈ పని పూర్తి చేసింది. చివరకు ఆ నెల 16న నేరం చేయడానికి బీదర్ వెళ్లిన ఈ ద్వయం సీఎంఎస్ సంస్థ ఉద్యోగుల్లో గిరి వెంకటే‹Ùను చంపి, శివకుమార్‌ను గాయపరిచి రూ.83 లక్షలు దోచుకుంది. అక్కడ నుంచి డబ్బు నింపిన బ్యాగ్‌లు తీసుకుని నేరుగా తాము బస చేసిన హోటల్‌కే వచ్చారు. రూమ్ ఖాళీ చేయడంతో పాటు తమ వస్తువుల్నీ తీసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరి మియాపూర్ నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చారు. నేరం చేయడానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉంచారు. అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి ప్రైవేట్ బస్సులో రాయ్‌పూర్ వెళ్లేందుకు అమిత్‌కుమార్ పేరుతో టిక్కెట్ బుక్ చేసుకున్నారు.
నేపాల్‌లో ఉండటంతో పటిష్ట నిఘా...
ఈ ట్రావెల్స్ వద్ద జరిగిన పరిణామాలతో మేనేజర్ జహంగీర్‌ను కాలి్చన ఇద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. అఫ్జల్‌గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన వీళ్లు... అక్కడ నుంచి గజ్వేల్ వెళ్లడానికి మరో ఆటో మాట్లాడుకున్నారు. అనివార్య కారణాలతో తిరుమలగిరిలో దిగేసి... ఇంకో ఆటోలో మియాపూర్ వెళ్లారు. ఆపై తిరుపతి వెళ్లే ఏపీఎస్‌ఆరీ్టసీ ఎక్కి కడపలో దిగిపోయారు. మరో బస్సులో నెల్లూరు, అట్నుంచి చెన్నై వెళ్లారు. చెన్నై నుంచి రైలులో కోల్‌కతా చేరుకున్న ఈ ద్వయం పశి్చమ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతం నుంచి నేపాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మీర్జాపూర్ నేరం తర్వాత ఇలా వెళ్లిన ఈ ద్వయం కొన్నాళ్లకు తమ స్వస్థలాలకు తిరిగి వచి్చంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిటీ పోలీసులు వారి కదలికలపై పటిష్ట నిఘా ఉంచారు.